మెహెర్ కు అభినందనలు..

2010 లో..

బ్లాగింగ్ మొదలెట్టిన తొలినాళ్ళలో..

కూడలి, మాలిక ఈ రెండింటిలో మంచి బ్లాగ్ కోసం వెదుక్కోవాలని ఎవరో చెప్పాక -
అట్టే వెదక్కుండానే కళ్ళబడ్డ బ్లాగు - "కలంకలలు"

నారింజ రంగు హెడర్..ఎవరో తీరి కూర్చుని దిద్దుకుంటున్నారా అన్నట్టున్న అక్షరాలు, ఇటాలిక్స్, బోల్డ్ ఏవి ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉన్న బ్లాగ్. చూడగానే ఆ బ్లాగులో ప్రేమతో పడిపోయాను. అది మొదలూ ఈ తొమ్మిదేళ్ళుగా పూట పూటా కాకపోయినా కొన్ని సార్లు కొన్ని వ్యాసాల కోసం, చాలా సార్లు ఊరికేనూ ఆ బ్లాగ్ చదువుతూనే ఉన్నాను.

ఇన్నాళ్ళకు, ఆ బ్లాగులోని కథలన్నీ పుస్తక రూపంలో వచ్చాయని తెలిసి - సంతోషంతో ఆ రోజుల గురించి తల్చుకుంటుంటే, చాలానే గుర్తొస్తున్నాయి. తన కథలన్నీ చూసి ఇష్టమైన వాక్యాలు ఎత్తి రాయాలనుంది కానీ, బ్లాగ్ లేదిప్పుడు. కథల పుస్తకమూ నా ముందు లేదు. అందుకని, అజంతాలా, స్మృతి పీఠం ముందు కూర్చుని, ఈ నాలుగు మాటలూ.

మొట్టమొదటగా చదివినదేదో గుర్తు లేదు కానీ, "సరిహద్దుకిరువైపులా" అలా పాత జ్ఞాపకంగా మనసులో మెదులుతోంది. గొడవపడ్డ భార్యాభర్తలు -  మొదటంతా అబ్బాయి వైపు నుండి, మళ్ళీ అవే సన్నివేశాలు అమ్మాయి వైపు నుండి, తర్వాత అసలు గొడవ - ఇలా సాగుతుందా కథ.

మెహెర్ మొదట్లో రాసిన కథల్లో, చిత్రీకరణ చాలా బలంగా ఉండేది. అంటే అది ఒక కెమెరాని స్లో మోషన్‌లో తిప్పుకుంటూ వెళ్ళడం లాంటిది. ఆ గది ఉన్నదున్నట్లు మనకు కనపడి తీరాలన్నట్లు రాసేవాడు. ఫ్రిడ్జ్ డోర్ తీసిన వెలుగులో, ఆమె తలెత్తి బాటిలో నీళ్ళు గుక్క గుక్క తాగుతుంటే గుటక పడటం లాంటి వర్ణనలు, నాకిప్పటికీ అలా గుర్తుండిపోయాయి. అంత స్పష్టమైన వెలుగుతో ఉంటాయి తన వర్ణనలు.

"రోడ్ మీద కోక్ టిన్‌ని లాగి పెట్టి తన్నిన అనుభవం.." లాంటిది ఇంకోటి. అందులో కథగా ఏమీ ఉండదు. వాళ్ళేదో సినిమా తాగి (మెహర్, తన స్నేహితుడూ) ఓ గుట్ట లాంటిదేదో ఎక్కాక, స్నేహితుడు ప్రేమకథ చెప్తాడు. హైదరాబాద్ రాత్రి గాలి మన మీదకొచ్చినట్లు హాయిగా అనిపిస్తుంది మొత్తం చదివేశాక.  రచయితకు ప్రత్యేకమైన గమనింపు అనేది ఉంటే ఇష్టమన్నట్టు, అతను రాసే కొన్ని కొన్ని వాక్యాలు భలే ఉంటాయి. స్నేహితుడు ప్రేమ కథను చెబుతుంటే, ఊఁ కొడుతూ, అది మరీ ఆసక్తి లేకుండా వింటున్నట్టు అనిపించకుండా, మధ్యలో ఊరికే ఏవో ప్రశ్నలడిగానని రాస్తాడిందులో. భుజాలు తడుముకున్నాను నేను కూడా.

ఇంకో కథలో నాకు పరిచయమే లేని హైదరాబాదు గల్లీల్లో గొడవల గురించి - అందులో ఓ హొటల్ లో అయిన చిన్న గొడవ గురించి వర్ణన ఉంటుంది.   హోటల్ లో మిగిలిన వాళ్ళు, సమోసా ప్లేట్లతో సహా లేచి దూరం జరిగి చూస్తూ ఉంటారని రాస్తాడు. నాకెప్పుడూ ఆ సీన్‌లో ఆ సమోసా కొరుకుతూ గొడవ చూస్తున్నదాన్ని నేనే అనిపిస్తాను. అక్కర్లేని వాళ్ళు ఎడం జరిగి చూడండి - అని చెప్తున్నట్టే ఉంటాయి మెహెర్ గొడవలన్నీ.

మాలికలోనో కూడలిలోనో చూసి, ఒకసారి చదివి, మళ్ళీ చదివి, లాప్టాప్ మూసేసి మళ్ళీ చదివి, మళ్ళీ ఎవరికో చెప్పి వచ్చి మళ్ళీ చదివిన కథ "రంగు వెలిసిన రాజు గారి మేడ కథ". కథ అల్లిక ఇలా కదా ఉండాలనిపిస్తుంది. ఆ కుమ్మరి వాడి ఇల్లు ఊహల్లో ఎంత స్థిరంగా ఉండిపోయిందంటే - అట్లాంటి ఇల్లొకటి చూడాలనిపించేంత.

మెహెర్ వాకిలిలోనూ, తరువాత రస్తాలోనూ కూడా కథలు వ్రాశాడు. నాకు లోకంలోనీ, మనుషుల్లోనీ చీకటి, రుచించదు. చేదుగానే అనిపిస్తుంది. మెహెర్ కథల్లో చేదు ఉగాది పచ్చడిలో తప్పని రుచిలా, కొండొకొచో ముఖ్యమైన రుచిలా, ఏ తొడుగూ లేకుండానే కనపడుతుంది. "లోకంలో ఇట్లా జరక్కుండా ఉంటే బాగుండు కదా, ఎవ్వరికీ ఈ కష్టం రాకుండా ఉంటే బాగుండు కదా! అప్పుడిలా చెయ్యరు కదా!" అని నాకు పదే పదే అనిపిస్తూనే ఉంటుంది. ఈ ఆశల హోరుతో, ఇలా కాక ఇంకెలా ఉండి ఉండాలోనన్న నా సొంత ఆలోచనలతో, నేను ఆ తరహా కథలనసలు చదవలేను.  కానీ, ఒరాంగుటాన్ మెహెర్ నుండి వచ్చిన అత్యుత్తమమైన కథ అనిపిస్తుంది. ఆ మనిషి పొడవాటి చేతులతో అలా కళ్ళ ముందు ఊగుతూ ఉంటాడు. పాత్రని ఇలా ప్రాణశక్తితో ముందుకు తెచ్చి మన ముందు నిలిపే రచయితలు ఎంతమంది ఉన్నారో నాకనుమానమే. చెక్కే వాళ్ళు చాలా మంది ఉండచ్చు. కానీ ప్రాణం అన్నిట్లోనూ దొరకదు. పాత్రల ఉనికిని ఇంతలా అనుభవంలోకి తెచ్చుకోగలిగేలా రాయడం ఎంత కష్టమో ప్రయత్నం చేస్తాను కనుక నాకు తెలుసు. ఒరాంగుటాన్ గొంతు, అతని నంగిరితనం, ఆ రాత్రి చీకట్లో అతని గొంతులో వ్యంగ్యం అన్ని కళ్ళకు కట్టినట్టు కనపడతాయి, వినపడతాయి. అతని పాత్రలకు నటించడం చేతకాడు. నటించామని బయటపడటానికీ వెనుకాడరు వాళ్ళు.

కొన్ని కొన్ని పదాలకు కొన్ని కొన్ని స్పురణకు తెచ్చే శక్తి ఉంటుంది. వాక్యం పోకడను బట్టి కరుణ రసమా, భయానక రసమా మనం చెప్పగల్గుతాం, చాలా సార్లు. కానీ మెహెర్ వాక్యం ఎప్పుడూ మీదకొచ్చి దబాయిస్తున్నట్టే ఉంటుంది. అన్ని వాక్యాలూ ఏవో సీరియస్ విషయాలను ప్రతిపాదిస్తున్నట్టే ఉంటాయి. ఇతని కలంలో కరుణ రసం అనేది అవ్వని పని అనిపించేది ఓ కాలంలో. అతను ముక్కు పగలగొట్టేలా రాయగలడు, దాపరికం లేకుండా తాననుకున్నది చెప్పగలడు, కానీ ఏదైనా ఒక సీరియస్ టోన్‌తోనే.. అంతే. మనసు లోతుల్లోని తడి తెలియబరచేందుకు అతనికి మాటలున్నాయా అనిపించేది.

రెండు కథలు. ఇదెంత పిచ్చి ఆలోచనో చెప్పాయి.  1) కన్నా గాడి నాన్న. 2) చంటోడికి లేఖ? (ఇదేనా పేరు?-)

కన్నా గాడి నాన్న - బిడ్డని చిన్నప్పుడే పోగొట్టుకుని, జీవితంలో ఆశను పోగొట్టుకున్న ఓ వెర్రి తండ్రి కథ. అతని బాధ ఎంత బలమైనదో చెప్పేందుకు గుర్తుండేందుకు కథలో ఓ వాక్యం ఉంటుంది, వాళ్ళ భార్య గురించి. ఆమె ఇదంతా మర్చిపోయి చెత్త గొడవల్లో పనికిరాని వాటి గురించి ఆశపడటం, అదివరకట్లానే చాడీలు చెప్పడం, - ఇలా ఏదో ఉంటుంది. ఇంత పెద్ద బాధ ముందు, వెలితి ముందు, జీవితంలోని చిల్లర విషయాలు ఎలా కనపడుతున్నాయామెకు అన్నది ఇతని బెంగ. ఆ చిరాకుతోనే ఆమెకీ దగ్గరకాలేకపోతాడు. ఆ నిసహాయత మెహెర్ మాటల్లోనే చదవాలి. ఒరాంగుటాన్‌ని తోసిరాజన్న కథ ఇది, నావరకూ.

మెహెర్ మొదట్లో రాసిన కథలకూ, తరువ్వాత్తర్వత రాసే కథలకూ, నేను పోల్చుకోగల్గిన పెద్ద తేడా ఇలాంటి వాటిలోనే. మొదట్లో అతను చెప్పినవన్నీ భౌతికమైన వర్ణనలు. ఒక సన్నివేశం మెహర్ చెప్పాడంటే, అది మన కళ్ళ ముందుకు రావాల్సిందే. అట్లతద్దికి వాళ్ళమ్మ చెరువు మీదకి సాగేలా ఉయ్యాలూగిందని రాస్తే, ఎన్ని డిగ్రీల్లో ఉయ్యాల వంపు తిరిగిందో కూడా కనపడి, మనమూ ఏట్లో పడి పైకి లేవాలి ;). ఆఫీసుకు పోతూ పోతూ షాప్ వాళ్ళమ్మాయి సాయి(?)తో ఇసుక గూళ్ళు కట్టాడంటే మనకు ఎత్తూ లోతూ తెలియాలి. కానీ, తర్వాత్తర్వాత, ముఖ్యంగా ఈ కన్నాగాడి నాన్న కథలో, కాలంతో పాటు గడ్డకట్టిన్నట్టయ్యే ప్రేమల్ని, బాధల్ని, అవి బ్రతుకులో నింపే నిస్తేజాన్ని, ఎంత నమ్మశక్యమైన డ్రామాతో చెప్తాడో. నాకింకా ఆశ్చర్యమనిపించిందేమంటే - ఆ పిల్లాడు చనిపోయాడనేది, కథ మొదట్లోనే, మేటర్ ఆఫ్ ఫేక్ట్లా చెప్పేస్తాడు. అందులో దాపరికమేం లేదు. పొరలు పొరలుగా విప్పి, పాఠకులకూ కొంత పని పెడదాం లాంటి గోలేం లేదు. చాలా సరళంగా, మామూలుగా చెప్పుకెళ్తాడు. చావు అతని కథలో రహస్యం కాదు. ముడి కాదు. అది కూడా ఆ కేరక్టర్ లో పొదిగిన నిజాయితీలా కనపడి కథ మరింత నచ్చేలా చేసింది.

ఇంకోలా చెప్పాలంటే, మొదట్లో కథలు అతను చూసినవి చూసినట్టు చెబుతున్నట్టుంటే, ఒరాంగుటాన్, ఈ కన్నగాడి నాన్న లాంటి కథల్లో- రచయిత వాళ్ళతో ఎన్నాళ్ళో ప్రయాణం చేసి, ఆప్తుడై, అన్నీ అయి, మనం ఎక్కడ కలిస్తే అక్కడ నుండి మొదలెట్టి కొంత కొంతగా చెప్పుకుంటూ పోతాడు. ఇందులో కనపడే ప్రయత్నమంతా ఆ పాత్రల్ని గుచ్చి గుచ్చి చూడటంలోనో, వాళ్ళ చుట్టూ ఉన్న పరిసరాలనూ, మనుషులనూ భూతద్దం వేసినట్టు పాఠకులకు చూపించడంలోనో లేదు. - మనం కలిసిన చోటు నుండి కథను  చెప్పుకుపోవడంలో ఉంది. మొదలూ తుదీ అనచ్చేమో. పాత్రల మనఃస్థితులను వీలైనంత తేలిగ్గా పట్టి ఇచ్చే ప్రయాణపు భాగాలను అందివ్వడంలో ఉంది.

చింతల్లికి ఉత్తరం చదివినప్పుడు, అందరూ "ఆహా! నాన్న మనసు, నాన్న మనసు!" అన్నారు అందరూ. ఎంత అబద్ధం! అందులో కనపడిందల్లా నాన్న లేకుండా పెరిగిన కొడుకు బెంగ. ఎన్ని రకాలుగా చెప్పాడా మాటని! మంచో చెడో నాకో ఉదాహరణ ఉంటే, దాన్ని బట్టి నేనెలా ఉండాలో తెలిసేది అన్న మాటలు చదివినప్పుడు, ఎంత నొప్పి మనకి.

తండ్రి అయ్యాక పిల్లల భాష పట్టుకోవడంలో తేలిగ్గానే -కానీ గట్టి పట్టు వచ్చేసినట్టుంది - పైన చెప్పిన సాయి తో ఆడుకున్నప్పటి కబుర్లకూ, తరువాత రాసిన స్కూలెల్లను, ఈ ఉత్తరం, తప్పిపోయినట్టు నటించే పిల్లాడి కథ - లాంటి వాటికీ ఎంత తేడానో. వీటిలో మెహెర్లోని రచయిత పిల్లల మనసుతో చిందులేశాడు. తెలుగులో పిల్లల సాహిత్యమంటే పిల్లల భాషే ప్రధానమన్నట్టు రాస్తారు. అవి చాలా సార్లు వెగటు పుట్టిస్తాయి. రచయితల తెలివి, పిల్లాళ్ళ భాషలో ఎబ్బెట్టుగా ఉంటుంది. అలా కాకుండా, పిల్లల మనసు పట్టుకుని రాసిన రాతలు మెహెర్ వి.  ఆ తప్పిపోయినట్టు నటించిన పిల్లాడి కథలో, ఓపెనింగ్ సీన్ లోనే పిల్లాడు దొడ్లోక్కూర్చుని నీటితో కార్ల బొమ్మలు గీస్తున్నాడనీ గాజు పురుగులని చూసి భయపడి ఎగిరాడనీ ఉంటుంది. పిల్లల కథల్లో ఇట్లాంటి పరిసరాలూ, అక్కడ ఇలాంటి వర్ణనలూ చేసిన కథకులున్నారా మనకు? ఎక్కడేపని చేస్తున్నా తమలోని కుతూహలాన్నీ, భయాన్ని, దాచుకోలేని పిల్లలనిలా పట్టిచ్చినవాళ్ళు?

మెహెర్ కథల్లో ప్రేమ విచ్చలవిడిగా పడి ప్రవహించదు. కోపమో, లెక్కలేనితనమో ఎదురుగ్గా వచ్చి పలకరించినట్లు సున్నితమైన ఉద్వేగాలేవీ సున్నితంగా కనపడటం ఉండదు. కానీ, ఆ మొండి గోడలు దాటుకుంటూ వచ్చి తాకిన చెమ్మ కూడా పాఠకులను వరదలా ముంచేస్తుంది అనడానికి ఈ రెండూ కథలూ గొప్ప ఉదాహరణలు.

చేదు పూలు(*కాదు, తరళ మేఘఛాయ..) కథ కినిగె్‌లో ప్రచురించారు - వేరే పేరుతో. నేను అది కనిపెట్టి మెసేజ్ చేశాను. అది మీరే కదా అని. అందుకు నాకు నేనే చప్పట్లు.

అలాగే ఇంకోటి గుర్తొస్తోంది - నేనూ ధీరజ్ చాలా సార్లు అనుకున్న వాక్యం  -" రాత్రంతా నిద్రపోనట్టు ముఖం వడిలిపోయి ఉంది, కానీ దుఃఖమంతా బైటకు తోడేసాక మిగిలే తేటదనమూ ఉంది"   - భాగ్యనగర్ కాలనీ కథలో అనుకుంటానిది. కథలకు సరుకు కోసమని కాకుండా, మనుషులను గమనించడం, రచయితగా ఉండటం, ఈ రెండూ తెచ్చి పెట్టుకున్న లక్షణాలుగా కాకుండా,  మనిషికి స్వభావసిద్ధమైపోతే, అప్పుడూ, ఇలాంటి వర్ణనలు పాఠకులకు దొరికేది!!

నీలా టీచరులో- ఆ టీచరు మీద బొత్తిగా ఆసక్తి కలగలేదు, ఆవిడ ముక్కు తప్ప. :) ఆ పెద్ద కళ్ళమ్మాయి కథ ఆ చిన్న పిల్లాడి చూపులో -96 సినిమాని గుర్తు తెచ్చింది. పదిలంగా దాచుకున్న తొలిప్రేమ కథ, అలా అపురూపంగానే ఉంది.

ఇంకా కొన్ని కథలున్నాయి - కొన్ని మరీ నా గొంతు దిగనివి. చదివాను కానీ, నాకు గుర్తుండిపోలేదు. అట్లా నాకంతగా రుచించని కథల్లో కూడా కొన్ని వర్ణనలు, వాక్యాలు ఎంత బలంగా తాకాయంటే - అవి నాకు గుర్తుండిపోయాయి. ఆ అనుభవం పకడ్బందీగా పాఠకులకు చేర్చడమే రచయితగా నా పని తప్ప,  దేహ వర్ణనలతో కామపు స్పృహ కల్గించడం నా పని కాదన్నట్టు రాసిన వాక్యాలవి. రక్తమాంసాలతో సహా మనిషిని ముందుంచడమంటే ఏమిటో "పింక్ మాంసం" అన్న పదం చదివినప్పుడు తెలిసింది. మీకు జుగుప్స కలిగిందా, ఇంకేమైనా అనిపించిందా అన్నది తరువాతి సంగతి. ఆ వర్ణన మీలో కలిగించే స్పృహ, తొట్రుపాటు - అవి అనూహ్యం.

ఏవైనా రచయిత రాసేది రాయాలన్న వాళ్ళ బలమైన కోర్కెకు లోబడి. పాఠకులుగా మనకున్న పరిమితులకూ వాటికీ ఏ సంబంధమూ ఉండకూడదు కదా.

--

మెహెర్ కథలొస్తున్నాయని పోయినేడు ధీరజ్ నాకు చెప్తే, అప్పుడు విజయనగరంలో ఉండబట్టి వెంటనే కాల్ చేసాను - "నా కాపీ ఉంచాలి మీరు" అని. నెమ్మది గొంతుతో మర్యాదగా సరేనన్నారు. అసలు నా జలుబు గొంతు అర్థమై ఉండదు. మొదటిసారి కినిగె్‌కు రచనల కోసమని చేసినప్పుడూ అంతే, నేను ఆఫీసులో క్యూబికల్ నుండి ఎగిరి దూకి బయటపడి, మాట్లాడదామని ఎంత ప్రయత్నించినా గొంతు రాదే. పుట్టెడు జలుబు ఆ రోజూనూ. అయినా "మీ బ్లాగ్ ఇష్టం" అని చెప్పే కాల్ ముగించాననుకోండీ.

మెహెర్ కథలొస్తున్నాయంటే - సారీ, వచ్చాయంటే, అది, బ్లాగింగ్ ఒక మెట్టు పైకెక్కినట్టనిపించే సందర్భం నాకు. స్వాతి లాంటి నా మిగతా మిత్రులూ పుస్తకాలు తెచ్చారు. అప్పుడూ ఇదే సంతోషం. మనం వెదుక్కు చదువుకున్న బ్లాగ్ ఇంకా బాగా ముస్తాబై వెదుక్కోన్నక్కరలేకుండా ఒళ్ళో పుస్తకమై వచ్చి పడుతున్నట్టు..

( సుధామయి ఇప్పుడే చెప్పారు -  మెహెర్ పుస్తకం వచ్చేసిందనీ, ఈ రోజే సభ అని; ఒక వరుసాగిరుసా ఏమీ లేకుండా ఏదో రాసేశాను...)

(స్మృతి పీఠం ముందు కూర్చుని రాశానని చెప్పాను కదా - తప్పులు దొర్లి ఉండచ్చు. కథలూ గట్రా ఏమున్నాయో, ఏం లేవో నాకింకా తెలీదు. అయితే సారీలవీ చెప్పను.. :-) - అమెజాన్ లో పుస్తకం కొనుక్కుని, ఈ తప్పులనిక్కడ వదిలి, ఒప్పులు మీరు పట్టుకోండి. )

కంగ్రాట్స్ మెహెర్!
& థాంక్యూ!

8 comments:

  1. మానస గారు.. మీ నెమరువేత లాంటి ఈ రాతలో నాకు బాగా నచ్చింది మీరు పుస్తకమూ బ్లాగూ రెండూ దగ్గర లేకుండా, వాటిని చూసుకోకుండా దీన్ని రాయటమే. మొన్నెప్పుడో మీతోనే అన్నాను- రాసేవాళ్ళకి వుండేది అభిమానులు కాదూ, ఉత్తరాలు రాస్తే అర్థం చేసుకోగలవాళ్ళూ అని; ఒకరకంగా ఈ కథలూ కవితలూ ఉత్తరాలేనని. నచ్చినవైనా నచ్చనివైనా, నా ఉత్తరాలన్నీ మీకు చేరినందుకు ఎంతో సంతోషం.

    ReplyDelete
    Replies
    1. ఏళ్ళకేళ్ళు భద్రంగా దాచుకునే ఉత్తరాలివి మెహెర్ :)) <3

      Delete
  2. కేవలం జ్ఞాపకంలోంచి ఇది వ్రాసారా? ఇంత చక్కగా వ్రాసినందుకు అభినందనలు.

    ReplyDelete
  3. అజయ్ ప్రసాద్Friday, October 18, 2019

    చదివినాన జ్నాపకాల్లోంచి ఇంత గాఢంగా రాయడం మంచి విషయమండి. చాలా బాగా రాసారు. మెహెర్ కథలు చదువరుల మీద అట్లాంటి ప్రభావాన్నే కలగజేస్తాయి.

    ReplyDelete
  4. One of the best things you have done for any reader of your blog in general (and in this post, particularly) is to introduce how you read a text. Which is pretty educating.

    Thanks!

    ReplyDelete
  5. రావు గారూ, అజయ్ ప్రసాద్ గారూ - అవునండీ. రాసేదాకా నాకూ ఇంతలా గుర్తున్నాయని తెలీదు. థాంక్స్ చెప్దామని మొదలెట్టిన నోట్ తలపోతల్లో ఇంతదైంది..థాంక్యూ!

    ధీరజ్ - థాంక్యూ! :) మీరెలా చదువుతారో కూడా చెప్పాలి. :)

    ReplyDelete
  6. I love Meher's literature for their rawness and straightfarwardness; despite the fact that it was some times very difficult to digest.

    I recollect his "chiraaku" on agenda based writings. I donno his political ideology but his aversion on stories that were written half baked, just for the sake of supporting or opposing political agendas, was mind blowing.

    My love for his letters multiplied when I knew he is a Godavari guy (Alamuru, right?) Regional feeling, eh!

    Truly speaking, his observation yet detachment are great learning experiences for me.

    ReplyDelete
    Replies
    1. ఫణీ, మెహెర్ పుస్తకం చదివిన వాళ్ళందరూ ( ఒకప్పుడు పుస్తకాలు చదివి, గత ఇరవయ్యేళ్ళుగా రకరకాల కారణాల వల్ల అసలు చదవడానికి పూర్తిగా దూరమైపోయిన వాళ్ళు; ఏ సాహితీ సమూహాలకూ చెందని వాళ్ళు; నా స్నేహితులు) చెప్తున్న మాటల్లో నుండీ, నేను ఎంచి పట్టుకుంటున్న వాక్యం ఒకటుంటోంది. నచ్చిన కథలు మర్చిపోలేనంతలా వాళ్ళని అంటిపెట్టుకోవడం ఒక ఎత్తైతే, నచ్చని కథల గురించి కూడా అందరూ, "నాకు నచ్చలేదు/నాకిలాంటి కథలు ఎక్కవు, నచ్చవు/ ఇలా ఏదో అంటూనే, "కానీ అతడు చాలా బాగా రాశాడు. చాలా బాగా రాశాడు" అని నొక్కి వక్కాణించడం.

      వ్రాసే మనిషిగా, నాకీ మాటలు భలే ఆశ్చర్యంగా, అసూయ తెప్పించేవిగా ఉంటున్నాయి.

      వాళ్ళీ మాట అనబోయే ముందు, కథలను ఒకటికి రెండు సార్లు అప్పటికే చదివేశారని కూడా వాళ్ళ మాటలు నాకు పట్టిచ్చాయి.

      Delete

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...