కవులనూ రచయితలనూ మనసు గుర్తుపెట్టుకునే తీరు చాలా చిత్రంగా ఉంటుంది. మననీ వాళ్ళనీ కలిపి బంధించే లతల మొదళ్ళు చాలా సార్లు మనమసలు గమనించుకోము కూడా. మీరు చెప్పండి, మీకిష్టమైన రచయితలను మీరెలా గుర్తుచేసుకుంటారో? నాకైతే, చూరు నుండి వేలాడే వానబొట్లు చూసినప్పుడల్లా ఇస్మాయిల్ గుర్తొస్తారు. పల్లెటూర్లో బస్సు దిగగానే కనపడే సోడాబండిని చూస్తే, శ్రీరమణ గుర్తొస్తారు. ఇసుక తిన్నెలు, ఒడ్డున ఉన్న పడవలు చూస్తే టాగోర్ చప్పున స్ఫురణకొస్తారు. ఆకుపచ్చ రిబ్బన్లు కట్టుకుని ఆకతాయిగా బడి బయట తిరిగే ఆడపిల్లలను చూస్తానా, చలం జ్ఞాపకం మెరుపులా మదిలో మెదులుతుంది; ఆ వరుసలోనే, పూరేకుల మీద వాలే సీతాకోకచిలుకలను చూసినప్పుడు, మైథిలిగారి రచనలు...
*
సారస్వతవ్యాసాలూ, నోట్స్ కలిపి 230 పేజీల సంకలనంగా మైథిలి అబ్బరాజు గారి "నిమగ్న" ప్రచురింపబడి రెండేళ్ళు కావస్తోంది. సౌందర్యమూ, సున్నితత్వమూ - ఈ రెండూ మైథిలిగారి రచనలను ఇట్టే పట్టిస్తాయి, సునాయసంగా ఆ రచనల్లోకి మనని తీసుకునిపోతాయి. ఆ పదాల్లోని మృదుత్వమూ, ఆ భావాల్లోని నైర్మల్యమూ ఇట్టే కట్టిపడేస్తాయి కూడా. కానీ, ఆ సౌందర్యస్పృహ అలవాటయ్యాక మెల్లిగా అర్థమవుతూ వచ్చేది మాత్రం సునిశితమైన గమనింపులూ, అవి చెప్పేందుకు ఎంచుకున్న విధానమూ. లెక్కకు బహుతక్కువగా ఉన్న వ్యక్తిగత అనుభవాలను పక్కన పెడితే, వాసికెక్కిన ఎందరో కవుల, రచయితల రచనల గురించి విపులమైన, విలువైన వ్యాసాలు, ఈ పుస్తకంలో ఉన్నాయి. అయితే వీటిలో ఏ ఒక్కటీ, ఆయా రచనల మంచి చెడ్డలను విడగొట్టి వివరించి చర్చించిన విమర్శలు కావు. నచ్చినవన్నీ ఏకరువు పెడుతూ వ్రాసిన సమీక్షా వ్యాసాలూ కావు. ఆయా పుస్తకాలను తానెలా సమీపించారో, ఎలా ఏ కారణాలకు దగ్గరయ్యారో ఎన్నదగిన కారణాలేవో మాత్రం ఆసక్తికరంగా చెబుతూనే వచ్చారు. నిజానికి, ఇందులో ఉన్నవెక్కువ భాగం సుప్రసిద్ధ రచనలే కనుకా, విమర్శా ధోరణిలో ఆయా రచయితలు/రచనల గురించిన వ్యాసాలు వెలువడి ఉన్నాయి గనుకా, వారి గురించైనా, వారి రచనల గురించైనా ఇప్పుడు కొత్తగా కొత్త పాఠకులకు చెప్పేందుకు మైథిలి ఎంచుకున్న పద్ధతే బాగుంటుందని నాకనిపించింది.
ఈ పుస్తకంలో వినపడే గొంతు స్థిరమైనది, అంతకు మించి స్థిమితమైనది. పగలు చదివిన పుస్తకాల గురించి రాత్రి నిద్రమానుకుని వ్రాసిన ఆలోచనలు కావీ వ్యాసాలు. ఇందులో ప్రస్తావించబడ్డ రచనల్లో చాలా మటుకు రచయిత ఎన్నోసార్లు చదివినవి, మరికొన్ని చిననాటి నుండి పరిణత క్రమాన్ని పరిశీలించుకుంటూ పునశ్చరణ చేసుకున్నవి. అంటే, వీటి వెనుక రమారమీ ముప్పై నలభయ్యేళ్ళ సాహిత్యానుభవం ఉంది, పునఃపునః పఠనాల ద్వారా రచనలను స్వంతం చేసుకున్న అధికారంతో, కొత్త లోచూపుతో మరో తరానికి ఆ రచనను పరిచయం చెయ్యగల ప్రజ్ఞా ఉంది. ఆ ప్రజ్ఞా, సుదీర్ఘ సాహిత్యప్రయాణానుభవమూ ఆమె పదాల్లో తొణికిసలాడుతూనే ఉంటాయి. ప్రధానంగా శాంతరసంలో స్థిరపడ్డ ఆలోచనలు, ప్రతిపాదనలు, గంభీరమైనవి, ఒక్కోచోట చర్చకు తావిచ్చేవీ. ఆ స్వరఛాయల నుండి బయటపడి మరొకలా ఆలోచించడానికి మనకు కొంత వ్యవథి పడుతుంది. అది ఇబ్బంది కాదు, పాఠకులుగా మనకు మనం సాధించుకోవాల్సిన మెలకువ.
ఈ పుస్తకంలో ప్రస్తావించబడిన రచనలన్నీ, 90' ల తరువాతి పిల్లలకు బహుశా పూర్తిగా కొత్తవి, అడుగూ చూపూ కూడా వెనక్కి మళ్ళించుకుని చూడవలసినవీ, చదువవలసినవీ. సాహిత్య విలువలపరంగా ప్రాసంగికత చెడని రచనలే ఎంచుకోబడటం నేను ఈ పుస్తకంలో గమనించిన ముఖ్యమైన విషయం. సాహిత్యపఠనంలో మనిషిమనిషికీ భిన్నమైన వైఖరులుంటాయి. సాహిత్యం వెలుగును చూపేదై ఉండాలనీ, చీకట్లోకి నెట్టేది కారాదనీ అనుకున్నవారిగా, మైథిలి గారి రచనలు ఏ పక్షానికి చెందుతాయో తేలిగ్గానే ఊహించగలం. కరుణ ఉన్న రచనలున్నాయి గానీ, జీవితపు చీకటి కోణాలపై పట్టుపట్టి వెలుగు ప్రసరింపజేసిన రచనలేవీ ఈ పుస్తకంలో నాకు తారసపడలేదు. కనుక, తేలిక మాటల్లో చెప్పాలంటే, హృదయాహ్లాదకరమైన రచనలు, మాటలు మాత్రమే మనమిందులో ఆశించగలం. ఈ స్పష్టత పాఠకులకు ఒక వెసులుబాటు. ఇచ్ఛాపురపు జగన్నాథరావు కథలు, బాలాంత్రపు రజనీకాంతారావు గేయాలు, ఆచంట 'నా స్మృతిపథం' వంటి వారి రచనల్లోని నాజూకుదనాన్ని, ఆయారచయితల సౌందర్యాన్వేషణని స్పష్టంగా చూపెట్టడం ఎంతగానో ఆకట్టుకుంది. వీలు కుదిరినచోటా, అవసరమైన చోటా, ఆ కాలపు పోకడల మీదుగా సాగిన వ్యాఖ్యానం అదనపు సొబగు.
నేను ప్రధానంగా కవిత్వాన్ని ప్రేమించే మనిషిని కనుక, కృష్ణశాస్త్రి, రజనీకాంతారావు, మరికొన్ని ఆంగ్లకవితల వ్యాఖ్యానం ఇష్టంగా చదువుకున్నాను. "నవ్వు చూడు తుమ్మెదకి, పువ్వు పువ్వు కోసమయి, ఆ ధూర్తపు కదలిక అంత ఝుమ్మంటూ ఉందెందుకు?" అంటూ మోహలాలసని ఒలికించిన ఆరాధనా గీతాలను కూడా తరచితరచి ఈ కవయిత్రి మాటల్లో చూసుకున్నాను, భద్రపరుచుకున్నాను. పత్రికల్లో కవితల సంపుటి మీద వ్యాసం వచ్చిందంటే, అన్నింటి గురించీ మాట్లాడాలన్న తాపత్రయంతో, మోయలేని బరువుతో, కవితలోని అందమంతా తాము ఆస్వాదించలేకా, ఒకవేళ ఆస్వాదించినా తిరిగి ఆ మేరకు పాఠకులకు అందివ్వలేకా సతమతమవుతున్నారనిపిస్తుంది మనకాలపు సమీక్షకులు, విమర్శకులు. ఒక కవిత మనని నిజంగా తాకినప్పుడు, దానిలోని అక్షరమక్షరం గురించి తాదాత్మ్యతతో చెప్పుకోనిది, అదేమి స్పందన? ఫేస్‌బుక్‌లో ఈ మధ్య మిత్రులు కొందరు నచ్చిన కవితల గురించి తమ తలపోతల నుండి ఎన్నో విషయాలతో పెనవేసి కవితనూ, అది తమను కుదిపిన అనుభూతిని, తద్వారా ఆ కవితల్లోని ప్రత్యేకతలనీ ఎంతో గొప్పగా చెబుతున్నారనిపిస్తుంది. అది, ఆ కవిత గుర్తుండిపోయేలా చేసే పద్ధతి.
*
'నా విశ్వనాథ' అంటూ విమర్శలతో సహా ఆయన్ని స్వంతం చేసుకుని, ఆ మాటను బహిరంగంగానే ప్రకటించారామె. అయితే విశ్వనాథవారిని ఇంతింత అన్న కొలతలతో బంధించడానికో లేదా అట్లా ఉన్న కొలతల నుండి విముక్తుణ్ణి చెయ్యడానికో కాక, కొన్ని మెరుపుల్లాంటి పద్యాలు వివరించి వదిలేశారీ రచయిత. ఏమిటీ పద్యాల ప్రత్యేకత? ఇవి పదహారణాల తెలుగు పద్యాలు. తెలుగు నుడికారాన్ని పాదాల్లో కుదుర్చుకున్న పద్యాలు. భయమో భక్తో ఆయన రాసినదేమిటో మనసులోకి పూర్తిగా ఎక్కించుకోకుండానే 'ఏదేదో రాసేరులెమ్మని' దూరం పెట్టేసే పాఠకులకి - ఇలాంటివి చదివినప్పుడు కొత్తగా ఆశ్చర్యమూ, కుతూహలమూ కలిపి మొదలవుతాయి. ఆ సాహిత్యం పట్ల ఆసక్తి కలిగేలా చేస్తాయి. నిజానికి ఏ సాహిత్య వ్యాసమైనా చెయ్యాల్సిన మొదటి పని సాహిత్యాన్ని పాఠకలోకానికి దగ్గర చెయ్యడమే కదా! గుణదోషచర్చలూ, విమర్శలూ అవన్నీ అటుపైని మాటలే. ఒక ఇజాన్ని నెత్తిన పెట్టుకోవడమో లేక ఖండించడమో మాత్రమే పనిగా పెట్టుకునే సమకాలీన సాహిత్య వ్యాసాలు ఏం చెయ్యలేకపోతున్నాయో, ఈ వ్యాసాలు నా మీద నెరిపిన ప్రభావం ద్వారా తెలుసుకున్నట్టైంది. Robert Frost గురించి వ్రాసిన సుదీర్ఘమైన వ్యాఖ్యలోనూ ఇట్లా కవినీ పాఠకులనీ ఒక చోట కూర్చి 'చదివిచూడండ'ని చెప్పే ప్రోద్బలమే కనపడింది నాకు. నిజానికి ఈ ఎడమే, ఈ సౌలభ్యమే నాకు గొప్ప తెరిపినిచ్చింది.
"మజ్జారే! చక్కిలిగిలి బుజ్జాయికి
బొజ్జ మీద ముద్దిడుకొన్నన్
బొజ్జ గలవేమో బుజ్జికి
ముజ్జగముల కిలకిలారు ముద్దుల నవ్వుల్" ,
"పక్క అంతయు జిమ్మితి పద్మనాభ!
అన్న చూడుము, పుస్తకమ్మట్లు పండుకొనును,
నీవేమో పక్కంత కుమ్మి కుమ్మి
పక్క యటులుండ నీవిట్లు పండుకొందు!"
శ్రమపడకుండానే అర్థమయ్యే ఇట్లాంటి పద్యాలూ, వాటికి మైథిలి గారి వ్యాఖ్యానమూ చూశాకే నేనూ కల్పవృక్షం పద్యాలు చదువగలనన్న నమ్మకం కుదిరింది. అన్నీ అర్థమయిపోతాయని కాదు- అర్థం చేసుకోవడానికి ఒక మొదలూ, వెదికేందుకొకింత బలమూ, నాకు "నిమగ్న"లో దొరికాయి. అలాగే, హృదయాహ్లాదిని కుందమాల, తప్పనిసరిగా చదువవలసిన మరొక వ్యాసం. రాముడి వ్యక్తిత్వాన్ని, సీత పట్ల అతని అనురక్తినీ ఎంత గొప్పగా ఈ వ్యాసంలో పొందుపరిచారో చూస్తే ఆశ్చర్యమనిపిస్తుంది. వివాదాల అయోధ్యా రాముడి ప్రస్తావన ఇప్పుడిక్కడ అప్రస్తుతమే కానీ, నేను అంటున్నదల్లా ఒక పాత్రగా రాముడిని ఎట్లాంటి ప్రేమికుడిగా చిత్రించారో గమనించమనే.
"సుఖము నందు దుఃఖమునందు సువ్యక్తమై చెప్పనక్కరలేనిదై(ఆమె) ఆత్మయందున్నది. దోషమునకుగాని, గుణమునకుగాని సంబంధములేని కారణరహితమైన యొక భావబంధము నాకామె యందున్నది." - అన్న మాటలు ఏ ప్రయత్నమూ అక్కరలేకుండానే నా మనసులో ముద్రించుకుపోయాయి.
*
"ఏమీ లేని గగనం లో హరివిల్లొకటి విరిసే వేళ , ఆ క్షణమే నా కల - వేకువకి మేల్కొంటుంది.
వాగు మీంచి వీచే తెమ్మెర - ఆనందాలన్నీ పేనిన వేణుగానమయి నిమిరి వెళుతుంది
వసంతానికి జ్ఞాపకాలూ తియ్య తియ్యగా చివురులు పెడతాయి. నా సుఖ స్వప్నాల కి సూర్యకాంతిలా నువ్వు వెలిగిపోతుంటావు
పురివిప్పిన నెమలికాటు కి రాత్రంతా వలపు అలజడి - కాని, సొగసా - నీ ఆకృతి ఒకటే ఆకర్షణ కవతలి హద్దు"
అన్న మలరే పాట అనువాదం చదివింది మొదలూ, మైథిలిగారి పేజ్‌ని బుక్‌మార్క్ చేసుకున్నాను. ఫేస్‌బుక్ విధిగా మన స్నేహాలను గుర్తుంచుకుని మనకూ గుర్తుచేసి సంబరాలు చేస్తుంది కానీ, ఇక్కడి పరిచయాలు ఆసక్తులుగానూ, ఆకర్షణలు ఆత్మీయంగానూ మారే ఉద్విగ్నక్షణాలేవో దానికి తెలీవు. అవిట్లా మనకు మనంగా చెప్పుకుంటేనే తప్ప బయటపడని రహస్యాలు.
#mythilipoetry పేరిట గత కొద్ది నెలలుగా ఆంగ్ల కవితలకి అనువాదాలు చేస్తున్నారీ రచయిత, వాటిలో కొన్నైనా ఈ పుస్తకంలో ఉంటాయని ఆశించానేమో, చిన్న ఆశాభంగం! అవన్నీ త్వరలోనే ఒక ప్రత్యేక సంచికగా రావాలి. నవల, నాటకం, గేయం, కథ, కవిత - ఇలా సాహిత్యరూపాలెన్నింటినో స్పృశిస్తూ లోతైన ఆలోచనలతో ప్రతిపాదనలతో వివరణలతో ప్రవాహసదృశ్యమైన రచనావేగాన్ని చూపెడుతూ సాగిన ఈ పుస్తకంలోని కాగితాలు నా కళ్ళ ముందు రెపరెపలాడినప్పుడల్లా, " కుడిఎడమలే కానరాని తుదిమొదళ్ళే తోచబోని స్వప్నమధువుల జడుల లోపల స్వాంతమున జ్ఞాపకపు పొరలు, పొరల లోపల తెరలు తెరలుగ.." అన్న రజని గీతం అప్రయత్నంగా నా పెదాలనల్లుకుంటోంది.
No comments:
Post a Comment