చామంతి పూల తోటలో

 అలా నిన్న సాయంత్రం అనుకోకుండా ఆ చామంతి పూల తోటకి వెళ్ళాం. అసలైతే నాకు సెలవు కూడా లేదు. కానీ అనిల్ కీ, పిల్లాడికీ ఉన్నాక -నాకు ఆఫీసున్నా సుఖం ఉండదు. వాళ్ళ పోరు పడేకంటే సెలవు చీటీ రాసేస్తేనే నయం నాకు. ఏమాటకామాట. వారం మధ్యలో సెలవు వచ్చినా, పుచ్చుకున్నా భలే మజా. కె.ఆర్ పురం లో పని ఉందని అటు వెళ్ళిన వాళ్ళం, మధ్యలో నా కాలేజ్ స్నేహితురాలు దీప్తిని కలిశాం. నాకు చామంతి పూల తోట చూడాలని ఉందని చెప్పి అందరినీ బయలుదేరదీశాను. దారి మొత్తం అందరూ ఎక్కడికి వెళ్ళాలో చెప్పమంటారు. కానీ నాకు దొడ్డబళ్ళాపూర్ పేరు తప్ప ఇంకేమీ తెలియదు. అది కూడా రమ గారు అనడం వల్ల. అనిల్ కాబట్టి నువ్వు వెళ్దామంటే ఎక్కడికో కూడా తెలీకుండా వస్తున్నాడు, మా ఇంట్లో అయితే ముందు అడ్రెస్ కనుక్కు రమ్మని కూర్చోబెట్టేస్తాడు అని దీప్తి నస పెడుతూనే ఉంది కార్‌లో ఉన్నంతసేపూ. ఏం చెయ్యను. ఈ రెండు వారాలు గడిచిపోతే చామంతి పూలు దొరకవని నా బెంగ. సరే, కార్ ఎక్కగానే పడి నిద్దరోయే నేను, నిన్న మాత్రం అదే పనిగా అన్ని దిక్కులూ వెదుక్కుంటూ కూర్చున్నాను. ఊరు దాటి పల్లె గాలి తగిలిందో లేదో...రోడ్డు కి దూరంగా...పసుప్పచ్చ చారికలా కనపడింది. ఎంత సంబరమైందనీ...!!

అంగలుపంగలుగా సన్నటి మట్టిరోడ్డు లో నుండి ఆ తోటల వైపెళ్తే...ఓహ్! ఓహ్! తెలుపు, పసుపు చామంతి పూవులు...అట్లా చిన్న మచ్చైనా మరకైనా లేకుండా విరబూసి ఉన్నాయి. ఎంతందం ఈ పూలది అనిపించని క్షణం లేదు అక్కడ ఉన్నంతసేపూ. పిల్లలు యథేచ్ఛగా తిరిగారు ఆ తోటంతా. తొడిమలు తీసి రేకులు గాల్లోకి ఎగరేసి అడుకున్నారు. బెండ మళ్ళు ఉంటే అక్కడి లేత కాయలను ముట్టుకుని గరుకుగా గుచ్చుకుంటున్నాయేంటీ అని గంతులేశారు. గులాబీ తోటల్లో పూవులను వదిలేసి అక్కడి ముళ్ళ పొడవూ వెడల్పూ కొలుచుకున్నారు. పెద్ద పెద్ద చేపలు తిరుగాడుతున్న నీళ్ళ తొట్టె చుట్టూ చేప పిల్లల్లానే తుళ్ళిపడ్డారు. మా దీప్తి దసరాల్లో అయినా రాకపోతిమి, బోలెడు పూలు కొనుక్కు వెళ్ళేవాళ్ళం అని బెంగపడి, అక్కడ పూలు సంచీలకెత్తి వెళ్ళిపోతున్న వాళ్ళని అడిగింది. పూలు కొనుక్కుంటాం, ఇస్తారా అని. ఇక్కడ అమ్మం, కవర్ ఉంటే కోసుకుని తీసుకెళ్ళమన్నారు. కవర్ కోసం వెతుక్కుంటూ, దొరక్క దాని స్కార్ఫ్ తీసి ఇస్తే, దీపు తూలి వెనక్కు పడేటన్ని పూలు ఒడి నిండా పోసారు. ఎన్ని కిలోలో! చీకటి పడేదాకా ఆ పక్క తోట, ఆ పక్క తోట అంటూ నడుస్తూనే ఉన్నాం అందరం. చీకట్లు ముసురుకుంటూ ఉండగా, పక్కనున్న గులాబీ తోటమాలి వచ్చారు. పెద్దాయన. ఆ పూవుల్నీ, మూల ఉన్న పచ్చిమిర్చి ని కోసుకు తీసుకు వెళ్ళమన్నారు. ఇంటికి రమ్మని పిలిచారు కూడా. తోటకి ఎవ్వరు వచ్చినా ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇవ్వడం ఆయన అలవాటట. భలే. ఒంటరి లో రైతు గుర్తొచ్చాడు చప్పున. వాళ్ళావిడ గోరుచిక్కుళ్ళు తెమ్మందిట. అన్నీ మూట గట్టుకు తీసుకెళ్తున్నాడాయన. త్వరగా వెళ్ళాలనీ, ఆమె వంటకు ఆలస్యమైపోతుందనీ మా దగ్గర సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయాడు. దూరంగా కొబ్బరి చెట్ల వెనుక అస్తమించే సూర్యుడు. ఆకాశమంతా లేత ఎరుపు రంగు. ఇహనో ఇప్పుడో కమ్ముకునే చీకట్లు అన్నట్టుంది. కళ్ళ ముందంతా పచ్చాపచ్చని చామంతులు. ఆ గాలంతా ఉందా లేదా అన్నంత పల్చని పూల పరిమళం. తెల్ల చామంతులైతే చూపు తిప్పుకోనివ్వలేదు. ఉన్న కాసిన్ని గులాబీలదీ భలే మత్తు పరిమళం. తోట బయటకు వచ్చి నాలుగు అడుగులు వేశామో లేదో వారమంతటికీ సరిపోయేంత ఆకుకూరలు కట్టలు కట్టి అమ్ముతున్నారు. తోటకూర పెసరపప్పు వేసి పొడికూరగానూ, పప్పో రోజూ పులుసో రోజూ అని అక్కడే ప్లాన్‌లు వేసి కొనేశాం, ఆ తాజా ఆకుల్ని చూసి వదిలిపెట్టబుద్ధి గాక. కార్ ఎక్కుతూ వెనక్కి చూస్తే అంతా చీకటైపోయింది. తోట వెనుక ఎక్కడో దూరాన చిన్న డాబా ఇంటి వరండాలో లైటు వెలుతురే ఆ కాస్త మేరా ఉంది.

No comments:

Post a Comment

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...