"ఊపి ఊపి మనసు నొక్కొక్క వేదన
కావ్యమౌను మరియు గానమౌను" అంటాడు కృష్ణశాస్త్రి. నిండా ఏడేళ్ళైనా లేని తన జీవితంలో ఇరవయ్యైదు వేల బొమ్మలు గీసి, వాటిని తన జ్ఞాపకాలుగా వదిలి వెళ్ళిన క్లింట్ అనే కేరళ చిత్రకారుడి కథ, "లిప్తకాలపు స్వప్నం"గా తెలుగు లోగిళ్ళలోకి రావడానికి వెనుక కూడా అట్లా మనసుని పట్టి ఊపిన వేదనే ఉంది.
ఈ పుస్తకం అతని ఆరేళ్ళ పదకొండు నెలల జీవితాన్ని కళ్ళకు కడుతుంది. అతని ఆసక్తులు, అతని వేళ్ళలోని ప్రతిభ, అతని ఆలోచనల్లోని పదును, అతని అమ్మానాన్నల మురిపెం, అతని చుట్టూ ఉన్న వాళ్ళ అపేక్ష, అతని వీడ్కోలు...అన్నిటినీ మెల్లని గొంతుతో పరిచే కథనమీ పుస్తకానిది. రేఖా చిత్రాలు, వర్ణ చిత్రాలు, నీటి రంగుల చిత్రాలు - ఒకటేమిటీ, క్లింట్ గీసిన బొమ్మలను ఈ పుస్తకంలో మణిపూసల్లాగా పొదిగి, అతని కథనీ, కళనీ కూడా ఒకేసారి పరిచయం చేశారు అనువాదకురాలు స్వర్ణ. స్వర్ణ కిలారి
చీకట్లతో యుద్ధం చేస్తున్నట్టు కనపడే నారింజ రంగు శోభలు ఏటి నీళ్ళ మీద పారాడే సంధ్యాకాలాన్ని క్లింట్ పట్టుకున్న తీరు చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఇదే ఈ పుస్తకపు ముఖచిత్రం. ఎట్లాంటి కళ్ళతో జూమ్ చేసి ఈ సూరీడిని పట్టుకున్నాడో అనిపించేంత దగ్గరగా, నిండుగా చిత్రించడం ఒక్కటే నా ఆశ్చర్యానికి కారణం కాదు. ఆ ఏటి ఒడ్డున వెదురు పొదల్లోకి కూడా పాకిన కాంతి పుంజాలు ఆ చిన్నపిల్లవాడి కళ్ళను తప్పించుకోలేదన్న ఊహ ఇచ్చిన పులకింత కూడా దానికి తోడైంది. వాటర్ కలర్స్ తో క్లింట్ గీసిన మొదటి చిత్రం విప్పారిన ఓ పూవు మీద తుమ్మెద వాలిన చిత్రం. ఏమి అందం ఆ బొమ్మది. చూస్తూ చూస్తూనే ఆ సౌందర్యానికి లోబడిపోయాను. ఆ బొమ్మ దాకా వచ్చాక, ఆ బొమ్మను విప్పారిన కళ్ళతో చూశాక, ఇక కథ వదిలేసి ఒక్కొక్క బొమ్మనూ వెదుక్కుంటూ పుస్తకం చివరికి వెళ్ళిపోయాను. చిన్నప్పుడే తల్లిదండ్రులకు తన బొమ్మలేవీ పారెయ్యద్దని చెప్పాట్ట ఈ పిడుగు. అందుకని, వాళ్ళు అన్నీ దాచారు. పుస్తకంలో దశల వారీగా ఆ బొమ్మలన్నీ చూపెడతారు కనుక, బొమ్మల గురించి కనీస పరిజ్ఞానం లేని నాబోటి వాళ్ళకి కొన్ని మరీ చిన్నపిల్లల బొమ్మల్లానే అనిపిస్తాయ్. ప్రత్యేకత ఏమీ లేనట్టుగానే కనిపిస్తాయ్. అయితే అవి కొన్నే. ఆనక ఈ పూవునో, ఆ సాయంసంధ్యల్నో, జలపాతాలనో, కేరళ ఉత్సవాలనో చూస్తే - వాటిలో ఎట్లాంటి వారినైనా విభ్రముల్ని చేసే సౌందర్యం కనపడుతుంది. తీవ్రమైన భావాతిరేకం, ఆతని కోమలమైన భావస్పూర్తి, ఆ వయసుకి చెక్కుచెదరని అతని ఏకాగ్రత ఆ బొమ్మల్లో నుండి, రంగుల్లో నుండి అర్థమై అతనెంత ప్రత్యేకమో తెలిసొస్తుంది.
నమ్మశక్యంగాని ఎన్నెన్ని సంగతులు గుది గుచ్చి రాశారో ఈ పుస్తకంలో. ఉదాహరణకి, ఒక్కటంటే ఒక్కసారే చూసి కాలికులేటర్ బొమ్మ గీశాట్ట క్లింట్. స్క్రీన్, బటన్‌లు అన్నీ ఏ పరిమాణంలో ఏ నిష్పత్తిలో ఉండాలో అచ్చు అట్లానే. అందం గురించి మాట్లాడుతూ, ఒక టీచర్ గురించి చెప్తూ, ఆమె ఉదయం మామూలుగానే ఉంటుందనీ, రోజు పూర్తయ్యాక వదులైన జుట్టుతో, చక్కటి చీరకట్టులో అందమైన మార్మిక యువతిగా మారిపోతుందనీ అన్నాట్ట. ఏడేళ్ళ పిల్లాడి గమనింపులోకి రాగలిగిన అందమా అది అని ఆశ్చర్యచకితురాలినయ్యాను. జంతువుల బొమ్మలు గీసినప్పుడు ఆ కళ్ళల్లో క్రౌర్యం, ప్రకృతిని పరిచినప్పుడు, మామూలు మనుషుల కళ్ళను దాటిపోయే అందాలు అలవోకగా చూపించాడతను. చావు గురించి ఎంత మాట్లాడాడు! బ్రతుకు గురించి ఎంత తపనపడ్డాడు. ఎన్ని బొమ్మల్లో తన జీవితాన్ని ఒంపుకున్నాడు. ఆఖరకు అతడు గీసిన చివరి బొమ్మ కూడా ఓ అద్భుతమే. దానికీ అతని మరణానికీ కూడ ఒక మెలిక లాంటి కథ. ఇలాంటి ఎన్నో ఎన్నో ఆశ్చర్యాల మూట క్లింట్ జీవితమంతా.
క్లింట్ కి బొమ్మలు వెయ్యడానికి ఏదైనా స్పూర్తి కావాలి. జూ లో, తోటల్లో, జంతువుల్లో, వస్తువుల్లో, తాను విన్న కథల్లో ఏది ఆసక్తిగా అనిపిస్తే దానిని తన రంగుల, గీతల లోకంలోకి తెచ్చేసుకున్నాడు. కానీ ఎట్లాంటి ఊహలు ఆ పిల్లాడివి!! ఏనుగులంటే ఇష్టమని వందల ఏనుగులనీ, వినాయకుడిని విధవిధాలుగా చిత్రించుకున్నాడు. అది సరిపోలేదతనికి. షీట్‌లో ఒదగనన్ని ఏనుగులను తీసుకొచ్చి గుంపులుగా గీశాడు. అదీ చాల్లేదు, ఏనుగుల దండు వెళ్తుంటే ఆ తొక్కిడికి నలిగిపోయిన దారినీ గీశాడు. అసాధ్యుడు నిజంగా. కార్ బొమ్మలు, విమానాల చప్పుళ్ళు, ఇంకా స్వగతాలు..ఒకటేమిటీ, ఒక పసి మనసు ఎంత హడావుడి ఆలోచనలతో ఉంటుందో, అవన్నీ వరుసాగ్గా, అదే పనిగా బొమ్మలు గీసుకుంటూ వచ్చాడు. అదే అతనిలో తమాషా. లేదంటే బతికిన 2300 రోజుల్లో 25000 వేల బొమ్మలు వేయడం ఎవరికైనా సాధ్యం కాకపోవచ్చు. కానీ, ఎంత చెప్పినా, ఈ కథను ఒక చిత్రకారుడి కథగా మాత్రమే అయితే నేను చూళ్ళేకపోయాను. ఒక అపురూపమైన కళాకారుణ్ణి అంతే అపురూపంగా పెంచుకున్న తల్లిదండ్రుల కథ ఇది. లోకంలో ఎవ్వరూ పంచుకోలేని దుఃఖాన్ని తనతో పాటే మోసుకు తిరుగుతోన్న తల్లి వ్యథ, ఈ పుస్తకంలో అంతర్లీనంగా ఉంటూ హృదయాలను తాకుతూనే ఉంటుంది.
*
మీరు కళాకారులైతే, ఎట్లాంటి తపనతో మసలుకోవాలో నేర్చుకునేందుకు ఈ పుస్తకం చదవాలి. ఎట్లా వేశాడు ఈ పిల్లాడు బొమ్మల్ని! బడిలో, హాస్పిటల్ బెడ్‌లో, ఇంట్లో, గోడల మీద, పనికిరాని అట్టల మీద, ఇసుక మీద, తన నిశితమైన గమనింపుతో, అది మరపు దారుల్లోకి మళ్ళిపోయే లోపే సృష్టించుకున్నాడు.
మీరు ఒక కళాకారుడైనా, కళాకారుడి తల్లిదండ్రులైనా, వాళ్ళ గురువులైనా, వాళ్ళు మసలుకునే దగ్గరి సమూహాల్లోని సమాజంలోని వాళ్ళైనా ఈ పుస్తకం చదవాలి. కళాకారులు ఎట్లాంటి సున్నితత్వంతో ఉంటారు, వాళ్ళతో ఏం చెప్పాలి, మరీ ముఖ్యంగా ఏం చెప్పకూడదు, ఏం చేస్తే ఈ లోకంలో ఇంకొందరు కళాకారులు స్వేచ్చగా ఎదుగుతారో అర్థం కావాలంటే, మీరీ పుస్తకం చదవాలి.
క్లింట్ తల్లిదండ్రులు ఎవ్వరికైనా అర్థం అయ్యే అవకాశం తక్కువ. అందుకని, ఆ ఆదర్శమూర్తుల నుండి మీరేదైనా నేర్చుకోవడానికి ఈ పుస్తకం ఒకసారి చూడండి అని నేను చెప్పను. వాళ్ళ నాన్న అతనికున్న చిన్న జీతంలో నుండీ లెక్కకు వెనుకాడకుండా వాళ్ళ పిల్లాడికి కాగితాలు, రంగులు తెచ్చిపోసాడు. అల్లిబిల్లి గీతల మీద అంత ఖర్చా అనుకోలేదతడు. వాళ్ళ అమ్మ పిల్లాడిని కేవలం అతనికి తోచుబాటు కోసమే బడికి పంపాలనుకుంది తప్ప మార్కుల కోసమో, "బొమ్మలతో పాటుగా" క్లింట్ మిగతావన్నీ నేర్చేసుకోవాలన్న తాపత్రయంతోనో కాదు. ఎన్ని సార్లో ఆలోచనల్లో మునిగిపోయాను, ఈ పుస్తకం చదువుతూ. పిల్లలకు ఒక పూట బాలేదంటే సర్వశక్తులూ ధారపోసి పక్కన కూర్చుందాం అనుకుంటాం. వాళ్ళకి బాలేని రోజున బొమ్మలిస్తాం, ఆడిస్తాం, ఆడతాం, అటెన్షన్ ఇస్తాం. ఆరోగ్యంగా ఉంటే మాత్రం గ్రాంటెడ్ గా తీసుకుంటామేమో కదా. ఏవి వాళ్ళను సంతోషంగా ఉంచుతాయో తెలిసీ, మూసలో ఒదక్కపోతే ఏమవుతాడో నన్న భయానికి ఏడిపించైనా సరే, ఎ ప్లస్‌ల రొంపిలోకి దించేస్తాం. వాళ్ళకి ఇష్టమైన ఆట మళ్ళీ మళ్ళీ ఆడితే, ఇష్టమైన పాట పదే పదే పాడితే, నచ్చిన పనే ఇంకోసారి ఇంకోసారి చేస్తే, ఏ పిచ్చి పడితే అదేనా నీకు అని కట్టడి చేసే ప్రయత్నం చేస్తాం. రాత్రిళ్ళు క్లింట్‌ని చదువుతూ, అప్రయత్నంగానే పక్కనున్న పిల్లాణ్ణి తడుముకున్నాను.
క్లింట్ కళలో ఎంత మగ్నమై ఉన్నా, అతను పట్టుమని ఏడేళ్ళైనా నిండని చంటిగుడ్డు. అందరు పిల్లల్లాగే అతనిలోనూ ఇష్టమైన వాటిని చేతికిస్తే సంతోషంతో ఎగసిపడే పసితనం ఉంది. నచ్చని వాటిని నిర్ద్వందంగా తిరస్కరించే పెంకితనం ఉంది. నచ్చని మనుషుల పొడ కూడా గిట్టదని చెప్పే దురుసుతనం ఉంది. కానీ, అతని తల్లిదండ్రులు అతనికిచ్చిన భరోసా ముందు, ఇవన్నీ నలకలైపోయాయి. పూవులు విచ్చుకుంటుంటే దూరం నుండి చూసినట్టు, పిట్టలు గొంతులు సవరించుకుంటే నిశ్శబ్దంగా నిలబడి విన్నట్టు, ప్రార్థనలో నిమగ్నమైన మనిషి ఏకాంతాన్ని భగ్నం చేయకుండా పక్కన కూర్చునట్టు - వాళ్ళు క్లింట్ రంగుల ప్రపంచంలో మునిగిపోవడం చూశారు. తన ఊహల్లో నుండి కొత్త ప్రపంచాలను కాగితాల మీదకు అద్భుతాలుగా అనువదించుకుంటుంటే చూశారు. నిమిషాలు, గంటలు, రోజులు...అతని తపస్సులో కాగితాలు, అట్టలు, ఇంటి గోడలు, సమస్తం- అతని ఆవేశంలో ఐక్యమవడం చూశారు. నిశ్శబ్దంగా, ఇష్టంగా...
ఏ తపః ఫలాలతో మనందరం ఈ భూమి మీదకు వచ్చామో తెలీదు. ఆ రహస్యాలు పట్టుబడవు. కానీ, ఈ సృష్టిలో మనగలగడానికి ఎవ్వరికైనా కావలసినది మాత్రం "అనువైన వాతావరణం". అది ఉంటేనే పూవులు వికసిస్తాయి. అది ఉంటేనే పిట్టలు పాడతాయి. అది ఉంటేనే... కొన్ని రంగులకలలు ప్రాణం పోసుకుని కాలానికిలా నిలబడతాయి.
No comments:
Post a Comment