చెప్పగలిగే నేర్పు అనుభవించిన మనకు లేకపోవడమే తప్ప, మనలో చాలా మందికి "బంగారు మురుగు" బామ్మ లాంటి బామ్మ/అమ్మమ్మ ప్రేమ అనుభవమే అని నా నమ్మకం. నాకు ఊహ తెలిసే నాటికే మా అమ్మమ్మకు డెబ్బై ఏళ్ళు దగ్గరపడ్డాయి. విజయవాడలో ఇద్దరు కూతుళ్ళున్నా సరే, నా ఒక్కగానొక్క మేనమామను విడిచి రావడానికి ఒప్పుకునేదే కాదు. బతిమాలీ బామాలీ ఏ వేసవి సెలవులకో ఇంటికి తీసుకొస్తే, వచ్చిన రోజు నుండే ఏదో పని నెత్తిమీదకు వేసుకునేది. రోటి పచ్చళ్ళో, దేవుడి దగ్గర వెండి పూలు తోమడమో, అమ్మ చీరలన్నీ చేతులతో ఒత్తివొత్తి శుభ్రంగా మడతలు పెట్టడమో, నాకు తలంతా నూనె పట్టించి ఓపిగ్గా దువ్వి జడలెయ్యడమో..ఏదో ఒకటి చేస్తూనే ఉండేది. పరీక్షలొస్తున్నాయంటే చాలు - పొద్దున లేచి చదువుతాంలే అమ్మమ్మా అన్నామా, లేచి తీరాల్సిందే. గంట కొట్టినట్టే లేపేది. లేచేదాకా రెణ్ణిముషాల కొకసారి గుర్తు చేస్తూనే ఉండేది. ఆవిడ గొడవకి అమ్మ లేచొచ్చి తిడుతుందన్న భయానికి నసుగుతూనే లేచి కూర్చునేవాళ్ళం. స్నానం చేసుకుని పూజ చేసుకుని చదువుకోమనేది. "స్పర్ధయే వర్ధతే విద్యా" అని మా క్లాసులో మా కన్నా బాగా చదివేవాళ్ళ పేర్లు వద్దన్నా గుర్తు చేస్తూ ఉండేది. మేం విసుగుమొహాలు పెట్టి, పుస్తకాల్లో తలలు దూర్చి కూర్చునేవాళ్ళం. పరీక్షలప్పుడు భయమేసి కాలుగాలిన పిల్లుల్లా తిరుగుతుంటే, "ముందు చదువుకు ఏడవరాదూ" అని మొహంవాచేట్టు తిట్టి ఆంజనేయ మంత్రం చెప్పేది. ఏదైనా వస్తువు పోతే మా అమ్మమ్మ ఎట్లాయీనా సాధించి తీరుతుందని మా కజిన్స్లో ఒక బలమైన నమ్మకం. ఆ వెదుకులాటకు వెయ్యి దండాలు. ఆవిడ వెటకారం అర్థమవ్వడానికే చాలాసేపు పట్టేది. నన్నూ, నా ఆటలనూ, నా స్నేహితులనూ వెయ్యి కళ్ళతో కనిపెట్టి, మా అమ్మ బడి నుండి రావడంతోటే నేరాలు చెప్పేది. అప్పుడు కోపంగా ఉండేది. ఇప్పుడు అర్థమవుతోంది. ఆవిడ పట్టుదలా, క్రమశిక్షణా, శుభ్రతా, ఓపికా, దేన్నైనా తేలిగ్గా తీసుకునే స్వభావం, కష్టపడే తత్వం, తృప్తీ, క్షమా - మాలో ఎవ్వరికీ ఆ స్థాయిలో పట్టుబడలేదనిపిస్తుంది.
పోయిన నెలలో అమ్మమ్మ వందవ పుట్టినరోజు పిల్లలూ, మనవలూ, మునిమనవలూ అందరూ కలిసి పండుగలా చేశారు. వెళ్ళలేకపోయిన ఇద్దరు మనవలలో నేనొకదాన్ని. రెండవవాడు, నా మేనమామ ఒక్కగానొక్క కొడుకు మనోహర్. ఇద్దరం అమెరికాలోనే ఉన్నాం. ఆ వారం రోజులూ, అటుపైన, ఎవరి ఊళ్ళకి, ఎవరి దేశాలకి వాళ్ళు వెళ్ళే దాకా, పూటకో ఫొటో, ఓ వీడియో పెట్టి ప్రాణాలు తోడేశారు మా వాళ్ళంతా. కానీ మొన్న నా పిన్ని కొడుకు సందీప్ -' అమ్మమ్మ నువ్వు రాసిన కవిత చూడు ఎట్లా చదువుకుంటోందో రోజూ' అని మా "సీతామహాలక్ష్మి మనవలు" గ్రూప్‌లోఓ వీడియో పంపినప్పుడు మాత్రం, మాటమాటా కూడబలుక్కుంటూ, పవిటతో కళ్ళొద్దుకుంటూ మెల్లిగా చదువుకుంటున్న అమ్మమ్మను చూడగానే నా సంతోషమూ దిగులూ కూడా రెట్టింపైపోయాయి.
అమ్మమ్మ గురించి నేనేదైనా రాసి తీరాల్సిందే అన్నప్పుడు, నా వల్ల కానేకాదని తప్పుకున్నాను. పోరు పడలేక ఒప్పుకున్నాక కూడా, నాలుగుమాటలు రాయగానే అమ్మమ్మ కళ్ళముందుకొచ్చి భారంగా అనిపించేది. ఎక్కడ మొదలెట్టాలో, ఎక్కడ ఆపాలో ఏమీ అర్థం కాలేదు. ఇంత దగ్గరి అనుబంధాల గురించి వ్రాయడం చాలా కష్టమైన పని, నాకైతే చేతకాని పని- కానీ అమ్మ ప్రేమకి తలొగ్గి వ్రాయక తప్పలేదు.
శతవసంత లక్ష్మి
==============
వేయి పున్నముల వెన్నెల తటాలున కురిసినట్టూ,
చంద్రహారపు పుత్తడి మెరుపేదో తళుక్కున మెరిసినట్టూ,
అమ్మమ్మ జ్ఞాపకం!
నున్నగా, నూనె రాసి శ్రద్ధగా దువ్వుకున్న
పండిన తలపై నుండి,జీవితంలోని
నలుపు తెలుపు రంగులన్నింటినీ
చదివీ చూసీ విడదీస్తున్నట్టుండే
అమ్మమ్మ పాపిట,
బిగించి కట్టిన ముడీ
ముక్కోటి అనుభవాలను
దిక్కుకొక్కటిగా చల్లినట్టుండే
ఆ తెల్లరాళ్ళ చెవి దిద్దులు,
వాటి బరువుకు సాగీ సాగీ వేలాడే
ఆ చెవి తమ్మెలు
వేసవి సెలవుల్లో మావయ్య ఇంటికెళ్ళినప్పుడు
ఆరేడేళ్ళ నా పసితనం మంకుగా ఏడుస్తున్నప్పుడు
పైవరసల్లోని స్టీలు డబ్బాల్లోంచీ మిఠాయి తెచ్చి
వీధరుగు మీద కూర్చోబెట్టి తినిపించిన సనసన్నటి చేతులు,
ముడతలు పడ్డ ఆ వేళ్ళూ,
పదిహేనుమంది మనవల్లో,
ఎవరెప్పుడు దగ్గరకెళ్ళి ముద్దాడినా,
నాలుగు పేర్లు దాటాక గానీ అసలు పేరు చెప్పనివ్వని ప్రేమ,
నుదిటి మడతల్లో నలిగి కనపడే జ్ఞాపకశక్తీ,
అమ్మమ్మంటే, పుట్టగానే అమ్మ నా గుప్పెట్లో పెట్టిన పగడపు ఉంగరం!
పసితనపు చేసంచీ అరల్లో భద్రంగా దాచిపెట్టుకున్న తీపి తాయిలం!
ఒక్క దొండపాదుతో ఏ తుఫాను గాలికీ తొణక్కుండా
ఇల్లు నడిపిన నిండుకుండ అనేవారొకరూ,
లోచూపుతో ఇందరిందరిని కనిపెట్టుకుని
దప్పి తీర్చి సేదతీర్చిన చల్లని సెల అనేదొకరూ,
వెళ్ళిపోతున్నాం -అనగానే గబాల్న కదిలి కావలించుకుని
కన్నీరైపోయ్యే గోదారి అనేది ఇంకొకరు.
ఒక్కొక్కరికీ ఒక్కోలా,
అద్దంలా. ఆకాశంలా.
అందరి మనసులూ తడయ్యేలా, తేటపడేలా,
అమ్మలా, అమ్మమ్మలా, సీతమ్మలా..
వెనక్కి తిరిగి చూస్తే వేయి పున్నములు.
వేలెండంత కూడా లేని మేం చేసిన
వేలవేల తప్పులు.
పశ్చాత్తాపాలూ, ప్రాయశ్చిత్తాలూ,
ఇప్పుడు ఆగి నిలబడితే కొన్ని కన్నీళ్ళు.
మెత్తటి చీరల్లో ముడుచుకు పడుకుని
మావయ్య ఇంట్లో మా కోసం ఆశగా చూస్తున్నట్టూ..
ఫోనుల్లో మా మాట వినగానే,
ఓసారి వచ్చి కనపడవే అంటున్నట్టూ..
నే చెప్పిన మంత్రం చదూకుంటున్నావా? అని
అలాగే వంగి ఆరా తీస్తున్నట్టూ..
"ఆయీ ఆయీ ఆపదలు కాయీ" అని
లాలి పాడి నిద్రపుచ్చుతున్నట్టూ
వేపచెట్టు క్రింద కథలు చెబుతున్నట్టూ
వెలక్కాయ పచ్చడితో ముద్దలు పెడుతున్నట్టూ
నిన్ను తీసుకెళ్తా రావె అమ్మమ్మా అంటే
'ఓ...యబ్బో' అంటూ వెక్కిరిస్తున్నట్టూ..
అమ్మమ్మ అనుకుంటే చాలు,
వేయి అనుభవాలిలా పూరేకుల్లా నా చుట్టూ ఎగిరి
నన్నొక సీతాకోకను చేసి ఆడిస్తాయి.
అమ్మమ్మంటే,
నా ప్రతిభయాన్నీ దాటించిన తిరుగులేని రామమంత్రం,
వేయి చేతులతో నన్ను కాచుకుని
బ్రతుకంతా వెంట నడిచే తొలిప్రేమప్రపంచం.
<3 div="" nbsp="">3>
మీ అమ్మమ్మగారికి వందవ పుట్టినరోజు శుభకామనలు!
ReplyDelete"అమ్మమ్మంటే, పుట్టగానే అమ్మ నా గుప్పెట్లో పెట్టిన పగడపు ఉంగరం!
పసితనపు చేసంచీ అరల్లో భద్రంగా దాచిపెట్టుకున్న తీపి తాయిలం! "
ఈ లైన్లు అధ్బుతం!
Thank you so much, Lalitha Garu :)
ReplyDeleteLong time, how are you doing?
Ma ammamma ni kalla mundu chusinatte vundhi mi kavitha chadivaka... Bahusha andharu ammama gnapakalu ilane vuntayemo !
ReplyDeleteThank you Ramana Reddy garu. Language of love is almost the same everywhere, I guess
DeleteSorry, Venkat gaaroo..? meeraa! evarO anukunnaanu, very sorry and thank you very very much, seeing you here is a great great surprise and I am very happy!
DeleteNo problem. Thanks you again.... following your blog write ups regularly :)
Deleteఅమ్మమ్మ ఆశీర్వచనాలు మిమ్మల్ని ఇలా తీర్చి దిద్దాయన్నమాట,శతవసంతాల అమ్మమ్మగారికి నమోన్నమ్మ:
ReplyDeleteఎంతో ప్రేమ అభిమానం ఉంటే తప్ప ఇలాంటి పదాలు ఊడిపడవు గొంతులోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాయి
మీకు అమ్మమ్మ ఎలాగో మాకు నానమ్మ అలాగన్నమాట🙏
నేను పుట్టేనాటికే మా బామ్మ, ఇద్దరు తాతయ్యలూ లేరండీ. తెలిసిందీ, గుర్తుందీ, మర్చిపోలేనిదీ అమ్మమ్మే. :) మీ మటలకు ఎప్పటిలాగే చాలా సంతోషం..థాంక్యూ!
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteమీ వ్యాసం మొదట్లో చెప్పినట్టు అందరికి అమ్మమ్మల మీద అపారమైన ప్రేమ ఉన్నా, వ్యక్తం చేయటం చేతకాదు. మీ కవిత ద్వారా మీ అమ్మమ్మగారిలో ఎంతో అందంగా మాకందరికి మరోమారు మాఅమ్మమ్మలని చూపెట్టారు. చాలా సంతోషం.
ReplyDeleteమీరు ఎలా అండీ ఇలా రాసేయు గలుగుతున్నారు?....
ReplyDelete