రాగసాధిక

 ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్లలా నేనూ వస్తానని వెంటపడ్డాను. ఒకట్రెండు రోజులు రావాలంటే, ముందు పది రోజుల కోర్స్ పూర్తి చెయ్యాలన్నాడు.

వెబ్‌సైట్‌లో ఒక టిక్ మార్క్ కొట్టడమే కదా...అయిపోయిందని చెప్పి enroll చేసుకోనా అంటే తను చూసిన చూపు నాకిప్పటికీ గుర్తే.
"అబద్దాలు ఆడకూడదన్నది విపస్సన మొదటి నియమాల్లో ఒకటి. నువ్వు మొదలే కాని పని చేసి అక్కడకొస్తే, ఇంకేం నేర్చుకుంటావ్?" అన్నాడు. ఎప్పటిలాగే ఒక్కడూ వెళ్ళిపోయాడు.
తన నింపాదితనానికీ, మిన్ను విరిగి మీద పడుతోన్నా, ఏం కాదులెమ్మని నా వెన్ను నిమిరి తనిచ్చే భరోసాకి విపస్సన ఒక రహస్యమైన కారణం అనుకుంటాను కనుక, ఎప్పటికైనా అక్కడికి వెళ్ళాలి అని నాదో కుతూహలంతో కూడిన కోరిక. పది రోజులంటే అయ్యే పనేనా అని ఆగిపోతాను ఎప్పుడూ.
*
"మనుషులు కావాలి మనుషులు..." అని తపించినట్లుండే జాజిమల్లి గారు పది రోజులు అన్నీ విడిచి విపస్సన కి వెళ్ళారని చదవగానే నా ఆశ్చర్యానికి హద్దే లేదు. అనుకున్నపని చెయ్యడంలో ఆమె పట్టుదలను ఊహించగలను కానీ, అక్కడి నియమాలు తెలిసినదానిగా, ఎందుకు వెళ్ళాలనిపించిందో తెలుసుకోవాలనీ, పోనీ, వెళ్ళాక వారి అనుభవాలు, పాఠాలు ఎలాంటివై ఉంటాయో చూడాలనీ నాకు మరీ మరీ అనిపించింది. శుక్రవారం రాత్రి ఇంట్లో ఉన్న స్నేహితులు పడుకున్నాక, ఉండబట్టలేక పుస్తకం చదివేశాను.
**
ఎప్పుడూ చదవకూడదదు అనిపించే కరోనా కాలంలోని సందిగ్ధతలు, అప్పటి ప్రశ్నల దగ్గర, అప్పటి ఊపిరి పోరాటాల, ఒంటరితనాల ప్రశ్నలు కదలాడిన పేజీల్లో నుండి ముందుకు సాగిన రచన ఇది. కాబట్టి, ఈ పుస్తకం చాలా వ్యక్తిగతమైన ప్రయాణం. బరువైన ప్రయాణపు అనుభవం.
"ఇందుకోసమే బతుకుతున్నాను అని యావగా బతుకుతున్న విషయాలు కూడా బలమైన సంశయంలో పడేవి. ఉనికి సమస్తమూ విశ్వాస, అవిశ్వాసాల నడుమనేనా అన్న అనుమానం కలిగేది.
నా జీవాభినయం మీద నాకే నవ్వు కలగడం - బాధ, భయం, కోపం, ద్వేషం ఏమీ కాదు - జస్ట్ ఆశాభంగం, నిరుత్సాహం. ఇంతేనా, ఇంకా ఏమైనా తీవ్రత ఉందా.."
నేను అనే ఏకాకితనంలోని గాఢతను, దాని తాలూకా నలిబిలిని ఏ భేషజాలూ లేకుండా విప్పుకుపోయిన ఈ మొదటి పేజీల దగ్గరే నాలో చెప్పలేనంత అలజడి మొదలైంది. ఎదుర్కునే ఆసక్తి లేక తప్పించుకు తిరిగే ప్రశ్నలేవో, ఒక ఇరుకైన దారిలో మనకి ఎదురుపడుతున్నప్పుడు, తప్పించుకునే వీల్లేనప్పుడు, లోపల నుండి కమ్ముకొచ్చే ఇబ్బందీ, అసౌకర్యం నన్ను చుట్టుముట్టాయి. కోరుకునేవాటికీ, అవసరమైనవాటికీ మధ్య గీత గీయడం మనకి తెలియక కాదు, ఆ గీతను చెరిపేసుకుని అటూ ఇటూ దూకగల స్వేచ్ఛ, అందులోని స్వార్థం కొన్ని గీతలను బలంగా గీయనివ్వవు. ఉన్నా చూడనీయవు. ఏదో ఒక వేడి, పొగమంచులాంటి ఆ స్వార్థాన్ని కరిగించి గీతని బలపరిచి చూపించినప్పుడు, భయంతో కళ్ళు మూసుకోవాలనిపించే స్థితి వస్తుంది. ఈ పుస్తకం మొదలెట్టినప్పుడు నాకట్లాంటి ఇబ్బంది.
ఒక స్నేహితురాలు తోడు ఉందని ముందు సంతోషంగా ఒప్పుకోవడం, చివరికి ఎవ్వరూ రాక, నా అన్న మనిషి పక్కన ఊరికే కనపడుతూ ఉన్నా దొరికే భరోసా కూడా దూరమై -ఒక్కతే వెళ్ళాల్సి రావడం ఈ ప్రయాణపు, అనుభవపు టోన్‌ని స్థిరపరిచాయి అనిపించింది.
ఈ పుస్తకంలోని కొన్ని మాటలు ఎదుటి మనిషిని నిలువునా చీరేసే నిజాయితీ తో రాసినవి. మొదటిది ఇక్కడికి వచ్చిన కారణం అని పైన రాశాను కదా. రెండవది, రాత్రి ఏ ఝాముకో నిద్ర పోయిన కళ్ళతో బయటకొచ్చినప్పుడు, ఓ సీనియర్ సాధిక అధికారం చూపించడానికి ప్రయత్నించే సందర్భం. "వలచి వేసుకున్న సంకెళ్ళే" అయినా సరే, మనిషికి తనవైన కొన్ని ఇబ్బందులూ, బలహీనతలూ ఉంటాయి. ఎంత ఏరికోరి ఎవరితోనూ సంబంధం లేని జీవితం వైపు అడుగులేసినా, ఎదుటి మనిషి పట్ల అక్కర చూపించకుండా మాట్లాడే మనిషి పట్ల వెగటు ఓపలేనిదే అయిపోతుంది. అది క్షణికమే కావచ్చు, "ఆమెకు తెలిసింది అదీ" అనుకోగల నెమ్మదితనం మళ్ళీ రావచ్చు, కానీ ఆ క్షణాల భంగపాటు గురించి మాట్లాడటం నావైన ఎన్నో అనుభావలను గుర్తు చేసింది. తర్వాతి నా ఒప్పుకోలు, పశ్చాత్తాపాలు కూడా.
ఇక మూడవది, భోజనం. ఈ పుస్తకంలో తిండి ప్రస్తావన ఉన్న ప్రతిచోటా, ఒక నొప్పి కూడా ఉంది. దొరికిన దాని పట్ల తృప్తి కన్నా ముందు వినమ్రత కావాలి అనిపించే అనుభవాలు. కొందరిళ్లల్లో భోజనాల దగ్గర, వడ్డనల్లో అహంకారం తప్ప ఏమీ కనపడని గుణం ఉంటుంది. ఆపాటి ప్రదర్శన గురించిన ఆలోచన కూడా లేనంత లెక్కలేనితనం కూడా కొందరి దగ్గర ఉంటుంది. వంద రకాల వంటకాలతో భోజనాలు పెట్టందే నామోషీ అనుకునే జనాభా పెరిగిన ఈ కాలంలో, ఇలాంటి అనుభవం ఏదో ఒకరకంగా కంటపడని వాళ్ళు అరుదే.
అంత వేలంవెర్రితనం లో నుండి పక్కకొచ్చి, అగ్గి చారికలు రాచుకున్నట్టు, నిప్పులు కుమ్మరించినట్లు ఒళ్ళంతా మంటలు రేగుతుంటే, కప్పు పెరుగు కోసం చేయి చాచినప్పుడు, "పర్మిషన్ తెచ్చుకోండి" అన్న మాట వినడం ఎలా ఉంటుందో ఊహించగలం కదా!
"పది రోజుల కాలాన్ని తరచి చూసుకుంటే భిక్షా పాత్ర నిండుగా ఊపిరి గట్టిగా పీల్చి వదిలిన నిట్టూర్పులే కనపడతాయి" అని రాశారు.
ఆ వాక్యం దాటి పోవడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది.
**
జాజిమల్లి గారి వచనం దేన్నైనా గాఢంగా అనుభవించిన పలవరింతలా ఉంటుంది. కాబట్టే ఇంత బరువైన పుస్తకం కూడా కొన్ని కొన్ని అపురూపమైన వర్ణనలతో మెరిసి ఆ బరువును కాస్త కాస్తగా తగ్గించింది.
"దూరం నుంచి జాయిగా వచ్చే గాలి రివ్వ - అన్ని వందల కొబ్బరిచెట్ల ఆకులను గలగలలాడిస్తూ మా నెత్తి మీదుగా దాటి పోయేది. గాలీ చెట్లూ కలిసి చెట్టాపటాలాడితే అంత సంగీతం పుడుతుందని నాకేమి తెలుసు!
తెలిసి ఉన్నా కూడా మరెన్నో నిర్మిత శబ్దాల ముందు ఆ జ్ఞాపకాన్ని పారేసుకుని ఉంటాను."
లాంటి అక్కడి ప్రకృతికి సంబంధించిన గమనింపులతో పాటు, శరీరం లోని సూక్ష్మ సంవేదనలను విపస్సన ద్వారా గుర్తిస్తూ, ఆ అనుభవాల గురించి మాట్లాడినప్పుడు, "ముక్కు నుండి మెల్లగా వదుల్తున్న గాలి, పై పెదవి మీది పలుచని నూగూరు మీదుగా వీచినప్పుడు, వరి పైరుని అల్లల్లాడించే గాలి తరగ స్పురించేది" అనడం కూడా ఆ కోవలోకే వస్తుంది. ఉప్మా, వేడి జావల ఒక ఉదయపు ఉపాహారాన్ని గురించి రాస్తూ,
"ఆస్వాదిస్తూ తినడం తెలిసి కూడా వేగం, వడి, అలసత్వాలలో పడి మనం పోగొట్టుకున్న ఒక జీవనకళని దాని నిజ అర్థం లో అనుభవించాను" అనడం కూడా పుస్తకంలో చదువుతున్నప్పుడు, ఆ నిండైన అనుభవానికి అలవోకగా దగ్గరకు తీసుకెళ్ళింది.
**
ఈ పుస్తకం నేను చదవాలి అనుకోవడానికి ముఖ్యమైన కారణం, అనిల్ దగ్గర విన్నది ఇంకాస్త లోతుగా అర్థం చేసుకోవడం కోసం. విపస్సన మొదలెట్టగానే (తీసుకునే ఆహారంతో సంబంధం లేకుండా), సంవేదనలు బయటపడుతూ ఉండటం వల్ల ఒక రకమైన వేడి మొదలవుతుందని నేను విని ఉన్నాను. అలాంటివి, ఆలాంటి ఇంకొన్ని, కొన్ని వేరే రకాలైన వివరణలతో ఈ పుస్తకంలో చూడటం ఆసక్తిగా అనిపించింది.
కానీ, పుస్తకం చదివాక మళ్ళీ నాకు నేను గుర్తుగా చెప్పుకుంటున్న మాట మాత్రం, వినమ్రత. humbleness. అది ఎందుకు, ఎప్పుడు, ఎలా అంటే, ఈ పుస్తకం చదివితే కొంత అర్థమవుతుంది. నిద్రపట్టని రాత్రుల్లో, కిటికీ ఊచల్ని చూస్తూ స్వేచ్ఛను పణంగా పెట్టిన పోరాట యోధులను గుర్తు చేసుకున్న క్షణాలను చదివినప్పుడో, పది రోజులు భిక్షాపాత్రను చేతుల్లో ఉంచుకున్న అనుభవాన్ని గురించో ఈ పుస్తకంలో చదివినప్పుడు, అది ఎంతో కొంత స్థాయిలో అవగతమవుతుంది.
ఈ పుస్తకం చదివితే విపస్సన కి వెళ్తామనో, విపస్సన సూత్రాలు అర్థమవుతాయనో, అవలంబిస్తామనో చెప్పను. కానీ, ఈ మార్గంలో వెళ్ళిన ఓ మనిషి రాసిన అనుభవాలు లోపల కలుగజేసే అలజడీ, ప్రశ్నలు, చెల్లాచెదురు ఆలోచనలు ఏదో ఒక స్థాయిలో చదువరుల ఆలోచనలను కూడా ప్రభావితం చేస్తాయని అనుకుంటున్నాను. ఆ ఆలోచనల మీదకి దృష్టి వెళితే, స్పష్టత కోసం ఎవరికి అవసరమైన మార్గం వాళ్ళకు ఎదురొస్తుంది. రాగద్వేషాలకు అతీతులమై ఉండటం, అదుపులో ఉంచుకోవడం, రెండూ కష్టమే. "but you can try.." అని గాంభీర్యం, మెత్తదనం జమిలిగా పెనవేసుకున్న గొంతుతో భరోసాగా పలికే పుస్తకం ఈ "రాగసాధిక".
No photo description available.
All reactions:
Somasekhararao Markonda, Vadrevu Ch Veerabhadrudu and 81 others

No comments:

Post a Comment

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...