ఇంట్లో రెండో వాళ్ళుగా పుడితే వాడేసిన పుస్తకాలు, వదిలేసిన బొమ్మలు బట్టలు వస్తాయని నా చిన్నప్పటి నుండీ వింటున్నాను. కానీ నాలా నాలుగున్నరేళ్ళ తేడాతో పుడితే సిలబస్ మారిపోయి క్లాసు పుస్తకాలు పనికి రావు! బొమ్మలేమో మా ఇద్దరికీ పడవు మొదటి నుండీ. దానికి పుస్తకాలు కావాలి. నాకు మనుషులు, ఆటలు కావాలి. ఇద్దరం ఎవరి ప్రపంచాల్లో వాళ్ళు ఉండేవాళ్ళం.
ఒక్క బడేమిటి, అది ఎక్కడికి వెళితే అక్కడికి వెంటపడేదాన్ని. అదేమో రావద్దనేది. చెప్పుల్లేకుండా చింపిరి జుట్టుతో దాని వెనుక వెళ్తే, చిరాకుపడిపోయేది. వాళ్ళ స్నేహితులు "పోన్లే మధూ" అంటూ నన్ను బుజ్జగించబోతే మొహం గంటు పెట్టుకుని పక్కకు వెళ్ళిపోయేది.
కోతి పిల్లలా అదేం చేస్తే అది చేసేదాన్ని. ఏమంటే అది అనేదాన్ని. అది వింటోందనే పాటలు వినేదాన్ని. అది చెప్పాకనే ఇళయరాజాని కనుకున్నదాన్ని. రాత్రిళ్ళు రేడియో చెవి పక్కన పెట్టుకుని అది వినే పాటల కోసం, దాని దుప్పట్లో దూరేదాన్ని. అది తింటోందనే అరిటాకు కంచం నాకూ కావాలని పేచీలు పెట్టేదాన్ని.
అది ఏం చేస్తుందో చూద్దామనే లైబ్రరీకి వెళ్ళాను ఆరేడేళ్ళప్పుడు. ఎందుకు చదువుతోందో చూద్దామనే పుస్తకాలు పట్టుకున్నాను. శ్రీపాద సాహిత్యాన్ని కథలు కథలుగా నాకు చెప్పిందదే. అత్తగారి కథలు చూపించిందీ అదే. మీనా సెక్రటరీ అదే ఇచ్చింది. దానికి గుర్తుందో లేదో కానీ, అమృతం కురిసిన రాత్రిని నా దోసిళ్ళలో పెట్టిందదే. బుక్ ఫెస్టివల్ వస్తోందంటే రూపాయ్ రూపాయ్ దాచుకునే దాని శ్రద్ధ చూసే పుస్తకాలు విలువైనవని నమ్మాను. ప్రతి వ్యాసరచనలోనూ మొదటి బహుమతి తెచ్చుకునే దాన్ని చూసే రాయడంలోని ఉత్సాహాన్ని పట్టుకున్నాను.
కొట్టడం అదే నేర్పింది. actually, కొరకడం కూడా అదే నేర్పింది. వీళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళినందుకు ఛెడీ అంటే ఫెడీ మని కొట్టారు. ఏం పిల్లలే బాబూ, పాడు పిల్లలు అని మా అమ్మను తిట్టేది మా పెద్దమ్మ. "అది నీకు చెల్లెలే, బక్కది; అక్క మాట వినాలని తెలీదూ; పొద్దస్తమానం వెధవ తగాదాలూ మీరూనూ" అంటూ ఇద్దరినీ కలిపి ఒకేసారి దులిప్పారేసేది మా అమ్మ.
పరీక్షలప్పుడు నేను నిద్రకు తూలిపోతే, చప్పుడు చెయ్యకుండా అమ్మనీ, నాన్నగారినీ పిలుచుకొచ్చి చూపించేది. నేను పారబోసిన పాల మరకలు ఎండిపోక మునుపే అమ్మని పిలిచి చూపించి నా వీపు పగిలేలా చేసేది. నేను దాచేసిన పరీక్ష పేపర్లు తెల్లారేసరికి మా అమ్మ ఒళ్ళో ఉండేవి. నా స్నేహాల మీద ఓ కన్ను. నా అల్లర్ల మీదో కన్ను.
అంత తగాదాల్లో నుండి, మా అంత చిన్న ఇంటినీ మాటల్లో చెప్పలేనంత భయపెట్టేంత పెద్దది చేస్తూ, అది మెడిసిన్ చదవడానికి వెళ్ళిపోయింది. నేనేమి చెయ్యాలీ?
పిచ్చిది, నా పేరు మీద ఉత్తరం రాసేది. ఇన్లాండ్ కవర్ అంచులు విడదీసి చదువుతూ చివర్న "ప్రేమతో, అక్క" అని చూడగానే కళ్ళ నుండి జలజలా నీళ్ళు కారిపోయేవి. ఉత్తరాలు రాయడం అలా అలవాటైన విద్యే. Archies గ్రీటింగ్ కార్డ్ సొగసు దాని వల్లే తెలిసింది. వచ్చిన డబ్బులతో పొదుపుగా ఉండడం కూడా మాటల్లో కాదు కానీ, అదే నేర్పింది. చదువుకు తప్ప ఒక్క రూపాయి కూడా అదనంగా అడిగేది కాదు ఇంట్లో.
నా స్నేహితులందరికీ హీరో. అక్క చదువుకునే పద్ధతి చూస్తే అర్జంటుగా పుస్తకాలు తీయాలనిపిస్తుంది అనేవాళ్ళు. అంత చదువుకుంటూ మనకీ ఏమైనా చేసి పెడుతుందే, అక్క ఎంత మంచిదీ, అనేవాళ్ళు. స్టైఫండ్‌లో నుండి నెల నెలా నాకు వంద రూపాయలు ఇచ్చేది. అంత డబ్బు ఏం చేసుకోవాలో నాకు మాత్రం ఏం తెలుసు, నాన్నగారికి నెలాఖరుకి అప్పిచ్చేదాన్ని. హవేలి రెస్టారెంట్‌కి మొదట తీసుకెళ్ళింది కూడా అక్కే.
పెళ్ళి సంబంధం అడిగితే "మాధవిని అడిగి చెప్తాను" అన్న మా నాన్నగారి మాట అప్పట్లో గొప్ప ఆశ్చర్యం. అక్కా బావల పెళ్ళి కుదిరాకా, " You two continue to be good friends and focus on your studies అన్న మా నాన్నగారి ఉత్తరం కాపీ తీసుకుని దాచుకున్నాను. "ప్రైవేట్ లెటర్స్ ఇలా కాపీలు తీయించుకుంటున్నావ్, బుద్ధి లేదూ" అని కేకలేస్తే, ఇంకో నాలుగేళ్ళకి నాకూ ఇదే మాట చెప్పాలి కదా అనేదాన్ని.
దాని చదువూ అంతే. పి.జి ఎంట్రెన్స్ అది కోరుకున్న రేడియోలజీ రాలేదని వచ్చిన సీట్లన్నీ వదిలేసింది. మళ్ళీ రాస్తే ఇవన్నీ అయినా వస్తాయో రావో అని అమ్మ కంగారు పడింది కానీ, నాన్నగారు మాత్రం " అదంత ఇష్టంగా, నమ్మకంగా చదువుతా అంటోంటే వెనక్కి లాగకూడదు; అయినా దాని చదువు, దాని ఇష్టం" అని సర్ది చెప్పారు. కోరుకున్నది సాధించుకుంది. పై చదువుల నిర్ణయం నా చేతుల్లోనే అని అంత ముందే తెలిసిపోవడం ఎంత రిలీఫ్!
రిపీటెడ్ లాసెస్ తో ప్రెగ్నెన్సీ లో చాలా భయపడిపోయాన్నేను. పిలిచి విజయనగరం లో తన ఇంట్లోనే ఉంచుకుంది నన్ను. అన్ని స్కాన్‌లూ అదే చేసేది.
"జెండర్ చెప్తావా?" స్కానింగ్ చేయించుకుంటూ బతిమాలాను.
"దేనికి?"
"జస్ట్ ఊరికే. అమ్మాయైతే లలిత చదువుకుంటాను. అబ్బాయైతే విష్ణుసహస్రం.."
" పొద్దునొకటి సాయంత్రమొకటీ చదువు, ఎవరో ఒకళ్ళు పుడతారు"
"చెబితే నీ సొమ్మేం పోతుంది? నాకు ఎవ్వరైనా అపురూపమే కదా"
"కదా"
"మరి చెప్పు"
"జైల్లో పెడతారు నిన్ను. ఇంటికి పో, డ్రైవర్ బైటే ఉన్నాడు" జెల్ తుడుచుకోమని టిష్యూలు చేతిలో పెట్టింది.
మొండి మొహం....గింజుకుంటూ, లేచాను.
*
మొన్న ఐదారు రోజులు తమిళ్నాడులో అమ్మా నాన్న, అక్కా బావలతో కలిసి ఉన్నా. రవ్వదోశ, పొంగల్ సగం సగం పంచుకుని తిని, 1/2 కాఫీ తాగడం దాకా; అమ్మ కొన్న ఒకే రంగు చీరలు కట్టుకుని, మిడ్ లైఫ్ క్రైసిస్ నిజమా కాదా అని ముచ్చట్లాడుకునేదాకా, ఉండాలబ్బా, ఉండాలి. జీవితానికో అక్క.
*
No comments:
Post a Comment