అఫ్సర్ కవిత్వంలో అమూర్త భావనలు

 అఫ్సర్ సాహితీ అవలోకనంలో వక్తగా పాల్గొనమని తెలుగు భాష, సాహితీ సాంస్కృతిక సేవా సంస్థ "సేవ" సభ్యులు పోయిన వారం నన్ను ఆహ్వానించారు.

అఫ్సర్ సాహిత్యంలోని విభిన్న రచనల గురించి, ప్రత్యేకతల గురించీ నాలుగు రోజుల పాటు సాగిన సభలలో, నాకు కేటాయించిన రచన - "ఇంటి వైపు". ఈ ఇంటి వైపు కవిత్వానికి ముందు, అఫ్సర్ రక్తస్పర్శ, ఇవాళ, వలస, ఊరి చివర అనే మరో నాలుగు కవితా సంపుటులు కూడా ప్రచురించారు. తొలినాళ్ళలోనే, అఫ్సర్ అస్తిత్వవాద కవిగానూ, స్పష్టమైన రాజకీయ దృక్కోణం కలిగిన కవిగానూ కూడా గుర్తించబడటం నాకు తెలుసు. అఫ్సర్ గురించి ఈ రోజు కూడా ఎవరైనా మాట్లాడేటప్పుడు, ఈ కోణాల నుండే ఎక్కువగా పరిశీలించబడటం కూడా నేను గమనిస్తాను. అఫ్సర్ కూడా ఒక రెండేళ్ళ క్రితమే తన ఐదు కవిత్వ సంపుటులను కలిపి బృహత్ సంకలనంగా తెస్తూ, దాని ముందుమాటలో, "కవిత్వాన్ని కేవలం హృదయానికి, ఉద్వేగాలకు సంబంధించిన వ్యాపారం తానెప్పటికీ చూడలేనని చెప్పారు. అయితే, సంఖ్యాపరంగా బహుశా చాలా తక్కువగానే ఉన్నా, అఫ్సర్ పూర్తి వైయక్తిక ఆవరణలో నుండీ చెప్పిన కవితలు కొన్ని, వాటిలోని లోతు వల్ల, వాటిలోని తీవ్రత వల్ల, వాటిలోని సరళత వల్ల నన్ను గొప్పగా ఆకట్టుకున్నాయి. కాబట్టి, ఆ రోజు నేను నా ప్రసంగంలో అఫ్సర్ కవిత్వంలోని ఈ కోణాన్ని గురించి, నావైన కొన్ని గమనింపులు పంచుకున్నాను.
*
ఇంటివైపు నిస్సందేహంగా తన కవిత్వంలో అఫ్సర్ తనకు తానుగా వెతికి పట్టుకున్న కొత్త గొంతుక. స్థూలంగా వస్తుపరంగా చూసినప్పుడు, వలస, ఇంటివైపు ఒకే లాంటివి. దూరాలకు సంబంధించి, అస్తిత్వానికి సంబంధించి, అవే ప్రశ్నలు, అవే వేదనలు, అవే అసహాయతలు. కానీ, వలసలో ఆ అసహాయతలో నుండి పుట్టే కోపమూ, అసమానతల సమాజం పట్ల అసహనమూ, వేదనా కనపడతాయి. సమాజాన్ని ఎంత ధాటీగా ప్రశ్నించాలో, కొలుచుకుని మాట్లాడినట్టు ఉంటాయి అందులో పదాలు. కానీ ఇంటివైపుకి వచ్చేసరికి, వ్యక్తీకరణలో, ఒప్పుకోలులో - సమాజాన్ని ఒక వైపు నుండీ చూడటం దగ్గర నుండి - సమాజంలో తానూ ఒకడినే - అని తెలుసుకునేంత దాకా సాగిన ప్రయాణం ఉంది.
"మిగిలిన అన్ని ప్రయాణాలూ లోకం కోసం
యీ ఒక ప్రయాణమే నాదీ నా లోపలికీ అనిపిస్తుంది"
అని ఇంటి వైపు టైటిల్ కవితలో అంటాడు అఫ్సర్. అది అర్థం చేసుకుంటే, మనకి ఇందులో ఒక కొత్త అఫ్సర్ దొరుకుతాడు. అతడు అస్తిత్వాల నుండి విడివడి అంతర్యానం చేసిన మనిషి. నువ్వూ నేనూ అంటూ మాట్లాడిన మిత్రుడు. అందుకని ఈ పుస్తకం ఒక ఆంతరంగిక సంభాషణ. లోపలి ఆరాటాలను, దిగుళ్ళను, ప్రశ్నలను ఒంచి రాసుకున్న ఆత్మీయలేఖా పరంపర.
**
అఫ్సర్ ఏ కవిత్వ సంపుటిని ముట్టుకున్నా, ఇంకా చదవకుండానే గమనింపులోకి వచ్చేది ఆ పాదాల నిడివి. అందులోని క్లుప్తత. అఫ్సర్ కవిత్వపు బలమూ, ప్రత్యేకతా దాదాపుగా చిన్న చిన్న పాదాల విరుపుల్లోనే ఉంటుంది. తిలక్, అజంతా, బైరాగి ..ఇలా వచన కవిత్వంలో అద్భుతాలు చేసినవాళ్ళంతా నమ్ముకున్న ఆ సుదీర్ఘమైన పాదాల పట్ల, సమాసాల పట్ల అఫ్సర్‌కి మోహం ఉన్నట్టు తోచదు.( ఆ ఉన్న కొన్ని దీర్ఘ కవితల మీదా మరో ప్రత్యేకమైన చర్చ జరిగింది) శ్రీశ్రీ తనను ప్రభావితం చేసిన కవుల్లో ఒకరని ఒక పుస్తకానికి ముందుమాటలో రాస్తారు కానీ, శ్రీశ్రీ కవిత్వం కూడా ఒక అవిచ్ఛిన్నమైన ధారగానే ఉంటుంది. అఫ్సర్ కవిత్వంలో మాత్రం ఒక తుంపు ఉంటుంది. ఉదాహరణకి, తిలక్ ఒక పాట గురించి రాయాలంటే,
"పరువానికి వస్తున్న నా వయసులో చటుక్కున పరిమళపు తూఫానులని రేపి, మహారణ్యాల సౌందర్యాన్ని చూపి, సముద్ర కెరటాల జలంతో మధ్యగా మౌనంగా ఉన్న ద్వీపాల్ని ఊపి, ప్రపంచం యొక్క అవధులను దూరంగా చాచి నన్ను దిగంతాలకు విసిరేసే వేళ..." అని రాసుకుంటాడు. ఆ ఆవేశంలోకి, ఉద్ధృతిలోకి ఎంత వడిగా తీసుకుపోవాలో తెలిసినట్టు, ఈ అసమాపక క్రియలను ఒక దాని మీద ఒకటి వేసి అవి చదవించడంతోనే పాఠకుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తాడు.
నాస్టాల్జియా చుట్టుముడితే ఎవరైనా అలాగే అవుతారేమో. పాత పాటలు వింటుంటే, ఉన్నట్టుండి ఇప్పటి ఈ క్షణంలో నుండి తప్పిపోయి, ఎప్పుడో ఏ నిర్జన వీధుల్లోనో, ఇంట్లో రాత్రి వేళల రేడియోలోనో, ఎవరో బాగా ఇష్టమైన వాళ్ళతోనో, హేమంతపు ఉదయాల చలిలోనో ఆ పాటను తొలిసారి విన్న సందర్భంలోకి వెళ్ళిపోతాం. ఆ పాట విన్నప్పటి ఋతువు, అప్పడు చుట్టూ ఉన్న పరిమళాలతో సహా మళ్ళీ మన అనుభవంలోకి వచ్చేలా కొన్ని పాటలలా మనుషుల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. ఒక ముకేశ్ పాటనో రఫీ పాటనో సైగల్ పాటనో వింటూ గదిలో ఏకాంతంగా ఆ దిగులు వలయాల్లో కొట్టుకుపోయేవాళ్ళూ ఎంతమందో ఉంటారు. బహుశా మీలోనూ ఉండే ఉంటారు.
"కిటికీ తెరల కుచ్చుల్ని పట్టుకుని
జీరాడుతుంది
దిగులుగా నీ పాట" అని తన తొలినాళ్ళ "ఇవాళ"లోనే ఎంతో క్లుప్తతతో భారమైన భావాన్ని అక్షరాల్లోకి ఎక్కించాడు అఫ్సర్.
ఇంటి వైపులో కూడా ఇప్పుడు నేను చెప్పిన భావాలన్నీ ఒదిగి వచ్చేలా, చిత్ర పాట గురించి రాస్తూ,
"యెలా తుడిచేస్తావో దాటిన కాలాల్ని
నన్ను ఎటూ కదలనివ్వని గాయాల్ని..." అంటాడు.
"నువ్వొచ్చి వెళ్ళు
ఒక్కటై ఒక్క పూవై, నేను
ఈ సాయంత్రాన్ని దాటేసేలా.."
అని సుధా రఘునాథన్ గాత్రాన్నీ తల్చుకుంటాడు. ఇలా, ఈ చిన్న పదాలతో, కవితలో ఒక మూడ్ ని స్థిరపరిచే పద్ధతి, నాకెప్పుడూ ఆశ్చర్యంగానే ఉంటుంది.
*
శైలి విషయానికి వస్తే, అఫ్సర్, ఇప్పుడు మనం చర్చించుకుంటున్న ఈ మానసిక అవస్తలకు సంబంధించిన కవితల్లో, అంటే అమూర్తభావనల చుట్టూ నడిచే కవిత్వంలో చాలా సరళమైన పదాలనే ఎంచుకున్నాడు. పోలికల చుట్టూ తిరిగే కవిత్వ ప్రపంచంలో, అతడు సాదా పదాలను నమ్ముకున్నవాడిగా కనపడతాడు. చెప్పకూడదు, చూపించాలి అనేది ఒక కవిత్వ నినాదం. సుందరకాండలో హనుమ సీతమ్మవారిని చూసిన సందర్భంలో మహర్షి ఇరవైకి పైగా పోలికలతో వర్ణిస్తారు సీతమ్మని.
శుక్లపక్షపు మొదటిరోజు నెలవంకలా, పద్మాలు లేని కొలనులా, వేటకుక్కలు ముట్టడించిన లేడిలా...
గుర్తు రాని జ్ఞాపకంలా
నశించిన వివేకంలా
సడలిన నమ్మకంలా
కలతబారిన వివేకంలా
అభూతమైన అపవాదుతో దెబ్బతిన్న కీర్తిలా
అభ్యాసలోపం వల్ల శిధిలమవుతున్న చదువులా
ఇలా ఇన్నేసి పోలికలతో పాఠకుడి మనసులో సీత స్థితి ముద్రించుకుపోయేలా రాస్తారు మహర్షి. మూర్త, అమూర్త ప్రతీకల ద్వారా కవిత్వంలోకి సౌందర్యాన్ని, బలాన్ని ఒంపడం అనాదిగా వస్తున్న పద్ధతి.
ఆధునిక కాలంలో, ఈ పోలికల మీద విమర్శలు లేవా అంటే ఉన్నాయి, నామిని విమర్శలు అని నిన్నే ఒక స్నేహితురాలు నాతో చెప్పిన మాట.. రావిశాస్త్రి రచనల్లో ఏ పాత్రా దానిలా ప్రవర్తించదు అని. అంటే, ఆ గుడిసెలో కిరసనాయిలు దీపం - ఆరు పరీక్షలూ ఫెయిల్ అయిన పదో తరగతి పిల్లాడిలా బిక్కు బిక్కుమంటూ ఉంది- ఇలా.
ఆ మాటలని అలా ఉంచితే, ఉపమ లేకుండా కవిత్వం చెబితే అది ఉత్త వచనమేగా! అని అనిపించే ప్రమాదమూ ఉంది. కానీ, ప్రమాదాలకు ఎదురు వెళ్ళడం మంచి కవుల లక్షణాల్లో ఒకటి, అఫ్సర్ ఎప్పుడూ మాటను సూటిగా, సరళంగా ఉంచే ప్రయత్నమే చేశాడు. మరి బలం ఎక్కడ నుండి వస్తుందీ అంటే, అది కవి అనుభవంలో నుండీ రావాలి. రెండు, కవి గొంతుకలోని నిజాయితీ నుండి రావాలి. ఇవి రెండూ కలిసి అక్షరమై వెలువడినప్పుడు, ఆ కవిత రాణించకుండా ఉండదు.
అప్పుడు పాఠకుడి దృష్టి అది అబ్స్ట్రాక్ట్ ఇమేజరీతో ఉందా, కాంక్రీట్ ఇమేజరీ తో ఉందా, సాదా పదాలుగా ఉందా, సంక్లిష్టంగా ఉందా అనే దాని మీదకి పోదు. కాండిన్స్కీ అనే ఆర్టిస్ట్, పేరు వినే ఉంటారు, ఆయన, " స్పిరిచువల్ ఇన్ ఆర్ట్" అనే తన పుస్తకంలో కళను ఒక ఇన్నర్ నెసెసిటీగా చెప్పుకుంటాడు. రిల్కే కూడా ఆ యువకవికి ఉత్తరాలు రాస్తూ, "నువ్వు రాయకుండా కూడా ఉండగలిగితే, రాయకుండానే ఉండు" అని సలహా ఇస్తాడు. ఎప్పుడైతే రాత ఇలా మన లోపల నిర్భధించుకోలేని ఉద్వేగంతో కాగితం మీదకి వస్తుందో, అప్పుడు రూపం మీద మాస్టరీ అయినా, శైలి మీద మాస్టరీ అయినా కవికి క్షణాల మీద పట్టుబడతాయి. అఫ్సర్ కూడా "కవిత్వం ఎదుట నా భాష" అన్న కవితలో "ఎంతకీ పాలు అందని శిశువు ఆక్రోశమై వినపడుతుంది నా బాష" అని రాస్తాడు. శిశువు ఆక్రోశం ఎవరికి అర్థం కాదు! అందులో మనం చూసేదల్లా ఒక్క ఉద్వేగం. అంతే.
"
నా పసి భాష ఒక ఉద్వేగమై ప్రవహిస్తే
ఈ ఒక్కసారికీ మన్నించు
ఇంకా నాకు రానే రాని
ఈ లోకపు భాష నేర్చుకోవాలి నేను
కానీ నా బాధల్లా ఒక్కటే.
ఆ తరువాతి తయారీ భాషలో నువ్వు వినిపిస్తావా?
పోనీ నాకు నేను వినిపిస్తానా?"
తయారీ భాషలో ఏ కవీ ఎవ్వరికీ వినపడతాడని నేనైతే అనుకోను. కవికి ఈ సంగతి తెలుసు.
**
అఫ్సర్ కవిత్వంలో నాకు బాగా నచ్చే మరొక విషయం - ఈ కవితల్లో, చాలా విస్తృతంగా అఫ్సర్ వాడిన టెక్నిక్ . నాస్టాల్జియా విరహం దిగులు ఈ భావాలు లోపల ఎంత స్పష్టంగా, బలంగా సుళ్ళు తిరిగినా, వాటిని పేపర్ మీద పెట్టడం కష్టం. వాటికి స్పష్టంగా మొదలూ తుదీ అంటూ ఉండవు, ట్రిగ్గర్ లా ఒక మాటో, పాటో, ఒక సంఘటనో కనపడుతున్నా, అది కలుగజేసిన అలజడి తాలూకు వైశాల్యం పట్టుకోవడం అసాధ్యం.
అఫ్సర్ చాలా చిత్రంగా ఈ ఫీట్ సాధిస్తారు. ఇట్లాంటి కవితలను దాదాపుగా అన్నింటినీ ఖండికలుగా రాస్తారు. వాటిలోని స్టాంజాలకు నంబర్లు వేస్తారు. ఈ ట్రిగ్గర్ పాయింట్ - అని దేన్నైతే అంటున్నామో- ఆ మాటో పాటో ఇంకేదైనానో - దానిని కవితకి టైటిల్ చేస్తాడు. కవితను ఇలా నంబర్లతో ముక్కలు చెయ్యడం వల్ల, మన మనసులో ఉండే దాటు ఏదైతే ఉందో, అది పాఠకుడికీ తెలుస్తుంది. పాఠకుడు ఒక లీప్ తీసుకోవాలక్కడ. అంటే, కవి కేవలం ఒక ఆవరణ సృష్టిస్తున్నాడు. అక్కడీకి పాఠకుడిని పిలుస్తున్నాడు, ఒక ఆధారాన్ని ఇచ్చి. అటు గానీ వెళ్ళగలిగామా, అది ఒక ఇంటిమేట్ ట్రిప్. ఎన్నో సంగతులు, ఎన్నో రహస్యాలు, ఎన్నో దిగుళ్ళు..కవిత పూర్తైనా హుక్‌లా వెంట పడి వచ్చే ఒక అనిర్వచనీయమైన భావం.
పాఠకులకు సరే, కవిత్వాన్ని రాసే మనిషిగా కూడా, ఈ టెక్నిక్ మీద నాకు చాలా మోజు. సినిమాల్లో స్క్రీన్‌ప్లే రాసినట్టు, కథల్లో స్టార్ గుర్తు పెట్టి సన్నివేశాలను మార్చినట్టు, కవిత్వంలో కథలను చొప్పించాడు అఫ్సర్. తన తరం వాళ్ళనైనా, తన తరువాతి తరం వాళ్ళనైనా, కొత్త ప్రయోగాలు చేస్తూ, కవిత్వ రచనకు సంబంధించి ఒక కొత్త ఉత్సాహానివ్వడం కన్నా, కవులు కోరుకునేది మరొకటి ఉంటుందనుకోను. తెలీకుండానే ఇన్‌ఫ్లూయెన్స్ చేసే కవి అఫ్సర్ అని మిత్రులు కొంతమంది అనడమూ వింటాను నేను. అలాగే కవితలకు శీర్షికలు పెట్టడం లో కూడా, అఫ్సర్ ది ఒక మిడాస్ టచ్. "నిన్ను దాచిన సాయంకాలపు ఎండ" , "తెంపుకొచ్చిన నీలిమలు కొన్ని", "పగటికి రాత్రి రాసుకున్న లేఖలు కొన్ని" , "ఇది ఆట సమయం", "రెండేసి పూలు చందమామా", "పద్యం వెలిగిన రాత్రి" "వాన చుక్క ధ్యానం" - వీటిలో ప్రతి ఒక్కటీ ఎంత కవితాత్మకం! వీటిని టైటిల్స్‌గా ఇచ్చి కవిత రాయమంటే, అదాటున నాలుగు లైన్లైనా రాయించేసేంత అందమైన పేర్లు.
**
ఇంటివైపు కవిత్వంలోని వస్తువు గురించి ఎంత చెప్పినా తరగదు. కానీ రెండే రెండు కవితలు చెప్పి ముగిస్తాను. అఫ్సర్ ఈ పుస్తకాన్ని సూఫీ కవుల మీద విస్తారంగా కృషి చేసిన తరువాత రాశాడు.
ఇందులో ఫనా అన్న కవిత - ఈ పుస్తకానికి ప్రాణం లాంటిది.
"ఎన్ని దూరాలు కలిపితే
ఒక అస్థిర బైరాగునవుతానో
ఎన్ని తీరాలు గాయాలై సలిపితే
ఒక నిర్లక్ష్య సూఫీనవుతానో!
ఇదీ ఒక ఆటే కదా నీ చుట్టూ
నేను బొంగరమై తిరగడానికి"
ఎన్నో తలుపులు కొట్టుకుంటూ, తెరుచుకుంటూ, మూసుకుంటూ ఎంతో జీవితం సాగిపోయాక కానీ, ఇదీ కాదు, ఇదీ కాదు, ఇదీ కాదు అని కొట్టేసుకుంటూ ముందుకు వెళ్ళే ఆట అలవడ్డాక కానీ, బైరాగి తత్వం వంటబట్టడు. అన్ని తీరాల్లో అన్ని గాయాలూ ఓర్చుకున్నాకే సూఫీ ఎదురుపడతాడు. చివరికి ఇదంతా ఆటే అని తెలిసినప్పుడు, విషాదం కొంత కొంతగా పక్కకు తప్పుకుంటుంది. మనిషిలో ఒక ఒప్పుకోలు మొదలవుతుంది.
"కాస్త లోపలికి వెళదామా" కవితలో,
"ఆరుబయలు నువ్వు దాచేసిన ప్రతిబింబం" అంటాడు. "విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం..." అన్న దక్షిణామూర్తి స్తోత్రం నుండీ, "ద ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ఇన్‌సైడ్ యూ.." అన్న రూమి దాకా, మాటల మూలాలకు వెళితే దొరికేదొక్కటే.
అందుకే ఇంటివైపు కవిత్వం అఫ్సర్ మిగతా కవిత్వం కన్నా చాలా ప్రత్యేకం. ఇక్కడ ఇల్లు ఒక ప్రతీక. నీ లోపలి నీదైన గూడు కి. దానిలోకి నువ్వు తొంగి చూడాల్సిన అవసరాన్ని గుర్తు చెయ్యడమే ఈ కవిత్వం చేసే పని. ఆ బాల్య కాలాల్లోకి,ఆ రేగుపళ్ళ వాసనల్లోకి...తీసుకెళ్ళడమే ఈ కవిత్వం చేసిన పని.
*
"నువొచ్చి వెళ్ళు
ఒక్క పూవై
ఈ సాయంత్రాన్ని దాటేసేందుకు" అని సుధ పాటను గురించి ఈ కవి రాసినట్టే, ఈ ఇంటివైపు కవిత్వాన్ని, ఆ సాయంకాలం అఫ్సర్ అక్షర సాహచర్యంలో గడిపేందుకు తోడు తెచ్చుకున్నాను.
*

No comments:

Post a Comment

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...