చుక్కలు పొడిచిన నొప్పిని వెన్నెల నవ్వుల మాటున భరించే రాతిరి, సౌందర్యవతి, ప్రేమమూర్తి అయిన రాత్రి, సోమరిగా కూలబడిన నన్ను ఊరడించాలని చూసీ చూసీ అలసిపోయింది. తన కోమలశీతలస్పర్శ నా నుండి దూరం జరిగిపోతోందన్న స్పృహ కలిగేసరికే ఆలస్యమైపోయింది. తన నీలోత్తరీయాన్ని నా వేలికి ముడివేసి, ఆమె వెళ్ళిపోయింది. నీడలునీడలుగా కొన్ని మాటలింకా ఇక్కడే తచ్చాడుతున్నాయి. నీటిబుడగల్లాంటి కలల్లో నిజాన్ని వెదుక్కునే పనిలో పడ్డ నన్ను కాలం ముల్లులా గుచ్చి మేల్కొల్పుతుంది. పల్చని పసుపు వెలుతురు కూడా కళ్ళకు భారమైపోతుంది. వసంతోత్సవైశ్వర్యం పొందకుంటే నిరుపేదలేనన్న మాటలు తల్చుకుని, బెంగటిల్లే హృదయం బయటకు చూస్తుంది. ఇంకా రాలని మంచుముద్దై శిశిరం అద్దపు తలుపుల అంచులను పెనవేసుకుని నిద్రిస్తూనే ఉంది. లేఎండ పొడకు మెల్లిగా కరిగిన మంచుపొర ఒకటి ఎండుకొమ్మని వెలిగించి జారిపోతుంది. రాదారుల మీద ఉప్పురాళ్ళనూ మంచురవ్వలనూ వేరు చేసి చూడలేని చూపు నిశ్చలత్వాన్నెరుగని లోలకమై కదిలి అలసిపోతుంది. బాహ్యస్పృహని వదిలించుకుని సౌందర్యంలో లీనమైపోలేని శాపంతో, వచ్చేపోయే వాహనాల వెలుగుల్లో చిక్కుపడి ఆలోచన కదిలిపోతుంది. విసురుగా తగిలి, అద్దాలను ఊపేస్తుంది గాలి. కంపించీ కుదురుకునే హృదయం పట్టుబడని రహస్యాల కోసం ఊపిరి బలంగా తీసుకుంటుంది. చూపుడువేలితో అద్దాల మీద దారులు గీసుకుని, ఆకశపు సౌందర్యం ఆ హద్దులు దాటి విస్తరించడాన్ని చూపులతో వెంబడిస్తుంటాను. అంతూదరీ లేని అందమంతా సొంతమయ్యీ కానట్టుంటుంది. ఆగీఆగి ఉబికే ఆనందం ఏ దిక్కు నుండి వస్తుందో నాకే అర్థం కాకుండా ఉంది. నీకూ ఈ పద్యమర్థం కాకుంటే, ఈ చలి ఉదయంలో తలుపులు తీసి, నిన్ను నా పక్కకు ఆహ్వానించడం వినా మరేమీ చెయ్యలేను. ఎందుకంటే, ఈ ఉదయం నాకున్నదంతా ఈ చిన్ని అద్దపు తునక! దీని మీద నీకోసమేమీ ఈవేళ రాయలేనిక!
ఈ నెల ఈమాట సంపాదకీయం గురించి:
"సాహిత్యాన్ని ప్రక్రియల పావురాల గూళ్ళల్లో పెట్టే ధోరణి కొంతైనా పోతుందని" ఈ నెల ఈమాట సంచికలో వచ్చిన రచనలన్నింటికి labels/Tags తీసేసి ప్రచురించారు. ఇలా చెయ్యడం వల్ల, రచనను రచనగా చూడటం అలవాటవుతుందన్న ఆశ ఉందని కూడా చెప్పారక్కడ.
నిజంగానే కొన్ని రచనలను చదివినప్పుడు, వీటిని కథ అని ఎందుకు అన్నారు/ వీటిని కవితగా ఎందుకు ప్రచురించారు అని సందేహం కలుగుతూ ఉంటుంది. రచనల నాణ్యతతో పాటు, కొత్తగా కనపడ్డ ప్రతిదానికీ మనసు అంత తేలిగ్గా అలవాటు పడకపోవడమొక కారణం. స్వాతి కినిగె్‌లో అనుకోకుండా రాసే రోజుల్లో, మొదటి నెలల్లో "మీరేదో సగం సగం రాస్తున్నట్టు ఉంది, అవి కథలు కదా, ఇంకాస్త పొడిగించి రాయండి, ఇంకొంచం స్పష్టంగా రాయండి" - అని గొడవపడటం నాకింకా గుర్తుంది. కానీ, ఆ శీర్షిక ముగిసేవేళకి అవి నాకు ఉన్నవున్నట్లుగానే ఎంతగానో నచ్చాయి. ఆ చెప్పీచెప్పనితనం, కథకీ కవిత్వానికీ మధ్య ఊగిసలాడే గుణం ఆ శీర్షికని క్రమం తప్పకుండా చదివేలా చేశాయి. అదే శీర్షికతో అంతకు మునుపే నందకిశోర్ "నీలాగే ఒకడుండేవాడు" పుస్తకంలో ఒక ప్రత్యేక భాగాన్ని ప్రచురించినప్పుడు, దాన్ని కవిత్వంగా చూసేందుకు మరో ఆలోచన లేకుండా సన్నద్ధంగా ఉండటం, దాన్ని మొదటే "కవిత్వం"గా చేతుల్లోకి తీసుకోవడమేనా? అని ఇప్పుడు ఆలోచిస్తున్నాను. "నేనొక కథ చెప్తానిప్పుడు/రాశాను" అని చెప్పి మరీ చదివించే కొందరి కథల్లో ఆ వాక్యమే మొదటి ఇబ్బందిగా ఉండిపోవడం నాకైతే చాలా సార్లే అనుభవం. బ్లాగుల్లో చాలా కాలం రాసినవాళ్ళు, తరచుగా వాడే మాట ఒకటుండేది -"ఇది కథగా రాయాల్సిందండీ, దీన్ని ఇలా వదిలేశారేమి?" అన్నది. ఆ మాటను చాలాసార్లు ఆ రచనకు పొగడ్తగానే వాడేవాళ్ళు తప్ప, నిజంగా ఏవో మార్పులు చేసెయ్యమన్న అర్థంతో కాదు. "కథ" అన్న పేరు తగిలించి ప్రచురించమన్నది మాత్రమే చాలామంది సలహా. ఒక రచనను ఏ చీటీలూ లేకుండా చదివి అభినందించేశాకా, దాన్ని పాఠకులే ఒక ప్రక్రియగా గుర్తుపట్టాకా, మళ్ళీ దాన్ని పనిగట్టుకుని ఒక అరలోకి తొయ్యాల్సిన పనేముంది?
చాలా స్పష్టంగా ఇది కథ/వ్యాసం/కవిత్వం అని గుర్తుపట్టగలిగేలా ఉండే రచనలు కొన్ని ఉంటాయి. వాటిని పక్కనపెడితే, అసలు రచనలకు ఈ పక్రియలన్న పేర్లు పెట్టడం బొత్తిగా అనవసరమనీ, పెట్టకపోతేనే బాగున్నదనీ నాకు బలంగా అనిపించేలా చేసిన రచన: నేను ఈ మధ్యనే చదివిన "రియాలిటీ చెక్". ఆ పుస్తకం గురించి రాస్తూ, అరవై భాగాలుగా సాగిన ఆ విడి విడి రచనలను కథలనాలా వద్దా? అన్న మాట దగ్గరే నేనెంతో ఆలోచించాల్సి వచ్చింది. పరిశీలనా వ్యాసాలు అన్న మాట వాడాను కానీ, ఎన్నో భాగాల్లో జీవిత చరిత్రలే ఉన్నాయి. మనం అర్థం చేసుకోవాల్సిన మనుష్యుల కథలున్నాయి. తెలంగాణా వంటల గురించి రాసిన భాగమొక్కటీ నాకు నచ్చలేదు, అది ఆ పుస్తకంలో లేకుంటే బాగుండనిపించింది, నిజానికి ఇమడలేదనిపించింది. దానిని రిపోర్ట్ అనాలేమో అనిపించింది. అలా వేరే పేరు స్పురించడంతోనే దానిని వేరుగా చూడటం మొదలైంది. ఏ రచన కా రచన ఒక "సర్ప్రైస్ ఎలిమెంట్" ని మోసుకుంటూ వచ్చినందుకే ఈ పుస్తకం నాకింత నచ్చిందని చెప్తున్నా, ఇందులో కొన్ని కథలు అని నేను ఏ ప్రయత్నమూ లేకుండానే గుర్తుపట్టగలిగాను. అదే నేను, మళ్ళీ ఇదే రచయిత "చింతకింది మల్లయ్య" కథల సంపుటిగా ప్రచురిస్తే, అందులో "శ్రీమతి దినచర్య" ని చదివి, ఇదేదో రియాలిటీ చెక్‌లో ఉంటేనే బాగుండేది, కథలా అనిపించడం లేదనుకున్నాను. ఈయన రాసేవే మళ్ళీ ఈమాటలో "స్వగతం" శీర్షికన వస్తోంటే, ఆ label ఎంత చప్పగా ఉందో అని ఎప్పుడూ నిరుత్సాహపడిపోతుంటాను. అలా చూస్తే, ఈ పేర్లూ, వీటితో ముడిపడిన మన అంచనాలూ మన పఠనానుభవం మీద చూపిస్తోన్న ప్రభావాన్ని పూర్తిగా విస్మరించనూ లేమనిపిస్తోంది. ఇంతేనా, లేదూ, ఒక పత్రిక లేదా పుస్తకంలో ప్రచురణలంటే మనకున్న గౌరవమూ, అవి కొన్ని ప్రమాణాలని అందుకోవాలని మనకున్న ఆశా, అక్కడి రచనలను అతిగా పరీక్షించేలా చేస్తున్నాయా? ఫేస్‌బుక్‌లోనో, బ్లాగులోనో, అరకొర వాక్యాలైనా ట్విటర్‌లోనో రాస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు మనమింతగా రచనా ప్రక్రియల పేర్లని గమనిస్తున్నామా, అవీ ఇలా కొన్ని ప్రమాణాలతో ఉండాలని అనుకుంటున్నామా? నేనైతే అనుకోను, బహుశా అందుకే, ఈ ఈ మాధ్యమాల్లో రచనలని ఇంకా ఇష్టంగానే చదువుకుంటాను కూడా. చాలాసార్లు, వీటిలో నిజాయితీ కూడా నచ్చుతుంది, ఒక అనుభవాన్ని ఒక రచనాప్రక్రియగా మార్చడంలో జరిగే చిన్నపాటి కల్తీని దాటుకుని వచ్చి మనముందు ఉన్నందుకనుకుంటాను. సౌమ్య రాసిన మెట్రోకథల్లో ఒక కథలో, రెండు బోగీలు కలిసే ఇనుపచప్టా మీద కూర్చుంటే అలల దగ్గర కూర్చున్నట్లుందని అంటాడొకబ్బాయి. ఆ ఎపిసోడ్ ఎంత ఇష్టంగా, ఆశ్చర్యంగా, దిగులుగా చదువుకున్నానో. ఈ కథలకి పేర్లు కూడా పెట్టలేదామె.
ఈమాట ప్రయోగం వెనుక ఉన్న ఆలోచన నచ్చింది. పోతే, ఎక్కడైనా, ఎప్పుడైనా మనం దేన్నైనా సర్దుకునేది వీలు కోసం. వెదుక్కుంటే తిరిగి తేలిగ్గా అందుకోవడం కోసం. నెల గడిచాకైనా, వీళ్ళు ఈ నెల రచనలకు చీటీ తగిలించి దాస్తారా లేక సంచికను సంచికగానే చదువుకోమంటారా చూడాలి.
ఉగాది శుభాకాంక్షలు
బాగా చిన్నప్పుడు, ఉగాది రోజు ఏం చేస్తే, ఏడాది పొడుగూతా అదే మళ్ళీ మళ్ళీ జరుగుతుందనే నమ్మకం గట్టిగా ఉండేది. ఆ రోజు బాగా శ్రద్ధగా చదువుకుంటే, ఏడాదంతా అంతే శ్రద్ధగా చదువుకోవచ్చుననమాట. ఆ రోజు నవ్వుతూ ఉంటే, ఏడాదంతా సంతోషమే. ఆ రోజు అల్లరి చేసి తన్నులు తింటే, ఇదీ పూటపూటా జరిగే వ్యవహారమయిపోతుందన్నమాట. ఒక్క రోజుతో ఏడాది కాలాన్ని కట్టెయ్యడమనమాట! ఎంత తేలిక! ప్రయత్నమూ అక్కర్లే, ప్రాయశ్చిత్తమూ అక్కరలే! ఇంకొంచం పెద్దవాళ్ళమయ్యాక, ఆ రోజు చిన్నపాటి FriendshipDay కూడా అయింది. ఇష్టమైన వాళ్ళందరినీ, ఫోనులోనో, విడిగానూ, కుదిరితే రెండు రకాలుగానూనో కలుసుకోవాలి, రోజూ చెప్పుకునే కబుర్లే అయినా చెప్పుకోవాలి. అదొక కనపడని వాగ్దానం. నమ్మకంలా కనపడే ఇష్టం. చిరుచేదులు తగిలిన ఏడాదుల్లో ఎప్పుడైనా ఈ నమ్మకాలను ప్రశ్నించాలనిపించేది కానీ, మొత్తంగా చూస్తే మటుకు నాకిది ఇష్టంగానే ఉండేది. ఈ ఏడు రుచికరమైన ఉగాది పచ్చడి రహస్యం కూడా తెలిసినట్టే ఉంది :) (మావిడి ముక్కలు తరుగుతూ, పక్కింటి మామ్మగారి కొమ్మకున్న వేప పూవు దూసి తెమ్మంటే కొమ్మలు విరగొట్టుకు తెచ్చి, ఉఫ్ఫ్ ఉఫ్ఫ్ అని ఊదుతూ తెలతెల్లని లేత పూరేకులు విదిల్చినప్పుడు తెలీలేదు గానీ, డాలర్లు పోసి కొన్న వేపమండల్లో పూవెక్కడా అని వెదుకుతుంటే ఇంకా చాలా రహస్యాలే తెలిసాయ్ ;) )
సరే, మన ఊహలని కదిలించడానికీ, కలవరపెట్టడానికి, చుట్టూ ప్రపంచం ఏదో కుట్ర పన్నుతోందని అన్ని దిక్కుల నుండీ అందరూ వాపోతున్న ఈ రోజుల్లో - ఒక్క రోజంతా మనం ఎలా అనుకుంటే అలా ఉండగలమన్న నమ్మకమూ, అవకాశమూ ఇచ్చే ఉగాది మంచిదే కదా! ఏడాదంతా సాగబోయే స్నేహానికి నా తరఫు మొదటిమాటగా - అందరికీ హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు! :)
Subscribe to:
Posts (Atom)
రాగసాధిక
ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...