అనుభవించడానికి మనసే మాత్రం సంసిద్ధపడని ఏకాంతం మనిషిని స్థిమితంగా నిలబడనీయదు. మనిషికి మనిషి ఎదురుపడే భాగ్యం లేని వేళల్లో మనం తెరవగలిదేల్లా హృదయపు తలుపులే.
ఉదయాన్నే వెలుతురునూ గాలినీ ఆహ్వానిస్తూ తెరలు పైకి లాగి గడియలు తీసినట్టు, పరాకుగానే మది తలుపులు తోశానీవేళ. తమ రెక్కల బలంతో కాలాన్నీ, దూరాన్నీ చెదరగొడుతూ, జ్ఞాపకాల పక్షులు కువకువలతో కళ్ళ ముందుకొచ్చాయి.
చుట్టూ ఏ అలికిడీ లేని నిర్జనప్రాంతంలో, నగరపు ఛాయలు వాలని చోట ఒంటరిగా ఉండేది మా పెద్దమ్మ ఇల్లు. అపార్ట్మెంట్‌లూ, చుట్టూ పెద్ద ఇళ్ళు కూడా లేని మారుమూల వీధి అది. తలెత్తి చూస్తే, ఏ అడ్డూ లేకుండా కనపడే ఆకాశపు నీలిమ. ఆ డాబా మీద, ఆ ఎలప్రాయంలో, సాయంసంధ్య కాంతులను త్రోసిరాజని మరీ పొదువుకున్న అక్షరాలు "నిర్వికల్ప సంగీతం"లోవి. ఆనాటి మైమరపులో గంటలు క్షణాలయ్యాయి. సుదూరాన నీలమణులు కెంపులయ్యాయి. ఆకు కదిలిన చప్పుడు తప్ప ఏదీ చెవిపడని ఏకాంతంలో ఆ గరుకుగచ్చు మీద అలౌకికానందంలో ఒక్కతెనూ నిలబడిపోవడం మాత్రం, ఆ రేయి చూసిన ఒంటరి నక్షత్రంలా హృదయాకాశంలో మిణుకుమిణుకుమంటూనే ఉంది. తొలిప్రేమానుభవం లాంటి జ్ఞాపకమది. దాన్ని దాటి మనమెంతదూరమైనా వెళ్ళాల్సిరావచ్చు, కానీ కంపించే హృదయాన్ని గుచ్చి, ప్రేమించేశక్తిని పరిచయం చేసిన అపురూపక్షణాలను మర్చిపోలేం.
చినవీరభద్రుడి వాల్ మీదకు తొంగిచూసినప్పుడల్లా, సముద్రంలోకి వెళ్ళిపడ్డ చేపపిల్ల తుళ్ళింతలా, నాలోనూ ఏదో సంబరం ననలెత్తుతుంది. పసిపిల్లలు ఉండుండీ ఇష్టంగా తడుముకుని హుషారు కొసరుకునే బొమ్మలప్రపంచంలా, ఆ వాల్ మీద నా ఉత్సాహాన్నీ, సంతోషాన్ని నిలిపిఉంచే నిధులేవో ఉంటాయి. వెళ్ళినప్రతిసారీ ఏ తలుపులూ లేకుండా నన్ను ఆహ్వానిస్తుంటాయి. ఆకాశంలో స్వర్ణకాంతుల ఉత్సవం కంటపడిన ప్రతిసారీ హృదయం మరికొంత తేటపడినట్టు, శుభ్రపడి బలపడినట్టు, వేకువలో ఆ వాల్‌ని అల్లుకుపోయే అక్షరాలను చూసినప్పుడల్లా తెరలుతెరలుగా హృదయానికి తేనెపూత. జీవితానుభవాలకు దోసిలి ఒగ్గి నిలబడగలిగే స్థైర్యం.
ప్రేమ మార్గం బహుఇరుకన్న కబీరూ...నువ్వీ తోటమాలి వికసింపజేసిన పూదోటలో నడిస్తే ఏమనేవాడివి?
No comments:
Post a Comment