"కణ్ణముందిరో రంగ కణ్ణముందిరో..."

 "కణ్ణముందిరో రంగ కణ్ణముందిరో..." -

కళ్ళముందుండుమా రంగా, కళ్ళ ముందుండు....అని అర్థమట ఆ కీర్తనకు. అటూ ఇటూ పారిపోయి దుడుకు పనులు చెయ్యకుండా కళ్ళ ముందే ఉండరా కన్నా అని నా పిల్లాణ్ణి పిల్చుకోవడం...అమ్మను కనుక నాకు తప్పని పని. కానీ ఈ మాటలు రాయడానికి పురందరదాసు ఎట్లాంటి ఆరాటంతో, ప్రేమతో రంగణ్ణి కొలిచి ఉంటాడో అనుకున్న ప్రతిసారీ, నా మనసు కదలిపోతుంది.
ఓ శనివారం రాత్రి, భోజనాలయ్యాక మావాడు ఎప్పటిలాగే ఏవేవో ఆట సామాగ్రి కొనిపించుకోవాలని వాళ్ళ నాన్నతో బయటకు వెళ్ళాడు. వీధి మలుపులో షాపుకే. పనులన్నీ అయిపోయిన విశ్రాంతిలో హాయిగా పడగ్గదిలోకి వెళ్ళి ఈ కీర్తన వింటున్నాను. పక్కపై అలా వాలానో లేదో..బెల్ మోగింది.
"ఆంటీ, ప్రహ్లాద్ వస్తాడా?"
"రాడు నాన్నా, రాత్రైపోయిందిగా. బయటకు వెళ్ళాడు. మళ్ళీ రేపు ఆడుకుందురు, సరేనా?" ఓపిగ్గా చెప్పి పంపేశాను.
లోపలికొచ్చి పుస్తకం తెరిచానో లేదో, మళ్ళీ బెల్...
"ఆంటీ..."
"వాడు లేడమ్మా...మళ్ళీ రేపు.." తలుపు వేసేశాను.
ఐదు నిమిషాల్లో మళ్ళీ మోగింది.
"ఇదిగో అందరికీ చెప్పండి, వాడు ఇప్పుడే రాడు. వచ్చినా ఇక రాత్రికి ఆడడు. మీరు కూడా ఇళ్ళకు పోయి హాయిగా పడుకోండి.." అక్కడక్కడే తిరుగుతున్న అరడజను మందినీ కూడా పిలిచి గట్టిగా చెప్పానీసారి.
ఒక్కడూ ఊ కొట్టలేదు.
వీళ్ళకి బొత్తిగా భయం పోయిందసలు అనుకుంటూండగానే, మెల్లిగా మ్యావ్...మ్యావ్ అని బయటి నుండి కూత మొదలైంది.
ఎంత దొంగ గాడిదలు వీళ్ళు! ఎన్ని నాటకాలు! ఈసారి నేను తలుపు తీయదల్చుకోలేదు.
నిమిషాలు దొర్లుతున్నాయ్, ఆ పిల్లి కూతలు ఆగట్లేదు. ఏడుపు గొంతుతో ఆ అరుపలా ఆగకుండా వినపడుతుంటే నా మనసుకేం తోచలేదు. విసుగేసింది. పుస్తకం పక్కన పడేసి మళ్ళీ బయటకెళ్ళాను. ఎవరూ కనపడలేదు. కూత ఆగింది.
తలుపు ఓరగా వేసి లోపలికి తిరిగాను. రెణ్ణిమిషాలలో మళ్ళీ కూత మొదలైంది. ఈసారి బయటి నుండి కలగాపులగంగా బోలెడు గొంతులు కూడా.
మావాడి గొంతు కూడా చేరినట్టు అనిపించి బయటకొచ్చాను. ఒక పది మందికి పైగా పిల్లలు జట్టుగా చేరి ఉన్నారు, అందరి ముఖాల్లోనూ ఏదో దిగులు, భయం.
"ఏమైంది?" కంగారొచ్చింది నాకు.
మా ఫ్లాట్‌కీ పక్క ఫ్లాట్‌కీ మధ్య ఉండే ఖాళీ స్థలంలోకి, అక్కడి చీకటిలో ఉండే ఓ కిటికీ వైపుకీ వేలు పెట్టి చూపించారు.
చిన్న పిల్లి పిల్ల. అలా ఎలా వెళ్ళిందో, ఎందుకు వెళ్ళిందో పాపం. ఆ కిటికి అంచులో ఇరుక్కుపోయింది. ఇటువైపు దూకడానికి భయపడుతోంది. అటు వైపు ఇంకేమీ లేదు. అది నిలబడ్డ కిటికి కూడా మూసేసి ఉంది. దాని అంచు మీద ఒంటి కాలితో నిలబడి ఉంది.
ఆ పిల్ల మూకని చూస్తే నిజంగా కోపం వచ్చింది. వీళ్ళే దాని వెంటబడి ఉంటారు. వీళ్ళ నుండి తప్పించుకోవడానికే అది చీకట్లో ఆ కిటికి వైపుకి దూకి ఉంటుంది. దూకాకే అక్కడిక ఏ ఆధారమూ లేదని అర్థమై అట్లా మ్యావ్ మ్యావ్ అని అరుస్తూ ఉన్నట్టుంది.
నాకూ ఏం చెయ్యాలో తోచలేదు. లోపలికి వెళ్ళి ఏదో పల్చటి చెక్క ముక్క ఉంటే, అది మా కారిడార్ గోడకీ ఆ కిటికీ కి మధ్య బ్రిడ్జ్ లా వెయ్యమని ఇచ్చాను.
ఊహూ, అది కదల్లేదు. అపార్ట్మెంట్‌లో పిల్లలు మొత్తం మా ఇంటి ముందు పోగైపోయారు. పిల్లి పిల్ల ఇంకా కీచుగా అరుస్తూనే ఉంది. ఈ గొడవకి పక్కింటి వాళ్ళు తలుపులు తీశారు. అనిల్ వాళ్ళకి సంగతి చెప్తే, కిటికి తీస్తాం, ఇంట్లోకి వచ్చినా పర్లేదు అని లోపలికి వెళ్ళారు. వాళ్ళు కిటికీనలా ముట్టుకున్నారో లేదో, పాపం ఆ పిచ్చి పిల్లి పిల్ల ఏమనుకుందో, ఎంత భయపడిందో, అమాంతం కిందకి దూకేసింది. రెండో ఫ్లోర్ నుండి.
నాకు చెప్పలేనంత భయమూ బాధా వచ్చి ఇంకేం చూళ్లేక లోపలికి పరుగెట్టాను. అనిల్, ప్రహ్లాద్, పిల్లలు అందరూ బిలబిలమంటూ కిందకి వెళ్ళిపోయారు. నాకు లోపలి నుండి వికారం మొదలైనట్టు అయిపోయింది.
పావుగంట దాటిపోయింది, ఎవ్వరూ ఇంటికి రాలేదు. ఉండబట్టలేక బయటకు వెళ్ళి అడిగితే, కింద నుండి ఎవరో చెప్పారు, దానికేం అవ్వలేదనీ, దెబ్బలేం తగల్లేదని. ఊపిరి పీల్చుకున్నాను.
ఆ రాత్రి ప్రహ్లాద్ ఇంటికి వచ్చేసరికి, వాడి ముఖం వెలిగిపోతోంది.
"ఏమవ్వలేదుగా?" మళ్ళీ అడిగాను.
వాడు నా మీదకి ఎగిరి దూకి చెప్పాడు...
"అమ్మా..! దాన్ని వాళ్ళ అమ్మ దగ్గరకు నేనే పంపించాను తెల్సా"
"నువ్వా?"
"నాకు దాని అమ్మ ఎవరో తెలుసు. you know what, అది కూడా వెదుక్కుంటోంది బేబీ కోసం. కానీ ఇది కింద పడిపోయింది కదా..కదా?"
"ఊ?"
"దాని కాలికి దెబ్బ తగిలింది, లేవట్లేదు. నాన్న ఎత్తుకున్నాడు. నేనేం చేశానో తెల్సా...ఆ మమ్మీ కేట్ దగ్గరికి వెళ్ళి, నా వెనుక రమ్మని సైగ చేసి, బేబీ దగ్గరికి తెచ్చాను. "
"దానికి అర్థమైందా? లయర్!!"
"ఊహూ..విను...అలా రాదది. మనం వెళ్ళి, మ్యావ్, మ్యావ్..మ్యావ్ మ్యావ్ అని అరుస్తూ పిలవాలి. ఒక్కో స్టెప్ వేసుకుంటూ వస్తుంది. నేనట్లా వాళ్ళిద్దరి మధ్యా తిరిగీ తిరిగీ... అందుకే లేట్ అయింది తెల్సా"
"చివరికి వచ్చిందా మరి?"
"ఆఁ వచ్చింది, వచ్చాకా ఆ కిటెన్ లేచింది, అప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే దాని నొప్పి తగ్గిపోయింది"
"నీతో చెప్పిందా?" వెక్కిరించాను.
"this is why ammaa..." విసుక్కుని వాళ్ళ నాన్న వైపు జరిగి నిద్రపోయాడు.
*
ఆ సోమవారం,
వాణ్ణి స్కూల్ బస్ నుండి దించి తీసుకురావడానికి నాక్కుదర్లేదు. మీటింగ్ ఉంది. వేరే పిల్ల వాళ్ళ తాతగారికి మెసేజ్ చేశాను.
ఆయన పిల్లాణ్ణి లిఫ్ట్ దగ్గర వదిలి వెళ్ళిపోతానన్నారు. సరేనన్నాను.
మామూలుగా వచ్చే వేళ దాటిపోయింది. వీడు అజాపజా లేడు. హడావుడిగా మీటింగ్ అవగొట్టి బయటకు రాగానే ఎదురొచ్చాడు. వాడి ముఖంలో పట్టలేనంత సంబరం.
మామూలుగా అయితే అంత సంబరం దేనికో "గెస్ చెయ్" అంటాడు. ఆ రోజు నేను చెప్పేదాకా కూడా ఆగలేకపోయాడు.
"అమ్మా...మొన్న ఒక పిల్లికి వాళ్ళ బేబీ ని చూపించానని చెప్పానా, అది ఈ రోజు నన్ను గుర్తుపట్టింది" నన్ను పట్టుకుని ఆపి చెప్పాడు.
"ఎలా గుర్తుపడుతుందిరా?"
"పట్టిందమ్మా, నిజం."
"నీకెలా తెలిసింది?"
"నేను ఇంటికి వస్తున్నానా, అది దారిలో కనపడింది. మామూలుగా ఐతే మనం దగ్గరకెళ్తే అది పరిగెట్టి పారిపోతుందా? ఈ రోజు అలాగే నిలబడింది. నేను వెళ్ళి దాని తోక పట్టుకున్నాను. ఇలా ఇలా అన్నాను. దాన్ని పట్టుకుని పక్కనే కూర్చున్నాను. ఏం అనలేదు. పారిపోలేదు.
నేను ఆశ్చర్యంగా విన్నాను.
"నిజంగా గుర్తుపట్టిందా నిన్ను?"
"మరి? నీకు చెప్పానా, వాళ్ళ బేబీని నేనే చూపించానని? ఇట్ లైక్స్ మి" మ్యావ్ మ్యావ్ అంటూ అటూ ఇటూ చూశాడు.
కళ్ళెగరేశాను.
"మంచి పనే చేశావ్ కానీ, కాళ్ళూ చేతులూ కడుక్కురా పో, రెండు ముద్దలు పెరుగన్నం పెడతా"నని చెప్పి తోలేశాను.
"అమ్మా..." - చొక్కా విప్పుకున్నవాడు మళ్ళీ హడావుడిగా వంటింట్లోకి వచ్చాడు.
నా చేతిలోవి లాక్కుంటూ అడిగాడు - "అమ్మా, ఆ రోజు నువ్వు రిత్విక్‌కి చాక్లెట్ ఇచ్చి యు ఆర్ సచ్ యె నైస్ బాయ్ అని ఎందుకు అన్నావ్?"
ఎప్పుడూ? నాకు చప్పున గుర్తు రాలేదు. వాడే చెప్పాడు,
"లాస్ట్ మంత్...ఆ రోజు కింద ఫ్లాట్ లో అబ్బాయి నన్ను కొట్టబోతే, రిత్విక్ నీ దగ్గరకు వచ్చి చెప్పాడూ, అప్పుడు నువ్వు వచ్చి మా ఫైటింగ్ ఆపావూ?"
గుర్తొచ్చింది.
"అమ్మా...బేబీస్ ని ప్రొటెక్ట్ చేస్తే, సేవ్ చేస్తే, అమ్మలకి ఇష్టం కదా..."
నోటమాట రాకుండా అయిపోయాను. ఎప్పటి విషయం! దేన్నీ దేన్నీ కలిపాడు!
బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాను.
" అవును. అమ్మకి పిల్లలని కాపాడే వాళ్ళంటే ఇష్టం, వాళ్ళకి ఏమైనా హార్మ్ చేస్తే చాలా చాలా కోపం. అందరితో మంచిగా ఉండాలందుకే, లేదనుకో...."
"నాకు తెల్సు" కౌగిట్లో నుండి జారిపోయాడు.
బయట నుండి ఆటలకు పిలుపులు మొదలైపోయాయ్.
నువ్వు తినకుండా వెళ్తే దెబ్బల్ పడతాయ్. బెదిరించాను.
స్పూన్ తెచ్చుకుని చకచకా ముద్దలు నోట్లో పెట్టుకున్నాడు.
ఇప్పుడే కదా వచ్చిందీ, పొద్దస్తమానం బయట తిరక్కురా... పక్కన కూర్చుని బతిమాలాను.
ఇల్లు దాటావంటే ఏదో ఒక దుడుకు పని చేసొస్తావ్, నా దగ్గర ఉండరాదా కాసేపు...
"కణ్ణముందిరో రంగ...కణ్ణముందిరో..." ❤️

No comments:

Post a Comment

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...