నీలూ నేనూ

 చదువు అయ్యీ అవగానే ఉద్యోగంలో కుదురుకున్నాకా, ఉన్నట్టుండి జీవితంలో ఇంకేం చెయ్యాలా అన్న అయోమయం మొదలైంది నాకు. అదొక అజ్ఞానపు దశ. ఇక చెయ్యడానికి ఏం లేదేమో? అన్న మాయ తాత్కాలికంగా బుర్రను ఆవరించుకునే ఒక విచిత్రమైన దశ. అదృష్టవశాత్తూ చాలా త్వరగానే మేలుకున్నాను కానీ, ఈ లోపు కొన్నాళ్ళు నేనూ ఆ మాయలో మగ్గాననే చెప్పాలి. Discipline లో D కూడా మర్చిపోయిన ఆ phase of life ని నేను ఇంకా ఇష్టంగా గుర్తు చేసుకుంటానూ అంటే, అది కొన్ని స్నేహాల వల్లే. నా బుర్రని కలుషితం చేయనందుకూ, ఏ రకంగానూ ఇంఫ్లూయన్స్ చేయనందుకూ ఆ స్నేహాల పట్ల నాక్కొంత గౌరవం, బోలెడు ప్రేమ.

అట్లాంటి రోజుల్లో పరిచయమైన అమ్మాయి నీలిమ Neelima. గెస్ట్‌గా వచ్చింది మా ఫ్లాట్‌కి. నెలో రెండు నెలలో ఉండి వెళ్ళడానికి. రోజుకి కనీసం పది పన్నెండు గంటల నిద్ర కావాలా పిల్లకి. ఆఫీసుకి పూటా లేటే, అంటే మేమే లేటంటే మా కన్నా ఆలీసం. పొద్దున్నే ఇంట్లో అందరం ఎదురూబొదురూ కొట్టుకుని యుద్ధాలైపోతూ ఉండేవి. ఎప్పటికో తెమిలి ఆఫీసుకి వచ్చాక కూడా, వాళ్ళ తమిళ మేనేజర్‌తో పూటా తిట్లు తినేది. సరే ఒక శుభముహూర్తానా నా దగ్గరకొచ్చి, తనకొక అలారం టోన్ సెట్ చెయ్యాలనీ, తను చెప్పినదంతా నేను రికార్డ్ చేసి ఇవ్వాలనీ అడిగింది. ఏదో బలహీన క్షణంలో ఒప్పుకున్నా కానీ, it was a crazy message. మేనేజర్ తిడతాడు త్వరగా లే...అని ముద్దుముద్దుగా పిలుస్తూ లేపే రింగ్ టోన్. రికార్డింగ్ చేశాకా వింటే దానికి నవ్వులాటగానూ, నాకు పరమ చిరాగ్గానూ అనిపించింది. మూడు నాలుగు రోజులయ్యాక, ఆ అలారం మోగడం మొదలయీ అవ్వగానే నాకు నిద్ర మొత్తం చెదిరిపోయేది. పొద్దు పొద్దున్నే బెడ్ రూంలో ఒక మేనేజర్ పేరు వినపడడం, అదీ నా గొంతులో...మహా కంపరంగా ఉండేది. దుప్పట్లు విసిరి కొట్టుకుంటూ లేచి, నీలూ వీపు పగలగొట్టి వెళ్ళిపోయేదాన్ని. అలా, దాని ట్రిక్ బానే పని చేసినట్టు.
ఆ మేనేజర్ పేరు చెప్పలేదు కదా - కామరాజు కళ్యాణ సుందరం. యెస్. ఆ పేరు, ఆ పిలుపు.. నభూతో...
(పదేళ్ళ తర్వాత కూడా ఎన్నో ఫోన్‌లు మారాక కూడా ఆ అలార్మ్ టోన్ అలాగే దాచుకుని నాకు పంపింది ఈ పిల్ల. మొదలవగానే ఆయన పేరు మొదలయేలోపే డిలీట్ చేశేశా...అప్పటి దడుపు జ్వరం నన్ను వదలలేదల్లే ఉంది ;))
**
అప్పట్లో నీలూ పిల్ల చాలా లేతగా సుకుమారంగా ఉండేది. ఓ ఆదివారం, ఎలా జరిగిందో తెలీదు కానీ, ఒక పలుచటి గాజుసీసా ని గట్టిగా పట్టుకుని మూత తిప్పుతుంటే, ఆ సీసా పగిలి ముక్కలై ఈమె చేతులంతా గాయలయ్యాయి. వంటిల్లంతా రక్తపు మడుగు. ఇంట్లో ఉన్న నేనూ చందనా బెదిరిపోయాం. చందనా పసుపో కాఫీ పొడో, రెండూనో దట్టంగా చల్లింది, ఎమెర్జెన్సీ వార్డ్‌లోకి వెళ్ళేసరికి కాస్త రక్తం ఆగుతుందని. కేస్ చూడటానికి అక్కడి సింగపూర్ డాక్టర్ వచ్చింది. అక్కడి వాళ్ళందరిలాగే ముద్దుగా ఉంది. ఏమైంది, ఎలా అయింది లాంటి వివరాలు కనుక్కున్నాక, పేషంట్ చేతి నిండా ఆ రంగులు ఏంటని అడిగింది.
మా చందనా భలే మాటకారిలే. ఏదైనా వివరంగా, ఉత్సాహంగా చెబుతుంది. ఆ కుర్ర డాక్టర్ దీనిని మొత్తం కథంతా చెప్పనిచ్చి, కాస్త చిల్లీ పౌడర్ కూడా చల్లకపోయారా, అది కూడా కిచెన్ లోనేగా ఉంటుందీ, అని కరిచినంత పని చేసింది.
అప్పటి దాకా దాని కథని నోరెళ్ళబెట్టుకు విన్న నీలూ నేనూ, నర్సులూ అందరం తలో దిక్కుకూ తిరిగి వచ్చే నవ్వాపుకున్నాం. కానీ వస్తూ వస్తూ దారిలోనూ, ఆ తర్వాత ఇంట్లోనూ ఎన్నిసార్లు ఆ డాక్టర్ తిట్లని గుర్తు చేసుకున్నామనీ. ఇంట్లో మేం ముగ్గురం ఉంటే నవ్వులు వినపడని రోజే ఉండేది కాదు. అంత కులాసాగా, అకారణంగా నవ్వుకోవడం ఒక భాగ్యమని మాకు అప్పుడూ తెలుసు.
**
ఈ మధ్య హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళినా హడావుడిగానే తిరిగొస్తున్నాను. పిల్లాడిని వదిలి ఉండకూడదనుకుంటాను కనుక ఫ్లైట్, బస్ - ఏది నా పని పూర్తవగానే నన్ను తెచ్చి ఇంట్లో పడేస్తుందో దాని వైపు వెళ్ళిపోతున్నాను. క్రితంసారి, అంతకు ముందుసారీ కూడా నీలుని కలవడం వీలుపడలేదు. ఈసారి వస్తే తప్పకుండా చెప్తానని మాటిచ్చాను. పోయిన వారం ఒక ముఖ్యమైన Client Presentation కోసం రెండు రోజులు హైదరాబాద్‌లో ఉన్నాను. పర్మిషన్ పెడతావా ఓ రెండు గంటలు ఎటైనా పోదాం అని నేనడిగితే, బోడి పర్మిషన్ ఎందుకూ, నువ్వొస్తే లీవే పెట్టేస్తాను అని తయారై కూర్చుంది. నా కోసం.
చార్మినార్ ఎప్పుడూ చూళ్ళేదు ఇన్నేళ్ళలో. ఎందుకో ఎప్పుడూ కుదర్లేదలా. మొన్న అదే తీసుకువెళ్ళింది. కులాసా షాపింగ్‌లూ, గాజులూ, ఝుంకీలు, బోలెడన్ని చిరు తిళ్ళు అయ్యాక...ఎండలో మాడిపోతున్నాం అన్న స్ఫురణ కలిగాక చట్నీస్ కి పారిపోయాం. ఇంటికి తీసుకువెళ్ళి, గదంతా చీకటి చేసి వెచ్చగా బజ్జోపెట్టింది. అచ్చం ఆ పదిహేనేళ్ళ నాటిలాగే. 🙂 ఆ సాయంకాలం నాకు ప్రాజెక్ట్ పార్టీ కూడా ఉంది. ఇంకోగంట కూర్చో నీకు ఫేస్‌పేక్ వేసి మెరిపిస్తానంది. చూశారా, అమ్మాయిలు ఫ్రెండ్స్ అయితే ఆ లోకంలో మజా వేరే.. :))
సరే, నాకు కాబ్ బుక్ చేసి, అది వచ్చే లోపు...ఉండుండూ అని ఓ పుస్తకం, పెన్నూ తెచ్చి నా చేతిలో ఉంచి సంతకం చెయ్...అని అడిగింది. నా పరవశ. 🙂 చెప్పొద్దూ...కన్నీళ్ళొచ్చినంత పనైంది. పుస్తకం తెరిచి చూశానా - దగ్గు కూడా వచ్చింది. మరి ఆ మొదటి పేజీలోనే ఇంత బూజు. గాడిద!! గబగబా లాక్కుని నా చున్నీతోనే తుడిచిందనుకోండీ...ఏదో పొరబాటున అయిందిలేవే అయినా కవిత్వాలు రోజూ చదువుతామా ఏంటీ...నీ పేరు కోసం కొని దాచా కానీ అని ఎదురు పోట్లాడుతూనే సంతకం చేయించుకుంది. ❤️
No photo description available.
All reactions:
Vadrevu Ch Veerabhadrudu, Padmaja Suraparaju and 190 others

No comments:

Post a Comment

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...