వేదనామయ జగత్తులో ప్రార్థన - వాడ్రేవు చినవీరభద్రుడి "కోకిల ప్రవేశించిన కాలం"

ఫాల్గుణ మాసం నడుస్తోంది. ఉదయపు గాలుల్లో చలిపొడ పూర్తిగా తప్పుకుని, వేడి తెలుస్తోంది. మార్నింగ్ స్కూళ్ళూ, పరీక్షల కోసం ముందే వచ్చేసే స్కూల్ బస్సులూ, ఆఫీసుల కోసం ఏడింటికల్లా అపార్ట్‌మెంట్‌ల నుండి చీమలబారుల్లా బయటకొచ్చేస్తున్న కార్లూ, రయ్యిరయ్యిన దూసుకుపోయే డెలివరీ అబ్బాయిల బళ్ళూ, అన్నీ కలిసి నగర జీవితపు రద్దీనంతా ఉదయాల్లోకి ఒంపుతున్నాయి. అట్లాంటి ఒక హడావుడి ఘడియలోనే నా బాల్కనీలోని తీవెలకు గుత్తులు గుత్తులుగా పూవులు పూయడాన్ని గమనించాను. ఆ పూవుల పక్కన సర్దుకు కూర్చుని, ఇనాళ్ళూ కనపడని ఓ బుజ్జి పిట్ట. ఆగీ ఆగీ తాకుతోన్న దాని తీయని పిలుపు.
ఆ ఒక్క కూజితంతో కోకిల/ నా నగర జీవితాన్నంతా ఒక మూలకు తుడిచేసింది
అన్న వాడ్రేవు చినవీరభద్రుడి కవితాపాదాల్లోని బలం అనుభవంలోకి వచ్చిన క్షణాలవి. కాసేపు బయట హారన్ల రొద నుండి తప్పించుకుని, నా క్షణాలను ఆ కోకిల కూత చుట్టూ, విప్పారబోతున్న పూలరెక్కల చుట్టూ తిప్పుకున్నాను. అక్కడ నిలబడ్డ ఆ కాసేపట్లోనే "కోకిల ప్రవేశించిన కాలం" కవితా సంపుటిలోని పంక్తులు ఒకటొకటిగా జ్ఞాపకమొస్తూంటే అనిపించింది, కవిత్వం చేసే మంచిపని, జీవితంలోని కొన్ని అపురూపమైన క్షణాలను గుర్తుపట్టగల సున్నితత్వాన్ని పాఠకుడిలో మేల్కొల్పడమని. దైనందిన జీవితాన్నంతా పక్కకు తుడిచి, కాసేపొక రసజగత్తులో తిప్పి తీసుకురాగలగడమని.
మనం నగరాల్లో జీవిస్తున్నాం కానీ,
ఎవరి పల్లెల్ని వాళ్ళు తడుముకుంటూనే ఉన్నాం
కిక్కిరిసి జీవించవలసి వస్తున్నందుకు
ఖేదించడం లేదన్నట్టు నటిస్తూనే
ఆ బాల్యకాల వైశాల్యాల్నే
పునః పునః స్మరిస్తున్నాం
అన్న చినవీరభద్రుడి చురుకైన గమనింపుని, "కోకిల ప్రవేశించిన కాలం" సంపుటిలో చదివినప్పుడు, ఒక్క కోకిలను అడ్డం పెట్టుకుని, ఈ కవి నగర జీవితాన్ని పక్కకు నెట్టుకోవడం గమనించినప్పుడు, నాకు అర్థమైనదిదే. మనం పాతబడిన కవి సమయాలనుకునేవి- అది కోయిలైనా, పూవులైనా- నిజానికి ఎన్నటికీ పాతబడవు. ఎందుకంటే, వాటికి మనలోని బాల్యకాల స్మృతులను సజీవంగా ఉంచడమెలాగో తెలుసు. మనలోని ఆశని, మనలోని వసంతాన్ని.
*
కోకిలకూ వసంతానికీ, వసంతానికీ కవిత్వానికీ ఏదో అవినాభావ సంబంధముంది.
పువ్వెడు వసంతం కోసం కవిత రాసిన శేషేంద్ర, "వసంత ఋతువు వచ్చిందో లేదో ఆ కోకిల కంఠం ఎలా పేలిపోతోందో చూడు.." అంటారు. తొలిపొద్దు తెమ్మెర త్రోవలో పయనమై పరువెత్తు కోయిల గొంతున చిక్కిన వసంతగీతిని కృష్ణశాస్త్రీ గానం చేశారు.
“పూలపూజలు సల్పిన మోహనుడు వసంతుడాతని రాక నీవింత చాటనేల..” అంటూ ఆ బుల్లిపిట్టను నిగ్గదీసిన రాయప్రోలు, దానిని కన్నె పూబోండ్లకు రాయబారాలు గావించే దూతగా భావన చేస్తారు. కోకిల మీద అపురూపమైన పద్యాలెన్నింటినో రాసిన ఈ 'కోకిలస్వామి' కవిగారి ఇంటి ముందు గున్నమామిడి చెట్టు ఉండేదిట. లలితానామ పారాయణం చేసి వరండాలో కూర్చోగానే కొమ్మ మీద కోకిల కుహూకుహూరావాలు చేసి రచనకు ప్రేరేపించేదట. అందుకే, "మామిడికొమ్మ మీద కల మంత్ర పరాయణుడైన కోకిల స్వామికి మొక్కి" ఈ అభినవ స్వరకల్పనకు ఉద్యమించితిన్...అని రాసుకున్నారాయన. ఆ కోకిల వాల్మీకి అనుకోవడంలోనూ దోషం లేదన్నది వేరే సంగతి.
కానీ, భద్రుడి కోకిల మాత్రం వీళ్ళందరి ఊహల కన్నా భిన్నమైనది. ఎందుకంటే, భద్రుడి కోకిల మాత్రమే, వసంత కాలపు వైభోగంతో పాటు, ఆ సౌందర్యానికి ఆగి నిలబడి కైమోడ్చలేని నగర జీవితపు ఇబ్బందిని కూడా పసిగట్టింది. అందుకే అది తన గానంతో ఈ మనిషిని ఒక్క చరుపు చరిచి ఇంకో దిక్కుకి తిప్పే ప్రయత్నం చేసింది.
వసంతకాలసాయంకాలం
నగరం తన పనిలో తానున్నది,
60 లక్షల మంది మనుషులకు
అరవై లక్షల వ్యాపకాలు
సంధ్యాకాంతి బంగారం కురుస్తున్నా
సేకరించుకునే తీరిక లేదెవ్వరికీ
రావి చెట్లు మరకతాలు చిమ్ముతోన్నా
ఏరుకునే వ్యవధి లేదెవరికీ
అదిగో, అట్లాంటి కాలాల్లోనే ఈ వసంతసూచక కోకిలకంఠం వినవచ్చిందని రాస్తారు. ఆ కంఠం ఒక సూచన. తీరిక లేని వ్యాపకాల్లో తలమునకలుగా ఉన్న నగరజీవికి, జీవన మాధుర్యం వైపు తల తిప్పి చూడమనే హెచ్చరిక. బహుశా అందుకు, ఈ కోకిల పిలుపు అడవులకో పల్లెలకో మాత్రమే సొంతమైంది కాదని చెప్పినందుకు, అందరి కంటే ఎక్కువగా ఈ కోకిల కావలసినది, ఈ కోకిల కంఠాన్ని సొంతం చేసుకోవలసింది నగర జీవేనని గుర్తుపట్టినందుకు, ఈ నగర జీవితపు ఏకాకితనాన్ని ముక్కలు చెయ్యగలిగిన శక్తి కోకిల కూజితానికి ఉందని గుర్తు చేసినందుకు, భద్రుడి కోయిల ప్రత్యేకము, అపురూపమూ కూడా. అందుకే ఆ కవిత్వం,
"లోకమొక కోకిల కోసం ఎంత ఎదురు చూసిందో
కోకిల కూడా లోకం కోసమంతగానూ ఆరాటపడింది" అని నమ్మించగలిగింది. కోకిలలానే, "నువ్వు పాడవలసిన పాట నువ్వే పాడాల"ని ఉత్సాహపరిచింది.
*
"కోకిల ప్రవేశించిన కాలం" కవిత్వాన్ని చేతుల్లోకి తీసుకోగానే, క్షణాల మీద పాఠకుడిని పట్టి నిలబెట్టేది ఆ పదాల్లోని సారళ్యం. ఒక్కో పాదం చదువుతుంటే కళ్ళ ముందు పరుచుకునే నిస్తుల భావసౌందర్యం ముగ్ధుల్ని చేస్తూంటుంది. నిరాడంబరత్వం, సూటిదనం కలగలిసిన ఆ పదచిత్రాలు రేకెత్తించే స్ఫురణలు అలౌకికమైన ఆనందాన్ని హృదయంలోకి ఒంపుతాయి.
ఉదాహరణకు, కోకిల కూజితం గురించే చూడండి, కవి ఎన్ని రకాలుగా చెప్తాడో,
"అది నేను దాటి వచ్చిన ఏ అడవుల్లోంచో
దూసుకొచ్చిన శరంలాగా నన్ను గుచ్చుకుంటున్నది
నా చిన్ననాటి స్నేహితుడెవ్వడో మా ఊరి నుంచి
బిగ్గరగా పిలుస్తున్నట్టు నన్ను కుదిపేస్తున్నది."
వేదనామయ జగత్తులో ప్రార్థనలాగా/వినిపిస్తున్నది దాని పలుకు - అని కవి రాశాడంటే, అది ఎట్లాంటి శాంతినీ, ఓదార్పునీ, బలాన్ని ఇస్తుందో ఊహించగలం కదా.
"ఇంటి ముందు ఆటోలో అతిథి వచ్చిన చప్పుడైనట్టు/
నిద్రాలోకపు కొసన ఎవరి సెల్‌ఫోన్‌లోనో
లతా మంగేస్కర్ రింగ్‌టోన్‌గా వినవస్తున్నట్టుందా పిలుపు"
కోకిల ఇట్లా వదులుకోలేని బంధమై ప్రతి వసంతంలోనూ చుట్టుముట్టింది ఈ కవినేనేమో! ఆ ప్రేమా, ఆ ప్రేమలోని బలమైన ఆకర్షణా, పాఠకుడినీ ఏదో ఒక చోట తాకకుండా పోవు. తెలవారుతూండగానే పలకరించే పక్షి కూతలని తలుచుకుంటూ కవి "ఎక్కడో ఓ పక్షి కిలకిలతో ఆకాశం తలుపు తెరుస్తుంది" అంటారు కొండ మీద అతిథి సంపుటిలో. పక్షుల కిలకిలలతోనే ఈ లోకంలో వెలుగులు నిండుతున్నాయనడం అపురూపమైన మాట. ఈ వాక్యాన్ని గురించి, ఇందులోని సౌందర్యాన్ని గురించి ఆలోచించిన కొద్దీ రసజ్ఞ పాఠకులకు కొత్త అర్థాలు స్ఫురిస్తూనే ఉంటాయి.
ఎక్కడి నుండి వస్తుందో కోకిల
సరసులాంటి నీ తెల్లవారుఝాములో
అల్లరిపిల్లవాడిలా ఒక జ్ఞాపకం విసుర్తుంది
ఇక వలయాలు వలయాలుగా మనసు చిట్లిపోతుంది
ఈ కవి మనసు ఇక్కడితో తృప్తి చెందలేదు. దీని తరువాత వచ్చిన నీటి రంగుల చిత్రం సంపుటిలో రాస్తారిలా :
ఆఫీసులో పని మధ్య, చుట్టూ కాగితాలు, ఎదట
పార్కులో ఒకటే మారాం చేస్తున్న కోకిల
--
చిన్నపిల్లలా కోకిల నా చుట్టూ గీపెడుతూ
పిలవగానే పరుగెత్తుకు రమ్మంటున్నది, చిన్నప్పుడు
ఏ పిల్లవాడూ ఆటల కోసం నన్నిట్లా పిలవలేదు, నవ
యవ్వనవేళ ఏ యువతీ నన్నిట్లా అల్లరి పెట్టలేదు
ఎట్లాంటి ఊహ! కోయిలను బాల్యకాల స్నేహితుడిగా, యవ్వనకాలాల్లో కవ్వించే యువతిగా భావన చేయడమా! అలా రాయడానికి కోయిలను కేవలం ఒక కవితా వస్తువుగా చూడగల మనసు సరిపోతుందా! తరిగిపోయిన కాలాల స్మృతిగీతాన్ని ప్రతి వసంతంలోనూ పునః పునః గానం చేసే కోకిలను తన నుండి వేరు చేసుకుని చూడలేని హృదయమైతేనే తప్ప ఇట్లాంటి కవిత్వాన్ని రాయలేదు. రాయలేదు.
*
కోకిలను నెపంగా ముందుంచుకుని, జీవన సౌందర్యాన్నంతా పరచిన ఆ కవితలను పక్కన పెడితే, ఈ పుస్తకంలో మననం చేసుకోదగిన కవితలు ఇంకా ఎన్నో ఉన్నాయి.
తీపిపూల గాలి, పూర్తిగా పూసిన పూవు లాంటి పొద్దుటి ఎండ కుమ్మరించిన పసుపు రంగు, కానుగ చివుళ్ళ నిగనిగలతో శోభిల్లే నగర వైభవం, పండుటాకుల వేప కొమ్మల మధ్య ధూపం వేసినట్టున్న తొలి వెన్నెల, వేకువ చంద్రుడి పచ్చకర్పూర లోకం... ఇలా కవిత కవితలోనూ రసం చిప్పలజేస్తున్నట్టున్న పదబంధాలను ఎవరికి వారే చదువుకోవాలి. ఆ పదాల్లోని నిర్మలత్వంలో తెప్పరిల్లి లేవాలి. దైనందిన జీవితపు హడావుడిలో నుండి, అందులో నుండి ఆవహించే అలసట నుండి, నిరాసక్తత నుండీ కొన్ని క్షణాల పాటైనా మనిషిని పక్కకు నెట్టగల శక్తి ప్రకృతికి తప్పకుండా ఉంటుంది. కానీ కవి అన్నట్టు,
ఒక కోకిల లోకం కోసం గొంతు సవరించాలంటే/ లోకం కూడా కోకిల కోసం చెవులు రిక్కించాలి
అన్న మాటను జ్ఞాపకముంచుకోవాలి. కాళిదాసూ చెప్పాడు, రత్నం నన్నెవరు ధరిస్తారని అన్వేషించదు, ధరించదలచినవారే రత్నం కోసం అన్వేషిస్తారని. కాబట్టి వెదుక్కోవాలి ఆ పిలుపుల కోసం. ఆ పిలుపులు వినపడే త్రోవలు పరిచిన ఇట్లాంటి పుస్తకాల కోసం. చెవులు రిక్కించాలి. ఎవరికి వారే. ఎందుకంటే, మొదలవుతోందిప్పుడే, కోకిల ప్రవేశించే కాలం.
No photo description available.
All reactions:
Somasekhararao Markonda, Padmaja Suraparaju and 161 others

No comments:

Post a Comment

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...