పడి మునకలు - మెహెర్

 పుస్తకాలలో లోకం మరచిపోయేలా చేసేవి కొన్నుంటాయి, ఈ లోకంలోనే పట్టి తిప్పుతూ ఆలోచింపజేసేవి కొన్నుంటాయి. కానీ, నీలో చదివే లక్షణం ఉంటే నిన్ను అమాంతం మళ్ళీ పుస్తకాల వైపు లాగి వాటిని ప్రేమించేట్టుగానూ; నువ్వు రాతగాడివైతే నీ చేత అప్పటికప్పుడు కాగితాలు పట్టించి రాయాలనిపించే పిచ్చిలో తోసేట్టుగానూ ఉండే రచనలు అరుదు. ఒక అద్భుతమైన చదువరీ, అంతే అద్భుతమైన రాతగాడూ ఒకే మనిషిలో సగపాళ్ళలో ఒదిగిపోయి ఉంటే, బహుశా అదే మెహెర్. అతను చదువు గురించి రాస్తూ అప్పటికప్పుడు నీ చేత పుస్తకం పట్టించగలడు, నచ్చిన రాతల్లోని మెరుపులు అరచేతిలో పట్టి తెచ్చి నీ కళ్ళ ముందు ఊపి నువ్వు నిభాయించుకోలేనంత వేగంతో నిన్ను మళ్ళీ రాతలోకీ తోయగలడు. రాయడం ఇంత పేషనేట్ వ్యవహారమని బహుశా నీకూ తెలుసు. ఎప్పుడో ఆ అనుభవం నీకు దక్కి ఉండకపోతే ఈ కాగితాల ప్రపంచంలో నువ్వెలాగూ ఉండవ్. కానీ బహుశా వేళ్ళ మీద లెక్కపెట్టగలిగిన ఏ కొన్ని సార్లో నువ్వు పొందిన అనుభవాన్ని, అంతే గాఢతతో పేజీ వెనుక పేజీ నింపుకుంటూ పోయిన ఈ పిల్లాడి పనితనం చూస్తూ పోతుంటే, ఆ ఆశ్చర్యంలో నుండి, కేవలం మంచి పుస్తకాలే తెచ్చివ్వగల ఆ ఆనందంలో నుండి, మెల్లగా నీకు మళ్ళీ ఇతని చేత ఇంత రాయించిన రచయితల మీదకు దృష్టి పోతుంది. అప్పుడు నీకు మళ్ళీ చలం దొరుకుతాడు. "అసంబద్ధమైన కాల్పనిక ప్రపంచాల్లో కూడా ఏదో నిగూఢమైన అంతిమ సత్యాన్ని స్ఫురింపజేస్తూ, దాన్ని ఎప్పటికీ మనకి అందీఅందని దూరంలోనే ఉంచగల" ఓ కాఫ్కా దొరుకుతాడు. స్వర్గం లాంటి ఓ లైబ్రరీ, పుస్తకాలను చదూకునే పద్ధతీ, పుస్తకాలను పైకి చదవడంలో ఆనందం, పుస్తకాలతో నువ్వు ప్రేమలో పడ్డ ఆ ప్రాచీన కాలాలు, ఆ కాలపు మైకాలు, వచనాలు కవిత్వాలు వాటి లెక్కలు, వాటి అసలు రహస్యాలు... చదువు అన్న ప్రక్రియను ఒక మనిషి ఇంత అందంగా, ఇంత ఒడుపుగా, ఇంత ఆవేశంగా ఇష్టంగా హత్తుకోవడాన్ని తెలుసుకోవడమే ఒక ఉద్వేగపూరితమైన ప్రయాణం. ఈ చిట్టి పడవలో ఎక్కించుకుని ఇన్నేసి కబుర్లు చెబుతూ ఏ కాఫ్కా ద్వీపంలోనో అతడు నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతాడా - అక్కడిక నీకెన్ని సాయంత్రాలో, ఎన్ని పగళ్ళో, కాలాలెలా గడిచిపోతాయో లెక్కే ఉండదు. ధైర్యం చేసి దూకాక హేలగా పడిమునకలేస్తుంటే - పట్టి లాగే వాళ్ళూ ఎవరూ ఉండరిక.

దీనిని రాత్రిళ్ళు రోజూ నాలుగు పేజీలు చదువుకునే పుస్తకంగా మలచిన మెహర్ కు, ఈ ఏడాదిగా నేను పొందిన సంతోషానికి బదులుగా...ఈ నాలుగు మాటలు ❤️

No comments:

Post a Comment

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...