అనిల్‌తో స్నేహం మొదలయ్యాక, సాయంత్రమవగానే స్కూల్ గంట విన్నంత గుర్తుగా ఆఫీసు నుండి పారిపోయి వచ్చేసేదాన్ని. దాదాపు ఆర్నెల్లు. దాదాపు ప్రతిరోజూ. గచ్చిబౌలి నుండి నేనూ, అమీర్‌పేట్ నుండి తనూ. ఎప్పుడైనా పొరబాటున నాకు ఆఫీసులో లేట్ అయ్యేట్టు ఉంటే, తను సరాసరి ఆఫీసుకే వచ్చేసేవాడు. "ఎక్కడున్నావూ..." అని సెక్యూరిటీని దాటుకుని బయటకొస్తూ నే ఫోన్ చేస్తే, తన పల్సర్ లైట్ల వెలుగు నేను నడిచే దారంతా పరుచుకునేది. ఎండల్లో వానల్లో ఆ గచ్చిబౌలి కొండరాళ్ళ రోడ్లల్లో, చీకట్లో వెన్నెట్లో, కాలం, లోకం పట్టనట్టే తిరిగాం. ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు తల్చుకున్నా, ఆ రోడ్ల దుమ్మూ ధూళీ ట్రాఫిక్ అలసటా ఏమీ గుర్తు రావు. హెల్మెట్ లో నుండి తను చెప్పే మాటల కోసం ఒళ్ళంతా చెవులు చేసుకుని ముందుకు వంగి విన్న క్షణాల మైమరపు తప్ప. నా అంతట నేనే ఇంటికొచ్చే రోజుల్లో, కొండాపూర్ షేర్ ఆటోల్లో నుండి కొత్తబంగారులోకం పాటలు వినలేని గొంతులతో వినపడుతూండేవి. ఎంత రభసలోనైనా "ఈ వయస్సులో ఒక్కో క్షణం ఒక్కో వసంతం..." అన్న మాటల మేజిక్‌ని మాత్రం తప్పించుకోలేకపోయేదాన్ని.
ప్రేమ
అనిల్ ఇంటి దగ్గరకొస్తే, బైక్ ఆ వీధి మొదట్లో పార్క్ చేసేసి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం ఎంత దూరమైనా. ఆ వీధి చివరి ఇంటి కాంపౌండ్ వాల్ నుండి మెట్ల మీదుగా ఎన్ని పూల తీగలుండేవో! రాత్రిళ్ళు ఆ పక్కకు వెళితే ఏవేవో పూల పరిమళాలు కలిసిపోయి మత్తుగాలి పీలుస్తున్నట్టు ఉండేది.
ఇంటి చుట్టూ బోలెడు గుడులూ, పార్క్‌లూ రెస్టారెంట్‌లూ ఉండేవి. అనవసరంగా ఆ డిన్నర్‌లలో బోలెడుబోలెడు డబ్బులు తగలేశామని ఆ తర్వాత్తర్వాత - అంటే పెళ్ళయ్యాక అనిపించేది :)) కానీ ఆ పేపర్ నాప్‌కిన్‌ల నిండా ఎన్ని ప్రేమ సంతకాలు! హోటెల్ స్టాఫ్ వచ్చి తలుపులేసుకోవాలి మీరిక కదులుతారా అన్నట్టు పక్కకొచ్చి నిలబడితే, ఆ మసక వెన్నెల రాత్రుల్లో అడుగూ అడుగూ కొలుచుకుంటునట్టు నింపాదిగా నడిచి ఎప్పటికో ఇల్లు చేరేవాళ్ళం. హైదరాబాద్ రద్దీ రోడ్లన్నీ ఖాళీ అయి, రాత్రి గాలి చల్లదనం అనుభవానికొచ్చే ఘడియల్లో, వీధి లైట్ల పసుపు వెలుతుర్లో నిలబడి, చూపుల నిండా పరుచుకున్న ఇష్టాన్ని చదువుకోవడం ఆ కాసిన్ని రోజుల్లో ఎవ్వరూ భగ్నం చెయ్యని వైభవం.
"రోజూ అంతలేసి సేపు ఏం చెప్పుకుంటున్నారు?" అని కుతూహలంగా స్నేహితులూ, కాస్త భయంభయంగా ఇంట్లో వాళ్ళూ ఆరాలు తీస్తూనే ఉండేవాళ్ళు. ఏమో ఏమని చెప్తాను, ముందూ వెనుకా లెక్కా వరుసా ఏమీ పట్టని మైకం.
"నాకు పది పన్నెండేళ్ళు ఉన్నప్పుడే నువు పరిచయమైతే ఎంత బాగుండేదీ?" అని ఎన్నో సార్లు అనేదాన్ని అనిల్‌తో.
పెళ్ళైన ఎన్నాళ్ళకో ఓ సారి ఒప్పుకున్నాడు. "కనీసం పదేళ్ళ కబుర్లు వినే పని తప్పేది నాకు" అంటూ.
Subscribe to:
Post Comments (Atom)
రాగసాధిక
ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...
No comments:
Post a Comment