ఆఫీసులో pantry వైపుకు వెళితే, అక్కడ కొంచం పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు housekeeping staff ఎప్పుడూ ఏవో పనులు చేసుకుంటూ కనపడుతూనే ఉంటారు. తెలుగువాళ్ళు మొహాలను చూసే ఒకరినొకరు గుర్తుపడతారనుకుంటాను. ఒకావిడ నన్నెప్పుడూ టైం ఎంతయింది మేడం ..అని పలకరిస్తూ ఉంటుంది. భోజనం చేశారా, టైం ఎంత - ఈ రెండే ఆవిడ ప్రశ్నలు. చక్కగా స్టెప్స్ వేసి కట్టుకునే సిల్కు చీరలతో, ముడితో, పెద్ద బొట్టుతో..బాగుంటుంది.
ఈ రోజు లంచ్ టైంలో ఇక వెళ్దాం అనుకుంటూండగా పది నిముషాల్లో జాయిన్ అవ్వాలి అంటూ meeting invite ఒకటి వచ్చింది. కాదనలేనిది, ముందువెనుకలకు జరపలేనిది. తప్పదురా దేవుడా అనుకుంటూ, అప్పుడే ఏదో ఫోన్ వస్తే మాట్లాడుతూ pantry వైపుకి వెళ్ళిపోయాను. ఆవిడ ఉన్నారు, ఎప్పటిలాగే, నవ్వు మొహంతో. పక్కకు ఒద్దికగా జరిగి నిలబడి, కొట్టొచ్చినట్టు కనపడే ఆకుపచ్చ నాప్‌కిన్‌తో కాఫీ మగ్స్ తుడుస్తూ. నేను మాట్లాడాల్సిన నాలుగు ముక్కలూ మాట్లాడి, - ఇక మీటింగ్ ఉందనీ, మళ్ళీ ఎప్పుడైతే అప్పుడు లంచ్ కి బయటకి వచ్చినప్పుడు ఫోన్ చేస్తాననీ చెప్పి - పెట్టేశాను. హడావుడిగా అక్కడున్న బిస్కట్స్ తీసుకుని, వాటర్‌బాటిల్ నింపుకుని వెనక్కి రాబోతుంటే, వెనుక నుండి "ప్చ్.." అంటూ ఏదో వినపడీ వినపడని శబ్దం. చప్పున వెనక్కి తిరిగి చూశాను - ఆవిడ చేసే పని ఆపి నన్నే చూస్తోంది. "సారీ, టైమే కదా..ఒకటవుతోంది.." నా నోటిలో మాటింకా పూర్తవనే లేదు.."ఇంకో రెండు బిస్కట్లు తీసుకు పో మేడం.." అందామె అలాగే చూస్తూ, కొంచం భయం అంటిన కళ్ళతో..
No comments:
Post a Comment