నేనెప్పుడు పుట్టాను? - తగుళ్ళ గోపాల్

 మొన్నెప్పుడో అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు, పుస్తకాలు సర్దుతోంటే పాలపిట్ట పాత సంచిక కనపడింది. తగుళ్ళ గోపాల్ పేరుండేసరికి చేత్తో పుస్తకంతో కూర్చుండిపోయాను. చదవగానే కళ్ళల్లో ఊరిన చెమ్మ, ఈ కవితను గుర్తుండిపోయేలా చేసింది. ఇంత చిన్న కవితలో ఎంత జీవితం పరిచాడో గమనింపులోకి వస్తే ఆశ్చర్యంగా అనిపించింది. జాషువా అన్నట్టు, "దాటిపోయిన యుగముల నాటి చరిత మరల పుట్టించగల సమర్థుడు" కవియే కదా అనీ అనిపించింది. ఈ కవితలోని బలం, బహుశా ఆ కాలాలను దాటి వచ్చిన నిబ్బరంలో నుండి, ఈ కాలానికి జీవితం మెరుగైన తృప్తిలో నుండి మాట్లాడడంలో ఉండి ఉండవచ్చు. పుట్టినరోజులు అందరికీ నమోదయ్యే ఉంటాయి కానీ, నిజంగా పుట్టిన క్షణాలు అనుభవంలోకి వచ్చే వాళ్ళు అరుదు. వాళ్ళు అదృష్టవంతులు. గోపాల్ ఇక్కడ కూడా ఒక అడుగు ముందే ఉన్నాడు - అతడు తన గురువు మాట ప్రమాణమనుకునే శిష్యుడు! ఆయన మాట ఇచ్చిన ఊతంతో చెప్తున్నాడు "అక్షరాన్ని ఆవు దూడలా నా వాకిట్లో కట్టేసుకున్నప్పుడు" నిజంగా పుట్టానని. వాకిట్లో కట్టేసుకునే మరే ఇతర పెంపుడు జంతువో ఎందుకు కాదు? ఎందుకంటే, అతను ఆహ్లాదం కోసం మాత్రమే మచ్చిక చేసుకోలేదు. ఆడుకుని ఆ అచ్చుల్ని వదిలేయలేదు. వాటితో తన ఆకళ్ళు తీర్చుకున్నాడు. "జ్ఞానలక్ష్మీ జాగ్రత్పరిణామమిమ్ము దయతో" అని వేడుకుంటాడు కవి కాళహస్తీశ్వర శతకంలో. అట్లాంటి సంపద ఏదో తన సొత్తు చేసుకున్నాడు.

*
ఇంతకూ నేనెప్పుడు పుట్టాను?
---------------------------------------------
పుట్టినరోజు పండుగని
నాపేరుతో రాసిన కేకు ముందు
వొక క్యాండిల్ దీపంగ నిలబెట్టిండ్రు
వొద్దందునా?
పిల్లలప్రేమను చిన్నతనం చేసినట్లైతది
ఇష్టంలేదందునా?
టీచర్ల మనసు నత్తగుల్లలాగ ముడ్చుకుంటది
అయినా
ఎవరురాసి పెట్టిండ్రు మాకు బర్త్ డేలు?
నాయిననడిగితే
పట్వారిమనువడు పుట్టినప్పుడంటాడు
అమ్మనడిగితే
పొద్దంతా నాట్లేయబోయి
పుట్టెడునొప్పులతో కన్నానంటది
స్కైలాబ్ పడ్డప్పుడో,చెరువుకట్ట వేసినపుడో
గుడి కట్టినపుడో,గుడిలోలింగం మాయమైనపుడో
ఇవే గదా మా అన్నలకు
చరిత్ర రాసిపెట్టిన పుట్టినరోజులు
తాతమూత్తాతలైతే
ఎప్పుడు పుట్టిండ్రో
ఎప్పుడు పెద్దల్ల కలిసిండో
ఏ తాటాకును అడిగినా చెప్పదు.
నాయిన,పెదనాయినలు మాత్రం
మాచేత ఫోటోల కింద
మరణం తేది రాయించుకొని పోయిండ్రు
కేకు కట్ చేయబోతుంటే
గడ్డికోస్తూ వేలు తెగిన రోజు గుర్తొచ్చి
వెనకకు మళ్ళి నిలబడ్డాను
లోపల కన్నీటికాలువలు పారుతుంటే.
నీళ్ళునీళ్ళు అయిన అన్నాన్ని
కండ్లుమూసుకొని తిని కన్నీళ్ళు తాగినరోజులు
తింటున్న సల్లబువ్వలో ఈగబడితే
చేతితో తీసేసి తిని కంకర్రాళ్ళు మోసిన రోజులు
వొట్టికారం మధ్యలో నూనెచుక్క కలుపుకోని
ఆకలిపద్యం పూర్తిచేసిన రోజులు
ఈ పుట్టినరోజు వేడుక వెనుక
చిమచిమ మండే ఎన్ని గాయపుగుర్తులో.
ఇంతకూ నేనెప్పుడు పుట్టాను?
రిజిస్టర్ లో పేరెక్కించిన
మా పెద్దబడి పరమేశ్వర్ సార్ ని అడిగిన
అక్షరాన్ని ఆవుదూడలాగ
వాకిట్లో కట్టేసుకున్నప్పుడు
నేను నిజంగా పుట్టానట.

No comments:

Post a Comment

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...