దూరపుమిత్రుడు

2005 లో, మా అక్క బావా వాళ్ళకు పెళ్ళవగానే, కలిసి నాకిచ్చిన మొట్టమొదటి గిఫ్ట్ ఒక బుజ్జి నోకియా ఫోన్. ఎంత అపురూపంగా చూసుకునేదాన్నో ! ఫోన్ నంబర్ అడగని వాడు పాపి ! (మాధవ్ గారి మాటలు అప్పు తెచ్చుకుంటే, అడిగినవాడు అర్భకుడు ) బస్‌స్టాపుల్లో నిలబడి తోచట్లేదనీ, ఇంటర్వ్యూకి వెళుతున్నాం నువ్వో నాలుగు ప్రశ్నలడుగూ అనీ, రిలీజ్‌లు, డెప్లాయ్మెంట్‌లూ వీకెండ్ లో ఒక్కరం చేస్తున్నాం కంపెనీ ఇమ్మనీ, బంగాళాదుంప కూర చేస్తుంటే గుర్తొచ్చాననీ, పాట పాడమనీ, ఉత్తికే మాట్లాడమనీ, నా ఫ్రెండ్స్ ఎడాపెడా ఫోన్ చేసేవారు. నా నంబరుకి ఫ్రీ డయల్ పెట్టించుకున్న నేస్తాల లెక్కా తక్కువేం కాదు. టైం వేస్ట్ అన్నా, ఇంకోటన్నా, ఎవ్వరేమనుకున్నా నాకు పట్టేదే కాదు. ఇష్టంగానే ఉండేది. పంతొమ్మిదేళ్ళు గూట్లో గువ్వపిట్టలా పెరిగిన నాకు, రెక్కలొచ్చాక ఆకాశమంత స్వేచ్ఛనిచ్చిన నేస్తం ఫోన్. బస్‌స్టాప్‌లో వాడి ముఖం వీడి ముఖం చూసి భయపడకుండా ఫోన్ పట్టుకుని హాయిగా నా లోకంలో నేనుండేదాన్ని. లంచ్ బ్రేక్‌లో ఒక్కదాన్నీ టేబుల్ ముందు కూర్చోవాల్సి వస్తే, మెసేజ్‌లు చూసుకుంటూ పక్కనొకరునట్టే తిని వెళ్ళిపోయేదాన్ని. కూకట్‌పల్లి చీకటి రోడ్లలో స్పీకర్‌లో మాట్లాడుతూ నడిస్తే, నాతో ఇంకో మనిషి నడిచినంత అండగా ఉండేది. రూంలో హరితా నేనూ కూర్చుని ఇద్దరికీ స్నేహితులైన వాళ్ళతో తగాదాపడుతుంటే, మా బేచ్ మొత్తం ఒకే చోట లేదన్న దిగులే ఉండేది కాదు. పొద్దున్నే వచ్చే గుడ్ మార్ణింగ్ మెసేజ్ నాకు ఒక్కటంటే ఒక్కరోజు కూడా విసుగు పుట్టించేది కాదు. అది నాది. నాకోసం ఎవరో 13 సార్లు కీ పేడ్ నొక్కితే వచ్చిన మెసేజ్ అది. నాకిష్టం లేకపోవడమెందుకు!
లెక్క గుర్తు లేదు కానీ, ఒక అంకె దాటాక, స్పేస్ లేక చివరి మెసేజ్‌లు డిలీట్ చేసేసేది నోకియా. ఇష్టమైనవి డ్రాఫ్ట్స్‌లో పెట్టేదాన్ని. అతి ముఖ్యమన స్నేహితులనే మెసేజ్ పంపమని చెప్పి మిగతావాళ్ళకి ఫోన్ మాత్రమే అని హుకుం జారీ చేసేదాన్ని. ఒప్పుకునేవాళ్ళు. స్పేస్ ఎక్కువ ఉంటే ఎవ్వరికీ కాదని చెప్పక్కర్లేదబ్బా అనుకునేదాన్ని. కొన్నాళ్ళకు అవీ వచ్చాయి. కొత్త బిజినెస్ ప్లాన్ చేస్తున్నాం, నువ్వూ కలవాలి అని దేశం కాని దేశంలో ఉన్న నాకు, కొత్త ఫోన్ తో సహా ఆఫర్ పంపాడో మిత్రుడు. అది 3 జి వచ్చిన కొత్తలో అనుకుంటాను. మెయిల్స్, గ్రూప్స్, ఇంటర్నేషనల్ కాల్స్, జి.టాక్స్. వీడియో కాల్స్, ఆడియో వీడియో రికార్డింగ్..ఎన్నని!
పాటలు నేర్చుకుంటూ ఫోన్ లో రికార్డ్ చేద్దామనేది చందనా. పొద్దునే అలారం సౌండ్ నచ్చట్లేదని, నువ్వు నన్ను లేపవా అని రికార్డ్ చేసుకుని నా మాటలే అలారం గా పెట్టుకుంది నీలిమ. పాతిక దాటని ప్రాయం ఎన్ని వేషాలేస్తుందో, అన్నీ దాచుకునేందుకు దొరికిన మేజిక్‌బాక్స్లా భద్రంగా దాచుకునేవాళ్ళం ఫోన్‌ని. ఫుకెట్‌లో బీచ్ ఫొటో హోంస్క్రీన్ మీద పెట్టుకుని - నచ్చినప్పుడల్లా సముద్రపు గాలులు పీల్చుకునేదాన్ని. "తుంసే అచ్ఛా కౌన్ హైన్.." అంటూ చెవిలో తీయగా పాడుతుంటే, నిజమనుకుని అట్లానే హాయిగా మసలుకునేదాన్ని! నచ్చిన పాటలు, నచ్చే జ్ఞాపకాలు, అసలు మనకేం కావాలంటే అదే గుప్పెట్లో ఉంచే మంత్రదండమది.
"పిల్లా..ఆకలేస్తోందీ..నీకొచ్చిన కూరే చెయ్..ప్లీజ్. వంక పెట్టను." అని రూంమేట్ మెసేజ్ చేస్తే ఎక్కడలేని హుషారూ తోసుకొచ్చేది. "ఇంకెప్పుడూ ఇలా చెయ్యను. ప్రామిస్. నిజంగా.." అన్న అక్షరాలు చూస్తే కళ్ళల్లో నీళ్ళూరి కోపాలన్నీ కరిగిపోయేవి. "కుడి వైపు తిరుగు." అని ఉన్నట్టుండి ఫోన్ బజ్జుమంటే ముఖంలో వేయి పున్నముల వెలుగు - దాచలేకపోయేదాన్ని. వేయి ఫోల్డర్ ల పాత్ అయినా, ఎంత చిత్రమైన స్క్రిప్ట్ పేరైనా, నాలుక చివర దాచుకున్న టీం-మేట్స్ కాల్‌లో ప్రాసెస్ చెప్తుంటే గుడ్డిగా రన్ చేసి దేవుడికి కొబ్బరికాయలు కొట్టుకున్న రాత్రిళ్ళు కోకొల్లలు.
మిస్డ్ కాల్ వస్తే ఎన్ని జతల కళ్ళు కుతూహలంగా చూసేవీ! మరి?!
మిస్డ్ కాల్ అంటే ఎవరో "ఐలవ్యూ" అన్నట్టు, "నువ్వే గుర్తొస్తున్నావ్.." అని గారాలు పోతున్నట్టు. "నువ్వే కాల్ చెయ్ పందీ.." అని తిట్టినట్టు. "రీచార్జ్ చేయించు, రేపిచ్చేస్తాను" అని బతిమాలినట్టు. ఇంకొక్క నిముషం చూసి వెళ్ళిపోతానని బెదిరించినట్టు. నీ కోసమే చేశానని చెప్పే ధైర్యం లేనివాణ్ణి పట్టిచ్చినట్టు. అన్నీ అర్థమయ్యేవి. ఎవ్వరెప్పుడు ఎలా చెబితే, అలాగే అర్థమయ్యేది.
ముఖం మీద ఈ జన్మకి చెప్పలేని మాటలు, ఫోన్‌లో ఏమీ చెప్పకుండానే చేరిపోయేవి. కాల్ కట్ చేయడమెంత సీక్రెట్ సీక్రెట్ వ్యవహారం..
"నోరెత్తకసలు. జస్ట్ షటప్!" ." "ఇప్పుడే ఓ నిముషం దొరికి నిద్ద్రపోతున్నా, చంపేస్తా మళ్ళీ చేసావంటే!" "పక్కనే ఉంది..మాట్లాడే వీల్లేదు." "అరిచి గీపెట్టినా నువ్వంటే నాకు లెక్కలేదు" "ఇప్పుడు కాదు, నేనే చేస్తాను" ఎత్తకుండానే ఎన్ని చెప్పచ్చు. మొహం చాటేసుకుని ఎన్ని తిట్టచ్చు.
*
ఆడియో వీడియో కాల్స్. పంచుకోవాల్సిన ఎన్ని తొలితొలి క్షణాలు చేజారిపోయేవివి లేకుంటే!
"మనం వాయించిందే..ఎంత బాగా వచ్చిందో కదా. ఒక్క స్వరం తప్పు పోలే.."
"దేనికి భయం! రెండు గంటల్లో వచ్చేస్తాను. చెకిన్ కూడా అయిపోయింది..ఫేస్టైం?"
"పది రోజులూ నువ్వు నాకు కనపడాలి. వర్క్ పేరెత్తకు. పగలా రాత్రా? ఏ టైం చెప్పు?"
"ఒరేయ్ చెప్పరా నిన్న నేర్చుకున్న పద్యం. ఎవ్వనిచే జనించు.. అమ్మమ్మా...."
"హేపీ బత్ డే..తాతగారూ.. నా దగ్గరికి ఎప్పుడొస్తారూ..?"
*
చూడందే నమ్మలేని ఎన్ని ఉద్వేగాలు చూసేలా చేసిందీ ఫోన్. చూస్తే కానీ చెరిగిపోని ఎన్ని అపనమ్మకాలను ఉఫ్ఫ్ఫ్ మంటూ ఊదేసి చూపించిందీ! ఎన్ని దూరాలు చెరిపింది. చేతిలో ఉన్నది ఫోనా, మరొకరి ముఖమా అన్నట్టు, ఎంత ఒదిగి ఒదిగి చూశా ఆ మూడో కంటిలోకి!
"నాన్సెన్స్! ఎలా ఉంటే అలాగే కనపడు. ఐ జస్ట్ వాంటూ సీయూ ఫర్ యె సెకండ్.."
"డోంట్ వర్రీ..హి ఈజ్ జస్ట్ ఫైన్. ప్లేయింగ్ విత్ అదర్ కిడ్స్ నౌ"
"అమ్మవారు వచ్చి కూర్చునట్టే చక్కగా ఉంది అలంకారం...చామంతులు కూడా దొరుకుతున్నాయా అక్కడ? అన్ని ప్రసాదాలు ఒక్కతివే చేశావా? వాడేమన్నా సాయంచేశాడా ఇంతకీ?"
"ఆగు, అందరూ జాయిన్ అవ్వనీ కాల్. అప్పుడే అరవకు. ష్ష్ష్....వెయిట్..!! వెయిట్. వాడింకా రాలేదు."
"ఎక్కడ? వెనక్కి తిప్పు..కొంచం పక్కకి...అది వాపు కాదే బలుపు. కాస్త ఎకర్సైజ్ చెయ్! అదే తగ్గుతుంది. ఇంతోటి దానికి మళ్ళీ మందులా? నీకు పని లేదూ, నాకు బుద్ధి లేదు"
"వేద రాసింది. నా కోసం. ఎలా ఉందే? నీక్కాక ఇంకెవరికి చూపించను? "
*
ఎంత దూరంలో ఉన్నా "డెలివర్డ్" అని చూడగానే దొరికే దగ్గరితనం మీద ఆశ. స్క్రీన్ నిండా కనపడి 'హాయ్' అంటే దొరికే నిశ్చింత మీద ఆశ. మాప్‌లు అప్డేట్ అవుతూ ఉంటే, దారితప్పమన్న ఆశ. గ్రూప్‌లో కలిపారంటే, మనవాళ్ళ మధ్యలోనే ఉన్నాం లెమ్మన్న భరోసా. లంచ్ టైం లో మోగే మెసేజ్ చప్పుడు, స్టార్టింగ్ అని చూపెడుతూ సాయత్రం అదిరే ఫోన్, ఇండియాలో తెల్లారుతూనే నాకు రాత్రైపోకూడదని మోగే కాల్ - వెన్నులో వణుకు పుట్టించే ఇంత పెద్ద ప్రపంచంలో వెచ్చగా దగ్గరకు లాక్కునేవి ఈ చిట్టిచిట్టి శబ్దాలే.
కానీ, ఎప్పుడో ఎక్కడో లింక్ తెగిపోయింది. ఎక్కడా అన్నది చెప్పలేను. ఎందుకో నిజంగానే సరిగ్గా గుర్తు లేదు. వాల్‌మార్ట్‌లో ట్రాలీలోని పిల్లాడు "నాన్నా..నాన్నా.." అని ఆపకుండా పిలుస్తోన్నా ఫోన్‌లో మునిగిపోయిన తండ్రి తలతిప్పకపోవడం చూసినప్పుడేమో..న్యూయార్క్ రోడ్ల మీద సెల్ఫీ తీస్తూ పిల్ల నవ్వట్లేదని, నిన్నిక్కడే వదిలేసి వెళ్ళిపోతానని ఒక చింతాకు కళ్ళ చిన్నది బెదిరిస్తే కళ్ళు తుడుచుకుని నవ్విన నాలుగేళ్ళ పసిదాన్ని చూశాకేమో. రెస్టారెంట్‌లో ఆర్డర్ చెప్పి ఎవరి ఫోన్ వాళ్ళు చూసుకుంటూ మురుస్తున్న భార్యాభర్తలను చూసాకేమో. బెస్ట్‌ఫ్రెండ్ కి మొదటి పాప పుట్టిందని గ్రూప్ మెసేజ్‌లో చదివాకేమో. రోడ్డు మీద వీడియో కాల్ మాట్లాడుతూ, అమ్మను సిగ్నల్ దగ్గర వదిలేసి వెళ్ళిన ఇండియన్ కొడుకుని చూశాకేమో. ఆవిడ పిలిచే ప్రయత్నం చెయ్యకుండా ఖాళీ కళ్ళతో నిలబడిపోయినప్పుడేమో. పిల్లాడికి ఈవినింగ్ స్నాక్ పెట్టడం మర్చిపోయి నేను కాలక్షేపం చేసిన రోజేమో. ఫార్వర్డ్‌లతో నిండిపోయి ఉన్న సొంత మనుషుల విండోలు గమనించుకున్నప్పుడేమో. అతిప్రేమ పొంగిన అపరిచితుల విండోలో. అసందర్భ ప్రేలాపనలో. బాత్రూంలలోకి పట్టుకెళ్ళిన ఫోన్‌లు మళ్ళీ డైనింగ్ టేబుల్ మీద చూస్తున్నప్పుడో. జారిపడ్డ వస్తువుని అందిస్తే, థాంక్స్ చెప్పకుండా ఫోన్‌లో మాట్లాడుతూ వెళ్ళిన అబ్బాయిని చూసినప్పుడో. లోకల్ ట్రైన్‌లో వికలాంగులకు కేటాయించిన సీట్‌లో యియర్ ఫోన్స్ పెట్టుకు కూర్చుని, అవసరమైనా లేవని పెద్దమనిషిని చూసినప్పుడో. బంధువులూ అపరిచితులూ కాని వాళ్ళ లెక్కలోకొచ్చే వాళ్ళింటికెళ్ళి, వాళ్ళ పిల్లలను వీడియోగేం నుండి బయటకు లాగాలని ప్రయత్నించి భంగపడినప్పుడో. ఇంటికి పిలిచిన వాళ్ళు ఫోన్‌లో పాటలు పెట్టి 'ఇంకేంటి సంగతులు..' అని రెట్టించినప్పుడో. మంచినీళ్ళ కన్నా ముందు వైఫై పాస్వర్డ్ ఇచ్చినప్పుడో. ఇచ్చి నవ్వినప్పుడో. "ఎలా ఉన్నావ్?" అన్న ప్రశ్నకు ఎవ్వరైనా ఫోన్‌లో ఫొటోలతోనే జవాబు చెప్పడం చూసినప్పుడో..గుంపులు గుంపులుగా మనుషులు. వాళ్ళ అరచేతుల్లో ఆరని వెలుగులు. అందరూ మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడాలనే అనుకుంటారు, మంచివాళ్ళే అయి ఉంటారు - కానీ రెండోవాళ్ళు పక్కనుండకూడదు. దూరాలు దగ్గరయ్యీ, దగ్గరితనం దూరమయ్యే రోజుల్లో...
*

పునరపి

పండుగ హడావిడంతా మెల్లిగా సర్దుమణుగుతోంది. సెలవలు, పొడిగించుకున్న సెలవులు, అన్నీ పూర్తయ్యి ఒక్కొక్కరుగా ఇళ్ళు చేరుతున్నారు. మనుష్యుల అలికిడి తెలిసిపోతోంది. పార్కింగ్‌లో కార్లు నిండుగా కనపడుతున్నాయి. చాలా రోజుల తర్వాత ఇల్లు చేరాకా ఉండే మొక్కుబడి పనులన్నీ పూర్తయ్యి, మళ్ళీ జీవితం గాడిలో పడుతున్నట్టే ఉంది.
పొద్దున లేస్తూనే "పెదనాన్నను మనింటికి తెచ్చేసుకుందాం" అన్నాడు ప్రహ్లాద్. వాడు చెబుతున్నదర్థమవుతూనే నా ముఖం విప్పారింది. వాడిక్కావలసినది పెదనాన్న కొడుకు. వీడి అన్న. ఇంటికి చేరి పది రోజులు దాటిపోతున్నా గుర్తు చేసుకుంటున్న వాడిని చూస్తే ఏవిటేవిటో ఆలోచనలు. సూదిమొనలా అప్పుడప్పుడూ గుచ్చే అమెరికా జీవితపు నొప్పి.
బాగా చిన్నపిల్లగా ఉన్నప్పుడు, 'పసిడి రెక్కల పైన కాలం ఎగిరిపోతుంద'న్న ఎరుక లేనప్పుడు, మేనత్త కుటుంబం మా ఇంటికి వస్తుందంటే ఇలాగే వేయి కళ్ళతో ఎదురు చూసేదాన్ని. ఒక పెద్ద అంబాసిడర్ కారులో బిలబిలమంటూ వచ్చేవాళ్ళు ఆ ఇంటిల్లిపాదీ. అత్తయ్యా మామయ్యా నలుగురు పిల్లలూ. వాళ్ళొచ్చేందుకు నెల రోజుల ముందు నుండే ఇంట్లో వాళ్ళ తాలూకు కబుర్లతో సందడి మొదలైపోయి ఉండేది. మా అత్తయ్య జామచెట్టు గడ నాన్నగారి తల మీదకు జార్చితే రక్తం బొటబొటా కారిపోవడమూ, వయసుకు తప్పని కుతూహలాలతో వాళ్ళు మొదటిసారి ఏ ఆకుల చుట్టో నోట్లో పెట్టుకున్నారని తెలిసి ఎవరికీ పట్టుబడకుండా ఆపేందుకు, మా అత్తయ్య పెరడులోకి లాక్కెళ్ళి జామాకులు నమిలించడమూ, కిష్టలో ఆటలూ, చదువులు మానేసి వాళ్ళు తోటల్లో తిరుగుతూ చేసిన అల్లర్లూ, కళ్ళింతలు చేసుకుని వింటూ ఉండేదాన్ని.
వాళ్ళు రావడమూ, నాలుగు రోజులు నాలుగు నిముషాల్లా గడిచి వెళ్ళే ఘడియ రావడమూ చకచకా జరిగిపోయేవి. కారు వీధి చివరి మలుపు తిరిగేదాకా భుజాలు నొప్పెట్టేలా వీడ్కోలిచ్చి, అందరూ తిరిగి వాళ్ళ వాళ్ళ పనుల్లో పడేవారు. అడిగడిగి చెప్పించుకున్న ముచ్చట్లు పెంచిన అపేక్షతో, దిగులుగా నేనొక్కదాన్నే ఇంటి ముందరున్న ఓ రోలు దగ్గర కూర్చుండిపోయేదాన్ని. ఎంత దుఃఖంగానో ఉండేది. అది చెప్పడానికే కాదు, ఊహించడానిక్కూడా ఇప్పుడు చేతకావట్లేదు. ఇంట్లో అందరూ ఒక్కొక్కరిగా వచ్చి, పిలిచి, మాట వినని నాతో విసిగి వెనుతిరిగిపోయేవారు. నేను మాత్రం, అలాగే, ఆ ఇంటి ముందే కూర్చుని, ఆ కార్ వెనక్కి తిరిగి వచ్చెయ్యాలని కోరుకుంటూ ఉండేదాన్ని. ఎదురుచూసీ, చూసీ, చూసీ, - ఏడుపు తగ్గి ఊరికే ఏవో ఆటలాడుకుంటూ నేనింకా అక్కడే ఉండగానే, చిత్రంగా, వాళ్ళ కార్ వెనకొచ్చేది. 
ఏదో మర్చిపోయామనో, ఆ కార్‌కి ఏదో ఇబ్బందైందనో...వెనక్కు వచ్చి, కాసేపు ఉండి, లేదా ఆ రాత్రికి ఉండి, వెళ్ళిపోయేవారు.
నా కోరికకే కారు వెనక్కు వచ్చినదని నా పసిమనసు నమ్మకం. కాదనే ధైర్యం అప్పటికెవ్వరికీ లేదు మరి.
*
వచ్చిన కార్ మళ్ళీ వెళ్ళిపోతుందని తెలిసిన నేను, ఇప్పుడు ఊరడింపుగా నా పిల్లాడికి ఏం చెప్పగలను?
*

వ్యాపకం

పరాయిపరాయిగానే ఉంటాం
ఒకే క్షేత్రంలో వేసిన విత్తులు కూడా
వేటికవే మొలకెత్తి పెరుగుతున్నట్టు
విడివిడిగా ఉంటాం,
పోలిక లేని బ్రతుకుల్లో
పోలిక వెదుక్కునే తీరిక లేని పరుగుల్లో
ఎటు నుండో ఓ గాలి వీస్తుంది
నీకూ నాకూ తెలిసిన పరిమళమేదో మోసుకుంటూ,
నీకూ నాకూ అర్థమయ్యే మాటలన్నీ మోసుకొస్తూ
ఊపిరాడుతుంది
తెరిపిగా ఉంటుంది
దారులు కలవ్వు కానీ
దగ్గరితనం తెలుస్తుంది
ముందడుగు ఎవరిదో
హద్దులేదిక్కు నుండి చెదురుతున్నాయో
ఎవరు చూడొచ్చారు ?
విచ్చుకోవడం విస్తరించడం
వ్యాపకాలయ్యాక...

రేణువులు

తప్తదేహాలను తడిపీ చల్లార్చీ
ఒడ్డుకు విసిరిన రోజు వీడ్కోలన్నాక,
మిణుకుమిణుకుమంటూ
చుట్టూ కొంత నక్షత్రకాంతి
మేఘాలు వెళుతూ జారవిడిచిన విశ్రాంతి
అలలపై తేలియాడి తీరాన్ని తాకే మౌనం.
గవ్వల్లో చిక్కుకుని
ఎలా విదిల్చినా రాలిపడని రేణువుల్లా
గుండెల్లో సర్దుకుని
కాలం ఎటు విసిరినా వేరుపడని క్షణాలు...

వ్యవధి లేదు

“ఆరు గడియలలో తల్లియనుట తెలియు..ఆరు నెలలు బై తండ్రియనుట తెలియుననుట నిజమే, శిశువు రాజహస్తమందు నేడ్చి కౌసల్య హస్తమందు నేడ్పుమానె" - కల్పవృక్షం, విశ్వనాథ.

బుజ్జాయి నీ చేతుల్లోనూ అలా ఏడ్చి ఉంటే, నిన్ను తెలుసుకోవడానికి వాడికి ఆరు నెలల కాలం పట్టే ఉంటే, నేనిప్పుడు ఈ మాటలన్నీ రాయాల్సిన అవసరమే ఉండేది కాదు.

మత్తు వదలని నా చెవులకు వినపడేలా, పుట్టీ పుట్టగానే కేర్ర్ర్....మంటూ గాఠి కంఠంతో ఏడ్చిన పసి గొంతు, ఇప్పుడు తల్చుకున్నా ఒళ్ళంతా ఓ క్షణం మొద్దుబారినట్టవుతుంది. "మగపిల్లాడు మానసా.." అని డాక్టరు చెంప తట్టి చెప్పడం కలలా గుర్తుంది. అంతే... ఆ క్షణంలో వాణ్ణి నేను చూడనే లేదు..చూసిన క్షణానికి ఎన్ని గడియలయ్యాయో చెప్పడానికి, అమ్మ మనసు లెక్కలు లోకానికర్థం కావు. అయినా ఆ చూసిన క్షణానికన్నా ముందు నుండే, ఎన్నో నెలల ముందు నుండే, ఏళ్ళ నుండీ, జన్మల నుండీ వాడు నావాడేనన్నంత వెర్రి ప్రేమ మగతలా కమ్ముకుని అక్కర్లేని జ్ఞాపకాలన్నీ, లెక్కలన్నీ చెరిపేసింది.

ప్రేమ బలం అనుభవం నుండి పుడుతుందా? ఆలోచన నుండా? తరచి చూసుకునే వ్యవధేదీ?

నేను అమ్మనై వాణ్ణి అల్లుకున్న క్షణమేదో గుర్తు లేదు కానీ, నువ్వు నాన్నలా వాణ్ణి చుట్టుకున్న తొలిక్షణం మాత్రం కళ్ళారా చూశాను.

ఎన్.ఐ.సి.యు లోకి బ్లూ డ్రస్, గ్లోవ్స్, ముక్కు చుట్టూ మాస్క్ కట్టుకుని, నా కోసం వేగం మందగించిన అడుగులేస్తూ, నా అరచేయిని వదలకుండా నడిపించుకెళ్ళావా? మత్తుగా నిదరోతున్న బుజ్జాయి తొట్టెను నీకు చూపించగానే నా చేయి వదిలేశావ్. రెండు చేతులు సరిపోనట్టు, చూపులతో వాడిని తడుముకున్న ఆత్రంలో చూశాను..నాన్నగా పుట్టిన నిన్ను. కొత్త స్పర్శకు ఉలిక్కిపడి కదిలిన బుజ్జాయిని ఇంకా అపురూపంగా దగ్గరకు హత్తుకుని, వాడికీ నీకూ అర్థమయ్యే కొత్త భాషకు అక్షరాలు సృష్టించుకున్నావ్. వాడి మీద నుండి మరలి నా కళ్ళల్లోకి చూసిన నీ చూపుల్లో, ఈ భాగ్యమంతా ఇకపైన మనిద్దరిదీ అని చెప్పకనే చెప్పిన నీ మనసు తెలిసిందనుకో. అరచేతిలో అంతక్రితం దోగాడిన ఖాళీతనమంతా, నీ కళ్ళలో ఉబికిన సంతోషానికి తుడిచిపెట్టుకుపోయాక, ఎన్నడూ నా ఛాయలకు రాని గర్వం ఆ క్షణంలో నన్ను చుట్టుముట్టి ఉక్కిబిక్కిరి చేసిందని నీకెప్పుడైనా చెప్పానా?

నీ ఆఫీసు పని. నీ ఆలస్యపు నిద్ర. అర్థ రాత్రిళ్ళు మెలకువ వస్తే, స్క్రిప్ట్ స్టేటస్ చూసుకుని మళ్ళీ రన్ ఫైర్ చెయ్యడం తప్పనిసరిగా మార్చిన ఉద్యోగం. ఏ అర్థరాత్రో రెప్పలను గుచ్చే వెలుగుకి నేను కళ్ళు తెరిస్తే, నలుపూ తెలుపుల యునిక్స్ స్క్రీన్ - బ్లింక్ అయే కర్సర్. "ప్చ్..." విసుగ్గా అటు తిరిగి ఒత్తిగిలి పడుకుంటే "వన్ మినిట్..ఆల్మోస్ట్ డన్.." అని నువ్ ఠాప్ మని లేప్‌టాప్ మూసేసిన శబ్దం. ఎక్కడికి పోయాయ్ ఆ నిన్నలన్నీ? నా కోపానికేముంది, నీ గారపు చూపుల మెత్తదనానికే వీగిపోయేది. కానీ పిల్లాడి కోపమంటే ఇంత తేలిక కాదని తేలిగ్గానే తెలిసిందిగా? మొదలెట్టాడా ఇక ఆరున్నొక్క రాగమే. గదిలో లాప్‌టాప్ పెట్టే నీ ధైర్యాన్ని పుడుతూనే వాడి విడవని గుప్పెట్లో నలిపి విసిరేశాడు. దుప్పటి అంచు కదిలినా ఊరుకోని మహాయోగి కదా వాడప్పుడు! నువ్ పిల్లిలా లేచి హాల్‌లోకి వెళ్ళబోయినా, వాడికి తెలిసిపోయేది. ఎవరి తప్పుకు వాళ్ళే బాధ్యులని తప్పుకు పడుకునేదాన్ని నేను. నీకిక తప్పక వాణ్ణి మోచేతి వొంపులోకి పొదువుకునేవాడివి. నడిరాతిరి లాలిపాటలు పాడేవాడివి, పక్క గదిలో నుండి మీ అమ్మా నాన్నల ఆదుర్దా గొంతులు వినపడితే కిందామీదా అయ్యేవాడివి. "ఊర్కోరా బుజ్జికన్నలూ.." అని వాణ్ణి నాకిచ్చి బతిమాలే నీ కన్నుల్లో..ఎన్ని క్షమాపణలు! ఎన్ని ప్రమాణాలు! పెదవి చివర నే దాచిన నవ్వులు, ఆ చీకట్లో నీకు కనపడి ఉండవ్ కదూ...!

కన్యాకుమారిలో సూర్యోదయం చూడాలని కదా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాం. సుష్టుగా తిని, వెచ్చగా పడుకుంటే ఏంటర్థం? కాళ్ళ క్రిందకి దుప్పటి లాగేస్తే తల మీదుగా మరొకటి లాక్కుంటూ...ఏం మొండివాడివబ్బా! "నావల్ల కాదు! సైనస్ ...ప్లీజ్...ఒక్క అరగంట" అంటూ తెల్లగా తెల్లారేదాకా గదిలోనే ఉంచేశావ్. తాకితే అంటుకుపోయే బద్ధకాన్ని, బద్ధకాలు పెనవేసుకుంటే రాజుకునే సౌఖ్యాన్ని, కాదనడమెట్లానో అప్పుడు నాకూ తెలీలేదు. ఊటీలోనూ నా నేస్తాలందరినీ బోల్తా కొట్టించి చీకటివేళకి రిసార్ట్స్‌లో నిలబెట్టావ్. పాటలన్నావ్, చిందులన్నావ్, లవ్ సీట్స్‌లో ఒదిగి అర్థం లేని ఆటలాడుకుంటుంటే...లోకపు సౌందర్యంతో నువ్వన్నట్టే పని లేకుండా పోయింది. పగలూ రాత్రీ నీ లెక్కల్లో నడుపుకున్నావ్. నిద్రా మెలకువా నీ రెప్పలతో చూపించావ్. ఎదురడగాలని మర్చేపోయేంత మైకం నాకు. సాగుతున్న భోగాన్నంతా అటకెక్కిస్తూ వచ్చాడుగా సుపుత్రుడు. వాడు ఐదింటికే లేచి ఆటలాడీఆడీ నిన్నూ లెమ్మని గుంజుతోంటే, ఏనాడైనా సైనస్ అన్నావా, దొంగా!! స్వెటర్లు వేసుకునీ, మఫ్లర్లు చుట్టుకునీ ఇద్దరూ ఎన్ని ఆటలు! అర్థమవుతాయనేనా, వాడికన్నేసన్నేసి కథలు? ఓయ్! నా కోపం గురించి అడుగుతున్నావా...నిజం చెప్పనా! వాడిని భుజానికెత్తుకుని నా దుప్పటి మెడ దాకా సర్ది వీపు రుద్ది వెళ్ళే నిన్ను, ఎన్నిసార్లో రహస్యంగా చూసుకున్నాను . వెయ్యింతలయ్యి మీదవాలిన తీయని బరువుని నెట్టుకుంటూ  మళ్ళీ నిద్రలోకి జారుకున్నాను.

ఇల్లు సర్దాలంటే ఎంత బద్ధకంగా ఉండేవాడివి! ఏ పూట కాపూట వాయిదాలూ, వంకలూ. ఇల్లు కాదు, మనసు శుభ్రంగా ఉండాలని పిచ్చి మాటలొకటి పైగా. ఎక్కడికి దొర్లాయబ్బా ఆ జ్ఞానగుళికలన్నీ ఇప్పుడు? ప్రతి రాత్రీ ఫెళఫెళలాడే ఉతికిన దుప్పట్లు. సెంటర్ టేబుల్ తుడవడం, బట్టలు పద్ధతిగా ఉంచుకోవడం, జర్నల్స్ అన్నీ వరుస్సాగ్గా సర్దుకుని లోపల పెట్టుకోవడం, ఒకటా రెండా! పిల్లాడు లాగేస్తాడని బెదురూ, వాడి బుడిబుడి అడుగులకు ఏమైనా అడ్డొస్తాయని భయమూ, నోట పెట్టుకుంటాడన్న జాగ్రత్తా - మంచి నాన్నవేలే!! భోజనాలవగానే వంటింటి పై పని నాకొదిలేసి వాణ్ణి వెంటేసుకు వెళ్ళిపోతావు. పని పూర్తి చేసుకుని, చప్పుడు చెయ్యకుండా బెడ్ లైట్ వెలుగుకు అలవాటు పడుతూ మిమ్మల్ని చూస్తానా...ఎవరినెవరు పడుకోబెట్టారో అర్థం కాకుండా నిద్రలోకి జారుకున్న మీ ఇద్దరూ కనపడతారు. బెడ్ లైట్ ఆపేస్తాను కానీ, నా కళ్ళు చూసిన వెలుగు మనసంతా పరుచుకునే ఉంటుంది, రాతిరి తెల్లవార్లూ. మర్నాడూ, అటుపైనా, ఆపైనా..

హైదరాబాదులో మీటింగ్ నాకు. వదుల్చుకోవడం కుదర్లేదు. తప్పించుకునే వీల్లేదు. ఒక్క రోజు పని. పొద్దున మొదటి ఫ్లైట్ తీసుకుంటే, రాత్రి లాస్ట్ ఫ్లైట్ కి వెనక్కి వచ్చెయ్యచ్చు. ట్రావెల్ డెస్క్ వాళ్ళు వీలు కుదిరే ఎయిర్‌లైన్స్ లిస్ట్ పంపి చూసుకోమన్నారు. నాలుగింటి నుండి ఒంటిగంట దాకా నాది కాదనుకోవాలి. టైం టేబుల్ ఒకటికి పది సార్లు సరి చూసుకున్నాను. బట్టలు సర్దుకున్నాను. కాన్ఫరెన్స్‌కి ప్రిపేర్ అవుతున్నాను. పసివాడు "మ్మా..అమ్మా..." అన్నప్పుడల్లా గుండె ఎగిరిపడుతోంది. అన్ని గంటలు వాణ్ణి చూడకుండా ఎప్పుడూ లేను. ఉండలేను. ఏం చెయ్యాలీ? ఏం చెయ్యాలీ?  టీ ఇస్తూ అడిగావ్... "హైదరాబాదులో నాకూ కొంచం బేంక్ పని ఉంది, నీ కూడా రానా పోనీ?" అని. ఎంత దగ్గరగా అనిపించావో తెల్సా - టీ కప్పు అడ్డుండబట్టి కానీ, ఈ గుండెలో చెలరేగిన ప్రేమ తుఫాను, నిన్ను వదిలేదే కాదా క్షణం. పొద్దున్నే లేస్తూ అమ్మ ఎక్కడని వాడు వెదుక్కోకూడదు. రాతిరి పడుకునే ముందు అమ్మ ఇంకా రాలేదేమని ఏడవకూడదు. తెలుసు, కోర్కెల చిట్టా ఎప్పుడూ ఇంత చిన్నదై ఉండదని తెలుసు. బ్రతుకంటే ఇంత చిన్ని ఊగిసలాటలు కాదని పసితనం నా ఒళ్ళో నుండి దూకి వెళ్ళిపోయినప్పుడే తెలుసు. కానీ, కానీ..., మెడపట్టి ఊగే చిట్టి చేతుల్లోనే ప్రాణాలను పట్టి బంధించే బలముంటుంది. పెగలని పసి గొంతుల్లోని దుఃఖమే కుదిపి కుదిపి నిలదీస్తున్నట్టుంటుంది. నాకిప్పటికి ఇదే ముఖ్యం. ఇదే అవసరం. లోకం నాన్సెన్స్ అని కొట్టిపడేసే నా బలహీనతని, ప్రశ్నించకుండా, వెక్కిరించకుండా, నువ్వొక్కడివే అర్థం చేసుకున్నావ్. బలమై కాచుకున్నావ్ - చాలు. డెస్క్ వాళ్ళకి మూడు టికెట్లు బుక్ చెయ్యమని చెప్పేశాను. ధిలాసాగా పని పూర్తి చేసుకున్నాను. ఆ సాయంత్రం ఫ్రెండ్స్‌ని కలిసి, మర్నాడు కూడా అక్కడే ఉండి, మూడో రోజుకి ముగ్గురం మళ్ళీ బెంగళూరులో. చలో! ఏమీ ఎరగనట్టు, ఇదంతా ఏదో మామూలుగానే చేసినట్టు నువ్వు చులాగ్గా తిరగగా లేంది, అంతే మామూలుగా నేను పెట్టెలు ఖాళీ చేసి ఆఫీసుకు తయారైతే మాత్రం నేరమా? అల్మరాకి అడ్డుగా చేతులు కట్టుకు నిలబడి, - డైరీ చదివాను - అన్న నీ కవ్వింపు మాటల్లో, పట్టుబడింది నేను కాదు...నువ్వే!

రెండు ఉధృతప్రవాహాలు కలిసి ఒక్కటై పారినట్టు, రెండు జ్యోతులు పెనవేసుకుని ఒకే వెలుగై కదిలినట్టు, మునుపంతా నువ్వూ నేనూ ఒకటి.

ఇప్పుడు నీదీ వాడిదీ ఒకే రంగుల లోకం. నువ్వూ వాడూ కలిస్తే అది రెక్కలతో ఎగిరిపోయే కాలం.

గోరుముద్దలూ, తడి ముద్దులూ, కథలూ, ఆటలూ..

కాలాన్ని ఒంగోబెట్టి దాని వీపున మీ ఇద్దరూ ముద్దుగా గుద్దే  పసి ముద్రలన్నీమూడోమనిషినై చూస్తున్నా, ఎడంగా నిలబడ్డానన్న స్పృహ ఇబ్బంది పెట్టడంలేదెందుకో!

ప్రేమ బలం అనుభవం నుండి పుడుతుందా? ఆలోచన నుండా? తరచి చూసుకునే వ్యవధేదీ?

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...