విజయనగరం నాకొక నింపాది లోకంలా ఉంటుంది. అటు చీపురుపల్లికీ, ఇటు విశాఖపట్నానికీ మధ్య ఏదో బాలెన్స్ వెదుక్కుంటున్నట్టు హాయిగా, కుదురుగా, కంగారేం లేనట్టుగా ఉంటుంది. 'మా ఊరి కొండగాలి పల్చగా తేలిగ్గా ఉంటుంద'ని అనేవారు నా బెంగళూరు బ్లాగ్ మిత్రులొకరు. అదెలా తెలియాలీ? అని మనసులో లెక్కలు వేసుకునేదాన్ని. మా అక్క పిల్లల్ని చూడటానికి పద్నాలుగేళ్ల క్రితం మొదటిసారి వెళ్ళానక్కడికి. ఇక్కడి పాలతో పొద్దున్నే ఫస్ట్ కాఫీ తాగితే అది అమృతమేననుకో...అంటూ రెండు కాఫీ కప్పులతో వాళ్ళ అత్తగారి డాబా మీదకి తీసుకుపోవడం, ఆ ఉదయపు లేత ఎండలో కొబ్బరాకుల నీడల కింద తిరుగుతూ బెజవాడంత కాకపోయినా ఈ ఊరూ బానే ఉందే! అనుకోవడం ఇంకా గుర్తు నాకు. బావిలో కప్పలా అప్పటికి బెజవాడ దాటితేనా మరి నేను! సరే, చంటి పిల్లల్ని వదిలి అది రాలేదని, వాళ్ళ మావయ్యగారు నన్ను ఊరంతా తిప్పి చూపించారు. కోట, మూడు లాంతర్లు, గంట స్తంభం, డెంకాషావలి దర్గా, అన్నీ ఓపిగ్గా తిప్పి, "తల్లీ, నీకు పుస్తకాలు ఇష్టం కదా, ఇక్కడ మనం చాలా సేపు ఉండాలి.." అంటూ గురజాడ ఇల్లు, జిల్లా గ్రంథాలయం దగ్గర ఆగిపోయారు. ఆయన కబుర్లతోనే ఆ ఊరంటే ఓ కుతూహలం, ఇష్టం మొదలయ్యాయి. ఆ తర్వాత, రాసిపెట్టి ఉన్నట్టే, కడుపుతో ఉన్నన్నాళ్ళూ ఆ ఊరి గాలే నాకు ప్రాప్తమయింది. ప్రహ్లాదుడని నా పిల్లాడికి పేరు పెట్టుకుందీ ఈ ఊళ్ళోనే. వాడి వంకన అమ్మావాళ్ళు కూడా ఈ ఊరికి మారిపోయాక, నాకసలు బెజవాడే పరాయిగా అనిపిస్తుందిప్పుడు. సాయంకాలాల తీరికదనమంతా కెంపు ఛాయగా మీద వాలుతోంటే, సరస్వతి గుడి దాటి పొలాల వైపుగా అమ్మా, అక్కా, నేను కలిసి గంటల తరబడి నడుస్తూండేవాళ్ళం; సెలవలెక్కువైతే సముద్రపు గాలి; అక్క పిల్లల్ని వెంటేసుకు తిరగడానికి బేకర్స్ ప్రైడ్; నా పిల్లాడు ఉత్సాహంగా వంగి చూడటానికి తాబేళ్ళు కూడా ఉన్న కళ్యాణ వేంకటేశ్వర స్వామి గుడి - ఒకటా రెండా! ఈ ఊరు నాకొక హాయి నెలవు.
విజయనగరం
గుడి దాకా వచ్చేశాను కదా. పక్కనే కొచ్చెర్లకోట జగదీష్ గారి ఇల్లు. బాపు రమణల అభిమాని వారు. బాపు నాయికల సోగకళ్ళ అందాలను పట్టి దాచుకునే భావుకులు. ఆపాతమధురాలకు గొంతు సవరించుకునే పాటగాళ్ళు కూడా. ఇవన్నీ కాదు కానీ, ఆరుగురు అష్టదిగ్గజాల్లో ఒకరు. గుడికి ఆనుకుని ఒక వైపు వాళ్ళ ఇల్లు. రెండో వైపు మా ఇల్లు. అవే గోవింద నామాలు వింటూ కొన్ని ఏళ్ళు గడిచిపోయాక, ఇన్నాళ్ళకి మొన్ననే, ఈ జనవరి ఒకటిన వారిని కలిసే వీలు చిక్కింది. ఎమెర్జెన్సీ కేసుల్లో హడావుడిగా ఉన్న డాక్టర్ గారిని అర్ధరాత్రి పదింటికి కలిశాం అక్కా, నేనూ. ఆలస్యమైపోతోంది అని నొచ్చుకుంటూనే మరో గంట కబుర్లతో గడిపేశాం. భవాని గారి మాటలు విన్నాక అనిపించింది, ఆయన చెణుకుల్లో సగం క్రెడిట్ న్యాయంగా ఆవిడకే దక్కాలని. బాపు బొమ్మలతో నిండుగా ఆహ్వానించిన ఆ ఇంట్లో, ఎన్నిసార్లు చెప్పుకున్నా మళ్ళీ నవ్వొచ్చే ఆయన రచనల్లో కొన్ని తల్చుకుని, ఆయన మాటల్లోనే మళ్ళీ చెప్పించుకున్నాం. భవానీ మాతలు, వాచ్మాన్ ఆలౌట్‌లు..."సత్యవతి మనిషా" కడుపుబ్బా నవ్వించింది.
జగదీశ్ గారు ఎప్పుడు ఆ వీధి ఫొటోలు పోస్ట్ చేసినా, అవి నాకోసమే పోస్ట్ చేసినట్టు ఉంటుంది. ఆ నెల్లిమర్ల దారులు చూసిన ప్రతిసారీ, మళ్ళీ నేనేప్పుడు వెళ్తానో అని మనసు లాగుతూనే ఉంటుంది. డివైడర్ లు కడుతోండగా నేను చూసిన రోడ్ మీద, మొక్కలు పెరిగి చెట్లై పూలు రాల్చడం ఆయన ఫోటోల్లో చూసి అప్పుడే ఎంతవయ్యాయీ అని అబ్బురపడిపోయేదాన్ని. మిథునం సూపర్ మార్కెట్‌లోకి నడిచిన ప్రతిసారీ, పక్క వాకిట్లో నుండి ఆయన ఎదురుపడతారేమో అన్న ఊహ మెదులుతూనే ఉంటుంది. నిన్న ఆయన హాస్పిటల్ నుండి వచ్చేలోపు, ఆ బాల్కనీ నుండి గుడినీ, వీధినీ చూస్తే ఆ వ్యూ చిరపరిచితంగా తోచింది. Facebook is magical!
ఇప్పుడిక చిటుక్కుమని పది రోజుల సెలవులూ అయిపోయి ఇంటికొచ్చేశాక, అమ్మ ఇచ్చిన పేకట్లన్నీ విప్పుకు డబ్బాల్లో సర్దుకున్నాక, మొగుడ్స్ పెళ్ళాంస్ మళ్ళీ ఎవరి పనుల్లోకి వాళ్ళం కూరుకున్నాకా - ఇంకేముందీ - ఇదిగో, ఇలా సింహాచలం సంపెంగల్లా గుబాళించే స్నేహాలూ; పదిరోజుల ఫోటోలూ తిప్పి చూసుకోవడాలూ, మళ్ళీ సెలవుల కోసం పగటికలలూ;
Subscribe to:
Post Comments (Atom)
రాగసాధిక
ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...
No comments:
Post a Comment