ఒక నిన్న

బయట ఇంకా పూర్తిగా చెదరని చీకటి. ఇంకా భంగమవని నిశ్శబ్దం. ఇంకా కురవని నల్లమబ్బు తునక. నన్ను పిలిచీ పిలిచీ అలసినట్టు, కూత ఆపేసిన బుల్లిపిట్టల అలికిడి. నిలువెల్లా ఊగుతోన్న నిటారు చెట్టు. రెండుకాళ్ళ మీద నిలబడి పచ్చిక కొసరుకుంటోన్న ఉడుతలు. చెంగున దూకి కనుమరుగవుతోన్న కుందేలు పిల్లలు. పొద్దున లేవగానే ఇక్కడికే వచ్చి నిలబడతాను. రాత్రి అలసటతో వదిలేసిన ఇల్లు గమనించుకోకుండా నేరుగా తలుపులు తీసి వీటినే చూస్తుండిపోతాను. అటుపైన లోపలికెళితే హాల్ నిండా బొమ్మలు, రంగు కాగితాలు. వంటింట్లో శుభ్రపడని గిన్నెలు. టేబుల్ మీద ఇంకా విప్పని బహుమతులు. గదిలో, సున్నాలా తెరచుకున్న నోటితో నాన్న మీదకో కాలు విసిరి పడుకున్న పిల్లాడు. ఊరికే నన్నొక ఉత్సాహం కెరటంలా తాకిపోతుంది. నిన్న ఇక్కడ ఈ ఇంట్లో సంతోషంగా మసలుకున్నామనడానికి గుర్తుగా ఇవన్నీ పడి ఉన్నాయనిపిస్తుంది. ఆనందంతో అలసిపోయి అలాగే నిద్రలోకి జారుకున్నామని గుర్తుచేస్తూ నిన్నటి సందళ్ళు తునకలై నా కళ్ళ ముందు ఆడుతున్నట్టుంటుంది. ఆఖరు నక్షత్రం కూడా ఆకాశంపు లోతుల్లోకి జారిపోయేదాకా లోపలికీ బయటకీ తిరుగాడుతూనే ఉంటాను. మెల్లగా వెలుగు పరుచుకుంటుంది. బుల్లిపిట్టల కువకువలు తగ్గి ఎక్కడో ఎవరో భళ్ళున తలుపులేసి బయటకు వెళ్తున్న చప్పుడు తెలుస్తుంది. అలవాటైన రొద లోకాన్ని ఆక్రమించుకుంటూ ఉంటుంది. నేను రహస్యంగా పోగేసుకున్న బలమేదో రోజంతా నాతో అదృశ్యంగా ఊసులాడుతూనే ఉంటుంది.

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...