"చినతండ్రీ..బళ్ళో టీచర్ చెప్పింది జాగ్రత్తగా వినాలి..సరేనా?" గడ్డం పట్టి పాపిడి తీస్తూ ఏ వెయ్యోసారో చెప్పాను. బుద్ధిగా తలూపాడు నాలుగేళ్ళ నా పసివాడు. "ఎటూ వెళ్ళిపోకు నాన్నా, ఎవరైనా ఏమైనా అన్నా వెంటనే టీచర్‌కి చెప్పాలి..ఏం?!" చొక్కా సరిచేసే నెపంతో వెనక్కు గుంజి మళ్ళీ గుర్తుచేశాను. వాడికిష్టమైన బొమ్మతో కుస్తీలుపడుతూ, అలవాటుగా ఒప్పుకున్నాడు. "మంచినీళ్ళు ఇక్కడ పెట్టాను, ఆకలైతే ఇందులో పప్పుండలున్నాయ్..నువ్వు తిని, నీ ఫ్రెండ్స్ కి కూడా ఇవ్వు. ఇబ్బందైతే టీచర్‌కి చెప్తావుగా" జేబులో రుమాలు దోపుతూ అడిగాను. "ఊఁ" కొట్టి ఆటల్లో పడిపోయాడు.
చిట్టి స్నాక్స్ డబ్బా ఒకటి సంచీలో సర్ది వెనక్కు వచ్చేసరికి, వాళ్ళ నాన్న పొట్టి స్టూల్ మీద కూర్చోబెట్టి సాక్స్ వేసి, షూ లేసులు కడుతున్నాడు. నా ముఖంలోని భావం అర్థమై "అప్పగింతలయినట్టేనా?" అన్నాడు ప్రసన్నంగా. తలాడించాను. "పిల్లలు ఏడుస్తారని విన్నాను కానీ..తల్లుల గురించి ఎక్కడా వినలేదే?!" కవ్వింపుగా అంటూ పిల్లవాణ్ణి బయటకు బయలుదేరదీశాడు. నాన్న వేళ్ళను చిట్టి చేయి చుట్టుపోయింది. బాల్కనీలోకొచ్చి నిలబడేసరికి అద్దాలు దించిన కారులో నుండి నవ్వుతూ టాటా చెబుతున్నాడు నా బుజ్జాయి!
వెనక్కి తిరిగి చూసుకుంటే హాల్ నిండా బొమ్మలు. టేబుల్ మీద పళ్ళెంలో వాడు తిననని మారాం చేసి వదిలేసిన ఇడ్లీ ముక్కలు. మూడు గుంటలున్న ఆ పళ్ళెం వాడికి ఊహ తెలిసిన నాటి నుండీ మహాప్రియమైనది. తినేదుండదు కానీ గుంటలు మాత్రం నిండాలి. "ఎర్ర కాం" కావాలమ్మా అంటూ ఆవకాయ నంజుకుంటాడు, ఆవకాయేమీ కారం ఉండదుట వాడి నాల్కకి. మా అమ్మకి చెబితే "ఇదేం అన్యాయం! వేలెడంత లేడు వెధవ, నా ఊరగాయకే వంకపెడతాడూ!" అని ఎప్పుడూ ఆశ్చర్యపోతుంది. రెండో గుంటలోని కొబ్బరి పచ్చడి ముట్టనైనా లేదు - మొండి ఘటం! రోజూలాగే ఓ పది నిముషాలు ఆగి మళ్ళీ నోట్లో వేద్దామంటే దొరకడుగా! మనసంతా భారంగా అయిపోయింది. బళ్ళో ఉన్న పదిహేను మంది పిల్లల్లో వీణ్ణి పట్టించుకుంటుందా ఆ టీచరు? ఏదీ కావాలని నోరు తెరిచి అడగలేడు నా బిడ్డ, గమనించుకుంటుందా ఆవిడ? అంత తీరికుంటుందా పాపం వాళ్ళకి? పంచదార పలుకులు అలదుకున్న ఇడ్లీ ముక్క మూడో గుంటలో నుండి తీసుకుంటే, పెదాల పైకి ఏ వైపు నుండో పాకిన ఉప్పదనం - నా ఊహేనా?
బాత్రూం హేంగర్‌ల నుండి బట్టలు తీసి వేస్తుంటే అనిపించింది - చంటివాడికి టాయ్‌లెట్ అని చెప్పాలని నేర్పించాను- గుర్తుంటుందా? చెప్పలేకో చెప్పింది వాళ్ళకు అర్థం కాకో వీడు కంగారు పడి పేంట్ తడిపేసుకుంటేనో? చేతులు కడిగేప్పుడు చుక్క నీరు చొక్కా మీద పడినా "డర్టీ అయిపోయింది, మార్చెయ్ మార్చెయ్యమ్మా" అని చుట్టూ తిరుగుతాడు. ఈ రోజేం చేస్తాడో?! బేగ్‌లో ఇంకో జత బట్టలు పెట్టాను కానీ ఆవిడ చూసుకుంటుందా? బడిలో బేగ్‌లు మారిపోవు కదా!! అసలే కొత్త బేగ్ - వీడైనా గుర్తుపడతాడా? దేవుడా!
స్నేక్స్ డబ్బాలో కర్జూరాలు పెట్టాను, లోపల గింజ ఉంటే తీసుకుంటాడో, అత్యుత్సాహంతో మొత్తం నోట్లో పెట్టుకు కొరికేస్తాడో! కొత్తవాళ్ళను చూస్తే బెరుకు పిచ్చి వెధవకి - టీచర్ తినమందన్న భయానికి మింగెయ్యడు కదా. కాసేపు కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరిగాను. ఫోన్ మోగింది. గుండె దడదడలాడింది. టీచర్ చెయ్యలేదు కదా - ఆటల్లో ఏమైనా దెబ్బ తగిలించుకోలేదు కదా - పరుగుపరుగున అందుకున్నాను. స్క్రీన్ మీద బుజ్జాయి నాన్న పేరు చూసి ఊపిరి పీల్చుకున్నాను. "గట్టిగా మూడు గంటలైనా లేదు! ఊరికే అతిగా ఆలోచించకు, నీ వర్క్ చేసుకో, టైం కి వెళ్ళి పిక్ చేసుకో..పాటలు విను పోనీ.." తోచిన జాగ్రత్తలేవో చెప్పి పెట్టేశాడు.
"ఉన్ కుట్టి పప్పీ నాన్..రౌడీ బేబీ" ప్లేయర్ లో వాడు ఆపేసిన పాట మళ్ళీ మొదలయ్యింది. పప్పీ అనగానే పెద్ద పెట్టున నవ్వులతో పరుగుపరుగున వచ్చి వాడు నా చేతుల్లో వాలిపోయే వీల్లేకుండా ఈ బడేమిటసలు?! పది నిమిషాల్లో ఇల్లు సర్దడం అయిపోయింది. కానీ అద్దంలా ఉన్న ఇల్లు ఇంత అసహ్యంగా ఉంటుందా అనిపించింది. దేని స్థానంలో అది లేని ప్రతీ వస్తువూ నా పిల్లాడి ఉత్సాహానికి కదా గుర్తు! కలగాపులగంగా హాల్‌నిండా ఉన్న బొమ్మలూ, ఉతికిన బట్టలు మడతలు పెడుతుంటే పక్క నుండి లాగేసే అల్లరీ, అన్నం పెడుతుంటే తల తిప్పుకుపోయే పెంకితనం, స్నానానికి వేణ్ణీళ్ళు నింపుతుంటే బకెట్ దొర్లించేసే చిలిపితనం, దుప్పటి అంచులు లోపలికి సర్దుతానంటూ బయటకు లాగే అమాయకత్వం, సోఫా లో నా భుజానికి ఆని కూర్చుంటే దొరికే హాయీ - జిగ్-సా పజిల్ ముక్కల్లా అన్నీ కలిస్తేనే వాడు.
రెండు గంటలు కాస్త ఊపిరి పీల్చుకుంటాను, కాల్స్/వర్క్/ఇంటిపని వాడి మీద కన్నేసి ఉంచే పన్లేకుండా, వాడి అల్లరికి బెదిరే మనసును స్థిమితపరుచుకునే గొడవ లేకుండా, అన్నీ హాయిహాయిగా చేసుకుంటానని కలల్లో తేలిన నేనే, బడి వదిలే వేళకి పావుగంట ముందు చేరుకున్నాను. బయట ప్లే యేరియాలో ఆడిస్తున్నారు పిల్లల్ని. వాళ్ళని వాలంటీర్‌లకి అప్పజెప్పి నవ్వుతూ వచ్చింది టీచర్. భయాలన్నీ ప్రశ్నలుగానూ, ప్రశ్నలన్నీ భయాలుగానూ వినపడే ప్రమాదం అర్థమవుతున్నా ఆగలేకపోయాను. ఓపిగ్గా అన్నింటికి బదులిచ్చింది. స్నాక్స్ తిన్నాడనీ, పక్కవాళ్ళకు పెట్టాడనీ, టాయ్స్ క్లీన్-అప్ చేశాడనీ (ఏవిఁటీ..మావాడే!!), బుద్ధిమంతుండనీ, టాయ్లెట్ అని చెప్పాడనీ, - ఆవిడ ఆవిడ చెప్పుకుపోతోంటే సంబరంగా విన్నాను. భయం లేదనీ, తేలిగ్గా కుదురుకున్నాడనీ చెప్పింది. "నాకోసం అడిగాడా?" ఉండబట్టలేక బయటపడ్డాను. నవ్వారావిడ. ఒకసారి వెదికాడనీ మళ్ళీ క్రేయాన్స్ తీసుకుని కలరింగ్‌లో మునిగిపోయాడనీ, అయినా పిల్లలు బెంగగానో, దిగులుగానో ఉంటే ఫోన్ చేసి చెప్తామనీ, వాట్స్అప్‌లో ఫొటోలు చూస్తూ ఉండమనీ చెప్పారు. పెద్ద బరువొదిలిన తేలికతనం నాలో.
ఆవిడతో మాట్లాడుతూనే ప్లే యేరియాకి వెళ్ళాం. నన్ను చూస్తూనే ఆడుకుంటున్నది ఆపి పరుగుపరుగున వచ్చి నా కాళ్ళను చుట్టుకుపోయాడు. మోకాళ్ళపైన కూర్చుని హత్తుకున్నాను.
కార్‌లో సీట్ బెల్ట్ పెడుతుంటే అప్పుడే కొత్త ఫ్రెండ్స్ పేర్లు చెప్పేస్తున్నాడు. ఆపిల్ కి ఎర్ర రంగు వేశాట్ట..బాల్‌కైతే నాలుగు రంగులు ఇచ్చారుట వెయ్యమని. "బాగా వేశావా నానా?" సీట్ బెల్ట్ సర్దుకుంటూ అడిగాను. చక్రాల్లాంటి కళ్ళు ఇంకా గుండ్రంగా తిప్పాడు.
"స్కూల్ నచ్చిందా? రోజూ వస్తావా మరి?"
"వస్తామ్మా, స్కూల్ నచ్చింది. మా టీచర్ కూడా .." సీట్‌లో నుండి ఎగరబోయాడు. వారించాను.
"అమ్మా మా టీచర్ నన్నేమన్నారో తెల్సా.."
కొత్తకథలు మొదలు.
తన ఒడి నుండి, తన వాళ్ళ నుండి, తన ఇంటి నుండి తప్పించి, తల్లి బిడ్డను తొలిసారిగా మరొకరికి అప్పగించేది బడిలోనే. తనలా తన బిడ్డను జాగ్రత్తగా గమనించుకుంటారనీ, తన కన్నా ఎక్కువగా వాళ్ళకు బుద్ధులు నేర్పిస్తారనీ, నమ్మీ, ఆశపడీ తన బిడ్డల్ని ఉంచేది ఆ మేష్టార్ల చేతుల్లోనే. బడి అంటే తల్లులకంత భరోసా. వేలి చివర్లలో విజ్ఞామంతా కుప్పలుగా పడి ఉన్నా, ఆ టీచర్ బోర్డ్ మీద పెట్టిన వేలంటే ఈ రోజుకీ అమ్మలకు అందుకే అంత గౌరవం! తల్లులయ్యాక, వాళ్ళు తమకు చదువు చెప్పిన టీచర్‌లను ఎలా తల్చుకుంటారో, తమ పిల్లలను అక్కున చేర్చుకున్న టీచర్లనూ అంతగా గుర్తుంచుకుంటారు. మా అక్కకు తొలిసారి చదువు చెప్పిన రామాలయం పంతులు గారిని మా అమ్మ ఈ రోజుకీ మర్చిపోలేదు. నిజానికది మా అమ్మమ్మ నుండి ఆమె మునిమనవల దాకా పాకిన అపురూపమైన కథ; నేనెన్నడూ చూడని ఆ పంతులు గారు, మా ఇంటిల్లిపాదీ తలుచుకు మురిసే మా బాల్యపు జ్ఞాపకం. లోకం తెలియని పసివాళ్ళు అమ్మనూ నాన్ననూ కాక హీరో వర్షిప్‌తో చూసుకునేదీ, కథలుగా తోటి నేస్తాలకు చెప్పుకునేదీ టీచర్ల గురించే. వాళ్ళు అనుసరించేదీ, అనుకరించేదీ బళ్ళో కొన్ని గంటల పాటు చూసే ఆ గురువులనే. అందుకే టీచర్లంటే అమాయకమైన బాల్యానికి దొరికే అందమైన హీరోలు. థాంక్స్ అనేది పేలవమైన మాట. కానీ నిలబెట్టే నమ్మకాలకు బదులుగా ఏమీ ఆశించని కొందరు గురువులకు ఇవ్వడానికి మన దగ్గర ఉన్నదదే.

*

(తొలి ప్రచురణ :మామ్స్‌ప్రెస్సో, తెలుగు ఎడిషన్, ఉపాధ్యాయదినోత్సవం సందర్భంగా)
Sooper బాగా రాసారు
ReplyDeleteThank you!
Delete