అపరాహ్ణ వేళ, అలసిన మనసులకు ఊరట లాగా, ఎవరైనా ఒక టీ కప్పు చేతికి అందిస్తే, ఆ భోగమే వేరు కదా! ఈ పూట అలాగే ముసురుకున్న మేఘాలను చూస్తూ, చేతిలో ఈ "ఆవిరిపూల కొమ్మ"ను పట్టుకుని నింపాదితనాన్ని గుటకలుగా గొంతులోకి ఒంపుకుని మళ్ళీ పనిలో పడితే, ఈరోజు టీ డే అని వచ్చిపడిందో సమాచారం.
ఒకాకురొ కకుజో "ద బుక్ ఆఫ్ టీ" ని తేనీటి పుస్తకంగా అనువదించారు చినవీరభద్రుడు. అందులో చదవగానే పెదాల మీదకు నవ్వు తెప్పించే మాటొకటుంది -
ఒక కప్పు తేనీటిని ఆయన అపురూపంగా ఆవిరిపూల కొమ్మ అని పిలుచుకున్నారు. ఆ వెచ్చని దయాప్రాసారంలో అందరూ ఓలలాలాడాలనుకున్నారు.
నేనేమో పోయి పోయి నిర్దయాసముద్రంలో పడ్డానోసారి. ఎప్పుడో లెండి!
కరోనా అప్పుడే తగ్గుతున్న రోజులు, పెద్దవాళ్ళకి భయం పూర్తిగా విడవని రోజులు. అనిల్ వాళ్ళ బంధువుల ఇంట్లో ఏదో ఫంక్షన్ కి అందరం కలవాల్సి వచ్చింది. కరోనా భయం వదల్లేదని చెప్పా కదా - అందుకనీ, అందరం ఒకేచోట ఎందుకని మాకోసం ప్రత్యేకంగా వాళ్ళ స్నేహితుల ఇంట్లో బస ఏర్పాటు చేశారు. మా కోసం అంటే, మేమూ, మా మరిది కుటుంబం. ఆ స్నేహితులు ఎంతో ఆదరంగా ఆహ్వానించారు, మర్యాదలు చేశారు, ఆ రాత్రి బ్రహ్మాండమైన భోజనం పెట్టి ఫెళఫెళలాడే దుప్పట్లు పరిచిన మంచాలిచ్చారు.
సరే మర్నాడు పొద్దున్నే నేను స్నానం చేసి హాల్‌లోకి రాగానే ఆవిడ ఒక కప్పుతో నా ముందుకొచ్చారు. ఆవిడ అనడం టీ అనే అన్నారు కానీ..అదొక బీభత్సం. కాఫీ టీ అలవాటు లేవు కనుక అనిల్, మా మరిది తప్పించేసుకున్నారు. మా తోడికోడలు రాలేదు. నేనొక్కదాన్నే బలి. కక్కలేను-మింగలేను అన్నది అక్షరాలా అనుభవంలోకొచ్చిన సంగతి.
"ఇందులో ఏమేం వేశానో గెస్ చెయ్యిరా..." గడ్డం కింద చెయ్యి పెట్టుకు నా ఎదురూగ్గా కూర్చుని అడిగిందావిడ నన్ను.
తల అడ్డంగా ఊపాను.
యాలకులు తెలిసాయా?
ఊ..
అల్లం?
ఊ..
లవంగం?
నాకు దుఃఖం మొదలైంది.
ఎంత మంది అడుగుతారనుకున్నావ్, ఆంటీ ఇందులో ఏవేం వేస్తారో చెప్పండీ అని..ఇదిగో చూడు, ఈ పుదీనా వేస్తే...
నేను నిటారుగా కూర్చున్నాను.
ఎన్నో కాదు..ఓ నాలుగు రెమ్మలు వేసి మరిగిస్తే..
టీలో పుదీనా!!
అందరూ అడుగుతార్రా, ఆంటీ ఈ టేస్ట్ ఎలా వస్తుందసలు అని..నేను ఎవరికీ చెప్పననుకో. అసలు మా ఇంట్లో ఎవరికీ కోవిడ్ రానిది కూడా ఇందుకేరా.
(నేను అడగలేదుగా ఎలా ఈ టేస్ట్ అని )
ఇలా రా..జబ్బ పట్టి కిచెన్ లోకి లాక్కుపోయారు.
చిక్కం పట్టి చూపించారు.
మీరెలాగూ నమ్మరు కానీ, నేను నిజ్జంగా చెప్తున్నాను, నేను బిర్యానిలో కూడా అన్ని విచిత్రాలు కలపను.
ఆవిడ ఎదురూగ్గా కూర్చుని ఆ టీ రహస్యాలు నాకు చెప్తూనే ఉన్నారు - నాకు దేవుడు కనపడుతున్నాడు . ఆవిడ ఒక్కో దినుసు విడమరిచి చెప్పే కొద్దీ, పరగడుపున ఇవన్నీ తాగాను - నాకేమవుతుందో అన్న భయం నాలో అంతెత్తుకు పెరిగిపోయింది.
( తొ-టుంగ్ ఒక చీనా కవిట. ఆయన "ఆ తేనీటి మొదటి పాత్ర నా పెదాల్నీ గొంతునీ తడుపుతుంది. రెండవ పాత్రతో నా ఒంటరితనం తొలగిపోతుంది. మూడవపాత్ర నా శుష్కజీర్ణకోశంలో ప్రవేశించి ఐదువేల పూర్వ పద్యాల కోసం వెదుక్కుంటుంది...." అని రాసుకున్నాడు.
నాకు మొదటి గుటకకే తలుపులు తెరవని తిరుపతి గుళ్ళో ఉన్నట్టుంది. జన్మాంతరాల్లో చేసి మర్చిపోయిన పాపాలన్నీ ఎవరో నా ముందు కూర్చుని ఏకరువు పెడుతున్నట్టు ఉంది.)
సరే, పుణ్యం పుచ్చి అప్పుడే మా మరిది వచ్చాడు.
"నీకూ టీ తెస్తాను." ఆవిడ లేవబోయారు.
"ఏంటేదో స్పెషల్ గా ఉన్నట్టుందీ.." మా మరిది నా ఏడుపు మొహంలోకి చూస్తూ అడిగాడు.
ఆవిడ గండికోట రహస్యం చెప్పేంతలో మా మరిదే
అందుకుని, "ఆంటీ, పిల్లలకి పాలు కలపాలిట, చూపిస్తారా" అంటూ లేచాడు.
ఆవిడ "హార్లిక్స్ కావాలా, బూస్ట్ ఆ..." అని అడుగుతూ వంటింటి లోపలికెళ్ళగానే,
"ఆ బాల్కనీలో ఓ వాష్బేసిన్ ఉంది, అటెళ్ళు.." నాకు గుసగుసగా చెప్పి వంటింట్లో కెళ్ళాడు.
మా మరిదికి మార్కులు పడిన అరుదైన సందర్భాల్లో ఒకటిది
*
ఆవిడని అప్పట్లో ఎన్నో మాటలనుకున్నాను కానీ, ఈ తేనీటి పుస్తకం చదివాక తెలిసిందేమంటే, అప్పట్లో టీలో నారింజ తొక్కలు, ఆఖరకు ఉల్లిపాయలు కూడా వేసేవారుట. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతాయంటారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆదర్శ తేనీరు బండి బొక్క బోర్లా పడి జపాన్ కళలు తెచ్చుకోకూడదని ఏముంది?
సరే, పుస్తకంలో తేనీటివాదపు మర్యాద ప్రకారం నువ్వు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలని చెప్తారు. ఒక్క పొల్లు కూడా ఎక్కువ పలకకూడదట. బిర్యాని టీ తాగిన పాపం కొద్దీ, నేను కాస్త ఎక్కువే మాట్లాడి ఉంటాను. ఈసారికింతే.
*
తేనీటి మర్యాద కోసం కాదు కానీ, ఈ పుస్తకంలో కనపడే నాలుగైదు లైన్ల జెన్ కథలు అలసి సొలసిన వేళల్లో అమాంతం శక్తినిచ్చే టీ చుక్కలంత మధురంగా, హాయిగా, రిఫ్రెషింగ్‌గా ఉన్నాయి. ఇంకా చదవని వాళ్ళు ఉంటే భద్రుడి గారి బ్లాగ్లో చదవండి.
No comments:
Post a Comment