ఈ రోజు లైబ్రరీ దగ్గర పుస్తకాలేవో తిరిగిచ్చెయ్యడానికి ఆగితే, ఈ దేశం మనిషొకతను పలకరించాడు. న్యూయార్క్ నుండి మాస్ కి వచ్చి నాలుగు నెలలే అవుతోందనీ, ఇక్కడ కంటే అక్కడే బాగుంటుందనీ ఏదో చెబుతున్నాడు. నేను ఇండియా నుండి వచ్చానా అని కనుక్కుని సౌతా, నార్తా, బొంబాయి తెలుసా? గుజరాతీ వాళ్ళు తెలుసా..ఇలా మన ముచ్చట్లన్నీ తెలిసినట్టు ప్రశ్నలడుగుతుంటే ఆశ్చర్యంగా సమాధానం చెబుతున్నాను. న్యూయార్క్‌లోని అతని స్నేహితులు కనీసం మూణ్ణాలుగు భాషల్లో అలవోకగా మాట్లాడేస్తారనీ, తనకు అమ్మ స్పానిష్ అయినా ఆ భాష సరిగ్గా మాట్లాడేంత రాలేదనీ, తానిక్కడే పుట్టి పెరిగినా రంగు చూసి ఎవరూ అమెరికన్ అనుకోరనీ భోళాగా చెప్పుకుపోతున్నాడు. ఈ సంభాషణేమీ పట్టనట్టు తలొంచుకు నడుస్తున్నాడు నా పిల్లాడు.
అతను వంగి పిల్లాడికొక Fist bump ఇచ్చి పేరడిగాడు. వీడు ఎప్పటిలాగే మొకం ఒక్కటే బయటపెడుతూ నా వెనుక దాక్కున్నాడు. నేను పక్కకి తొలగబోతే చెయ్యి పట్టి గుంజి, `Franklin అని చెప్పనా?` అని అడిగాడు. గుసగుసలాడకూడదట్లా..అని బుజ్జగించి ఎదుటి మనిషికి ఆ పేరు, దాని కథ చెప్పబోయాను. అతనింతలోనే కళ్ళింతింత చేసి..is it that cute little turtle, oh I love it too.. అనగానే ముడుచుకున్న వీడి ముఖం విప్పారిపోయింది. మెల్లగా ముందుకొచ్చి నిలబడ్డాడు. అతనా తర్వాత కూడా ఒకట్రెండు మాటలు మాట్లాడి, వెళ్తూ వెళ్తూ మా వాడితో bye bye Franklin, I am your Beaver అని చేతులూపాడు.
లైబ్రరీ గేటు నుండి అతని కార్ దాకా..మహా అయితే మాదంతా మూడు నిముషాల నడక. ఉవ్వెత్తున లేచిన సంతోషపు కెరటం మా వాడి ముఖంలో అలాగే..బడికెళ్ళేదాకా..!
#Joy of small things