'96

"తీరాన్ని చేరాకే సముద్రం మీద ప్రేమ మొదలవుతుంది.
తలవెంట్రుకలు నెరిశాకే ప్రపంచం అర్థమవుతుంది.
నిన్నామొన్నల ఆనందాలన్నీ పేనుకుని
ఈనాటి ఈ క్షణాలని రసవంతం చేస్తున్నాయి.
కూడుకుంటోన్న ఈ వేళ్టి సంబరాలన్నీ,
రేపటి జీవితానికి కొత్త అర్థాలను దాచిఉంచుతాయి.

జీవించని జీవితపు భరించలేనితనంతో, కుదుపుతో,
మున్ముందుకెళ్తున్నాను.

దాచుకున్న తపనలను రగిలించుకోవడానికి,
వెలిగించుకోవడానికి,
ఇప్పుడే ఇక్కడే నేను బయటకు కదిలి-
లోలోపలి లోతులకు దూకుతున్నాను.

అకారణంగా, సహజంగా, స్పష్టంగా,
సూర్యకిరణపు చందంగా,
నా నుండి వేరుబడి, నన్ను నేను చూసుకుంటాను.
నావి కాని లోతులివి, కానీ ఇక్కడే బతుకుతున్నాను.
అద్దంలా పుట్టినందుకు,
దేనిని చూస్తే దానిలా, మారిపోతుంటాను.

కాళ్ళ మధ్య గారంపు చెలిమితో తిరుగాడే
పిల్లి పిల్ల ఉల్లాసపు జీవితమైనా చాలు కానీ,
ఎదురుపడ్డ ప్రతిసౌందర్యాన్ని తాకి చూసే
భాగ్యమైతే కావాలి.

అవసరమైతే లోకనియమాలను అతిక్రమిస్తాను
నాలానే, నాకు నచ్చినట్టే,
జీవితోన్నత సారమంతా అనుభవంలోకి తెచ్చుకుంటూ,
మరింత నిర్మలమైన నన్ను ఉనికిలోకి తెచ్చుకుంటూ,
ప్రతీ క్షణం పరిపూర్ణంగా అనుభవిస్తూ బ్రతుకుతాను.

గమ్యపు స్పృహ లేకుండా తన మానాన తాను
గాలిలో గిరికీలు కొడుతూ పోయే పక్షిలా
లోతులకు జారవిడువబడ్డ రాయిలా
శబ్ద ఛాయలన్నీ దాటుకుని, చూస్తున్న
దృశ్యంలోనే తలమునకలైపోతాను.

ఎద్దు మూపురం మీద నిలబడ్డ పక్షిలా
భూమి మీద బ్రతుకు సాగించుకుంటాను.
చేయీచేయీ కలుపుకుని
దూరాలను కొలుచుకుంటూ సాగిపోతాను

ఇప్పుడు, ఈ క్షణంలో,
అమ్మలా నన్ను పొదుముకుని
లాలి పాడుతున్న ఈ క్షణంలో,
పరవశమేదో పరుచుకుపోతోంది,
రహస్యమేదో గుప్పిట చిక్కుతోంది. "

కథ ఎక్కడ మొదలెట్టాలన్నది, కథ చెప్పినంత కష్టం. కథలో ఒక పాత్రని మనకు పరిచయం చెయ్యడమన్నది, ఆ పాత్ర జీవితమంత సంక్లిష్టం. ఒకే దెబ్బకి రెండు పిట్టలన్నట్టు, 96 దర్శకుడు కథ ఎత్తుగడని రామచంద్రన్ పాత్రతో, రాంచంద్రన్ పాత్రని ఓ పాటతో మొదలుపెట్టాడు. ఐదున్నర నిముషాల నిడివి ఉన్న పాటని వినడానికి మాత్రమే కాదు, చూడటానికి కూడా ఇంత కథనంతో, కవిత్వంతో నింపి మన ఎదుటకు తెచ్చిన పాట, ఈ మధ్య కాలంలో నాకు తారసపడలేదు.

ఒక తాపసిని, భావుకుడిని, సంచార జీవిని, సరళత్వమే జీవన స్వభావంగా మలుచుకున్నవాడిని, అతని చుట్టూ పరుచుకునే ఓ తేలికపాటి వాతావరణాన్నీ, మిడిసిపాటులేకుండా మసులుకునే నైజాన్నీ, ప్రకృతితో మమేకమై బ్రతికే ట్రావెల్ ఫొటోగ్రాఫర్‌ని ఒక్కొక్క ఫ్రేంలో ఇముడ్చుకుంటూ రామచంద్రన్ జీవనచిత్రాన్ని మనకు పరిచయం చేస్తాడు. ఈ పాట ఓపెనింగ్ షాట్, క్లోసింగ్ షాట్ గురించి రెండు మాటలు చెప్పాలి.

చివ్వుమని కదిలి చిరుమీనులన్నీ గుంపులుగుంపులుగా చెదిరిపోయేయే దృశ్యంతో మొదలైన పాట - ఇసుకలో హీరో తన పేరు రాస్తూ ఉండగా, కెమెరా పైపైకి జరుగుతూ పోయి, అక్షరాలు, అతను అలుక్కుపోవడంతో ముగుస్తుంది.

సమూహాల్లో ఇమడలేక, సముద్రమంత ప్రపంచంలో, జీవితంలో తనదైన అన్వేషణను మొదలెట్టుకుని, చివరికి కోరుకున్న తీరంలో తన పేరును ముద్రించుకుంటూ, పోలికలకూ, పోటీలకు అతీతంగా, తనకు తానుగా, ఒంటరిగా నిలబడ్డ రామచంద్రన్. ఎంత అందంగా చెప్పుకొచ్చాడా కథని! ఈ ఒక్క పాటతోనే దర్శకుడు నా మనసు దోచేశాడు.

"ఫొటో తీస్తున్నప్పుడు మనం పట్టుకోవాల్సింది ఓ దృశ్యాన్ని కాదు, ఓ జ్ఞాపకాన్ని" - అని చెప్తాడు ముప్పైఏడేళ్ళ నాయకుడు.  ఎదురుపడే ఒక్కో దృశ్యం ఒక్కో జ్ఞాపకం; జ్ఞాపకం, ఉద్వేగాలన్నీ శాంతించి మనఃఫలకంపై విశ్రమించిన అనుభవం. మసకబారని జ్ఞాపకాలూ కొన్ని ఉంటాయి, మలినపడని అపేక్షలూ భద్రంగా రహస్యపు అరల్లో దాచిపెట్టబడతాయి. అట్లాంటి అమాయకమైన అపురూపమైన ప్రేమకథ - '96.

ఒక మొహమాటపు పిల్లవాడు. పల్చని చెంపలతో, మధ్యపాపిట తీసిన జుత్తుతో, లోతైన నల్లని కన్నులతో, చిన్నప్పటినుండీ కలిసి చదువుకున్న పిల్ల మీద ఇష్టం పెంచుకున్న మామూలు పిల్లవాడు. ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసే ధైర్యం కూడా లేని వాడు. అలనాటి మేటి గాయని పేరు పెట్టుకున్న నెచ్చెలిని, అందమైన గొంతుతో క్లాసందరి ముందూ పాటలు పాడే అమ్మాయిని, తనకిష్టమైన పాట పాడమని కూడా అడగలేనంత మొహమాటస్తుడు. ఆమె దబాయింపు చూపులకి ముసినవ్వుతో తలవొంచుకునేవాడు, ఆమె తల తిప్పి చూస్తే చూపు కలపకుండా దాక్కునేవాడు..

ఆమె కళ్ళల్లో ఇష్టాన్ని గమనించుకోవడం తెలిసినవాడు, ఆమె కాదంటే కోపగించుకోకుండా దారివ్వడం తెలిసినవాడు. ఆమె అవునంటే పేరెలా మారుతుందో ఊహ చేసే ఆశ ఉన్నవాడే కానీ, ఆటల్లో అయినా శాశ్వత బంధం కాదన్న ఊహను రానీయలేనివాడు.

కె. రామచంద్రన్!

**
"బ్రతుకుదారిలో మేలిమలుపంటూ తారసపడదు
శ్రుతి చేయబడని వీణలా వేదనతో కదిలే పిరికి హృదయం
లోలోపలి మాటలనేనాడూ బయటపెట్టదు

ప్రేమ మార్గం నియమాలన్నీ యదేచ్ఛగా అతిక్రమించుకుంటుంది,
ఆలోచనలు హద్దులు చెరుపుకుంటూ ఎగిరెగిరిపడతాయి
నువు రా,

ఈ భారమంతా మబ్బుపింజవుతుంది
నీ జత చేరే వీలుగా
కూడలి దగ్గర నా మార్గం వేయి దారులుగా విడివడుతుంది...."

ఎలా కలిశారో చూసినప్పుడు, ఎలా విడిపోయారన్నది పెద్ద విషయం కాదనిపిస్తుంది. ఇరవైరెండేళ్ళ వియోగం తరువాత కూడా, సోలిపోతున్న రెప్పలు పూర్తిగా విప్పి ఆమెనింకా సరిగా చూడనైనా చూడకుండానే, కుశలమైనా అడగకుండానే, ఎగిరెగిరి పడ్డ గుండె అతని మనసుని ఆమెకు పట్టించేసింది. వివశుణ్ణి చేసిన అతని ప్రేమ, బాల్యమిత్రుల ముందతన్ని మళ్ళీ దోషినీ చేసింది. పట్టుపరికిణీ కట్టుకున్న పదిహేనేళ్ళ పడుచుపిల్ల ముందు ఎట్లా సోయితప్పి పడ్డాడో, ముప్పైఏడేళ్ళ ప్రౌఢ ముందూ అదే తీరున. ఈ రెండు సన్నివేశాల్లోనూ దర్శకుడు మన కోసం ఇంకో మేజిక్ చేస్తాడు. ఆమె చేయి అతని గుండె మీద వాలుతుండగా మొదలయ్యే సనసన్నటి పక్షికూతలు..టిక్టిక్ఛిక్...అతను వెనక్కు వాలుతుండగా పెరిగి పెరిగి మళ్ళీ సన్నగిల్లడం - నావరకూ నాకు అదొక butterflies in stomach ఫీలింగ్‌ని అద్భుతంగా తెరకెక్కించగల ప్రతిభ అనిపించింది.

కాలం-దూరం లెక్కల్లో, ఏ ఇద్దరికీ ఒకే జవాబు దొరకని ప్రశ్నలు ప్రేమ గుప్పెట్లో ఉంటాయి. అందుకే ఇన్నేళ్ళ దూరం తరువాత అతనెక్కడున్నాడో తెలియగానే ఆమె ఆగలేక కదిలి వెళ్ళిపోతుంది, అతని పసి ముఖాన్ని గుర్తు తెచ్చుకుంటూ, ఇప్పటి ముఖంతో పోల్చుకునే ప్రయత్నం చేస్తుంది, అతని గడ్డంలోకి, చిక్కని అతని కన్నుల లోతుల్లోకి వంగి వంగి వెదుక్కుంటుంది. అతడు దొరకడు, అప్పటి వాడు దొరకడు. అతడామెని పరీక్షించి చూసుకోవాలనుకోడు, ప్రశ్నలేమీ అడగాలనుకోడు, మునుపటిలానే సిగ్గూ బిడియం వదిలించుకోడు.

ఎందుకంటే అతనామెని చూశాడు. చూస్తూనే ఉన్నాడు. ఆమె పెళ్ళయ్యేదాకా, ఆమెను కలవాలనిపించినప్పుడల్లా ఆమె ఊరికి వస్తూనే ఉన్నాడు. ఆమెకు ఆశ్చర్యం కనుక అడిగి చెప్పించుకుంది, ఋజువులు చెప్పమని పందెం కట్టింది. అతనికవి నాల్క చివర ఉన్న కొండగుర్తులు. ఆఖరు సారి ఆమెని ఆమె పెళ్ళిచీరలో చూశానని చెప్తాడు - నిశ్చేష్టలా మారిన ఆమెతో.  దర్శకుడు మళ్ళీ మేజిక్ చేస్తాడు - ఆ పెళ్ళి వాద్యాల హోరు వినబడనంత దూరంగా పారిపోయాను అని చెప్తూండగా, బాక్గ్రౌండ్‌లో హోరెత్తే సన్నాయి వాద్యం. అతను దూరం వెళ్ళిన కొద్దీ అది శ్రుతి మించి వినబడి అతలాకుతలం చేసిందని చెప్పడం. ఆ మాటలు, ఆ సంగీతం, విజయ్ సేతుపతి కళ్ళు - సినిమా మాత్రమే సాధించగల అద్భుతం కదా ఇది.

లైట్స్ కెమెరా యాక్షన్‌తో పాటు కట్ చెప్పడం కూడా దర్శకుడి పనే. దుఃఖభారంతో ఆమె చెయ్యి అతని మీద పడేలోపు కట్. వాసంతి అతని పేరు మర్చిపోకుండా ఉంటే ఏమయ్యేదో చెప్పాక, అతని కళ్ళల్లో చిప్పిలిన కన్నీళ్ళర్థమయ్యేలోపు కట్. "చిన్ని పొన్ను నా" ఇళాయరాజా పాతపాటల్లోంచి అందంగా కొసరిన ఓ బిట్. ఇవన్నీ తరువాత, ఆమె తాళి కనపడితే కళ్ళకద్దుకునేంత, ఆమె పైకి రమ్మంటే కనుబొమలెత్తి చూసి, ఆమె కూర్చుని ఉండటం చూసి నొసలు కొట్టుకునేంత, ఆమె బెంగలని స్నేహితుడిలా అర్థం చేసుకునేంత, చిన్నప్పటి హెయిర్‌కట్‌లో చూడాలనుందన్న ఆమె మోజును తీర్చగలిగేటంత, ఆమెను అంత ప్రేమించీ, తిరిగి పంపించగలిగేంత, తిరిగి రహస్యపు అరల్లోకి ఆమెతో గడిపిన క్షణాలనీ, జ్ఞాపకాలనీ నెట్టుకునేంత - నిజాన్ని గౌరవించి ఒప్పుకునేంత నిబ్బరాన్ని ఆ పిచ్చి గుండె సాధించుకోవడానికి ఎన్నేళ్ళు పట్టి ఉంటుందో - ఆ ఇరవైరెండేళ్ళ సమయమూ - కట్ కట్ !!! "యెఛీ, ఇలా రా, సిల్లీ ఫెల్లో" అన్న త్రిష విసురు- ముసుగులేయని ఇష్టం, విజయ్ మొహమాటపు చూపులు, మాత్రం అన్‌కట్ డైమండ్స్.

బహుశా అందుకే నాకీ సినిమా నచ్చింది. దాచాల్సినంత దాచాక కూడా ఆకాశపు అనంతమైన నీడలా మీద పరుచుకున్న ప్రేమానుభవం వల్ల. సీతారాముల వియోగం ఎంత నొప్పి కలిగించేదైనా, ఆ వియోగానికి కారణాలు ఎంత అసంబద్ధమైనవని మనం నిష్ఠూరాలాడినా, జంటగా ఉన్నంతకాలం వాళ్ళిద్దరి ప్రేమా సమ్మోహనంగానే ఉంటుంది. జానకీదేవి, రామచంద్రన్ పేర్లు నాయికానాయికలుగా పెట్టడంలో ఇంతకు మించిన తత్వం నాకు బోధపడలేదు. అయినా పేరులో ఏముంది?

#96moviereviewtelugu

మాగ్నెట్

బ్యాగుల నిండా తడిబట్టలు. దులుపుతుంటే రాలిపడుతోన్న ఇసుక. తప్పుకుంటుంటే చుట్టుకుంటోన్న సముద్రపు నీటి వాసన, నీచు వాసన. తీరంలో నా పాదాలను తడిపినట్టే తడిపి వెనక్కి పోయిన అలల్లా… సెలవులు.

పొద్దున్నే మళ్ళీ అదే దారిలో, అవే మలుపులు దాటితే, ఆఫీస్. స్నాప్‌వేర్ లంచ్ బాక్స్. తరిగి పెట్టుకున్న కూరలు, డబ్బాల నిండా పాలు. ఫ్రిడ్జ్‌లో. తలుపు తీస్తే తగిలే గాలి, ఏ తీరాలది?

తలుపు మూస్తే… బీచ్ సైడ్ గిఫ్ట్ షాప్. బేరమాడిమరీ కొన్న మాగ్నెట్. బబుల్ ర్యాప్‌లో భద్రంగా నా సంభ్రమం. నాకు మాత్రం తెలుసా, సముద్రాన్ని ఇంటికి తెచ్చుకోవడం ఇంత తేలికని.

ఆకర్షణ. ఏదీ శాశ్వతం కాదనిపించే క్షణాల్లో, అన్నీ స్థిరంగా కనపడే సందర్భాలు. కలిసే ధ్రువాలు అరుదూ అపురూపమూ. ఎవరు విడదీయగలరు?

అరచేతుల్లో మాగ్నెట్. జ్ఞాపకం ఎప్పుడూ ఆకర్షణే.

ఆకర్షణ, ఒక జ్ఞాపకమిప్పుడు.

"నాది దుఃఖం లేని దేశం" - వాడ్రేవు చినవీరభద్రుడు.

నాది దుఃఖం లేని దేశం - అన్న మాట పుస్తకం మీద ఎప్పుడు కనపడ్డా తెలియని దిగులేదో ఆవహించేది. వరదలు, భూకంపాలు, కల్లోలపరిచే రాజకీయాలు, బాధ్యతల ఊసెత్తని బంధాల్లో స్వేచ్ఛను బలవంతంగా పొందాలనుకునే జనాలు, ఏ క్షణానికా క్షణం పెచ్చుపెరుగుతోన్న నేరాలు - మనదా దుఃఖం లేని దేశం? ఏడెనిమిది నెలల క్రితం ఈ పుస్తకం కోరి తెప్పించుకున్ననాటి నుండీ, ఈనాటికి, వార్తల్లో మనుష్యులు మారుతున్నారేమో గానీ, వాటి తీవ్రత ఏమీ మారలేదు. బహుశా అందుకేనేమో, ఈ పుస్తకాన్ని ఎప్పుడు ఎంత ఆర్తిగా నా చేతుల్లోకి తీసుకున్నా, నా ఆలోచనలు 'ఎవరికి లేదిక్కడ దుఃఖం? ' అన్న ప్రశ్న దగ్గరే ఆగిపోయేవి. చాలాకాలం పాటు నేనా ప్రశ్నని దాటలేకపోయాను. నిజానికి అట్లాంటి అనిశ్చిత మనసుతోనే ఒకరోజు నేనీ పుస్తకాన్ని అందుకున్నాను.
*
కబీరు సాహిత్యానికి అనువాదం అని వినగానే ఇదొక అసాధ్యమైన పని అనిపిస్తుంది. అంతూదరీ లేని సముద్రంలా కబీరు రాతల పేరిట చలామణీ అవుతున్న సాహిత్యం దానికి మొదటి కారణమైతే, వాటిల్లోంచి కబీరు గొంతుని, లేదా కబీరు స్పూర్తిని గుర్తుపట్టి అనువదించేందుకు కవితలను ఎంచుకోవడం రెండవది. కబీరు మనలో చాలామందికి సరిగా తెలీకపోవచ్చు కానీ, కబీరు దోహాలు మాత్రం ఒక్కటైనా, బడిలో పాఠాలుగానైనా వినే ఉంటాం. జనాల నాల్కలపైన భాషలకతీతంగా నానిన పదాలు కబీరువి. ఆ పాదాల్లోని సరళత, సూటిదనం, మరీ ముఖ్యంగా వాటిలోని కవిత్వం - వీటిని ఒక ప్రవచనంలా కాకుండా, తీర్పుల్లా కాకుండా, మరొక భాషలోకి తేగలిగిన సామర్థ్యం మూడవది.
మంచి పరిశోధకులు, చేస్తున్న పని మీద శ్రద్ధ ఉన్నవారు మొదటిని రెండు ఇబ్బందులనీ అవలీలగా దాటేస్తారు. అలాగే, స్వతహాగా గొప్ప కవులైన వారు, ఎదుటనున్న అపారమైన సాహిత్యంలో గొప్ప కవిత్వాన్ని తేలిగ్గా గుర్తుపట్టనూగలరూ, అంతే సమర్థవంతంగా ఆ కవిత్వాన్ని తన భాషలోకీ తేగలరు. కనుక, ఈ పుస్తకంలో ఇవన్నీ దొరుకుతాయన్న విషయంలో భద్రుడి రచనలతో ఏ కాస్త పరిచయం ఉన్నవారికైనా ఎలాంటి సందేహమూ ఉండకూడదు. కానీ, భద్రుడి రచనలెప్పుడూ ఆశించినవి ఇవ్వడం దగ్గర ఆగిపోవు. అది ఇష్టమైన గాయని గీతాలతో తన ప్రయాణం కావచ్చు, అసలు మన కవిత్వం ప్రపంచమంతా పాకాలంటే ఏం చెయ్యాలన్న దాని మీద ఆయన సలహా కావచ్చు (నౌడూరి మూర్తి గారి Wakes on the horizon సభలో), నిన్న గాక మొన్న కాకినాడలో జరిగిన యాత్రాకథనాల మీద చర్చలో ఆయన మాటలు కావచ్చు - ప్రతిసారీ, ప్రతిచోటా, తనదైన ఓ ముద్రని వదలకుండా, తన మాటల మీదుగా పాఠకులు తమతమ ఆలోచనలను పొడిగించుకునే వీలుని ఇవ్వకుండా ఆయన రచనలు ముగియవు.
అట్లాంటి అంచనాలతో ఈ పుస్తకం పట్టుకునేవారి కోసం, భద్రుడు ఒక సృజనకారుడిగా తానెంత ప్రత్యేకమో మరొక్కసారి నిరూపిస్తూ, ఈ పుస్తకంలో కబీరు జీవన ప్రయాణాన్ని తానెంచుకున్న దోహాలతో దశలుదశలుగా విభజించి చూపించారు. అంటే, ఈ పుస్తకం ఒకేసారి కబీరు రచనల ద్వారానే కబీరు కవిత్వాన్ని, కబీరు జీవితాన్ని కూడా మనముందుంచుతోందన్నమాట.
*

నా గురువు గొప్ప భ్రమరం 


నా గురువు గొప్ప భ్రమరం. నాలాంటి కీటకానికి తను రంగులద్దుతాడు. తనలాగే భ్రమరంగా మారుస్తాడు. కొత్తకాళ్ళు, కొత్తరెక్కలు, కొత్త రంగులు సమకూరుస్తాడు.
నీ జాతి ఏమిటి, కులమేమిటని అడగడు. అతడి సమక్షంలో భంగీ కూడా భక్తుడిగా మారిపోగలడు.
నదులూ, కాలవలూ గంగలో కలవగానే గంగగా మారిపోతాయి.
సముద్రంలో చేరగానే నది కూడా సముద్రమై అపారమైపోతుంది.
చంచలమనస్సు ఆయన సన్నిధిలో నిశ్చలమై ఊరికెనే గెంతడం మానేస్తుంది.
తత్వాలన్నిటిలోనూ తత్వాతీతాన్ని చూపించాడు. నన్ను తన అంతేవాసిగా మార్చుకున్నాడు. నా బంధాల నుంచి నన్ను బయటపడేశాడు.
నా దుఃఖం సమస్తం తెంచిపారేశాడు.
అతీతమైనదాన్ని అందించాడు, నన్ను రామరాగరంజితుణ్ణి చేశాడంటున్నాడు కబీరు.

మొన్నా మధ్య మా అక్కతో మాట్లాడుతున్నప్పుడు, అది చిన్నప్పుడు చదువుకున్న బడిపిల్లలందరూ అనుకోకుండా ఒక్కొక్కరుగా ఒక గ్రూప్‌లో కలిశారనీ, అందరూ కలిసి వాళ్ళ బడి కోసం ఏదైనా చేయడానికి పూర్వవిద్యార్థులసమ్మేళనమొకటి ఏర్పాటు చెయ్యాలనుకుంటున్నారనీ చెప్పింది. ఆ పనుల్లో భాగంగానే ఆ ఊరెళుతూ, ఆ ఊళ్ళోనే ఉంటోన్న వాళ్ళ గురువులకి-ఓ పండుముసలిదంపతులకి బట్టలు కొని తీసుకెళ్తున్నానని చెప్పింది. నేను అన్యమస్కంగా వింటూ, "కానీ నువ్వెళ్తున్నది మీ బడికీ, మీ పార్టీ ఏర్పాట్లు స్నేహితులతో కలిసి నిర్ణయించుకోవడానికీ కదా.." అన్నాను. నా ఉద్దేశ్యమల్లా మరొక్క నెలలో వీళ్ళెలాగూ తమ గురువులను సభాముఖంగా ఘనంగా సత్కరించుకోనున్నారు కదా అని మాత్రమే. కొన్ని సెకన్ల నిశబ్దం తరువాత అది ఆ ఊరితోనూ, ఆ బడితోనూ, ఆ మేష్టార్లతోనూ ముడిపడి ఉన్న తన జ్ఞాపకాలను నా బదులుతో నిమిత్తం లేకుండా చెప్పుకుపోయింది. అవేమీ నాకు తెలియనివి కాదు.
నాకు ఎనిమిదితొమ్మిదేళ్ళొచ్చేవరకు మేము బెజవాడను ఆనుకుని ఉన్న పల్లెటూరిలో ఉండేవాళ్ళం. అమ్మ అదే ఊళ్ళోని జిల్లాపరిషద్ స్కూల్‌లో తెలుగు టీచరుగా పనిచేసేది. మా ఇంటికీ, బడి వెనుక ఉన్న విశాలమైన గ్రౌండ్‌కీ మధ్య ఒక్క బల్లకట్టు దూరం, అంతే. సాయంకాలాలు ఆ బల్లకట్టు మీద గంతులేస్తూ ఆడుకునే మాకు, దూరంగా రేకుల షెడ్‌లలోనూ, చెట్ల నీడల్లోనూ బడి అయిపోయాక కూడా పిల్లల్ని కూర్చోబెట్టి చదివించే మేష్టర్లు కనపడుతూ ఉండేవారు. గంటల తరగడి కరెంటు పోయే ఆ చిన్నఊళ్ళో, పరీక్షలకు రెండు మూడు నెలలు ముందుగానే కాస్త బాగా చదివే పిల్లలందరినీ అక్కడి టీచర్లు వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళి ప్రత్యేకంగా చదివించేవాళ్ళు. మా అక్క అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ నాతో అంది -"ఎందుకు చెప్పాలి చెప్పు, మాకట్లా ఆ పాఠాలన్నీ? అలా వాళ్ళ పిల్లలతో పాటుగా మమ్మల్నీ కూర్చోబెట్టీ, వాళ్ళకంటూ సమయం మిగుల్చుకోకుండా, ఆలస్యమైతే, మాకు ఆకళ్ళైతే గమనించుకుని అన్నాలు పెట్టి మరీ, కొవ్వొత్తులో కిరోసిన్ దీపాలో మా ముందు పెట్టి మరీ, మేం చీకట్లలో వెళ్ళలేక భయపడతామని మేష్టార్లు తోడొచ్చి వీధి చివర్లలో దించుతారని ధైర్యం చెప్పి మరీ, -వానాకాలం, చలికాలం అసలు కాలాలతో సంబంధం లేకుండా ఎట్లా చదువుచెప్పేవారు! బదులుగా మేమిచ్చాం? ఎన్ని సార్లు గుర్తొస్తుందో, చలిలో పొద్దున్నే వాళ్ళింటి తలుపులు కొట్టేసరికే ఊడ్చి చాపలేసి సిద్ధంగా ఉన్న ఆ వరండా."
ఒక్క వీకెండ్ ఫీచర్ రిలీజ్ చేస్తే, దానికి బదులుగా సెలవెప్పుడిస్తారో చెప్పమని మేనేజర్లని సతాయించే ఉద్యోగులను అన్ని దిక్కుల్లోనూ చూస్తున్న ఈ కాలంలో ఏమీ కాని పిల్లలకోసం, బదులేమీ రాదని తెలిసీ తాపత్రయపడటం - ఆ వయసుకీ, ఈ వయసుకీ కూడా మా ఊహకందదు. మా అక్క, 'మా టీచర్లు లేని బడెక్కడ? ఊరెక్కడ? నా బాల్యమెక్కడ?' అని వాపోయినపుడు, ఇదుగో, నాకీ కబీర్ దోహానే చెవుల్లో మోగిపోయింది. "నువ్వెవరు?" అని అడక్కుండా విద్యార్థులందరినీ అక్కున చేర్చుకున్న ఆ గురువులు నేర్పిన సంస్కారమే మా అక్క మాటల్లోనూ వినబడి నన్ను చకితురాలిని చేసింది.
కబీరు మాటల్లోనే చెప్పాలంటే, "చిత్తం లోపల దీపం వెలిగే గురుముఖులెక్కడో అరుదు కదా!". నాకీ సందర్భంలో, ఇస్మాయిల్ మాటలు కూడా గుర్తొస్తున్నాయి. ఆయన, కవిత్వం చేసే పని కూడా చిత్తం లోపల దీపం వెలిగించడమే అంటారొక ఇంటర్వ్యూలో.
*
నేను నీ బానిసను, గోసాయీ, నన్నమ్మేసుకో
నా తనువు, నా మనసు, నా ధనం ఆయన కోసమే. కబీరుని తీసుకొచ్చి ఆయన అంగడిలో నిలబెట్టాడు. అమ్ముకునేదీ అతడే, కొనుక్కునేదీ అతడే. అతడే నన్ను అమ్ముతానంటే రక్షించేదెవ్వడు? నన్నతడు రక్షింపదల్చుకుంటే, అమ్మగలిగేదెవడు?
తనువూ, మనసూ దహించేస్తున్నాయి, ఇక క్షణం కూడా నిన్ను మరిచి బతకలేనంటున్నాడు కబీరు.
ఈ కవితలో మొదటి వాక్యమే, " నన్నమ్మేసుకో " అంటుంది. జీవచ్ఛవమా, పశువా, అమ్మకమేమిటి ఇక్కడ - అన్నది మామూలు జనాల ప్రశ్న. కానీ, ఇది కబీరు కాంక్షించిన ప్రేమ. ఇద్దరినే ఒకటి చేసి నడిపించే ఆ ప్రేమ మార్గం బహు ఇరుకు. కాబట్టి అక్కడ మూడో మనిషి ఉనికి అసాధ్యం. 'ఎవరికి అమ్మాలి?' అన్న ప్రశ్న అసంబద్ధం. పోతే, "కొనుక్కునేదీ అతడే" అన్న మాట గమనించదగినది. ఎలా కొనుక్కోగలడో కూడా ముందు పుటల్లో తనే సూచనగా చెబుతాడు -"మనసు చెల్లించి మరీ". ఇట్లాంటి కవిత్వం, ప్రేమ అనుభవంలోకి రాకపోయినా, కనీసం అర్థమైనా అవ్వాలి మనకు. అలా అర్థమైతే, ఇలాంటి హృదయసంవేదనే ప్రేమికులలో, జంటల్లో ఉంటే, సర్వోన్నత న్యాయస్థానం మన ముందుకొచ్చి భాగస్వామి ఒకరి సొత్తు కాదు అని తీర్పులివ్వవలసిన అగత్యం పట్టదు. నిజానికి న్యాయస్థానాలెప్పుడూ నిర్వచించగలవే కానీ నియంత్రించలేవు. హృదయం అమూల్యమైన ఆస్తి అనీ, హక్కుదారెప్పుడూ ప్రేమతో దాన్ని సాధించుకున్నవాడేననీ చెబుతున్న ఈ కబీరు కవిత్వం కాలానుగుణమూ, కాలాతీతమూ కూడా.
ఈ ప్రాపంచిక విషయాలను పక్కన పెట్టినా, ఆ ఒక్క పదంలో ఎంత కవిత్వం! ప్రేమని, నమ్మకాన్ని, సమర్పణని ఒకే ఒక్క పదంలో ఎంత బలంగా చెప్పాడు కవి. ఇట్లాంటి కుదుపులే కదా, కవిత్వప్రయాణాలు ఏమరపాటుగా సాగకుండా కాపాడేవి! ఒక నవలలోనో కథలోనో, పాత్రల స్వభావాన్ని లేదా కథ నడతని పొరలుపొరలుగా రచయితలు విప్పుతూ పోవడం మనకు తెలుసు, కానీ ఈ పుస్తకంలో చినవీర కవిత్వంలో అట్లాంటి అద్భుతం చేశారు. పై ఉదాహరణనే తీసుకుంటే, దాని రసస్పూర్తి మనకు అవగతం కావాలంటే మనం ఈ ఒక్క కవితా ఖండికా చదివితే సరిపోదు. ముందువెనుకలుగా ఎన్నో పుటల్లో విస్తరించుకుపోయిన భావాలను మిగతా భాగాలతో కలిపి కుట్టుకోవలసిన బాధ్యత పాఠకుల మీద ఉంది. అనువాదకులకు భాషా సంబంధిత పరిజ్ఞానంతో పాటు, కవితల ఎంపికలోనూ, వరుస నిర్థారించుకోవడంలోనూ కూడా ఎలాంటి పట్టు, మెలకువ ఉండాలో, ఉన్నప్పుడు పాఠకుల అనుభవం ఎంత సంపూర్ణంగా, సమ్మోహనకరంగా ఉంటుందో నిరూపించి చూపించిన పుస్తకమిది.
కవితల ఎంపికలో అనువాదకుడి ప్రజ్ఞ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మరొక ఉదాహరణ. కబీరు కవిత్వం సరళంగా ఉంటుందన్నది తఱచుగా మనం వినేమాటే. అయితే పాఠకుడి మనసులో లేని సరళత, పదాల్లో వెదికితే దొరకదు. ఉదాహరణకి ఈ కవిత చూడండి :

ఈ దేహంలోనే గూడు కట్టుకుని

ఈ దేహంలోనే గూడుకట్టుకుని పాట పాడుతున్న ఈ పక్షి గురించి నాకు చెప్పేవాళ్ళెవ్వరూ లేరు.
దానికి రంగు లేదు. రూపం లేదు, ఆకృతి లేదు. తలపులనీడలో కూచుంటుందది. అక్కడే ఎగురుతుంది, తుళ్ళింతలాడుతుంది. ఆహారం నొలువుకుంటుంది.
అదెక్కణ్ణుంచి వచ్చిందో తెలియదు, దాన్నేది పాడిస్తున్నదో కూడా తెలియదు. చిక్కగా అల్లుకున్న కొమ్మల గుబుర్లలో ఆ పక్షి మజిలీ చేస్తున్నది. సాయంకాలం కాగానే గూటికి చేరుకుంటుంది, తెల్లవారగానే ఎగిరిపోతుంది. దాని రాకపోకడలెవరికీ తెలియకున్నవి.
పది కాదు, ఇరవై కాదు, కేవలం రెండు పండ్లు రుచి చూడటానికే వస్తుందది. దాని నిజనివాసమేదో గుర్తుపట్టలేం, హద్దు చూపలేం, వ్యవధి చెప్పలేం. దాని రాకపోకలు మనం కాపుకాయలేం.
సాధుసోదరులారా, ఈ కథ అంత తేలిగ్గా అర్థం కాదు. ఆ పక్షి నిజస్థావరమేదో తెలుసుకున్నవాడే నిజమైన పండితుడంటున్నాడు కబీరు.
ఇప్పుడు ఆ పక్షి ఎవరో, అది రుచి చూడాలనుకున్న రెండే రెండు పళ్ళేమిటో ఆలోచించండి. ముడి విప్పడం తెలియకపోతే మరిన్ని చిక్కుముళ్ళు పడతాయని ఎందుకంటారో ఈ కవిత చెబుతుంది. కబీరు మీకు ఆషామాషీగా అందడు సుమా అన్న సున్నితమైన హెచ్చరికా ఇందులో ఉంది.
*
కబీరు ప్రకటించిన నిర్గుణ భక్తి, ఆయన సహచరుడి గురించి తపించిన విధానం, ఆ ప్రేమను ప్రకటించిన విధానం, ఎలాంటివారైనా సొంతం చేసుకోగలిగిన భావాల్లా అనిపిస్తాయి. ఐహికమైన ప్రేమలు వీటికి ఏ విధంగా దూరం అన్న ప్రశ్న కలిగింది నాకైతే. ప్రేమ అన్న పదం దానికదే ఎంత తీవ్రమైనదైనా, విరహంలో ప్రకటితమయ్యే ప్రేమ అగ్నిలా కాల్చేస్తుంది, కనికరం లేనిదది. కవికి ఉన్నది కనుక, గాజుపలకలాంటి కవిత్వం వెనుక నుండి ఆ వెలుగుని చూపించి వదిలేశాడు. ఆ వేడి చురుకు మనకి తెలిసినా నొప్పనిపించదు, అదే చిత్రం. ఆ వేడిలోని సుఖం అనుభవంలోకి రావడమాలశ్యం, మనమా ప్రేమకి దాసానుదాసులం.
"నిన్న నువ్వు ఏ శరంతో నన్ను గాయపరిచావో ఆ శరం నాకెంతో ప్రీతిపాత్రమైపోయింది. మళ్ళా ఈ రోజు కూడా ఆ బాణంతో నా గుండె చీల్చు, ఆ శరం తగలకపోతే హృదయానికి సుఖం లేదు" అంటాడు కబీరు.
ప్రేమలో పడ్డవారిని పట్టించే అతి సామాన్యమైన విషయమేమిటంటే, వారు ఇష్టమైన వాళ్ళని పదేపదే తల్చుకునే తీరు. ఆ ప్రియమైన పేరుని, ఆ పేరులోని మొదటి అక్షరాన్ని ఎన్నిసార్లో రాసుకుంటారు, వెదుక్కుంటారు, గుర్తు చేసుకుంటారు. అకారణంగా వాళ్ళ పేరు ప్రస్తావనకి తెస్తారు, మురిసిపోతారు. ఈ కబీరు కవిత చదవండి. తొలిప్రేమని తల్చుకోని వాళ్ళుంటారా ఈ కవిత చదివి?
"ఎవరన్నా నాకు ఆయన గురించి చెప్పండర్రా. చూద్దామన్నా కంటికి కనిపించని ఆ మనిషి గురించి ముచ్చటలాడండర్రా.
ప్రతి ఒక్కళ్ళూ పదే పదే ఆయన పేరు తలుస్తారు. ఆ పేరు స్ఫురింపజేసే రహస్యమేమిటో తెలిసినవాళ్ళొక్కరూ లేరు.
కబీరు చెప్పేదొకటే, అతడు మాటల్లో దొరకడు. అలాగని, ఆ పేరు తలవకుండా ఆ రహస్యం కూడా చేతికందదు."
కబీరు ప్రశ్న ఎంత అమాయకంగా కనపడుతోందో అంత గడుసుది. ఈ కవిత చదువుతుంటే నాకు గిలిగింతలు పెట్టినట్టైంది. "ఆ పేరు స్ఫురింపజేసే రహస్యమేమిటో" నని అడుగుతున్నాడు కబీరు. ఆ మహామహా రహస్యం ఎవ్వరూ బయటకు చెప్పరని తెలిసీ అడిగి కవ్వించడం మరొక్కసారి వాళ్ళని ఆ పేరుని తల్చుకునేలా చెయ్యడం కాక మరేమిటి!
అలాగే మనం పూర్తిగా పదంపదం సొంతం చేసుకోగల మరొక కవిత - 

దినాలు సుఖానివ్వడం లేదు


1
దినాలు సుఖాన్నివ్వడం లేదు, రాత్రులు, చివరికి స్వప్నాలూనూ. అతణ్ణుంచి దూరమయ్యాక కబీరుకి ఎండలోనూ సుఖం లేదు, నీడలోనూ లేదు.
2
ఎడబాటు చేసిన గాయం ఒకటే సలుపుతున్నది. తనువూ, మనసూ అల్లల్లాడుతున్నాయి. ఈ బాధ ఏమిటో గాయం చేసిన వాడికి తెలుసు, లేదా నొప్పి మెలిపెడుతున్నవాడికి తెలుసు.
3
పండితుడా, పుస్తకాలు కట్టిపెట్టు, వాటిని తలగడ చేసుకుని నిద్రపో. ప్రేమ అన్న ఒక్క పదం లేనప్పుడు ఎందుకవి? నవ్వుకుంటూ పారేస్తావో, ఏడుస్తూ వదిలేస్తావో, పక్కన పారెయ్యి.
4
దోహాలు వల్లిస్తావు, అర్థం గ్రహించవు, అడుగు ముందుకు వెయ్యవు. మోహసలిలం నదిగా ప్రవహిస్తున్నది, అందులో నీ పాదాలు ఆననే లేదు.
5
ఏ దేహంలో ప్రేమ సంచారం లేదో, అది స్మశాన సమానం. కమ్మరికొలిమిలో తిత్తులు చూడు, ఊపిరి తీస్తాయి, ప్రాణముండదు.

ఈ ప్రేమ కవిత్వం చదివినా, సామాజికవాదం ఉట్టిపడే గొంతుతో అతను పలికిన మిగతా భావనలు చదివినా, ఆ సున్నితత్వం, సూటిదనం, గ్రహింపులోకి వస్తూనే మనకూ అర్థమవుతుంది, కబీరు టాగోర్‌నీ, మహాత్ముడినీ, శిరిడి సాయినీ - ఇలా ఎందరినో ఆకర్షించడానికి కారణమేమిటో. ప్రహ్లాద చరితం, గజేంద్రమోక్షం, గోపికా గీతల్లోని భావాలను ఏమాత్రం శ్రమపడకుండానే గుర్తుతెచ్చే భావాలు కబీరు కవిత్వంలో తారసపడినా, ఈ ఆధ్యాత్మికత కన్నా, వైరాగ్యం కన్నా, మనల్ని ప్రస్తుత పరిస్థితుల్లో బలంగా తాకేవి కబీరులోని ఒక సంఘజీవి ఆశలే. నిజానికి ఈ పుస్తకం ప్రాసంగికత కూడా ఇక్కడే ఎక్కువగా ఉంది. "కులమేదో తెలియగానే కులం చెదిరిపోయింది" అంటూ అతను పలికించిన మానవత్వాన్ని, సమానత్వాన్ని మనమింకా అర్థం చేసుకోవలసే ఉంది, అందుకోవలసే ఉంది.
"వేదాలూ, కొరానూ వివరించలేని దేశం, చెప్తేనో వింటేనో జాతి వర్ణం, కులం కర్మలవల్లనో, సంధ్య, నియమం, నిష్టవల్లనో పోల్చుకోలేని దేశం, మబ్బులు కమ్ముకోకుండానే నిర్విరామంగా వాన కురిసే దేశం, సూర్యుడు ఉదయించకుండానే ఉజ్జ్వలంగా ఉండే దేశం, .." ఇది కేవలం కబీర్ కవిత్వం మాత్రమే కాదు. మనమంతా కబీర్ రహస్యమేదో పట్టుకోగలిగితే పునర్నిర్మితమయే రాజ్యం గురించి కబీర్ కన్న కల.
*
ఈ పుస్తకం చేతుల్లోకి తీసుకున్న ప్రతిసారీ, దుఃఖం ఎవరికి లేదు? అన్న ప్రశ్న వేయి గొంతులతో నన్ను చుట్టుముట్టేదని మొదట రాశాను. అవును, దుఃఖం మనందరిదీ. చిన్నదో, పెద్దదో, చెప్పగలిగినదో కాదో, అలవాటైనదో, కానిదో. కానీ, ఓ నమ్మకాన్నీ ఆధారంగా చేసుకుని అది కార్యాచరణకు మనని ముందుకు తోసేదిగో ప్రయాణాన్ని మలచుకోవడంలో జీవన సాఫల్యత ఉంది కానీ, జరిగిపోయిన అపరాథాలను ఎత్తి చూపుకు పొడుచుకోవడంలో లేదు.
తన అజ్ఞానాన్నీ, మన అజ్ఞానాన్నీ గమనించుకుని, గురువు కోసం వెదుక్కుని, ఎన్నో సంశయాలనూ, ప్రశ్నలనూ దాటుకుంటూ, సమాధానాలు వెదుక్కుంటూ, ఆఖరకు, తన లోకపు పోకడలు చెప్పి అందులోకి అందరినీ ఆహ్వానించే దాకా సాగిన ప్రయాణాన్ని, భద్రుడెత్తి నిలబెట్టిన దారి దీపాల వెలుగులో చూడటం దానికదే ఓ అనుభవం, ఓ పాఠం.
"గురువూ గోవిందుడూ ఇద్దరూ ముందు నిలబడ్డారు, ఎవరి చరణాలకు ప్రణామం చేసేది? గురువుకే నా ఆత్మార్పణ. ఆయనే కదా, గోవిందుణ్ణి నాకు ఎరుక పరిచింది." అన్న కబీర్ మాటలు ఆవహించిన మనిషి కదా, అందుకే ఈ పుస్తకం ముందు మాటలో, భద్రుడంటారు, ఈ పుస్తకం తనకు చిన్ననాట హింది నేర్పిన హీరాలాల్ మేష్టారి చేతుల్లో పెడదామనుకున్నాననీ, వారిప్పుడు లేరనీ, కానీ స్వర్గం నుండి తప్పకుండా స్వీకరిస్తారన్న నమ్మకంతో వారి పిల్లల చేత పెడుతున్నాననీ. నిజానికి ముందుమాటలోని ఈ వాక్యాలు, ఈ పుస్తకం మన మీద నెరపబోయే ప్రభావానికి మచ్చుతునకలు.
మనం చదువుతున్న వార్తలు, చుట్టూ గమనిస్తోన్న సంఘటనలు మౌలికంగా మనముందుంచుతోన్న ప్రశ్నలు వర్గానికీ, కులానికీ, మతానికీ మించి మానవత్వానికి, మానసిక వికాసానికీ సంబంధించినవి, అత్యంత ప్రమాదకరమైనవి. ఇట్లాంటప్పుడు, మౌనంగా ఉండటం అవకాశవాదంగా చూడబడుతోన్న చోట, సంఘటనలైనా పరిస్థితులైనా జీర్ణించుకోవడానికీ, అర్థంచేసుకోవడానికీ స్పందించడానికీ సమయం తీసుకోవడమొక పలాయనవాదంగా పరిగణింపబడుతోన్నచోట, నిజంగా మాట్లాడాల్సి వస్తే, నాకిప్పుడు కబీరులా మాట్లాడాలని ఉంది, కబీరు లాంటి మనసుతో మాట్లాడాలని ఉంది. 

*


ఇట్లాంటి రాత్రుల్లోనే

వానాకాలపు చివరి రోజులు.
భూమిలోకి మేకులు గుచ్చుతున్నట్టే
పడి ఆగింది వర్షం.
చివాలున వీచే గాలికి, చినుకులు
నేల ఝల్లుమనేలా జారిపడుతున్నాయి
పల్చని వెన్నెల రేకలు కొమ్మల దాటుకుని
పొదలను వెలిగిస్తున్నాయి
చీకటి కొసలను కోసుకుంటూ
కీచురాళ్ళ రొద పరుచుకుంటోంది
గిటార్ తీగలను పట్టి తూగుతూ
ఎవరింటి సంగీతమో దిక్కుల్లోకి దూకుతోంది
ఇట్లాంటి రాత్రుల్లోనే ఒకప్పుడు నేను
చినుకుల చప్పుడు వింటూ కూర్చుండిపోయాను,
మా అక్కని కుదిపి కుదిపి
నా తొలియవ్వనగీతాలన్నీ పాడి వినిపించుకున్నాను,
కిటికీ ఊచల మధ్య నుండి ఆకాశాన్ని చూస్తూ
దాని అనంతమైన స్వేచ్ఛని కలగంటూ నిద్రలోకి జారుకున్నాను.
నా తడిచేతులతో శ్రావణభాద్రపదాలను దాటించుకుంటూ,
నేను ఒంటరి ప్రయాణమే చెయ్యాలనుకున్నాను కానీ
కారుమొయిలు మధ్య దూదిపింజెలా మెరిసే ఆకాశపు తునకను
రెప్పలెగరేసి వెదుక్కునే పసిపిల్లను నా నుండి వేరుచేయలేకున్నాను.
నేనెంతో మారాననుకున్నాను,
శరణార్థిలా నా తలుపులు దడదడ తట్టిన వర్షం,
నేనొచ్చేలోపే వెళ్ళిపోయిందని కళ్ళు తడిచేసుకోవడం మాత్రం మానలేకున్నాను.

కొత్తనేలపాట

తలుపు తియ్యగానే ఎదురొచ్చే ఆ రెండు తెల్ల ముఖాలూ
కొత్తగా కొని, వాళ్ళు ముంజేతికి కట్టేసుకున్న బుల్లి కుక్కపిల్లా.
అదే సైడ్‌వాక్, అవే ముఖాలు,
అక్కర్లేని అక్కరకురాని నవ్వులు
అలవాటైన ప్రశ్నలకి
అనాలోచితంగా ఇచ్చే జవాబులు.
ఏ దిక్కుకి చూసినా
మూసుకుపోయి వెక్కిరించే తలుపులు.
ఆగి నిలబడి చూసినా
నాది కాదనే అనిపించే లోకం.
దిగులు బుడగకు బయటే స్థిరపడి
అనుభవానికి రాని సౌందర్యం.
ఘడియ ఘడియకీ పక్షిరెక్కలతో
సముద్రాలు దాటి వెళ్ళే మనసు.
ఆకులు కదలని చెట్ల నడుమ
నా అడుగు తడబడి తూలినప్పుడు
ఆ తెల్లటి ముఖాలలో ఆందోళనల నీడలు-
“ఆర్ యూ ఓకే? డూ యూ నీడ్ సమ్ హెల్ప్?”
నాది కాని దేశం
నాది కాని భాష
గొంతు క్రింద కోపం
గొంతులో అడ్డుగా దుఃఖం
పట్టి ఆపిన బెల్ట్ లాక్కొని
నామీదకెగిరిన కుక్కపిల్లది
ప్రేమా? కోపమా?
పెద్దపెద్ద అరుపులతో
ఇంట్లోకొచ్చి పడ్డ నాది
బాధా? భయమా?
బైట నుండి వినిపిస్తున్న
క్షమాపణలూ పరామర్శల భాష
పరాయిదేనా? నిజంగా?
మూసుకున్న తలుపులపై ఆనుకున్న నాకు
అక్కసు అభద్రత అర్థమవుతున్నాయిప్పుడే,
ఆర్తీ అక్కర కూడా.
“అయామ్ ఓకే, అయామ్ ఓకే.”
వలసగీతం వల్లించే గుండె
వాళ్ళకు జవాబయితే ఇచ్చింది కాని
తలుపులు తెరుచుకోవాలంటే ఇక
తలపులెన్ని సుడులు తిరగాలో.

*తొలి ప్రచురణ : ఈమాట, జులై-2018 సంచిక

కొన్ని ఆశలూ, కొన్ని అభిప్రాయాలూ


http://www.andhrajyothy.com/artical?SID=610054

*23/7 ఆంధ్రజ్యోతిలో

శతవసంత లక్ష్మి

చెప్పగలిగే నేర్పు అనుభవించిన మనకు లేకపోవడమే తప్ప, మనలో చాలా మందికి "బంగారు మురుగు" బామ్మ లాంటి బామ్మ/అమ్మమ్మ ప్రేమ అనుభవమే అని నా నమ్మకం. నాకు ఊహ తెలిసే నాటికే మా అమ్మమ్మకు డెబ్బై ఏళ్ళు దగ్గరపడ్డాయి. విజయవాడలో ఇద్దరు కూతుళ్ళున్నా సరే, నా ఒక్కగానొక్క మేనమామను విడిచి రావడానికి ఒప్పుకునేదే కాదు. బతిమాలీ బామాలీ ఏ వేసవి సెలవులకో ఇంటికి తీసుకొస్తే, వచ్చిన రోజు నుండే ఏదో పని నెత్తిమీదకు వేసుకునేది. రోటి పచ్చళ్ళో, దేవుడి దగ్గర వెండి పూలు తోమడమో, అమ్మ చీరలన్నీ చేతులతో ఒత్తివొత్తి శుభ్రంగా మడతలు పెట్టడమో, నాకు తలంతా నూనె పట్టించి ఓపిగ్గా దువ్వి జడలెయ్యడమో..ఏదో ఒకటి చేస్తూనే ఉండేది. పరీక్షలొస్తున్నాయంటే చాలు - పొద్దున లేచి చదువుతాంలే అమ్మమ్మా అన్నామా, లేచి తీరాల్సిందే. గంట కొట్టినట్టే లేపేది. లేచేదాకా రెణ్ణిముషాల కొకసారి గుర్తు చేస్తూనే ఉండేది. ఆవిడ గొడవకి అమ్మ లేచొచ్చి తిడుతుందన్న భయానికి నసుగుతూనే లేచి కూర్చునేవాళ్ళం. స్నానం చేసుకుని పూజ చేసుకుని చదువుకోమనేది. "స్పర్ధయే వర్ధతే విద్యా" అని మా క్లాసులో మా కన్నా బాగా చదివేవాళ్ళ పేర్లు వద్దన్నా గుర్తు చేస్తూ ఉండేది. మేం విసుగుమొహాలు పెట్టి, పుస్తకాల్లో తలలు దూర్చి కూర్చునేవాళ్ళం. పరీక్షలప్పుడు భయమేసి కాలుగాలిన పిల్లుల్లా తిరుగుతుంటే, "ముందు చదువుకు ఏడవరాదూ" అని మొహంవాచేట్టు తిట్టి ఆంజనేయ మంత్రం చెప్పేది. ఏదైనా వస్తువు పోతే మా అమ్మమ్మ ఎట్లాయీనా సాధించి తీరుతుందని మా కజిన్స్లో ఒక బలమైన నమ్మకం. ఆ వెదుకులాటకు వెయ్యి దండాలు. ఆవిడ వెటకారం అర్థమవ్వడానికే చాలాసేపు పట్టేది. నన్నూ, నా ఆటలనూ, నా స్నేహితులనూ వెయ్యి కళ్ళతో కనిపెట్టి, మా అమ్మ బడి నుండి రావడంతోటే నేరాలు చెప్పేది. అప్పుడు కోపంగా ఉండేది. ఇప్పుడు అర్థమవుతోంది. ఆవిడ పట్టుదలా, క్రమశిక్షణా, శుభ్రతా, ఓపికా, దేన్నైనా తేలిగ్గా తీసుకునే స్వభావం, కష్టపడే తత్వం, తృప్తీ, క్షమా - మాలో ఎవ్వరికీ ఆ స్థాయిలో పట్టుబడలేదనిపిస్తుంది.  

పోయిన నెలలో అమ్మమ్మ వందవ పుట్టినరోజు పిల్లలూ, మనవలూ, మునిమనవలూ అందరూ కలిసి పండుగలా చేశారు.  వెళ్ళలేకపోయిన ఇద్దరు మనవలలో నేనొకదాన్ని. రెండవవాడు, నా మేనమామ ఒక్కగానొక్క కొడుకు మనోహర్. ఇద్దరం అమెరికాలోనే ఉన్నాం. ఆ వారం రోజులూ, అటుపైన, ఎవరి ఊళ్ళకి, ఎవరి దేశాలకి వాళ్ళు వెళ్ళే దాకా, పూటకో ఫొటో, ఓ వీడియో పెట్టి ప్రాణాలు తోడేశారు మా వాళ్ళంతా. కానీ మొన్న నా పిన్ని కొడుకు సందీప్ -' అమ్మమ్మ నువ్వు రాసిన కవిత చూడు ఎట్లా చదువుకుంటోందో రోజూ' అని మా "సీతామహాలక్ష్మి మనవలు" గ్రూప్‌లోఓ వీడియో పంపినప్పుడు మాత్రం, మాటమాటా కూడబలుక్కుంటూ, పవిటతో కళ్ళొద్దుకుంటూ మెల్లిగా చదువుకుంటున్న అమ్మమ్మను చూడగానే నా సంతోషమూ దిగులూ కూడా రెట్టింపైపోయాయి.
అమ్మమ్మ గురించి నేనేదైనా రాసి తీరాల్సిందే అన్నప్పుడు, నా వల్ల కానేకాదని తప్పుకున్నాను. పోరు పడలేక ఒప్పుకున్నాక కూడా, నాలుగుమాటలు రాయగానే అమ్మమ్మ కళ్ళముందుకొచ్చి భారంగా అనిపించేది. ఎక్కడ మొదలెట్టాలో, ఎక్కడ ఆపాలో ఏమీ అర్థం కాలేదు. ఇంత దగ్గరి అనుబంధాల గురించి వ్రాయడం చాలా కష్టమైన పని, నాకైతే చేతకాని పని- కానీ అమ్మ ప్రేమకి తలొగ్గి వ్రాయక తప్పలేదు. 



శతవసంత లక్ష్మి
==============


వేయి పున్నముల వెన్నెల తటాలున కురిసినట్టూ,
చంద్రహారపు పుత్తడి మెరుపేదో తళుక్కున మెరిసినట్టూ,

అమ్మమ్మ జ్ఞాపకం!

నున్నగా, నూనె రాసి శ్రద్ధగా దువ్వుకున్న
పండిన తలపై నుండి,జీవితంలోని
నలుపు తెలుపు రంగులన్నింటినీ
చదివీ చూసీ విడదీస్తున్నట్టుండే
అమ్మమ్మ పాపిట, 
బిగించి కట్టిన ముడీ 

ముక్కోటి అనుభవాలను 
దిక్కుకొక్కటిగా చల్లినట్టుండే
ఆ తెల్లరాళ్ళ చెవి దిద్దులు, 
వాటి బరువుకు సాగీ సాగీ వేలాడే 
ఆ చెవి తమ్మెలు

వేసవి సెలవుల్లో మావయ్య ఇంటికెళ్ళినప్పుడు
ఆరేడేళ్ళ నా పసితనం మంకుగా ఏడుస్తున్నప్పుడు
పైవరసల్లోని స్టీలు డబ్బాల్లోంచీ మిఠాయి తెచ్చి
వీధరుగు మీద కూర్చోబెట్టి తినిపించిన సనసన్నటి చేతులు,
ముడతలు పడ్డ ఆ వేళ్ళూ,  

పదిహేనుమంది మనవల్లో, 
ఎవరెప్పుడు దగ్గరకెళ్ళి ముద్దాడినా, 
నాలుగు పేర్లు దాటాక గానీ అసలు పేరు చెప్పనివ్వని ప్రేమ,
నుదిటి మడతల్లో నలిగి కనపడే జ్ఞాపకశక్తీ,

అమ్మమ్మంటే, పుట్టగానే అమ్మ నా గుప్పెట్లో పెట్టిన పగడపు ఉంగరం! 
పసితనపు చేసంచీ అరల్లో భద్రంగా దాచిపెట్టుకున్న తీపి తాయిలం!   

ఒక్క దొండపాదుతో ఏ తుఫాను గాలికీ తొణక్కుండా
ఇల్లు నడిపిన నిండుకుండ అనేవారొకరూ,
లోచూపుతో ఇందరిందరిని కనిపెట్టుకుని
దప్పి తీర్చి సేదతీర్చిన చల్లని సెల అనేదొకరూ,
వెళ్ళిపోతున్నాం -అనగానే గబాల్న కదిలి కావలించుకుని 
కన్నీరైపోయ్యే గోదారి అనేది ఇంకొకరు.
ఒక్కొక్కరికీ ఒక్కోలా, 
అద్దంలా. ఆకాశంలా.
అందరి మనసులూ తడయ్యేలా, తేటపడేలా,
అమ్మలా, అమ్మమ్మలా, సీతమ్మలా.. 

వెనక్కి తిరిగి చూస్తే వేయి పున్నములు.
వేలెండంత కూడా లేని మేం చేసిన
వేలవేల తప్పులు. 
పశ్చాత్తాపాలూ, ప్రాయశ్చిత్తాలూ, 
ఇప్పుడు ఆగి నిలబడితే కొన్ని కన్నీళ్ళు.

మెత్తటి చీరల్లో ముడుచుకు పడుకుని
మావయ్య ఇంట్లో మా కోసం ఆశగా చూస్తున్నట్టూ..
ఫోనుల్లో మా మాట వినగానే,
ఓసారి వచ్చి కనపడవే అంటున్నట్టూ..
నే చెప్పిన మంత్రం చదూకుంటున్నావా? అని 
అలాగే వంగి ఆరా తీస్తున్నట్టూ..
"ఆయీ ఆయీ ఆపదలు కాయీ" అని
లాలి పాడి నిద్రపుచ్చుతున్నట్టూ
వేపచెట్టు క్రింద కథలు చెబుతున్నట్టూ
వెలక్కాయ పచ్చడితో ముద్దలు పెడుతున్నట్టూ
నిన్ను తీసుకెళ్తా రావె అమ్మమ్మా అంటే
'ఓ...యబ్బో' అంటూ వెక్కిరిస్తున్నట్టూ.. 

అమ్మమ్మ అనుకుంటే చాలు, 
వేయి అనుభవాలిలా పూరేకుల్లా నా చుట్టూ ఎగిరి
నన్నొక సీతాకోకను చేసి ఆడిస్తాయి.
అమ్మమ్మంటే,
నా ప్రతిభయాన్నీ దాటించిన తిరుగులేని రామమంత్రం,
వేయి చేతులతో నన్ను కాచుకుని 
బ్రతుకంతా వెంట నడిచే తొలిప్రేమప్రపంచం.

<3 div="" nbsp="">

ఆకుపచ్చద్వీపం

నీ పేరు పక్క వెలిగే ఆకుపచ్చ దీపాన్ని చూస్తే
వేయి పావురాలు టపటపా రెక్కలు విదుల్చుకుంటూ
ఆకాశంలోకి ఎగిరినట్టుంటుంది.
అడవిదారిలో నడుస్తోంటే జలపాతపు హోరేదో చెవుల్లో పడి
ఒళ్ళంతా పులకలు రేగినట్టుంటుంది.
తెల్లకాగితాలన్నీ రంగుపతంగులుగా మారి తలపై తిరుగుతుంటే
అక్షరాల దారాలు వాటిని నీ వైపు మళ్ళిస్తున్నట్టుంటుంది.
సూర్యుడూ చంద్రుడూ మనలాగే కాలాలు సర్దుకుని,
పక్కపక్కన చేరి మనని గమనిస్తునట్టు ఉంటుంది.

ఏడేడు ముఖాలతో నాకు నువ్వూ నీకు నేనూ
ఎదురవడమనే పరీక్ష వస్తుంది కానీ,
నీ జాలి మొహం వెనుక నున్న కవ్వింపూ
నా నవ్వు మొకం వెనుక ఉన్న వెక్కిరింపూ
ఏ క్షణానికా క్షణం గ్రహింపులోకి వస్తూనే ఉంటుంది.
ఎన్నెన్ని ముసుగులేసినా దాయని ప్రేమ ఒకటి
మన మన కిటికీల్లో నుండి దూదిపింజెలా ఎగిరి
దిక్కులన్నీ తాకుతూనే ఉంటుంది.

చుక్కలుగా విరిగిపడే మౌనాన్నీ,
బేక్‌స్పేస్ చెప్పని కథలనీ,
ఈ దూరాలు నేర్పిన కొత్త లిపిని
కూడబలుక్కుని చదువుతూనే ఉంటాం.
భూమికి చెరోపక్కగా కూర్చుని,
వేళ్ళ చివరి విద్యుచ్చక్తి నరాల్లోకి పాకించే ప్రాణశక్తిని
రెప్పల కంటించుకున్న కలలన్నీ పండి రాలిపడేదాకా
అందుకుంటూనే ఉంటాం.

అలాగే అక్కడే కూర్చుంటాం మనం
దగ్గరితనమంతా
మూడే రంగులతో కొలుచుకుంటూ
బెత్తెడంత కిటికీలో మనసంతా పరుచుకుంటూ
నిమిషాలో గంటలో, గారాలో గొడవలో,
మనదైన ద్వీపంలో చిక్కుపడ్డాక,
ఇద్దరి గుప్పెళ్ళూ విప్పుకుని
ఒకే రహస్యానికి ఇరుకొసలమవుతాం.

కాలసర్పం కొరికీ కొరికీ కొరికీ
మనం పట్టుకున్న ఒంటిఓటితీగను తెంపేస్తోన్నా

పావురాలన్నీ ఏ శూన్యంలోకో ఎగిరిపోతూ పోతూ
బూడిదరంగును ఇద్దరి ముఖాలకీ పులిమేస్తోన్నా

తల తెగినా నాట్యమాపని జానపదకథలో పాత్రల్లాగా
తత్తరపాటుతో కాసేపక్కడే తచ్చాడి లేస్తాం,

మనసుకి మీట నొక్కుకోవడం చేత కాని మనం -
ముసుగులు సరిచూసుకోకుండానే.
రంగస్థలం వైపు.

**తొలి ప్రచురణ, ఆంధ్రజ్యోతి వివిధలో (17-06-2018)..

http://www.andhrajyothy.com/artical?SID=594122
(My sincere thanks to my colleague and good friend Vamsi S, who motivated me to write this poem - Thanks buddy! This one is for you!)

పంతం

రోజురోజూ నేనేం లెక్కపెట్టుకోను
మారే ఋతువుల నసలు పట్టించుకోను
ఉన్నదొక్కటే దేహం
మనసుకొక్కటే పంతం
పరిచయమూ నీవల్ల ప్రియమూ అయిన నిశ్శబ్దాన్ని
పట్టుకోకూడదని తెలుసు కానీ
జారిపోనీయలేను
ఈ చలికాలపు పొద్దును.
నిన్ను.

*తొలి ప్రచురణ : ఈమాట, మే -2018 సంచికలో.

అమృతసంతానం - గోపీనాథ మహాంతి

బెజవాడ బెంజ్‌సర్కిల్ దగ్గర్లో, రోడ్డు మీదకే ఉండే అపార్ట్మెంట్‌లో, ఒక చిన్న ఫ్లాట్ మాది. వెనుక వైపు ఖాళీగా ఉండే ఐ.టి.ఐ కాలేజీ గ్రౌండులో పద్ధతి లేకుండా అల్లుకుపోయే పిచ్చి చెట్లూ, దూరంగా కనపడే గుణదల కొండా, ఆ కొండ మీద మిణుకుమిణుకుమనే దీపమూ, పాలిటెక్నిక్ కాలేజీ గుబురు చెట్ల మీంచీ సూర్యుడూ చంద్రుడూ ఆకాశం పైకి ఎగబాకుతూ వచ్చే దృశ్యమూ - ఇదే నేను చూసిన ప్రపంచమూ, ప్రకృతీ. ఊరెళుతూ వెళుతూ పక్కవాళ్ళకి తాళాలిచ్చి నీళ్ళు పోయించుకు కాపాడుకునే తులసీ, గులాబీ మొక్కలు తప్ప, ఆ ఎర్రటి కుండీల్లోని నాలుగు గుప్పిళ్ళ మట్టి తప్ప, బంకమన్నును బిగించిన అదృష్టరేఖలేవీ నా అరచేతుల్లో లేవు. అట్లాంటి ఈ ఖాళీ చేతుల్లోకి, పుష్యమాసపు చివరి దినాల ఎండని మోసుకొంటూ, అమృతసంతానం వరప్రసాదంలా వచ్చి పడింది. విచ్చుకున్న అడవి పూల మత్తుగాలిని మోసుకొచ్చింది. అడవి దేశపు వాసనలు చుట్టూ గుమ్మరించింది. గుమ్మటాల్లాంటి కొండల మధ్యలో నిలబెట్టి, 'ఎదటి కొండల మీద ఎండ కెరటాల్లా..' తేలిపోవడం చూపెట్టింది. కోఁదు గుడియాలను ఒరుసుకుంటూ పరుగెట్టే కొండవాగు పక్కన కూర్చుండబెట్టి పిల్లంగోళ్ళు వినిపించింది. చెవుల్లో డుంగుడుంగా గుబగుబలాడించింది. మామిడి టెంకల గుజ్జు గుటక దాటించింది. ఇప్పసారా జోపింది. ' షాఠీ ' లా తోక విసిరింది. 'ఆకుపచ్చ తుప్పల మధ్య ఎగసిన ఎర్రపువ్వు లాంటి గాయం ' లా - అమృతసంతానం కొంత బాధనూ మిగిల్చింది. అనుమతి అడక్కుండా యథేచ్ఛగా నా ఊహాప్రపంచాన్ని పునర్నిర్మించుకుంటూ పోయింది. 
*

సాహిత్యం లోకవృత్తాన్ని ప్రతిబింబించాలి అనే మాట, విమర్శకుల దగ్గర వినపడుతూంటుంది. ఆ మాట, ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలంలో, రచయితలు, పాఠకుల అవసరాలను బట్టి రూపు మార్చుకోవడం రివాజయ్యాక, లోకం కాస్తా సమకాలీన సమాజమయ్యింది. దరిమిలా, మన రచనలు, వాటిలో మనం చూస్తున్న మనుషులు, వాతావరణమూ ఇవన్నీ ఇప్పటికే మనకు చిరపరిచితాలైన వాతావరణాన్ని పాత్రలను అంటిపెట్టుకుని మసలడమూ మొదలైంది. ఎప్పుడైతే ఇవి అందరికీ తెలిసిన పాత్రలే అన్న భావన స్థిరపడిపోయిందో, ఆ పాత్రలను బలమైన నేపథ్యంతోనూ, తమదైన ఒక గొంతుకతోనూ, ప్రభావంతోనూ కథలోకి నడిపించుకు రావలసిన అవసరమూ తగ్గిపోయింది. ఎక్కువ మంది రచయితలకు, ఈ పాత్రల ద్వారా చెప్పించాల్సిన కథే ముఖ్యమైపోయింది, పాత్రల కథ - వాటి ప్రాముఖ్యత వెనక్కి నెట్టబడ్డాయి. "కథలో పాత్రలు" కాకుండా, "పాత్రల ద్వారా కథ" చెప్పడమన్న పద్ధతి ఊపందుకున్నాక, రచనను నాయికా నాయికల చుట్టూ తిప్పుకురావడమూ, వాటికి ఉదాత్తతను, వీరత్వాన్నీ ఆపాదించి ఒక మెట్టెక్కించి నిలబెట్టడమూ, ఒక సరళరేఖలో వారి జీవిత గమ్యాన్ని నిర్దేశించుకుంటూ పోయి, మైలు రాళ్ళను ముందే నిలబెట్టుకుని చుక్కలను కలుపుకుపోవడమూ కూడా తప్పనిసరైపోయింది. కాబట్టే,  ఇప్పుడు మనం చదువుతున్న చాలా కథల్లో వర్ణనలంటే సందర్భ వివరణలే తప్ప ఆయా లోకపు వర్ణనలూ, మనుష్యుల వర్ణనలూ, విశేషాలూ కావు. ప్రత్యేకించి నవలలను పాపులర్ రచనలుగా ఇంటింటికీ చేర్చాక, సామాన్య పాఠకులకు కూడా అర్థమయ్యేలా చెయ్యాల్సిన అవసరానికి లోబడి, తెలుగు నవలలలో ఒక తరం రచయితలు, తమదైన పద్ధతినీ, శైలినీ నవలా రచనలో ప్రతిక్షేపించుకుంటూ పోయాక, అమృతసంతానం లాంటి ఒక నవల చదివినప్పుడు, మనం పాఠకులుగా ఎలాంటి కల్పనా చాతుర్యానికీ, రచనా ప్రపంచానికీ, ఊహాశక్తికీ దూరమయ్యామో తెలుస్తుంది. 

అందుకే అమృతసంతానంలో పాత్రల చిత్రీకరణను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రచయిత అవసరానికి మెరిసి వెళ్ళిపోయే పాత్రలు కావవి. చదువుతూండగానే మన కళ్ళకు కట్టే పాత్రలు. 

ఇందులో ఉన్న ఎన్నో పాత్రల్లో బెజుణిదీ ఒక పాత్ర. సర్వస్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న ఈ పాత్ర, కథలో ఎలా ప్రవేశపెట్టబడిందో చూడండి : ఎన్ని వివరాలతో - వ్యక్తిగతంగానూ, కోఁదు జాతిలోనూ, - ఈ పాత్ర ఉనికిని, ఆనుపానులను సవివరంగా రచయిత చెక్కుకుపోయిన తీరును చూడండి. ఈ స్ఫుటమైన వర్ణనలే, ఆ లోకానికి మనం బొత్తిగా అపరిచితులమన్న లోలోపలి సంశయాన్ని, బెరుకును మెలమెల్లగా కరిగించుకుంటూ పోతాయి.

బెజుణి ఇల్లు వచ్చింది. ఊరి చివర ఒంటరి కొంప. చుట్టూ కిత్తలితుప్పల పెండె. లోపల గడ్డీగాదా అడివి. దాని మధ్య ఒక పాడుపంచ. అందులోనే ముసిలి బెజుణి కాపురం. ఎవ్వరూ లేరామెకి. కోఁదు సమాజంలో ఒక విశిష్ట స్థానముంది బెజుణికి. ఎప్పుడు కావాలంటే అప్పుడు దేవత పూనుతుందామెకి. ఏ దేవతని పిలిస్తే ఆ దేవత ఆవేశిస్తుంది. ఆమె గొడ్రాలు. చచ్చినవాళ్ళకి బతికినవాళ్ళకి మధ్య ఒక నిచ్చెన లాంటిదామె.

బెజుణి అంటే జనానికి నచ్చేది కాదు. అందవికారంగా ఉండేదామె. ఆమె గోళ్ళు డేగగోళ్ళలా వంకరగా ఉండేవి. నోట్లో రెండే రెండు పళ్ళున్నాయి. రెండూ పొగచూరిన పసుపురంగుతో ఉండేవి. కళ్ళు రెండూ పొగచూరినట్టుండేవి. ఒంటి మీద చర్మం వేలాడుతూ ఉండేది. అందరూ ఆమెను చూసి భయపడేవాళ్ళు. ఎముకలు అవుపిస్తూన్న గుండె మీద రకరకాల గాజుపూసల పేర్లూ, గుత్తుగుత్తులు తావేజులూ, వేళ్ళముక్కలూ వేలాడుతూ ఉండేవి. అసాధ్యమైంది సాధించే దామె. అగ్గిలో నడిచేది. ముళ్ళ మీద కూచునేది. దేవతల వాహనం ఆమె: బెజుణి.

రెండవది, ఈ వర్ణనల్లోని పచ్చిదనం : అది రోమాలు నిక్కబొడుకునేలా చేస్తుంది. నిటారుగా కూర్చోబెట్టి పుస్తకం చదివిస్తుంది. మొదటి పేజీల్లోనే మనకెదురయే పియు, నెలలు నిండాక అడవిలో ఒంటరిగా ఆమె పడ్డ క్షోభ, రచయిత మాటల్లోనే..ఇలా -

"తుఫానులాగ తెరలుతెరలుగా వస్తున్నాయి నొప్పులు. ఒంటి మీద కెరటాలు విరిచిపోయేవి. పుయు అరిచేది. ఏడ్చేది. లోకం మరచిపోయేది, బైట ఎండ ఉజ్జ్వలంగా ఉంది. ప్రకృతి విచ్చలవిడిగా ఉంది. అన్నీ మరచిపోయింది పుయు. ఒంట్లో ఏదో భయంకరమైన విప్లవం రేగుతున్నట్టుంది. ఏదో తెంపుకున్నట్టుంది. లాక్కుంటున్నట్టంది. పీక్కునట్లు పెనుగులాడుతున్నట్లు ఉంది. అంతా రణ చీకటి. దుఃఖం. మద్దిచెట్టు రెండు చేతులతోనూ బిగించి పట్టుకునేది పియు. చెట్టు బెరడు పళ్ళతో కరచిపట్టేది. అమ్మవారు పూనట్టు వొంటికి ఎక్కడలేని సత్తువా వచ్చేది. నులుచుకునేది. 

ఎంతసేపలా గడచిందో తెలీదామెకి. హఠాత్తుగా తుఫాను  ఆగిపోయినట్టు అనిపించింది. కళ్ళ ముందు చీకటి తొలగిపోయింది. దిమ్మెత్తిపోయిన చెవులకి ఏదో కొత్తజంతువు అరచినట్టు వినిపించింది. ఆమె వినడం కోసమే ఎవరో గూబలు పగిలిపోయినట్టు అరుస్తున్నారు. పుయు నివ్వెరపోయి చూసింది. ఎర్రటి చిన్నమనిషి కిందపడి అరుస్తున్నాడు.పుయు తెలువుకుంది. చేరడేసి కళ్ళు చేసుకు చూసిందామె. ఆఁ? ఇది తన బిడ్డా? ఇదేనా ఇంతకాలమూ తన దేహంలో దాగుడుమూతలాడుతూ ఉంది? ...

బలం లేని చేతులతో ఒక దారైన రాతిముక్క తీసిందామె. దాంతో కొడుకు బొడ్డు కోసింది."

చివ్వుమని లోపల నొప్పి లేచే వర్ణన - "అమృతసంతానం" నేలను పడే వేళ. అమృతసంతానం చదవగానే గుర్తింపుకొచ్చేది, అందులోని భాష అనీ, కవిత్వమనీ, ఈ పుస్తకం ఇప్పటికే చదివిన మిత్రులు కొందరు నాతో చెప్పినప్పుడు, నేనా కవిత్వం దగ్గరే ఆగిపోతాననుకున్నాను. "పుష్య మాసపు చివరి దినాల ఎండ" నన్ను పట్టి నిలబెట్టడమూ అబద్దం కాదు. అయితే, నన్నాపినవి, నవలలో ఒక గొప్ప వచనం చదివిన తృప్తీ, సంతోషమే తప్ప కవిత్వం కళ్ళకు అడ్డుపడటం కాదు. అది ఈ రచన విలువను పెంచేదే తప్ప, పాఠకులను పక్కదారి పట్టించేది కాదు. ఈ మాటలు రాస్తూ రాస్తూ నేను ఇది పురిపండా వారు చేసిన అనువాదమనీ మరొక్కసారి నాకు నేనే గుర్తు చేసుకుంటున్నాను. ఇట్లాంటి అనువాదం అరుదే కాదు, అసంభవం కూడా. ఇంత తేనెలొలికే తెలుగూ, తూచి వేసినట్లే పడ్డ మాటలూ, వాక్య నిర్మాణమూ, ఈ పుస్తకాన్ని భారతీయ సాహిత్యంలోనే పైవరుసలో కూర్చుండబెడతాయి.

ఒక సవిస్తారమైన ప్రపంచం! వలయాలు వలయాలుగా - లౌకికంగా మనమనుభవించినట్లే - శకలాలుగా, ఇక్కడా - మరొకచోట కూడా, కనపడని ముడులతో, ఇప్పటికింకా ముడిపడని మనుష్యుల మధ్య, పోగులుపోగులుగా అల్లుకుపోయే సాంసారిక బంధాలను సవిస్తరంగా చూపెట్టడానికి నవలకున్న పరిధే సరైనది. 

అమృత సంతానం ఒక నాయకి కథ కాదు. ఒక జాతి కథ. ఒరిస్సా కొండ ప్రాంతాల్లో జీవించే కోఁదుల బ్రతుకు కథ. అక్కడి సంస్కృతిని పరిచయం చేసిన కథ. అందుకే, ఒక 'సావొతా' సరబులా, ఒక 'డివరీ'లా, ఒక 'బిజుణి' లా, పియు లా, లెంజులా, పియోటి లా, హకీరాలా, ఈ కథలో కొండలూ, వాగులూ, డప్పులూ కూడా మనకు స్పష్టంగా పరిచయమవుతాయి. ఆ దారులు అస్పష్ట రేఖలు కావు. ఎక్కడ అడుగు తీసి అడుగేయాలో విస్పష్టంగా చూపెట్టిన కథనమిది. 

అయితే, ఇది  విశ్వసనీయత కోసమో, పఠనీయత కోసమో మాత్రమే చెప్పుకోవలసిన వివరం కాదు. ఒక సర్వస్వతంత్ర ప్రపంచాన్ని పాఠకుడి చేతుల్లో పెట్టేప్పుడు, సమర్థుడూ, సహృదయుడూ అయిన రచయిత పడే కష్టమిదంతా. మరోలా చెప్పాలంటే, ఒక మంచి రచయితకు, మంచి పాఠకుడి మీద ఉండే అవ్యాజమైన ప్రేమ మాత్రమే ఇలాంటి రచనలా బయటకు రాగలదు. 

ఒక కథగా చెప్పాలంటే, అమృతసంతానం చిన్నదే. కానీ పరికించి చూసినవాళ్ళకి, జీవితమంత పెద్దది. బహుముఖీయమైనది. తప్పొప్పులకు అతీతంగా, జీవితం ఎలా సాగగలదో, అదే చూపిస్తుందీ పుస్తకం. కొండల మీద పారాడి పారిపోయే వెలుగు నీడల్లాగే, జీవితమూ ఎప్పుడూ ఒక రంగు పులుముకుని కూర్చునేది కాదని చెప్తుంది. కోఁదు జీవన నేపథ్యంలో ఈ కథను చెప్పడం, ఎత్తైన కొండల మీదా, ఆ లోయల్లోనూ అప్పుడప్పుడే నాగరికత పొటమరిస్తోన్న వాతావరణాన్ని చూపించడం, ఈ కథను మరింత ప్రత్యేకం చేశాయి. ప్రత్యేకించి ప్రకృతి వర్ణనల్లోని కవితాత్మకత, వాటిలోని నవ్యత (ఈనాటికీ..), ఆ వర్ణనల లోతూ, విస్తృతీ, ఈ పుస్తక పఠనానుభవాన్ని తనివి తీరని అనుభవంగా మిగులుస్తాయి. మానవ సంబంధాలు ఎన్ని ముళ్ళు పడి ఉన్నాయో, అన్ని ముళ్ళనూ విప్పే ప్రయత్నం, కాదంటే కనీసం తాకే ప్రయత్నం చేసి వదిలింది. ప్రత్యేకించి శారీరక సంబంధాల విషయంలో మనిషికి స్వాభావికమైన ఆశనూ, ఆకలినీ అంతే గాఢంగా, పదునైన పదాల్లో చూపెట్టింది. 

"వెర్రెత్తిస్తోంది పియొటి. అభాసంతోనూ, ఇంగితంతోనూ దివుడు సావొఁతా గుండె మీద సమ్మెటపడేది. ఆమె ఒళ్ళు కొంచం ఒంపు చేసేది, దివుడు మొహం మీద వేడిగాడ్పు కొట్టి, మొహం ఆర్చుకుపోయేది. ఆమె రవంత పక్కకి జరిగేది. ఇరవై మూళ్ళ దూరాన ఉండికూడా కోణం లెక్కప్రకారం అతడిమెడ అంతే జరిగేది"

ఇదీ అతని లెక్క! ఇట్లాంటి మాటల గారడీతో మన మెడలనూ వంచి చదివించే నేర్పుతో, లెక్కతప్పని నిపుణతతో, ఇంత పకడ్బందీగానే ఏ సన్నివేశాన్నైనా రాసుకుపోయాడు. 

అది ఫారెస్టాఫీసర్ల దాష్టీకం కావచ్చు, లెంజుకోఁదు నిస్సహాయత కావచ్చు, మన్యం జ్వరాల గురించి కావచ్చు, లొడబిడలాడుతూ ఆ శుభ్రస్వచ్ఛ లోకంలోకి చొచ్చుకొచ్చిన షావుకార్ల గురించి కావచ్చు- ఒక కథైనా, నవలైనా చదివేప్పుడు మనం ఎట్లాంటి నిజాయితీని ఆశిస్తామో, అదంతా ఈ రచనలో దొరుకుతుంది. ప్రత్యేకించి ఆ కొండజాతి వాళ్ళు తమ అమాయకత్వం వల్లా, అసహాయత వల్లా, అన్ని రకాలుగానూ దోపిడీకి గురవడాన్ని గురించి చదివినప్పుడు, మనకు నమ్మకంగా తెలుస్తుంది, ఇలాంటి ఒక  రచన చెయ్యడానికి నైపుణ్యమొక్కటే కాదు, గుండెలో ఆర్ద్రత కూడా ఉండాలి. కళ్ళలోనూ కలంలోనూ కొంత కన్నీరుండాలి. పోతే, ఇన్ని పాత్రల గురించీ, ఇంత చెప్పీ, రచయిత ఎక్కడా ఏ పాత్ర తరఫునా వకాల్తా పుచ్చుకోవడం కనపడదు. ఎంచి ఒకరికి అండగా నిలబడి ముందుకు నెట్టడమూ ఉండదు. రచయిత నిలబెట్టుకున్న ఈ ఎడం, మనలని వాళ్ళకి దగ్గర చేస్తుంది. మనకి మనంగా వాళ్ళని హత్తుకునేట్లు చేస్తుంది. పుయునే గమనించండి. 

ఎంత సంఘర్షణనో అనుభవించిన మనసు పుయుది. ఆమె తన స్వహస్తాలతో బొడ్డు కోసిన అమృతసంతానం ఊసుతో కథ మొదలవుతుంది. అది మొదలు. మనస్సులో అగ్గి మండుతోన్నా, ఒళ్ళో పిల్లాణ్ణి చూసుకుంటే కళ్ళు ధారలు కట్టే వేదనలోకి వెళ్తుంది, ఆఖరు పేజీల వద్దకొచ్చే సరికి. "ఎవళ్ళు వాణ్ణి నా అని ఆదుకుని పైటకొంగు కప్పుతారు?" అనుకుంటే దేవుడు గుర్తొస్తాడామెకి. మన గుండె చెరువైపోతుంది. వెక్కి వెక్కి ఏడుస్తూ ఆకాశం వైపుకి మొహమెత్తుకుంటుంది. 

అండగా ఉండే వాళ్ళు లేరని కాదు. అయినా, పుయు బుదరింపు మాటలన్నీ అంత దుఃఖంలోనూ పసిగడుతూనే వొచ్చింది. దేబిరింపుతనం తన ఛాయలకు రాకుండా జాగ్రత్తపడుతూనే వచ్చింది.  ఆమె మనసులోకి ఇంకిందల్లా 'డిసారి' మాటే.

"మూణ్ణాళ్ళ ముచ్చట మనిషి జన్మ. తరవాత మార్పు రానే వస్తుంది. ఈ రెన్నాళ్ళూ గడుపుకోడం సాధ్యం కాదా?"

ఆకాశం వైపు చూసింది కానీ, ఆశ వదులుకోలేదు పుయు. తనదైన బంధాన్ని, తనదే అయిన జీవితాన్ని, ఎవ్వరికీ అయాచితంగా ధారపొయ్యలేదు. ధీరనాయిక పుయు! ఎగసిన ఆత్మగౌరవ పతాక! సీతనీ, ఒకానొక కోణంలో శకుంతలనీ కూడా గుర్తుకుతెస్తుంది. 

ముందుకు నడిచింది. కథనూ నడిపించింది. 

చావు లేని కథ, జీవనంలో ఉన్న రుచి తెలిపిన కథ. "అమృత సంతానం"

*
ఆశా? ఆకలా? ఆక్రమణా? జాలీ, మోసం, కల్లోలమా? అసహాయతా? నిబ్బరమా? యుద్ధ స్థైర్యమా? మీరు చెప్పండి! ఒక గొప్ప నవలలో మీరేం ఆశిస్తారో, ఏం ఊహిస్తారో! అవన్నీ అంతకు పదింతలుగా దొరికే పుస్తకమిదేనేమో చదివి సరిచూసుకోండి. జటాజూటంలో ఉన్నంతసేపూ విశ్వరూపం చూపని గంగలా, భగీరథ ప్రయత్నం లేనిదే ఎవరికీ అందుబాటులోకి రాని గంగలా, ఈ ఆరువందల పేజీల పుస్తకం రెండు అట్టల మధ్యా చిక్కుబడి ఉన్నంతకాలమూ మనకిది అర్థం కాదు. భగీరథప్రయత్నం ఎవరికివారే చేసుకోవాలి. తరాలు, మారే కాలాలు, వాటి క్రీనీడలూ, మానవ సంబంధాలూ, మహోద్వేగాలూ..రచనా విశ్వరూపాన్ని చూడటానికి సంసిద్ధులై ఈ పుస్తకాన్ని అందుకోండి.

*
"అమృతసంతానం"
ఒడియా మూలం : గోపీనాథ మహాంతీ
తెలుగు : పురిపండా అప్పలస్వామి.

కడుపు నిండిన మధ్యాహ్నమొకటి..

ఆఫీసులో pantry వైపుకు వెళితే, అక్కడ కొంచం పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు housekeeping staff ఎప్పుడూ ఏవో పనులు చేసుకుంటూ కనపడుతూనే ఉంటారు. తెలుగువాళ్ళు మొహాలను చూసే ఒకరినొకరు గుర్తుపడతారనుకుంటాను. ఒకావిడ నన్నెప్పుడూ టైం ఎంతయింది మేడం ..అని పలకరిస్తూ ఉంటుంది. భోజనం చేశారా, టైం ఎంత - ఈ రెండే ఆవిడ ప్రశ్నలు. చక్కగా స్టెప్స్ వేసి కట్టుకునే సిల్కు చీరలతో, ముడితో, పెద్ద బొట్టుతో..బాగుంటుంది.
ఈ రోజు లంచ్ టైంలో ఇక వెళ్దాం అనుకుంటూండగా పది నిముషాల్లో జాయిన్ అవ్వాలి అంటూ meeting invite ఒకటి వచ్చింది. కాదనలేనిది, ముందువెనుకలకు జరపలేనిది. తప్పదురా దేవుడా అనుకుంటూ, అప్పుడే ఏదో ఫోన్ వస్తే మాట్లాడుతూ pantry వైపుకి వెళ్ళిపోయాను. ఆవిడ ఉన్నారు, ఎప్పటిలాగే, నవ్వు మొహంతో. పక్కకు ఒద్దికగా జరిగి నిలబడి, కొట్టొచ్చినట్టు కనపడే ఆకుపచ్చ నాప్‌కిన్‌తో కాఫీ మగ్స్ తుడుస్తూ. నేను మాట్లాడాల్సిన నాలుగు ముక్కలూ మాట్లాడి, - ఇక మీటింగ్ ఉందనీ, మళ్ళీ ఎప్పుడైతే అప్పుడు లంచ్ కి బయటకి వచ్చినప్పుడు ఫోన్ చేస్తాననీ చెప్పి - పెట్టేశాను. హడావుడిగా అక్కడున్న బిస్కట్స్ తీసుకుని, వాటర్‌బాటిల్ నింపుకుని వెనక్కి రాబోతుంటే, వెనుక నుండి "ప్చ్.." అంటూ ఏదో వినపడీ వినపడని శబ్దం. చప్పున వెనక్కి తిరిగి చూశాను - ఆవిడ చేసే పని ఆపి నన్నే చూస్తోంది. "సారీ, టైమే కదా..ఒకటవుతోంది.." నా నోటిలో మాటింకా పూర్తవనే లేదు.."ఇంకో రెండు బిస్కట్లు తీసుకు పో మేడం.." అందామె అలాగే చూస్తూ, కొంచం భయం అంటిన కళ్ళతో..

తొట్ట తొలి హీరో!

JustBake మా ఇంటి దగ్గర్లో..నాలుగు అడుగుల దూరంలో ఉంటుంది. కొన్నాళ్ళ క్రిందట, అక్కడ ఒక కేక్ తీసుకోవడానికి వెళ్ళాను. అనిల్ కోసం.
ఆగస్టు పదిహేనున కూడా అపార్ట్మెంట్‌లలో కేకులు చిన్నపిల్లల కోసం కట్ చేయించడం తెలుసు నాకు. బహుశా అందుకేమో, చాలా రద్దీగా ఉంది. ఆర్డర్లు తీసుకుంటూ కౌంటర్‌లో వాళ్ళు కూడా హడావుడిగా ఉన్నారు.
నా పక్కనే పొట్టి నిక్కరొకటి వేసుకుని, మెడ పైకి కత్తిరించిన జుట్టుతో ఉన్న ఒకమ్మాయి, వంగి వంగి అద్దాల పైకి ముక్కు పెట్టి అన్ని కేకులూ చూసుకుంటోంది.
"ఇదెంత?" ప్రతి దాన్నీ చూపించి అడుగుతోంది.
KG అయితే?
1/2 KG చాలు?
నాకు కేండిల్స్ అక్కర్లేదు.
ఆ అమ్మాయి ప్రశ్నలు తెగట్లేదు.
కౌంటర్ లో అబ్బాయి విసుగు లేకుండా సమాధానాలిస్తున్నాడు.
మొత్తానికి ఆ నాజూకు చూపుడువేలు ఒకదాని మీద స్థిరపడింది. అరకేజీ చాలని చెప్పింది.
15 వ తారీఖు రాత్రికి వచ్చి తీసుకుంటాననీ, వచ్చేటప్పటికి ఏడవుతుందనీ - షాప్ మూసెయ్యద్దనీ చెప్తోంది.
నేను తల తిప్పి నేరుగా ఆమెను చూడకుండానే వింటున్నాను అన్నీ.
కౌంటర్ లో అబ్బాయి నా వైపు చూశాడు.
అదే కేక్ నాకూ, అరకేజీనే కావాలనీ, నేను అదే టైంకీ వస్తాననీ చెప్పాను. అన్నీ రాసుకున్నాడు.
"ఏం రాయాలి?" అడిగాడా అబ్బాయి.
నేను చెప్పాను.
ఆ అమ్మాయి వైపు చూశాను.
"To the best Dad in the world"
గర్వంగా చెప్పింది.
is it your husband's birthday? నా వైపు తిరిగింది.
చక్రాల్లాంటి కళ్ళు. పల్చని చెంపలు.
తలూపాను.
సర్ప్రైజ్ పార్టీ?
కాదని చెప్పాను. పెళ్ళైన మొదటి ఏడు ఉంటుందేమో కానీ, ఆ తరువాత ఇదొక అలవాటైన వ్యవహారమే. అటుపైన ఇచ్చేదేమన్నా ఉంటే అది కాస్త ఆశ్చర్యమేమో కానీ..కేక్ - కాదు. తెలిసిన వాళ్ళు ముగ్గురో నలుగురో రాకపోరు. వాళ్ళ కోసం ఇది...
షాపంతా ఆ మూల నుండి ఈ మూలకు నడిచి చూసింది.. జేబుల్లో చేతులు పెట్టుకుని, నా దగ్గర ఆగి చెప్పింది..
తను వేసిన పెయింటింగ్ అమ్మితే వచ్చిన 650/- రూపాయలతో కేక్ కొంటున్నాననీ....వాళ్ళ నాన్నకు తన బొమ్మ అమ్మకానికి పెట్టినట్టు కూడా తెలియదని, మురుస్తూ మురుస్తూ, ముద్దొచ్చే అతిశయంతో, ఆ వయసు పిల్లలకి ఇంకాస్త అందానిచ్చే అతిశయంతో, చెప్పుకుపోయింది... అది తానిచ్చే మొట్టమొదటి సర్ప్రైజ్ పార్టీ అని..
ఎదురుగా ఉన్న అన్ని అద్దాల్లోనూ, నా మొహం నాకే సరిగ్గా కనపడటం లేదు.
అక్కడ పని అయిపోయాక, పాల పేకట్లు తీసుకుని ఇంటికి వచ్చేశాను. నాన్నగారు కులాసాగా కూర్చుని Sudoku ఆడుకుంటున్నారు.
వెళ్ళి పక్కన కూర్చున్నాను. ఆగి ఆలోచిస్తుంటే, సరిచెయ్యబోయాను.
చగ్గా వెనక్కి లాక్కుని దాచుకున్నారు...
**
పాలు గిన్నెలో పోసి కాచుకుంటున్నాను.
"ఏమంటుందదీ...?" కర్టెన్ వెనుక నుండీ అమ్మను అడుగుతున్న గొంతు..
"నాకేం తెలుసు, ఇప్పుడేగా అదసలు ఇంటికి చేరిందీ..?"
**
జరిగి ఆరు నెలలు కావస్తోంది..ఆ మెరుపుకళ్ళ పాపాయి ఆ దారి వెంట నడిచినప్పుడల్లా గుర్తొస్తూనే ఉంటుంది. వెళ్ళే ముందు, "మళ్ళీ కలుద్దాం" అని మాటవరసకైనా చెప్పుకోలేదే..ఆ పిల్ల నా వెంటెందుకు పడుతుందో...నాకసలు అర్థమే కాదు.
*

ఏడు పుస్తకాల అట్టలు - నచ్చని ఆట- నాలుగు మాటలు

ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో నచ్చిన ఏడు పుస్తకాల అట్టలు పోస్ట్ చేయడమనే ఆట నడుస్తోంది. అక్కడా కాస్త కలుపుగోలుగా తిరిగే చదువరులకు ఆ ఆటా, వివరం తెలిసే ఉంటాయి కానీ, కొరుకుడుపడని ఆ ఆట గురించి నా నాలుగు మాటలూ..
*

అసలు పుస్తకాలకి ఒక్క లోపలి అక్షరాల వల్లేనా అంత అందమూ, ఆకర్షణా, ఆదరణానూ? పోనీ, అట్ట మీద బొమ్మల వల్లా?
మనకిష్టమైన రచయిత మనకళ్ళ ముందే కొత్త పుస్తకాలు ప్రచురిస్తున్నా, అవే మునుపటి పుస్తకాల కన్నా అన్ని రకాలుగానూ ఉత్తమమైనవని మనకి తెలుస్తూనే ఉన్నా, ఆ పాత పుస్తకాల అట్టలనే మళ్ళీ మళ్ళీ అతికించుకుంటూ, అట్టలేసుకుంటూ ఎందుకు భద్రంగా కాపాడుకుంటాం? జీవనశకలమొకటి ఆ రంగుమార్చుకున్న కాగితాల మధ్యన చిక్కుబడిపోయి ఉందనీ, అది భద్రమైనన్నాళ్ళూ, మన పసితనమో, యవ్వనమో, మనమో, మన ప్రియమైనవాళ్ళో భద్రమనీ, లోలోపల మనకొక నమ్మకం. ఏవీ అర్థమవ్వని పుస్తకాలుంటాయి, అయినా అవి మన పుస్తకాల అరల్లో కళ్ళకెదురుగా కనపడడం మానవు. అవి అర్థమవ్వడం కాదు మనకు ముఖ్యం, అవి మనవిగా ఉండటం. మనని జీవితకాలమంతా అంటిపెట్టుకునే ఉండటం. ఒకే పుస్తకం పది ప్రచురణలకు నోచుకుంటుంది. బ్రతికున్న రచయితలైతే తప్పులొప్పుకుని దిద్దుకుని మరీ ప్రచురిస్తారు. మనకి సంబంధం ఉండదు. మనదైన ఒకనాటి పుస్తకమే ముద్దు మనకి. ఆ పుస్తకాన్ని అందుకున్న మరి కొన్ని చేతులో లేదా కోరి ఇచ్చిన మరో రెండు చేతులో ఆ పుస్తకం చుట్టూ గాల్లో గీసిన రేఖల్లా, అదృశ్యంగా ఉంటూ మనకొక్కరికే కనబడుతూంటాయ్. ఆ పుస్తకంలో దాచుకు చదువుకున్న ఉత్తరాలో, జ్ఞాపకాలో, అక్కడే ఎండిపోయిన కొన్ని కన్నీటి చారికలో.. కాగితాలను ముట్టుకుంది మొదలూ మూసే వరకూ ప్రాణం తెచ్చుకుని మళ్ళీ మన చుట్టూ గిరికీలు కొట్టి పోతాయి.
"ఇందులో అమ్మాయి అచ్చం నీలానే ఉంటుంది తెల్సా.." అని కవ్వించి మనకి పుస్తకాల నిచ్చిన నేస్తాల వల్ల కదా అవి ప్రియం? "ఇదేమి జీవితం?" అని నివ్వెరపోయేలా చేసిన మనుషుల అనుభవాల వల్లా అది ప్రియమే. "ఇట్లాంటివన్నీ తట్టుకునీ లేచిన జనులున్నారా లోకంలో?" అని ఊపిరి తీసుకునే ధైర్యాన్నిచ్చినందుకూ అవి ప్రియాతి ప్రియం. నమ్మలేనంత దగ్గరగా, మనల్ని పోలిన మనుషులని కాల్పనిక జగత్తులో బొమ్మ గీసి చూపించినందుకూ, చెప్పలేనంత ప్రేమని, అకారణంగా గుమ్మరించిపోయిన ఆ మంత్రనగరిలోని మనుష్యులను మనం కోరినప్పుడల్లా కళ్ళ ముందు నిలబెట్టినందుకూ ప్రియం. నిదురలో కలవరించి మగతలోనే మర్చిపోయిన పదాలను, పగటి పద్యాలుగా మరెవరో మార్చి పాడి వినిపించినందుకు గుండెలకు హత్తుకుంటాం.
రెండు టీ చుక్కల మధ్యా, పిల్లవాడి చొక్కా గుండీల మధ్యా, మనవి కాక వెళ్ళిపోయిన రెండు బస్సుల మధ్యా, మొత్తం మనదే అయిన రైలుబండి చక్రాల మధ్యా, మనం వెదుక్కు సాధించుకునే విరామక్షణాల మధ్యా, చుక్కల మధ్యా, వెలుగూ చీకట్ల మధ్యా, మూసుకున్న దారుల మధ్యా, తెరవలేని తలుపుల మధ్యా, - తాకితే చాలు,మన ఒళ్ళో రెక్కలు విదుల్చుకు వాలే అచ్చులూ, హల్లులూ..పుస్తకాలూ..ఎవరికెందుకు ప్రియమో తెలుసుకోవాలని ఎవరికుండదు? అక్షరాలే కొలమానమైతే ఏ పుస్తకమైనా ఎవ్వరికైనా ఒకేలా చేరుతుంది, కానీ మనం తక్కెట్లో ఒక జీవితాన్నీ, ఒక మనసునీ, ఒక పుస్తకాన్ని ముడి వేసి కదా పెడుతున్నాం. ఏ జీవితాన్ని అడ్డం పెట్టి చూస్తామో, ఏ మనసును వెనకేసుకొస్తూ చూస్తామో..అవీ, తూకానికి నిలబడేది.ఆ చేరికలో ఎవరు పొందినదేమిటో తరచి చూసుకు పంచుకోవద్దంటే, - ఇంకెక్కడి సంబరం?

సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ

ప్రస్తుతం విమర్శ అన్న పదాన్ని మనం criticism– ఒక సృజనను విశ్లేషించి మంచిచెడ్డలు ఎంచడం– అన్న అర్థంలో వాడుతున్నాం. ఇది పాశ్చాత్య ప్రభావం వల్ల ఆంగ్లేయుల పాలన తరువాత మనం కొత్తగా అలవాటు చేసుకున్నది. అంతకు ముందు మనం విమర్శ అన్న పదాన్ని ఈ అర్థంలో వాడలేదు. పూర్వకవులు ఒక రచనను సవిస్తరంగా పరిశీలించి, వివరించి చెప్తూ వ్యాఖ్య అని రాసేవారు. (ఉదా: మల్లినాథసూరి వ్యాఖ్యలు) ఇప్పుడు మనకున్న ఈ critical evaluation అన్న విమర్శ పద్ధతి మనకు మొదటినుంచీ అలవాటైన పద్ధతి కాదు.
ప్రస్తుతం తెలుగు సాహిత్యరంగంలో విమర్శ కనిపించటం లేదు అని తరచూ వినపడుతున్న మాటకు కారణాలు ఆలోచిస్తే– తమ విద్వత్ప్రతిభలపై విశ్వాసం హద్దులు దాటి వున్న రచయితలు పొగడ్తలు మినహా మరేమీ తీసుకోలేకపోవడం మొదలుకుని, సాహిత్యేతరకారణాలు, స్పర్థలు, విభేదాల వల్ల కావ్యవిమర్శను కవివిమర్శగా దూషణలతో అలంకరించి, తమ అభిప్రాయాలను సాహిత్యసత్యాలుగా ప్రకటించి విమర్శ అన్న పదానికి చెడ్డపేరు తెచ్చిన విశ్లేషకులు, వ్యాఖ్యాతల వరకూ- ఎన్నో కనపడతాయి.
కారణాలేమైనా, విమర్శ అన్న పదానికి తప్పులెన్నడం అన్న అర్థం ఇటీవలి కాలంలో స్థిరపడిపోయింది కానీ నిజానికి విమర్శ అన్నది సునిశితమైన పరిశీలన. సంయమనంతో, నిరాపేక్షగా విమర్శ చేయడం విమర్శకునికి ఎంత ముఖ్యమో, దానిని అంతే నిరాపేక్షగా తన సృజనకు దక్కిన అభినందనగా స్వీకరించవలసిన బాధ్యత సృజనకారునిది కూడా. ఈ రకమైన సుహృద్భావ వాతావరణం ఏర్పడాలి అంటే ముందు మనకంటూ విమర్శాపద్ధతులు ఏర్పరచుకోవాలి. ఏది మంచి విమర్శ, ఏది కాదు అని నిర్ణయించే ముందు, విమర్శ అంటే ఏమిటో నిర్వచించి వివరించగలగాలి. ఆ ప్రతిపాదనలు తప్పు అని ఇంకొకరు నిరూపించవచ్చు. ఒకవేళ అదే జరిగితే, ఏది తప్పు ఏది ఒప్పు అని చర్చించడం ద్వారానైనా విమర్శాపద్ధతికి ఒక చక్కటి ఉదాహరణగా నిలబడే అవకాశమూ ఉంది. ఇదే ప్రధాన ఉద్దేశ్యంగా, ఈ వ్యాసం ద్వారా నా దృష్టిలో విమర్శ అంటే ఏమిటి, అది ఎలా ఉండాలి అన్నది కొన్ని ఉదాహరణలతో వివరించి, ప్రస్తుత విమర్శ పరిస్థితి, అది మెరుగుపడే మార్గాలను స్పష్టపరిచే ప్రయత్నం చేస్తాను.

విమర్శ అంటే ఏమిటి?

విమర్శ అంటే ఒక సృజన యొక్క విశ్లేషణాత్మక పరిశీలన అని నిర్వచించుకుందాం. సృజన అంటే ఏమిటి? తన అనుభూతులకు, అనుభవాలకు, ఆలోచనలకు, ఒక కళాకారుడు ఇచ్చే రూపం సృజన. ఇది శిల్పం, వర్ణ చిత్రం, సంగీతం, సాహిత్యం ఇలా ఎన్నో లలిత కళారూపాల్లో ప్రకటితమవుతుంది. సాహిత్యవిమర్శ గురించి చర్చిస్తున్నాము కనుక, ఇప్పుడు మనముందున్న మొదటి ప్రశ్న: సాహిత్యాన్ని ఎలా పరిశీలించాలి? ఎలా అర్థం చేసుకోవాలి?
ఏ రచనకైనా ఒక పరిధి, సందర్భం ఉంటాయి. ఏ సాహిత్యవిమర్శ అయినా తాను విమర్శిస్తున్న రచన యొక్క పరిధి, సందర్భాలను దాటి ఆ రచనను తప్పుగానో ఒప్పుగానో నిర్ణయించకూడదు. ఒక్కొక్కసారి పరిధి సందర్భం ఒకటే కావడం కద్దు. ఐతే, ఈ పరిధి, సందర్భం ఏమిటి?
ప్రతి రచనా తనకంటూ ఒక లోకాన్ని సృష్టించుకుంటుంది. మన భౌతిక ప్రపంచం కొన్ని నియమాలు, ధర్మాల మీద ఆధారపడి ఉన్నట్టే ఒక రచనాలోకం కూడా కొన్ని ధర్మాలు, నియమాల ఆధారంగా నిర్మించబడి వుంటుంది. అవి మన ప్రపంచపు ధర్మాలే కావాలని కూడా నియమమేమీలేదు. రచనాలోకపు నియమాలు అభూత కల్పనలూ కావచ్చును. ఐతే ఒకసారి నిర్మించబడ్డాక ఈ భౌతిక ప్రపంచంలానే ఆ రచనాలోకం కూడానూ ఆ నియమాలననురించి ఒక తర్కబద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఇది ఆ రచన పరిధి. ఒక రచన, ఇలా తన రచనాలోకపు ధర్మాలకు కట్టుబడి వున్నదా లేదా అని చూడడం ఒక రచనను ఆ రచన పరిధిలో పరిశీలించడం అవుతుంది. ఉదాహరణకి, సైన్స్‌ ఫిక్షన్‌ రచనలో టైమ్‌ ట్రావెల్‌ ఒక అంగీకరింపబడిన సత్యం. అలాంటి రచనను టైమ్‌‌ ట్రావెల్‌ అనేది లేదు అది కేవలం కల్పన అనే ప్రాతిపదికన పరిశీలించబోవడం, ఆ రచనను దాని పరిధి దాటి పరిశీలించడం అవుతుంది. హాస్యం ప్రధానోద్దేశమైన రచనలో సామాజిక సందేశం వెతకడం ఇలాంటిదే. ఎంచుకున్న ఆవరణం, శైలి, శిల్పం తదితర సాహిత్య పరికరాలన్నీ కూడానూ ఒక రచన తన పరిధిలో ఎంత సహజంగా పటిష్టంగా ఇమిడిందో లేదా ఇమడలేదో చూపిస్తాయి.
కళాసృజన ఏకాంతంలో సాగే స్వార్థపూరిత ప్రక్రియే అయినప్పటికీ దాని అంతిమ లక్ష్యం ఇతరులతో పంచుకోబడటం. ప్రతి రచన, రచయిత అంతర్‌ప్రపంచంతోనో బాహ్యప్రపంచంతోనో ముడిపడి ఉంటుంది. ఏదో ఒక స్థాయిలో ఆ రచనాలోకం, పాఠకలోకంతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ సంబంధాన్నే సందర్భం అని పిలుస్తున్నాను. అంటే ఒక రచన తను ఉన్న సమాజంతో ఏ రకమైన సంబంధాన్ని కలిగివుంది లేదా ఆ సమాజంలో ఏ విధమైన పాత్ర పోషిస్తున్నది? అప్పటికి ఉన్న సాహిత్యంలోనూ, సమాజంలోనూ ఏ రకంగా అంతర్భాగం అవుతున్నది? అని పరిశీలించడం ఆ రచన సందర్భాన్ని అంచనా వేయడం అవుతుంది. ఉదాహరణకి సూరన కళాపూర్ణోదయం యొక్క ప్రశస్తి, అందులోని వర్ణనలకే పరిమితం కాదనీ, మన దేశంలో ఆ కాలానికి వాడుకలో లేని ఆధునిక నవలా సాహిత్య లక్షణాలన్నీ అందులో ఉన్నాయనీ, ఆ రకంగా ఆ కావ్యం సాహిత్య చరిత్రనే కాదు, సాహిత్యం ఆధారంగా మన దేశచరిత్రనే పునఃపరిశీలించడానికి ఆస్కారం ఇచ్చిందనీ చెప్పడం– ఆ రచన సామాజిక, సాహిత్య చరిత్రలో ఎక్కడ ఒదుగుతోందో వెల్చేరు నారాయణరావుగారు[1] విశ్లేషించి, వివరించి చూపించడం వల్లే సాధ్యపడింది. రచనా సందర్భమన్నది విమర్శలో ఇందుకే ఒక ముఖ్యభాగం.
రచయిత కర్తవ్యం తన రచనాలోకాన్ని వీలైనంత పకడ్బందీగా సృష్టించటం. విమర్శ పని ఆ ప్రపంచాన్ని, దాని నిర్మాణ కౌశలాన్ని ఆ రచన పరిధీ సందర్భాలను విశ్లేషించి, ఆ రచనను పాఠకుడు మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి తోడ్పడడం.
కథ, కవిత, గేయం, పద్యం– అన్నీ సాహిత్య ప్రక్రియలే అయినా, ప్రస్తుత వ్యాసాన్ని, స్వభావసిద్ధంగా సాంద్రతరమైన కవిత్వం గురించి ప్రధానంగా చర్చిస్తూ కొనసాగిస్తాను.

విమర్శ ఎందుకు కావాలి?

కవిత్వం స్వభావసిద్ధంగా కొంత క్లిష్టంగా ఉంటుంది. మామూలు భాష వేరు, కవిత్వ భాష వేరు. కవిత్వ వ్యాకరణమూ వేరు. కనుక, కవిత్వం పాఠకుడి నుండి మరింత ప్రయత్నాన్ని కోరుతుంది. మనకు ఎప్పటికప్పుడు కవిత్వంలో కొత్త ఉద్యమాలు కనపడుతూ ఉంటాయి. సామాజిక, రాజకీయ ధోరణులు ఆయా కాలాల కవిత్వాలను ప్రభావితం చేస్తాయి. ఫలితంగా భావానికి సంబంధించో, అభివ్యక్తి మార్గానికి సంబంధించో, అనివార్యమైన మార్పులు పుట్టుకొస్తాయి. కవి ఏ ప్రభావంతో వ్రాసినా, సృజన సంపూర్ణత్వాన్ని పొందేది పాఠకుణ్ణి చేరిన తర్వాతే. పాఠకుడికి అదెలా చేరిందన్న దాని మీదే రచన విలువ నిర్ణయింపబడుతుంది.
రచయిత స్వరం సూటిగా లేని సందర్భాల్లో, ఆ రచన మనం నమ్మే భావజాలాన్నెక్కడో సమర్థిస్తోందన్న ఊహతో పఠనం కొనసాగిస్తాం. కొత్త మార్పులను అవగాహన చేసుకోకుండా, మనం మునుపు చదివిన ధోరణిలోనే చదువుకుపోతుంటాం. అంటే, రచన పరిధిని మనం మన పరిమితుల మేరకు కుదిస్తున్నాం. దానికి లేని లక్షణాలేవో ఆపాదించే ప్రయత్నం చేస్తున్నాం. ఇలా చేసే ప్రక్రియలో, మనం కొన్నిసార్లు రచన విలువను పెంచుతూండవచ్చు, కొన్నిసార్లు తగ్గించనూ వచ్చు. అంటే రచనలో లేనిది మనం చూసుకుంటున్నాం, ఉన్నదని ఊహించుకుంటున్నాం. సాహిత్యం యొక్క లక్షణం సువ్యాప్తమవడం కనుక, పాఠకులను ఈ ఊహల్లో నుండి మెలకువలోకి తోసేందుకు విమర్శ కావాలి. రచన ఉద్దేశ్యాన్ని విప్పి చెప్పడం రచయిత బాధ్యత కాదు కాబట్టి, ఈ నూతన అభివ్యక్తి మార్గాల ఒరవడిలో పాఠకులు కొట్టుకుపోతున్నప్పుడు, వీరిద్దరి మధ్యా ఒక వారధిని నిర్మించే పనికి పూనుకునేవారు విమర్శకులు. వీళ్లు, ఒకేసారి పాఠక హృదయాన్ని, కవి హృదయాన్ని తమలో నింపుకుని, ఈ ఇద్దరి మధ్యా బంధాన్ని బలీయం చేస్తారు. ఇజాలకు ఆవల నిలబడి, కవిత్వాన్ని శాస్త్రీయంగానూ సహృదయతతోనూ పరిశీలించి, దానిని పాఠకులకు తేలిగ్గా చేరవేసే ప్రయత్నం చేస్తారు. కవిత్వమే లేని ప్రేలాపనల్ని సాహిత్యంలో కలవకుండా అడ్డుకుంటారు.
ఒక సంపుటిలోని కవితలను పేరు పేరునా పేర్కొంటూ, వాటిలోని పంక్తులనే వచనంగా తిప్పి రాయడం, కేవలం ఆ మాటల గురించే మాట్లాడటం పరిచయమే అవుతుంది తప్ప విమర్శ కాదు. ఏ విధమైన వ్యాఖ్యానము, సమర్థన లేకుండా ఒక కవిత్వ సంపుటి తమకు నచ్చిందనో, నచ్చలేదనో చెప్పడం వ్యక్తిగత అభిప్రాయమే అవుతుంది తప్ప, విమర్శ కాదు. ఇలాంటి వ్రాతల వల్ల పాఠకులకుగానీ కవులకుగానీ సాహిత్యానికిగానీ ఏ విధమైన లాభమూ ఉండదు. విమర్శ అన్నది కవిత్వధోరణి పట్ల జరగాలి. ఆ కవిత్వం విడుదలైన స్థలకాలాలతో సహా, ఆ కవిత్వం మొత్తం సాహిత్యంలో ఎక్కడ నిలబడి ఉన్నదో, ఆ ధోరణితో మనకున్న ప్రాచీన, సమకాలీన కవిత్వం ఎటువంటిదో, వాటన్నింటి మధ్యా ఈ కవిత్వం ఎలా, ఎందుకు భిన్నమైనదో గుణదోషాలతో సహా నిష్పక్షపాతంగా చర్చించేందుకూ, కవిత్వ ఉద్దేశ్యం సామాజికమో, రాజకీయమో, వ్యక్తిగతమో, మానసికోల్లాసమో గమనించి, ఒక కళారూపంగా దాని ప్రత్యేకత ఏమిటో విడమరచి చెప్పేందుకూ విమర్శ కావాలి.
కవిత్వంలో కొన్నిసార్లు కొట్టొచ్చినట్టుగా కనపడే శబ్ద సౌందర్యము, లయ, భావుకత వంటివి పాఠకులను తేలిగ్గా, ఊపిరి తీసుకున్నంత సహజంగా, తమ తమ లోకాల్లోకి లాక్కొనిపోతాయి. ఇందుకు భిన్నంగా, కొన్ని రచనారీతులను మనం ఆస్వాదించడానికి, అభినందించడానికి, కొంత పరిశ్రమ అవసరం. ఉదాహరణకి మనమొక గంట శబ్దం విన్నామనుకుందాం, వినగానే గంట శబ్దమని గుర్తుపట్టగల జ్ఞానం మనలో చాలామందికి ఉండవచ్చు. ఆ గంట వీధిలో వెళుతోన్న బండిదా, గుడి గంటా, బడి గంటా, అని గుర్తు పట్టగల వివేచన మాత్రం అన్ని వయసులవారికీ వర్గాలవారికీ ఉండకపోవచ్చు. ఇది వయసును బట్టీ అనుభవాన్ని బట్టీ కలిగే మెలకువ. ఆలయంలో గంట ఓ సత్సంప్రదాయానికి చెందినదనీ, అక్కడ సభక్తితో మెలగాలనీ; ఆంబులెన్స్‌ ఒక ఆందోళనాపూరిత వాతావరణ స్పృహ కలిగిస్తుందనీ, ఈ వివేచనే మనకు చెబుతుంది. ఇతరత్రా సంగీత పరికరాలేవో కాకుండా, ఇక్కడ ప్రత్యేకించి గంటనే ఎందుకు వాడుతున్నారన్నది, ఇదే దారిలో ఎదురయ్యే మరుసటి ప్రశ్న. (ఇది నేను ముందు ప్రస్తావించిన నిర్మాణ కౌశలంలో భాగం.) అప్పుడప్పుడే శబ్దాలనూ వస్తువులనూ గుర్తుపడుతున్న పసివాడికి ఇవన్నీ తెలుస్తాయని అనుకోలేం. ఆ అనుభవమున్న పెద్దలెవరో సందర్భానుసారం ఇవన్నీ విడమరచి చెప్పాలి. నేర్పించాలి. అప్పుడే ఆ ఉద్వేగాలన్నీ సరిగ్గా పరిచయం చేసినవారమవుతాం. వాళ్లలోని సున్నితత్వాన్ని మేల్కొల్పినవారమవుతాం. జాగ్రత్తగా గమనిస్తే, విమర్శకుల పని ఒక స్థాయిలో దీనినే పోలి ఉంటుంది. అందుకే, విస్తృతంగా చదివే విమర్శకులకి సహజంగానే కొన్ని సౌలభ్యాలుంటాయి. వారి పదసంపద బాగుంటుంది. ఏ సందర్భంలో ఏ పదం ఏ అర్థాన్నిస్తుందన్న వివేకం సామాన్య పాఠకులని మించి ఉంటుంది. కనుక కొత్త రచనను చదివినప్పుడు, దాని ప్రత్యేకతను తేలిగ్గా గుర్తుపడతారు. తమ విమర్శ ద్వారా సమకాలీన సాహిత్యంలో ఆ రచన ఎలా రాణిస్తుందో, ఎందుకు రాణిస్తుందో సూటిగా, స్పష్టంగా చెప్పగల్గుతారు. సాహిత్యం యొక్క ఆకాంక్ష మన లోపలి లోకమొకటి విశాలం కావడం, ఆత్మవికాసం, జీవితం పట్ల మనకి మెరుగైన అవగాహన కల్పించడం, మరింత సమర్థవంతంగా జీవితాన్ని అభినందించే మార్గాన్ని చూపడం అనుకుంటే, విమర్శకులు తమ విమర్శ ద్వారా మన ఎదుటనున్న సాహిత్యం దానికెలా దోహదం చేస్తుందో చెబుతారు.

సోదాహరణంగా కవిత్వ విమర్శ

“మాటలన్నీ అయిపోయాక, కలిసి నిద్రలేవడం గురించే చివరగా ఇంకోసారి చెప్పుకుంటాం. మన దేహాల్ని మనమే దూరంగా చూస్తూ మేల్కొనే కల వచ్చిన విషయం మాత్రం దాచేస్తాం. అదే కలలో ఒక ఆకుపచ్చ దుప్పటి మట్టి వేర్లతో మనమీద పరచుకోవడం చూసి ఇష్టంగా నవ్వుకుంటాం. పచ్చికపై రాలే పూల శబ్దాల కింద ఆదమరచి నిద్రపోతాం. ఇక అప్పుడు మనం కలిసే ఉంటాం.” (కవి: బండ్లమూడి స్వాతికుమారి, సంపుటి: ఆవిరి, పు: 63.)
ఇప్పుడు ఎవరైనా- ఆ రచన ఆసాంతమూ చదవనివాళ్లు, ఈ మట్టివేర్లతో ఓ ఆకుపచ్చ దుప్పటి మీద కప్పుకోవడమన్న భావన ఆహ్లాదంగా ఉందనీ, ఇది సౌందర్యమనీ అనుకోవడం కద్దు. సమర్థులైన విమర్శకులు ఇలాంటి వ్యాఖ్యానాన్ని అందించడంతోనో, లేదా దీన్ని ఖండించడంతోనో ఆగిపోరు. ఇక్కడ కవి ఒక సమాధిస్థితిని చెబుతున్నారనీ, తన ప్రియుడు/ ప్రియురాలితో కలిసి మరణించి, తమ శవాలను చూస్తూ తాము కలిసి లేవడం గురించి మాట్లాడుతున్నారనీ, వాళ్ల శవాలు భూస్థాపితం అయ్యాకా, తిరిగి అక్కడ మొలిచే గడ్డి గురించీ, అక్కడి పూలచెట్టు మీద నుండి రాలిపడ్డ పువ్వుల గురించీ మాట్లాడుతున్నారనీ తెలియజేస్తారు. ఇది ప్రాథమికమైన విశ్లేషణ. అంటే, మొదటి చూపులో మనకు ఆహ్లాదంగా కనపడ్డ కల, కలిసి నిదురలేవడం, మట్టివేర్లతో పరచుకున్న ఆకుపచ్చ దుప్పటి, స్వేచ్ఛగా రాలే పూలు– వీటన్నింటినీ అపారమైన దుఃఖాన్ని ప్రకటించడానికే కవి వాడారని మనకు తెలిసిపోయింది. అంటే, కొన్ని పదాలను, వాటి సాధారణ అర్థాలతోనే వాడుతూ కూడా, వాటి కలయిక ద్వారా, అవి సాధారణంగా అందించే ఉద్వేగాలకు పూర్తిగా భిన్నమైన అనుభూతిని కలిగించే ప్రయత్నం చేసింది కవయిత్రి. ఇది, ఇందులో మొదటగా తోచే ప్రత్యేకత.
ఇలా అత్యంత సుకుమారమైన పదాలతోనే అత్యంత వేదనాభరిత కవిత్వం రాసిన కవులు, మన ఆధునిక తెలుగు సాహిత్యంలోనూ ఉన్నారు. కృష్ణశాస్త్రి[2] మనకు చప్పున గుర్తొచ్చే పేరు. అయితే, ఈ కవితలో కనపడుతున్నది విషాదమూ, దిగులూ కూడా! ఈ రెండూ భిన్నమైనవి. దిగులే తొట్టతొలి మాటగా కవిత్వం రాసిన రేవతీదేవి[3], శివలెంక రాజేశ్వరీదేవి[4] మొదలైనవారి కవిత్వం వాళ్ల వాళ్ల ఒంటరితనాలతో ముడిపడి, లోకంలో మరెవ్వరూ అక్కర్లేదన్న నిరాశను ఒకరి గొంతులోనూ, అందరూ హృదయం ఒంపి మాట్లాడితే బాగుండన్న ఆశను మరొకరి గొంతులోనూ వినిపించింది. కానీ, పైన ఉదహరించిన కవిత్వంలోని దిగులు వీటికి భిన్నమైనది. ఇక్కడ, కవి గొంతులో ధ్వని ఆశ. నిరూపణమవుతున్నది మాత్రం నిరాశ. ఇది ఒంటరితనంతో, ప్రేమరాహిత్యంతో నిలువునా కుంగిపోయిన మనసు కథ. ఈ మనసు కోరుకుంటున్నది విముక్తి, శాశ్వతమైన విశ్రాంతి. ఈ విముక్తిలోనే శాంతి దొరుకుతుందని కవి భావన కనుక, అక్కడ ధ్వని ఆశగా మనకు వినపడుతోంది. నిజానికి, ధ్వనిపరంగా ప్రతీ కవిత మనకు ఎంతో కొంత చెబుతుంది.
కొన్ని కవితలు, కేవలం శబ్దచాతుర్యంతోనే మనను కొత్త ఆవరణలోకి తీసుకుపోతాయి. నన్నయ్య నలదమయంతుల దీర్ఘ విరహాన్ని చెప్పిన ‘సలిపిరి దీర్ఘవాసర నిశల్‌ విలసన్నవ నందనంబులన్‌'[5] మొదలుకుని, తిలక్‌ ‘జలజల మని కురిసింది వాన’, పోతనామాత్యుల ‘లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలం బయ్యె…’ వరకూ, శబ్ద ప్రధానమైన కవితలకు మనకెన్నో ఉదాహరణలున్నాయి. వీటిలోని కవితా సౌందర్యమంతా ఈ కవితలు నిర్మింపబడ్డ పదాలు అందించే సంవేదనాత్మక ధ్వనులూ, అవి వ్యక్తం చేసే రూపాల్లోనే ఉందని చెప్పవచ్చు. ఆధునిక కవుల్లో కొందరు, కవిత్వంలో నాదాన్ని, అంత్యప్రాసలనూ కూడా కాదని, కవిత నైరూప్యంగానే ఉండాలనీ, దాని సౌందర్యమంతా అది అందించే భావంతోనే తెలియాలనీ పట్టుబట్టారు. అంటే, అక్కడ భావానికే పెద్దపీట. ఇప్పుడీ నేపథ్యంలో మనం చర్చిస్తున్న కవితను చూస్తే, ఇది ఏ కోవకు చెందిందో స్పష్టంగా చెప్పడం అంత తేలిక కాదు. వాక్యం వెనుక వాక్యం హాయిగా ముగిసే తీరు, సౌమ్యమైన పదాల పోహణింపు ఇది ఒక సౌందర్యాత్మకమైన కవితేనన్న భావన కలిగించినా, కవి పాఠకుడికి చెప్పాలనుకున్న భావం ఆ వాతావరణానికి పూర్తిగా ఆవలి దిక్కున ఉండి, ఒక చేదు అనుభూతినీ బాధనూ మిగుల్చుతోంది. ఇలా ఒకేసారి రెండు భిన్నమైన అనుభవాలను కలిగించడం ద్వారా, ఈ కవిత పాఠకుడిని మలి పఠనాలకు ప్రేరేపిస్తోంది. ఇది, ఈ కవితలోని మరో ప్రత్యేకత.
భావపరంగా, మనకు కొన్ని ఉర్దూ కవితలతో సామ్యం కనపడుతుంది. బాధ ఉంటుందని తెలిసీ కోరుకోవడం, విడిపోవడానికే అయినా కలుసుకోవడం- ఈ విరహం, ఈ ఎదురుచూపు మనకు కొన్ని ఉర్దూ గీతాల్లో కనపడుతుంది.
“एक उम्र से हूँ लज़्ज़त-ए-गिरिया से भी महरूम
ऐ राहत-ए-जाँ मुझ को रुलाने के लिए आ”
విరహవేదన అనుభవించి కూడా చాలా కాలమయింది /ప్రియా, మళ్లీ నన్ను ఏడిపించడానికే ఐనా, రా!— అన్న అహ్మద్‌ ఫరాజ్‌ గజల్‌ ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
“My grave will be in a place where every spring the northern winds will shower blossoms.”
వసంత ఋతువుల్లో ఉత్తరగాలులు జల్లే పూవులన్నీ రాలే చోట, నా సమాధి ఉంటుంది[8] అన్న ఉమర్‌ ఖయ్యాం మాటలు అప్రయత్నంగా గుర్తురావడంలో కూడా ఆశ్చర్యమేమీ లేదు. ఇవి ఈ కవిత మనకు పరిచయం చేస్తోన్న కొత్త ప్రపంచం తాలూకు కిటికీలు. (page IX, Introduction; The Nectar of Grace, Omar khayyam’s life and works, by Swami Govinda Tirtha)
అలాగే, ఈ ఆవిరి సంపుటిలో ‘అనుకోకుండా’ సింహభాగం. ఇదే శీర్షిక కింద దాదాపు తొమ్మిది భాగాలు ప్రచురించారు కవి. అంటే, ఈ తొమ్మిదిటినీ కలిపే అంతస్సూత్రమేదో ఉందని అర్థం. ఆ అంతస్సూత్రపు లక్షణాలు మనం పైన చెప్పుకున్న ఒంటరితనం, ప్రేమరాహిత్యం లేదా వైఫల్యం, వేదన, నిరాశ ఇత్యాదులు. ‘అనుకోకుండా’కూ, మిగిలిన వాటికీ శిల్పపరంగా పరిణతి కనపడుతుంది. రచన బట్టి, శిల్పం దానంతటదే రూపుమార్చుకోవడం ఇక్కడ కనపడుతుంది. అత్యంత వైయక్తికమైన కవిత్వం కనుక, అసంబద్ధత అక్కడక్కడా ఇబ్బంది పెడుతుంది. ఒకే శీర్షికలో సాగుతున్నప్పుడు, ఇవి భాగాలుగా ఊహిస్తూ చదువుతున్నప్పుడు, స్వరం మారినప్పుడల్లా ఆ ఇబ్బంది పాఠకులకు తెలుస్తూనే ఉంటుంది. ఉదాహరణకు, ఇవి ఎక్కువ భాగం స్వగతంగానూ, లేదంటే, కేవలం ఆ పాత్ర మాట్లాడదలచిన మరొక్కరితోనూ ముడిపడి ఉన్న సంభాషణలు. ఐతే, జాగ్రత్తగా గమనించినప్పుడు, అక్కడక్కడా మనకో మూడో పాత్ర కూడా కనపడుతుంది. కొన్నిసార్లు ఒకే భాగం రెండు విభాగాలుగా కూడా సాగి, ఒక భాగంలో సంభాషణ, రెండవ భాగంలో స్వగతం కనపడుతుంది. అయితే, మొదటి సంభాషణలో ఉన్న పాత్ర, రెండవ భాగంలో కవి స్వగతంలో ఉద్దేశిస్తున్న పాత్ర ఒకటి కాదు. దీనికి సంబంధించి స్పష్టమైన ఆధారాలేవీ వదల్లేదు కనుక, రెండు భాగాల మధ్యా ప్రయాణం అంత సాఫీగా జరగక పాఠకుడికి అసహనాన్ని కలిగిస్తుంది. అలాగే, ప్రతీకలు తేలిగ్గా అందక ఇబ్బంది పెడతాయి. ఉదాహరణకి, ‘మునిగిపోయిన గులక రాయొకటి ఈదుకుంటూ ఒడ్డు చేరినప్పుడు ఉలికిపడకుండా, ఎవరూ చూడకుండా దాన్ని నీ చేతిలో పెట్టి దోసిలి మూసిన గుర్తు. ఇది తీసుకు వెళ్లిపొమ్మని చెయ్యి వదిలినప్పుడు, పదే పదే అదేపనిగా వేళ్లని ముద్దాడాలని గుర్తుకు రాకపోవడమూ గుర్తే.’ అన్న వాక్యంలో మునిగిపోయిన గులకరాయి దేనికి ప్రతీకగా వాడారో తెలుసుకునే అవకాశమేదీ కవితలో కనపడదు. ఈ అస్పష్టతే ఈ కవిత్వాన్ని అందరికీ చేరువ కాకుండా అడ్డుకుంది.
ఇలా, పైన ప్రస్తావించిన వివరాల బట్టి మనకు పొరలుపొరలుగా ఈ కవిత ప్రత్యేకతలు, ఈ కవితతో మిగతా కవిత్వానికి ఉన్న సారూప్యాలు, భేదాలు తెలుస్తున్నాయి. కొంత వివరణ ద్వారా, ఈ కవితను ముందుకన్నా ఎక్కువగా అభినందించగల్గుతున్నాం. విమర్శకులు వదిలిన కొన్ని ఆధారాల ద్వారా, మిగతా భాషల కవిత్వాన్నీ వెదికి చదివే ప్రయత్నం చేస్తున్నాం. ఆ కొత్త కవిత్వం తెరిచిన కిటికీలతో మనం మరో కొత్త ప్రపంచాన్ని చూడటానికి ఉద్యుక్తులమవుతున్నాం. కొత్త రచయితల గురించి కొత్త విశేషాలు తెలుసుకుంటున్నాం. క్లుప్తంగా చెప్పాలంటే, ఈ కవిత్వం పట్లా ఈ తరహా సాహిత్యం పట్లా కవుల పట్లా మనకున్న అవగాహనను పెంచే ప్రయత్నం చేస్తోందీ విమర్శ. ఆవేశంలోనో, అనాలోచితంగానో కవి చేసిన తప్పులను ప్రస్తావించడం ద్వారా, కవి తన మలి రచనల్లో మరింత జాగ్రత్తపడేలానూ చేస్తోంది. తద్వారా, భాష మరింత మెరుగైన సాహిత్యసృజనతో అలరారేందుకు కూడా పరోక్షంగా తోడ్పడుతోంది.
విమర్శ అంటే వీలైనంత వివరంగా రచనను చర్చించడం అనుకున్నాం. రచన అద్దాల మండపం మధ్యలో ఉందని భావించి, వీలైనన్ని ప్రత్యేకమైన కోణాల్లో దర్శింపజేసి, ఆ రచన ప్రత్యేకతనూ పూర్ణత్వాన్నీ స్పష్టంగా చూపించడం విమర్శకుల ధర్మం. అయితే, ఈ క్రమంలో లేని అర్థాలను ప్రతిపాదించడం విమర్శ లక్షణం కాబోదు. రచన ఉద్దేశించని అర్థాలను చూపించడం విమర్శ పని కాదు. విడిగా కొన్ని భాగాలు మనకు కొత్త అర్థాలను ప్రతిపాదించినట్టు అనిపించినా, ఒక రచనగా అది ఏమి చెబుతోందన్నదే విమర్శకుల ఆసక్తి కావాలి. అలా వివరించే క్రమంలో, విమర్శకులు తమ అభిప్రాయం జనబాహుళ్యంలో అప్పటికే ప్రచారంలో ఉన్న అభిప్రాయానికి భిన్నమైనదైనా సరే, ప్రతిపాదించడానికి కూడా వెనుకాడకూడదు. యెఱిగించరే పతికి యీ సుద్దులెల్లాను[11] అన్న అన్నమయ్య కృతికి ప్రతిపాదించబడిన విమర్శ ఇందుకు శ్రేష్టమైన ఉదాహరణ. కనుక ఎన్ని కోణాలున్నాయో అన్నీ చెప్పడం, లేని ఉద్దేశ్యాలేవీ రచనకు ఆపాదించకపోవడం, రెండూ విమర్శకుల కర్తవ్యాలే. ఇవి ఒకదానికొకటి భిన్నంగా కనిపించినా, నిజానికి ఈ వాక్యం సృజనను సృజన పరిధి, సందర్భాలననుసరించే చూడాలన్న మన మొదటి మాటలకు పొడిగింపు.

ప్రస్తుత తెలుగు సాహిత్య విమర్శ స్థితి, మెరుగుపరిచే మార్గాలు

ఇప్పుడు మనకున్న విమర్శ, సాహిత్యాన్ని బట్టి కాక వ్యక్తుల బట్టి ఉండటం విచారకరం. ఒక్కో కవిత్వానికి ఒక్కో ముద్ర వేసి, ఆ ఇజాన్ని భుజాల మీద వేసుకు మోసేవారే ఈ కవిత్వాన్నీ మోయడం, లేదంటే కాదనుకోవడం ఇప్పుడు కనపడుతున్న ప్రమాదకర ధోరణులు. సామాజిక సమస్యల మీద చూపు సారించని సంపుటులను స్వాప్నిక జగత్తుల్లో కవి చేసిన ఆషామాషీ విహారంగా భావించి చిన్నచూపు చూడటమూ; ప్రతీ సమస్యకూ ప్రశ్నగానో, పరిష్కరణగానో, లేదా బాధగానో కవిత్వాన్నే చూపించడమూ రెండూ ప్రబల ధోరణులై, విమర్శకులను కూడా ఏదో ఒక వైపు వచ్చి నిలబడాల్సిందిగా శాసించడం; విమర్శకులూ ఆ తరహాగానే చీలిపోవడం ప్రస్పుటంగా కనపడుతోంది. మనం కవిత్వాన్ని కాక, కవులను చూడటం మొదలెట్టినప్పుడే, కవిత్వంలోని అందాన్ని కాక, అది వినబరిచే ఉద్యమం వైపు మొగ్గు చూపినప్పుడే, విమర్శ పేలవమైపోతుంది. కవిత్వం ఏమైనా చెప్పనివ్వండి, ఏ భావజాలాన్నైనా మోయనివ్వండి, ముందది కవిత్వం అయి తీరాలన్న నిరంకుశ ప్రతిపాదనే మన విమర్శకులు చెయ్యవలసినది. విమర్శకు బదులుగా, అభిప్రాయాలు, సమీక్షలు అన్న పదాలు వాడటం, వాటినే విమర్శగా చలామణీ చేయటం, పత్రికల్లో వీటన్నింటికీ చోటివ్వడంవల్ల, గుణదోషాల చర్చ అన్నది మటుమాయమైపోయింది. అభిప్రాయాలు, సమీక్షలు కేవలం కవిత్వంలోని గొప్పదనాన్నే కీర్తించడం పనిగా పెట్టుకోవడం వల్లనూ, వ్యక్తులతోనో, సమష్టి శక్తులతోనో శతృత్వమెందుకన్న నేటి సమీక్షకుల అతి మంచితనమూ లేదా జాగ్రత్త వల్లనూ, ‘తప్పు లెన్నువాడు తన తప్పులెరుగడు’ అన్న పాఠకుల ఎదురుదాడుల వల్లనూ, ఎక్కడైనా ఏదైనా యథేచ్ఛగా ప్రచురించగల్గిన నేటి ప్రచురణాపద్ధతుల వల్లనూ, ప్రశ్నించి, మాటమాటకూ రచయితను జవాబుదారీ చేసి, నిజాలు, నిరూపణలు లేకుండా ఆరోపణ చెయ్యనివ్వని సమర్థవంతమైన ఎడిటర్లు అటు ప్రింట్‌ మాధ్యమంలోకానీ ఇటు వెబ్‌ పత్రికల్లోకానీ లేకపోవడంవల్లనూ, విమర్శ నానాటికీ నాసిరకంగా తయారవుతోందన్నది కాదనలేని సత్యం. అభిప్రాయాలను వెలువరించే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ అన్ని వేళలా ఉంటుందన్న నెపంతో, విపరీత వ్యాఖ్యానం చేయడమెన్నటికీ సద్విమర్శ కాబోదు.
విమర్శ ‘సీరియస్‌ సాహిత్యం’గా పరిగణింపబడాల్సిన అవసరం ఎంతో ఉన్న ఈ కాలంలో, దానిని సగటు పాఠకుడు చదవలేని, చదవాలనుకోని శీర్షికగా గుర్తిస్తున్నారు కొందరు సంపాదకులు. స్వాతి, నవ్య, ఆంధ్రజ్యోతి, ప్రభ– ఇలా తెలుగు పత్రికలు వేటిలోనూ సాహిత్యవిమర్శకు అరపేజీ చోటు కూడా లేదు. దినపత్రికల్లో సాహిత్య పుటల్లో అప్పుడప్పుడూ విమర్శ కనపడినా, ఆ విమర్శకు ప్రతి విమర్శ జరగే వీలున్న సందర్భాల్లోనూ, సమర్థత కలిగిన విమర్శకులు కూడా, ఉత్తరప్రత్యుత్తర వ్యవహారాలకి జడిసి, సామాజిక మాధ్యమాల్లో స్పందన తెలియజేసి ఊరుకుంటున్నారు. పత్రికా ముఖంగా విమర్శను ఖండించడమన్నది చాలా అరుదుగా కనపడుతోంది. ప్రింట్‌ పత్రికలు సైతం, నిర్ణీత వ్యవధిలో మరుసటి సంచిక ప్రచురించాలి గనుక, ముందే ఎంపిక చేసుకున్న రచనలతో పత్రిక విడుదల చేసేస్తున్నారు. వీలువెంబడి పత్రిక ప్రతి విమర్శ ప్రచురించేసరికి, జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. కేటాయించేందుకు తగిన స్థలము, సమయము, లేదా సాంకేతిక వనరుల లేకపోవడాన్ని ఆయా సందర్భాల్లో కారణాలుగా వింటున్నాం. నిడివితో నిమిత్తం లేకుండా, రచయితలకు వ్యాస విస్తరణలో స్వేచ్ఛనిచ్చే పాలపిట్ట వంటి పూర్తి స్థాయి సాహిత్యపత్రికలను ఆర్థిక వనరులు సరిపోక నెలకూ, రెణ్ణెల్లకూ, కుదరనప్పుడు మూడు నెలలకూ పత్రిక ప్రచురిస్తున్నారు. ఇలాంటి పత్రికల ద్వారా సాహిత్యానికి దగ్గరవుదామనుకున్న వాళ్లు, వీటి ప్రచురణలోని నిబద్ధతను ప్రశ్నిస్తూ, చందాలను నిలిపి వేస్తున్నారు. దీనివల్ల పరిస్థితి మరింత విషమిస్తోందే తప్ప మెరుగవ్వడం లేదు. ఇలా, మనకున్న అతి కొద్ది సాహిత్య పత్రికలు కూడా వనరుల లోపం వల్ల మూతబడిపోతున్నాయి. సాహిత్యాన్నే బతికించుకోలేని సమాజం, విమర్శ వైపుకి చూపు సారించలేదు.
అరచేతిలో ఇమిడే ప్రపంచాన్ని అ ఆ ఇ ఈ లు నేర్చిన వారెవ్వరూ వదలాలనుకోని ఈ అంతర్జాలపు రోజుల్లో, మనకు మిగిలున్నది, ఆశ కలిగించగలిగినదీ, ఆశ నిలపగలిగేదీ వెబ్‌ పత్రికలే. సాంకేతిక సహకారం, నిర్వహణావ్యయం హామీగా దొరికితే, ఇవి అందరికీ అన్నివేళలా అందుబాటులో ఉంటాయి. మనకు కావలసినదల్లా నిబద్ధత కలిగిన రచయితలు, రచయితలను స్వలాభం కోసం ఏమార్చని ఎడిటర్లూ. విమర్శ ఎక్కడ దూషణగా మారుతోందో, అక్కడ దాని ప్రచురణ నిల్చిపోవాలి. వేన్నోళ్ల పొగిడినా, వేలెత్తి చూపినా, విమర్శ సాధికారంగా అందుకు తగ్గ కారణాలను ప్రకటించి, వివరించి నిరూపించాలని నియమం పెడితే విమర్శకు విలువ పెరుగుతుంది. విమర్శ, విమర్శకుని అసందర్భ పరిజ్ఞాన ప్రదర్శనకుగాక రచన ప్రత్యేకతను వివరించడమే లక్ష్యంగా సాగాలి. ఏ ప్రత్యేకత, ప్రయోగాత్మకత లేని రచనలు కూడా కొన్నిసార్లు బహుళ ప్రాచుర్యాన్ని పొందడం చూస్తూనే ఉంటాం, ఆయా విజయాలకు కారణాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించకుండా, పాఠకుల విజ్ఞతను ప్రశ్నిస్తూ, పాఠక హృదయాలను గేలిచెయ్యడమూ, రచయిత అసమర్థతను అవహేళన చేయడమూ మాత్రమే ప్రధానోద్దేశ్యంగా విమర్శ సాగకూడదు. విమర్శకు శాస్త్రీయత, సహృదయత ప్రమాణంగా ఉండేలా చూడాలి. సంయమనం కోల్పోయిన విమర్శలను సంపాదకులు గుర్తించి తిరస్కరించాలి. అలాగే, విమర్శ కరినంగా ఉన్న ప్రతిసారీ, వ్యక్తిగత దాడులకు పాల్బడే ఆయా రచయితలనుగానీ, వారి అభిమానులనుగానీ, వారికి మద్దతుగా నిలిచే మరే ఇతర సమూహాలనైనా సరే, నిర్ద్వంద్వంగా చర్చకు ఆవల నిలబెట్టే హక్కును పత్రికలు నిలుపుకోవాలి.
చర్చకూ ప్రశ్నించడానికీ వాదోపవాదాలకూ అవసరమైన వేదికనూ సమయాన్నీ అందరికీ ఇస్తూనే, పరిధి దాటిన వ్యాఖ్యలను నిలిపివేసే బాధ్యతను వారే తీసుకోవాలి. ఇలా చెయ్యడం ద్వారా, సాహిత్య చర్చలు వీధి చివరి కుళాయి వాదనలు కాదనీ, వాటిని బాధ్యతగా, జాగ్రత్తగా నడపాల్సిన అవసరం ఉందనీ తేల్చిచెప్పినవారమవుతాం; ఇక్కడ ఎవ్వరి గౌరవానికీ ఏ రకమైన హానీ ఉండదన్న హామీని కల్గించినవాళ్లమవుతాం. మాట్లాడటం హక్కే కాదు, బాధ్యత కూడా అనుకున్నప్పుడు, మంచి చర్చ జరుగుతుంది. మంచి చర్చల నుండే మంచి విమర్శా పుడుతుంది. విమర్శకు ప్రతివిమర్శ జరిగినప్పుడు, దానికి సాధ్యమైనంతవరకూ అదే పత్రికలో, లేదా అదే చర్చావేదికలో స్థానం కల్గించడం మంచిది. పాఠకులకు భిన్న స్వరాలను నిష్పక్షపాతంగా వినిపించేందుకు, తాము ఏ వైపుకూ మొగ్గకుండా నిలబడతామన్న నైతిక ప్రమాణానికి పత్రికలు అన్ని వేళలా లోబడి ఉండాలి. అధికారం చేతుల్లో ఉన్నవాళ్లు, తమవాళ్లకో, తమ భావజాలానికో వత్తాసు పలుకుతున్నారని, కొందరికి సభల్లోనూ పత్రికల్లోనూ పెద్దపీట వేసి, వాటిపై రానున్న విమర్శకు ఆయాచోట్ల స్థానాన్నీ సమయాన్నీ మిగల్చకపోవడం, సాహిత్యం పట్ల చేస్తున్న నేరమేనని విజ్ఞులైన పాఠకులు తెలుసుకుని ఆ రాజకీయాలను దూరం పెట్టాలి.
సాహిత్యం ఏ వాతావరణంలోనైనా, ఎవ్వరి చేతుల్లోనైనా ప్రాణం పోసుకోగలదు. దానికా అవకాశం ఉంది. కానీ, ఉత్తమసాహిత్యమేదో గుర్తించడం, దానినే ప్రోత్సహించడం కళను నిలబెట్టే దారులు. ఆ పని చెయ్యగలిగింది, విమర్శ ఒక్కటే. దాని నడక ఎటు మళ్లుతోందో వేయికళ్లదో గమనించాల్సిన బాధ్యత సాహిత్యంతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ముడిపడ్డ ప్రతి ఒక్కరిదీ.
వ్యాసరచనకు సహకరించిన పుస్తకాలు, ఇతర వివరాలు:
  1. Pingali Surana, Translated by Velcheru Narayana Rao and David Shulman, The Sound of the Kiss, or the Story That Must Never Be Told, Columbia University Press, 2002, Introduction.
  2. కృష్ణశాస్త్రి సాహిత్యము, కృష్ణపక్షము, విశాలంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, డిసెంబరు, 2008.
  3. రేవతీదేవి, శిలాలోలిత, ప్రియబాంధవి ప్రచురణలు, 1981.
  4. శివలెంక రాజేశ్వరీదేవి, సత్యం వద్దు, స్వప్నమే కావాలి, ప్రేమలేఖ ప్రచురణలు, 2016.
  5. నన్నయ్య, కవిత్రయ విరచిత శ్రీమదాంధ్రమహాభారతము, అరణ్య పర్వము, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి ప్రచురణ, 2008, పు: 176.
  6. దేవరకొండ బాలగంగాధర తిలక్‌, అమృతం కురిసిన రాత్రి, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, 1968, పు: 9.
  7. బమ్మెర పోతన, భాగవతవము, ఎనిమిదవ స్కంధము, గజేంద్రమోక్షము- పు:176, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి ప్రచురణ, 2010.
  8. అహ్మద్‌ ఫరాజ్‌ గజల్‌ : రంజిష్‌ హీ సహీ.
  9. Swami Govinda Thirtha, “Nectar Of Grace Omar Khayyam’s Life And Works”, Government Central Press, Hyd, 1941, Introduction- LIV, LV.
  10. స్వాతికుమారి బండ్లమూడి, ఆవిరి, జె.వి. పబ్లికేషన్స్‌, 2015, పు: 57.
  11. God on the Hill: Temple Poems from Tirupati, Annamayya (Author), Velcheru Narayana Rao (Translator), David Shulman (Translator), ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌, 2005, SCP 419, 12:63.
 
*తొలి ప్రచురణ : డెట్రాయిట్ సాహిత్య విమర్శ వ్యాసాల సంపుటిలో

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...