"బీచ్ పార్క్ దగ్గర మెక్.డి వెనుక నీ కోసం ఎదురుచూస్తున్నాను..ఒక్కదానివే రా...ప్లీజ్."
మెసేజ్ చూస్తూనే కళ్ళు తిరిగినట్టైంది. నమ్మలేక దానివంకా..అది పంపిన మనిషి పేరు వంకా మళ్ళీ మళ్ళీ చూశాను.
శేఖర్!
*
ఇంటిగాలి సోకకుండా నెలల తరబడి స్నేహితులతోనే మసలుకోవాల్సిన కాలం, నా జీవితంలోనూ కొన్నాళ్ళు సాగింది. ఇచ్చిన అడ్రస్‌లూ, ఫోన్ నంబర్లన్నీ కాగితాల మీద రాసుకుని; లాండ్‌లార్డ్, లాయర్ వచ్చి తాళాలిస్తారు వెళ్ళండంటే - ఓ తెల్లవారుఝామున సింగపూర్‌లో కాలూనాం, నేనూ, నాతో పాటు ఇంకో ఇద్దరమ్మాయిలు. ఒకరు ఒరిస్సా వాళ్ళు. మరొకరు బొంబాయిలో స్థిరపడ్డ మళయాళీలు. అదే నా మొట్టమొదటి ప్రాజెక్టు. కళ్ళ ముందే ట్రేడ్‌లు. ఆడుతూ పాడుతూ చేసిన కాలేజీ ప్రాజెక్టుకీ, పరీక్ష మీద పరీక్ష పెట్టి దేశాలు దాటించిన ట్రెయింగ్‌కీ - ఇక్కడ స్క్రీన్ మీద జరిగే భాగోతానికీ పోలికలు వెదుక్కునే ప్రయత్నం చేశాన్నేను. ఊహూ..ఇదంతా నాగలోకం. టీమ్‌లో మేం ముగ్గురం కాక, మరో నలుగురు నార్త్ ఇండియన్స్. లీడ్‌గా తనను తాను పరిచయం చేసుకున్నాడు శేఖర్. నుదుటి మీద చిన్న గంధం బొట్టు, దాని మధ్యలో కుంకుమ దిద్దుకుని, పక్క పాపిడి, మాయని గడ్డం, నలగని ఇస్త్రీ మడతలు - చూడగానే బుద్ధిమంతుడోయ్..అనిపించేలా, కొత్త పక్కన పెట్టి మాట్లాడాలనిపించేలా, భలే ఉండేవాడు.
శేఖర్ కన్నడవాడు. వాళ్ళ అమ్మ తరఫు వాళ్ళు తమిళబ్రాహ్మలు. బెంగళూరు కాలేజీలో అంతా తెలుగు స్నేహితులతో సావాసం. కాబట్టి కొద్దో గొప్పో నా భాషే అర్థమయ్యేది. బహుశా ఆ కారణానికే నాతో రెండు మాటలు ఎక్కువే మాట్లాడేవాడు. ఇద్దరు మనుషులుండే క్యూబికల్‌లో తన వెనుకే నా డెస్కూ.
అప్పటికి మూడేళ్ళుగా అదే ప్రాజెక్టులో చేస్తున్న శేఖర్ కి పని మొత్తం కొట్టిన పిండి. రాక్షసమైన ధారణాశక్తి. పనిలో ఏ ఇబ్బంది అయినా, ఏ డెపెండెన్సీ మర్చిపోయి డెడ్లైన్ దాటేట్టున్నా, అన్నీ తన భుజాల మీదకు వేసుకుని పని పూర్తి చేసేవాడు. టీమ్ మీదకి ఒక్క మాట రాకుండా చూసుకునేవాడు. పని అవుతుందంటే అవుతుంది, అవ్వదంటే అవ్వదు. ఏ మొహమాటం లేకుండా స్పష్టంగా కారణాలతో చెప్పేవాడు. క్లైంట్ మేనేజర్‌లతో కూడా అస్సలు డిప్లమేటిక్ సమాధానాలు చెప్పడనీ, కుండలు పగలగొడుతుంటాడనీ అతనికి అక్షింతలు బానే పడేవి. పని విపరీతంగా చేస్తాడనీ, చేయిస్తాడనీ తనంటే కొంత విముఖత ఉండేది మిగతావాళ్ళకి. మేం కొత్తవాళ్ళం కనుక మా మీద కొంత అజమాయిషీ కూడా చేసేవాడు. మీటింగ్స్‌లోకి లాగి మాచేత మాట్లాడించేవాడు. తప్పులన్నీ మెయిల్ చేసి ప్రశ్నలడిగేవాడు. ఒక బ్లాక్ వెనుక మరొకటి మాకప్పజెబుతూనే ఉండేవాడు. ఇతనొక్క పూట సెలవు పెడితే బాగుండు అని టీమ్‌లో పాతవాళ్ళు అనుకోవడం నేనే ఎన్నోసార్లు విన్నాను.
చేస్తే ఎందుకు రాదు? చూస్తే అర్థం కాకపోవడముంటుందా? గూగుల్‌లో వెదుకు, ఇంటర్నల్ డాక్స్ చూడు - ఇలా అనేవాడులే కానీ, మొత్తానికి పని వచ్చేలా చేసేవాడు. ప్రశ్న వెనుక ప్రశ్న వేసి ఎలా చెయ్యాలో దారి చర్చించేవాడు. నేను ఏ ఇష్యూతోనైనా కదల్లేనట్టుగా ఉంటే, తన పని మానుకుని మరీ నా మానిటర్లో దూరి సలహాలిచ్చేవాడు.
పని సంగతి పక్కన పెడితే, తన స్నాక్స్ డబ్బాలు. వాటికోసమే తనతో స్నేహాలు చేసేవాళ్ళు ఫ్లోర్‌లో చాలా మంది. పెసలు నానబెట్టి మొలకలు వచ్చాక, చక్కగా వాటిని డబ్బాలో వేసి తెచ్చేవాడు. కీరాముక్కలు, టొమాటోలు, కేరెట్ తురుము, కొత్తిమీర ఇవన్నీ వేరే డబ్బాలో ఉండేవి. చాట్ పౌడర్, పెపర్, సాల్ట్ ఆఫీస్పాంట్రీలోనే సర్దుకున్నాడు. నాలుగింటికి మేనేజర్లూ, క్లైంట్ మేనేజర్లూ, ఫ్లోర్‌లోని డైరెక్టర్లూ వెళ్ళిపోయాక, నా డెస్క్ దగ్గర ఘుమఘుమలు మొదలయ్యేవి. రాజీవ్ కులకర్ణి అని మాకో కన్నడ మేనేజర్ ఉండేవాడు. ఈ రోజు కోసంబరి తెచ్చావా అని పూటా కనుక్కుని, వెళ్ళేముందు ఏదుంటే అది నాలుగు స్పూన్లు పెట్టించుకుని వెళ్ళేవాడు.
వేరుశనక్కాయలు ఉడకేసి తెచ్చేవాడో రోజు. భేల్పూరీ చాట్ ఇంకోరోజు. అరటికాయలతో చిప్స్ చేసి పైన పల్చగా ఉప్పూకారం జల్లిన డబ్బా నా కళ్ళముందు ఊపేవాడు. అతని అలసంద వడలు తిన్నరోజైతే మతేపోయింది నాకు. పెసరపుణుకులు తెచ్చాడని ఫోన్‌లో చెప్తే మా అమ్మ కూడా ఆశ్చర్యపోయింది. అన్నీ స్వయానా తనే, ఏ రోజు కారోజు చేసేవాడు. పుట్టి బుద్ధెరిగాక ఇంట్లోనూ చుట్టాల్లోనూ తెలిసినవాళ్ళలోనూ ఇంతమంది ఉద్యోగస్తులను చూశాను కానీ, అతని పద్ధతిని మాత్రం ఎక్కడా చూళ్ళేదు.
అతని డబ్బాలకలవాటు పడ్డాక, నాకొక్కోరోజు మూడింటికే ఆకలాకలిగా ఉండేది. అస్సలు ఒప్పుకునేవాడు కాదు. టైమంటే టైమే. నన్నే కాదు, నాలాంటి తిండిబోతులందరినీ మొహమాటం లేకుండా తిప్పికొట్టేసేవాడు. అన్నట్టూ, అన్నీ వచ్చిన శేఖర్‌కు కాఫీ చేసుకోవడం రాదు. రాదంటే - వాళ్ళమ్మ చేతి రుచి రాదుట. అందుకని నచ్చదుట. నా కాఫీ బాగుందని, ఇస్తే ఎన్ని సార్లైనా తాగాలనిపిస్తుందని సర్టిఫికేట్ ఇస్తే ఎవరెస్ట్ ఎక్కినంత సంబరపడిపోయాన్నేను.
ఆదివారం తన స్నేహితుల కోసం చేసిన స్వీట్స్ మిగిలితే సోమవారం తెచ్చేవాడు. ఒక్కోసారి లంచ్ కూడా రెండు డబ్బాలు తెచ్చేవాడు. తనవన్నీ వన్‌పాట్ మీల్స్. వాంగీబాత్, పులిహార, పులావ్, బిసిబెల్లాబాత్, పొంగల్, కొబ్బరన్నం..ఇలా. తోడుగా కీరా రైతా, నంజుకు చిన్న నిమ్మబద్దో మామిడి ముక్కో. అంతే ఇక.
మేం వెళ్ళాక వచ్చిన మొదటి క్వార్టర్ చివర్లో.. శుక్రవారం రాత్రి నుండి దాదాపు ఆదివారం మధ్యాహ్నం దాకా సాగే ఓ మేజర్ రిలీజ్ ప్లాన్ చేశారు. నెట్వర్కింగ్ వాళ్ళు, డేటాబేస్ వాళ్ళూ, ఇప్పటి భాషలో డెవాప్స్ - ఇలా అందరూ ఉండి తీరాల్సిన రిలీజ్. అప్లికేషన్ కథేంటో అప్పుడప్పుడే నేర్చుకుంటున్న నా పేరు రిలీజ్ ప్లాన్‌లలో చక్కర్లు కొడుతున్న సంగతి గమనించి నా రూంమేట్ అడిగింది "నువ్వెలా ఒప్పుకున్నావ్" అని. "నేర్చుకున్నట్టు ఉంటుంది కదా, ఇంకో మూణ్ణెల్లకైనా మనం చెయ్యాల్సిందే కదా, అయినా ఏదైనా తెలీకపోతే శేఖర్ లాగ్ఇన్ అయి చూస్తానన్నాడు. కాల్ చెయ్యమన్నాడు." అతను చెప్పింది చెప్పినట్టు అప్పజెప్పాను.
"ఏం చూస్తాడు, ఆడిట్ వాళ్ళు లాగ్ చూడరా, తేడాపాడా అయితే నిన్ను ఫైర్ చేసి పారేస్తారు. ఇన్వెస్ట్మెంట్ బాంక్ అనుకున్నావా ఇంకేమైనానా" అని భయపెట్టేసింది.
అక్కడితో ఆగకుండా వెళ్ళి అతన్నీ నిగ్గదీసింది.
ఆ రిలీజ్‌లో అదృష్టవశాత్తూ మామూలుగా వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఏం రాలేదు. అనుకున్న సమయానికి అనుకున్నట్టే అయిపోయింది. తర్వాత చెప్పాడు శేఖర్, తనకు వీకెండ్ ఆఫీసుకు రావడం అస్సలిష్టం లేదని.
నాకు పెళ్ళయ్యి, పిల్లాడు పుట్టాక వచ్చిన ఒద్దికా, కుదురు అతనికి పదేళ్ళ క్రితమే ఉన్నాయనుకుంటే ఇప్పటికీ భలే ఆశ్చర్యంగా ఉంటుంది. వీకెండ్ అంటే అతనికెన్ని పనులనీ- ఇల్లంతా సద్దుకుంటాడు; వారానికి సరిపడా కూరలూ, పళ్ళూ, సరుకులూ తెచ్చుకు ఏ రోజేం వండాలో ప్లాన్ చేసుకుంటాడు. బట్టలన్నీ శుభ్రంగా ఇస్త్రీ చేసుకుంటాడు. దుప్పట్లు ఘుమఘుమలాడేట్టు ఉతుక్కుంటాడు. తన గదీ, తన వస్తువులూ వారం వారం ఎత్తి తిరగెయ్యాల్సిందే. మూడ్నాలుగు రోజులకొచ్చేలా పచ్చళ్ళూ, వాంగీబాత్ వగైరాలకి రెండు వారాలకోసారి పొడులూ కూడా చేసుకుంటాట్ట. తనతో పాటు తన రూంమేట్స్ కి కూడా చేతి నిండా పని చెప్తాట్ట. ఎంత విసిగించినా వారమంతా వాళ్ళు నిద్రలేచే సరికి చక్కగా వండి వడ్డించే మగ రూంమేట్ దొరకడని వాళ్ళకూ తెలుసు. ఏమన్నా తలాడించేవారుట.
శేఖర్ చెప్పాడు, ఒక్కడికీ చేసుకోబుద్ధి కాదుట. ఇంట్లో అయినా ఆఫీసులో అయినా మనుషుల మధ్య ఉంటే, ఆ సందడి ఇచ్చే శక్తితో ఎంత పనైనా చేస్తాట్ట కానీ ఒక్కడూ ఉండలేడుట. అందుకే రిలీజ్‌లో నా పేరు పెట్టేశాడుట.
వెంటనే ఒప్పుకున్నందుకూ, ఉత్కళిక చెప్పినా నేనేమీ అననందుకూ అనుకోనందుకూ, తనకి నేనంటే ఇష్టం కుదిరింది. తను తెచ్చే స్నాక్స్ డబ్బాలు ఒకటికి రెండయ్యి, నా డబ్బా నాకే ప్రత్యేకంగా రావడం మొదలైంది. ఇక నేను మూడింటికే తినేసే వీలూ కుదిరింది.
తనలాంటి టీంలీడ్్‌ని తరువాతి పదేళ్ళలో ఎప్పుడూ చూళ్ళేదు నేను. పనిలో తప్పులైతే చకచకా ఫిక్స్ చేసేసేవాడు. పరాయిమనిషి పనికి నిజాయితీగా క్రెడిట్ ఇచ్చేవాడు. కోపాలు, అనవసరపు విసుగులూ, హస్షూబుస్షూలు ఉండేవి కావు. ఎంత క్రైసిస్ అయినా, కంగారు పడేవాడు కాదు, పెట్టేవాడు కాదు. టీమ్‌లో ముగ్గురం ట్రిప్‌కి వెళ్ళిపోతున్నాం అంటే - మేనేజర్‌తో తనే మా పని చేస్తానని చెప్పి ఒప్పించి సెలవకి ఇబ్బంది లేకుండా చూసేవాడు. మేం సినిమాలనీ, షికార్లనీ, మలేషియా ఇండోనేషియా అనీ వారాంతాలు తిరిగి తిరిగి డస్సిపోయిన ముఖాలతో సోమవారం ఆఫీసుకొస్తే, తను పండులా తయారై, వికసించిన ముఖంతో ఎదురొచ్చేవాడు. ఒక్కోసారి సిగ్గనిపించేది.
ఏదంటే అది కొనడు. బట్టలకు వృధా చేయడు. సినిమాల మీద మోజు లేదు. బయట దేశాలకెళ్ళినా, మాలా బీచ్ ఫేసింగ్ రూంలనీ, రిసార్ట్‌లనీ డబ్బులు తగలేసే ఫేన్సీలేవీ లేవు. బయట తిండి - ఊహూ- సమస్యే లేదు. తాను వండుకున్నదేదో కడుపు తిండా తింటాడు, కంటి నిండా పడుకుంటాడు. ఇంట్లో అయినా, ఆఫీసులో అయినా ఒళ్ళు దాచుకోకుండా విసుక్కోకుండా పనిచేస్తాడు. ఆశ్చర్యంగానూ, అప్పుడప్పుడూ అసూయగానూ ఉండేది తనను చూస్తే. ఎప్పుడూ మా ముగ్గురమ్మాయిలతోనూ తిరగడం వల్ల మిగతా అబ్బాయిలంతా తనను ఏడిపిస్తూ ఉండేవారు. కోపం రాదా అంటే - ఓ గంట నడిస్తే అదే పోతుందనేవాడు.
ఆ రోజుల్లోనే వాళ్ళింటి లీజ్ అయిపోవడంతో సింగపూర్‌లో మరో మూల ఉండే మా అపార్ట్‌మెంట్‌కి మారిపోయారు. మా పై ఫ్లోర్‌లోనే అద్దెకు దిగారు. ఇకనేం, వీకెండ్‌లో డబ్బాలొస్తాయని మేం టపాసులు పేల్చేసుకున్నాం మనసులోనే, తన వారాంతపు పని తెలిసి కూడా.
శనివారం ఉదయాన్నే లిటిల్ ఇండియా లోని గుడులు చుట్టబెట్టి వచ్చేవాడు. ఎనిమిదీ ఎనిమిదిన్నరకు తిరిగొచ్చేసేవాడు కూడా. అతను బయట బ్రేక్‌ఫాస్ట్ చేసే రోజు బహుశా అదొక్కటే.
నాకూ పొద్దున్నే లేచే అలవాటుంది కానీ అక్కడ మా ఇంట్లో ఎవ్వరూ లేచేవారు కాదు. వాళ్ళు పదకొండింటికి లేచి టీ తాగి తలస్నానాలయ్యాక వంట మొదలెట్టేవారు. నేను వంట చెయ్యను - చెయ్యను అంటే వాళ్ళు చెయ్యనివ్వరు. ఎందుకో ఇంకోసారి చెప్తానేం! - ప్రస్తుతానికి ఈ కథే.
సరే, తనొచ్చి, నేనిలా లేచి నూడుల్స్‌తోనో బ్రెడ్‌తోనో తిప్పలు పడుతున్నానని విని, నీకూ పార్సెల్ తేనా పోనీ అని అడిగాడు. కాదనే ముఖమేనా నాది? చక్కగా లేచి తయారై కూర్చుని ఎప్పుడొస్తాడా అని ఎదురుచూసేదాన్ని. నేతి వాసనల పొంగల్, సాంబార్, కొబ్బరి పచ్చడి, ఎర్ర పచ్చడి - అహా నా రాజా! ఆ రుచి ఎలాంటిదంటే ఏం చెప్పను! నా ఆకలి తెలిసి, ఇది ఖాళీ చేసేవేళకి రవ్వదోస పొట్లం కూడా విప్పేవాడు. ఆ కబురూ ఈ కబురూ చెబుతూ, నేను కాఫీ ఇస్తే తాగేసి కప్పు కడిగి బోర్లించేసి, తను చేసుకోవాల్సిన పనులు చెబుతూ వెళ్ళిపోయేవాడు. రెండు వారాలయ్యేసరికి ఇంట్లో అందరికీ ఆ పొట్లాల మీద మోజు మొదలైంది. శనివారం తను తేవాల్సిన పొట్లాల లెక్క పెరిగింది.
స్నేహితులందరం సింగపూర్ దాపుల్లోనే ఉండే ఒకానొక ఐలాండ్‌కి వెళ్ళామోసారి. లోపలకెళ్తుంటే అడవిలా ఉంటుంది. సైకిల్ తీసుకుంటే తప్ప తిరగలేరని అడ్డు కొట్టేశారు అక్కడివాళ్ళు. నాకు సైకిల్ రాదు. శ్రమపడీ, ఖర్చు పెట్టుకు వచ్చి అంతా చూడకపోవడమంటే మిగతావాళ్ళకి మనస్కరించలేదు. శేఖర్ వాళ్ళని పంపేసి నాతో ఉండిపోయాడు. మేం కాలినడకన లోపలికి బయలుదేరాం. ఓ గంట నడిచి, వెనక్కు వచ్చేద్దామని. ఎండిన ఆకులు ఓ వైపు, పచ్చని ఎర్రని చిగుర్లు ఇంకోవైపు. పక్షుల పాటలు..కీచురాళ్ళ రొద. మసక వెలుతురు. సైకిల్ మీద వెళ్తే ఇట్లాంటి చిన్నచిన్న అందాలు మిస్ అయిపోమా..నిక్కి చూస్తోన్న ఓ ఉడుతపిల్లని కెమెరాలోకి బంధిస్తూ అన్నాడు. అది నా గిల్ట్ ని చెరిపేయడానికేనని తెలుసు. తలొంచుకు నవ్వుకున్న నన్నూ ఫొటో తీసి చూపించాడు.
నేను ఎన్ని సార్లు సైకిల్ నేర్చుకున్నానో, ఎలా పడ్డానో, సైకిల్ రాకుండా ఇన్ఫోసిస్ మైసూర్‌లో ఎలా తిప్పలు పడ్డానో అన్నీ చెప్పించుకుని విన్నాడు. ఏడుగురు పిల్లల్లో ఒకడిగా, పదిహేను మంది మసలుకునే ఇంట్లో పసివాడిగా తానెట్లా పెరిగాడో కూడా చెప్పాడా రోజు. కర్చులూ, పొదుపులూ, ఆశలూ, ఆస్తులూ ..అన్నీ చెప్పుకుపోయాడు. కర్ణాటకలో ఇల్లు లీజుకు తీసుకునే పద్ధతుంటుందట. వాళ్ళుండే ఇల్లు కొనాలని కూడబెడుతున్నాడట. వచ్చే అమ్మాయి వయసు పైబడ్డ తన తల్లితండ్రుల మనసు నొప్పించే మాట మాట్లాడకుంటే ఉంటే చాలనీ, తను మనసు బాలేకుండా ఉంటే మాటలు మందుగా ఇవ్వాలనీ ఆశగా చెప్పాడు.
స్నేహితులమేనని మనసులో ఓ అభిప్రాయం స్థిరపడిపోయాక, కొన్ని గ్రాంటెడ్‌గా తీసుకోవడం అలవాటుగా జరిగిపోతుంది. అట్లా నేనూ చెప్పాపెట్టకుండా సెలవులు పెట్టేదాన్ని. తన డబ్బా తినేసి తనకు నా ఫుడ్‌కోర్ట్ కార్డ్ ఇచ్చేదాన్ని. తనకి ఏ అవార్డ్ కిందో రివార్డ్ కిందో సినిమా టిక్కెట్లిస్తే తనెలాగూ రాడు కనుక నేను నా రూంమేట్స్‌తో అవి తీసుకు వెళ్ళిపోయేదాన్ని. చూస్తూ చూస్తూ ఉండగానే మూడేళ్ళు గడిచిపోయాయి. మేమంతా ఇంతో కొంతో మారాం. పని విషయంలోనూ..ఇతరత్రానూ కూడా. తను మాత్రం మొదటి రోజు మేం చూసినప్పుడు ఎలా ఉన్నాడో..అదే మనిషి. పనిలోనైనా, పనికిమాలిన స్నేహాలకు గీతలు గీయడంలోనైనా, తన సంధ్యావందనాలు, నుదుటిన బొట్లూ, తను నమ్మిందేదో మొండిగా చెయ్యడం, తనకు వీలుగా లేనివన్నీ ఎవరెంత నవ్వినా విసిరేసి కొట్టడం. అట్లా నేనూ ఉండగలిగితే బాగుండనిపించేది చాలాసార్లు.
నా చపలచిత్తంతో నేనిక సింగపూర్ నుండి వెనక్కి వెళ్ళిపోతా అన్నప్పుడు, అక్కడ ఆఫీసు పనికీ, ఇక్కడ ఆఫీసు పనికీ తేడాలు, జీతాలూ, ప్రమోషన్ ఇవ్వడానికుండే లెక్కలూ అన్నీ ఓపిగ్గా వివరించాడు. నేను కుదరదంటే కుదరదని మొండికేస్తే నా సామాన్ల షిఫ్టింగ్‌కి, మిగతా పనులకూ దగ్గరుండి తనే ప్లాన్ చేశాడు.
ఆగస్ట్‌లో నా పుట్టినరోజు. అది అయ్యేలోపు ట్రాన్స్ఫెర్ డేట్ పెట్టద్దని మాత్రం నిమిష నిమిషం బతిమాలాడు. సరేనని, సెప్టెంబరు్‌కి ఇండియా టికెట్లు బుక్ చేసుకున్నాను.
ఆ రోజుకి నేను ఉండితీరాలని అంత పట్టుబట్టిన మనిషి, తీరా ఆ రోజు దగ్గరకు వస్తూండగానే నాతో మాటలు తగ్గించేశాడు. మూడేళ్ళ స్నేహం - అంత మాత్రం తేడా తెలీదా నాకు! ఆ శనివారం నా పుట్టినరోజనగా మొత్తం వారమంతా ఎవరో తరుముతున్నట్టు ఇంటికి పారిపోయేవాడు. ఎప్పటిలా డబ్బాల గురించి నాతో గొడవ లేదు; నేను తినేస్తే "ఇంకెప్పుడు వంట నేర్చుకుంటావ్, పెళ్ళి చేసుకునేవాడెవడో కానీ.." అని పరాచికాలాడం లేదు. ఆఫీసు పని గురించి ఏ చర్చా లేదు. నా కాఫీ కోసం పాంట్రీలో ఎదురుచూడడం లేదు. ఏదో జరుగుతోంది అనుకున్నానే కానీ, ఏమిటని ఆరా తీయలేదు. నేను ఇండియా వచ్చేసే సంబరంలో ఉన్నాను.
ఆ శుక్రవారం ఆఫీసు నుండి రోజూ కన్నా ముందు వెళ్ళిపోవడమే కాదు, ఆ సాయంత్రం జరిగే మీటింగ్ నన్ను అటెండ్ అవ్వమని చెప్పి ఫోన్ ఆఫ్ చేసేశాడు. మీటింగ్ లో ఎలాగూ వాళ్ళుండక్కర్లేదు కనుక నా మిగతా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోయి రాత్రి వంట సంగతి చూస్తామన్నారు. నేను వాళ్ళని పంపి, పనిలో పడ్డాను.శేఖర్ ఎందుకలా ముభావంగా ఉన్నాడోనన్న బెంగ లోపల సలుపుతూనే ఉంది. నే వెళ్ళిపోతున్నానని దిగులేమో అనిపించింది. స్నేహాలు ఎంత చిత్రమైనవి, ఎంత బలమైనవి! తనకి మిగతా స్నేహితులకంటే, టీంలో గడిపే సమయం వల్ల మా ముగ్గురితోనే చనువెక్కువ. నా ఒరిస్సా రూంమేట్ వయసులో తన కన్నా పెద్దది. చనువుగా ఉండేది అతనితో. తగాదాలూ పెట్టుకునేది. ఉచిత సలహాలిచ్చేది. మాతో ఎందుకూ, మగవాళ్ళతో ఉండరాదా అని కూడా అందోసారి. "ఏం, ఏంటి వాళ్ళ గొప్ప" అనేశాడు చప్పున. ఆ మాట అమ్మాయిలందరం తెగ చెప్పుకునేవాళ్ళం. నవ్వుకునేవాళ్ళం.
అంతలా మాలో ఒకరిగా కలిసిపోయినవాడు...నేనిట్లా తన గురించే ఆలోచిస్తూ ఉండగానే, ఆ రాత్రి కాల్ చేసి, ఏడింటికో ఎనిమిదింటికో.."బీచ్ పార్క్ దగ్గర మెక్.డి వెనుక నీ కోసం ఎదురుచూస్తున్నాను..ఒక్కదానివే రా...ప్లీజ్." అని మెసేజ్ ఇచ్చాడు.
నమ్మలేకపోయాను.
ఒక్క వాక్యమైనా, ఒక్క అక్షరమైనా, అది ఎవరెలా చెప్పారో, వెనుక ఉన్న ఉద్దేశ్యమేమిటో పట్టుకునే గుణం అమ్మాయిలకు సహజంగా ఉంటుంది. అట్లా, ఆ రోజు నాకూ లోపల గంటలు మోగాయి. ఫైర్ ఇంజిన్ గంటలు.
"నేను రాను. రేపు ఆఫీసులో మాట్లాడుకుందాం"
"లేదు. ఇప్పుడే రావాలి. మానసా..నువ్వు రాకపోతే నేనసలు ఇంటికే రాను. ఈ రోజే కాదు..."
కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయ్. ఫోన్ ఆఫ్ చేసేశాను. ఇంటికొచ్చి ఫార్మల్స్ తీసేసి నైట్ డ్రస్ వేసుకుని నా గదిలో తలుపేసుకున్నాను. గుండె దడదడ కొట్టుకుంటోంది. తిన్న తిండి, చెప్పుకున్న మాటలు, తీసుకున్న సాయాలు - ఇక ఇంతేనా? ఆ అబ్బాయికి ఏమైనా అయితే...లోపల నుండి ఒకటే హోరు. ఈ మగవెధవలతో స్నేహాలొద్దూ అని మొత్తుకున్న అమ్మమ్మ మాటలు వినకుండా ఎదురు పోట్లాడినందుకు నన్ను నేనే తిట్టుకున్నాను.
ముందు ఇంటికి రా - అని చెప్దామా అనిపించింది. అంతలోనే ఏదో అహం అడ్డొచ్చింది.
ఎవరో బెడ్‌రూం తలుపు మీద మునివేళ్ళతో తట్టిన చప్పుడు. గుండె అదిరిపడింది.
చకచకా ఫోన్ ఆన్ చేశాను. వేళ్ళు వణికిపోతున్నాయ్.
ఉత్కళిక.
"డోర్ తియ్" బయట నుండి పిలుస్తోంది.
ఊపిరి పీల్చుకుని తలుపు తీశాను. వెర్రి మొహంతో నిలబడి ఉంది.
"ఆర్యూ ఓకే..?" నా ముఖంలోకి చూస్తూ అడిగింది.
"యా..అక్చుయల్లీ నో.." ఏడుపు గొంతుతో చెప్పాను.
తను వచ్చి చెయిర్ లాక్కుంది. శేఖర్ తనకూ చేశాడుట. ఒక్కసారి వెళ్ళొద్దాం మానసా..ఏమైనా అయితే క్షమించుకోలేం..వెళ్ళి మాట్లాడదాం..నేనూ వస్తాను..ధైర్యం చెబుతోంది.
లేచాను.
వస్తున్నామని తనకు మెసేజ్ చేసాను.
కార్‌లో ఇద్దరం ఏం మాట్లాడుకోలేదు.దిగగానే కోపం కొద్దీ గబగబా అడుగులేసుకుంటూ వెళ్ళాను. ఉత్కళిక పరుగుపరుగున నన్ను వెంబడించింది.
వీక్ డే..రాత్రవుతూండటంతో పెద్దగా జనం లేరు. చీకటిగా ఉంది. అలల హోరు వినపడుతోంది. అలల్లో తడుస్తూ, సముద్రం వైపు తిరిగి చేతులు కట్టుకు నిలబడి ఉన్నాడు శేఖర్. నాలో మళ్ళీ భయం, బాధ, నమ్మలేనితనం.ఉత్కళిక నన్ను వెళ్ళమన్నట్టుగా తోసింది. నేను ఇక్కడే ఉంటా - అని నాకు ధైర్యం చెప్పింది.
అదురుతున్న పాదాలతో "ఓయ్..." అని అరుచుకుంటూ వెళ్ళాను. వెనక్కి తిరగట్లేదు.
"పిచ్చి పట్టిందా నీకు.." అడుగు దూరంలో ఆగి అడిగాను.
"శేఖర్.."
"శేఖర్ ప్లీజ్..."
"నాకసలు నువ్వంటే ఇష్టం లేదు పో.." ఆ మాటకి వెనక్కి తిరిగాడు.
నేనతని ముఖంలో భావాలు చదవడానికి ప్రయత్నం చేస్తున్నాను..కళ్ళూ, చెంపలూ..నవ్వు! నవ్వు..నవ్వుతున్నాడతను.అయోమయమయ్యానో సెకను. "హేపీ బర్త్డే..." బన్నీ టీత్ కనపడేలా నవ్వుతూ అరిచాడు.
"నీకిష్టం లేదా..నిజమా! మరి నాకిష్టమే..చాలా ఇష్టమే..ఏం చేద్దాం! ఏం చెప్తానని వెయిటింగ్..హెలో మేడం..అటు చూడు.." పడీ పడీ నవ్వాడు.
ఠాప్ ఠాప్ ఠాప్ అంటూ పెద్దగా శబ్దాలు. వెనక్కి తిరిగి చూస్తే అరడజను మంది అమ్మాయిలు..నా బెస్ట్ ఫ్రెండ్స్. ఇసుక మీద దుప్పటిలో కేక్..కేండిల్..గుత్తులుగుత్తులుగా తీరంలో ఎగురుతూ బెలూన్‌లు..అలలు..చందమామ, నేనూ..నా స్నేహితులూ. ఆ రాత్రి. నా పుట్టినరోజు రాత్రి. అర్థమవ్వడానికి నిమిషం పైగా పట్టింది. ఒక్కొక్కరూ వచ్చి హత్తుకుంటున్నారు. "అంత తేలిగ్గా వదిలేస్తామా నిన్ను.." "గుర్తుండిపోవద్దా.." "నువ్వెన్ని చేశావ్ ఇలాంటివి.." - అరుపులు, తీర్మానాలు..
శేఖర్ కోసం వెదికాను..
"నీ మనసులో మాట చెప్పావ్ మొత్తానికి" ముఖం ముడుచుకుని అన్నాడు.
"ఐయాం వెరీ సారీ.." నేనెంత సిగ్గుపడ్డానో, బాధపడ్డానో చెప్పడానికి మాటలే లేవు.
"నేనే సారీ..నేనట్లా చెయ్యనంటే చెయ్యనన్నాను, మీ వాళ్ళొప్పుకోలేదు. నీకు ఎప్పటికీ గుర్తుంటుందంటే...నేనూ గుర్తుంటాను కదా అని ఒప్పుకున్నాను.." అదే తేట మొహంతో భోళాగా చెప్పాడు.
బేగ్‌లో నుండి పులియోగర రైస్ తీసి డబ్బా నాకిచ్చాడు. రోజూ పెట్టినా తింటానని చెప్పేదాన్ని. ఆ రాత్రి దాని రుచి ఇంకా మధురంగా ఉంది.
...జరిగి పదేళ్ళు దాటిపోతున్నాయి. వాళ్ళు ఊహించినట్టే ఆ రాత్రిని తల్చుకోకుండా నా పుట్టినరోజెప్పుడూ పూర్తికాదు.