కొసరు

 

-----

గాఢనీలిమలోకి తిరిగే ముందు

ఆకాశం పరిచే పసిడి వెలుగు


ఆదరాబాదరా ఉదయాలకు వీడ్కోలుగా

బస్ ఎక్కే పసివాడి తేనెపెదాల ముద్దు 


రెండు ఆఫీస్ కాల్‌ల మధ్య

వెచ్చగా చేతుల్లో ఒదిగే కాఫీ 


రెప్ప పడని పనిలో

కళ్ళపై చల్లగా తగిలే వేళ్ళూ


ఉరుకులుగా సాగే జీవితంలో నుండి

ఇష్టంగా కొసరుకునే క్షణాలకెంత అందం...


ఎన్నో చప్పుళ్ళ మధ్య

అనూహ్యంగా కొంత మౌనం 


ఎంతో మౌనంలో నుండీ

దయగా ఓ పిలుపూ


మూయబోయిన కిటికిలో నుండి

మెల్లగా జారే వెన్నెల 


నిదురపాకే కన్నులపైన 

కలగా పరుచుకునే కవిత్వం


ఉరుకులుగా సాగే జీవితంలో నుండి

కొసరుగా వచ్చిపడే క్షణాలకెంత అందం...


గుప్పెడు మల్లెలతో పాటు

రెండు మరువపు రెబ్బలు


వేల ఆలోచనల నడుమ

హాయిగా తడిమే ఓ ఊహ 


మరువని జ్ఞాపకాల తీవెల్లో

గుచ్చుకునే ఓ పాట


ఈ రోజుకీ రేపటికీ మధ్య

వెచ్చగా ఓ తోడు.


అయాచితమైతే బానే ఉంటుంది కానీ

అడిగితే కూడా దోషం లేదు


వ్యాపారానికి వెనుకాడని ఈ లోకంలో

జీవితాన్ని పుణికి కొసరడగడం తప్పేమీ కాదు.


No comments:

Post a Comment

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...