"లిఖిత" - శ్రీకాంత్

మరపురాని కవిత్వాన్ని, మళ్ళీ మరొక్కసారి ఈమాట ద్వారా మరికొంతమందికి పరిచయం చేయాలని సంకల్పం. అందులో భాగంగానే, మార్చ్'16 ఈమాట సంచికలో, "కొన్ని సమయాలు" సంపుటి ద్వారానూ, "లిఖిత" బ్లాగు ద్వారానూ నాకు పరిచయమైన శ్రీకాంత్ కవిత్వాన్ని గురించి నాలుగు మాటలు వ్రాశాను. ఇది రేఖామాత్రపు పరిచయమే తప్ప, ఈ కవిత్వాన్ని గురించిన సంపూర్ణమైన విమర్శ కాదని మనవి.

ఏదో ఒక సూత్రానికి లోబడ్డ కవితలే పరిచయం చేయాలన్న నియమం లేకపోయినా, శ్రీకాంత్ కాలం మీద వ్రాసిన ఐదు కవితలు మచ్చుకు తీసుకున్నాను. ఆసక్తి ఉన్నవాళ్ళు, అతని కవిత్వ సంపద కోసం "లిఖిత" చూడగలరు.

*

నిరంతరం ఎదురయ్యే అనుభవాలు, చిరపరిచితమనిపించే భావాలు, పూనిక గల కవి చేతుల్లో మళ్ళీ మళ్ళీ చదివించే పద్యాలుగా రూపాంతరం చెందుతాయి. మనం విస్మరించే ఈ లోకపు సౌందర్యమంతా సహస్రముఖాలతో సరికొత్తగా సాక్షాత్కరించేదీ కవిత్వమనే రసవిద్య పట్టుబడ్డ నేర్పరుల చేతి చలువ వల్లే. "లిఖిత" శ్రీకాంత్ ఆ రసవిద్య నేర్చిన కవి. మనిషిలోని సంఘర్షణనీ, అతని మనసులో చెలరేగే ద్వంద్వాలనీ, అలవోకగా కవిత్వం చేయగల నేర్పు శ్రీకాంత్ సొంతం. అనిర్వచనీయమనిపించే క్షణాలను అక్షరాల చట్రంలో శ్రద్ధగా బిగించి, మరికొంతమందికి కూడా అనుభవైకవేద్యం చేయడమే ఇతని కవిత్వంలో తొంగిచూసే ప్రత్యేక లక్షణం. సంకుచితం కాని చూపొక్కటీ చాలు, కవిత్వాన్ని, ఆ మాటకొస్తే ఏ కళనైనా ఉదాత్తంగా చూపెడుతుందనడానికి నిలువెత్తు తార్కాణం ఈ కవిత్వం. లోకంలోను, మనుషుల లోతుల్లోనూ, మునుపెన్నడూ చూడని పార్శ్వాలను చూపెట్టడమా? లేదంటే జనసామాన్యం తెలుసుకున్న, తెలుసనుకున్న సంగతులనే సరికొత్తగా పరిచయం చేయడమా? ఏది ఉత్తమ కవిత్వ లక్షణం? అన్న ప్రశ్నను కలిగిస్తుంది శ్రీకాంత్ కవిత్వం. శ్రద్ధగా చదివే పాఠకులకు, బహుశా ఓ సమాధానమూ చూపెడుతుంది. నిప్పుకణికలా వెలుగులీనే నిజమూ, బాహ్యస్మృతి విముక్తులను చేసే సౌందర్యలోకాల ప్రస్తావనా, బాధల కొలిమిలో నిండా కాల్చి, మనలోలోపలెక్కడో స్వర్ణకాంతులీనే హృదయమొకటి ఉందని మరలా గుర్తు చేసే విషాదమూ శ్రీకాంత్ కవిత్వాన్ని చదివి తీరాల్సిన కవిత్వంగా మార్చిన సుగుణాలు. కవి మాటల్లోనే చెప్పాలంటే, ఊయలలూగి నిదురించే  "శిశువు పెదవిపై మిగిలిన పాల తడి" లాంటి ఇష్టాన్ని మిగిల్చే అనుభవం ఈ కవిత్వాన్ని చదవడం. వెన్నెల రాత్రినీ, మంచుబిందువులు పచ్చికను ముద్దాడే ఈరెండ ఉదయాలనీ తఱచుగానే కవితల్లో చూస్తూ ఉంటాం. కానీ, ఇవే ఉదయాస్తమయాలను మనిషిలోని భావసంచలనంతో సంధానించి కవిత్వం చెబితే ఎలా ఉంటుందో, శ్రీకాంత్ తన అక్షరాల సాక్షిగా పరిచయం చేస్తారు. ఒక్క రోజులో మన మనసు ఎన్ని రంగులు మార్చుకుంటుందో, ఎన్ని వైవిధ్యాలను, ఉద్వేగాలను ఉగ్గబట్టుకుని క్షణాలను దొరలించుకుంటుందో, అన్ని ఛాయలనూ చాకచక్యంగా కవి రెండు వేళ్ళ మధ్యా ఒడిసి పట్టుకున్న తీరు తప్పకుండా ఆశ్చర్యపరుస్తుంది.

ఒక కవిత చదవగానే, "ఇది శ్రీకాంత్ కవిత" అని ఇట్టే గుర్తించగలిగేంత ప్రత్యేకమైన శైలిని సృజించుకుని, తెలుగు కవిత్వ దారుల్లో తనదైన ముద్రలు వేస్తూ సాగుతోన్న శ్రీకాంత్ కవితలు ఐదూ- కవిత్వం కాలాన్నిలా అలవోకగా అక్షరాల్లో బంధించగలదని నమ్మే వారి కోసమూ, నమ్మని వారి కోసం కూడా  -  ఈనెల ఈమాటలో, మరికొందరికి చేరాలన్న ఆశతో..

3 comments:

  1. అలవోకగా కవిత్వం చేయగల నేర్పు, అవును ఏ సందర్భమైన సులువుగా కవిత్వమైపోతుంది, అతని అక్షరాల్లో.

    ReplyDelete
  2. (ఇంకిపోయే పరిమళంతో: బహుశా, అది
    నీ ముఖం - )

    ఆశ..నిలవని క్షణాన్నిలిప్తపాటైనా వొడిసి పట్టాలని. నిరాశ.. నిలిచి చూస్తే ఇగిరిపోతున్న సుగంధం..నాటి మెరుగుల ప్రతిబింబం.
    శ్రీకాంత్ గారి కవితలు లోలోపల పడిలేస్తున్న తరంగాలు. పరిచయం చేసిన మీకు నమస్సులు..

    ReplyDelete
  3. భాస్కర్ గారూ : నిజ్జంగా నిజం!

    విజయ్ గారూ : ఇప్పుడే చదువుతున్నారా లిఖితని? ఆశ్చర్యం! చాలా సంతోషం కూడానూ, మరొకరికి పరిచయం చేసినందుకు.

    ReplyDelete

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...