ఇట్లాంటి రాత్రుల్లోనే

వానాకాలపు చివరి రోజులు.
భూమిలోకి మేకులు గుచ్చుతున్నట్టే
పడి ఆగింది వర్షం.
చివాలున వీచే గాలికి, చినుకులు
నేల ఝల్లుమనేలా జారిపడుతున్నాయి
పల్చని వెన్నెల రేకలు కొమ్మల దాటుకుని
పొదలను వెలిగిస్తున్నాయి
చీకటి కొసలను కోసుకుంటూ
కీచురాళ్ళ రొద పరుచుకుంటోంది
గిటార్ తీగలను పట్టి తూగుతూ
ఎవరింటి సంగీతమో దిక్కుల్లోకి దూకుతోంది
ఇట్లాంటి రాత్రుల్లోనే ఒకప్పుడు నేను
చినుకుల చప్పుడు వింటూ కూర్చుండిపోయాను,
మా అక్కని కుదిపి కుదిపి
నా తొలియవ్వనగీతాలన్నీ పాడి వినిపించుకున్నాను,
కిటికీ ఊచల మధ్య నుండి ఆకాశాన్ని చూస్తూ
దాని అనంతమైన స్వేచ్ఛని కలగంటూ నిద్రలోకి జారుకున్నాను.
నా తడిచేతులతో శ్రావణభాద్రపదాలను దాటించుకుంటూ,
నేను ఒంటరి ప్రయాణమే చెయ్యాలనుకున్నాను కానీ
కారుమొయిలు మధ్య దూదిపింజెలా మెరిసే ఆకాశపు తునకను
రెప్పలెగరేసి వెదుక్కునే పసిపిల్లను నా నుండి వేరుచేయలేకున్నాను.
నేనెంతో మారాననుకున్నాను,
శరణార్థిలా నా తలుపులు దడదడ తట్టిన వర్షం,
నేనొచ్చేలోపే వెళ్ళిపోయిందని కళ్ళు తడిచేసుకోవడం మాత్రం మానలేకున్నాను.

4 comments:

  1. కళ్ళ తడి అల్లక్కడే... ఆ రెప్పల హద్దునే నిలవనీ
    నీ బెంగ నీలాల నా నవ్వు రుమాలతో అద్ది పోనీ :)
    ~లలిత

    ReplyDelete
    Replies
    1. లలిత గారూ - థాంక్యూ! :) ఎలా ఉన్నారు? మీ గొంతు వినాలని ఉంది మళ్ళీ..

      Delete
  2. Chala bagundandi gatinchina kalanni gnaptiki techharu

    ReplyDelete

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...