ఆరేసిన పచ్చ చీర
నువ్వు రాసిన ఉల్లి పొర ఉత్తరం
నీలం రంగు పమిట నాది
ఆకాశం వైపుకి ఎగురుతూ ఉంటే
పట్టుకో పట్టుకో అని…
పాలపర్తి ఇంద్రాణి అన్న పేరు వినగానే తను రాసిన ఇలాంటి హాయిపదాల అందమైన కవిత్వం గుర్తొస్తుంది. ఇదే రచయిత్రి బరువైన వస్తువుతో, జీవితాన్ని దాని అత్యంత సహజమైన రూపంతో, కోపాలు, మోసాలు, బాధలు, పాతబడని చిన్ని చిన్ని సంతోషాలు విప్పుతూ రాసిన పుస్తకం, ఱ. పుస్తకానికి ఈ పేరే ఎందుకూ అంటే, ముందుగా వేరే ఏ అక్షరానికీ లేని బండి దీనికుందన్నది ఆమె సమాధానం.
చనిపోయిన మనిషిని పడుకోబెట్టినట్టు అనిపిస్తుంది.
పాపాయి ఉయ్యాలలాగా అనిపిస్తుంది.
తన తమ్ముడు ‘ర’ కు ఉన్న వాడుక, మన్నన నాకు లేవే అని బాధపడుతున్న పెద్దన్నలా అనిపిస్తుంది ‘ఱ’
నిడివిపరంగా చూస్తే నవలిక అని చెప్పదగ్గ ఱ పుస్తకానికి ఆధారమైన వస్తువు చావు. తండ్రి మరణం జీవితంలో కదిలించిన వేదన నేపథ్యంలో నడుస్తూ ఉండగా రచయిత హైదరాబాద్‌లోని స్మశానంలోకి వెళ్ళడం, అక్కడ ఎదురుగా కనపడే సంఘటనలు ట్రిగర్ చేసినట్టు ఏవో గతస్మృతుల్లోకి జారుకోవడం, తిరిగి కథ వర్తమానానికి రావడం–స్థూలంగా ఈ పుస్తక శిల్పం. అధ్యాయాల్లా సాగే ప్రతీ జ్ఞాపకానికీ ముందు ట్రాన్స్‌లోకి నడిపిస్తున్నట్టుగా సాగే కవిత; అధ్యాయానికి ముగింపులా ఒక చావు. మధ్యలో ఎన్నో ఛాయలతో కదలాడే జీవన శకలాలు. ఈ అనుభవాల్లో కూడా అత్యంత ఆత్మీయమైనవి, తన బ్రతుకుతో సమాంతరంగా వెంటబడి వస్తున్నట్టుగా ఉన్నవీ కొన్నయితే కొన్ని మాత్రం కేవలం అప్పుడే, ఆ క్షణంలోనే అన్నాళ్ళూ మరుగున ఉండీ ఉండీ అకస్మాత్తుగా పైకి లేచినట్లు కనపడేవి. మనిషి తన జీవితాన్ని ఎంత గమ్మత్తుగా మెదడు పొరల్లో దాచుకుంటాడో చూపెడుతుందీ పుస్తకం.
ఇది తండ్రి పోయిన దుఃఖంలో రాసినదే కానీ అంతా తండ్రి గురించే రాసినది కూడా కాదు. చావు మాత్రమే నిజంగా సాగిన ఎందరెందరి కథలో ఈ పుస్తకంలో ఉన్న మాట నిజమే అయినా ఈ పుస్తకం చూపించింది ఆ మరణం తాలూకు నీలినీడలను మాత్రమే కాదు. మరణం అనే ఊహ తాలూకు బరువు కూడా చాలామందికి మోయలేనిదే కనుక ఎన్నో చావులను కుప్పగా ఒకే చోట చూపెట్టినట్టుండే ఈ పుస్తకం కొందరు పాఠకులను ఉక్కిరిబిక్కిరి చేసే ప్రమాదం ఉంది. అలాగే, చెప్పదలచిన మాటల్లో ఏ డొంకతిరుగుడూ లేకుండా సూటిగా చెప్పడం వల్ల చావు ఊహల నుండి దూరం పరుగెత్తించే భయమో వెరపో కూడా కొందరు పాఠకులకు అనుభవంలోకి రావచ్చు. కాలక్షేపానికి ఎప్పుడంటే అప్పుడు కూర్చుని చదువుకోగల పుస్తకాల్లా కాకుండా ఈ పుస్తకం పాఠకుడి నుండి ఒక ప్రత్యేకమైన మానసిక స్థితిని కోరుతుందనడం కూడా అతిశయోక్తి కాదేమో.
అయితే, విచలితం చేసే ఇన్ని అనుభవాల పరంపర విప్పుతూ కూడా, పుస్తకం మూసే వేళకి పాఠకులకు కేవలం దిగులునూ లేదా వైరాగ్య భావనలనూ మాత్రమే మిగల్చకుండా, కొంత బలాన్ని, ధైర్యాన్ని, ఒక విజయం తాలుకు ప్రయాణాన్ని కూడా గుర్తుగా మిగల్చడం ఆశ్చర్యం కలిగించే విషయం.
పదాలు అటూ ఇటూ పరుగులు తీస్తాయి
అర్థాలు ఎటెటో దిక్కులు చూస్తాయి
ఆలోచనలు ముందుకీ వెనక్కి ఊగిసలాడతాయి
చివరికి, శూన్యంలోంచి పువ్వులు రాలతాయి
ఇది తన అమాయకపుకళ్ళతో చుట్టూ జరిగే జీవితాన్ని సునిశితంగా గమనించిన పిల్ల కథ. ఆ అమ్మాయి ఎక్కడా ఎవ్వరినీ నిలదీసినట్టు కనపడకపోవచ్చు; ఎదురుతిరిగి ఎవ్వరితోనూ పోట్లాడినట్టూ కనపడకపోవచ్చు. కానీ తన ఎరుకలో ఒక మనిషిని మరో మనిషి గాయపరిచిన ప్రతిసారీ అది తిరస్కారంగా పుస్తకంలో కనపడుతూనే ఉంది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనన్నట్టు ప్రవర్తించే పెద్దవాళ్ళను ఆమె ఛీత్కరించుకున్న తీరు అప్రయత్నంగానే కొందరు పాఠకులను భుజాలు తడుముకునేలా చేస్తుంది. తండ్రి డైరీలో పుటలను తిప్పుకుంటూ బంధాలెంత సంక్లిష్టమైనవో చూపెడుతుందీమె.
ఇక్కడ నలిగిపోయిన నవ్వు మొహానికి తగిలించుకోవాలి. కన్నీళ్ళని కోటుజేబుల్లో మడిచేయాలి. ఏడుపుని అల్మరాలో దాచేయాలి. భయాలను భుజాన వేసుకుని మోయాలి. ఎవరికోసమో నచ్చని రంగులు మెత్తుకోవాలి. ఎవరినో మెప్పించడానికి నటనల నగలను గొంతున వేసుకోవాలి. చిన్ని దీపం వెలిగించుకొని, చిన్ని లోకాన్ని ఏర్పరుచుకుని హాయిగా మురిసిపోవడానికి లేదు. ఎవడొచ్చి ఆ దీపాన్ని ఊదేస్తాడో అని, ఆ చిన్ని లోకాన్ని చిందరవందర చేస్తాడో అని అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి
తాము బాధపడ్డాం కనుక అవకాశమొస్తే మరొకరిని బాధించడం సహజంగా తీసుకుంటారు కొందరు. లేదా ఒక హక్కుగా దాన్ని లాక్కుంటారు; మరికొందరు ఆ బాధలో ఆ కన్నీళ్ళతో తమను తాము శుద్ధి చేసుకుని అట్లాంటి వేదన వేరొకరిని తాకకుండా చూడాలని తపిస్తారు.
ఈ కథలో నాన్న రెండోకోవకి చెందిన హీరో! తనను నమ్మని తండ్రి పెంపకంలో పెరిగి, తనను నెట్టి బ్రతికాలనుకునే తమ్ముళ్ళ స్వభావానికి తట్టుకు నిలబడి, చిన్న ఉద్యోగపు కష్టాలను, అవి మోసుకొచ్చే చేదుతో సహా అనుభవించి కూడా ఆ తండ్రి తన పిల్లలను గెలిపించిన పద్ధతి, ఆ పిల్లల ప్రేమను గెలుచుకున్న పద్ధతి, అది చెప్పేందుకు రచయిత ఎంచుకున్న సందర్భాలు, శైలి ఈ చిన్న పుస్తకాన్ని నిస్సందేహంగా ఒక మంచి రచనగా నిలబెడతాయి. అమ్మా నాన్నా పక్కనుండనిదే ఎక్కడికీ వెళ్ళలేనివాడుగా, ఏ పనీ చేసుకోలేనివాడిగా వయసుకు తగినంతగా బుద్ధి ఎదగని పిల్లాడిగా పెరిగిన సునీల్, తండ్రి ఆసరాతో ఒక్కో మెట్టూ ఎక్కుతూ గవర్నమెంటు ఉద్యోగాన్ని సాధించడం కన్నా గొప్ప విజయమేముంటుంది? అదిగో, ప్రేమనలా మందులా పూటపూటా ఇచ్చి, పిల్లాణ్ణి బ్రతికించుకున్న తండ్రి కథ కనుక ఈ పుస్తకం ప్రత్యేకం.
ఒక వయసు దాటినవాళ్ళకు, ఈ పుస్తకం హెచ్చరికలా పనిచేస్తుంది. పెద్దవాళ్ళు చుట్టూ ఉన్న పెద్దవాళ్ళనే గమనించుకుంటారు. వాళ్ళ ఆమోదం కోసమే పాకులాడతారు. కానీ ఆడుతూపాడుతూ వాళ్ళ అల్లర్లలో వాళ్ళున్నట్టు కనపడే పిల్లల్లో ఎవరో ఒక్కరు తమ ప్రవర్తనను గమనిస్తున్నారన్న స్పృహ మొదలైతే ఎలా ప్రవర్తిస్తారు? అనే కుతూహలపు ఆలోచనను రేకెత్తిస్తుంది. తండ్రులుగా, తాతలుగా, అమ్మలుగా అక్కలుగా, తమ్ముళ్ళుగా మనం మాట్లాడే నిర్దయాపూరితమైన మాటలూ చేష్టలూ వాటితో నేరుగా సంబంధం లేని మరోతరం పిల్లలను కూడా ప్రభావితం చేస్తాయని గమనించుకుంటున్నామా? బయట ఎట్లాగూ తప్పని పోటీని మన ఇంటి నాలుగు గోడల మధ్యకూ రాకుండా ఆపుతున్నామా? ప్రేమిస్తున్నామా మన పిల్లల్ని? వాళ్ళతో ఏమైనా ఆడుతున్నామా, నడుస్తున్నామా ఆరుబయట వాళ్ళతో? వండి పెడుతున్నామా, కొసరి కొసరి ఆ చిన్న నోళ్ళలో పెద్ద చేతులతో పెడుతున్నామా?
సంప్రదాయం ఉంటే రేపెవరో వెళ్ళిపోయిన ప్రాణానికి పిండం పెడతారు. ఫొటో ముందు పువ్వులు పెట్టి అగరుబత్తులు వెలిగిస్తారు. కానీ ప్రేమతో కృతజ్ఞతతో ఆ చేతులు నమస్కరించాలంటే వెనుక ఎన్ని జ్ఞాపకాలుండాలి! దుఃఖంతో మలిగిపోతూ, మిగిల్చి వెళ్ళిన గుర్తులకు సాగిలపడుతూ తల్చుకోవాలంటే ఎట్లాంటి మనిషిగా జీవించాలి!
ఱ నిరంకుశంగా చెప్తుంది, చావు నిజం. చావు ఎంత నిజమో బ్రతుకూ అంతే నిజమని. హృదయం పొంగిన క్షణాలకూ, పగిలిన క్షణాలకూ లెక్కలు తప్పకుండా ఉంటాయని. దేని లెక్క దానిదేనని.
రచయిత: పాలపర్తి ఇంద్రాణి
ప్రచురణ: జె.వి పబ్లికేషన్స్
ధర: రూ.100/-
ప్రతులకు: జె.వి పబ్లికేషన్స్ మరియు అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు.
No comments:
Post a Comment