నెమలీక

 "అరుణాం కరుణాం తరంగితాక్షీం.."

శారద నవరాత్రులు మొదలుకాగానే దహరాకాశంలో ల.లి.త అన్న మంత్రాక్షరాలు నక్షత్రాల్లా మెరుస్తూ కనపడతాయి. తక్కిన లోకమంతా తానంతట తానే పక్కకు తప్పుకున్నాక, శరన్మేఘాల తేలికదనమేదో మనసును ఆవరించుకుని చిత్రమైన హాయిదనంలోకి మేల్కొల్పుతుంది.
వేళ మించకుండా ఉదయాస్తమయాల్లో "శ్రీమాతా శ్రీమహారాజ్ఞి.." అంటూ కుంకుమార్చనలు చేస్తోంటే, సింహాసనేశ్వరి అయిన ఆయమ్మ చామంతిపూల పొత్తిళ్ళలో నుండి చల్లగా నవ్వుతూ దీవిస్తునట్టే ఉంటుంది. అగరు ధూపాలు, ఆవునేతి దీపాలతో, రవ్వంత పచ్చకప్పురపు చిలకరించిన నైవేద్యాల సమర్పింపులతో, ఇల్లిల్లూ దేవాలయాలయ్యే వాతావరణమిది.
మనసుకు నచ్చే మనుష్యులు ఇంటికి వస్తే "మీ రాకతో ఇంటికి పండుగ కళ వచ్చింది" అంటాం. కట్టిన బట్ట కళ్ళకింపుగా కనపడితే "పండుగొచ్చినట్టే ఉంది నిన్నిలా చూస్తోంటే" అని ముద్దుచేస్తాం. ఆదరంగా వడ్డించి, ఆనక తాంబూలమిచ్చే ఆత్మీయ ఆతిధ్యం దొరికిందా.."పండుగ జరుపుకున్నట్టుంది" అని మురుస్తూ చెప్పుకుంటాం. నచ్చింది చేస్తూ, నింపాదిగా గడిపే వీలు దొరికితే, "పండగ చేస్కుంటున్నా" అనడం నిన్నామొన్నల్లో మొదలైన రివాజులా అనిపించే పరమ పాత సంగతి.
ఈ ఏడంటే ఇలా ఒంటెద్దు రామలింగడి పండుగ కానీ, గోదారి జిల్లాల ఇంటికి కోడలిగా వెళ్ళాక పండుగంటే ఎంత కోలాహలమనీ!! నా నిన్నామొన్నల్ని తీరిక క్షణాల మధ్య కూర్చుని తిప్పుకుంటుంటే, నెమలీకల్లా ఎన్నెన్ని జ్ఞాపకాలు!
చీమలు దూరని చిట్టడివి లాగా, కాలుష్యం దూరని పల్లెటూరు మా అత్తగారిది. ఇంటికి పక్కగా గచ్చు చేయించిన విశాలమైన ఖాళీ స్థలం. పండుగకి రెండు రోజుల ముందే రావాలని ప్రేమగా హుకుం జారీ చేస్తే, అనిల్ నేనూ రెక్కలు కట్టుకు బెంగళూరు నుండి బయలుదేరిపోయేవాళ్ళం. అక్కడక్కడే ఉండే అన్నదమ్ముల పిల్లలందరూ ఒకరి రాకను మరొకరు ఖాయం చేసుకుని వెనుకేవెనుకే వాలిపోయేవాళ్ళు. పండగలొస్తున్నాయంటే పది మందీ కూడతారని తెలిసిన వంటవాళ్ళు తమ పనినీ రొక్కాన్నీ ముందే ఖాయం చేసి పెట్టుకునేవారు. పేరుకి బేరమే కానీ బీరకాయపీచు బంధుత్వమేదో ఉండే ఉంటుంది. అవసరం ఇద్దరిదీ కనుక అభిమానం దానంతటదే నిలబడేది.
ఆ వంటావిడ కూడా మాతోపాటే దిగేవారు. బ్రహ్మాండమైన ఫిల్టర్ కాఫీ అందరికీ అందించేసి, ఇహ ఇంటి పక్క ఖాళీ స్థలంలో పొయ్యిలు ఏర్పాటు చేసి పిండివంటల ఏర్పాట్లు మొదలెట్టేవారు. పక్కింటి పిన్నిగారినీ, వెనుకింటి వదినగారినీ వంట త్వరగా ముగించుకుని రమ్మని కేకేసి పిలిచేవారు. కలిపికుట్టినట్టుండే ఆ ఇళ్ళల్లోని ఆడవాళ్ళందరూ అడిగిన వేళకి తప్పకుండా వచ్చేవారు. ఇక ఎవరికేమి ఇష్టమో ఇష్టంగా తలుచుకుంటూ, ఎవరికేమి పడవో జాగ్రత్తగా గుర్తు చేసుకుంటూ వంటలు మొదలెట్టేవారు. కొబ్బరిబూరెలకు దగ్గెవరికొస్తుందో, నువ్వులు పడితే తిననిదెవరో; పాలకోవాలో యాలకులపొడి వేయాలో వద్దో, లడ్డూలో పచ్చకర్పూరం పడాలో అక్కర్లేదో; కారప్పూసలో వామెంతో, చెక్కల్లో వెన్నపూసెంతో వైనవైనాలుగా చెప్పుకుంటూ పనిచేసేవారు. కజ్జికాయాలూ, అరిసెలూ అవుతూండగానే పళ్ళేల్లో మాదాకా వచ్చేసేవి. తెల్లవారుతూండగా మొదలైన పని చీకట్లు ముసురుకుంటున్నా పూర్తయ్యేది కాదు. మిగిలితే పిల్లలు ఊళ్ళు తీసుకుపోతారు, ఇంకో వాయ కలపండంటూ నులకమంచం మీద ఒత్తిగిల్లి పడుకుని కొలతలు సరిచూసే బామ్మగారు మరికాస్త బలవంతపెట్టేవారు వాళ్ళని.
"భుజాలు గుంజేస్తున్నాయబ్బా" అనుకుంటూ ఆ రాత్రికి వంట లఘువుగా కానిచ్చి నిద్దర్లు పోయేవారు ఆ ఆడవాళ్ళంతా. మేమింకా అంత పెద్దవంటలు చేసేదాకా పోలేదు కనుక అక్కడికి ప్రవేశం లేనట్టే.
నవరాత్రులు మొదలయ్యేవి. పొద్దున్నే తలస్నానాలూ, మడులూ, ఓ పక్క టిఫిన్లు, మరోవంక నైవేద్యాలు, పెద్దవాళ్ళ పారాయణాలు, ఏదో కనపడలేదనో, మరొకటేదో కావాలనో చిన్నాపెద్దా అరుపులూ; వెదుకులాటలూ;
చిన్నపనులకు పెద్దవాళ్ళమయ్యీ, పెద్దపనులకు చిన్నవాళ్ళమయ్యీ, ఏ పనీ లేకుండా తీరిగ్గా తిరిగే గుంపులో నేనూ ఒకదాన్ని. తడిజుట్టులు ఆరీఆరకుండా విసిగిస్తోంటే, పిడపలు చుట్టుకుని గడపలను పట్టి వేలాడుతూ తోడికోడళ్ళతోనూ వదినా మరదళ్ళతోనూ ముచ్చట్లు పెట్టుకునేదాన్ని. ముందరి వరండాలో తుడిచిన అరిటాకుల కట్ట ముందుంచుకుని, ఫలహారాల కోసం చిన్నచిన్న భాగాలుగా చాకుతో చీరుతూ ఎవరోఒకరు కనపడేవారు. వాటిని తీసుకెళ్ళి వంటింట్లో అప్పజెపితే, ఆ లేతాకు రంగు ముదురురంగులోకి మారేలా పొగలు కక్కే ఇడ్లీలు వడ్డించి, వాటి మీద నేతి గిన్నె వంచి, ఆదవరుగా ఏం కావాలంటే అది చూపించేవారు. ఈలోపు అమ్మవారికి నివేదన పూర్తయితే ఆ ప్రసాదమూ దోసిట్లో పడేది.
పదిరోజులూ అమ్మవారికి నైవేద్యాలు ముందే అనుకున్నట్టే, మధ్యాహ్నపు వంటకి ఏ కూరలో కూడా ఆలోచించుకు సిద్ధంగా ఉండేవారు. పంచరత్నాల్లాంటి కందబచ్చలీ, పనసపొట్టు, ఆవపెట్టిన అరటి కూరలూ, గుత్తి వంకాయా ఇంతమందికీ చేసేందుకు కావలసినవన్నీ ఊరూవాడా ఏకం చేసైనా సాధించుకొచ్చేవారు. అప్పటికే ఆవకాయను పాతావకాయగా నిర్ధారించి పక్కకు తోసేసి, దోసావకాయ సిద్ధం చేసేవారు. రోటిపచ్చళ్ళతో పాటు, ఈ పదిరోజుల కోసమని ముందుగానే పట్టించిన పొడులూ, అల్లం గోంగూరా టొమాటో పచ్చళ్ళూ, జాడీల్లో ఊరిస్తూ కనపడేవి. ముక్కల పులుసులూ, మజ్జిగ పులుసులూ, నేతిపోపులతో కమ్మగా వండిన బీరా, సొరా కూరలు - దేనితో ఏది వండాలో, ఏ కూరకు ఏ పచ్చడి తోడో, పప్పు, పులుసు, భక్ష్యమూ లేహ్యమూ ఏది దేనితో కలిసి విస్తట్లో పడాలో నిర్ణయించే బాధ్యత ఒకరికి అప్పగించేస్తారు. వాళ్ళ మాటను మీరే వీల్లేనేలేదు.
భుక్తాయాసంతో నడుం వాల్చాలనుకునే బద్ధకస్తుల్ని తట్టితట్టి లేపి పేకాటలోనో, అంత్యాక్షరిలోనో కూలేయడానికి నాలాంటివాళ్ళు ఉండనేఉంటారు. చిన్నవాళ్ళైతే మా గుంపులోనూ, పెద్దవాళ్ళైతే అత్తగారి గుంపులోనూ కలిపి చేతులు దులుపుకోవడమే. రెండు గంటలు రెండు క్షణాల్లా గడిచిపోయాయని చెప్పడానికి ఓ పదిహేనేళ్ళ పిల్ల వస్తుంది - " మీకు టీ కావాలా? కాఫీనా?" అని చిలకలా అందరినీ ఒకే ప్రశ్న వేసి లెక్కపెట్టుకుంటూ. మేము గెలిచిన టీం, ఓడిన టీం అని లెక్కలేసేవేళకి, ఎవరడిగింది వాళ్ళకి అప్పజెబుతూ మళ్ళీ ఆ వన్నెలవిసెనకర్ర రానే వచ్చేది. స్టీల్ కేన్లలో నుండి ముందువారం వండిన బూందీలు, లడ్డూలు, కారప్పూస , చెక్కలు, పేపర్ ప్లేట్లలో "పారేస్తే ఊర్కునేది లేదు సుమా!" అనే హెచ్చరికతో ఒకరందిస్తూ కూర్చునేవారు. ఆవిడ మాటను రెండో చెవితో వదిలేసి, వేడిగా ఏ బజ్జీలో వేయక ఇవేమిటే? అని విసుక్కునే మనిషి ఎవరో ఉండే తీరతాడు. "మిరపకాయ్ సగానికి చీల్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర కూరి, పైన పల్చగా నిమ్మరసం చిలకరించి ఇవ్వాలి, ఏం..? వాము దట్టించాలండోయ్.." ఒకదానివెనుక ఒకటి కోరికలన్నీ చదువుకుంటూపోతారు వాళ్ళు. పెరటిదొడ్డివైపు "చుయ్..చుయ్.." అంటూ పొయ్యి నవ్వుతూనే ఉంటుంది.
కప్పులు, పేపర్ ప్లేట్లూ ఏరుకుని, దుప్పట్లు మార్చీ, ఇల్లొకసారి తడిగుడ్డ పెట్టి, ఆడవాళ్ళంతా చేరి సహస్రనామాలు పారాయణ చేసేలోపు ఏడూ ఏడున్నర అయిపోతుంది. పసిపిల్లల అమ్మలు కంగారుకంగారుగా తిరిగేస్తుంటారు. వాళ్ళను పట్టిలాగి పెద్దవాళ్ళు "చద్దన్నం పెట్టేవు చంటోడికి, కాస్త ఆగు, అన్నం వార్చేయగానే పెట్టేద్దువు..ఇంకెంత ఐదు నిమిషాలు.." అంటూ సుద్దులు చెప్పేస్తారు. "నువ్వేమైనా నోట్లో వేసుకున్నావా? వేలాడిపోతున్నావేమట్లా?" అని ఆరా తీయగానే చివ్వున కళ్ళల్లో నీళ్ళు. ఈ నాలుగురోజులూ దాటి సొంతగూడు చేరితే బండిచక్రాల్లా తనూ తనవాడూ కలిసి పరుగుతీయడమే తప్ప ఇలా ఆగి తమని చూసి అడిగేవారెవ్వరూ ఉండరని గుర్తొస్తే సన్నటినొప్పి. ఇల్లంటే గబుక్కున పెరిగే బెంగ.
భోజనాల వేళ మించిపోతూంటుంది. "ఎవ్వరూ తినమంటే వండిందంతా ఏం చెయ్యాల్రా?" అరుపులు చెవిన పడుతున్నా అందరూ తప్పించుకు తిరుగుతారు. చెవి మెలేసి మరీ లాక్కొచ్చే మేనత్తలెవరో నడుం బిగించుకుంటారు. గోంగూర వాయ కలిపి ఉల్లిపాయ ముక్కలతో నంజుకు తినమంటారు. కందిపొడిలో ఆవకాయ నూనె వేసుకు తింటే ఉంటుంది నా రాజా!! అని లొట్టలేస్తారు. మాగాయ చిన్నజాడీలోకి తీసి, ఫ్రిడ్జ్ నుండి తొరక తెచ్చి ఎదురూగ్గా పెడతారు. పప్పు పులుసు గుమ్మడి వడియాలు, మిరియాల అప్పడాలు ముందుకు తోసి, ఎంత కావాలంటే అంతే తినండి, బలవంతమేం లేదు అని ఉదారంగా పలికి పక్కకెళ్ళిపోతారు. బొజ్జలోని బజ్జీలను పక్కకు సర్దుకుని కుంభాలు కుంభాలు కానిచ్చేస్తాం.
శుద్ధి చేశాక, వరండాలో ఆ మూల నుండి ఈ మూల దాకా పక్క దుప్పట్లు. సోఫా కుషన్లూ, దిళ్ళూ, మడతలేసిన దుప్పట్లూ అన్నీ తలల కిందకి సర్దుకుంటాయ్. ఎప్పుడూ నవ్వురాని పిచ్చి సంగతులకు కూడా ఆరాత్రి వికటాట్టహాసమే చెయ్యాలనిపిస్తుంది. ఎవరైనా కసిరితే ఇంకా నవ్వొస్తుంది. అత్తగారి దగ్గర కోడలి వినయాన్నీ, కోడలి మీద అత్త ప్రేమనీ మిగతావాళ్ళు వేళాకోళం చేసి నాటకమంటుంటే, ఒక్కటిచ్చి వాళ్ళతో తగువుపడాలనుంటుంది. నాకిక్కడ అస్సలు తోచట్లేదు..అని వేషాలేసిన పిల్ల కుంకల్ని లాకెళ్ళి, ఐదు కిలోల బెండకాయలు తడి లేకుండా తుడవమన్నారనీ; అంతెంత్తునున్న కరివేపాకు చెట్టంతా దూసి రెబ్బలు వొలిచి కడిగి ఆరబెట్టమన్నారనీ; జీడిపప్పు బద్దలు చీల్చి చిన్నచిన్న పలుకులుగా చేసి డబ్బాల్లో సర్దమన్నారనీ; వీధి గుమ్మంలో వేసిన అంతపెద్ద ముగ్గు నిండా దోమలు తిరిగే వేళ కూర్చుని రంగులద్దమన్నారనీ; వందాకులున్న అరిటాకుల కట్టంతా శుభ్రంగా తుడిచి ఆరబెట్టమన్నారనీ; దెబ్బకు అందరూ నోరెత్తకుండా పనిలో పడ్డారనీ చెప్పుకు చెప్పుకు పుక్కిలింతలుగా నవ్వుకునేవాళ్ళం;
శ్వాస తీసుకున్నంత మామూలుగా రోజులు సాగిపోతాయ్. పెరిగిన కిలోల లెక్క ఎందుకడుగుతారూ? వంటమనుషులు, ఆవిడ తనకు సాయంగా తెచ్చుకున్న మనుషులూ వంటింట్లో ఉన్నా, అక్క కొడుకుకి నేతి పెసరట్లు ఇష్టమని ఒకరూ, మేనల్లుడికి పెసరపచ్చడితో చేసే అట్టు ఇష్టమని ఒకరూ, చేమగడ్డలు వేయిస్తే మా కోడలు ఇష్టంగా తింటుందని ఒకరూ, మావయ్యగారికి పెరుగులో మీగడ సయించదు, మజ్జిగ చేసేస్తాను అంటూ ఒకరు - ఆ వంటిల్లు పట్టుకుని వేలాడుతూనే ఉండటం చూసి నాకెట్లా అనిపించిందో అడగండి. ఆడీ ఆడీ అరుపులతో అరిగిపోయిన గొంతుల గురించి వాకబు చెయ్యండి. దబాయించి లాక్కున్న పేకాట డబ్బులన్నీ వడ్డీలు కలిపి పిల్లల జేబుల్లో దోపేసిన ప్రేమల గురించి చెప్పమని అడగండి. సమవయస్కులందరూ దీపాలార్పేశాక చెప్పుకున్న రహస్యాల గురించి అడగండి. నాలుగు రోజులు వంట తప్పించుకున్న ఆనందంలో నిశ్చింతగా నిద్రపోయిన ఆడవాళ్ళ గురించి అడగండి. వాళ్ళ చీరల రంగులనూ, ఆ రంగుల్లో మెరుపులనూ అక్షరాల్లో చూపించమని అడగండి.
పండగ అయిన మర్నాటి గురించి మాత్రం నాకు గుర్తు చేయకండి. అందరినీ విడిచి, ఇల్లు చేరాకా, ఖాళీ గోడల ఆహ్వానం ఎలా ఉంటుందో, ఆ దుమ్ములూ దులుపుకోవడాలూ ..ఉఫ్ఫ్ఫ్!!!

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...