ఒక వ్యక్తి స్వతహాగా కవీ, రచయితా అయి, సున్నిత మనస్కుడై, భావుకుడై తన ఆత్మకథను వ్రాయాలని అనుకుంటే, అందుకు తోడుగా అతనికి తన కాలంలోని దాదాపు ప్రతీ సాహితీవేత్తతోనూ దగ్గరి పరిచయం ఉండి, ఆ అనుభవాలన్నీ గుర్తుంచుకోగల జ్ఞాపకశక్తీ, ఆ అపురూపమైన సంగతులన్నీ శ్రద్ధగా గుది గుచ్చి చెప్పగల నేర్పూ ఉంటే, అది నిజానికి పాఠకుల పాలిట వరం. ఈ పుస్తకం అలాంటిది.
"ఇవిగో! ఇంకా నిద్ర లేవని
మంచు తడి ఆరని, పారిజాతాలు!!
ఈ ధవళిమ నా భావాల స్వచ్ఛత;
ఈ ఎరుపు నా అనురాగపు రక్తిమ
ఈ పరిమళము మన స్నేహసౌరభము!
అందుకోవూ.."
అంటూ మొదలయ్యే పుస్తకమిది. ఈ పుస్తకంలోని పదాలెంత సుకుమారమైనవో, ఇందులోని భావాలెంత సున్నితమైనవో, అభివ్యక్తి ఎంతలా మనను కట్టి పడేయగలదో, ఈ మొదటి పేజీలోనే మనకు చూచాయగా తెలుస్తుంది. ఇక అది మొదలు, సంగీత సాహిత్యాలను ఇరు ఒడ్డులుగా చేసుకుని ప్రవహించే నిండైన నది లాంటి ఆచంట వారి జీవితం మన కళ్ళ ముందుకొస్తుంది. మహావృక్షాల్లాంటి మహనీయుల జ్ఞాపకాల నీడల్లో ఆగి కొంత విశ్రాంతిని పొందడం, ఆ నదిలోని చల్లని నీరు దోసిళ్ళ నిండా తీసుకుని ఎప్పటికప్పుడు దప్పిక తీర్చుకుని ఆ తీరం వెంబడి నింపాదిగా నడవడం - పాఠకులుగా ఇక మన పని.
భౌతికమైన వస్తువుల ఆత్మను దర్శించి, వాస్తవానికీ కల్పనకూ మధ్య అపురూపమైన సంధినొకదాన్ని నిర్మించి, మరొకరిని ఆ దోవలో నడిపించి ఊయలూగించడానికి మాంసనేత్రం సరిపోదు. రసదృష్టి లాంటిదేదో కావాలి. తనలో లేని సౌందర్యమేదీ ఈ ప్రపంచంలో కనపడదన్న ఓ పాశ్చ్యాత్యుని మాటలు నమ్మి చెప్పాలంటే, ఆచంట వారి మనసంతా సౌందర్యమయం.
ఆచంట స్వతహాగా కవి. లోకం పట్ల ప్రేమ, దయ ఆయన కవితల్లోనూ, నాటకాల్లోనూ కనపడుతూంటాయి. మునిమాపువేళ మిణుకుమిణుకుమనే ఒంటరి నక్షత్రమొకటి, ఆయనలో ఒకేసారి ఆశనూ, దిగులునూ కలిగిస్తుంది కాబోలు. ఆ తార ప్రస్తావన కనపడ్డ కవితలు రెండు:
" నేను నిదురించు శయ్యాగృహంపు టాకాశ
గవాక్షమందుండి యొక్క తారకామణి
మిణుకు మిణుకంచు తన సందేశాల బరపజూచు.."
"నీ నిరంతర స్మరణ నా యెద వ్రేగునపుడు
మమతతో కూయుచు మునిమాపువేళ
గువ్వతల్లియు తన గూడు చేరునపుడు
సొమ్మసిల్లిన సృష్టియు సుషుప్తి పొందినపుడు
నిలువ నీడేలేని నిరుపేద భిక్షుకుడ నేను
బాధతో రాల్చిన మౌనభాష్పకణమ్మునందు
దూరమున దీపించు నా దివ్యతార
ప్రేమకాంతుల బరుపుచు ప్రజ్వరిల్లు"
" I, a homeless beggar. drop a silent, painful tear in which gleams the distant star of love.." - ఎంత అపురూపమైన భావన!
కవిత్వం ఎలా ఉండాలి అన్నది, ఏనాటికీ చిక్కు ముడి వీడని ప్రశ్నే! రూపప్రథానమా, భావప్రథానమా? దేని పాళ్ళు ఎంతైతే మంచి కవిత్వమవుతుందంటే, ఎవ్వరు చెప్పగలరు? జిహ్వకో రుచి. అంతే. ఆచంట వారొకసారి రైలు ప్రయాణంలో రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారిని కలిసినప్పుడు, దేవులపల్లి కృష్ణశాస్త్రి మాట వచ్చి, "మీరంతా ఆయన్ను భావకవి అంటారు కదా, భావకవిత్వం అంటే ఏమిటి? భావము లేని కవిత్వమంటూ ఉంటుందా?" అని అడిగారట శర్మ గారు.
"అది నిజమే; భావం లేనిది కవిత్వం కాదు. పూర్వపు ధోరణిలో ఉన్న కవిత్వం రూప ప్రథానమైనదనుకుంటా. కృష్ణశాస్త్రి వంటివారి రచన భావప్రథానమైనది." అన్నారు ఆచంట.
"అల్లాగా ? ఈ పద్యం విన్నారా?" అంటూ భావయుక్తంగా, ఆయనీ పద్యం చదివారట అప్పుడు:
"కలుగవు కమలంబులు, హంసలు కదులవు, చూడవమ్మ చక్కగ నెవరో, తలక్రిందుగ నాకాశము నిలిపిన వార్త, చెరువు నీళులలోన్"
ఇది భావప్రథానమైనదేనని ఆచంట ఒప్పుకున్నాక, ఇది శకకర్త, శాలివాహనునికి ముందు, అంటే రెండువేల ఏళ్ళకు పూర్వం వ్రాసినవనీ, ప్రాకృతములో వందలకొద్దీ ఇటువంటివి ఉన్నాయనీ చెప్పారట.
కాలానికొక రకం కవిత్వం అని గిరి గీయడమెవ్వరి తరం?
ప్రబంధ సాహిత్యం గురించి మాట్లడుతూ, విజయ విలాసములో ఉలూచి తనని అమితంగా ఆకర్షించింది అంటారీయన. ఉలూచి ఆయనకు సత్యాదేవంత ప్రియమైన ప్రబంధ నాయికట. అందులోనూ నాగ కన్యక కూడానాయో!
"హేమంత ఋతువు కాబట్టి నా ఎదుట యమున అతి సన్నగా ప్రవహిస్తోంది. ఎప్పుడో ఒకనాడు ఇటువంటి నీటనే జలకమాడుతున్నాడు అర్జునుడు. అప్పుడే ఉలూచి అతన్ని తన కౌగిలిలో హత్తుకుని ఎత్తుకుపోయింది. ఆమె వచనాచమత్కృతికీ, ఆమె అసమానరూప లావణ్యానికీ, అన్నింటికంటే ఎక్కువగా ఆమె ప్రకటించే అనురాగానికీ లొంగిపోయి అర్జునుడు, మొదట కాదన్నా, చివరకు ఆమె ప్రేమను అంగీకరిస్తాడు." అని గుర్తు చేసుకుంటారు ఆచంట.
"చక్కెర బొమ్మ నా వ్రతముచందము దెల్పితి నంతెగాక..." అంటూ మొదలయ్యే మరో పద్యంలో, "ఎక్కడ నుండి వచ్చె తరళేక్షణకున్ నును సిగ్గు దొంతరల్" అంటాడు కవి. ఇందులో మొదట 'చక్కెర బొమ్మ' అన్న పదం వినగానే, మగధీర చిత్రంలో, "పంచదారా బొమ్మా బొమ్మా" అంటూ మొదలైన పాట వింటూ, ఈ పాట ఎత్తుగడ ఎంత బాగుందో అని పదే పదే అనుకోవడం గుర్తొచ్చింది. విజయవిలాసం చదువుతోన్న ఆచంట వారూ, ఆ చక్కెర బొమ్మ దగ్గరే ఆగిపోయారట. ముగ్ధకు అతి స్వాభావికమైన సిగ్గు, ఆ ఉలూచి కన్నుల్లో కనపడి పరవశింపజేసిన తీరూ, ఆయన అక్షరాల్లో అందంగా కనపడుతుంది.
అలాగే, తెలుగునాట తొలి చైతన్య స్రవంతి నవల వ్రాసిన వారుగా వినుతికెక్కిన బుచ్చిబాబు ప్రస్తావన కూడా, ఈ పుస్తకంలో కనపడుతుంది. అదీ, చాలా ఆశ్చర్యాన్నిచ్చే ఘటనగా:
"ఒకనాడు బుచిబాబు తాను రచిస్తోన్న ఒక క్రొత్త నవలను గురించి నాతో చెబుతూ కథావిషయము చెప్పి, ఈ రచనకు ఏకాంతము అనే పెడదామనుకుంటున్నాను, మీరేమంటారు? అన్నాడు.
నేనన్నాను : " మీరు మీ రచనలో జీవితపు విలువలను కొన్నిటిని వివరంగా పరిశీలిస్తున్నారు. ఈ కాలపు ఒకానొక యువకుని జీవితంలో కలిగే సమస్యలను వర్ణిస్తూ, కేవలమూ ఆదర్శజీవి అయిన అతని ఆశలూ, యత్నాలూ ఒక్కటీ ఫలింపపోవడం చూపిస్తున్నారు. ఇప్పుడు నాలాంటి వానిలో వచ్చే ప్రశ్న ఏమిటంటే : ఇట్టి విపరీతపు అన్వేషణలో, ఈ మహాయత్నములో చివరకు మిగిలేది అనే పేరు పెడితే బాగుంటుందేమో."
ఆ సూచనను వెంటనే అంగీకరించారట బుచ్చిబాబు. ఎంత ఆశ్చర్యం! తెలుగు నాట విశేషంగా పాఠకుల ఆదరణ పొందిన ఈ నవల పేరు, ఇంతకీ ఆచంట వారి ఆలోచనా!, అన్న ఆశ్చర్యం ముంచెత్తక మానదు ఈ సంఘటన చదివినప్పుడు.
ఆచంట వారి అదృష్టం సాహిత్య రంగానికి చెందిన విశ్వనాథ, చలం, దేవులపల్లి, బుచ్చిబాబు, రవీంద్రులు..ఇలా వీరికే పరిమితం కాలేదు. సంగీత రంగంలోని ఎందరో ప్రముఖులతోనూ ఆయనకు పరిచయం ఏర్పడింది. ఆకాలంలోని వారందరి సంగీత విభావరులూ ప్రత్యక్షంగా అనుభవించగల సదవకాశమూ దక్కింది. బెంగళూరు నాగరత్నమ్మ మొదలు, వెంకటనాయుడు గారి వయొలిన్ వరకూ, ఆయన చెవుల్లో అమృతం నింపిపోయిన వారే అందరూ. నాయుడుగారు సావేరి రాగంలో వినిపించిన ఆర్ద్ర సంగీతం వినే, ఆచంట వారు రిల్కే మాటలనిలా గుర్తు చేసుకుంటారు :
"రెండు రాగచ్ఛాయల మధ్య ఉండే విశ్రాంతిని నేను. ఆ క్షణిక విరామంలో వణికిపోతూ, కలియవచ్చిన ఆ రెండు రాగచ్ఛాయలూ మేళవించి, ద్విగుణితమైన మాధుర్యంతో గానం సాగిపోతుంది" అని.
చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా, అవతలి వారి పేరు ప్రఖ్యాతులతో సంబంధమే లేకుండా, ప్రజ్ఞను బట్టి వారిని పొదువుకున్న అపురూపమైన వ్యక్తిత్వం ఆచంట వారిది. మనస్ఫూర్తిగా వారిలోని కళకు కైమోడ్చిన సాహిత్యాభిమానులు వీరు. అంత నిర్మల హృదయులు కనుకనే, ఎందరెందరో సాహితీవేత్తల ఆంతరంగిక క్షణాల్లోకి ఆయన అలవోకగా ప్రవేశించగలిగారు. సృజనశీలుల్లో కవితాగంగ ఉప్పొంగుతోన్న వేళ, దగ్గరగా కూర్చుని దోసిళ్ళతో తాగి తన తృష్ణను తీర్చుకున్నారు.
" నువ్వూ నేనూ కలిసి/వెన్నెల వెలుగులా/వెలుగులో వాంఛలా
నువ్వూ నేనూ కలిసి గగన నీలానిలా/ నీలాన శాంతిలా" అన్న బాపిరాజు కవిత్వాన్నైనా, "మురళి పాటకు రగిలి/మరుగు నీ వెన్నెలలు/సొగయు నా యెదకేల తగని సౌఖ్యజ్వాల" అన్న దేవులపల్లి గీతాలనైనా, "కంటికంతా జలమయంబై, మింటివరకు నేకరాశై జంట దొరుకని మహాప్రళయపుటింటిలో వటపత్ర డోలిక నొంటిగా నుయ్యాల లూగితివా నా ముద్దు కృష్ణా జంటగా నను బిల్వదగదోయీ?" అన్న బసవరాజు గేయాన్నైనా, "వలపు నిండార విరిసిన పారిజాత కుసుమములు నేలరాలు వేకువలయందు ప్రసవ శయ్యాపదముల నీపాదయుగళి కదలెనో, నాదు హృదయమే కలతపడెను" అన్న అబ్బూరి రామకృష్ణారావుగారినీ, " గడ్డి పూవుని! రేకుల రెప్పల కలలు కంటూ కలవరిస్తూ కలతనిద్దురలోనె ఎప్పుడొ కళ్ళు మూస్తాను!" అన్న ఆచంట మేనత్త కొడుకు మల్లవరపు విశ్వేశ్వరరావైనా,విశ్వనాథ కిన్నెరసానినైనా, నూతిచుట్టూ ఉన్న పాలగచ్చు పళ్ళెం మీద ముక్కాలి పీట మీద కూర్చుని, గుమ్మడివడియాల వాసన పీలుస్తూ విన్న "చేతులార శృంగారము చేసి చూతు" నన్న సన్నిహితుల గానాన్నైనా, ఆఖరకు విజయనగరంలో జట్కా వాడి పాటలనైనా, అదే తన్మయత్వంతో, ఆ కవిత్వంలో, సంగీతంలో, గానంలో లీనమైపోతూ అనుభవించారు.
అప్పటి తనలోని ఆవేశాన్ని, ఉత్సాహాన్ని, ఆయన మిత్రులు కొండేపూడి సుబ్బారావు కవితాఖండికలో ఇలా చెప్పవచ్చునేమో!
"ఉదయకాంతుల పసిడితీగొకటి మెరిసినది
మృదుపుష్ప గర్భమున రేకొకటి విరిసినది
లలితసుందర దివ్య లావణ్య నవజీవ
మధుమాస సుధలలో హృదయమే పొంగినది"
సామాజిక జీవన చిత్రణ ఈ పుస్తకంలో ఉందని అనలేను కానీ, ప్రముఖ రాజకీయ నాయకుల ప్రస్తావన మాత్రం కనపడుతుంది. ఈ సరికే మన ఆలోచనల్లో ఒకింత ఎత్తులో సుఖాసీనులైన వాళ్ళందరి గురించీ, ఆచంట వారి మాటల్లో చదవడం బాగుంది. వాళ్ళెందుకంత గొప్పవాళ్ళయారో, మరొక్కసారి తెలుసుకున్నట్టైంది. పుదుచ్చేరిలో అరవిందులతో జరిగిన సంభాషణా, గాంధీ మదనపల్లె ఆశ్రమానికి వస్తూనే ఇచ్చిన ఉపన్యాసం, ఓ బహిరంగ సభలో సుభాష్ చంద్రబోస్ వందల మందిని రెండే మాటలతో నిలువరించి నిలబెట్టిన తీరూ, చకితులను చేస్తుంది. ఆచంట వారు వారందరికీ విధేయులుగా ఉండడమూ, అవసరమైనప్పుడల్లా, ఈ ఉద్యమాల వల్ల జైళ్ళకు వెళ్ళిన వారికి తన పరిథిని దాటుకుంటూ వెళ్ళి సాయపడడమూ కనపడుతుంది కానీ, అదంతా స్వభావసిద్ధమైన సున్నితత్వం వల్లే తప్ప, ప్రత్యేకించి రాజకీయాలంటే బలమైన ఆసక్తి ఉన్నట్టు అనిపించదు. బహుశా ఇది కూడా, రాజకీయాల్లో సహజంగా ఉండవలసిన మొండి పట్టుదల వంటిదేదో వారికి స్వాభావికముగా లేకపోవడం వల్ల అయి ఉండవచ్చు. జీవితం మొత్తం మీద ఒకేసారి ఒక వ్యక్తిపై చేయి చేసుకొనవలసి వచ్చిన సందర్భాన్ని గురించి ఎంతో మధనపడుతూ, పశ్చాత్తాపపడుతూ, తన తప్పు పూర్తిగా లేకున్నా కన్నీళ్ళ ప్రాయమైన వైనాన్ని చెప్పడం చదివితే, ఆయన మనసు మరింత స్పష్టంగా కనపడుతుంది. ఐతే, సాహిత్యవిమర్శలో మాత్రం, ఎక్కడా వెనుదీయలేదీయన. విశ్వనాథ ఏకవీర మొదలు, "ఎముకలు కుళ్ళిన" అన్న శ్రీశ్రీ కవిత్వం వరకూ, విభేదించవలసిన ప్రతీ సందర్భంలోనూ గట్టిగా నిలబడి సుదీర్ఘమైన వ్యాసాలు వ్రాసారు. కొన్ని సందర్భాల్లో కాలం తన అభిప్రాయాలను తప్పని తేల్చినా, తానా భిన్నమైన అభిప్రాయంతోనే ఈనాటికీ నిలబడి ఉన్నానని చెప్పుకోవడానికి మొహమాటపడలేదు. అది, ఆయనలోని నిబద్ధతకు నిరూపణం.
ఇలా ఈ పుస్తకాన్ని గురించి చెప్పుకుంటూ పోతే, ఎక్కడ అపాలన్నది ఎప్పటికీ తేలదు. కనుక, రవీంద్రుల కవితొక్కదానితో, ఈ పుస్తకాన్నీ, ఆయన జీవితాన్ని కూడా- పొదుపుగా మరొక్కసారి మననం చేసుకుంటూ, ముగిస్తాను.
"అపురూపమైన ఈ లోకపు మహోత్సవములో
పాల్గొనమని నన్ను ఆహ్వానించావు
నా జన్మ తరించింది. ఉత్సవాన్ని కళ్ళారా చూశాను!
ఆనంద గీతము చెవులారా విన్నాను.
ఈ మహోత్సవములో నా వాద్యమును
నా చేతనైనంత అందంగా వినిపించాను.."