ఉగాది అని కృష్ణారెడ్డి చిత్రరాజమొకటుంది. రూపాయ్‌పావలా పెట్టి బడి దగ్గర బడ్డీ కొట్లో సినిమాపాటల పుస్తకం కొని పాటలన్నీ బట్టీ కొట్టే రోజుల్లో ఒకనాడీ సినిమా నా కంటపడింది. మంచి కవిత్వమెట్లా ఉంటుందో తెలీని వయసులో, సినిమాపాటల్లో వెదుక్కు చూసుకున్న కవిత్వం పట్ల, నిజానికా రోజుల్లో నాకే ఫిర్యాదులూ ఉండేవి కాదు. "వాసంత సంగీతాలై, వయ్యార సంకేతాలై, తుమ్మెదను పిలిచేటి పూలై.." మొదలు, "వలపులు నీ దరి చేరుటెలా, మోహపు పడవలే చేర్చునులే" వరకూ అట్లా నేర్చిన పదాలెన్నో. ప్రేమించిన పాటలెన్నో.
ఒక సెలవు రోజెప్పుడో తీరి కూర్చుని, పెదాలనెంత సాగదీస్తే కళ్ళు లైలా కళ్ళలా మూతబడతాయో చూద్దామని, తలొంచుకుని పుస్తకంలోకి చూస్తూ "డేడీ...కథ వినవా చెప్తాను.." అని నవ్వుతూ పాడుకుంటున్నాను. ఉన్నట్టుండి తల నా ప్రమేయం లేకుండానే పుస్తకంలోకి దూరిపోయింది. ఏమైందో అర్థమయ్యేసరికి అక్షరాలు నక్షత్రాలయ్యాయి.
"ఆ పాటలో తండ్రి గొంతు ఏమందీ, మీరేమన్నారు..తకిటతకిటథా..." అందామనుకున్నాను కానీ అప్పటికి కింగ్ రిలీజ్ కాలేదు . ఈలోపే పక్క నుండి మా అక్క కొక్కిరింత వినపడేసరికి నా పసిమనసు అతలాకుతలమైపోయి అన్ని మాటలూ మర్చిపోయింది.
ఆయనలా పక్కకు తిరగ్గానే, "నిన్నటి దాకా తెలియని నొప్పి తలెత్తింది డేడీ.." నా తలెత్తి పట్టి రుద్దుతూ పకపకా నవ్విందది. అప్పుడే కాదు, ఆ తర్వాత చాలా రోజుల పాటు, అలవాటు కొద్దీ "ఏం కాదు, నాంగారు నా మాటే వింటారు" అని నేను జట్టు కలపగానే, వెనుక నుండి "ఆఁ ఆఁ వింటారు..బేబీ, చెప్పెయవా వింటానూ.." అని మరీ వింటారు అని వెక్కిరింపుకి దిగేది. నేను మన్నుదిన్న పాములా ముడుచుకుపోయేదాన్ని. అక్కల humiliation చెల్లెళ్ళకు పుట్టినప్పటి నుండి మామూలే. అదేమంత పట్టించుకోవాల్సిన విషయం కాదు. కానీ ఒకటో తారీఖు సాయంత్రం అమ్మకు బదులు నేను కాఫీ పెట్టేలా ఒప్పించేందుకు, నా ఆస్తంతా నీకే అని నానగారు తీర్మానించేప్పుడూ (అంటే ఎంతా అని ఎవరో రెట్టిస్తున్నారు! ఎంతుంటే అంతా!!), నెలాఖర్లో నా పుస్తకాలు వెదికేసి కొంచం అప్పివ్వు ప్లీజ్, తిరిగిస్తాగా అని నన్ను బతిమాలేందుకొచ్చినప్పుడూ, ఆనాటి అవమానాన్ని గుర్తు చేసి "జస్టిఫై" అని అడుగుతూనే ఉండేదాన్ని. ఆ అడగడంలో ఆ పల్చటి చవకరకం నల్లకాగితాల పాటల పుస్తకాన్ని పారేయకుండా దాచుకునేందుకు ఒప్పించుకున్నాను కూడా. అక్కా, నేనూ కోపాలు కొట్లాటలు లేకుండా సఖ్యంగా మాట్లాడుకునే వయసొచ్చాకా, ఈ పాట ప్రస్తావన వచ్చినప్పుడల్లా, కృష్ణారెడ్డి పాటలకే ఇలా బి.పి లు పెంచేసుకున్నారు, ఇహ వీళ్ళు కృష్ణవంశీ పాటలు వింటే ఏంటి పరిస్థితి అని బాఘా హాశ్చర్యపోయేవాళ్ళం.
అట్లా, నేను వదలకుండా దాచిన ఆ పుస్తకంలో, నన్నొదలని ఇంకో పాట కూడా ఉంది. అది "కాటుకపిట్టల మాదిరి కదిలే కన్నులు రెండు" అన్నది. ఆ పాట విన్నప్పుడల్లా నల్లగా ఉన్న రెండు గువ్వపిట్టలేవో అటూ ఇటూ బుడిబుడిగా నడుస్తున్న ఊహ లోపట మెదిలేది. ఆ పాట సాహిత్యం చూసినప్పుడల్లా, కాటుక పెట్టుకున్న కన్నుల నుండి చిందిపడే వెన్నెల గురించి రాశారనుకునేదాన్ని. "నల్లని కన్నుల వెన్నెల వల నిను అల్లుకోవచ్చు, మాటలకందని మూగసైగలతో మంత్రం వెయ్యచ్చు, నువు రాగానే రెప్పల రెక్కలు చాచి ఎగరవచ్చు.." ఇలా సాగుతుందా పాట. ఏళ్ళకేళ్ళు గడిచాక కూడా, కళ్ళ చుట్టూ దట్టంగా కాటుకనలదుకున్న అమ్మాయిలను చూసిన ప్రతిసారీ, "కాటుకపిట్టల మాదిరి.." అన్న కూనిరాగం నా పెదాలనల్లుకుపోయేది.
నిన్నామొన్నటి దాకా ఈ కాటుకపిట్ట అన్నది కాటుక కన్నులను పట్టిన కవి ఊహగా అనుకుంటూ వచ్చిన నాకు, అనుకోకుండా తారసపడిన ఒక పద్యంతో, "కాటుకపిట్ట" అని ఒక బుల్లిపిట్ట నిజంగా ఉందని కొత్తగా తెలిసింది. ఆ పిట్ట తోక పట్టుకు ముందు వెళితే ఇంకా తెలిసిందేమంటే, కొన్ని ప్రాంతాల్లో, శకున శాస్త్రాల్లో, ఈ కాటుకపిట్టను అదృష్టానికి ప్రతీకగా భావిస్తారని. బిసరుహము, అంటే పద్మం మీద వాలిన ఒక్క కాటుకపిట్టను చూసినా, ఆ చూసినవారికి చతురంగబలాధిపత్యం దక్కుతుందట. మహరాజయోగమన్నమాట. సంభోగం కోసం కాటుకపిట్టలు కూడిన చోట, మహానిధులుంటాయని ఒక నమ్మికట.
మామూలుగా కన్నులను మీనులతోటో, పద్మపురేకులతోటో పోల్చడం కద్దు. వాల్మీకి రామాయణంలో రాముడు పంపాతీరంలో వసంతఋతుశోభను చూస్తూ, ఆ వసంతగాలుల ధాటికి తన సీత, పద్మపలాశాక్షి, మృదుపూర్వాభిభాషిణి, ప్రాణాలు తనపై నిలుపుకున్న వివశ, విరహవేదనలో ఏమైపోతుందోనని విలవిల్లాడతాడు. ఆ సరస్సులోని ప్రతి పద్మమూ సీత ముఖాన్ని, వాటి రేకులు ఆమె కన్నులను, అక్కడి చిరుచేపలు ఆమె కనుపాప కదలికలనూ గుర్తుచేస్తున్నాయని సౌమిత్రితో చెప్పుకు బెంగపడతాడు.
కానీ, మొన్న నేను చదివిన పద్యంలో, ఆ ప్రియుడు ఇష్టసఖి ముఖాన్ని పద్మంతో పోల్చడం దగ్గర ఆగలేదు. ఆమెకన్నులను కాటుకపిట్టలన్నాడు. పద్మం మీద వాలిన ఒక్క కాటుకపిట్ట దర్శనానికే రాజభోగం కదా, మరిప్పుడు ఆమె ముఖమనే పద్మం మీద చేరిన పక్షిద్వయాన్ని చూస్తున్నాడు. ఇహ తనకు దొరకనున్న అనంత నిధులేమిటో, అందనున్న భోగభాగ్యాలేమిటో అని ఆత్రపడుతున్నాడీ రసికుడు. ఆమె హృదయసామ్రాజ్యమూ, ఆమె దాచిన గుప్తనిధులు, ఆమె కన్నులను (ల్లోకి..) చూసినంతనే సొంతమవుతాయని కాబోలు ఆశ!!
మహాకవి కాళిదాస పద్యానికి మేళ్ళచెర్పు భానుప్రసాదరావు గారి అందమైన, సరళమైన అనువాదం -
బిసరుహము మీద కాటుకపిట్ట జూడ
కల్గు చతురంగబలమధికంబుగాను
నీ ముఖాంబుజంబున గంటి నేడు నేత్ర
ఖంజన యుగమ్ము నా భాగ్యగరిమ నెరుగ!
కల్గు చతురంగబలమధికంబుగాను
నీ ముఖాంబుజంబున గంటి నేడు నేత్ర
ఖంజన యుగమ్ము నా భాగ్యగరిమ నెరుగ!
కాళిదాస శృంగార తిలకాన్ని అనువదించడంతో పాటు, ఉపయుక్తమైన అన్ని వివరాలతో గొప్ప వ్యాఖ్య కూడా అందించిన వీరి వసంత తిలకాన్ని చదువుతుంటే, ప్రత్యేకించి ఈ పిట్టలను జంటగా చూడాలన్న పై వివరాన్ని చదువుతుండగా స్పురించిన మరో ముచ్చట - పెళ్ళికి ముందు కొన్నాళ్ళు ఒక ఒరియా అమ్మాయితో ఫ్లాట్ షేర్ చేసుకునేదాన్ని. మా ఫ్లాట్ తొమ్మిదో అంతస్తులోనో పదో అంతస్తులోనో ఉండేది. అక్కడి నుండి చూస్తే కింద పచ్చటి తివాచీలా లాన్ కనపడుతూ ఉండేది. ఆ విశాలమైన లాన్‌కి అటువైపు వాకింగ్ ట్రాక్, ఇటువైపు గుండ్రటి సిమెంటు బెంచీల మీద ఫిక్స్ చేసిన కొన్ని కాలక్షేపం ఆటలూ (చైనీస్ చెకర్ లాంటివి..) ఉండేవి. ఆ ఆడుకునేవాళ్ళు తింటుండగా జారిపడినవో, కావాలనే పడేసినవో, ఏవైతేనేం, గడ్డి మీద వాలిన పక్షులు ఆ తినుబండారాల తునకల కోసంకొంచం కొంచంగా గంతులేస్తూ వచ్చి, వాటిని ముక్కుతో ఎత్తుకుపోయి ఇంకెక్కడో కూలబడి తింటూండేవి. నా ఒరియా స్నేహితురాలు పొరబాటున బాల్కనీలోకి వచ్చిందా, ఈ పిట్టల వైపు వెదుక్కుని మరీ చూసేది. రెండూ కనపడితే సరే, ఒకటే కనపడితే మాత్రం సర్వం మరిచినట్టు కిందకి పరుగెత్తేది. ఆ రెండో పిట్టను ఎలాగైనా దొరకబట్టి, దాన్ని తరుముకుంటూ మొదటిపిట్ట దగ్గరకు చేర్చి కానీ ఊరుకునేది కాదు. కాబ్ కోసం ఒక్క నిముషం ముందు దిగాలంటే, ఈ అమ్మాయి పిట్టల వెనుక పడి పోయి ఎక్కడాలస్యం చేస్తుందోనని నాకు ఒకటే గాభరాగా ఉండేది. వాటిని జంటగా చూసి "లక్ ఈజ్ మైన్" అని తన జబ్బ తానే చరుచుకోవడమూ, నేనేమైనా వేళాకోళం మాటనబోతే "కిక్ ఈజ్ యువర్స్" అని నన్నొక్క తన్ను తన్నడమూ అలవాటామెకు. ఉత్తపుణ్యానికి వచ్చి పడే నిధుల మీద నాకాశ లేదు కానీ, పిట్టలను జతచేర్చడంలో నా స్నేహితురాలి సంబరం దానికదే చూడముచ్చటగా ఉండేది. ఏనాటి కవిత్వంలోనో ఇంత సౌందర్యభరితంగా మెరిసిన ఒక నమ్మకం, ఈనాటికీ మిగిలుంది అని గుర్తు చేసుకుంటే - అంతే కదా, కవిత్వమంటే పదసంపదేనా, కవి సంస్కారమూ, కవి బ్రతికిన దేశపు సంస్కృతీ కూడా అనిపించి చిన్న గగుర్పాటు. కవులేం పరాయులా, వాళ్ళు మనవాళ్ళు.
మీరు వ్రాసే పోస్టులు ఒక పట్టాన అర్ధం కావు. తీరిగ్గా కూర్చుని ఆరా తీస్తే ఇలాంటి పోస్టులెన్నో వ్రాయవచ్చు. ఈ పోస్టు అర్ధం అయింది, బాగావ్రాసారండీ.
ReplyDelete>>కవిత్వమంటే పదసంపదేనా, కవి సంస్కారమూ, కవి బ్రతికిన దేశపు సంస్కృతీ కూడా అనిపించి చిన్న గగుర్పాటు. కవులేం పరాయులా, వాళ్ళు మనవాళ్ళు.>>>