గత యాభై ఏళ్ళల్లో ఎన్నడూ లేనంత వేడిట, ఈసారి బెంగళూరులో. బెజవాడ వదిలేశాక ఈ వేడి గాలి సెగ తాకడం చాన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఈ ఏడే! ఇంత మండుటెండల్లో వెన్నెల్లో షికారు చేసినట్టు ఓ బంతీ బ్యాటూ పట్టుకుని ముచ్చట్లాడుకుంటూ తిరుగుతారు మా పిల్లలు. నీడ పట్టున ఆడే ఆటలంటే ఎంత చిరాకో, ఎంత చిన్నతనమో. వాళ్ళని "ఎండలో వద్దూ" అని అరుస్తూ పిలిచినప్పుడల్లా, నా గొంతులో మా అమ్మ గొంతో నాన్నగారి గొంతో కలిసిపోయినట్టు ఉంటుంది. ఆ గొంతులను పెడచెవిన పెట్టి అచ్చం వీళ్ళలాగే ఆటల్లో మునిగిపోయిన నా బాల్యం అంతకంతకీ మసకమసకై చెదిరిపోతున్నట్టు ఉంటుంది.
మొన్నెప్పుడో ఓ శనివారం ప్రహ్లాదుడలా ఎండల్లో మాడిపోవడం చూడలేని వాళ్ళ నాన్న సినిమాకు తీసుకెళ్తానన్నాడు. చిన్న పిల్లల సినిమాల లిస్ట్ చదువుతుంటే పక్కింటి అబ్బాయి, మా వాడు "నా బెస్ట్ ఫ్రెండ్" అని దీర్ఘం తీసి మరీ చెప్పే కిట్టు వచ్చాడు. అనిల్ కిట్టుని కూడా సినిమాకు తీసుకెళ్దాం అన్నాడు. అనడమే తడవు, పిల్లలిద్దరూ బయటికి పరుగూ తీశారు, వాళ్ళ ఇంట్లో పర్మిషన్ కోసం. ఐదు నిమిషాల్లో పళ్ళెమంత మొహంతో ఇంట్లోకొచ్చి సంబరం సంబరంగా చెప్పాడు ప్రహ్లాద్ "వెళ్ళమన్నారు" అని.
అంతకు ఓ నాల్రోజుల ముందు వాళ్ళమ్మగారూ నేనూ ఇంటి ముందు నిలబడి వీళ్ళ అల్లర్ల గురించే ఏదో చెప్పుకుంటున్నప్పుడు, ఈ సినిమా ప్లాన్ ఒకటుందని అన్నాను నేను. ఆవిడ తీసుకెళ్ళండని చెప్పేశారప్పుడే. అందుకని మళ్ళీ ఇంకోసారి వెళ్ళి అడగకుండా అనిల్‌కి చెప్పేశాను.
టికెట్స్ బుక్ చేసుకున్నారు. తర్వాత ఆ పనీ ఈ పనీ చేస్తూ నిజంగానే ఆంటీకి చెప్పారు కదా అని మరీ మరీ అడిగాను. తలూపాడు.
ఇంకో పావుగంటలో బయలుదేరాలనగా, వెళ్ళి కిట్టు ని తయారవమని చెప్పి రా అని పంపాను.
గోడక్కొట్టిన బంతిలా ఠపామని దిగులు మొహంతో తిరిగొచ్చాడు, సోఫాలో ముడుచుకు కూర్చున్నాడు. ఆ మొహం - పిల్లలు ఏదో అవస్తలో ఉన్నారని ఏం చెప్పక్కర్లేకుండానే అమ్మలు గుర్తు పట్టే మొహం - అమ్మానాన్నలను కూడా బలహీనం చేసేసే మొహం - ఏమీ అడక్కుండా వాళ్ళని బుజ్జగించి ఊరడించాలనిపించే మొహం - కదిలిస్తే కన్నీళ్ళు పెట్టుకుంటారేమో అనిపించే అమాయకపు జాలి ముఖం -
"ఆంటీ వద్దన్నారా...?" పక్కన చేరి వీపు నిమురుతూ అడిగాను.
కళ్ళెత్తి చూడలేనట్టు తలాడించాడు.
గడ్డం పట్టి తిప్పుకుంటూ "ముందు అడగలేదా నాన్నా మరి...?" ప్రశ్నలా తోచకుండా ఉండేందుకు ప్రయత్నిస్తూ అడిగాను.
"అడిగానమ్మా, అప్పుడు సరే అన్నారు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళే వద్దన్నారు"
"ఎందుకుట?"
"చదువుకోవాలిట"
"సెలవల్లోనా?" పుస్తకం ముట్టనే ముట్టమని భీష్మించుకున్న బేచ్ వీళ్ళంతా.
"అదే!"
...
"పోనీలే.." నాకూ నిరుత్సాహంగానే అనిపించింది.
ఒక నిమిషం ఆగి నన్ను అడిగాడు, "నువ్వొస్తావా పోనీ?"
ఈ సారి బిక్కమొహం నా వంతయింది.
"నేను రాలేను కన్నమ్మా...నువ్వూ నాన్నా వెళ్ళండి."
అప్పటి దాకా ఎగిరి గంతులేసి ఏమేం చెయ్యాలో ఊహించుకున్న వాడు, వెళ్ళడం బలవంతమన్నట్టు కూర్చున్నాడు హాల్‌లో.
"మీరూ మానేస్తారా పోనీ?"
"మూడు టికెట్స్ చేశాం" కుదరదన్నాడు.
వాణ్ణలా చూళ్ళేక.."నేను అడగనా పోనీ ఆంటీని?" అన్నాను.
లేచి కూర్చున్నాడు. "నిజంగా వెళ్తావా?"
పక్క గడపే.
వాడు మా గుమ్మంలో నుండి గుసగుసగా అందిస్తున్నాడు.
"అమ్మా, ఆంటీని కాదు, అంకుల్ ని అడుగు.."
నేను నవ్వుతూండగానే ఆయన తలుపు తీశారు.
"రెండు నిమిషాల్లో వచ్చేస్తాడు" నేనింకా ఏం అడక్కుండానే చెప్పారాయన.
"అబ్బ! మా వాడు ఇందాకటి నుండి సతమతమయిపోతున్నాడు, మీరు పంపనన్నారుట"
" How can I not send, I was just kidding" మీరూ నమ్మారా అన్నట్టు పరిహాసంగా నవ్వి, కిట్టు పిలిచాడని లోపలికి వెళ్ళిపోయారాయన.
గుమ్మం దగ్గర నుండే నా మొహం చూసి "ట్రిక్ చేశారు కదా అంకుల్. నాకు తెలుసు. నాకు తెలుసు." అప్పటికిక అంతా అర్థమైనట్టు, అన్ని మాటలూ మళ్ళీ మళ్ళీ చెప్పుకున్నాడు. మోసపోయిన వాడిలా తలపట్టుకున్నాడు. లిఫ్ట్‌లో, కారిడార్‌లో, పార్కింగ్‌లో, ప్లే ఏరియాలో, ఇంట్లో...ఎక్కడ ఎదురుపడ్డా, ఆయన వీడిని ఆటపట్టించే ఏ అవకాశమూ వదులుకోరు, వీడూ అంతే తెలివిగా తప్పించుకుంటాడు, ఆయన చక్కిలిగింతలు పెట్టబోతే మెరుపు వేగంతో పక్కకు జరిగి వెక్కిరిస్తాడు, ఆయన ఫుట్‌బాల్ కిక్ చేస్తే వీడు చిట్టి పాదాలతో పోటీ పడి గోల్స్ కొడతాడు. ఆయన కొంటె ప్రశ్నలేస్తే దాని వెనుక ఇంకేదో అర్థం ఉందని ఒకటికి నాలుగు సార్లు చకచకా ఆలోచించే బదులిస్తాడు; అయినా ఈసారి మాత్రం మావాడు బోల్తా పడిపోయాడనమాట. అది వాడికి తగని సిగ్గయిపోయింది. వాడి లోపలి దిగులేదో అమ్మ పట్టేసుకుందని మహా అవమానమయిపోయింది. అయినా సినిమా సంబరంలో, స్నేహితుడొస్తాడనే ఉత్సాహంలో - పిల్లలకు మాత్రమే సాధ్యమైన మరపుతో, వాడి ధోరణిలో పడిపోయాడు. మెల్లగా, నేను కూడా...
*
ఇద్దరూ ఏ రంగు చొక్కాలు వేసుకోవాలో అనుకుని తయారయ్యారు. ఏం తినాలో అమ్మలు, నాన్నల ముందు నిలబడి నిశ్చయం చేసుకున్నారు. కూల్ డ్రింక్స్ తాగమని ముందే చెప్పేశారు.
రెండూ రెండున్నర గంటలు ఇట్టే గడిచిపోయాయి. నేను నింపాదిగా ఇల్లంతా సర్దుకుని, దుప్పట్లు మార్చుకుని, బయట తిని వస్తారని తెలుసు కనుక తేలిగ్గా ఉండే భోజనం సిద్ధం చేసుకుని కూర్చున్నాను.
పెద్ద కోలాహలంతో తిరిగి వచ్చి, హడావుడిగా కథ చెప్పి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక, అనిల్ ని అడిగాను, "బానే ఉన్నారా ఇద్దరూ" అని.
"వాళ్ళు సినిమా చూసిందెక్కడ, వాడు నవ్వుతున్నాడా లేదా అని వీడు; వీడికి అర్థమైందా లేదా అని వాడు; ఒకళ్ళనొకళ్ళు పొడుచుకుని నవ్వడమే సరిపోయింది వాళ్ళకి"
ఆ థియేటర్ చీకట్లలో ఒదిగి కూర్చుని, పాప్ కార్న్ డబ్బాలతో ఒకరినొకరు చూసుకుంటూ గుసగుసలాడుకునే వాళ్ళ చిట్టి మొహాలు నా ఊహలోకి రాగానే లోపల గిలిగింత పెట్టినట్టు ఏదో సంతోషపు రేఖ.
"నువ్వూ సినిమా చూడలేదనమాటేగా అయితే!! వాళ్ళిద్దరినీ చూస్కుంటూ కూర్చున్నావా! అంతా దండగ వ్యవహారాలు, ఎంత ఒక్కో టిక్కెట్టు?"
పట్టుబడిపోయినట్టు...ఈసారి తనూ నవ్వాడు.
No comments:
Post a Comment