ముల్లు



కాలింగ్బెల్ వింటూనే తలుపులు తోసుకొచ్చి
పాదాలను చుట్టుకుపోయే చిట్టి సంబరాన్నీ
మూడడుగుల ముద్దుల మూటై ప్రతిరోజూ
హత్తుకు పడుకునే వాడి పరిమళాన్నీ

మళ్ళీ మళ్ళీ ఊహించుకుంటూ
బస్సెక్కుతుందామె.

ఎర్రరంగు దీపాలను పొడవలేక
పెద్దముల్లు విరుచుకుపడిపోతుంది
చిన్ని ముల్లేదో ఆమె గుండెల్లో ఉండుండీ
గుచ్చుకుంటూనే ఉంటుంది

బండి వెనుక కూర్చుని, తమ భరోసాని హత్తుకుంటూ, పిల్లలు.
పెద్ద పెద్ద పాదాలను, పసి అడుగుల్లో ఒదిగించుకునే పిల్లలు.  
ఆనుకు నిలబడ్డ పొడుగు చేతులను పట్టి ఊపుతూ,
తోపుడుబళ్ళ చుట్టూ పిల్లలు. ఆ ముఖాల్లో తన ప్రాణం...

ఏడవ నెలలో కడుపులో నుండీ ఒక్క తాపు తన్నినప్పుడు
ఉలిక్కిపడి కదిలినప్పటి కలవరం మళ్ళీ ఆమెలో.
పాలపళ్ళొస్తున్నప్పుడు చనుమొనలను కొరికినప్పటి నొప్పి,
మళ్ళీ ఆమె నరనరాల్లో పాకుతో.

ఊచలను పట్టుకు కూర్చుని,
ఉచ్చు బిగిసిందెలానో ఆలోచించుకుంటుందామె.
ఉమ్మనీటి సంచీ పిగిలి వరదై ముంచెత్తినట్టు
నిబ్బరంగా దాచుకున్న ఆమె దిగులు పగిలి,
కన్నీళ్ళుగా- కొన్ని జ్ఞాపకాలు.
పళ్ళను తిని గింజలను ఊసేయమన్నవాడిని
విదిల్చికొట్టాక ఉదయించిన కొన్ని మెలకువలు.

దారులు చీల్చుకుంటూ ప్రయాణం సాగుతుంది.
రంగులు, వెలుగులు, సందళ్ళల్లో
ఆమె మనసేదో జవాబు వెదుక్కుంటుంది. 

అవసరాన్ని, అహాన్ని,
ఓటమినీ , ఓపికనీ,
భయాన్ని, భవిష్యత్తునీ

అనుక్షణం తూచుకోవడంలో
తడారిపోయిన కళ్ళతో ఆ అమ్మ.
ఆమె ఫోన్ స్క్రీన్లో
బుగ్గ మీద ముద్దు పెడుతున్న బుజ్జాయి బొమ్మ! 

(తొలి ప్రచురణ, టాగ్స్ తెలుగు వెలుగు పత్రికలో..)

నాకు యశోద అంటే అసూయ!!

నాకు యశోద అంటే భలే అసూయ! ఆవిడేదో భువనైకమోహనుడిని ఎత్తుకు మోసిందనీ, ఒళ్ళో వేసుకు ఆడించిందనీ కాదు. పైకి చెప్తే మరో పది మంది చూపు పడుతుందని ఆగడమే కానీ, ఏ తల్లికి తన బిడ్డ అందగాడు కాకుండా పోతాడు? ఆ యశోద కొడుకు కమలదళాక్షుడైతే, మన పిల్లల కళ్ళు పెరటి చెట్టు బాదం కాయలు. కన్నయ్య నెన్నుదిటిపై తుమ్మెద రెక్కల్లా వాలే బిరుసైన ఉంగరాలు చూసుకుని ఆయమ్మకు అతిశయమేమో గానీ, తిరుపతికి వెళ్ళొచ్చిన మన చంటోడి బోడిగుండైనా మనకు గుమ్మడిపండే కదా! ఇక అల్లరంటారా.. ఎవరి పిల్లలెంత తుంటరులో బయటవారికి తెలీదు. కన్నయ్య నోట్లో యశోదకు మాత్రమే కనపడ్డ కృష్ణమాయలా, పిల్లల అల్లరి అమ్మల పెదవి దాటని రహస్యం. చూసినవాళ్ళు మాయలో మర్చిపోతారు, చూడనివాళ్ళు నమ్మమంటారు.

ఇంకెందుకూ అసూయ అనేగా మీ సందేహం? అక్కడికే వస్తున్నా.

అమ్మనయ్యాకే శ్రీకృష్ణకర్ణామృతం నా చెవిన పడటం కాకతాళీయమని అనుకోబుద్ధి కాదు. ఆ యశోద తన ముద్దుల పట్టికి పొట్ట పట్టినన్ని పాలు పట్టనే పడుతుందా..ఐనా ఆ అల్లరి కన్నయ్య ఆడుతూ పాడుతూ ఏ గొల్లభామ దరికో చేరి, ఆ ఇంటి వెన్న గిన్నెలు కూడా ఖాళీ చేసేస్తాడుట. ఏ అత్తాకోడళ్ళ మధ్యో చిచ్చు పెట్టి పెరుగు కుండలు గుటుక్కుమనిపించి చల్లగా జారుకుంటాట్ట. పగలూ రాత్రీ భేదం లేకుండా, అమ్మ ఒడి చేరి కూర్చుని, పాలగిన్నె తీసుకురమ్మని మారాం చేస్తాట్ట! ఇప్పుడా పాలగిన్నె లేదురా అంటే, ఎప్పుడొస్తుందో చెప్పమని ఎదురు ప్రశ్నలు వేసి విసిగించేస్తాట్ట. రాత్రికి పాలు వస్తాయి లెమ్మని బుజ్జగించబోయిన యశోద ముందు, తన రెండు కళ్ళూ మూసుకుని, "చీకటైపోయిందిగా, ఇక పాలు తెమ్మ'నేటంత మొండి తండ్రి కృష్ణుడు. అడిగి మరీ బొజ్జ నింపుకునే పిల్లలుంటే, అలక నటించైనా మళ్ళీ మళ్ళీ ఆకలంటూ నోరు తెరుస్తుంటే, అమ్మలకు ఎంత హాయి!

నా బుజ్జాయి గులాబీ పిడికిళ్ళింకా విడువకుండా గాల్లోకి పిడిగుద్దులు విసురుతూ, గంట గంటకీ కేర్ర్ర్..మన్న ఏడుపుతో బొజ్జ నింపుకున్నన్నాళ్ళూ నాకూ బానే ఉంది. జాషువా అన్నట్లు, "బొటవ్రేల ముల్లోకముల జూచి లోలోన ఆనందపడు నోరు లేని యోగి" వాడప్పుడు. కన్రెప్ప వాలిందో లేదో కూడా చూసుకునే తీరిక లేక, ఓపిక మిగలక, వాడే ప్రపంచంగా మసలిన నెలలన్నీ దాటుకుని, అన్నప్రాశన చేయించాక మొదలైంది, యశోద మీద నా అసూయకు మూలమైన అసలు కథ.

*

ముక్కాలి పీటలు రెండు - ఒకటి వాళ్ళు కూర్చోవడానికీ, రెండవది వాళ్ళ కాలిమడమల క్రిందకీ - అటూ ఇటూ సర్దుకుని, ఎత్తు సరిచూసుకుని కూర్చుని, "ఇలా తేమ్మా పిల్లాణ్ణి" అంటూ, మా అమ్మో, అత్తగారో నా వైపు చేతులు చాచేవారు. చాచిన కాళ్ళ మీద జాగ్రత్తగా బుజ్జాయిని బోర్లా పడుకోబెట్టుకుని - మాడు చల్లబడేట్టు నూనె పెట్టి, ఒళ్ళంతా మర్దించి,  గట్టి పట్టుతో నలుగు పెట్టి, చెంబుల కొద్దీ వేణ్ణీళ్ళు పోస్తే మత్తుగా నిద్దరోతునట్టే పోయించుకునేవాడు. వాళ్ళలా రక్ష పెట్టి బుజ్జాయిని నా చేతికివ్వగానే  మెతమెత్తటి తువాల్లో బొమ్మను చుట్టినట్టు చుట్టేసి, బొజ్జను వాసన చూడటానికి వంగి, ఆగలేక ముద్దులాడి, మంచం మీద బజ్జోపెట్టి లేలేత రంగుల బట్టలు వాడి కళ్ళ ముందు ఊపేదాన్ని.  గాల్లోకి చేతులు, కాళ్ళూ విసురుతూ, నే చెప్పే కబుర్లన్నీ ఉక్కూ ఉంగా లతో వింటూ బట్టలేయించుకునేవాడు. ఆ తంతు కాస్తా ముగిసేవేళకి, "స్నానానికి అలసిపోతారు పిల్లలు, ఓ ముద్ద అన్నం పెట్టి పడుకోబెట్టేయ్రాదా" అని వెనుక నుండి ఎవరో ఒకరు అననే అనేవారు. నేనెక్కడ మర్చిపోతానో నని "అన్నప్రాశన చేశాక రోజూ ఇంత ముద్దైనా పెట్టాలమ్మా" అని చివర కలిపేవారు.

వాడి అన్నమంటే మన అన్నంలో ఓ ముద్ద తీసి పెట్టడమా మర్చిపోవడానికి, అదొక పెద్ద ప్రహసనం. కందిపప్పూ, పెసరపప్పూ దోరగా వేయించి, బియ్యంతో పాటు సన్నగా మిక్సీ పట్టి, ఒకటికి మూడో నాలుగో నీళ్ళు పోసి ఉడికించి, చారెడు నెయ్యీ, చిటికెడు ఉప్పూ కలిపి, మన అన్నంతో పాటు ఉడికించిన బంగాళదుంపో, కేరట్ ముక్కో లేదూ చిట్టి చిలకడ దుంపో మెదిపి, జారుగా ఉండాలనివాళ్ళ కోసం ప్రత్యేకంగా కాచిన చారు ఓ చెంచాడు జోడించి, ఆ నేతి పోపు ఘుమాయింపులు తగిలిన గిన్నెను మహానైవేద్యమంత భక్తిగా పట్టుకు వాడి దగ్గరకు వెళితే...ఏం చేసేవాడు!!

గిన్నె చూస్తూనే పెదాలను చిత్రంగా బిగించేసేవాడు. అదెంత చిత్రమంటే గింజుకోవడానికీ, ఏడవటానికి తెరుకునే నోరు, పొరపాటునైనా, ఒక్క రవ్వనైనా నాల్క మీద పడనిచ్చేది కాదు. ఊరూ పేరూ తెలియని వాళ్ళ కథలన్నీ ఇంట్లో ఎడాపెడా వినపడ్డ రోజులవి. ఫలానా వాళ్ళ పిల్లాడు కూడా ముద్ద మింగేవాడు కాదుటమ్మా, అరికాళ్ళ మీద చిటికె వేస్తే నోరు తెరుస్తారుట! అని చెబితే, మానవప్రయత్నంగా, కిమ్మనకుండా అమలు చేసేదాన్ని. ఇంకా చంటివాడేగా, కాళ్ళ మీద పడుకోబెట్టుకుని స్పూన్‌తో పెట్టమంటే దానికీ ఊఁ కొట్టాను. స్పూన్ కళ్ళ ముందుకు రాగానే దొర్లి కింద పడిపోయేవాడు, లేదా కాళ్ళ మీదే బోర్లా పడి బావురుమనేవాడు. పాపం, నా అక్క పిల్లలు - చాక్లెట్లో ఐస్క్రీములో కొనిపెడతానని ఎర వేస్తే, వాటి మీద ఆశలేకపోయినా పిన్ని మీద జాలితో, పక్కనే కూర్చుని చప్పట్లు కొడుతూ పిల్లాణ్ణి తినమని ఉత్సాహపెట్టే ప్రయత్నాలేవో చేసేవాళ్ళు. నవ్వులైతే దోసిళ్ళల్లో పట్టనన్ని వచ్చాయి కానీ, అన్నానికి మాత్రం ...ఊహూ!! పియానోల మీద పిల్లల సంగీతాలయ్యాయి. వాళ్ళ వచ్చీ రాని చిందులయ్యాయి. ఫలితం నాస్తి. "చికుచికురైలు వస్తోంది అంటే మన రాకి కొడుకు ఇట్టే నోరు తెరిచేవాడమ్మా "- అన్నారు మా అత్తగారొకసారి. ఆశగా చూశానావిణ్ణి. "నీ తోడికోడలు ముప్పూటలా ఆ వెధవ పాట నా చేతే పాడించింది - ఏడాది పాటు! ఉపాయం చెప్పాను - ఆనక నీ ఇష్టం" - మొహమాటం లేకుండా చెప్పేశారావిడ. ఆ పాట ఆవిడనెంత క్షోభ పెట్టిందో కళ్ళారా చూసి ఉన్నాను కనుక, జాలిపడి వేరే ఉపాయాల వేటలో పడ్డాను.

ఎన్ని శబ్దాలు చేయనీయండీ, ఎన్ని మాటలు చెప్పనీయండీ.. గిన్నె చూస్తే మొదలయ్యే మా వాడి రాగం మాత్రం నేనాపలేనిదైపోయింది. ఒకానొక మధ్యాహ్నం అలవాటుగా సాగుతోన్న వేషాలన్నీ విఫలమయ్యాకా,  "ఏడుకొండల వాడా, వెంకట రమణా ..! ఏమిటయ్యా నాకీ శిక్ష!" అని వాపోతోంటే, "తెరిచాడేవ్!" అరిచింది మా అమ్మ.

లేవబోయినదాన్నల్లా చటుక్కున చతికిలపడ్డాను. పరీక్షిస్తున్నట్టు మళ్ళీ అవే పదాలు ఒత్తి ఒత్తి పలికాను. బోసిగా నవ్వాడు. ఎర్రెర్రని చిగుర్లను తాకుతూ పల్చని నాలుక మీదకు జారింది ముద్ద. రెట్టించిన సంబరంతో గోవింద నామాలు చెప్పుకుపోయాను. గిన్నె ఖాళీ చేశాకా గుర్తొచ్చింది, కడుపుతో ఉన్నప్పుడు సాయంకాలాల్లో బాల్కనీలో కూర్చుని వుంటే, ఎదురుగా ఉన్న కళ్యాణ వేంకటేశ్వర స్వామి గుడిలో నుండీ గోవింద నామాలు, విష్ణు సహస్ర నామమూ వినపడుతూ ఉండేవి. పొట్ట మీద చేతులేసుకుని అంటూ, వింటూ అలాగే కునుకు తీసిన రోజులు కోకొల్లలు. బాలసారె నాడు బంగారు ఉంగరంతో బియ్యంలో రాసిన పేరా ప్రహ్లాదుడిది. పానీయంబులు తాగుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలానిద్రాదులన్ సేయుచున్.. సతతం శ్రీహరి నామ స్మరణలో మునిగి తేలిన పిల్లవాడి పేరు పెట్టాక తప్పేదేముంది!

రహస్యం తెలిసింది కదా! ఇక అది మొదలూ, ఏది వాడి గొంతు దిగాలన్నా, ముందు కాసిన్ని వేడి నీళ్ళో, టీ చుక్కలో నా గొంతులోనూ పోసుకుని, వాణ్ణందుకునేదాన్ని.

రోజుకు రెండు రకాల పళ్ళు కదా పిల్లల లెక్క. అరటిపండు చక్కా గుజ్జు తీసి ఓ రోజు, యాపిల్ మెత్తమెత్తగా కోరి ఓ రోజు, గింజలు తీసేసిన కమలా తొనలు వెనక్కు విరిచి ముత్యాలు వాడి పగడాల పెదాలకంటిస్తూ ఓ రోజు, బొప్పాయి గుజ్జు తీసి మరో రోజు- ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏ లింగాష్టకమో అందుకుంటే పనైపోయేది. కాకపోతే మనకు శివాష్టకం లేకనా!

బాదం, జీడిపప్పు, ఖర్జూరాలు, పిస్తా, కిస్మిస్ కాస్త పాలల్లో నానబెట్టి మెత్తగా మిక్సీ చేసి స్మూతీలా ఇచ్చేటప్పుడు, ఏ అన్నమయ్య కీర్తనైనా అక్కరకొచ్చేది. వారాలను బట్టి వీలుగా ఉంటుందని, లెక్కగా ఉంటుందని, హనుమాన్ చాలీసా ఓ రోజు, లక్ష్మీ అష్టోత్తరాలొకరోజు, ఆఖరకు ఆదిత్య హృదయం కూడా దగ్గరుంచుకుని, వీడి ఖాతాలోనే చదువుకునేదాన్ని.

ఇడ్లీ దోశలకూ, చపాతీల్లాంటి వాటికీ, నామరామాయణం, మధురాష్టకం సరిపోయేవి.

పాలకు మామూలుగా ఏ జంట వాయిద్యమూ అక్కర్లేదు కానీ, ప్రయాణాల్లో అవసరమనిపించినప్పుడు "రారా చిన్నన్నా.." అనో, "ఇట్టి ముద్దులాడేబాలుడేడవాడే !" అనో మొదలెడితే అయ్యేలోపు చేమపూవు కడియాల చేతులు ముడుచుకుని పెదాల మీద పాల చారికలతోనే నిద్రలోకి జారుకునేవాడు.

ముద్ద నోట్లో పెట్టాకా మాటమాటకూ తడుముకోవడం ఏం బాగుంటుంది! అందుకే అన్నానికి మాత్రం సహస్రనామాలే దిక్కు.

ఏడాది కాలం లోయలోకి జారిన నెమలీకలా తేలిగ్గా కరిగిపోయాక, పద్ధతి మార్చి కథల్లోకి వచ్చిపడ్డాం. చంకనేసుకుని చందమామను చూపిస్తూ గోరుముద్దలు పెట్టేప్పుడల్లా అనిపిస్తుంది- అమ్మకు అక్కరకొచ్చేవాడు పిల్లాడికి మామ కాక మరేమవుతాడని! దారిన పోయే మనుష్యులు, రోడ్డు పక్కన చెట్లకి కట్టిన చీర ఉయ్యాలల్లో ఊగే పిల్లలు, దుమ్ములో దర్జాగా పడుకునే వీధి కుక్కలు, వచ్చీపోయే ఆటోలు, బస్సులు, కార్లు, పక్కింటికి వచ్చి వెళ్ళిపోయిన చుట్టాలు - కావేవీ పిల్లల అన్నాల కథల కనర్హం!

రాసుకోరు కానీ, అమ్మలందరూ రచయితలే. ఎవ్వరూ గమనించి భుజం తట్టరు కానీ, చెప్పిన కథ చెప్పకుండా పిల్లలకు తాము నమ్మిన మంచీ మర్యాదలేవో మప్పుతూనే ఉంటారమ్మలు. పిల్లల పొట్ట నింపాలన్నా, వాళ్ళు కంటి నిండా నిద్రపోవాలన్నా, గొంతు పోయేలా ముచ్చట్లు చెప్పకుండా ఎలా! పుస్తకాలు కొనే చదువుతారో, విని వంటబట్టించుకున్న కథలే చెబుతారో, ఆశువుగా సృష్టించి మెప్పిస్తారో, ఏదైతేనేం- వ్రతమేదైనా ఫలం దక్కించుకునే తీరుతారు అమ్మలు! వాళ్ళ సంకల్పాలు గట్టివి.

ఇల్లంతా పీకి పందిరేసినా తిప్పుకు సర్దుకుంటాను కానీ, అన్నం వద్దని తల తిప్పుకుంటే భరించలేను అనే నాలాంటి అమ్మలను మీరూ చూసే ఉంటారు. పిల్లలు చేసే అల్లరినీ, వాళ్ళు తినే ముద్దలనీ అమ్మ రెప్పల మాటున దాగిన తరాజు అహరహం గమనించుకుంటూనే ఉంటుంది కాబోలు. పసివెన్ను నిమిరితే మెల్లగా తన్నుకొచ్చే త్రేన్పుకే అమ్మకు సగం ఆకలి తీరుతుందని ఎవరైనా తీర్పునిచ్చారేమో, మెల్లిగా ఆరా తీయాలి. వాళ్ళ వెనుక తిరిగీతిరిగీ హరించుకుపోయిన ఓపికకు చెల్లుబాటయేందుకు, మిగిలిన సగం ఆకలీ తీరేందుకు, గుండిగలైనా సరిపోకపోవడం తరువాతి మాట.

అయినా ఈ కంఠశోషేం అక్కర్లేకుండా, కన్నయ్యలా తానే తల్లి మీదమీదకొచ్చి గిన్నెలు చూపించమని అడిగేవాడూ, ఊరిలో ఇల్లిల్లూ తిరిగి మాయ చేసో మంత్రం వేసో కడుపు నింపుకునేవాడూ కొడుకుగా పుట్టినందుకు, యశోదంటే నాలాంటి మామూలు అమ్మలకు అసూయ ఉండటం చిత్రమా!


(ఇది ఎప్పుడో మా రేఖ కు బాకీ పడ్డ రాత! వాళ్లబ్బాయి ముచ్చట్లు వినీ నేనూ రాయబోయి ఆపేసిన మా ఇంటి కథ. తొలి ప్రచురణ, మామ్స్‌ప్రెస్సో, తెలుగు ఎడిషన్‌లో.) 

బుజ్జికన్నలు

బ్లైండ్స్‌లో నుండి కొంత కొంతగా మసక వెలుతురు చొరబడి పరుపు మీద పరుచుకుంటోంది. బక్కపల్చటి దేహాన్ని నా మీదకు తోచినట్టు వాల్చుతూ అడిగాడు నా చిట్టివాడు ..

"అమ్మా..ఈ రోజు నువ్ వేల్‌గా ఉంటావా?"

"ఊ?" సర్దుకుంటూ వాడి వైపు ఒత్తిగిలి అడిగాను -"ఎందుకురా?"

నా పొత్తికడుపును మీగాళ్ళతో తొక్కి వెనక్కు పాకుతూ చెప్పాడు.."అప్పుడూ నేను నీ మీదకి ఎక్కి పడుకోవచ్చూ..నువ్వు నన్ను ఈదుతూ ఈదుతూ తీసుకెళ్ళిపోవచ్చూ, అప్పుడు నేను శాం లా నిన్ను గట్టిగా పట్టుకుంటే ఒక ఐలాండ్‌కి వెళ్ళిపోవచ్చూ.."

"వెయిట్! శాం పెంగ్విన్ కదా..నేను వేల్ అయితే నువ్వూ వేల్ వే అవ్వాలి. బేబీ వేల్.."

"నేను పెంగ్విన్ అయితే?"

"నేను కూడా పెంగ్వినే"

"అయితే అప్పుడు నేను పెంగ్విన్.."

"అప్పుడు నువ్ నా మీద ఎక్కి ఈదలేవ్ కదా.."

"అది కాదమ్మా..."

"నువ్ బజ్జో కన్నా ముందూ.."

"కథ చెప్పైతే?"

"అనగనగా.."


💓

"మ్మా.."

"కింద స్నో స్నో చూసుకో...!!"

" అందుకే మనం బర్డ్స్ అయిపోవాలమ్మా.."

" నువ్ గట్టిగా పట్టుకో ముందు, జారవ్. ఏం బర్డ్స్ ఇంతకీ?"

"ఏవైనా...అమ్మా, flock అంటే తెలుసా నీకు"

"తెలుసూ..నీకెవరు చెప్పార్రా?"

" Mrs. Heinen. , "అమ్మా..గౌతూ, మనూ, నేనూ, నువ్వూ, నాన్నా, కీర్తి ఆంటీ అందరం ఒక కార్ లో వెళ్ళగలమా? flock ఐతే వెళ్ళచ్చు..."

"నిజంగానా?"

"చలేస్తే చెట్టులోకైనా వెళ్ళిపోవచ్చు..."

"తొఱ్రలోకా?"

"కాదమ్మా..అది ఉడతల ఇల్లు!"

"మరి?"

"నెస్ట్."

"ఓహో..మరప్పుడు నువు నా దుప్పిలో బజ్జోవా? నాకు చలేస్తే?"

"ఊహూ..వింగ్స్ క్రింద..warm గానే ఉంటుంది."

💓


"అమ్మా నీకు పప్పీ ఇష్టమా?"

"ఊహూ..నాకు నువ్వే ఇష్టం. యూ ఆర్ మై స్వీట్ లిల్ పప్పీ...mmuuaaah..." 

"అలా గట్టిగా పెట్టకమ్మా..పప్పీ కి వాళ్ళ అమ్మ ఎలా పెడుతుందీ...అలా ..ఇలా.."

"ఛీ..!!"

"ఎందుకూ..!!

"నేనేమైనా డాగ్‌నా"

" మరి నేను పప్పీని కదా.."
💓

ఈ రోజు పొద్దున ఏదో జనరల్ చెకప్ కోసం డాక్టర్ దగ్గరకి వెళ్తున్నాం. సరిగ్గా ఎనిమిది దాటి బయలుదేరాం. మెయిన్ రోడ్ మీదకు వచ్చిన క్షణం నుండి వీధి వీధిలోనూ స్కూల్‌బస్సులే. ఇక్కడ స్కూల్ బస్సుంటే, దాన్ని దాటి వెళ్ళడం చట్టరీత్యా నేరం. దానికి ఎర్ర సిగ్నల్ ఫ్లాష్ అవుతుంటే, వెనుక బండి పూర్తిగా ఆగిపోవాలి. ఇలా ఆగుతూ ఆగుతూ అసలెప్పటికి చేరతాం, కేన్సిల్ చేసేస్తారేమో అపాయింట్మెంట్ అని మాట్లాడుకుంటున్నాం.

"టాటా" వెనుక సీట్‌లో నుండి చేతులూపుతూ అరుస్తున్నాడు ప్రహ్లాద్.

ఎవరికా అని కుతూహలంగా బయటకు తొంగి చూశాను. ఎవరో అమెరికన్ అతను, వాళ్ళబ్బాయి బస్‌లో ఆఖరు సీట్ దగ్గర నిలబడి టాటా చెప్తుంటే తనూ టాటా చెబుతున్నాడు.

అపాయింట్మెంట్ కంగారు తగ్గి, మెల్లిగా నా మొహంలోకి నవ్వొచ్చి చేరింది.

ఆ తరువాతి దారిలో దాదాపు పది మంది బస్ ఎక్కడం చూసి ఉంటాను. ఇళ్ళ తలుపుల మాటు నుండీ భుజం తట్టి పంపింది కొందరు. బస్ ఎక్కించి గాల్లోకి ముద్దులు విసిరింది కొందరూ. బస్ కనుచూపు మేర దాటేవరకూ ఆ మంచు ఉదయంలో జేబుల్లో చేతులు దోపుకుని అలాగే నిలబడి చూసింది కొందరు. వినపడుతుందా, వింటారా అన్న సందేహమే లేనట్టు "బై హనీ" అని అరిచింది కొందరు. వాళ్ళ నోటి ముందు తెల్లటి ఆవిరి గాల్లోకి గింగిరాలుగా కదలడం మైమరపుగా చూస్తుండిపోయాను.

హాస్పిటల్ కు చేరుకున్నాం.

ఎలాగూ వచ్చానని, ఫ్లూ షాట్ వేస్తానని చెప్పింది నర్స్. సరేనన్నాను.

అరచేతులు వెచ్చదనం కోసం రుద్దుకుంటూ చుట్టూ చూస్తున్నాను. క్రిస్మస్ ఎరుపూ తెలుపు రంగుల్లోనే ఉత్సవ సంబరమేదో ఉంటుందనుకుంటాను. గదంతా ఏవేవో బొమ్మలు, పోస్టర్లతో నిండి ఉంది. బయట నుండి కూడా కనపడేలా అద్దం ముందు ఒక చూడ ముచ్చటైన క్రిస్మస్ ట్రీ ఉంది. చిన్న చిన్న వెలుగులు, మెరుపు బంతులూ, చిట్టి చిట్టి గిఫ్ట్ బాక్సులూ ఒదిగి వేలాడుతూ ఉన్నాయి దాన్నిండా.

నఖశిఖపర్యంతం జాకెట్లలో దాచుకుని బస్‌లెక్కిన పసివాళ్ళంతా కళ్ళ ముందు మెదిలారు. వాళ్ళ అమ్మలూ, నాన్నలూ.

ప్లే ఏరియా వైపు దూకడానికి నా అనుమతి కోసం కళ్ళలోకి చూస్తూ దగ్గరకొచ్చాడు ప్రహ్లాద్.

"బుజ్జీ..మనం శాం అవ్వద్దు. బర్డ్స్ కూడా అవ్వద్దు. సరేనా?" ఒళ్ళోకి లాక్కుంటూ అన్నాను.

"ఊ..ఎందుకు? మరి పప్పీస్ కూడా అవ్వద్దా?"

"ఊహూఁ వద్దు. ఇలాగే ఉందాం ఓకేనా?"

"పోనీ బేర్స్? ఆవూ దూడా..?"

"నో! నో!"

"ఓకే. " మణికట్టు విడిపించుకుని ప్లే యేరియా వైపు పరుగు తీశాడు. అంతలోనే మళ్ళీ తూనీగలా తిరిగొచ్చాడు.

"కానీ నేను ఫ్లూషాట్ తీసుకోను ఓకే???" వేళ్ళతో నా మొహం ముందు X రాసి వెనక్కి వెళ్ళిపోయాడు.

💓💓💓

అమాయకపు బాల్యానికి అందమైన హీరోలు

"చినతండ్రీ..బళ్ళో టీచర్ చెప్పింది జాగ్రత్తగా వినాలి..సరేనా?" గడ్డం పట్టి పాపిడి తీస్తూ ఏ వెయ్యోసారో చెప్పాను. బుద్ధిగా తలూపాడు నాలుగేళ్ళ నా పసివాడు. "ఎటూ వెళ్ళిపోకు నాన్నా, ఎవరైనా ఏమైనా అన్నా వెంటనే టీచర్‌కి చెప్పాలి..ఏం?!" చొక్కా సరిచేసే నెపంతో వెనక్కు గుంజి మళ్ళీ గుర్తుచేశాను. వాడికిష్టమైన బొమ్మతో కుస్తీలుపడుతూ, అలవాటుగా ఒప్పుకున్నాడు. "మంచినీళ్ళు ఇక్కడ పెట్టాను, ఆకలైతే ఇందులో పప్పుండలున్నాయ్..నువ్వు తిని, నీ ఫ్రెండ్స్ కి కూడా ఇవ్వు. ఇబ్బందైతే టీచర్‌కి చెప్తావుగా" జేబులో రుమాలు దోపుతూ అడిగాను. "ఊఁ" కొట్టి ఆటల్లో పడిపోయాడు.

చిట్టి స్నాక్స్ డబ్బా ఒకటి సంచీలో సర్ది వెనక్కు వచ్చేసరికి, వాళ్ళ నాన్న పొట్టి స్టూల్ మీద కూర్చోబెట్టి సాక్స్ వేసి, షూ లేసులు కడుతున్నాడు. నా ముఖంలోని భావం అర్థమై "అప్పగింతలయినట్టేనా?" అన్నాడు ప్రసన్నంగా. తలాడించాను. "పిల్లలు ఏడుస్తారని విన్నాను కానీ..తల్లుల గురించి ఎక్కడా వినలేదే?!" కవ్వింపుగా అంటూ పిల్లవాణ్ణి బయటకు బయలుదేరదీశాడు. నాన్న వేళ్ళను చిట్టి చేయి చుట్టుపోయింది. బాల్కనీలోకొచ్చి నిలబడేసరికి అద్దాలు దించిన కారులో నుండి నవ్వుతూ టాటా చెబుతున్నాడు నా బుజ్జాయి!

వెనక్కి తిరిగి చూసుకుంటే హాల్ నిండా బొమ్మలు. టేబుల్ మీద పళ్ళెంలో వాడు తిననని మారాం చేసి వదిలేసిన ఇడ్లీ ముక్కలు. మూడు గుంటలున్న ఆ పళ్ళెం వాడికి ఊహ తెలిసిన నాటి నుండీ మహాప్రియమైనది. తినేదుండదు కానీ గుంటలు మాత్రం నిండాలి. "ఎర్ర కాం" కావాలమ్మా అంటూ ఆవకాయ నంజుకుంటాడు, ఆవకాయేమీ కారం ఉండదుట వాడి నాల్కకి. మా అమ్మకి చెబితే "ఇదేం అన్యాయం! వేలెడంత లేడు వెధవ, నా ఊరగాయకే వంకపెడతాడూ!" అని ఎప్పుడూ ఆశ్చర్యపోతుంది. రెండో గుంటలోని కొబ్బరి పచ్చడి ముట్టనైనా లేదు - మొండి ఘటం! రోజూలాగే ఓ పది నిముషాలు ఆగి మళ్ళీ నోట్లో వేద్దామంటే దొరకడుగా! మనసంతా భారంగా అయిపోయింది.  బళ్ళో ఉన్న పదిహేను మంది పిల్లల్లో వీణ్ణి పట్టించుకుంటుందా ఆ టీచరు? ఏదీ కావాలని నోరు తెరిచి అడగలేడు నా బిడ్డ, గమనించుకుంటుందా ఆవిడ? అంత తీరికుంటుందా పాపం వాళ్ళకి? పంచదార పలుకులు అలదుకున్న ఇడ్లీ ముక్క మూడో గుంటలో నుండి తీసుకుంటే, పెదాల పైకి ఏ వైపు నుండో పాకిన ఉప్పదనం - నా ఊహేనా?

బాత్రూం హేంగర్‌ల నుండి బట్టలు తీసి వేస్తుంటే అనిపించింది - చంటివాడికి టాయ్‌లెట్ అని చెప్పాలని నేర్పించాను- గుర్తుంటుందా? చెప్పలేకో చెప్పింది వాళ్ళకు అర్థం కాకో వీడు కంగారు పడి పేంట్ తడిపేసుకుంటేనో? చేతులు కడిగేప్పుడు చుక్క నీరు చొక్కా మీద పడినా "డర్టీ అయిపోయింది, మార్చెయ్ మార్చెయ్యమ్మా" అని చుట్టూ తిరుగుతాడు. ఈ రోజేం చేస్తాడో?! బేగ్‌లో ఇంకో జత బట్టలు పెట్టాను కానీ ఆవిడ చూసుకుంటుందా? బడిలో బేగ్‌లు మారిపోవు కదా!! అసలే కొత్త బేగ్ - వీడైనా గుర్తుపడతాడా? దేవుడా!

స్నేక్స్ డబ్బాలో కర్జూరాలు పెట్టాను, లోపల గింజ ఉంటే తీసుకుంటాడో, అత్యుత్సాహంతో మొత్తం నోట్లో పెట్టుకు కొరికేస్తాడో! కొత్తవాళ్ళను చూస్తే బెరుకు పిచ్చి వెధవకి - టీచర్ తినమందన్న భయానికి మింగెయ్యడు కదా. కాసేపు కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరిగాను. ఫోన్ మోగింది. గుండె దడదడలాడింది. టీచర్ చెయ్యలేదు కదా - ఆటల్లో ఏమైనా దెబ్బ తగిలించుకోలేదు కదా - పరుగుపరుగున అందుకున్నాను. స్క్రీన్ మీద బుజ్జాయి నాన్న పేరు చూసి ఊపిరి పీల్చుకున్నాను. "గట్టిగా మూడు గంటలైనా లేదు! ఊరికే అతిగా ఆలోచించకు, నీ వర్క్ చేసుకో, టైం కి వెళ్ళి పిక్ చేసుకో..పాటలు విను పోనీ.." తోచిన జాగ్రత్తలేవో చెప్పి పెట్టేశాడు.

"ఉన్ కుట్టి పప్పీ నాన్..రౌడీ బేబీ" ప్లేయర్ లో వాడు ఆపేసిన పాట మళ్ళీ మొదలయ్యింది. పప్పీ అనగానే పెద్ద పెట్టున నవ్వులతో పరుగుపరుగున వచ్చి వాడు నా చేతుల్లో వాలిపోయే వీల్లేకుండా ఈ బడేమిటసలు?! పది నిమిషాల్లో ఇల్లు సర్దడం అయిపోయింది. కానీ అద్దంలా ఉన్న ఇల్లు ఇంత అసహ్యంగా ఉంటుందా అనిపించింది. దేని స్థానంలో అది లేని ప్రతీ వస్తువూ నా పిల్లాడి ఉత్సాహానికి కదా గుర్తు! కలగాపులగంగా హాల్‌నిండా ఉన్న బొమ్మలూ, ఉతికిన బట్టలు మడతలు పెడుతుంటే పక్క నుండి లాగేసే అల్లరీ, అన్నం పెడుతుంటే తల తిప్పుకుపోయే పెంకితనం, స్నానానికి వేణ్ణీళ్ళు నింపుతుంటే బకెట్ దొర్లించేసే చిలిపితనం, దుప్పటి అంచులు లోపలికి సర్దుతానంటూ బయటకు లాగే అమాయకత్వం, సోఫా లో నా భుజానికి ఆని కూర్చుంటే దొరికే హాయీ - జిగ్-సా పజిల్ ముక్కల్లా అన్నీ కలిస్తేనే వాడు.

రెండు గంటలు కాస్త ఊపిరి పీల్చుకుంటాను, కాల్స్/వర్క్/ఇంటిపని వాడి మీద కన్నేసి ఉంచే పన్లేకుండా, వాడి అల్లరికి బెదిరే మనసును స్థిమితపరుచుకునే గొడవ లేకుండా, అన్నీ హాయిహాయిగా చేసుకుంటానని కలల్లో తేలిన నేనే, బడి వదిలే వేళకి పావుగంట ముందు చేరుకున్నాను. బయట ప్లే యేరియాలో ఆడిస్తున్నారు పిల్లల్ని. వాళ్ళని వాలంటీర్‌లకి అప్పజెప్పి నవ్వుతూ వచ్చింది టీచర్. భయాలన్నీ ప్రశ్నలుగానూ, ప్రశ్నలన్నీ భయాలుగానూ వినపడే ప్రమాదం అర్థమవుతున్నా ఆగలేకపోయాను. ఓపిగ్గా అన్నింటికి బదులిచ్చింది. స్నాక్స్ తిన్నాడనీ, పక్కవాళ్ళకు పెట్టాడనీ, టాయ్స్ క్లీన్-అప్ చేశాడనీ (ఏవిఁటీ..మావాడే!!), బుద్ధిమంతుండనీ, టాయ్లెట్ అని చెప్పాడనీ, - ఆవిడ ఆవిడ చెప్పుకుపోతోంటే సంబరంగా విన్నాను. భయం లేదనీ, తేలిగ్గా కుదురుకున్నాడనీ చెప్పింది. "నాకోసం అడిగాడా?" ఉండబట్టలేక బయటపడ్డాను. నవ్వారావిడ. ఒకసారి వెదికాడనీ మళ్ళీ క్రేయాన్స్ తీసుకుని కలరింగ్‌లో మునిగిపోయాడనీ, అయినా పిల్లలు బెంగగానో, దిగులుగానో ఉంటే ఫోన్ చేసి చెప్తామనీ, వాట్స్అప్‌లో ఫొటోలు చూస్తూ ఉండమనీ చెప్పారు. పెద్ద బరువొదిలిన తేలికతనం నాలో.

ఆవిడతో మాట్లాడుతూనే ప్లే యేరియాకి వెళ్ళాం. నన్ను చూస్తూనే ఆడుకుంటున్నది ఆపి పరుగుపరుగున వచ్చి నా కాళ్ళను చుట్టుకుపోయాడు. మోకాళ్ళపైన కూర్చుని హత్తుకున్నాను.

కార్‌లో సీట్ బెల్ట్ పెడుతుంటే అప్పుడే కొత్త ఫ్రెండ్స్ పేర్లు చెప్పేస్తున్నాడు. ఆపిల్ కి ఎర్ర రంగు వేశాట్ట..బాల్‌కైతే నాలుగు రంగులు ఇచ్చారుట వెయ్యమని. "బాగా వేశావా నానా?" సీట్ బెల్ట్ సర్దుకుంటూ అడిగాను. చక్రాల్లాంటి కళ్ళు ఇంకా గుండ్రంగా తిప్పాడు.

"స్కూల్ నచ్చిందా? రోజూ వస్తావా మరి?"

"వస్తామ్మా, స్కూల్ నచ్చింది. మా టీచర్ కూడా .." సీట్‌లో నుండి ఎగరబోయాడు. వారించాను.

"అమ్మా మా టీచర్ నన్నేమన్నారో తెల్సా.."

కొత్తకథలు మొదలు.

*


తన ఒడి నుండి, తన వాళ్ళ నుండి, తన ఇంటి నుండి తప్పించి, తల్లి బిడ్డను తొలిసారిగా మరొకరికి అప్పగించేది బడిలోనే. తనలా తన బిడ్డను జాగ్రత్తగా గమనించుకుంటారనీ, తన కన్నా ఎక్కువగా వాళ్ళకు బుద్ధులు నేర్పిస్తారనీ, నమ్మీ, ఆశపడీ తన బిడ్డల్ని ఉంచేది ఆ మేష్టార్ల చేతుల్లోనే. బడి అంటే తల్లులకంత భరోసా. వేలి చివర్లలో విజ్ఞామంతా కుప్పలుగా పడి ఉన్నా, ఆ టీచర్ బోర్డ్ మీద పెట్టిన వేలంటే ఈ రోజుకీ అమ్మలకు అందుకే అంత గౌరవం! తల్లులయ్యాక, వాళ్ళు తమకు చదువు చెప్పిన టీచర్‌లను ఎలా తల్చుకుంటారో, తమ పిల్లలను అక్కున చేర్చుకున్న టీచర్లనూ అంతగా గుర్తుంచుకుంటారు. మా అక్కకు తొలిసారి చదువు చెప్పిన రామాలయం పంతులు గారిని మా అమ్మ ఈ రోజుకీ మర్చిపోలేదు. నిజానికది మా అమ్మమ్మ నుండి ఆమె మునిమనవల దాకా పాకిన అపురూపమైన కథ; నేనెన్నడూ చూడని ఆ పంతులు గారు, మా ఇంటిల్లిపాదీ తలుచుకు మురిసే మా బాల్యపు జ్ఞాపకం. లోకం తెలియని పసివాళ్ళు అమ్మనూ నాన్ననూ కాక హీరో వర్షిప్‌తో చూసుకునేదీ, కథలుగా తోటి నేస్తాలకు చెప్పుకునేదీ టీచర్ల గురించే. వాళ్ళు అనుసరించేదీ, అనుకరించేదీ బళ్ళో కొన్ని గంటల పాటు చూసే ఆ గురువులనే. అందుకే టీచర్లంటే అమాయకమైన బాల్యానికి దొరికే అందమైన హీరోలు. థాంక్స్ అనేది పేలవమైన మాట. కానీ నిలబెట్టే నమ్మకాలకు బదులుగా ఏమీ ఆశించని కొందరు గురువులకు ఇవ్వడానికి మన దగ్గర ఉన్నదదే.

*


(తొలి ప్రచురణ :మామ్స్‌ప్రెస్సో, తెలుగు ఎడిషన్, ఉపాధ్యాయదినోత్సవం సందర్భంగా)

తృప్తి

జీవితంలో కొన్ని సంఘటనలు జరిగేటప్పుడు బుద్ధికి వాటిని అర్థం చేసుకోగల వయసు ఉండదు. కానీ, ఆయా ఉద్వేగాల తాలూకు నిజాయితీని మాత్రం వయసుతో నిమిత్తం లేకుండా మనసు గుర్తు పెట్టుకుంటుంది.

ఎన్నో ఏళ్ళ క్రితం నాటి సంగతి.

కొత్తగా కొలువులో చేరిన రోజులవి. కాలేజీలో చదివిన చదువుకూ, ఆఫీసులో దొరికిన ప్రాజెక్టులకూ పొంతన కనపడక పగలూ రాత్రీ తేడా తెలీనంతగా పనిచేసిన కాలమది. ఒకానొక వీకెండ్‌లో దాదాపు పద్దెనిమిది గంటల చప్పున పని చేసి, సోమవారం ఆన్సైట్‌లో ఉండే మిగతా టీంతో మీటింగ్స్ అటెండ్ అయ్యీ, మేనేజర్స్ కి కావాల్సిన అప్డేట్స్ అన్నీ పంపి, అటుపైన విశ్రాంతి కోసం డోర్మిటోరీ వెళ్ళాను. ఐ.టి ఉద్యోగాల్లో ఇదేమంత కాని పని కాదు. అరచేతిలో బొంగరంలా ప్రపంచం తిరుగాడుతుండేప్పుడు, నిద్రవేళలు కూడా అటూ ఇటూ అవ్వాలి కదా మరి. అందుకే కంపెనీలు ఈ సదుపాయాలూ ఇస్తాయి.

ఆ గది చిమ్మచీకటిగా ఉంటుంది. సూది మొన నేలకు తగిలినా వినపడేంత నిశబ్దంగానూ ఉంటుంది. ఒక్కోసారి ఖాళీగానూ, ఒక్కోసారి గదంతా నిండిపోయీనూ ఉంటుంది. పని ఒత్తిడికి డెస్క్ నుండి మాయమై వచ్చి, ఇక్కడ ధ్యానం చేసుకుంటారు కొందరు. తలనొప్పులూ, ఒంట్లో బాగోని వాళ్ళూ ఇక్కడికే చేరతారు.  శుక్రవారాల్లో ముస్లిం మిత్రులు ఆ గదికి ఒక మూలలో ఉండే విశాలమైన ఖాళీ స్థలంలో నమాజులూ చెయ్యడమూ చూసి ఉన్నాను. దాదాపు ముప్పై పడకలున్న విశాలమైన గది అది.

ఆ రోజు నేనక్కడికి వెళ్ళి, ఆ చీకట్లో జాగ్రత్తగా అడుగులో అడుగేసుకుంటూ, కబోర్డ్స్ నుండి కొత్త దుప్పటీ, దిండూ బొత్తిగా తెచ్చుకుని అలసటతో కళ్ళు మూశానో లేదో, ఆ చీకటిలో నుండీ, నిశబ్దంలో నుండీ, ఎడతెగని నిట్టూర్పు వినపడటం మొదలైంది. ఎవరికో బాలేదనుకుంటూ, మళ్ళీ కళ్ళు మూసుకున్నాను. తిరిగి అదే రొప్పు. అందులో నుండీ అర్థమవుతోన్న నిస్సహాయతకు నేను కాసేపటికే లేవకుండా ఉండలేకపోయాను. సెల్‌ఫోన్ లైట్ ను గది నలుదిక్కుల్లోనూ తిప్పి చూశాను.

ఒకమ్మాయి, గోడ వైపుకు తిరిగి ఉంది. ఆమె నిల్చున్న పద్ధతిలో తేడాని నా కళ్ళు గుర్తు పట్టాయి కానీ, ఏం చేస్తోందో అర్థం కాలేదు. ఆమె చేతిలో చిన్న మైక్ లాంటిదేదో ఉందనిపించింది, ఆ చీకట్లో చూస్తే. తటపటాయిస్తూనే దగ్గరకు వెళ్ళాను.

ఆమె నన్ను చూస్తూనే నిస్సత్తువగా చేతులు జార్చేసింది. అప్రయత్నంగా ఆమె చేతుల్లోవి అందుకున్నాను. పాలడబ్బా అది. బ్రెస్ట్ పంప్ వాడి, కాటన్ చున్నీ చాటు నుండి పాలు పిండుకుంటోందామె. కింద ఉన్న స్విచ్ బాక్స్ పని చెయ్యకపోవడంతో, గోడకి పైన ఉన్న స్విచ్ ని వాడుకుంటునట్లుంది, నేలపై కూర్చుని పిండుకోగలిగేంత వైర్ కాదది. అర్థమవుతోంది. ఆమె నుదుటి నిండా చిరుచెమట్లు..

తన భర్త పావుగంటకు పైగా గేటు దగ్గర నిలబడి ఎదురుచూస్తున్నాడనీ, ఇంట్లోని పసివాడికి పాలు పంపాలనీ, కోపం ఆదుర్దా బాధ మిళితమైన గొంతుతో చెప్తోందామె.

నేనామెని ఒక్క నిముషం పాటు ఆగమని చెప్పి పరుగుల మీద బయటకు వెళ్ళాను. కింద ఫ్లోర్‌లో మీటింగ్ రూం నుండి కుర్చీని మోసుకుంటూ మెట్ల మీద పైకొచ్చాను.

నన్ను చూసి 'ఇది కూడా తట్టలేదు చూశారా నాకీ కంగారులో.." అనుకుంటూ ఆమె పైకి లేచింది. "జ్జ్జ్జ్..." అన్న శబ్దంతో పరికరం తన పని తాను చేసుకు పోయింది.

"మంచినీళ్ళు కావాలా?" ఆమె పని అయ్యేదాకా ఆగి అడిగాను నేను. అప్పటికి ఆమె ముఖం కాస్త తెరిపిన పడింది. పక్కనే ఉన్న బాగ్ తీసింది. పళ్ళూ, బిస్కట్లూ, వాటర్ బాటిళ్ళూ, ఫ్లాస్క్‌లో పాలు - సమస్తం ఉన్నాయందులో.

"మీక్కావలసినవి తీసుకోండి, ఇప్పుడే వస్తాను" అని బయటకు వీలైనంత చకచకా అడుగులేస్తూ వెళ్ళిపోయింది.

"గంట కొట్టినట్టే వేళకి కదులుతాడు మావాడు. లేచేలోపు పాలసీసా నోట్లో పెట్టేస్తే ఇంకో గంట అలాగే మత్తుగా పడుకుంటాడు. వేళకి ఇవ్వలేనని కంగారొచ్చేసింది." బుట్ట తీసుకుని బయటకు నడుస్తూ అందామె. గదిలోపల మాట్లాడలేక, ఠపీమని ఆమె మాట వినకుండా సంభాషణ తుంచలేక అడుగులు కలిపాను.

మాటల్లో చెప్పింది...డెలివరీకి మూడు నెలల ముందే సర్వైకల్ ఇన్‌కంపీటెన్స్ వల్ల సెలవులో వెళ్ళాల్సి వచ్చిందనీ, పిల్లాడు పుట్టేవేళకే సెలవైపోయిందనీ, లాస్ ఆఫ్ పే లో కొన్నాళ్ళు ఉన్నాననీ, (అప్పట్లో ప్రసూతి సెలవులు మూడు నెలలే - ఇప్పుడు ఆరు నెలలు చేశారు), ఈ ఫైనాన్షియల్ యియర్‌లో ఒక్క పది రోజులు గడిస్తే, కొత్త సంవత్సరపు లెక్కలో ఇంకో ఆరు నెలలు ఎల్వోపీ మీద సెలవు దొరుకుతుందని తప్పనిసరై వస్తున్నాననీ.

నేను చేసిన సహాయానికి మరీ మరీ థాంక్స్ చెబుతూ అప్పుడామె అంది -

"చంటివాడిని ఇంట్లో వదిలేసి ఎందుకొచ్చిన ఉద్యోగాలూ? అంటారంతా! ఎవరి అవసరాలు వాళ్ళవి. ఎవరి జీవితాలు వాళ్ళవి. ఏం చేసినా పిల్లాడికి ఇవ్వలేకపోయిన బొట్టు పాలైనా తల్లి గుండెల్లో ఎంత బరువో! ఎవరికి తెలుస్తుంది?"

ఆ పూటకి బరువు తగ్గించుకున్న నిశ్చింతతో తృప్తితో ఆమె పలికిన ఆ అపురూపమైన మాటలు అర్థమవడానికి, ఏళ్ళకేళ్ళు గడిచి నా ఒడిలోనూ పసివాడు పారాడే వేళ రావలసి వచ్చింది.
*

(Breast feeding awareness campaigns  చూసినప్పుడల్లా, breast pump గురించి మాట్లాడాలని ఉంటుంది. మహిళలకు సంబంధించి, ఈ శతాబ్దపు గొప్ప ఆవిష్కరణల్లో, ఇదీ మొదటి వరుసలో ఉంటుందని నా నమ్మకం. ఈ నేపథ్యంలోనే ఈ అనుభవాన్ని మొదటగా మామ్స్‌ప్రెస్సో, తెలుగు ఎడిషన్‌లో ప్రచురించాను.)

36 హెయిర్‌పిన్స్

"నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్ననీ..." ప్లేయర్లో బాలు గొంతు మెత్తగా వినపడుతోంది. ఊటీ ఘాట్ రోడ్ మీద కార్ మెలికలు తిరుగుతోంది.

బుజ్జాయి నా ఒళ్ళో నుండి దూకుతూ "నాన్నా..."అని డ్రైవింగ్ సీట్ వైపు దూకినప్పుడల్లా పట్టి ఆపాల్సి వస్తోంది.

"వద్దు నాన్నా..రోడ్ అస్సలు బాలేదు, మనం ఇంకా పైకి వెళ్ళాలి కదా..కార్ దిగాక నాన్నతో ఆడుకుందువు గాని..సరేనా?" లోపల ఉన్న భయం గొంతులో వినపడకుండా విశ్వప్రయత్నం చేస్తూ చెప్పాను.

వెనుక నుండి హరితా, రఘూ ఫక్కున నవ్వారు. "అంత భయమెందుకే, ఇప్పుడేమయిందనీ? అనిల్ అంత కూల్‌గా డ్రైవ్ చేస్తోంటే! వెధవభయలూ నువ్వూనూ" విసుక్కుంది హరిత.

"బయటచూడు, ఎంత బాగుందో! " అనిల్ మాట్లాడబోయాడు. చేత్తో తల తిప్పేసి "దారి చూడు ముందు!" కరుగ్గా చెప్పాను. నవ్వాడు.

నీలంపు పొడిని గుప్పిళ్ళతో జల్లినట్టు ఎంత బాగుంటాయో నీలగిరి పర్వతాలు. లోయలోకి జారిపడే సూర్యకాంతీ, వాలిపోయే ఆకులూ, కీచుమన్న శబ్దాలతో అకస్మాత్తుగా రెక్కలార్చుకుంటూ పైకి వచ్చే పక్షులూ - రెండు కళ్ళూ చాలనంత సౌందర్యం ఊటీది. ఎటు నుండో వినపడే జలపాతపు చప్పుళ్ళూ, కొండరాళ్ళపై ఎండిపోయిన సౌందర్యపు స్మృతులూ మనసుని నిలువనీయవు. ఏడు రంగుల ఇంద్రధనుస్సేదో ఒళ్ళో వచ్చి వాలినట్టు ఉంది, కార్ వెళుతోంటే. మోకాళ్ళ పర్వతం మీదకి ఎక్కలేక ఎక్కినట్టు, కార్ హెయిర్ పిన్ టర్న్స్ ని ఇబ్బందిగా దాటుతోంది. 24..25..26.. మలుపుమలుపుకీ ముప్పయ్యారు మీద ఆశే. సన్నని రోడ్లు, వానకు తడిసిన దారులూ, కవ్వించడానికన్నట్లు అకస్మాత్తుగా రోడ్ల మీదకు దూకే కోతులు..- ఎవ్వరేం చెప్పినా కొండవాలుని పట్టి ఊగుతోన్న పూల లతలా నా మనసులో భయం ఊగిసలాడుతూనే ఉంది.

"ఆ రోడ్డు చాలా ప్రమాదం! ఎన్ని ఆక్సిడెంట్స్ అవుతాయో తెలుసా అక్కడ! నేను మాత్రం డ్రైవ్ చెయ్యను" అని బయలుదేరే ముందు నా స్నేహితుల కుటుంబం చెప్పగానే గుండె ఆగిపోయింది. "అనిల్ డ్రైవ్ చేస్తా అంటేనే కదా కార్ తీశాం, లేదంటే ట్రావెల్స్ లో కనుక్కుంటే అయిపోయేది.." వాడిపోయిన నా మొహం చూసి అయోమయంగా అన్నారు వాళ్ళు. "అదేం లేదు.." పరధ్యానంగా చెప్పి కార్ ఎక్కాను. ఒళ్ళో బుజ్జాయిని చూసుకుంటే గుండె ఝల్లుమంటోంది. వాడికి ఏడాది వస్తోందనగా తిరుపతికి వెళ్ళొచ్చాక, మళ్ళీ బయటకు రావడం ఇదే మొదలు నాకు. ఏడాది మీద నాలుగు నెలలు. ఈ చీకట్లు ముసురుకుంటున్న కొండ దారిలో, అదీ ఊటీ కొండల మీద, మాకు మేమే డ్రైవ్ చేసుకుంటూ పిల్లాడితో వెళ్తున్నామని తెలిస్తే అమ్మా, అత్తగారు ఏమంటారో అసలు! ఏడో నెలలో పుట్టాడని రెప్ప వాల్చకుండా అందరూ అరచేతుల మీద పెంచుకొచ్చారు వీడిని. అతి జాగ్రత్త మంచిది కాదు కానీ, అజాగ్రత్త సంగతో?!

అమ్మ గుర్తొచ్చింది. నన్ను ఆపలేకా, తన మాటకు ఒప్పించలేకా ముఖం తిప్పుకున్న అమ్మ. ఎప్పుడూ  ఏ అడ్వెంచరస్ ట్రిప్ కి వెళ్తున్నానన్నా ఒప్పుకునేది కాదు. వెయ్యి జాగ్రత్తలు, వెయ్యినొక్క ఒట్లు. "నీదంతా ఛాదస్తమమ్మా.." అని ఎలా కొట్టి పారేసేదాన్ని. వెనక్కి లాగకమ్మా అంటూ ఏం వేళాకోళాలాడేదాన్ని! ఇప్పుడేమైంది నాకు! ప్రతి ప్రేమను వెన్నాడుతూ ఒక బాధ్యత, భయం కూడా ఉంటాయనుకుంటాను. నా ప్రాణం సగాలుగా విడివడి బుజ్జాయినీ, వాడి నాన్ననీ అల్లుకుపోయిందని తెలుస్తోంది. సంబంధం లేని ఆలోచనలతో, భయాలతో నేను బయట సౌందర్యాన్ని నిండా అనుభవించకుండానే, కొండ పైకి చేరడం అయిపోయింది. చుట్టూ చీకట్లింకా దట్టంగా అలుముకుంటున్నాయి. రిసార్ట్ చేరగానే, కార్ కీస్ వాలెట్ పార్కింగ్ వాళ్ల చేతుల్లోకి  వెళ్ళిపోయాయి. బుజ్జాయి నాన్న మీదకి దూకాడు. రెండు కుటుంబాలకూ రెండు గదులు. రిసెప్షన్లో తాళాలిచ్చారు. పల్చటి సువాసనతో ఆహ్వానం పలుకుతున్న విశాలమైన గదిలోకి వచ్చిపడ్డాం. ఫాన్స్ ఉండని గదుల్లోని నిశబ్దం సేద తీరుస్తోంది.

"కోపం పోలేదా? సారీ!" భుజాలు పట్టి నన్ను తన వైపు తిప్పుకుంటూ అడిగాడు.

".."

"ఏం కాలేదుగా!"

"డ్రైవర్ ని పెట్టుకుంటే ఎంత మనశ్శాంతిగా ఉండేది! ఎంత ప్రమాదం! ఎంత జాగ్రత్త కావాలి. ఏమైనా అయ్యుంటే..బుజ్జిగాడు కూడా ఉన్నాడ్..."

"అందుకే నేనే డ్రైవ్ చేశాను" మధ్యలోనే నన్నాపేస్తూ చెప్పాడు. ముడుచుకున్న నా కనుబొమలను మునివేళ్ళతో సరిచేస్తూ అన్నాడు -"అంత ప్రమాదకరమైన రోడ్లలో, నిన్ను, వాడినీ, నా కన్నా జాగ్రత్తగా తీసుకు రాగలిగిందెవరు? ఊఁ?"

మంత్రం వేసినట్టే కోపమెటో పోయింది.

ఇద్దరి పెదాలనూ తాకుతూ ఒకే నవ్వు.

(తొలి ప్రచురణ : "మామ్స్‌ప్రెస్సో, తెలుగు ఎడిషన్‌లో)


ద్వాసుపర్ణా: అనువాద కవిత్వం

వేలూరి వేంకటేశ్వర రావు, వెనిగళ్ళ బాలకృష్ణ రావు కలిసి, సుప్రసిద్ధ ఒరియా కవి సౌభాగ్య కుమార మిశ్ర కవిత్వం నుండి ఎంపిక చేసిన కవితలతో వెలువరించిన అవ్యయ గురించి, లోగడ మనం మాట్లాడుకున్నాం. సౌభాగ్య కవిత్వంలో కనపడే వేగం గురించి, ప్రతీకల విషయంలో అతని కచ్చితత్వం, సూక్ష్మదృష్టి గురించి, అతని కవిత్వం కలిగించే ప్రాంతీయ స్పృహ గురించి అప్పుడు కొంత చర్చించుకున్నాం. ఇప్పుడు, సౌభాగ్య కుమార మిశ్రకు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు (1986) తెచ్చిపెట్టిన ద్వాసుపర్ణా అనువాదం, మళ్ళీ ఈ ఇద్దరి శ్రమ ఫలితంగానే, యాభైరెండు కవితలతో నిండుగా మనముందుకొచ్చింది.
‘కాదేదీ కవిత కనర్హం’ అన్న శ్రీశ్రీ మాటలు తెలుగు కవిత్వానికి ఎంత చేటు చేశాయో మనమంతా గమనిస్తూనే ఉన్నాం. ఆ ఒక్క మాటనే తక్క, సరిగ్గా తరువాతి వాక్యంలోనే అతను కావాలన్న శిల్పం గురించి కాని, వస్తువు గురించి కాని, వాడే ప్రతీకలకూ వస్తువులకూ ఉన్న సంబంధం గురించి కాని, కవిత ఆసాంతం నిలబడాల్సిన ధోరణి గురించి కానీ పట్టింపుతో ఉన్న కవుల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. వీటిని నిబంధనలుగా భావించి అతిక్రమించాలి అనుకునేవారే తప్ప, మంచి కవిత్వ లక్షణాలుగా గుర్తించి గౌరవించాలనుకునే వాళ్ళు కనపడటం లేదు. రోజువారీ వార్తలను కవిత్వానికి వస్తువులుగా వాడుకుంటూ, అక్కడ కనపడే అల్లర్లలో నలిగిపోయిన నినాదాలన్నీ సాపు చేసుకుని ముద్రించుకోవడమే మన ప్రస్తుత కవిత్వోద్యమాల్లో మొదటి అడుగవుతోంది.
ఇట్లాంటి వాతావరణంలోకి, కొత్త కాగితాల తాజా వాసనను మోసుకొచ్చిన అనువాద కవిత్వం ద్వాసుపర్ణా. కవి బలం వార్తలు కాక, ఊహాశక్తీ, కల్పనా చాతుర్యం అయితే, అతని కవిత్వానికి ఎలాంటి ఆకర్షణ ఉంటుందో చూపిన పుస్తకమిది. సౌభాగ్య సామాజిక అంశాల మీద, సమస్యల మీద తక్కువగానే రాసిన మాట నిజం. ఆ రాసిన కొన్నింటిలోనూ, ఈ వస్తువు మీద రాయడాన్ని ఒక రివాజులా మార్చుకోవాలనుకోని అతని దృక్పథం స్పష్టమవుతూనే ఉంటుంది. సమస్యలను ఎత్తి చూపే క్రమంలో, తనలోని కవిని అతడెక్కడా చిన్నబుచ్చుకోలేదు. నిజానికి, అతను ఇంటి రాజకీయాల మీద రాసినా, ఇరాన్ మీద రాసినా, అతని చూపు పారిందల్లా మనిషి హృదయ వైశాల్యం మీదనే. ఆ గుణమే అతని కవిత్వాన్ని నమ్మదగినదిగా చేసింది. కవిగా అతని వృత్తం పరిమితమైన కొద్దీ, కవిత్వం మరింతగా సాంద్రతరమవుతూ వచ్చింది. అది నాకు నచ్చింది. అవ్యయ చదివినప్పుడు, అందులోని కవితలు మూడు సంపుటుల నుండి ఎంచి ప్రచురించినవి కనుక, సౌభాగ్య అనుభూతివాద కవిగా కనపడుతోన్నా ఆ మాటను స్థిరపరచలేనని చెప్పాను. అయితే, ద్వాసుపర్ణా చదివాక, అప్పటి నా నమ్మకం బలపడింది.
అసలు దేన్నయినా అతను కవిత్వంగా మలుచుకునే తీరు, చాలా కొత్తగా, ఆసక్తికరంగా ఉంటుంది. ఉదాహరణకు ఈ క్రింది కవితను చూడండి:
ఇచ్చి పుచ్చుకునే భాగోతం
ఎంతో విస్తృతమైనది
ఏం పోయిందో, ఏమొచ్చిందో, ఏదీ గుర్తుండదు
నేను లెక్కబెట్టినప్పుడు పన్నెండు
మరొకడు లెక్కపెట్టినప్పుడు పదమూడు.
మనం దాగుడుమూతలాడటం మరచిపోయి
వంతెన మీద కూర్చుని కబుర్లాడుకుంటున్నప్పుడు
ఆ పోయిన ఒకటీ కాస్త పరిహాసంగా
సగం పండి, సగమై తిరిగి వస్తుంది 
(ఇచ్చిపుచ్చుకోవటం, పు: 49)
ఏదైనా వస్తువు చేతులు మారినప్పుడు, తీసుకున్నవాడి దృష్టిలోనూ, ఇచ్చిన వాడి దృష్టిలోనూ దాని విలువకూ తేడా ఉంటుంది. ఆ భేదాన్ని పూరించుకోవడానికి స్నేహం ఒక దారి. అరమరికలు లేని స్నేహం. దాపరికాలు లేని స్నేహం. అప్పుడూ వాళ్ళు కోల్పోయేది కొంత ఉండవచ్చు గాక. కానీ పొందిన ‘ఫలం’ మరింత పరిపూర్ణమైనది. మరింతగా పక్వమైనది. ఇది తెలియనివాడికి వెలితి మాత్రమే మదిలో నిలిచిపోతుంది. అతనికి ఏం వచ్చిందో తెలియనట్లే ఏం పోయిందో కూడా తెలియదు.
ఈ కవితలో స్నేహం గురించి కాని, మానవ సంబంధాల్లోని బలిమి, లేముల గురించి కాని, కవి బిగ్గరగా ఏమీ చెప్పడు. కానీ లోగొంతుకలో విన్న రహస్యాలే కదా మధురంగా తోచేవి.
ఈ నవ్యతనే చూపెట్టే మరో ఉదాహరణ: పెద్ద పెద్ద షాపింగ్‌మాల్‌ల ముందు, కూడళ్ళ దగ్గర, కరపత్రాలలో తమ వినతిని ముద్రించుకుని చదవమని వెంబడించేవాళ్ళను చూస్తూంటాం. మాటలు రాక, మాట్లాడలేక, మూగగా మన సాయం కోరుతూ నిలబడే వాళ్ళ ముఖాలు, వాళ్ళ వేదన, చాలాసార్లు మన గమనింపులోకి రావు. కొందరంటుంటారు, ‘అప్పటిదాకా కులాసాగా తోటివాళ్ళతో కూర్చుని కబుర్లు చెబుతూ, మమ్మల్ని చూడగానే మూగ నటన మొదలెట్టడం కళ్ళారా చూశాం’ అని. పక్క పక్క నిముషాల్లో వాళ్ళు పట్టుబడ్డట్టే, చాలామంది కవులూ అబద్ధపు జాలిని, కపట ప్రేమనీ కవిత్వం చేస్తూ, చేయలేకా, పట్టుబడిపోతుంటారు. సౌభాగ్య ఏం రాశాడో చూడండి:
ఏమిటి? భాష ఏమైనా చెయ్యగలదని
నువ్వు కచ్చితంగా నిశ్చయించుకున్నావా
మౌనంగా ఉండటంలో మెలకువలు నేర్చుకున్నాం
పాము చస్తుంది, కర్ర విరగదు.
నువ్వు మణికట్టు విరగ్గొట్టుకున్నావు;
మరొకడు ఇల్లు వరదలో కొట్టుకుపోనిచ్చాడు.
నీ కాగితమ్ముక్క జాగ్రత్తగా పదిలపరుచుకో
చాలా చెట్లు విరిగిపడవలసి ఉంది,
చాలా హృదయాలూనూ,
చాలా మంది కవులు పుట్టవలసి ఉంది,
నువ్వు మా దగ్గర నుండి తిరిగి వెళ్ళిపోయాక.
 (నువ్వు చెప్తున్నావు, పు: 19)
నిడివి పరంగా చూస్తే, సౌభాగ్యకూ క్లుప్తతకూ చుక్కెదురనే చెప్పాలి. అతనికి పదాల లెక్క లేదు, అనుభవం నిండుగా అక్షరబద్ధం కావడమే అతని లక్ష్యం. కానీ, ఈ కవితలో మాదిరి (కవుల మీది వ్యంగ్యం, ఆ మూగవాని పట్ల అప్రయత్నంగా కలిగే సానుభూతి) భిన్న రసోద్వేగాలను ఒకేసారి స్ఫురింపజేయడంలో అతను చూపే నేర్పు నేర్చుకోదగ్గది. కవుల ప్రస్తావన ఇదే ధోరణిలో మరో రెండు కవితల్లో కనపడటం వల్ల, సౌభాగ్యకు కవులూ మనుషులేనన్న ఎరుకతో పాటు వాళ్ళ బలహీనతల పట్లా, పరిమితుల పట్లా స్పష్టమైన అభిప్రాయాలూ ఉన్నాయనుకోవాల్సి వస్తుంది.
నువ్వు పూలకు వాడిపోకండనీ, ఉత్తరానికి దారి తప్పవద్దనీ
చెప్పటం చాలాసార్లు విన్నాను
తేలిక శబ్దాలు వేలాడుతూండటానికి
ఒక్క ముహూర్త కాలాన్ని తీగలాగా సాగదీయడం చాలాసార్లు చూశాను
 (ఏడు కవితలు, పు: 219)
సౌభాగ్య ఎత్తుగడలలో కనపడే సొగసిది. ఎవరామె? పూలను వాడిపోవద్దనే భావుకురాలు, సున్నిత మనస్కురాలు? ఉత్తరాలకు దారి తప్పవద్దని చెప్పే ప్రేమికురాలు? ఒక్క ముహూర్త కాలాన్నలా తీగలా సాగదీస్తోందే, ఆమె కోరుకున్న తేలిక శబ్దాలు ఎలాంటివై ఉంటాయి? గాలి వీచే శబ్దమా? గాలికి ఆకులు రాలే శబ్దమా? పక్షి కూతలా? ఊఁ, ఉహూఁ లాంటి పొడి అక్షరాలా? కవిత నడిచే కొద్దీ, సహజంగా తలెత్తే ఈ ప్రశ్నలతో పాటుగా, ఆ భావనల తోడుగా మన మనసుల్లో మెల్లిగా పరుచుకునే నాజూకు సౌందర్యమంతా, కవి చేసే మాయాజాలం. అదే ఈ కవితలోని సౌందర్యం.
దాదాపు ఇలాంటి పరిచయంతోనే మొదలయ్యే మరో కవిత, సీతకోకచిలుక ప్రతి. నువ్వు పూవుల మధ్య పూవువి, తారల మధ్య తారవి అని సీతాకోకను కీర్తించడం సరే, అది మన ఊహకందుతుంది. కాని,
ఎప్పుడు చూసినా అతి వేగంగా
పొద నుండి పొదకూ, గోడపై నుండి పెంకు మీదకీ
వరండా నుండి గూటి అంచుకూ ఎగరడం, నరనరానికీ
అసహజమైన బరువుతో భుజం నెప్పెట్టి,
దించుకోవడానికి చోటు కోసం చూస్తున్నావు
అన్నిచోట్లా ఎవరో చెప్తున్నారు ఇక్కడ కాదు, ఇక్కడ కాదని
 (పు: 193)
అనడం మాత్రం నిస్సందేహంగా గొప్ప కవి ముద్ర. ప్రతి చోటా ఎవరో అడ్డు నిలబడి నెడుతుండబట్టి కానీ సీతాకోకచిలుకకు భుజం నొప్పి లేకనా అలా లోకమంతా ఎగరడం అనడంలోనే కవి సున్నితత్వం, ఊహాశక్తి రెక్కలు విప్పుకు కనపడుతున్నాయి. ఇదే కాదు, నది, వసంతం, చలిగాలి, చీకటి ఇలాంటి ఎన్నో మామూలు భావనలను, అసాధారణమైన చూపుతో గొప్ప కవిత్వంగా మార్చాడీ కవి. అనువాదకుల ఉత్తమ పదసంపద వల్ల, సరైన పదాన్ని వాడగల ప్రజ్ఞ, జాగ్రత్త వల్ల, అద్భుతంగా పండిన భావాల నుండి కొన్ని ఉదాహరణలు:
– జ్ఞాతుల చేతిలో పరాజయపు అనుభవంలా వేధిస్తున్నది చల్లటి గాలి
– కిన్నెర స్త్రీ ముఖంలాంటి ముఖమొకటి చీకటిలో చివాలున మంటలా ఎగసి…
– వేపపూల వాసన నన్ను తరుముతోంది, పాములా.
– చీకటి ఆకాశం పైనుండి వేలాడుతోంది.
– ఒకప్పటి నీ అవయవాల వేదన, ఆకాశంలో మెరుస్తూంటుంది, ఓర్పుగా
సాహిత్య వాతావరణంలో స్తబ్ధత అన్న పదానికి అర్థం, కొత్త రచనలు రావడం లేదని మాత్రమే కాదు, వచ్చిన రచనల్లో కొత్తదనం లేదని కూడా. దానిని చెదరగొట్టడానికి మనకున్న వాతావరణమే మారాలి. అది అంత తేలిగ్గా జరిగేపని కాదు. అయితే, వచ్చే ప్రతీ రచన ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మరో సృజనకు ప్రేరణనిస్తుంది. అందుకే, సాహిత్య వాతావరణాల్లోని స్తబ్ధతను చెదరగొట్టేందుకు అనువాదాలు కావాలి. ఆ పని ద్వాసుపర్ణా తలకెత్తుకుంది.
అయితే, ఈ అనువాదం ఎవరి కోసం చేశారు, ఎందుకోసం చేశారు అన్నవి రెండు మౌలికమైన ప్రశ్నలు. రచన అంటే, అందులోనూ కవిత్వమంటే, ఆలోచనల పొందిక, పదాల అమరిక. సాహిత్యాన్ని ఒక భాష నుండి మరొక భాషలోకి తీసుకురావడమంటే, ఆ ఆలోచనలను, పదాలను కూడా తిరిగి మన భాషకు, మన వాక్య నిర్మాణ పద్ధతులకు, వ్యాకరణ సూత్రాలకు అనుగుణంగా పొందిగ్గా అమర్చుకోవడం. పుస్తకంలో ఈ పొందికతో ఉన్న కవితలు ఎంత ఆకట్టుకుంటాయో, ఆ పొందిక లేక అటూ ఇటూ అయిన కవితలన్నీ అంతే ఇబ్బంది పెడతాయి. మూలంలోని పదాలకు కట్టుబడిపోయి తెలుగులో ఆ భావం సహజంగా ఎలా పలుకుతుందో గమనించని సందర్భాలలో, కొన్నిసార్లు ఒకే కవితలో చక్కటి తెలుగు చరణాలతో పాటు అసహజమైన తెలుగు వాక్యమూ కనిపించి, ఆ కవితలను ఆస్వాదించడంలో కొంత ఆటంకం కలిగిస్తాయి. కొన్ని కవితల్లో పదాలు, వాక్యాలు ఇబ్బంది పెట్టినా కొద్దిపాటి ప్రయత్నంతోనే భావం అందుతుంది. కొన్నింటికి ఆ వెసులుబాటూ లేదు. ఇది అనుసృజన అని అన్నారు కనుక, ఈ కవితలను తెలుగులో మెరుగుపరచి ఉండుంటే పాఠకులకు మరికొంత సులువయ్యేది, కవిత్వం ఎక్కువమందికి చేరడానికి వీలయ్యేది. ఒరియా, తెలుగూ రెండూ భారతీయ భాషలవడం, ఇది పక్క రాష్ట్రపు కవిత్వమవడం, సంస్కృత సాహిత్యం ఆ రాష్ట్రపు, ఆ కాలపు కవుల మీద చూపిన ప్రభావం తెలియడం, మొదలైన ఎన్నో అంశాలు ఈ కవిత్వాన్ని ఓ వంక దగ్గర చేస్తోన్నా, ఇది కేవలం అర్థానువాదమేనన్న స్పృహ పాఠకులను అంటిపెట్టుకునే ఉంటుంది. ఉదాహరణకు, ఈ పాదాలు చూడండి:
గాయత్రీ జపం చేసేవేళ
నేను తూలిపడ్డాను బ్రహ్మ ముహూర్తంలో;
ఇవాళ ఉదయమే తాళలేని వేడికి
కరిగి ప్రవహించి పోతున్నది ఆకాశం,
కలం ఒకటి విరిచేశా
నేను అభిమానంతో దుఃఖంగా.
గురి చేశాను పసుప్పచ్చని గుర్రానికి,
నా రక్తం నుంచి, ఆ దుఃఖం నుంచి వేరయింది,
ఆధారం లేని ఆ పశువు
ఒక వైపు కొట్టుకుపోతోంది,
మరొకవైపు తెలిసీ తెలియని నా భవిష్యత్తులాగా
ఒకే సమయంలో కోమలంగా, కఠోరంగా.
 (ఉత్తరం, పు: 111)
ఈ అనువాదం వల్ల మూలంలో ఉన్న భావం తెలుగులో పాఠకుడికి అందదు. అందువల్ల, ఈ అనువాదాలు తెలుగు పాఠకుల కోసం, ప్రత్యేకించి కవిత్వాన్ని చదివే పాఠకుల కోసం చేశారనుకుంటే, ఈ పుస్తకం ప్రధాన లక్ష్యం సౌభాగ్య కవిత్వాన్ని తెలుగులోకి తీసుకురావడం కాకుండా, అతని కవిత్వాన్ని తెలుగులో, కవిత్వంగా అందజేయడం అయి ఉండాల్సింది.
అనువాదాల గురించే మాట్లాడుతూ, వెల్చేరు నారాయణరావు ఒక వ్యాసంలో ఇలా అంటారు: ‘ఒక విలుకాడు తన ఇష్టం వచ్చిన చోట బాణం వేయడం గొప్ప కాదు. అతను బాణం వేసిన చోట సూటిగా తగిలేట్టు మరో విలుకాడు బాణం వేయడం–అదీ గొప్ప సంగతి’. సూక్ష్మమైన దృష్టి లేకపోతే, అన్నిసార్లూ బాణం వేసిన చోటే సూటిగా తగిలేలా వెయ్యడం కాని పని. అయితే ప్రయత్నం ఏ దిశగా కొనసాగాలో, ద్వాసుపర్ణా తెలియజెప్తుంది.
తొలి ప్రచురణ : ఈమాట, నవంబరు-2019 సంచికలో..

మెహెర్ కు అభినందనలు..

2010 లో..

బ్లాగింగ్ మొదలెట్టిన తొలినాళ్ళలో..

కూడలి, మాలిక ఈ రెండింటిలో మంచి బ్లాగ్ కోసం వెదుక్కోవాలని ఎవరో చెప్పాక -
అట్టే వెదక్కుండానే కళ్ళబడ్డ బ్లాగు - "కలంకలలు"

నారింజ రంగు హెడర్..ఎవరో తీరి కూర్చుని దిద్దుకుంటున్నారా అన్నట్టున్న అక్షరాలు, ఇటాలిక్స్, బోల్డ్ ఏవి ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉన్న బ్లాగ్. చూడగానే ఆ బ్లాగులో ప్రేమతో పడిపోయాను. అది మొదలూ ఈ తొమ్మిదేళ్ళుగా పూట పూటా కాకపోయినా కొన్ని సార్లు కొన్ని వ్యాసాల కోసం, చాలా సార్లు ఊరికేనూ ఆ బ్లాగ్ చదువుతూనే ఉన్నాను.

ఇన్నాళ్ళకు, ఆ బ్లాగులోని కథలన్నీ పుస్తక రూపంలో వచ్చాయని తెలిసి - సంతోషంతో ఆ రోజుల గురించి తల్చుకుంటుంటే, చాలానే గుర్తొస్తున్నాయి. తన కథలన్నీ చూసి ఇష్టమైన వాక్యాలు ఎత్తి రాయాలనుంది కానీ, బ్లాగ్ లేదిప్పుడు. కథల పుస్తకమూ నా ముందు లేదు. అందుకని, అజంతాలా, స్మృతి పీఠం ముందు కూర్చుని, ఈ నాలుగు మాటలూ.

మొట్టమొదటగా చదివినదేదో గుర్తు లేదు కానీ, "సరిహద్దుకిరువైపులా" అలా పాత జ్ఞాపకంగా మనసులో మెదులుతోంది. గొడవపడ్డ భార్యాభర్తలు -  మొదటంతా అబ్బాయి వైపు నుండి, మళ్ళీ అవే సన్నివేశాలు అమ్మాయి వైపు నుండి, తర్వాత అసలు గొడవ - ఇలా సాగుతుందా కథ.

మెహెర్ మొదట్లో రాసిన కథల్లో, చిత్రీకరణ చాలా బలంగా ఉండేది. అంటే అది ఒక కెమెరాని స్లో మోషన్‌లో తిప్పుకుంటూ వెళ్ళడం లాంటిది. ఆ గది ఉన్నదున్నట్లు మనకు కనపడి తీరాలన్నట్లు రాసేవాడు. ఫ్రిడ్జ్ డోర్ తీసిన వెలుగులో, ఆమె తలెత్తి బాటిలో నీళ్ళు గుక్క గుక్క తాగుతుంటే గుటక పడటం లాంటి వర్ణనలు, నాకిప్పటికీ అలా గుర్తుండిపోయాయి. అంత స్పష్టమైన వెలుగుతో ఉంటాయి తన వర్ణనలు.

"రోడ్ మీద కోక్ టిన్‌ని లాగి పెట్టి తన్నిన అనుభవం.." లాంటిది ఇంకోటి. అందులో కథగా ఏమీ ఉండదు. వాళ్ళేదో సినిమా తాగి (మెహర్, తన స్నేహితుడూ) ఓ గుట్ట లాంటిదేదో ఎక్కాక, స్నేహితుడు ప్రేమకథ చెప్తాడు. హైదరాబాద్ రాత్రి గాలి మన మీదకొచ్చినట్లు హాయిగా అనిపిస్తుంది మొత్తం చదివేశాక.  రచయితకు ప్రత్యేకమైన గమనింపు అనేది ఉంటే ఇష్టమన్నట్టు, అతను రాసే కొన్ని కొన్ని వాక్యాలు భలే ఉంటాయి. స్నేహితుడు ప్రేమ కథను చెబుతుంటే, ఊఁ కొడుతూ, అది మరీ ఆసక్తి లేకుండా వింటున్నట్టు అనిపించకుండా, మధ్యలో ఊరికే ఏవో ప్రశ్నలడిగానని రాస్తాడిందులో. భుజాలు తడుముకున్నాను నేను కూడా.

ఇంకో కథలో నాకు పరిచయమే లేని హైదరాబాదు గల్లీల్లో గొడవల గురించి - అందులో ఓ హొటల్ లో అయిన చిన్న గొడవ గురించి వర్ణన ఉంటుంది.   హోటల్ లో మిగిలిన వాళ్ళు, సమోసా ప్లేట్లతో సహా లేచి దూరం జరిగి చూస్తూ ఉంటారని రాస్తాడు. నాకెప్పుడూ ఆ సీన్‌లో ఆ సమోసా కొరుకుతూ గొడవ చూస్తున్నదాన్ని నేనే అనిపిస్తాను. అక్కర్లేని వాళ్ళు ఎడం జరిగి చూడండి - అని చెప్తున్నట్టే ఉంటాయి మెహెర్ గొడవలన్నీ.

మాలికలోనో కూడలిలోనో చూసి, ఒకసారి చదివి, మళ్ళీ చదివి, లాప్టాప్ మూసేసి మళ్ళీ చదివి, మళ్ళీ ఎవరికో చెప్పి వచ్చి మళ్ళీ చదివిన కథ "రంగు వెలిసిన రాజు గారి మేడ కథ". కథ అల్లిక ఇలా కదా ఉండాలనిపిస్తుంది. ఆ కుమ్మరి వాడి ఇల్లు ఊహల్లో ఎంత స్థిరంగా ఉండిపోయిందంటే - అట్లాంటి ఇల్లొకటి చూడాలనిపించేంత.

మెహెర్ వాకిలిలోనూ, తరువాత రస్తాలోనూ కూడా కథలు వ్రాశాడు. నాకు లోకంలోనీ, మనుషుల్లోనీ చీకటి, రుచించదు. చేదుగానే అనిపిస్తుంది. మెహెర్ కథల్లో చేదు ఉగాది పచ్చడిలో తప్పని రుచిలా, కొండొకొచో ముఖ్యమైన రుచిలా, ఏ తొడుగూ లేకుండానే కనపడుతుంది. "లోకంలో ఇట్లా జరక్కుండా ఉంటే బాగుండు కదా, ఎవ్వరికీ ఈ కష్టం రాకుండా ఉంటే బాగుండు కదా! అప్పుడిలా చెయ్యరు కదా!" అని నాకు పదే పదే అనిపిస్తూనే ఉంటుంది. ఈ ఆశల హోరుతో, ఇలా కాక ఇంకెలా ఉండి ఉండాలోనన్న నా సొంత ఆలోచనలతో, నేను ఆ తరహా కథలనసలు చదవలేను.  కానీ, ఒరాంగుటాన్ మెహెర్ నుండి వచ్చిన అత్యుత్తమమైన కథ అనిపిస్తుంది. ఆ మనిషి పొడవాటి చేతులతో అలా కళ్ళ ముందు ఊగుతూ ఉంటాడు. పాత్రని ఇలా ప్రాణశక్తితో ముందుకు తెచ్చి మన ముందు నిలిపే రచయితలు ఎంతమంది ఉన్నారో నాకనుమానమే. చెక్కే వాళ్ళు చాలా మంది ఉండచ్చు. కానీ ప్రాణం అన్నిట్లోనూ దొరకదు. పాత్రల ఉనికిని ఇంతలా అనుభవంలోకి తెచ్చుకోగలిగేలా రాయడం ఎంత కష్టమో ప్రయత్నం చేస్తాను కనుక నాకు తెలుసు. ఒరాంగుటాన్ గొంతు, అతని నంగిరితనం, ఆ రాత్రి చీకట్లో అతని గొంతులో వ్యంగ్యం అన్ని కళ్ళకు కట్టినట్టు కనపడతాయి, వినపడతాయి. అతని పాత్రలకు నటించడం చేతకాడు. నటించామని బయటపడటానికీ వెనుకాడరు వాళ్ళు.

కొన్ని కొన్ని పదాలకు కొన్ని కొన్ని స్పురణకు తెచ్చే శక్తి ఉంటుంది. వాక్యం పోకడను బట్టి కరుణ రసమా, భయానక రసమా మనం చెప్పగల్గుతాం, చాలా సార్లు. కానీ మెహెర్ వాక్యం ఎప్పుడూ మీదకొచ్చి దబాయిస్తున్నట్టే ఉంటుంది. అన్ని వాక్యాలూ ఏవో సీరియస్ విషయాలను ప్రతిపాదిస్తున్నట్టే ఉంటాయి. ఇతని కలంలో కరుణ రసం అనేది అవ్వని పని అనిపించేది ఓ కాలంలో. అతను ముక్కు పగలగొట్టేలా రాయగలడు, దాపరికం లేకుండా తాననుకున్నది చెప్పగలడు, కానీ ఏదైనా ఒక సీరియస్ టోన్‌తోనే.. అంతే. మనసు లోతుల్లోని తడి తెలియబరచేందుకు అతనికి మాటలున్నాయా అనిపించేది.

రెండు కథలు. ఇదెంత పిచ్చి ఆలోచనో చెప్పాయి.  1) కన్నా గాడి నాన్న. 2) చంటోడికి లేఖ? (ఇదేనా పేరు?-)

కన్నా గాడి నాన్న - బిడ్డని చిన్నప్పుడే పోగొట్టుకుని, జీవితంలో ఆశను పోగొట్టుకున్న ఓ వెర్రి తండ్రి కథ. అతని బాధ ఎంత బలమైనదో చెప్పేందుకు గుర్తుండేందుకు కథలో ఓ వాక్యం ఉంటుంది, వాళ్ళ భార్య గురించి. ఆమె ఇదంతా మర్చిపోయి చెత్త గొడవల్లో పనికిరాని వాటి గురించి ఆశపడటం, అదివరకట్లానే చాడీలు చెప్పడం, - ఇలా ఏదో ఉంటుంది. ఇంత పెద్ద బాధ ముందు, వెలితి ముందు, జీవితంలోని చిల్లర విషయాలు ఎలా కనపడుతున్నాయామెకు అన్నది ఇతని బెంగ. ఆ చిరాకుతోనే ఆమెకీ దగ్గరకాలేకపోతాడు. ఆ నిసహాయత మెహెర్ మాటల్లోనే చదవాలి. ఒరాంగుటాన్‌ని తోసిరాజన్న కథ ఇది, నావరకూ.

మెహెర్ మొదట్లో రాసిన కథలకూ, తరువ్వాత్తర్వత రాసే కథలకూ, నేను పోల్చుకోగల్గిన పెద్ద తేడా ఇలాంటి వాటిలోనే. మొదట్లో అతను చెప్పినవన్నీ భౌతికమైన వర్ణనలు. ఒక సన్నివేశం మెహర్ చెప్పాడంటే, అది మన కళ్ళ ముందుకు రావాల్సిందే. అట్లతద్దికి వాళ్ళమ్మ చెరువు మీదకి సాగేలా ఉయ్యాలూగిందని రాస్తే, ఎన్ని డిగ్రీల్లో ఉయ్యాల వంపు తిరిగిందో కూడా కనపడి, మనమూ ఏట్లో పడి పైకి లేవాలి ;). ఆఫీసుకు పోతూ పోతూ షాప్ వాళ్ళమ్మాయి సాయి(?)తో ఇసుక గూళ్ళు కట్టాడంటే మనకు ఎత్తూ లోతూ తెలియాలి. కానీ, తర్వాత్తర్వాత, ముఖ్యంగా ఈ కన్నాగాడి నాన్న కథలో, కాలంతో పాటు గడ్డకట్టిన్నట్టయ్యే ప్రేమల్ని, బాధల్ని, అవి బ్రతుకులో నింపే నిస్తేజాన్ని, ఎంత నమ్మశక్యమైన డ్రామాతో చెప్తాడో. నాకింకా ఆశ్చర్యమనిపించిందేమంటే - ఆ పిల్లాడు చనిపోయాడనేది, కథ మొదట్లోనే, మేటర్ ఆఫ్ ఫేక్ట్లా చెప్పేస్తాడు. అందులో దాపరికమేం లేదు. పొరలు పొరలుగా విప్పి, పాఠకులకూ కొంత పని పెడదాం లాంటి గోలేం లేదు. చాలా సరళంగా, మామూలుగా చెప్పుకెళ్తాడు. చావు అతని కథలో రహస్యం కాదు. ముడి కాదు. అది కూడా ఆ కేరక్టర్ లో పొదిగిన నిజాయితీలా కనపడి కథ మరింత నచ్చేలా చేసింది.

ఇంకోలా చెప్పాలంటే, మొదట్లో కథలు అతను చూసినవి చూసినట్టు చెబుతున్నట్టుంటే, ఒరాంగుటాన్, ఈ కన్నగాడి నాన్న లాంటి కథల్లో- రచయిత వాళ్ళతో ఎన్నాళ్ళో ప్రయాణం చేసి, ఆప్తుడై, అన్నీ అయి, మనం ఎక్కడ కలిస్తే అక్కడ నుండి మొదలెట్టి కొంత కొంతగా చెప్పుకుంటూ పోతాడు. ఇందులో కనపడే ప్రయత్నమంతా ఆ పాత్రల్ని గుచ్చి గుచ్చి చూడటంలోనో, వాళ్ళ చుట్టూ ఉన్న పరిసరాలనూ, మనుషులనూ భూతద్దం వేసినట్టు పాఠకులకు చూపించడంలోనో లేదు. - మనం కలిసిన చోటు నుండి కథను  చెప్పుకుపోవడంలో ఉంది. మొదలూ తుదీ అనచ్చేమో. పాత్రల మనఃస్థితులను వీలైనంత తేలిగ్గా పట్టి ఇచ్చే ప్రయాణపు భాగాలను అందివ్వడంలో ఉంది.

చింతల్లికి ఉత్తరం చదివినప్పుడు, అందరూ "ఆహా! నాన్న మనసు, నాన్న మనసు!" అన్నారు అందరూ. ఎంత అబద్ధం! అందులో కనపడిందల్లా నాన్న లేకుండా పెరిగిన కొడుకు బెంగ. ఎన్ని రకాలుగా చెప్పాడా మాటని! మంచో చెడో నాకో ఉదాహరణ ఉంటే, దాన్ని బట్టి నేనెలా ఉండాలో తెలిసేది అన్న మాటలు చదివినప్పుడు, ఎంత నొప్పి మనకి.

తండ్రి అయ్యాక పిల్లల భాష పట్టుకోవడంలో తేలిగ్గానే -కానీ గట్టి పట్టు వచ్చేసినట్టుంది - పైన చెప్పిన సాయి తో ఆడుకున్నప్పటి కబుర్లకూ, తరువాత రాసిన స్కూలెల్లను, ఈ ఉత్తరం, తప్పిపోయినట్టు నటించే పిల్లాడి కథ - లాంటి వాటికీ ఎంత తేడానో. వీటిలో మెహెర్లోని రచయిత పిల్లల మనసుతో చిందులేశాడు. తెలుగులో పిల్లల సాహిత్యమంటే పిల్లల భాషే ప్రధానమన్నట్టు రాస్తారు. అవి చాలా సార్లు వెగటు పుట్టిస్తాయి. రచయితల తెలివి, పిల్లాళ్ళ భాషలో ఎబ్బెట్టుగా ఉంటుంది. అలా కాకుండా, పిల్లల మనసు పట్టుకుని రాసిన రాతలు మెహెర్ వి.  ఆ తప్పిపోయినట్టు నటించిన పిల్లాడి కథలో, ఓపెనింగ్ సీన్ లోనే పిల్లాడు దొడ్లోక్కూర్చుని నీటితో కార్ల బొమ్మలు గీస్తున్నాడనీ గాజు పురుగులని చూసి భయపడి ఎగిరాడనీ ఉంటుంది. పిల్లల కథల్లో ఇట్లాంటి పరిసరాలూ, అక్కడ ఇలాంటి వర్ణనలూ చేసిన కథకులున్నారా మనకు? ఎక్కడేపని చేస్తున్నా తమలోని కుతూహలాన్నీ, భయాన్ని, దాచుకోలేని పిల్లలనిలా పట్టిచ్చినవాళ్ళు?

మెహెర్ కథల్లో ప్రేమ విచ్చలవిడిగా పడి ప్రవహించదు. కోపమో, లెక్కలేనితనమో ఎదురుగ్గా వచ్చి పలకరించినట్లు సున్నితమైన ఉద్వేగాలేవీ సున్నితంగా కనపడటం ఉండదు. కానీ, ఆ మొండి గోడలు దాటుకుంటూ వచ్చి తాకిన చెమ్మ కూడా పాఠకులను వరదలా ముంచేస్తుంది అనడానికి ఈ రెండూ కథలూ గొప్ప ఉదాహరణలు.

చేదు పూలు(*కాదు, తరళ మేఘఛాయ..) కథ కినిగె్‌లో ప్రచురించారు - వేరే పేరుతో. నేను అది కనిపెట్టి మెసేజ్ చేశాను. అది మీరే కదా అని. అందుకు నాకు నేనే చప్పట్లు.

అలాగే ఇంకోటి గుర్తొస్తోంది - నేనూ ధీరజ్ చాలా సార్లు అనుకున్న వాక్యం  -" రాత్రంతా నిద్రపోనట్టు ముఖం వడిలిపోయి ఉంది, కానీ దుఃఖమంతా బైటకు తోడేసాక మిగిలే తేటదనమూ ఉంది"   - భాగ్యనగర్ కాలనీ కథలో అనుకుంటానిది. కథలకు సరుకు కోసమని కాకుండా, మనుషులను గమనించడం, రచయితగా ఉండటం, ఈ రెండూ తెచ్చి పెట్టుకున్న లక్షణాలుగా కాకుండా,  మనిషికి స్వభావసిద్ధమైపోతే, అప్పుడూ, ఇలాంటి వర్ణనలు పాఠకులకు దొరికేది!!

నీలా టీచరులో- ఆ టీచరు మీద బొత్తిగా ఆసక్తి కలగలేదు, ఆవిడ ముక్కు తప్ప. :) ఆ పెద్ద కళ్ళమ్మాయి కథ ఆ చిన్న పిల్లాడి చూపులో -96 సినిమాని గుర్తు తెచ్చింది. పదిలంగా దాచుకున్న తొలిప్రేమ కథ, అలా అపురూపంగానే ఉంది.

ఇంకా కొన్ని కథలున్నాయి - కొన్ని మరీ నా గొంతు దిగనివి. చదివాను కానీ, నాకు గుర్తుండిపోలేదు. అట్లా నాకంతగా రుచించని కథల్లో కూడా కొన్ని వర్ణనలు, వాక్యాలు ఎంత బలంగా తాకాయంటే - అవి నాకు గుర్తుండిపోయాయి. ఆ అనుభవం పకడ్బందీగా పాఠకులకు చేర్చడమే రచయితగా నా పని తప్ప,  దేహ వర్ణనలతో కామపు స్పృహ కల్గించడం నా పని కాదన్నట్టు రాసిన వాక్యాలవి. రక్తమాంసాలతో సహా మనిషిని ముందుంచడమంటే ఏమిటో "పింక్ మాంసం" అన్న పదం చదివినప్పుడు తెలిసింది. మీకు జుగుప్స కలిగిందా, ఇంకేమైనా అనిపించిందా అన్నది తరువాతి సంగతి. ఆ వర్ణన మీలో కలిగించే స్పృహ, తొట్రుపాటు - అవి అనూహ్యం.

ఏవైనా రచయిత రాసేది రాయాలన్న వాళ్ళ బలమైన కోర్కెకు లోబడి. పాఠకులుగా మనకున్న పరిమితులకూ వాటికీ ఏ సంబంధమూ ఉండకూడదు కదా.

--

మెహెర్ కథలొస్తున్నాయని పోయినేడు ధీరజ్ నాకు చెప్తే, అప్పుడు విజయనగరంలో ఉండబట్టి వెంటనే కాల్ చేసాను - "నా కాపీ ఉంచాలి మీరు" అని. నెమ్మది గొంతుతో మర్యాదగా సరేనన్నారు. అసలు నా జలుబు గొంతు అర్థమై ఉండదు. మొదటిసారి కినిగె్‌కు రచనల కోసమని చేసినప్పుడూ అంతే, నేను ఆఫీసులో క్యూబికల్ నుండి ఎగిరి దూకి బయటపడి, మాట్లాడదామని ఎంత ప్రయత్నించినా గొంతు రాదే. పుట్టెడు జలుబు ఆ రోజూనూ. అయినా "మీ బ్లాగ్ ఇష్టం" అని చెప్పే కాల్ ముగించాననుకోండీ.

మెహెర్ కథలొస్తున్నాయంటే - సారీ, వచ్చాయంటే, అది, బ్లాగింగ్ ఒక మెట్టు పైకెక్కినట్టనిపించే సందర్భం నాకు. స్వాతి లాంటి నా మిగతా మిత్రులూ పుస్తకాలు తెచ్చారు. అప్పుడూ ఇదే సంతోషం. మనం వెదుక్కు చదువుకున్న బ్లాగ్ ఇంకా బాగా ముస్తాబై వెదుక్కోన్నక్కరలేకుండా ఒళ్ళో పుస్తకమై వచ్చి పడుతున్నట్టు..

( సుధామయి ఇప్పుడే చెప్పారు -  మెహెర్ పుస్తకం వచ్చేసిందనీ, ఈ రోజే సభ అని; ఒక వరుసాగిరుసా ఏమీ లేకుండా ఏదో రాసేశాను...)

(స్మృతి పీఠం ముందు కూర్చుని రాశానని చెప్పాను కదా - తప్పులు దొర్లి ఉండచ్చు. కథలూ గట్రా ఏమున్నాయో, ఏం లేవో నాకింకా తెలీదు. అయితే సారీలవీ చెప్పను.. :-) - అమెజాన్ లో పుస్తకం కొనుక్కుని, ఈ తప్పులనిక్కడ వదిలి, ఒప్పులు మీరు పట్టుకోండి. )

కంగ్రాట్స్ మెహెర్!
& థాంక్యూ!

శ్రీకాంత శర్మ సాహితీప్రస్థానం

నా లోపల విశ్వమంత ఆమ్రవృక్షం/ ఎడతెగని పరాగపవనాన్ని శ్రుతి చేస్తుంటే/ గానంగా కరిగిపోయే కోకిలాన్ని/ ఏకాంత ఢోలాఖేలనం ఎప్పటికీ ఇష్టం నాకు!‘ అంటూ తన ప్రవృత్తిని కవిత్వంలో ప్రకటించుకున్న సాహితీవేత్త ఇంద్రగంటి శ్రీకాంతశర్మ. ‘పండిత పుత్ర…’ అన్న లోకోక్తిని తిప్పికొడుతూ, కవులు, పండితులు అయిన తండ్రి శ్రీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రిగారి సాహిత్య వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు.
కవిత్వమంతా రాజకీయమయమై, నిరసననూ, పోరాటాన్ని ప్రతిపాదించనిదంతా అకవిత్వంగా చూపించబడుతోన్న రోజుల్లో, వి.ర.సం. సాహిత్య ఆధిపత్య ధోరణులపై ఎక్కుపెట్టిన విమర్శగా, శర్మగారి తొలి కవితా సంపుటి అనుభూతి గీతాలును పరిగణించవచ్చు. ఒక సాహిత్య ప్రక్రియను ఈ తీరున అడ్డుగోడల మధ్య బిగించడం నచ్చని, మెచ్చని ఇంద్రగంటి దానిని బాహాటంగానే విమర్శించారు. సొంత అనుభూతి మాత్రమే కవిత్వ ప్రకటనకు బాణీ కావాలన్న శర్మగారి మాటలు, అరువు గొంతులతో గుంపుల్లో దూరిపోతున్న ఈ కాలపు కవులకూ అశనిపాతాలే. వచన కవిత్వం ఒక సాహిత్య ప్రక్రియ మాత్రమేననీ, ఒక ధోరణిని ఉద్యమంగా నడపడం అనవసరమైన పని అనీ, తెలుగు కవిత్వానికి అది మేలు కంటే కీడే చేస్తుందనీ అనడం, ఆ ఉద్యమకర్త కుందుర్తిని విమర్శించడం, సాహిత్యానికి సంబంధించి శర్మగారి ముక్కుసూటితనాన్ని పట్టిస్తాయి. బాహ్య ప్రపంచపు పోకడల ప్రేరణలతో ఉత్పన్నమవుతోన్న తనకాలపు కవిత్వ ఋతువులను గమనిస్తూ, ఆ గొంతుల్లోని ‘ఆధునికత’ను జాగ్రత్తగా జల్లెడ పట్టిన సునిశిత దృష్టి ఇంద్రగంటిది. వస్తువూ, వాదమూ ఏదైనా, మనోధర్మమే ఏ కళకైనా శోభనిస్తుందనీ, అది ఎంత గొప్పదైతే కళ అంతలా రాణిస్తుందనీ నమ్మిన కవి ఇంద్రగంటి. కవిత్వానికి సంబంధించి ఆయన ఈ భావాలను ఎంతలా నమ్మారో, అంతలా పునరుద్ఘాటిస్తూ వచ్చారు. అంతగానూ అనుసరించారు కూడా. ‘గతాల శ్రుతులు సరిచేస్తూ/నా నరాల ప్రకంపనల్లోంచీ/అనుభూతి గీతాలు ఆలపిస్తాను‘ అన్నదందుకే. అలాగే మరొక కవితలో,
బ్రతుకంతా ఏదో సడి, తడి, అలజడి –
నువ్వు గుర్తించలేనంత సున్నితంగా
ఒకప్పుడు
ఒళ్ళు జలదరిస్తుంది-
ఒకానొక అనుభవం
నీలో ఘనీభవించే
మౌక్తిక క్షణమది-
అప్పుడు నువ్వు
కాళిదాసువి
తాన్సేన్‌వి
మైకేలేంజిలోవి-
అంటారు. కవిత్వం, అట్లాంటి మౌక్తిక క్షణాలను ఒడిసిపట్టుకోగల మెలకువతోనే సాధ్యమన్నది శర్మ గారి భావనగా అర్థమవుతుంది. వ్యక్తే శక్తికి ఆధారం కనుక, అదే ఇతివృత్తంగా యువ నామ సంవత్సరం నుండి, యువ నామ సంవత్సరం దాకా వచ్చిన కవిత్వం నుండి ఎంపిక చేసిన ఆధునిక కవితలతో ఆయన వెలువరించిన యువ నుండి యువ దాకా సంకలనం, దానికి వారు వ్రాసిన ముందుమాట, ఈ భావనలను బలపరుస్తాయి.
కృష్ణశాస్త్రి, ఆరుద్ర, శ్రీశ్రీ వంటి ఆ కాలంలోని మంచి కవులు, చలనచిత్ర రంగాన్ని చేరడం కద్దు. కవులకు ఛందస్సు కూడా తెలిసి ఉండటం గీతరచనలో ఒక అదనపు ప్రయోజనం. నిజానికి శర్మగారి వచన కవిత్వంలో కూడా శబ్ద సౌందర్యం చాలా చోట్ల స్పష్టంగా కనపడుతుంది. కళ్ళను ‘క్రూర కాంక్షా ఫణుల మణులవి/ ధీర వాంఛా మదన సృణులవి‘ అన్నప్పుడూ, తనకిష్టమైన గౌతమీ తీరాన్ని, ‘కలల తళుకు టలల వణుకు గోదావరి గళం తొణికి/ కథలు కథలుగా గీతులు గగనంలో మెదులుతాయి‘ అని వర్ణించినప్పుడూ, ఆ శబ్ద, లయజ్ఞానం మనకూ అర్థమవుతుంది.
తనపై ఎంతో ప్రభావం చూపిన కృష్ణశాస్త్రిగారి పంథాలోనే, ఇంద్రగంటి కూడా చలనచిత్ర రంగాన్ని చేరి, చెవుల్లో తేనె సోనలు నింపే గీతాలను వ్రాశారు. పద్య సాహిత్యంలోనూ కృషి చేసి ఉండటం వల్ల, స్వతహాగా లయజ్ఞానం ఉండటం వల్ల, మీటర్‌కు వ్రాయడం శర్మగారికి కష్టమైన విషయమేమీ కాలేదు. కవి కావడం వల్ల చేయగలిగిన గారడీ ఒకటి కలిసి, ఆయన వ్రాసిన చలన చిత్ర గీతాలను గుర్తుండిపోయేలా చేసింది. విపరీతమైన అధ్యయనం వల్ల ప్రోది చేసుకున్న పదసంపద, పద లాలిత్యం, వెలకట్టలేని ఆస్తుల్లా ఆయన కాలూనిన ప్రతి రంగంలోనూ వెన్నంటి నిలిచాయి. విరివిగా ఒక పోలిక జనాల్లో నాటుకుపోయాక, దానిని అటుదిటు చేసి చెప్పడం కూడా ఒక్కోసారి అపూర్వమైన వెలుగునిస్తుంది. ‘తిరునాళ్ళకు తరలొచ్చే కన్నెపిల్లలా/ మెరుపులతో మెరిసింది వానకారు’ పాటలోని ఐంద్రజాలికత అదే. ‘కనుబొమ్మల పల్లకిలోన కన్నెసిగ్గు వధువయ్యింది’ అన్నా, ‘సాంబ్రాణి పొగమాటు ఓ సందమామ/ నీ అగులుచుక్కా సొగసు అద్దానికీసు’ అన్నా, ఈమధ్యనే వచ్చిన సమ్మోహనం సినిమాలోని పాటలో, ‘తనివాఱ నాలో వెలుగాయె/ చిరుయెండ చాటు వానాయె‘ అని వ్రాసినా, ఆయనలోని కవికి సాగిలపడటమే రసహృదయాలు చెయ్యగలిగినది. తొలినాళ్ళలోనే జంధ్యాల వంటి దర్శకుల దగ్గర సింగిల్ కార్డ్ గేయ రచయితగా నిలబడ్డా, తరువాత కాలంలో సినిమాలకు దూరంగా వచ్చి, ఆకాశవాణి ఉద్యోగంలోనే స్థిరపడిపోయారు. తన సాహితీ స్వేచ్చని హరించని వాతావరణంలో ఆయన సృజనాత్మకత రెక్కలు విప్పుకుంది. ఆయన రచించిన లలితగీతాల్లో, ‘బాల చంద్ర రేఖ వంటి ఫాలమందు అలకలటే/ నీలి మొయిలు తునక జారి లీలగా తూగాడెనటే’ ‘ఆనాటి నీపాట ఎదను తాకి గుబులు రేపు…’, ‘ఒక గాలి తేలీ ఉయ్యాలలూగీ నడిచేవా ఓ గోదావరీ’, ‘పూరింటిలో గడప పొదిగిటను నిలచి/ పొంగు ఆకటికంటి నీరు తుడిచాడు (సూర్యుడొచ్చాడమ్మా)’ లాంటి గీతాలూ, వాక్యాలూ ఒక ఎత్తయితే, ఒకే ఒక దేశభక్తి గీతం వ్రాసినా, ఆ తేనెల తేటల బాణీ ఈనాటికీ తెలుగు బాలబాలికలందరి నాల్కల పైనా ఆడుతుండటం, వారికి మాత్రమే దక్కిన గొప్ప గౌరవం.
76’లో విజయవాడ ఆకాశవాణిలో చేరినది మొదలూ ఆయనలోని కళాకారుడి బహుముఖీయమైన ప్రజ్ఞ వెలుగులీనుతూ వచ్చింది. సంగీత సృజనాత్మక రూపకాల్లో శర్మగారూ, వారి బృందమూ జాతీయ స్థాయిలో బహుమతులు గెల్చుకోవడమొక ఆనవాయితీగా మారింది. నాటక పక్రియ పట్ల తొలినాళ్ళ నుండీ అపరిమితమైన ప్రేమా, ఆసక్తి ఉన్నాయని ప్రకటించుకున్న ఇంద్రగంటి, తెలుగు నాటక రంగానికి సంబంధించి చేసిన కృషి, విమర్శ వారి సాహిత్య సృష్టి మొత్తానికీ మణికిరీటంగా నిలబడదగ్గవి. తెలుగునాట నాటకరచన తన ప్రాభవాన్ని కోల్పోవడంలో, నాటక రచన, చదువుకునేందుకు వీలుగా కాక, ప్రదర్శనకు వీలుగా ఉండాలన్న ధోరణి ప్రబలబడమొక ముఖ్యకారణమన్నది శర్మగారి ప్రధానమైన విమర్శ. పరిషత్తు నాటకాలు తెలుగు నాటక రంగానికి చేటు చేశాయనీ, నేడు ప్రతి నాటకానికీ మూల రచనా, ప్రదర్శనా ప్రతి భిన్నంగా ఉన్నాయనే ఇంద్రగంటి గమనింపు చాలా ముఖ్యమైనది.షుమారు నలభై అద్భుతమైన నాటకాలతో, అలనాటి నాటకాలు పేరిట ఆయన వెలువరించిన పుస్తకం, ఆ నాటకాలన్నింటి మూల కథలనూ, మార్పులనూ, ఆ నాటకాల గొప్పతనాన్ని వీలైనంతగా వివరిస్తూ నడుస్తుంది. మహాకవి కాళిదాస మాళవికాగ్నిమిత్రమ్ నాటకాన్ని, మాళవిక నవలగా తిప్పి వ్రాయడంలోనూ నాటకాల మీది శర్మగారి ప్రేమ విస్మరించరానిది.
ఆలోచన పేరిట శర్మ గారు వ్రాసిన సాహిత్య వ్యాసాలెంత విలువైనవో, ‘తెలుగు కవుల అపరాధాలు’ పేరిట ప్రచురించిన సాహిత్య విమర్శ కూడా అంతే విలువైనది. ప్రత్యేకించి ‘అపర కవులు -అంతరార్థశోధకులు’ వ్యాసంలో రచనను దాటి వెళ్ళి, విమర్శా స్థలాన్ని తమ ప్రతిభా ప్రదర్శనకు వాడుకునే విమర్శకులను, రచన ఎక్కడా ఉద్దేశించని అర్థాలను తమకు తాముగా వెల్లడి చేయాలని చూసే విమర్శకుల అత్యుత్సాహాన్ని ప్రశ్నించడం, ఈ బాపతుకు చెందిన విమర్శకులకు కాస్త చురుగ్గానే తగిలిన దెబ్బ.
శర్మ గారు శిలామురళి కావ్యం వ్రాశారు, మూడు కవితా సంపుటులు ప్రచురించారు, కథలు వ్రాశారు, ఎన్నో యక్షగానాలు కూర్చారు, పత్రికల్లో శీర్షికలు నిర్వహించారు, సీరియల్ వ్రాశారు. ఉపనిషత్తులకు తేట తెలుగులో, సరళమైన వ్యాఖ్యానాలు చేశారు. విశ్వగుణాదర్శము లాంటి ప్రబంధాలకు శర్మగారి తెలుగు వ్యాఖ్య చాలా అవసరమైనదీ, అరుదైనదీ, గొప్పదీ కూడా. సంస్కృత సాహిత్యానికీ, తెలుగు పాఠకులకూ వారధి నిర్మించగల వారిని ఒక్కొక్కరిగా మనం కోల్పోతూ వస్తున్నాం. పాఠకాదరణ వినా, ఇట్లాంటి శ్రమకు ఐచ్చికంగా పూనుకునేలా అటు రచయితను గానీ, ఇటు పబ్లిషర్స్‌ను గానీ ప్రేరేపించే సాధనాలు మరేవీ ఉండవు. ఇంద్రగంటి సాహిత్య ప్రస్థాన సింహావలోకనం మనకీ సందర్భంలో అందిస్తోన్న బలమైన హెచ్చరిక ఇదే. ఇన్ని సాహిత్య పక్రియల్లో ఆయన ప్రయోగాల్లా ఏవో చేయడం కాదు, ఈ పక్రియల వైవిధ్యాన్ని గుర్తించి, తన రచనలకు ఏది నప్పుతుందో విశ్లేషించుకుని, ఆ ప్రక్రియను ఎంచుకోవడం వల్ల,ఇన్ని విభాగాల్లోనూ తనదైన ముద్రను వెయ్యగలిగారు. కవిత్వంలో ఆధునికత ఎట్లా చూపగలమో చెబుతూ ప్రస్తావించిన, పురాణమిత్యేవ నసాధు సర్వం, నచాపి కావ్యం నవమిత్య వధ్యమ్‌, సంతః పరీక్ష్యాంతరత్‌ భజంతే, మూఢః పరప్రత్యయనేయ బుద్ధిః–శ్లోకంలో మాదిరిగానే, ఆయన ప్రాచీనమైనదంతా స్వీకరించలేదు, కొత్తది కదా అని ఉదాశీనంగా చూసి దేనినీ తిరస్కరించలేదు. వివేకవంతుల్లా, అన్నింటిని గమనించి, విశ్లేషించి, ఏది ఉత్తమమైనదో దాని పట్ల అభిమానాన్ని ప్రకటిస్తూ వచ్చారు. తన రచనలన్నింతినీ ఇదే తటస్థ బుద్ధితో చూస్తూ, పునః ప్రచురణలప్పుడు కవిత్వాన్ని ఎడిట్ చేసుకున్నారు. సాహిత్యంలో అవలంబించిన ఇదే విమర్శనా దృష్టినీ, నిష్పాక్షపాత ధోరణినీ జీవితంలోనూ అనుసరించారని, ఆయన ఆత్మకథ ఇంటిపేరు ఇంద్రగంటి చెబుతుంది. ‘నేను ఎవ్వరికీ క్షమాపణలు చెప్పలేదు, కానీ నాకు నేను సవరణలు చెప్పుకున్నాను’ అనడం, పుస్తకంలో పంచుకున్న విషయాలు, విజయాలు, అన్నీ కలిసి, ఇంద్రగంటి శ్రీకాంత శర్మను దాపరికాలెరుగని, దాచాల్సిన అగత్యమెరుగని నిండు వ్యక్తిత్వంతో మన ముందు నిలబెడతాయి. తనవారైనా, వేరెవరైనా–అన్ని బంధాలనూ నిర్మోహంగా గమనించుకోవడమూ, నిస్సంకోచంగా విమర్శించుకోవడమూ, తనకు కావలసిన ఏ విషయంలోనైనా తులనాత్మకంగా ఆలోచించుకుని, రాజీపడని ధోరణితో నిర్ణయాలు తీసుకోవడమూ–అది ఉద్యోగం కావచ్చు, చదువూ, పెళ్ళీ కావచ్చు; కుటుంబ సభ్యులతో బంధాలు కొనసాగించుకోవడమో, తెంచుకోవడమో కావచ్చు; సాహిత్య ప్రభావాలు కావచ్చు; జీవితం, ఉద్యోగం తనకు అందించిన అవకాశాలన్నీ అందిపుచ్చుకుంటూ తన ప్రతిభను ఇష్టానుసారంగా మలుచుకోవడం లాంటి విశేషాలు ఇంద్రగంటి ఆత్మకథ పట్ల ఆకర్షణను కలిగిస్తాయి.
మర్రి చెట్టు నీడలో మరే వృక్షమూ ఎదగదంటారు, ఆ ఛాయలను దాటుకుని తనదైన విద్వత్తుతో శాఖోపశాఖలుగా విస్తరించిన ఇంద్రగంటి ప్రతిభ తెలుగు సాహిత్యానికి కొత్త సొబగులద్దిందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. తన తొట్ట తొలి కావ్యమైన శిలామురళిని తండ్రికి అంకితమీయడంతో మొదలై, అటుపైన తన జీవితంలో సింహ భాగంగా స్థిరపడ్డ ఇంద్రగంటిసాహితీ ప్రస్థానం, చిట్టచివరి కవితను తన తండ్రి పేరిటే ‘ఏరు దాటిన కెరటం’గా ప్రచురించడంతో ఒక ఆవృతాన్ని పూర్తి చేసుకుని నిండుతనాన్ని సంతరించుకుంది.
కొండరాళ్ళ మీద నుండి
వర్షధారలు జారిపోయినట్టు
ఎన్నేళ్ళు గడిచాయో కదా!
అయినా కొండగొప్పు మట్టి చుట్టూ
మొలిచిన పచ్చగడ్డి పువ్వులంటి
మీ జ్ఞాపకాలు!
జీవితంలో మీరు వదిలేసిన ఖాళీలను పూరించడానికో
మీ ప్రేమ వైఫల్యాలు, భగ్న స్వప్నాలూ,
తనివితీరని లోకాలోకనాలు
సమీక్షించడానికో
బహుశా నా ఈ కొడుకుతనం!
అంటారా కవితలో.
హద్దుల మధ్య జీవితం
జబ్బులా వార్ధక్యంలా,
బెంగ పుట్టిస్తుంది కాబోలు!
అందుకే, మనస్సు ఇంకా ఇంకా
వెన్నెల రెక్కలు తొడుక్కుని,
ఆకుపచ్చని యౌవన వనాల వైపు
పరుగులు తీస్తుంది!
అంటారింకొక కవితలో.

అట్లాంటి యవ్వనోత్సాహంతోనే జీవన పర్యంతమూ తనను తాను మెరుగుపరుచుకుంటూ సాహిత్య సృజనలో కొత్త పుంతలు తొక్కుతూ వచ్చారు. ఇప్పుడిక హంస ఎగిరిపోయింది. ఇది విశ్రాంతి సమయం.

మారిన పాట

గొంతులో,
చీకటి కొసలు తగిలి
ఆవహించిన మత్తు.

“ఇంకొక్కటి…”

ప్లే లిస్ట్‌లో తరువాతి అంకె.

“మనం మొదటిసారి కలిసినప్పుడు
కాఫీషాప్‌వాడు వినిపించిన పాట!”

జ్ఞాపకాల అలికిడికి
చలించే వర్తమానం.

పెదవి మెత్తదనం పెదవే తేల్చే ఉసురు
శాంతించీ సర్దుకునీ లేచే వేళకి
నిదుర చాలని కన్నుల్లో
పట్టలేనంత వెలుగు.

ఒక పాట నుండి
ఇంకో పాటలోకి
ఇంకో కాలంలోకి…

తొలిస్పర్శ, తొలిముద్దు,
తొలి తొలి సుఖాల క్షణాల దాటి దాటి
ఎక్కడున్నావిప్పుడు?

నీడలు ముసిరేదీ, చెదిరేదీ
అన్నీ చూసిన ఆకాశాన్ని ఆగి అడగడమా!

ఇప్పుడు చుట్టూ తిరుగుతున్న పాట
ఇప్పటిదో రేపటిదో
ఈ క్షణానికి తెలుసా?

పోనీ నీకు?


*తొలి ప్రచురణ: ఈమాట, జులై-2019 సంచికలో..

మీకు తెలియందేం కాదు

మంత్ర నగరి ఒకటి
పిలిచి పిలిచి లాక్కెళుతుంది

ఆ ఊరి పొలిమేరల దగ్గరే ఆకాశం
పాత డైరీల్లోని కాగితాలతో ఆహ్వానమందిస్తుంది

కాళ్ళను పట్టి లాగి అక్కడి నది
వయసు వెనక్కు మళ్ళే మందేదో నోట్లో వేస్తుంది. 

మలుపు మలుపుకీ జ్ఞాపకాలక్కడ
గుర్తులుగా ముద్రించబడి ఉంటాయి

ఏనాడో సగంలో వదిలేసిన రాగాలను
వీధులు వేయి నోళ్ళతో వినిపిస్తుంటాయి

రాతి కొండల హృదయాల్లో పేర్లు,
చెట్ల తొర్రల్లో రహస్యాలు, అక్కడ
భద్రంగా దాచబడి ఉంటాయి

ముక్కలుగా లోలో మిగిలిన అనుభవాలన్నీ
ఒక్కరిగా రూపు కట్టి అడుగడుక్కీ హత్తుకుంటాయి

ఊపిరాడటానికీ, ఊపిరాగడానికీ మధ్య
పోగేసుకునేదల్లా ఆ కౌగిట్లో దక్కిన పరిమళం

మీకు తెలియందేం కాదు,
తొలిప్రేమ ఒడిలో ఆడించిన మంత్రనగరికి వెళితే

ప్రతి ఉదయమూ కొత్తకలల సంతకమవుతుంది
ప్రతి రాత్రీ మోహపు వెన్నెలలో మేల్కొనే ఉంటుంది.

తొలి ప్రచురణ - 2019, జులై సారంగ తొలిసంచికలో


అమ్మ వెళ్ళిన రాత్రి


మళ్ళీ నాలుగు రోజులకు సరిపడే దోసెల పిండీ,
డబ్బాల నిండా కారప్పొడులూ,
కొత్తిమీరా, గోంగూరా పచ్చళ్ళూ..
అమ్మ ఊరెళుతూ కూడా
కొంత కష్టం నుండి తప్పించే వెళ్తుంది.
పగిలిన తన పాదాల కోసం
నే కొన్నవన్నీ వదిలేసి,
విరిగిపోతున్న గోళ్ళకు అద్దుకోమని
నేనిచ్చిన రంగులన్నీ వదిలేసీ,
కొంత దిగులునీ, కొన్ని కన్నీళ్ళనీ
నాకు వదిలేసి
అమ్మ వెళ్ళిపోతుంది
మళ్ళీ వస్తానుగా అన్న పాత మాటనీ
ఏమంత దూరం, నువ్వైనా రావచ్చులెమ్మనీ..
తనను కరుచుకుపడుకున్న నా చెవిలో
ధైర్యంలా వదిలేస్తూ,
నన్నిక్కడే వదిలేస్తూ
అమ్మ వెళ్ళిపోతుంది.
అమ్మ వెళ్ళిన రాత్రి,
నిద్ర పిలువని రాత్రి,
బాల్కనీలో తీగలను పట్టుకు
ఒక్కదాన్నీ వేలాడుతోంటే,
ఆరలేదని అమ్మ వదిలిన చీర
చెంపల మీద తడిని ముద్దాడి పోతుంది.
మసకబారిన మొహాన్ని దాచుకోబోతే
అద్దం అంచు మీద అమ్మ బొట్టుబిళ్ళ
తన కళ్ళతో సహా కనపడి సర్దిచెబుతుంది.
అలవాటైన అమ్మ పిలుపు వినపడక
ఖాళీతనమొకటి చెవులను హోరెత్తిస్తోంటే
తను పిలిస్తే మాత్రమే పలికే ఇళయరాజా పాట
రింగ్‌టోన్‌లా ఇల్లంతా మోగిపోతుంది.

( * ప్రచురణ: తెలుగు వెలుగు, జులై 2019 )

ఊపిరి

స్టాపర్‌ను తోసుకు తోసుకు
మూతపడాలనుకునే తలుపులా
నీ తలపు తోసీ తోసీ
లోకాన్నంతా నెట్టేస్తుంది.

లోపలి ప్రపంచంలో
నువ్వూ నేనూ.
ఆపే బలం గురించి అడుగుతారు వాళ్ళు-

ఈదుతూ ఈదుతూ మధ్యలో
గాలి కోసం తల తిప్పినట్టు
ఏ పని చేస్తున్నా నీకోసం వెదుక్కోవడం
ఊపిరి నిలిపే వ్యాపకం నాకు.

పలుకుసరులు (చిన్నపిల్లల కోసం తెలుగు పద్యాలు)

ఇంట్లో పసివాళ్ళుంటే కాలమెట్లా పరుగులు తీసేదీ తెలియను కూడా తెలియదు. వాళ్ళ చివురు ఎరుపు పాదాలను బుగ్గలకు ఆన్చుకుని ఆ మెత్తదనానికి మురిసిపోవడాలూ, ఇంకా తెరవని గుప్పిళ్ళలో వేలు ఇముడ్చుకుని మైమరచిపోవడాలూ, పాలుగారే చెక్కిళ్ళనూ, పాలు కారుతుండే పెదవి చివర్లనూ చూస్తుండిపోవడాలూ ..వీటిలో పడితే చూస్తూ చూస్తూండగానే రోజులు వారాలు, వారాలు నెలలూ అయిపోతాయి. బోర్లాపడితే బొబ్బట్లు, పాకితే పాయసాలూ, అడుగులకు అరిసెలు, పలుకులకు చిలకలూ – దివ్యంగా వాళ్ళ పేరన పంచుకు తినడాలైపోతాయి. పొత్తిళ్ళలో పడుకుని అమ్మ చెప్పే కథలన్నింటికీ ఊఁ కొట్టడాలతో, తొట్టిగిలకలకేసి కాళ్ళను విసురుతూ ఉక్కూ ఉంగాలతో, ఉంగరాల జుత్తు మీద అందీ అందని చేతులు జోడించి “ఓవిందా” పెట్టడంతో, అత్తా తాతా అమ్మా నాన్నా..బోసి నవ్వులు, బుజ్జి బుజ్జి మాటలతో తోసుకుంటూ తోసుకుంటూ ఏడాది రివ్వున గడిచిపోతుంది.
ఇదిగో..ఈ ఏడాది నుండీ రెండేళ్ళ కాలం భలే గడ్డు కాలం. ఇంకా నడక కుదురే రాలేదని మనమొక వంక బెంగపడుతోంటే, వాళ్ళు మాత్రం అన్ని దిక్కుల్లోనూ పరుగులు తీసి గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తారు. వాళ్ళ అత్తిరిబిత్తిరి మాటలు అర్థమయ్యే లోపే ఇంకో పది ప్రశ్నలు మన దోసిట్లో పోస్తారు. ఆ వయసులో బట్టలు ఇట్టే పొట్టైపోయి నెల తిరిగేసరికి మరిక వాడటానికి వీలుకానట్టు, వాళ్ళకు నేర్పేవి కూడా ఇట్టే పాతబడిపోతునట్టు ఉంటాయి. ఏది చెప్పినా కళ్ళింతలు చేసుకు వినే వాళ్ళ ఆసక్తీ, ఎలా చెప్పినా ఇట్టే నేర్చుకుని వాళ్ళలో వాళ్ళే చెప్పుకుంటూ ఇల్లంతా తిరుగుతూ ఆడే పద్ధతీ చూస్తే, రోజూ రాత్రి వేళ మనమూ వాళ్ళ కోసం ఏదో ఒక హోంవర్క్ చేసి తీరాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చేస్తాం.
కానీ, ఏం చెప్పాలి? వాళ్ళకి ఏమీ తెలియవు కాబట్టి ఏమైనా చెప్పచ్చు కానీ, అన్నీ రుచులనూ పరిచయం చేసే వయసు కాదు. కనీసం రెండేళ్ళైనా వస్తే, “నీ పాద కమల సేవయు..” అంటూ ఓ దణ్ణం పెట్టుకుని, భాగవత పద్యాలో, శతక పద్యాలో, శ్లోకాలో మొదలెట్టవచ్చు కానీ..ఈ లోపో?
అదుగో, అప్పుడు తెలుస్తుంది తంటా! మనకసలు తెలుగులో ఈ వయసు వాళ్ళకు నేర్పేందుకు ఏం ఉన్నాయి?
“తారంగం తారంగం” అంటూ వాళ్ళ చిన్మయ రూపాన్ని చూస్తూ చెప్పినంత సేపు పట్టదు, చిద్విలాసంగా నవ్వుతూ వాళ్ళు దాన్ని అందిపుచ్చుకోవడానికి. అటు పైన “చేత వెన్నముద్ద” చేతిలో పెడతామా, గుటుక్కున మింగేస్తారు. “చందమామ రావె” అంటూ రాత్రిళ్ళైతే రామకథను కూడా గరిపి జోకొడతామనుకోండీ! “బుజ్జి మేక బుజ్జి మేక ఏడకెళితివీ..” అంటూ రెండు చేతులతో అమాంతం ఎత్తుకుని గాలిలో ఊయలూపబోతే, తోటమాలి వస్తున్నట్టే దూకి తుర్రుమంటారు వాళ్ళు. ఈ లోపు తొలకరులు పడితే వానావానా వల్లప్పా అంటూ వాకిలంతా చుట్టబెడతారు కూడా.
“ఒప్పులకుప్పా వయారి భామా” నాకు వెగటుగా అనిపిస్తుంది ” రోట్లో తవుడు, నీ మొగుడెవరు” అన్న మాటలూ చంటివాళ్ళ నోట్లో వినడానికి ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. “బుర్రు పిట్ట బుర్రు పిట్ట” పాటతోనూ ఇలాంటి ఇబ్బందే. చంటిపిల్లలకి “మామ తెచ్చిన మల్లెపూలు ముడవనన్నది” అన్న సంగతెందుకో, కోరి వాళ్ళకి మొగుడి చేత మొట్టికాయ తినేవాళ్ళ గురించి నేర్పడమెందుకో, అందులో సరదా ఏమిటో అస్సలు అర్థం కాదు. పాడబుద్ధీ కాదు, పిల్లలకు నేర్పబుద్ధీ కాదు.
ఇట్లాంటి ఆలోచనలతో, కొన్ని మంచి తెలుగు పాటలు, పద్యాలు, సరదాగా సాగే వాటి కోసం చూస్తూన్నప్పుడు, మిత్రులొకరు ఒక పుస్తకం పంపారు. పారనంది శోభాదేవి గారు వ్రాసిన ఈ చిన్నపిల్లల పద్యాల పుస్తకం పేరు “పలుకుసరాలు”.
చూడగానే పిల్లలకు నేర్పాలనిపించేలా, కొన్ని పద్యాలు చాలా బాగున్నాయి. తేలిక పదాలతో వెనువెంటనే ఆకట్టుకున్నాయి.
మచ్చుకి కొన్ని:

సెనగ బెల్లపచ్చూ
తినగ తినగ హెచ్చూ
చిన్ని పొట్ట నొచ్చూ
డాక్టరపుడు వచ్చూ
చేదు మాత్రలిచ్చూ”
అలాగే ఆటల్లో ఆటగా తెలుగు అంకెలు కూడా నేర్పేయవచ్చు
“ఒకటీ రెండూ మామిడిపండూ
మూడూ నాలుగూ పారా పలుగూ
ఐదూ ఆరూ కొబ్బరి కోరూ
ఏడూ ఎనిమిది పాకం చలిమిడి
తొమ్మిదీ పదీ లడ్డూ బూందీ”
అలాగే “ఎవరా పాప” కూడా ముద్దుగా ఉంది.
చెంపకు చారెడు ముద్దుల పాపా
పొంగిన బూరెల బుగ్గల పాపా
చిట్టీ చిట్టీ నడకల పాపా
నవ్వుల పువ్వుల వెన్నెల పాపా”
ఆ పాప ఎవరో కనుక్కోమనడం, అమ్మ చెప్పననడం – ఊహ అందంగా ఉంది. ఎత్తుకుని పిల్ల చెంపలను చెంపలకానించుకున్న బొమ్మ అందంగా అదే పేజీలో అమరిపోయింది. ఆడపిల్లల అమ్మలందరూ హాయిగా నేర్పుకోగలిగిన మరొక ముచ్చటైన పద్యం “పావడా”. 
పుస్తకంలో ప్రాసలు మరికాస్త అందంగా అమరితే బాగుండని అనిపించింది. కొన్ని పద్యాలు మరీ పెద్దవైనాయి. అవి నేర్పడం పెద్దవారికీ, అంత పద్యాన్నీ వల్లె వేసి ఆటగా చెప్పుకోవడం పసివారికి, ప్రయాసవుతుంది. ఇట్లాంటి పుస్తకాలకి అటువంటి లక్ష్యం ఉంటుందని ఊహించలేం కనుక, ఆ పెద్ద పద్యాలను మినహాయించి ఉండవచ్చుననిపించింది. పుస్తకానికి పేరుగా పెట్టిన “పలుకుసరులు” పద్యం నిరుత్సాహపరిచింది.  ఎక్కువ పద్యాల్లో పిల్లలు రోజువారీ జీవితాల్లో చూసే వాటిని చొప్పించడం బాగుంది. ఆ పదాలు దొర్లినప్పుడల్లా పిల్లలకు ఒక కుతూహలపు చూపుతో వాటికి చెవులప్పగిస్తారు. అలాగే, వీలైనన్ని జంతువులూ, పిట్టలను  పద్యాల్లో ప్రవేశపెట్టడం కూడా పిల్లల ఆసక్తుల పట్ల రచయిత్రికి ఉన్న గమనింపుని పట్టి ఇస్తాయి. పుస్తకం పొడుగుతా, ఒక్క పద్యంలో పిల్లల పేర్లకు మినహాయిస్తే, ఒక్క సంయుక్తాక్షరమూ పడకపోవడం గొప్ప తెరిపినిస్తుంది. ఈ విషయంలో రచయిత్రి శ్రద్ధకు అభినందనలు.
ఐదేళ్ళ లోపు తెలుగు పిల్లలకు లేదా ఆ వయసు పిల్లలున్న పెద్దవాళ్ళకు, ఇలాంటి పుస్తకాలు బహుమతిగా ఇస్తే బాగుంటుంది. రిటర్న్ గిఫ్ట్‌ల జాడ్యం దండిగా అంటుకుపోయింది కనుక, పిల్లలకు ఈ తరహా పుస్తకాలిస్తే అవే చేతులు మారి పద్యాలు నోళ్ళల్లో నానుతుంటాయి. ఐ.పాడ్ లేనిదే అన్నం తినమని మొండికేస్తున్న పిల్లలకూ, అది ఇస్తే తప్ప అన్నం పెట్టలేని అమ్మలకూ ప్రయత్నిస్తే ఇలాంటి పుస్తకాలు, ఈ కొత్త రాగాల్లోని కొత్త పద్యాలు, కనీసం కొన్ని పూటలకైనా ప్రత్యామ్నాయంగా నిలబడగలవు. కొత్తదనాన్ని పిల్లలు ఆహ్వానించినంత సాదరంగా మనం ఆదరించలేం. ఈ సాహిత్యం వాళ్ళది కనుక, వాళ్ళకు అందజేసే బాధ్యతొక్కటీ మనది.
*తొలిప్రచురణ: పుస్తకం.నెట్ లో..

పారనంది శోభాదేవి, “పలుకుసరులు”,
వెల: 65/-,
మంచి పుస్తకం ప్రచురణలు,

ఫోన్: 9490746614

మే రెండో ఆదివారం వంకన..

బాగా ఇష్టమైన వాళ్ళను కళ్ళు మూసుకుని ఊహించుకుని వెనువెంటనే చూడటం దాదాపు అసాధ్యమనీ, వాళ్ళలా కనపడాలంటే, వాళ్ళతో గడిపిన క్షణాల్లో బాగా ఇష్టమైన సందర్భాలను తల్చుకుంటూ, కెమెరా ఫోకస్ మార్చినట్టు మెల్లిగా వాళ్ళ మీదకు చూపు మరల్చుకోవడమొక్కటే మార్గమనీ, ఒకసారెవరో చెప్పారు.
ఆ ఆటలో నిజానిజాలు నాకూ తెలియవు కానీ, అలా అమ్మను గుర్తు చేసుకున్నప్పుడల్లా ఫ్లాష్‌కార్డ్స్‌లా గుర్తొచ్చే జ్ఞాపకాలైతే కొన్ని ఉన్నాయి.
*
చిననాటి ఉదయాలన్నీ దాదాపు ఒకే విధంగా గడిచేవి. గట్టిగా హారన్లు మోగిస్తే వినపడే ఐదో నంబరు రూట్‌లోని వాహనాల రొద, గాలికి ఎగిరే గుమ్మం దగ్గరి కర్టెన్లను దాటుకుని లోపలికి రానే వచ్చేది. తెలవారుతూండగానే వచ్చే నారాయణ (సూర్యుడు కాదు, మా చాకలి) సందులో పంపు దగ్గర బట్టలు బాదుతూ ఉండేవాడు. కుకర్‌లు చుయ్ చుయ్ మంటూ ఈలలు వేస్తూనే ఉండేవి. మూడు ఈలల లెక్క మా ఇంట్లో ఎన్నడూ లేదు, సరిగా పని చెయ్యవని మేమనుకునే ఆ కుకర్ ఈలల లెక్కేమిటో మా అమ్మకొక్కతికే తెలుసు. గిన్నెలు, గరిటెల చప్పుళ్ళు అవిశ్రాంతంగా వినపడుతూనే ఉండేవి. ఆకుకూరలమ్మొచ్చే వాళ్ళు బుట్టలతో గుమ్మాల ముందు ఆగి పేర్లన్నీ ఏకరువు పెడుతుండేవారు. పాలవాళ్ళో, మరొకళ్ళో, ఏదో ఒక ఇంటి ముందు నుండీ పిలుపులూ, వాటికి సమాధానాలూ సందళ్ళతో, ఉదయాలెప్పుడూ మోయలేని హడావుడితోనే ఉండేవి.
ఇంతటి రసాభాసలో వంటింటి గుమ్మం దగ్గర, కత్తిపీట మీద కూర్చుని ముక్కలు తరిగిపోస్తూ, నేను పొద్దున్నుండీ చదివినవన్నీ అప్పజెప్పించుకునేది అమ్మ. నేను గొంతెత్తి అన్నీ చెప్పడం, తను వింటూ సరిదిద్దడం, వెనుక వెనుక తిరుగుతూ, పొయ్యి పక్కకెళ్ళి నిలబడితే, పోపు చిటపటామంటుదని చేయి చాపి తానడ్డుండటం..మొత్తం పాఠమంతా చెప్పేస్తే తన తడి చేతులంటకుండా నన్నే ముందుకు వంగమని ముద్దీయడం..
*
చాలా చిన్నప్పుడు, అమ్మ బెజవాడ పక్కనున్న నిడమానూరులో పని చేస్తున్నప్పుడు, బడికీ మా ఇంటికీ చిన్న బల్లకట్టు దూరం మాత్రమే ఉండేది. సాయంకాలాలు నేను ఆ స్కూల్‌గ్రౌండ్‌లోకి పరుగు తీసి ఆడుకునే వేళల్లో, దూరంగా ఒక మూలకి ఉన్న కోర్టులో టీచర్లు బాడ్మింటనో టెన్నికాయిటో ఆడుతూ కనపడేవారు. కొంగులు నడుం చుట్టూ తిప్పుకుని కోర్ట్ అంతా చకచకా పరుగులెడుతూ వాళ్ళాడుతుంటే, అంత పెద్ద గ్రౌండ్‌లో ఏ మూలనున్నా వాళ్ళ అరుపులు, కేరింతలు వినపడేవి. సంజెకెంపులు ఇక మొదలవుతాయనగా నేను దుమ్మోడుతోన్న బట్టలతోనే స్టాఫ్‌రూంకి వెళ్ళి బ్యాగ్ తెస్తే, అదే గుర్తుగా తాను కోర్ట్ నుండి బయటకు వచ్చేది. ఐదంటే ఐదే నిముషాల్లో ఇల్లు చేరేవాళ్ళం. తాళం తీస్తుండగానే మా ఆకలి కేకలు మొదలయ్యేవి. మాతో పాటే కాళ్ళు చేతులూ కడుక్కునే అమ్మ, మేం సర్దుక్కూర్చునేలోపే పొద్దుటి అన్నంలో పులిహోర పోపు కలపడమో, ఓ ఆవకాయ ముక్కతో దోశలో చపాతీలో, జీలకర్ర, ఉల్లీ,పచ్చిమిర్చీ వేసి పొద్దుటి ఇడ్లీపిండితో ఓ దిబ్బరొట్టో సిద్ధం చేసి చేతిలో పెట్టేది.
నారింజ రంగు ఆకాశం, విశాలమైన అరుగు మీద అక్కా, నేనూ తగువులాడుకుంటూ తినడం, వెనుక విశ్రాంతిగా టీ తాగుతూ పొద్దున వదిలేసిన పేపర్ చదువుతూ అమ్మా...
*
తాను గుంటుపల్లి్‌లో పని చేసేప్పుడు, ఒక్కోసారి సాయంకాలాలు ఇద్దరం బస్సులో కలిసేవాళ్ళం. నా చేతిలోని వైరు బుట్ట, భుజాల మీది బ్యాగు అందుకుని, నన్ను పక్కన కూర్చోబెట్టుకునేది. సున్నబ్బట్టీల దగ్గర బస్సు దిగితే, ఓ ఐదూ పది నిముషాల నడక మా ఇంటికి. కూరల కొట్లో కావాల్సినవి సంచీలో వేయించుకుని, వైరు బుట్ట ఊపుకుంటూ బళ్ళో కబుర్లు చెప్పుకుంటూ, ఒక్కోసారి ఏమీ మాట్లడుకోకుండానూ - నేను గబగబా నాలుగడుగులు వేసినప్పుడల్లా నన్ను తన ఎడమవైపుకు తెచ్చుకుంటూ నా దగ్గరికి వస్తూ -
సైకిళ్ళూ, స్కూటర్లూ, స్కూల్బస్సులూ, సిటీబస్సులూ, అన్నీ రయ్యిరయ్యిన పోయే ఆ చిన్న రద్దీ రోడ్డు మీద, ఒక నిలువు గీత గీసి అది మా ఇద్దరికీ రాసిచ్చినట్టు, తానూ-నేనూ..
*
చిన్నప్పుడు బాగా దెబ్బలు పడేవి నాకు. అన్నం తినలేదనే ఎన్నో సార్లు..
ఎనిమిది దాటేదాకా ఇడ్లీలను ముక్కలుముక్కలుగా తుంచీ, పాలను చుక్కకొక్కటిగా ఉన్న నాలుగు కుండీల్లోనూ, తులసి మొక్కలోనూ వొంచీ (తప్పే..అప్పుడు తెలీదు..) ఐ.టి.ఐ గ్రౌండ్‌లోకి అరటిపళ్ళని విసిరేసి (ఈ పాపం అప్పుడే పండిపోయి, జన్మభూమి కింద ఊరంతా ఊడ్చి వచ్చేవాళ్ళం  ) ఏవేవో తిప్పలు పడుతుండేదాన్ని.
ఎనిమిందింపావు దాకా "అయిందా?" "తిన్నావా?" "నే వచ్చానంటే వీప్పగిలిపోతుంది.." "కానీయాలి త్వరగా.." - ఇట్లా ఆ గదిలో నుండి ఈ గదిలోకి తిరుగుతూ అమ్మ అరిచే అరుపులు చెవిన పడుతూనే ఉండేవి. అయినా ముద్ద దిగేది కాదు. చివరికి ఉరిమి ఉరిమి చూస్తూ నా మీదకొచ్చి, ఆ ఇడ్లీ ముక్కల ప్లేటు సింక్‌లో పడేసి, అప్పుడే దించిన అన్నంలో తోటకూర పప్పు, చారెడు నెయ్యి వేసి కలుపుతుంటే, ఆ అన్నం మెతుకుల వేడి అమ్మ వేళ్ళ మీదే చల్లారి నా నోట్లో గోర్వెచ్చని ముద్ద జారేది.
నేనలా మొండి వేషం వేసిన ప్రతిసారీ, చల్లారిన కాఫీ గొంతులోకి వొంపుకుని పరుగు తీసే అమ్మ...
*
గన్నవరం జిల్లా పరిషద్‌ హై స్కూల్‌లో లో రిటైర్మెంట్. మైక్ ముందు నిలబడి ముప్పయ్యారేళ్ళ ఉద్యోగ జీవితాన్నీ, దానిని ఒరుసుకుంటూ పోయిన ఉద్యోగపరమైన అనుభవాలనీ, జ్ఞాపకాలనీ, నింపాదిగా చెప్పుకుపోతోంది. నీరెండలో పద్ధతిగా బాసెంపట్టు వేసుకుని కూర్చున్న వందల మంది పిల్లలకు వెనుకగా నిలబడి, ఫొటోలు తీసుకుంటున్నాను. సభ ముగిసింది. పూలదండలు చేతుల్లోకి మార్చుకుంటూ స్టేజ్ దిగి వస్తోంది, అమ్మని అందుకుంటూ అక్క. తరువాతి ప్రోగ్రాం వివరం చూస్తూ, చెబుతూ నానగారు. ఓ తొమ్మిదో తరగతి పిల్లవాడికి ఏం తోచిందో..పరుగు పరుగున దగ్గరకు వెళ్ళి చేతులు కట్టుకుని మాట్లాడుతున్నవాడల్లా ఉన్నట్టుండి ఒక చేత్తో కళ్ళు రుద్దుకుంటూ బావురుమన్నాడు.
కెమెరా అసమర్థత అర్థమైన క్షణం...వాళ్ళిద్దరినీ దూరం నుండి చూస్తూండిపోయాను.
ఏం జరుగుతోందో అర్థం కాక అవాక్కై, అంతలోనే బిగ్గరగా నవ్విన అమ్మ...
*
జ్ఞాపకమున్న ప్రతి సందర్భం వెనుకా, నాకూ అబ్బితే బాగుండనుకునే గుణాలున్నాయి, నిర్లక్ష్యం చేయకూడదని తెలీక చేసిన తప్పులున్నాయి. అమ్మంటే ఓపికనీ, అమ్మంటే సహనమనీ, అమ్మంటే ఆకలెరుగనిదనీ, విశ్రాంతి కోరనిదనీ అందరిలాగే అమాయకంగా నమ్మిన అబద్ధాలున్నాయి. ఆ అమాయకత్వాన్ని క్షమించిన అమ్మ దయ ఉంది.. మన పశ్చాత్తాపం, మన క్షమాపణలు అమ్మ కోరదేమో కానీ, కాలం చెవులు మెలివేసి మరీ నేర్పిస్తుంది. చెప్పిస్తుంది.
అమ్మకు కోపం తెలీదని కాదు. తన మౌనంతోనే మనం తలపడలేని యుద్ధం చెయ్యగలదని తెలీకా కాదు. "చెంపకు చేయి పరంబగునపుడు కంటికి నీరు ఆదేశంబగు.." అన్న సూత్రం వంటబట్టిస్తే మిగిలినవన్నీ నేర్పడం తేలికని తెలియనిదనీ కాదు. కానీ, జ్ఞాపకంగా ఇవి మాత్రమే ఉండే బాల్యాన్ని ఇవ్వనందుకు అమ్మకు ఆలింగనాలు.
ఏపూటకాపూట మారిపోయే తెలిసీతెలియనితనాల లెక్కలు పక్కనపెడితే, ఊహ తెలిసిన నాటి నుండీ, ఇప్పటి దాకా, "ఇది మాత్రం నిజం" అనిపించిందేమైనా ఉందా అంటే..ఉంది.
అది, అమ్మ ఇచ్చే ధైర్యమే ఇప్పటికీ నా సంతోషానికి మొదటి మెట్టవడం.
అమ్మ సంతోషమే నా ధైర్యమవడం!
Happy Mother's Day!!  

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...