చిన్నప్పుడు ఇళ్ళల్లో గోడ మీద ఉండే కాలెండర్ ఫొటోలతో చాలా మందికి అనుబంధం ఉంటుందనుకుంటాను. బహుశా ఆ ఫొటోలు కాలం గడిచే కొద్దీ ఉత్త ఫొటోలుగా మిగలకుండా ఆ ఇంటి జ్ఞాపకాలను, వాసనలను, ఉత్సాహాన్ని కూడా మెల్లమెల్లగా కలుపుకుంటాయేమో. మా ఇంట్లో కూడా తిథులు చూసుకోవడానికీ యే దేవాలయం వాళ్ళిచ్చినదో ఒకటి పూజా మందిరం దగ్గర ఉండేది. అవన్నీ దేవుడి బొమ్మలవి. ఒకసారెప్పుడో ఎవరో రాణీల్లా అలంకరించుకుని వచ్చిన మోడల్స్‌తో ఉన్న ఒక కాలెండర్ ఇచ్చారు. ఆ బొమ్మలు, ముట్టుకుంటే జారిపోయే ఆ కాగితాలు ఎంత బాగుండేవంటే, ఏడాది దాటిపోయినా మార్చబుద్ధేసేది కాదు. ఉన్న వాటిలోకెల్లా ఇష్టమైన పుస్తకాలను ఎంచి తెచ్చి, వాటికి అట్టలుగా వాడేవాళ్ళం చివరికి.
రాముడూ కృష్ణుడూ
చిన్నప్పుడు స్కూల్ రోజుల్లో ఒక పాకెట్ కాలెండర్ ఫొటో కూడా ఉండేది. బాక్స్‌లోనో బేగ్‌లో పై అరలోనో, ప్రియసఖుల పుట్టినరోజులన్నీ ఎర్ర రంగుతో గుర్తుగా దిద్దుకున్న చిట్టి కాలెండర్. అవి కూడా పారేయడానికి మనసొచ్చేది కాదు. ఒక్కో ఏడు- జీవితం మీద ఉత్సాహం మరీ పొంగి పొర్లి - ఎన్ని రోజుల్నో జ్ఞాపకాలుగా ముద్దర్లేసుకుంటే, ఇక ఆ చిన్న ఫొటో మీద ఏదీ సరిగ్గా కనపడేది కాదు. అయినా సరే.
ఉద్యోగంలో చేరాక కూడా ఒక చిట్టి కృష్ణుడుని కాలెండర్ ఫొటోలో బాగున్నాడని నా వెంటేసుకు తిరిగేదాన్ని. ఓరగా వంగి చూసే ఆ చూపూ, ఆ బుజ్జి బొజ్జ నాకెన్ని సార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించేవి. మహాముద్దుగా ఉన్నాడు ఈ చిట్టి కృష్ణుడు అని నవ్వుకునేదాన్ని. మాటల్లో ఎప్పుడో చెప్పి ఉంటాను పక్కన ఉన్న మిత్రులకి. ఆ కంపెనీ మారిపోయాక, వేరే దేశంలో ఉన్న నన్ను పలకరిస్తూ మెయిల్ రాసి, ఈ చిన్ని కృష్ణుడు కనపడితే నీకు పంపిస్తున్నాను అంటూ పెద్ద పోస్టర్ అటాచ్ చేసి పంపాడు సతీశ్.
భలే సంతోషమైంది. ఆ మెయిల్ అట్లానే భద్రంగా దాచుకున్నాను. పెళ్ళయ్యాక, ఇష్టం కొద్దీ ఫ్రేం కట్టించుకుని, ఈ కన్నయ్యని కళ్ళ ముందే కట్టేసుకున్నాను. ఇంట్లో ఎక్కడా ఫొటోలంటే ఏమంత ఇష్టపడని నాకు, దాదాపు పదేళ్ళకు పైగా ఎటు వెళితే అటు వెంటతిప్పుకోవాలనిపించిన ఒకే ఒక్క ఫొటో ఇది.
ఒకసారెప్పుడో ఇల్లు మారుతుంటే, ఈ గ్లాస్ ఫ్రేంకి చివర్లో సన్నటి పగులు కనపడింది. "ఎట్లా అయిందబ్బా?!" అని ఆశ్చర్యపోయి, పేకింగ్ సందట్లో పడి, మళ్ళీ చూడాలనుకుని వదిలేశాను. కొత్తింట్లోకి వెళ్ళిన మర్నాడు, మధ్యాహ్నం వేళ ఈ ఫొటోని భద్రంగా గుండెలకు హత్తుకుని మోసుకొచ్చి నా చేతుల్లో పెట్టారు మా మావయ్యగారు. "నీకు మహాప్రాణం ఇదంటే, ఫ్రేం మార్పించేస్తే ఇక భయముండదని చేయించుకొచ్చేశా" అంటూ. ఎంత సంతోషపడ్డానో!! అప్పటి నుండీ ఈ ఫొటో అంటే ఇంకాస్త ప్రేమ. ఇంకా చాలా జాగ్రత్త.
ప్రహ్లాద్ పుట్టాక, వాడు తిండికి మహా సతాయించేవాడు. ఉక్కూ ఉంగాలు ప్రయత్నించే వయసులో ఉన్న వాణ్ణి ఒళ్ళో వేసుకుని ఊపుతూ, ఈ కన్నయ్య ఫొటోని చూపించి..."ఇట్టి ముద్దులాడే బాలుడేడవాడే, వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలుపొయ్యరే..." అని పాడుతుంటే ఒళ్ళోంచి దూకి ఆ వేలు వంకా, ఫొటో వంకా మార్చి మార్చి చూసేవాడు. ఎంత కృష్ణుడి కథలు, అల్లర్లు, మాయలు చెప్పినా, చిన్నప్పుడంతా వాడికి రాముడు ఇష్టం. ఎంత ఇష్టమంటే, వాడికి ఎవరి మీదైనా కోపమొస్తే ఏమీ అనేవాడు కాదు, రాముడిలా, ఒక బాణం తీసి వేస్తున్నట్టు ఫోజులిచ్చేవాడు. ఆ బాణాల మీద, రామ కథ మీద వాడికున్న మక్కువ చూసి, అనిల్ కొలీగ్, అమెరికాలో మా పక్కింట్లో ఉన్న భరత్ - అంత పెద్ద బాణాల సంచీ, విల్లూ తెచ్చి వాడికి కానుకిచ్చాడు. కృష్ణుడు ఎందుకు ఇష్టం కాదూ...అని ఎప్పుడో కుతూహలంగా అడిగితే, "దొంగ కాబట్టి..." అన్నాడు గుర్రుగా. పసివాడు అప్పటికి
"నిజమే. గజదొంగ. నీలాగే!" వెక్కిరించేదాన్ని
Subscribe to:
Post Comments (Atom)
రాగసాధిక
ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...
No comments:
Post a Comment