మధుపం - పూడూరి రాజిరెడ్డి

 పెళ్ళి అనేది రోజువారీ పోరు, నిరంతర మైత్రి అంటాడు రాజిరెడ్డి. "ఈ మనిషి కచ్చితంగా మనకోసమే పుట్టిందన్నంత నమ్మకం కలుగుతుంది; ఇంకోసారి పోయిపోయి ఈమె బారిన పడ్డామే అన్నంత వేదన వస్తుంది" అని రాశాడు మధుపం మొదటి పేజీలోనే. వార్నీ, ఇట్లాంటి మాటలు ఆడవాళ్ళ దగ్గర కదా విన్నాను అని చిన్న నవ్వొచ్చి వాలింది నా పెదాల మీద. నిజమే, మగవాడి ఫీలింగ్స్ అంత ఫిల్టర్స్ లేకుండా తెలిసే వీలేదీ? "మధుపం" నా చేతుల్లో పడబట్టి కానీ. ఇంతకీ నవ్వుకున్నాను అంటే, అదేమీ బిగ్గరగా నవ్వుకునే హాస్యం కాదు. అందరితో చకచకా పైకి చదువుకు పంచుకు చెప్పుకునేదీ కాదు. రాజిరెడ్డి రాతల సరంజామా అంతా నీదీ నాదీ కూడా అయినా సంసారి జీవితం. ఎవరికి వాళ్ళమే ఎక్కడో ఓ చోట తారసపడతాం. ఆ ఫీలింగ్ బాగుంటుంది. కన్వీనియంట్‌గా మర్చిపోయే చిరాకు క్షణాలు కొన్నింటిని రాజిరెడ్డి రహస్యంగా ఫైల్ చేసి పెట్టాడు అనుకుంటే ఉన్నట్టుండి బ్రతుకు మీద కొత్త జాగ్రత్త మొదలవుతుంది. మూతివిరుపూ, నవ్వూ, చీర కట్టు, ఆఖరికి తన క్రాఫ్‌లో కదలాడే వేళ్ళ స్పర్శకు నెమ్మదించే తలనొప్పి కూడా ఒద్దికగా ఒక రెప్పచాటున రికార్డ్ అవుతోందనుకుంటే, రెపరెపలాడే గర్వం తోడుగా కొంత జాగ్రత్త, ఇంకొంచం ప్రేమా - నిజమా, కాదా?! తా వలచింది రంభ అయినా కూడా అందం కన్నా ఆమ్లెట్ కే ఎక్కువ మార్కులు అనుకునే లౌక్యాన్ని మగాడిలో చూసీ చూడనట్టు పోవడం ఆడవాళ్ళకేం సమస్య కాదు కానీ, రాత్రి వేళ మెతుకు మెతుకూ రుచి చూసుకుంటూ తినే మొగుడిని "కానీయ్..గిన్నెలు సర్దాలి" అనే పెళ్ళాం గొంతులోని విసుగు రంపంలా కోస్తుందంటే ఏమిటోగా ఉండదా! అమ్మాయిలు సీతాకోకలేమోలే కానీ కందిరీగలు అనకూడదా? అని ఎదురొచ్చి నిలదీస్తే సమాధానం దొరకబుచ్చుకోవడానికి సమయం కావాలా అక్కర్లేదా! చూపూ చూపూ కలిపి కవ్వించే ఆడవాళ్ళ మనస్తత్వాన్ని గుర్తుపట్టి, వాళ్ళ అటెన్షన్ సీకింగ్ అర్థమైపోయిందనే మగవాళ్ళ వాలకం ఆడవాళ్ళకి గాభరా పుట్టించేస్తుంది. స్నేహితుడు ప్రాణాలడిగితే ఇచ్చేస్తాను కానీ పది రూపాయలంటేనే గుంజాటన మొదలవుతుందనే మధ్యతరగతి మొగుడి వాలకానికి అయ్యో రామా అనుకుంటుందేమో కానీ, నెలలో వారాలు గడిచేకొద్దీ బడ్జెట్ కి తగ్గట్టు జీవితాన్ని మలుపులు తిప్పుకుని కుటుంబాన్ని హత్తుకు పడుకునే వాణ్ణి ప్రేమించకుండానూ ఉండలేదు. అయినా అవన్నీ తెలిసే హత్తుకుంటారు వాళ్ళు, మధుపం చెప్పింది. ఇన్ని రహస్యాలు తెలిసినవాడికి, కుతూహలం పోవడమే నిరాసక్తతకు కారణం అని కూడా తప్పకుండా తెలిసే ఉంటుంది. అట్లాంటివాడు మరిక స్త్రీని ఎన్ని మాయలైనా చెయ్యగలడు. ఆమెకి ఎన్ని అబద్ధాలైనా చెప్పగలడు. రాత్రి పూట తన చేత్తో భోంచేసి ఎన్నాళ్ళైందో అనుకుంటూనే, పెళ్ళాం అంటే కోడెలేగ పొగరణచడానికి దాని మెళ్ళో కట్టే లెంకపీట లాంటిదని కూడా అనగలడు. సరే ఎన్ని అన్నా ఇంటికి రావడానికి ఒక కారణంగా కనపడే ఆమె వంటి విరుపు, టాటా చెప్పే పిల్లాడి కంటి మెరుపు చాలనుకునే సంసారిని మెచ్చకుండా ఎట్లా! "పెళ్ళి మోసపురాణమే కానీ, ఆ మోసంలో అందం ఉంది, ఆకర్షణ ఉంది, ఇష్టం ఉంది, స్త్రీ పురుషులు కలిసి నడవాల్సిన వాళ్ళమన్న గమనింపు ఉంది, ఏదోలా కాపురాన్ని సౌఖ్యంగా మలచుకోవాలన్న తహ తహ ఉంది..." అని కన్ఫెస్ చేశాక ఇక ఇలా ఎందుకన్నావ్ అని పోట్లాడేందుకేముంది? నిన్న పెట్టుకున్న నాగుపాము బొట్టుకూ, ఇవ్వాళ్టి దోసగింజ తిలకానికీ తేడా గుర్తించగల బ్రహ్మచారి చూపు సంసారంలో పడ్డాక కూడా ఎక్కడో నక్కి ఉంటుందనుకోవడంలోనే ఉంది బ్రతుకులోని "తీయ తేనియ బరువు"! ఈ రాజిరెడ్డి అలా కాదే! ఉందనో లేదనో అనడు. ఉందో లేదో అన్న గుంజాటన వీడడు. "సాహిత్యానికి చిక్కని క్షణాలు" పేజీల నిండుగా పరిచి, వెదుక్కుంటున్నది ఉందో లేదో వేయి వైపుల నుండి లెక్కలేసి చూసుకుని చూపిస్తాడా, దాని లెక్క తేల్చడం ఆషామాషీ వ్యవహారమేం కాదు.

❤️

No comments:

Post a Comment

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...