నల్లమబ్బుపిల్ల - మల్లిక పులగుర్తి

 మల్లిక నా చిట్టి స్నేహితురాలు. నల్ల మబ్బు పిల్ల అని ఒక పుస్తకాన్ని ప్రచురించి, నాకు పంపే ఏర్పాటు చేసింది. బుక్ ఫెస్టివల్‌లో ఆ కాపీ అందుకుని, ఈ రోజే జరిగిన ఆ పుస్తకపు ఆవిష్కరణలో పాల్గొనాలనుకున్నాను కానీ అక్కడే సాయంత్రమైపోయింది. ఫోన్‌లో చార్జింగ్ లేదు. నెట్‌వర్క్ అంతంత మాత్రం. చిన్న పుస్తకం కనుక ఇప్పుడే చదవడం పూర్తి చేశాను.

మల్లిక ఏదైనా పోస్ట్ చేసినప్పుడు, చాలా మంది, నువ్వు మా పసితనాన్ని గుర్తు చేస్తున్నావ్ అనో, చిన్నప్పుడు నేనూ అచ్చం నీలాగే ఉండేదాన్ని అనో రాస్తారు. అలా అని మల్లిక పసి వయసు నాటి ముచ్చట్లేం రాయదు. పసిపిల్ల లానూ రాయదు. కానీ ఆ కామెంట్ ఎందుకు ఆమెకు అన్ని సార్లు చేరుతుందా అని ఆలోచిస్తే, చప్పున తట్టేదొకటి. ఆమె అక్షరాల్లో తొణికిసలాడే అమాయకత్వం. అమాయకమైన నమ్మకం. మనుషుల పట్ల, పిట్టల పట్ల, పూవుల పట్ల, ఉదయం పట్ల ప్రేమ. ఆ మనుషులనీ, ఈ పిట్టలనీ పూవులని దగ్గరగా గమనిస్తూ ఆ గమనింపులోని ఆనందాలను అందరూ అలాంటి మనసుతోనే చూస్తారని - ఇక్కడ ఈ మాధ్యమంలో పంచుకునే గుణం. వయసు మీదపడే కొద్దీ పడికట్టు పదంలానూ ముతక పదంలానూ తోచే "మంచితనం" అన్న మాటని ఆమె ఇంకా దాని నిజమైన అర్థంలోనే వాడుతూ ఉండటం.
"పట్టకపోయినా పర్వాలేదు, ఎన్నిసార్లైనా మంచితనం తాళం చెవితోనే తాళం తీస్తా" అనే ఈ అమ్మాయి నాకైతే గుండెలో గుబులు పుట్టిస్తుంది. వేరే తాళం చెవి ప్రయత్నించమని నేనూ అనను. కానీ, అది నీ ఇల్లు కాదని పక్కకు వెళ్ళిపోమనైనా చెప్తాను.
అందరూ ఎలా మల్లికలో తమని చూసుకుంటారో నాకూ తెలీదు. కానీ తన పాటలు, రంగులు, బొమ్మల ప్రపంచంలో అపారమైన జీవితేచ్ఛ కనపడుతుంది నాకు. "అందరిదీ ఒకే ప్రయాణం, మనలోని ఒకప్పటి వెర్రి హుషారును వెదుక్కుంటూ" అంటుంది. ఆ హుషారు ఎలా వస్తుందో, ఎలాంటి పనుల్లో దొరుకుతుందో తనకు తెల్సు కనుకే ఇన్ని వ్యాపకాలు. ఆ ప్రపంచంలో తన వేళ్ళను ఇంకా ఇంకా సుస్థిరం చేసుకునే తన ప్రయత్నమే బహుశా అందరూ ఆమె లోకంలోకి కుతూహలంగా తొంగి చూసేలా చేస్తుందేమో.
హైకూ, కవిత్వంలో అత్యంత కష్టమైన ప్రక్రియ. నల్ల మబ్బు పిల్ల, మల్లిక హైకూ ప్రయత్నంలో, ఆ దిశగా వేసిన తొలి అడుగు. ఆమెకు ఒక క్షణంలో లీనమవగల శక్తి ఉంది. అది అక్షరాల్లోకి అంతే బలంగా మున్ముందు తప్పకుండా తర్జమా అవుతుందన్న నమ్మకం నాకుంది.
మల్లికా...మొదటి పుస్తకానికి మనసారా అభినందనలు! నీ రంగురంగుల ప్రయాణాన్ని నేను ఇక నుండి ఇంకా శ్రద్ధగా చూస్తుంటాను.

No comments:

Post a Comment

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...