కీర్తి ఇంటికొచ్చినప్పుడు

 మొన్న రాత్రి కీర్తి పిల్లల్ని తీసుకుని ఇంటికి వచ్చింది. ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఆలస్యంగా నిద్రపోయాం. పొద్దున పిల్లలు లేవలేదు కానీ పెద్దవాళ్ళం అలవాటుగా మామూలు వేళకే లేచేశాం. అల్లం చాయ్ తాగాక అనిల్ కార్ క్లీనింగ్ మీద పడ్డాడు. ఉతకాల్సిన కర్టెన్లేవో నానబెట్టి, ఒక రౌండ్ ఫ్రిడ్జ్ లో నుండి ఈ పూటకి వండాల్సిన కూరలు తీసి, నీళ్ళల్లో వేసి, పిల్లలు లేచే దాకా టిఫిన్ల పని ఉండదనిపించాకా, నేనూ కీర్తీ కాసేపు బయట నడవడానికి వెళ్ళాం.

రాత్రి కురిసిన వానకి నేలంతా చిత్తడి చిత్తడిగా ఉంది. ఆకాశం తన గులాబీ పరదాను కాస్త కాస్తగా పక్కకు సవరించుకుంటోంది. ప్రాచీ దిక్ రేఖల్లో నుండీ లోకం వెలుగునద్దుకుంటోంది. లేత ఎండ.
నగరం నుండి పల్లెలోకి, శబ్దం నుండి నిశ్శబ్దం లోకి, సిమెంటు బస్తాల నుండి నల్లమట్టిలోకి, హారన్ల నుండి పక్షి కూతల మధ్యలోకి ఈ లోకపు సౌందర్యంలోకి- అట్టే దూరం లేదు. ఓ పది నిమిషాలు నడవగానే జామతోటలు కనపడ్డాయి. నేలని అందుకోవాలా అన్నట్టు, కిందదాకా వచ్చి వేలాడుతున్నాయి. అది దాటితే మడుల నిండా ఆకుకూరలు. పాలకూర, గోంగూర, కొత్తిమీర, తోటకూర. కొత్తిమీర ఆకులు తుంపి మునివేళ్ళ మీద నలిపి వాసన చూసుకున్నాను. వేలి కొసల మీద ఆ వాసనింకా ఉండగానే, ఈ పందిరే లేకపోతే ఆ లేత తీగలు అంత బరువు కాయలని ఎలా మోస్తాయో అనిపించేట్టు, సొరపాదులు. గోటి గాటు కూడా పడకూడదనిపించేట్టు, ఆ పందిరికి వేలాడుతూ, లేత దవ్వల్లాంటి కాయలు.
గాలి రొదను చీలుస్తున్నట్టు నడుస్తున్నాం. చుట్టూ రకరకాల తోటలు. రకరకాల మడులు. ఎటు వైపు నుండో పెద్ద తొట్టెల్లో నీళ్ళు పడుతున్న చప్పుడు. మడుల మధ్య, అడుగేస్తే కూరుకుపోయే మట్టిదారి. దారి పక్కన రావి చెట్లు. వాటి నీడన కుంకుమబొట్ల రాళ్ళు. నల్లటి మరకలతో ఎర్రమట్టి ప్రమిదలు. చూపుని లాగేస్తూ, కొమ్మ నుండి కొమ్మకి దూసుకుపోతున్న బుల్లిపిట్టలు. వాటి కువకువలు. స్మార్ట్ వాచ్‌లు ఆగిపోయే సౌందర్యం మధ్యన...
రమ్మని పిలుస్తూ గాల్లో నుండీ గులాబీ పూల పరిమళం. ఇనుప కంచెలు జాగ్రత్తగా తోసుకుని లోపలికెళితే, మునివేళ్ళతో పూలకాడల దగ్గర జాగ్రత్తగా తుంపి, గంపలు నింపుకుంటున్నారు అక్కడున్న నలుగురు మనుషులూ. "నచ్చినవి కోసుకోండ.." ఆదరంగా పలికి వాళ్ళ పనిలో మగ్నమైపోయారు. మనసొక సీతాకోకయ్యాకా...
తోటంతా కలియదిరిగాం. ఆ గులాపూరేకుల మెత్తదనం మధ్య, ఆ విచ్చీవిచ్చని రేకుల మసకచీకట్ల మధ్య హాయిగా ఒదిగి నిద్దురపోతోందో పచ్చని కీటకం. తోటకావలనున్న కలల పందిరి లాంటి చెట్టునొకటెంచుకుని ఊహల అల్లికలో ఊగిపోతోందో బుల్లిపిట్ట. ప్రశాంత నిశ్శబ్దం. సుగంధాల గాలి కౌగిలి.
ఆ పూలని ముద్దాడిన వేళ్ళలో నుండీ, ఒక మృదుత్వం నా సమస్తాన్నీ ఆక్రమించి నన్ను తేలికపరిచింది. ఒక మనిషిని తాకితే ఇట్లాంటి మెత్తదనంతోనే తాకాలి. కొమ్మకున్న పూవును తాకేటప్పుడు ఎట్లా ప్రాణమంతా వేలి కొసల్లోకి ఉబికివస్తుందో, అట్లాంటి ఇష్టంతోనే ముట్టుకోవాలి. పూల మడిలో ముళ్ళ పొదను చూసినప్పుడు పూవుల వైపే చూస్తూ తప్పించుకున్నట్టు, నచ్చని మనుషుల మధ్య నుండి, నచ్చే మనుషులను జ్ఞప్తికి తెచ్చుకుని గాయం కాకుండా నడిచెళ్లి పోగలగాలి.
గులాబీ గంపలు దాటుకుని కనకాంబరాల మధ్యకొచ్చాం. మనుషులు కనపడిన చోట ఆగి, నచ్చిన కూరలు తీసుకున్నాం. ఎండ చురుకు తెలిసే వేళయింది. అమ్మ కడుపులో పిల్లల ఆకలి మొదలైంది. మళ్ళీ అదే దారిలో...
అరికాలి కింద మెత్తదనం మెలమెల్లగా మాయమవడం తెలుస్తోంది. ఇంటి గుమ్మం దగ్గరపడుతున్న గుర్తుగా పిల్లల గొంతులు వినపడుతున్నాయ్. స్మార్ట్‌వాచ్ నిలబెట్టి తనకు తెలిసిన లెక్కలు చూపెడుతోంది. దాన్నుండి దాచిన రహస్యాలతో ఈ మనసు మాత్రం ఇంకా ఇంకా తుళ్ళిపడుతూనే ఉంది. ❤️
All reactions:
Vadrevu Ch Veerabhadrudu, Narukurti Sridhar and 134 others

No comments:

Post a Comment

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...