గులకరాళ్ళు

చెరువులోని చేపలన్నీ పట్టి
ఆకాశం వైపుకు వల విసిరినట్టు
పక్షుల గుంపులు.
నా గుండె ఎక్కడ చిక్కుకుందో-
వెనక్కిలాగే లోపే వల పైపైకిపోయింది
*
ఒకే చెట్టుకు పూసిన పూలు
ఒకదానికి తెలీకుండా ఒకటి
ఒంగి ఒంగి కొలనులోకి చూసుకుంటున్నాయి
రాకుమారుడెటు నుండి వస్తాడో
రహస్యం చెప్పడం కోసం
నీళ్ళన్నీ ఒడ్డును వెదుక్కుంటూ వచ్చాయి
*
నల్లటి బాతులు రెండు,
నా కళ్ళను తోడు పిలుచుకుని
జంటగా ఈదుకుంటూ పోతున్నాయి
నీడ ఒక్కటే, నీటి మీద వదిలిన
దారి ఒక్కటే.
ఒక్కటే ఎందుకు మునిగిందో మరి,
కాసేపు ఊపిరాడలేదు
*
పక్షులు రొదపెడుతున్నాయి
పేరు తెలియని పూల పరిమళం
గుబురు చెట్ల వెనుక నుండి మత్తుగా పాకుతోంది
నిద్రకు ముందు నగలన్నీ తీసేసిన యువతిలా
సాయంకాలపు తళుకులు తుడుచుకున్న కొలను
నల్లగా మెరుస్తోంది
చందమామ తోసుకుంటూ ఎందుకొస్తాడో
లోకం ఒక ముద్దు కూడా దొంగిలించకుండానే
చీకటి కౌగిట్లో!
*తొలిప్రచురణ - ఈమాట ఫిబ్రవరి,2017 సంచికలో

ఈ క్షణం..

దారి తప్పాను
ఈ అడవి మధ్యన
సెలయేటి ఒడ్డున
వెదురు ఇల్లు నాకోసం
దాచి ఉంచారెవరో!
ఖాళీ కుర్చీలు, ఖాళీ అయిన పాత్రలు
కొన్ని ధూళికణాలతో గోడ మీది బొమ్మలు
ఏనాడో మరచిన ప్రియగీతిని వినిపిస్తూ
వాకిట్లో ఊగే గాలిగంటలు, వాటితో పాటే,
దడి దగ్గరే దోగాడుతూ
ఎవరూ కోయని పూవులు
సెలయేటి గాలులు, అవి తాకినపుడల్లా
రాతిరి చలిమంటలో నుండి
ఇంకా చల్లారక రేగుతోన్న నిప్పురవ్వలు
అడవిలో ఏ వైపునో నక్కి, ఆగీ ఆగీ
ఆత్రంగా పిలుస్తోన్న అడవి పక్షులు
సమయమెంతైందో తెలీదు.
 సర్రున పరదా లాగినట్టు,
లోకమంతా స్వర్ణకాంతులు
నిన్న ఇక్కడెవరున్నారో,
రేపింకెవరు రానున్నారో,
ష్ష్...
ఏమీ చెప్పద్దు
ఈ స్వర్గం
ఈ క్షణం
నాది!

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...