నా పిల్లాడూ - ఈ ప్రపంచం

 మొట్టమొదటిసారి ఒంటరిగా చేతిలో కొంత డబ్బుతో, యే వయసులో బయటికి వెళ్ళి ఉంటానోనని ఈ మధ్య ఊరికే ఆలోచించుకున్నాను. సొంత సంపాదన కాదండోయ్...ఏదో కాస్త డబ్బు లెక్కలు తెలిసిన లోకజ్ఞానంతో. ఏ కిరాణాకొట్టుకో... పుస్తకాలద్దెకిచ్చే లైబ్రరీలకో...ఆక్కూరల బండి దగ్గర పావలా కరేపాకుకో...

ఇంత రద్దీలు, ఇన్ని భయాలు, ఇలా ప్రైవేటో పబ్లిక్కో అర్థం కాని అయోమయంలోకి నెట్టే ప్రపంచాలు ఇప్పటికి ముప్పై నలభై యేళ్ళ క్రితం లేవు కాబట్టి, మనలో చాలా మందికి ఇదొక పెద్ద విషయంలా గుర్తుండి ఉండకపోవచ్చు. ఉన్న నాలుగైదు వీధుల ఊర్లో పిల్లలుగా ఉన్న మనల్ని గుర్తు పట్టి, ఒంటరిగా కనపడితే ఏదో ఒక ప్రశ్న వేసి సహాయం చేసేవాళ్ళు ఎవరో ఒకరు ఉండేవాళ్ళు కనుక, మనం వీధి చివర కొట్టుకెళ్ళడం నిజానికి అప్పట్లో పెద్ద సంగతీ కాదు, గొప్ప సంగతీ కాదు.
ఇది పది నెలలకే మాటలు నేర్చిందనీ, ఇది ఏడాదికి నడక మొదలెట్టేసిందనీ, మూడేళ్ళకే మూడు చక్రాల సైకిలు సొంతగా తొక్కేసిందనీ మిగతా మైల్‌స్టోన్స్ గురించి చెప్పినట్టు, ఐదారేళ్ళకు కూడికలూ తీసివేతలూ రాగానే చేతిలో నోట్లు పెట్టుకుని ఒక్కతే బయటకు వెళ్ళిపోయేదని మన ఘనచరిత్ర ఎవ్వరూ చెప్పరెందుకూ!
అదృష్టవశాత్తూ, నాకింకా నాగేస్రావ్ కొట్టు గుర్తుంది. అది మా నిడమానూరులో మిథునం ధనలక్ష్మి కొట్టంత ఫేమస్. అక్కడ లేదన్న పదం వినగా గుర్తు లేదు. ఇంటికి పంపిస్తాంలే పాపా, ఎప్పటికి కావాలీ అని అడగడం తప్ప, దొరకదన్న మాట కూడా చెవిన పడ్డ జ్ఞాపకం లేదు. అసలైతే బెజవాడ బస్సెక్కి, కాళేశ్వరరావు మార్కెట్‌కు వెళ్ళి, నెలకు సరిపడా సరుకులు, కావలసినన్ని కూరలు తెచ్చేసుకునేది మా అమ్మ. మధ్యలో మిగులూ తగులూ ఏమైనా ఉంటే, నా చేతిలో పదో పరకో పెట్టి, నాగేస్రావ్ కొట్లో ఉన్నాయేమో వెళ్ళి తెమ్మనేది. మా ఇంటికీ ఆ ఇంటికీ మధ్య మనిషెత్తు గోడ అడ్డు, అంతే. ఇట్నుండి అమ్మ గట్టిగా కేకేసి చెబితే, "పంపేస్తాం టీచరుగారూ" అనేవాళ్ళేమో. కానీ, అమ్మ అడిగింది తేవడం, ఆ వంకన తిరగడం నాకే సరదాగా ఉండేది.
నేనడిగినదేదో వాళ్ళు వెదికి పొట్లం కట్టి ఇచ్చేలోపు, అక్కడికొచ్చే సమస్త ప్రజానీకపు మాటలూ నా చెవిన పడేవి. అట్లా, ఓ పూట విచిత్రమైన పదబంధమొకదాన్ని నా చెవులు పట్టుకున్నాయ్. అది ఎలా వాడారో చూశాను కనుక, ఐదారేళ్ళ నా బుర్రకి అదొక చెడ్డ మాట అని బానే అర్థమైంది. కానీ విన్నవి విన్నట్టు నేర్చుకుని ప్రదర్శించాలనుకునే ఆ వయసులో నాకు ఆ పదాన్ని విడిచిపెట్టబుద్ధి కాలేదు. తర్వాతెప్పుడో మా పెద్దమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు, ఈ పిచ్చి పదం గుర్తుందో లేదో అని పలికి చూసుకుంటుంటే అది విన్న మా అన్నయ్యలు నోరెళ్ళబెట్టి, "ఉమక్కా, ఇది బూతులు మాట్లాడుతోంది" అని అరిచి ఫిర్యాదు చేసేశారు. బిక్కచచ్చిపోయాను. మాడు పగిలేలా మొట్టికాయ వేసింది మా అమ్మ. గుడ్ల నీళ్ళు గుడ్ల కుక్కుకుని ఎటో తప్పించుకున్నాను. ఆ తర్వాత అది అందరూ మర్చిపోయారు. నేను మర్చిపోలేదు. ఆ మాట అనకూడదూ, అనకూడదూ అని నాకు నేను ఎంత చెప్పుకున్నానంటే, దాదాపు పదిహేనేళ్ళు వచ్చేదాకా ఎవరైనా తిట్టు అంటే మొదట ఆ పదమే గుర్తొచ్చేది. కానీ నేను ఆ ఊహ మనసులో పూర్తవనిచ్చేదాన్నే కాదు. ఆ పదాన్ని మళ్ళీ జీవితంలో ఎన్నడూ పూర్తిగా అనుకున్నదీ లేదు. టీనేజ్ కి వచ్చాక, ఇంజనీరింగ్ లో చేరాకా, సీనియర్లు మా కళ్ళ ముందే యథేచ్ఛగా తిట్టుకునేవారు. మీదమీదకెళ్ళి మొహాలు పగలకొట్టుకునేవాళ్ళు కూడా. కులాల గొడవలూ ఉండేవి కనుక, రక్తాలు కారేంత దెబ్బలూ ఉండేవి. కోపం వస్తే అంత సహజంగా తిట్టడమూ కొట్టడమూ దాని తాలూకా గర్వాన్నో గిల్ట్ నో మోసుకు తిరగకపోవడమూ ఆ వయసుకు గొప్పగా కనపడేవి. ఆ టీనేజ్ కుర్రాళ్ళ రికామీ తిరుగుళ్ళ వెనుక లీలగా కదలాడే నిర్లక్ష్యమో ధైర్యమో నాకు భలే అబ్బురంగా ఉండేది. అనుసరించాలనిపించేంత ఆకర్షణ ఉండేదందులో. ఆ మైకంలోనే, మా వీధిలో వీడియో షాప్ ముందు జులాయిగా కూర్చుని వచ్చే పోయే వాళ్ళ మీద చతుర్లు విసిరే కుర్ర గాంగ్ ముందు ఆగి నిలబడి దులిపేసిన రోజు, ఘనకార్యమేదో చేసినట్టు గర్వంగా అనిపించింది. కాలేజీలో కూడా గోటితో పోయేదైనా అక్కడితో వదల్లేని విసురు, తెంపరితనం నన్నంటుకుని ఉండేవి. కానీ అదీ ఆ కొన్నాళ్ళే. ఆ తిట్టడాలూ, గెలవడాలూ అక్కర్లేకుండా కూడా నేను ఆ కాలాల్ని దాటగలనని తెలిసిన రోజు, ఇవన్నీ ఎందుకు చేశానా అనే అనిపించేది. వాళ్ళకి నప్పినట్టున్న గుణం, నా మీదకొచ్చేసరికి తేలిపోయినట్టుండేది. స్వభావసిద్ధంగా, ఒకరిని ఒక మాట అని నేను తొణక్కుండా ఉండలేను. ఎంత అవతలివారు ఆ కోపానికి అర్హులనుకున్నా, దురుసుగా ప్రవర్తించి నన్ను నేను సమాధానపరుచుకోలేను. ఇది కాదు నేను, ఇది నేను కానే కాదు...అని గుర్తుపట్టడం మొదలవుతున్న రోజులవి. అక్కర్లేని ప్రభావాలను గమనించుకుంటూ ఒక్కొక్కటిగా చెరిపేసుకుంటూ వచ్చాను. నా నెమ్మది స్వభావాన్ని అకారణంగా చెదరగొడతారనిపించిన వాళ్ళని, నిర్దాక్షిణ్యంగా దూరం జరుపుకున్నాను. అయినా కూడా, ఆ వెనుకటి రోజుల్లో నుండి ఇప్పుడు నేనేదైనా మార్చగలిగింది ఉంది అని ఎవరైనా చెబితే, ఆ నేర్చుకోవడాలూ, ప్రభావాలూ కాకుండా - నాలో ఆ ఓవర్ థింకింగ్ లేకుండా ఉంటే చాలనుకుంటాను. అది నన్ను చాలా హింస పెట్టింది. ఆలోచన దానికది మంచిదే కానీ ముందు వెనుకల గుంజాటన నన్ను ఎటూ పోనీకుండా ఇబ్బంది పెట్టిందనిపిస్తుంది. లోకం మొత్తం అటూ ఇటూగా చీలిపోయి నన్ను లాగేసిన టగ్ ఆఫ్ వార్ లో నేను నమ్మినదే పట్టుకుని స్థిరంగా నిలబడటానికి చాలా బలం కావాల్సి వచ్చింది.
సరే, నా కథ అలా ఉంచితే, రెండు నెలల క్రితం- ఎనిమిదేళ్ళ వయసులో, ప్రహ్లాద్ నా దగ్గర యాభై నోటు తీసుకుని వీధి చివరి సూపర్ మార్కెట్‌లో పాలు తెస్తానని వెళ్ళాడు. రోజూ నాకు తోడొస్తాడు కనుక షాప్లో పద్ధతి వాడికీ, షాప్‌లో వాళ్ళకి వీడూ కొత్తేం కాదు. ఆ షాప్ కూడా మెయిన్ రోడ్ మీదే కానీ, మా వీధి మలుపులోనే. రోడ్ దాటక్కర్లేదు. మొదటిసారి రెండు నిమిషాలాగి, భయమేసి నేనూ వెనుకే వెళ్ళాను. బిల్లింగ్ కౌంటర్ దగ్గర నన్ను చూసి, తల కొట్టుకున్నాడు. "ఎందుకొస్తావమ్మా, నన్నిలా ఎంబారస్ చెయ్యడానికి" అంటూ.
రెండోసారీ వెళ్దామనుకున్నాను కానీ ఏదో పని ఇంట్లో నిలబెట్టేసింది. ప్లాస్టిక్ నిషిద్ధమైన ఈ నగరంలో, చిన్న గుడ్డ సంచీలో పాలూ మామిడికాయా (పులిహోర చెయ్యమని కోరుకున్నాడా పూట) పడుతూ లేస్తూ మోసుకొచ్చాడు బక్క వెధవ. చిల్లర నా చేతిలో పెడుతున్న వాణ్ణి పట్టుకుని "నా బంగారుకొండా ఎంత సాయం చేసావురా!" అని ముద్దాడబోతే చెంపలకు చేతులు అడ్డు పెట్టుకుని ఆటలకు పరుగూ తీశాడు.
వాడలా ఒక్కడూ ఈ ప్రపంచంలోకి దుడుకుగా దూకిన ప్రతిసారీ బెదురుబెదురుగానే ఉంటుంది, నేను దాటేసిన కాలాలన్నీ మళ్ళీ బతికేలా చెయ్యడానికే వీడు నా జీవితంలోకి వచ్చినట్టు ఉంటుంది. నేను చేసిన తప్పులో, నన్ను ఆపిన పరీక్షలో అంతకన్నా పెద్దవో చిన్నవో వాడూ ఎదుర్కుంటేనో అని దిగులు దిగులైపోతుంది మనసు. అవతలి మనుషుల కోపం, వాళ్ళు చేయగల గాయం, అవమానం తెలీని పసివాడు కదా, లోకం వీణ్ణి నాలా అయితే చూసుకోలేదు కదా అని తల్లిప్రాణం బలహీనక్షణాల్లో విలవిల్లాడుతుంది. పిల్లల ఆటల్లో అరుపుల్లో, వాళ్ళు గుసగుసలాడుకున్నప్పుడు దొర్లే తుంటరి నవ్వుల వెనుక రహస్యాల్లో, నాకు కొత్తగా వినపడుతున్న మాటలన్నీ అనివార్యమైన సత్యాన్ని బోధిస్తున్నాయని అర్థమవుతూనే ఉంటుంది. నాకు తెలుసు, ఇవన్నీ నేనెలానూ నియంత్రించలేను. ఈ మాటలూ, ఈ ప్రభావాలూ నేను ఏం చేసీ ఆపగలిగినవి కాదు. మంచీ చెడూ ఇవేనని రాశులుగా పోసి వాడికి చూపించలేను, నేర్పించలేను. నా నోటితో నేను ఎవ్వరినీ చూపించి "వీళ్ళు చెడ్డవాళ్ళు, దూరంగా ఉండు" అని చెప్పలేను. చెప్పినా వాడికి అర్థం అవుతుందని, ఒప్పుకుంటాడని నమ్మించుకోలేను. వాడు ఎటెళ్ళినా ఒక రక్షణ వలయంలా నేనో వాళ్ళ నాన్నో ఉండగలిగితే బాగుంటుంది కానీ అది అయ్యే పని కాదని తెలుసు. వాడు ఈ లోకంలోకి రేపు కాకుంటే ఎల్లుండైనా ఒంటరిగా వెళ్ళాల్సిందేననీ తెలుసు. "రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమతజేసి రాయిడులందున్" అని చదువుకున్నదాన్ని కానూ! అయినా సరే, ఉండీ ఉండీ ఓ రోజు, ఇదిగో ఆలోచనలు ఇట్లాగే సతాయిస్తాయి.
ఏ అల్లరి పిల్లాడిదో ఆటల్లోని అరుపు మళ్ళీ నన్నీ లోకంలోకి లాగుతుంది. వాళ్ళ గొంతుల్లోని ఉత్సాహమే గాలిలో తేలి తేలి వచ్చి, తిరిగి నన్ను ఊరడిస్తుంది. మంచినీళ్ళ కోసం అందరూ ఒకేసారి మడ్డి కాళ్ళతో నా వంటింట్లోకి చొరబడబోయినా,కలిసికట్టుగా ఉన్నప్పుడు వాళ్ళని ఆవరించుకుని ఉండే ఉత్సవసంబరమొక్కటే నా కళ్ళకు కనపడి మనసుకు చందనపుపూతలా సాంత్వననిస్తుంది. వాళ్ళ కదలికల్లో చురుకుదనం, వాళ్ళ కళ్ళల్లో మెరుపు, వాళ్ళ మాటల్లో హుషారు నాలోకి చిత్రమైన ధైర్యాన్ని ఒంపుతాయి. పిల్లలు బాగుండాలి. జట్టుగా ఉండాలి. సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి. అంతా ఒకరిదే కావాలనుకునే స్వార్థం కానీ, ఒకరినొకరు పొడుచుకుంటే గానీ సుఖపడలేని రాక్షసత్వం కానీ, నా పిల్లాడికీ, లోకంలో ఏ పిల్లాడికీ అంటకూడదు, అంటకూడదు, అంటనేకూడదు అని ఈ అమ్మ మనసు భగవంతుడికి లోపల్లోపలే మొక్కుకుంటుంది. ❤️

No comments:

Post a Comment

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...