సత్యశోధకుడు గాంధి

గాంధి అన్నది ఇప్పుడు మనలో చాలా మందికి అతి సామాన్యమైన పేరు. మనం వినీ వినీ చలించకుండా పోయిన పేరు. మన ఊరిలో ఏ ప్రత్యేకతా లేని ఓ వీధి పేరు. మనం నిర్లక్ష్యంగా పారేసే రూపాయి నోటు మీది బొమ్మ పేరు. ఓ భగత్సింగ్ పేరు వింటే వెన్ను నిటారుగా అయి వెంట్రుకలు నిక్కబొడుచుకున్నట్టు, గాంధి పేరు చెబితే ఎప్పుడూ నాలో స్పందన కలిగేది కాదు. భగత్‌సింగ్ తనకు ఉరిశిక్ష విధించబడిందని తెలిసిన రోజు “ ‘విప్లవమంటే భగత్‌సింగ్’ అని ప్రజలు నమ్ముతున్నారు. నేను ఇప్పుడు చనిపోకపోయినా జీవితకాలంలో ఏ క్షణమైనా సిద్ధాంతాలకు భిన్నంగా ప్రవర్తిస్తే ప్రజలు దానిని వ్యక్తికి ఆపాదించరు. విప్లవ సిద్ధాంతానికి ఆపాదించి నిరసిస్తారు. కొన్ని వేల గుండెల్లో స్పూర్తిని నింపుతున్నాననుకుంటూ, నవ్వుతూ మరణించగలను” అన్న మాటలను, పసితనంలో అమాయకత్వంతో కురిసిన కన్నీళ్ళతోనూ, యవ్వనంలో ఆవేశంతోనూ, అటుపైన ఆ మాటల్లోని లోతైన భావానికి చలించి కృతజ్ఞతతోనూ కొనియాడినట్టు, గాంధిని మనస్పూర్తిగా అభినందించిన క్షణాలు నా జీవితంలో లేనేలేవు… “సత్యశోధన” పుస్తకం నా చేతుల్లో పడేవరకూ. అది కూడా ఎప్పుడు? మన లోలోపలి పేరుపెట్టలేని వేదనో వెలితో లేదా సందిగ్దతో మనను నలిబిలి చేస్తూన్నప్పుడు, ఓ అనుమానమో అవమానమో మనసును పట్టి కుదిపేస్తున్నప్పుడు, ఈ అనుభవాల నుండి ఏనాటికైనా బయటపడే మార్గముందా అని అడిగేందుకు కూడా మరొకరెవ్వరూ కనపడనప్పుడు, కనపడ్డా అడగాలని అనిపించనప్పుడు, ఇదుగో, ఈ సత్యశోధన లాంటి పుస్తకమొక్కటి మళ్ళీ మనని నిబ్బరంగా నిలబెట్టగలదు అనిపించింది.

పద్ధతిగా బ్రతకడమంటే పర్వర్షన్, ఇంద్రియ నిగ్రహం కోసం ప్రయత్నించడం తమని తాము మోసం చేసుకోవడం; వ్యాయామం చేయడమంటే అనారోగ్యం కలిగి ఉండటం; దేవుణ్ణి నమ్మడమంటే పాపం చేసి ఉండటం; జీవితకాలపు సహచరుడి కోసం అలవాట్లు మార్చుకోవడమంటే పతివ్రతలా నటిస్తూ లోపల ఏడవటం; సంస్కారం మాయముసుగు; సంతోషం నటన; ఉద్యోగం అవసరం; ప్రేమ బలహీనత; మంచితనం మూర్ఖత్వం – ఈ రోజు మన చుట్టూ స్వేచ్ఛగా చలామణీ అవుతున్న ఈ నిర్వచనాలన్నీ చూస్తూ చూస్తూ, సత్యాన్ని శోధిస్తూ ఓ మనిషి తన జీవితంలోని ప్రతి తప్పుని అంగీకరిస్తూ దాన్ని దాటి వచ్చిన వైనాన్ని జీవితాన్ని తెరిచిన పుస్తకం చేస్తూ విప్పి చెప్పాడంటే ఎంత ఆశ్చర్యమో! అసత్యం నుండి సత్యం వైపూ, భోగాల నుండి సరళజీవిత విధానం వైపు, ఆవేశం నుండీ ఉద్వేగం నుండీ సౌమ్యత వైపూ స్థితప్రజ్ఞత వైపూ జీవితపు చివరి క్షణాల వరకూ ప్రయత్నపూర్వకంగా ఒక్కో అడుగూ వేసుకుంటూ వెళ్ళిన ఒక మహాత్ముడు, ఇక్కడే, ఈ నేల మీదే తిరిగాడంటే నమ్మశక్యం కాని కల్పనలానే అనిపించింది. రాజకీయంగా అతనేమిటో ఈ పుస్తకంలో నాకు దొరకలేదు. ఆ మరకలు తుడిపే ఆసక్తీ నాకు లేదు. కానీ, ఒక్క రామ మంత్రాన్ని నమ్ముకుని బ్రతుకుని పండించుకున్న మనిషి అందించగల స్పూర్తి ఇంతింతని మాత్రం చెప్పనలవి కాదు. తనకు తానే నియమాలు విధించుకునీ, తనను తానే కష్టపెట్టుకుని, సత్యంతో ప్రయోగాలంటూ తనకు మాత్రమే తెలిసిన, తెలియాల్సిన కోణాలను చూసే ఆసక్తి ఉన్నంతమందికీ చెప్పుకుని… ఏం సాధించాడయ్యా ఈ బక్కపల్చని మనిషీ అంటే… అందుకూ సమాధానమూ ఆ బ్రతుకు పుస్తకపు చివరి పుటలో దొరికింది నాకు. అజామిళోపాఖ్యానము చదివిన వారెవ్వరికైనా ఆఖరు క్షణాల్లో రామనామ స్మరణ ఎంత గొప్ప వరమో, ఎంత పుణ్యఫలమో అర్థం కాకపోదు.

వర్షం కురిసే రాత్రుల్లో..

చీకటిని వణికించే దీపకాంతిలో
అసహనంగా కదులుతాయ్ పరదాల నీడలు
ప్రాచీన స్వప్నాన్ని పదే పదే గుర్తు చేస్తూ
ఉండీ ఉండీ గలగలమంటాయ్ గాలిగంటలు

తెరిచిన కిటికీల్లోంచీ చాచిన నా అరచేతుల్లో
చిందులేస్తున్న చినుకుల్ని చూస్తూ చూస్తూనే
నే తిరగబడ్డ గొడుగుల్లో
పసివాడు వదిలిన పడవనవుతాను
వాడి పగడపు పెదవుల మీది నవ్వునై తుళ్ళిపడతాను

చుక్కల్ని దాచేస్తూ రెమ్మల్ని రాల్చేస్తూ
దిక్కుల్ని కాల్చేసే వాననలా చూస్తూ చూస్తూ
నే ముడుచుకున్న సీతాకోక రెక్కల్లో
దాగిపోని రంగుల లోకమవుతాను
దాగలేని  స్వేచ్ఛా కాంక్షనవుతాను

మంత్రజలం చల్లేదెవరో
తెలియరాదు కానీ
వర్షం కురిసిన ప్రతి రాత్రీ నేను
నేలను తాకని చినుకునవుతాను.

(Published in TFAS Souvenir-2015)

మహాలయం

ఢం డం ఢం ఢండఢఢం డండఢడం
ఢడఢండం ఢండఢఢం డండఢడం
ఎవరి జీవితాల్లోని ఉత్సవ కోలాహలాన్నో
ఉరుకులు పరుగులతో మోసుకొస్తుంది గాలి
నల్లని రాత్రిని కన్నుల్లోకి ఒంపుకుంటూ
ఒంటరిగానే గాలిని నమ్మి నడచిపోతూంటాను
అడవి పక్షుల పాటలన్నీ పగటినీడలతో పారిపోయే వేళ
శరదృతునదులన్నీ సముద్రంతో సంగమించే చోట
నిశినీలి చెంపలపై నక్షత్రాలు కైపుగా నవ్వి
నిదురపోని లోకాలపై మెరుపుకలలు రువ్వే వేళ
వాళ్ళని చూస్తాను
కాగడా వెలుగుల్లో, కాళ్ళకు గజ్జెల్తో
జన్మాంతర దుఃఖాల్ని హేలగా
మంటల్లో విసిరే నిర్లక్ష్యంతో
యవ్వనంతో
చంద్రుని ఆవరించే ఎర్రని వెలుగులా వాళ్ళంతా
చితిమంట చుట్టూ చేరి చిందేస్తుంటే చూస్తాను
లోకాలు కంపించటమొక్కటే లక్ష్యంగా ఆ
చేతుల్లోని మంత్రదండాలు ఊగిపోవడం చూస్తాను.
ఢం డం ఢం ఢండఢఢం డండఢడం
ఢడఢండం ఢండఢఢం డండఢడం
ఆ రాత్రి,
ముక్కలయే కాలం ముందు
మౌనం నిశ్శేషంగా నిలబడ్డ రాత్రి,
చీకటిని శ్వాసిస్తున్న లోకంలోనే
వెలుగేదో సుస్పష్టంగా కనపడ్డ రాత్రి
ఆ అడవి మంటల్లో, అవనీ ఆకాశాల్లో
సముద్రపు గాలిలో, నీటిలో
నిరంతరం మెదలే అనాది సంగీతమే
అనాగరికుల వాయిద్యాల్లో ప్రతిధ్వనించి
లోలోపలి సంచలనాన్ని శకలంలా ఎగరగొడుతోంటే
చుట్టూ ప్రతీ శబ్దమూ నిశబ్దమవడమూ
మహానిశబ్దమంతా సంగీతమవడమూ తెలిసి
నాలోపలి ఊపిరి లయను తొలిసారి వింటాను.
---------------------------------------------------
తొలి ప్రచురణ: ఈమాట, మార్చ్-2015 సంచికలో

శ్రీ

"మెలికలు తిరిగే నది నడకలకూ, మరి మరి ఉరికే మది తలపులకూ.." అలుపన్నదే ఉండదని, భలే 'లయ'గా చెప్పి ఒప్పించాడే అనుకున్నాను కానీ, అతని పేరేమిటో నాకప్పుడు తెలీదు. "ఊరికే ఉండదే ఉయ్యాలూగే మనసూ.." అని ఊగుతూ తూగుతూ పాడుకున్న మా యవ్వనం మీద అతని సంతకం పడుతోందనీ ఏమంత శ్రద్ధగా గమనించుకోలేదు.
"ఔననా..కాదనా...అతనేదో అన్నాడూ" అనిపించే తొలిప్రేమ తడబాటునీ, "వీచే గాలి నీ ఊసులై తాకుతూ ఉంటే..దూరం దిగులుపడదా నిన్ను దాచలేననీ" అని అదే హృదయం నమ్మకంగా పలికి, "ప్రతీ శ్వాసలో ఉయ్యాలూగు నా పంచ ప్రాణాలు నీవే సుమా" అంటూ తీర్మానించడాన్నీ - మా మాటలు కాకపోయినా పాటలుగా పాడుకున్న క్షణాలు నిన్నా మొన్నా జరిగినంత స్పష్టంగానూ గుర్తు.
"అమ్మ కొంగులో చంటి పాపలా...మబ్బు చాటునే ఉంటే ఎలా?" అంటూ కవ్వించి వెండివెన్నెలను నేలకు దించి, ప్రణయ ఝంఝలో కంపించే చిగురుటాకు లాంటి మనసుని ఏడంటే ఏడే స్వరాలతో లాలించి ఊరడించిన శ్రీని - ఈ పాటల్తోనే గుర్తుంచుకుంటానెప్పటికీ..!

జాషువా కవిత్వం - పిరదౌసి

కళ ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటుంది. అది దాని జీవలక్షణం. సాహిత్యం దానికి మినహాయింపు కాదు. అందుకే ఎప్పటికప్పుడు కొత్త కథన కవిత్వ రీతులు పుట్టుకొస్తున్నాయి. నూతన అభివ్యక్తి మార్గాల కోసం అన్వేషణలు కొనసాగుతున్నాయి. కవితా వస్తువులు మారుతున్నాయి, నేపథ్యాలూ కొత్తగా కనపడుతున్నాయి. కవిత్వ లక్షణాల గురించీ, లక్ష్యాల గురించీ విభిన్న వాదనలు వినపడటమూ, సామాజిక ఆర్థిక రాజకీయ అవసరాలు ఏ కాలానికాకాలం కవిత్వాన్నీ ప్రభావితం చేయడమూ పాఠకలోకం గమనిస్తూనే ఉంది. ఇన్ని వైవిధ్యాలున్న వాతావరణంలో, ఎవరైనా ఒక కోవకు చెందిన కవిత్వాన్ని లేదా ఒకరి కవిత్వాన్ని మాత్రమే గొప్పది అనడం సాహసమనిపిస్తుంది. ఆ రకమైన అభిప్రాయం తాత్కాలికమనీ తోస్తుంది. సృజన గొప్పతనాన్ని నిర్ణయించగలిగేది కేవలం కాలం మాత్రమే. జాషువా ఖండకావ్యం పిరదౌసి, కాలం ధాటికి తట్టుకుని నిలబడ్డ అలాంటి అసాధారణమైన కవిత్వం. సరళమైన అభివ్యక్తితో గాఢమైన మానసిక దశలను చిత్రించిన తీరుకి, ఊహలకందని ఉద్వేగాలకి అక్షరరూపమిచ్చి అనుభవైకవేద్యం చేసిన సమర్థతకీ, ఇప్పుడే కాదు, ఏ కాలానికైనా ఈ కావ్యం సజీవంగా సాహిత్య లోకంలో నిలబడగలదు.
పిరదౌసి పర్షియనులు ఎంతగానో అభిమానించే 10వ శతాబ్దపు ఒక గొప్ప కవి. అతని షాహ్‌నామా సామానీ, గజనీ రాజుల కాలంలో రాయబడిన ఇరాన్ దేశపు చారిత్రిక ఐతిహాసం. అరవై వేల పద్యాలతో, ప్రపంచం లోనే అతి పొడుగైన ఇతిహాసంగా పేరెన్నిక గన్న గ్రంథం. అప్పటి కవిపండితులు ఎందరి లాగానో పిరదౌసి జీవితాన్ని గుఱించి కూడా ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వ్యత్యాసాలు ఎన్నున్నా స్థూలంగా కథ మాత్రం ఒక్కటే. ఇదీ ఆ పిరదౌసి కథ:

నిర్ణయం

ఎన్ని వసంతాల వంచనకు వడలి
రేకులుగా రాలిపడుతోందో
లోలోపలెంతగా దహించుకుపోయి
దావాగ్నిలా ఎగసిపడుతోందో
దూరం నుండి చూస్తున్నవాడివి
లేతపచ్చ ప్రాయంలో తన కోమలమైన స్పర్శని
కలనైనా ఊహించి అనుభవించలేనివాడివి
తొందరపడి తీర్పులివ్వకు, తననేమీ అనకు.
మలుపు మలుపులో
ఎందుకు ప్రాణాన్ని మెలిపెట్టుకుందో
ఉప్పునీట కలిసే ముందు
ఏమని మనసును ఒప్పించుకుందో
పడవ కుదురుగా పాడుతున్నప్పుడు
ప్రయాణం చేసి పోయినవాడివి
లోతులు తెలియకుండా
నువ్వే నిర్ణయానికీ రాకు, దోషివి కాకు.
నన్ను గిచ్చి లేపిన ఉదయమే
నీ వెన్నెల రాత్రవ్వడాన్ని
రెప్పవేయకుండా చూస్తోందే ఆ ఆకాశం
నిజం కూడా అబద్దమవుతుందంటే,
ముగింపుల్లోనే కథ మొదలవుతుందంటే
రాలిపడుతుందా? రంగులు మార్చుకుంటుందా?
ఏ కాలం నాటిదో
ఎవరెందుకు వాడి వదిలేసిందో
నువు లోలోపల దాచుకున్న
ఇనుప తక్కెడ.
బరువెత్తిపోయిన రోజైనా
బయటకు తీసి చూడు.
వీలైతే విరిచి ముక్కలు చేసి
ఒక్కరోజైనా బ్రతికి చూడు.
తొలి ప్రచురణ : ఈమాటజనవరి, 2015

ప్రయాణం

కొంత హుషారు
కొంత కంగారు
కొత్త స్టేషన్లో ఎప్పుడాగినా
ఎంతోకొంత కలవరం

అమ్మడాన్నీ అమ్ముడుపోవడాన్నీ
ఆగిన ఆ కాసిన్ని క్షణాల్లోనే
ఎన్నో కొన్ని అప్పగింతల్నీ
తప్పదు, ముగించుకోవాలి,
లోకాన్ని నమ్ముతూ నమ్మిస్తూ లేదా
నటిస్తూ

కళ్ళల్లో తేలే ఆశనిరాశల్నీ
కౌగిళ్ళలో నొక్కుకునే బాధల్నీ
అరుదుగా కొన్ని సంతోషాల్ని కూడా,
చూస్తూనే కదలాలి బండి, తప్పదు,
ఉద్వేగాలను గెలుస్తూ భరిస్తూ లేదా
వదిలేస్తూ

చెట్లు పుట్టలు వెనక్కి
మనుషులూ మమతలూ వెనక్కి
ఒక జీవితమో జ్ఞాపకమో వెనక్కి
వెళ్ళిపోయేవాడికి
ఏవీ కనపడవు చివరికి
ఇవేవీ మిగలవు గుర్తుకి.
తొలి ప్రచురణ : వాకిలి
జనవరి, 2015 సంచిక

సాంధ్యరాగం

రోజూ సాయంకాలం ఆఫీసు గేటు దగ్గరికి రాగానే కొన్ని వందల పక్షుల కువకువలు వినపడతాయ్. పగటి అలసటంతా చిరాగ్గా మారబోయే క్షణాలవి. ఆ వేళప్పుడు, ఇంటికి వెళ్ళేప్పుడు, ఆఫీసు బస్సు అందుకోవాలని దాదాపుగా పరుగెడుతూ కూడా, ఆ గుబురు చెట్లు దాటే అరనిముషం సేపూ ఆ కోలాహలాన్ని వినడం, నావరకూ నాకో టానిక్ లాంటిది. అన్ని వందల పక్షులక్కడలా చేరి కిచకిచమంటుంటే రొద అనిపించదు. విసుగనిపించదు. అక్కడేదో పెద్ద ఉత్సవం జరుగుతున్నట్టూ, చిన్నప్పుడెప్పుడో వదిలిపోయిన నేస్తాలందరూ ఓ గూటి క్రిందకు చేరి పట్టరాని ఆనందంతో కబుర్లాడుకుంటున్నట్టూ - సంబరంలానే ఉంటుందసలు.

ఎవరికైనా సరే, ఇంటికి వెళ్ళీ వెళ్ళగానే - సొంతగూటికి - అంత అల్లరీ సందడీ ఉంటే ఎంత బాగుంటుంది?! పెళ్ళైన కొత్తలో మా అత్తగారు పిలిచి, "మావాడికి కుక్కపిల్ల పెంచుకోవాలని ఏనాటి నుండో కోరికమ్మా, ఇంటికి రాగానే అది మీదమీదకొచ్చి ముద్దులాడడం, చుట్టూచుట్టూ తిరగడం ఇష్టమట, సరదాల మాటకేం గానీ ఆ చాకిరీ నావల్ల కాదని పడనివ్వలేదు..నిన్నూ విసిగిస్తాడెప్పుడో..ఇష్టమేనా అని. ఏం చెప్తావో మరి" అంటూ ఓ ముందస్తు హెచ్చరిక జారీ చేయగానే నా గుండెల్లో బండరాయి పడింది. ఇలా ఎవరైనా పెట్స్ అంటే ఇష్టమేనా అనో, లేదంటే మా స్నూపీ అసలు ఇష్టం లేకుండా ఎలా ఉంటుందీ అనో అంటే, నాకు ఆర్కుట్ గుర్తొస్తుంది. అందులో "డూ యూ లైక్ పెట్స్" అని ఓ ప్రశ్న ఉండేది. "యెస్, అట్ జూ" అని ఓ బ్రహ్మాండమైన ఆప్షన్ కూడా ఆ కింద కనపడేది. కళ్ళు మూసుకుని ఆ ఆప్షన్ క్లిక్ చేసిన కోట్లమందిలో నేనూ ఒకతెను. నా జంతుప్రేమ ఇంతమాత్రమేనని అప్పుడే అత్తగారి అబ్బాయిని పిలిచి చెప్పేదామనుకున్నాను కానీ, "ప్రతిదానికీ ఎడ్డెమంటే తెడ్డెమని ఆ అబ్బాయి మనసు కష్టపెట్టకు" అని పుట్టింట్లో అందరూ చెప్పిన హితబోధలు ఇంకా మర్చిపోకపోవడంతో, "పర్లేదండీ" అని నసిగాను. " నేనుండగా ఇంకా అవెందుకూ" అన్న నమ్మకాన్ని పెదవి దాటనీయకుండా కట్టడి చేసి.     
అనడమైతే అన్నాను కానీ, నా గొంతులో ఈ పక్షుల కువకువల్లో ఉన్నంత సంతోషం, ఉత్సాహం ఉంటాయా? గొంతులో ఉన్నది కళ్ళలో కనిపిస్తుందా? చేరాల్సిన మనసుకు చేరుతుందా ? ఇంతలా తనని మురిపిస్తుందా అన్నది ఇప్పటికీ సందేహమే.

సెక్యూరిటీ వాళ్ళను దాటుకుని ఓ సాండ్విచ్ లేదంటే మోసంబి జ్యూస్ పట్టుకుని బస్సు ఎక్కి అలా కూర్చుంటామా, అందరి మొహాల్లోనూ ఎంత నిశ్చింత కనపడుతుందో. సగం మందికి ఇంటికి వెళ్ళి పని చెయ్యాల్సి ఉంటుంది, ఆన్సైట్ కాల్స్, టీం మీటింగ్స్, నెట్వర్క్ బ్రేక్ అయితేనో డేటాబేస్ డౌన్ అయితేనో ఉండే తలనొప్పులూ, పిల్లల చదువులో అనారోగ్యాలో...అనుకోకుండా వచ్చే అతిథులో..
అయినా బాగుంటుంది. ఇంటికి వెళ్ళగానే మనకోసం ఒకరుంటారు అనుకోవడమో..మనం ఒకరి కోసం ఇష్టంగా ఇంటికి వెళ్తున్నాం అనుకోవడమో..ఏదైనా బాగుంటుంది. అయినా ఆ కాస్త ఉత్సాహమూ లేకపోతే బ్రతుకు బరువైపోదూ? చిన్నప్పుడు బడి నుండి ఇంటికి వెళ్తోంటే..ఒక్కోసారి దారిలోనే అమ్మ కనపడేది. పుస్తకాల బ్యాగు భుజాల మీదకి లాక్కుంటూ పరుగుపరుగున వెళ్ళి అమ్మ చేయి, చీరకొంగు కలగలిపి పట్టుకుని నవ్వేదాన్ని. అలా పట్టుకుంటే నడవడమెంత కష్టమో నాకు చీరలు కట్టుకునే వయసొచ్చేదాకా తెలీలేదు కానీ, ఆ కాసేపూ భలే ఉండేది, రోడ్డు మీద అందరూ మమ్మల్నే చూస్తునట్టు నాక్కొంచం సిగ్గుగానూ, మరికాస్త గర్వంగానూ ఉండేది. సందు చివరి తోపుడు బండి తాత దగ్గర అరటిపళ్ళు కొనుక్కుని ఆ రోజు బళ్ళో విశేషాలన్నీ చెప్పుకుంటూ ఇంటికొచ్చేదాన్ని. అరె, అమ్మ కూడా నాతో పాటే చెప్పులు విప్పుతోందే అన్న స్పృహ ఆ వయసులో ఉండేది కాదు. అది కావాలనీ, ఇది కావాలనీ, ఇలా చెయ్ అలా చెయ్ అని ఎంత విసిగించేవాళ్ళమో అక్కా నేనూ. చిత్రంగా చేతిలో మంత్రదండమేదో ఉన్నట్టే పది నిముషాల్లో కోరింది మా చేతిలో ఉంచేది. కొన్నిసార్లు గారంగానూ, కొన్నిసార్లు పెంకిగానూ తినమని మారాం చేస్తూంటే బుజ్జగించి తినిపించి, మూతి తుడిచి ఆటలకు పంపించే అమ్మ సహనం...నాకు పిల్లలు పుట్టాక నాకు ఏ కాస్తైనా అబ్బుతుందా అని ఒక్కోసారి బెంగగా ఉంటుంది. అయినా అమ్మ ఎప్పుడూ అమ్మే. నా తోటి వాళ్ళను చూస్తూంటాను కదా..అన్ని ఒత్తిడులనూ భరించి పని అయిందనిపించుకుని, ఆఫీసు ఎదురుగా ఉండే డే-కేర్ సెంటర్ నుండీ పిల్లలను తెచ్చుకుని, ఆ పసినవ్వుల్లో పడి లోకాన్ని మర్చిపోయే, మురిసిపోయే అమ్మలు కనపడ్డప్పుడల్లా నా అనుమానం ఎంత అసంబంద్దమైనదో తెలిసొస్తుంది. తరాలెన్ని మారినా మారిపోనివీ కొన్నుంటాయన్నది ఎంత నిజం!  

సాధారణంగా బస్సులో కూర్చున్నాక సగం సేపు ఈ తల్లీ పిల్లల్ని చూడటంతోనే సరిపోతుంది. బాగా సీనియర్స్ ఎవరైనా పక్కన కూర్చుంటే, మా రూట్‌లో రోజురోజుకీ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తోన్న షాపుల్నీ, షాపింగ్ కాంప్లెక్సుల్నీ, అపార్ట్‌మెంట్స్‌నీ చూపెడుతూ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. మూడేళ్ళ క్రితం వాళ్ళు పాతిక లక్షలకి కొన్న ఫ్లాట్ ఇప్పుడు ఎన్ని లక్షలైందో వద్దన్నా విడమరచి చెబుతూంటారు. అప్పట్లో ఈ ఖాళీ రోడ్డులో ఇల్లు తీసుకున్నదుకు స్నేహితులూ బంధువులూ తమని తెలివితక్కువ వాళ్ళన్నారనీ, ఇప్పుడు వాళ్ళే ఈ అభివృద్ధినంతా కళ్ళింతలు చేసుకుని చూస్తూంటారనీ కాలరెగరేసి మరీ చెబుతూంటారు. నిజమే, మేమిక్కడికి వచ్చిన కొత్తల్లో, ఈ సర్జాపూర్/జైల్ రోడ్‌లో అన్నీ తుప్పలే. అక్కడొకటీ అక్కడొకటీ అన్నట్టుండేవి ఇళ్ళు. ఆఫీసు బస్సు మిస్ అయితే, ఆటోలో వెళ్ళాలంటే గుండె దడదడలాడేది. రోజూ వార్తల్లో చదువుతున్నవన్నీ మనశ్శాంతిగా బ్రతకనిస్తున్నాయా మరి?! ఇప్పుడేమో ఇన్ని వేల మంది ఎదురెదురు నడుస్తున్నట్టుండి విసుగొస్తోంది. సౌకర్యానికీ, అవసరానికీ, ఇష్టపడి ప్రేమించడానికి మనకున్న నిర్వచనాలన్నీ ఏ క్షణానికా క్షణం ఎంత గమ్మత్తుగా మారిపోతూంటాయో.

బస్సు దిగాక మా ఇంటికి ఒక "ఎల్" ఆకారంలో ఉండే చిన్న వీధిలో నడవాల్సి ఉంటుంది. ఓ ఏడెనిమిది నిముషాల నడక. అక్కడ కూడా కొత్తగా రెండు భవంతులు కట్టడం మొదలైంది. ఇసుక, కంకర్లు మోసుకుంటూ వచ్చి పోయే ట్రాక్టర్లతో రోడ్డంతా పాడైపోయింది. ఎప్పుడో సరిగా గుర్తు లేదు, బహుశా ఈ రోడ్డు పాడైపోయిన ఓ వారం పది రోజులకు కాబోలు..ఆఫీసు నుండి వస్తూ - వాళ్ళిద్దరినీ చూశాను. బహుశా అక్కడ పని చేసే వాళ్ళై ఉంటారు. నైట్ వాచ్‌మెన్ అయి ఉంటారు. ఆ  నిర్మాణంలో ఉన్న ఇళ్ళకు పక్కగా ఉన్న ఖాళీ స్థలంలో చిన్న గుడిసె వేసుకుని అక్కడే ఉంటున్నారు. రోజూ మేం సాయంకాలం ఆ దారిన వచ్చే వేళకి, అంటే ఆరున్నరా ఏడూ మధ్యలో - గుడిసె గుమ్మానికెదురుగా నాలుగు రాళ్ళ పొయ్యి రాజేసుకుని దానికి ఓ వైపుగా కూర్చుని కనపడేవారు. గుడిసెలోని గుడ్డి దీపపు వెలుతురు లీలగా ఆ ఇద్దరి మీదా పడుతూ ఉండేది. ఆమె భుజం చుట్టూ తిప్పుకున్న చీరతో, తల వంచుకుని రొట్టెలొత్తుతూనో, అతని మాటలు వింటూనో కనపడేది. అతను ఆమె చేసి ఇస్తోన్న రొట్టెలు పెనం మీద కాలుస్తూ ఆపకుండా ఏవో కబుర్లు చెబుతూ ఉండేవాడు. ఆ నిర్జన వీథుల్లో నుండీ అతని గొంతు, అతని నవ్వూ గరగరమంటూ వినపడుతూ ఉండేవి.

మా కొలీగ్ దివ్య వాళ్ళ తల్లిదండ్రులు ఈ ఇంటికి ఎదురుగా ఉండేవారు. ఆమె ప్రతిరోజూ పొద్దున రెండేళ్ళ పిల్లను వాళ్ళింట్లో దించేసి, సాయంత్రం వస్తూ వస్తూ ఇంటికి తెచ్చుకుంటుంది. తనతో కలిసి వచ్చిన రోజుల్లో, ఆమె పిల్ల కోసం వెళ్ళి వచ్చేవరకూ నేనక్కడే రోడ్డు మీద నిలబడి దిక్కులు చూస్తూ..ఎవరూ లేరనిపిస్తే ఈ జంటను చూస్తూ కాలక్షేపం చేసేదాన్ని. ఒక్కోసారి సిగ్గనిపించేది. ఒక్కోసారి తప్పనిపించేది. వాళ్ళ ఏకాంతంలోకి తొంగి చూస్తోన్నందుకు నన్ను నేనే మందలించుకునేదాన్ని. అయినా కుతూహలమే గెలిచేది. అసలూ, చూపు తిరిగిపోతోంటే ఇప్పుడు కాబట్టి ఇలా ఆగి రోడ్డు మీద నిలబడి వాళ్ళని చూస్తున్నాను కానీ, విజయవాడలో ఇంజనీరింగ్ చదివే రోజుల్లో నా స్నేహితురాలు రమ్య, బెంజ్‌సర్కిల్ దగ్గరో, కామయ్యతోపు దగ్గరో బస్సు కోసం ఆగి ఉన్నప్పుడు గోడల వైపు తిరిగిపోయి సినిమా పోస్టర్లన్నీ చదువుతుంటే భలే కోపం వచ్చేది. దానికదో చిత్రమైన అలవాటు. హీరో బాగున్నాడనో, హీరోయిను బట్టలు బాలేవనో చెప్పి ఊరుకోవడం కాదు, పోస్టరు మీద ఎన్ని పేర్లుంటే అన్ని పేర్లూ శ్రద్ధగా పైకే చదివేది. జతగా ఉన్న వాళ్ళమెవరైనా "అబ్బా, పదవే, మురుగుకాలువ పక్క నిలబడి మోరెత్తి ఏమిటా లేకి పనులు" అని చిటపటలాడితే, "బాగుందే! అందరం సిగ్గుపడి వెళ్ళిపోవడానికా అంతలేసి మైదా పోసి అతికించి గోడలు పాడు చేస్తోందీ" అని ఎదురు పోట్లాడేది తప్ప పోస్టర్లు వదిలేది కాదు. నేను కూడా రమ్యలా తయారయ్యాను, దివ్య పక్కనున్న సంగతి మర్చిపోయి చాలా సార్లు అలాగే తదేకంగా వాళ్ళిద్దరినీ చూసేదాన్ని.

సాయంకాలాలు మొదలైన అలవాటు మెల్లిగా పగటికీ పాకింది. ఎంత హడావుడిలో పరుగులు తీస్తున్నా, ప్రతి ఉదయమూ నా కళ్ళు తప్పకుండా అటువైపు చూసేవి . నీళ్ళ తొట్టి నింపుతూ అతడూ, మడి దగ్గర మట్టి పనేదో చూస్తూ ఆమె. కబుర్లు మాత్రం అతడివే. పదహారేళ్ళకు మొదటిసారి ప్రేమలో పడ్డ యువకుడిలో ప్రేయసి మీద ఉండే పిచ్చి ఆసక్తీ, ఇష్టమూ నాకతడి ప్రవర్తన గుర్తు చేసేది. ఆమె ముఖం పగలు కూడా నాకంత స్పష్టంగా కనపడేది కాదు. ముఖంలో ఏ భావమూ గట్టిగా కనపడకపోవడమే ఆమె ప్రత్యేకత ఏమో అని చాలా సార్లు అనుకోవడం మాత్రం గుర్తుంది. ఒక్కోరోజు పొద్దుపొదున్నే నవారు మంచానికి అటూఇటూ కూర్చుని బాగు చేస్తూ కనపడేవాళ్ళు. ఇసుక చేటలని చేతులు మార్చుకుంటూ, ఇటుకలు విసిరేసుకుంటూ, గోడల మీద పైపులతో నీళ్ళు చల్లుతూ..ఇలా ఏ రోజైనా ఏ వేళైనా ఇద్దరూ జంటగా పని చేసుకుంటూ కనపడేవాళ్ళు. చుట్టూ అలాంటి కూలిపనులే చేసుకుంటూ మరో పది మంది బనీన్లు నిక్కర్లతో అక్కడక్కడే తిరుగుతూ ఉన్నా, చిత్రంగా నా కళ్ళు అందరినీ క్షణాల్లో వడబోసి, ఈ జంటను మాత్రమే చూపించేవి. 
దివ్యకి నా వాలకం కొంచెం చిత్రంగా అనిపించి ఉండవచ్చు.

"ఏంటి , వాళ్ళని మింగేసేలా చూస్తున్నారు రోజూ?" అని అడగనే అడిగిందో రోజు.
"బాగుంటోంది..ఏంటో తెలీదు. మీకేం అనిపించడం లేదా?" కొంచం మొహమాటంగానే, ఇబ్బందిగానే అడిగాను.
"అనిపిస్తోంది. పి.డి.ఏ పచ్చి పాపమని " గంభీరంగా చెప్పి పకపకా నవ్వింది.
" వాళ్ళెప్పుడూ ఏ పని చేసినా కలిసే చేస్తారు, గమనించారా? వంట కూడా! బాలేదూ?" పట్టు వదలకుండా చెప్పాను.
"ఏంటీ? కలిసి వంట చేయడమా? చాల్లెండి మానసా! ఇంతోటి ఇద్దరి మనుషుల వంటకి నాలుగు చేతులెందుకు? అయినా ఏమో బాబూ, నాకైతే అన్నీ నేను చేసుకుంటేనే సుఖమనిపిస్తుంది. వాళ్ళకి చెబితే కూరలో ముక్కలకి పులుసు ముక్కల్లానూ పులుసంటే కూర ముక్కల్లానూ తరిగక్కడ పారేస్తారు. వంటగదిలో కాలు పెడితే డబ్బాలన్నీ గల్లంతే ఇక! సర్దుకోలేక తల ప్రాణం తోకకొస్తుంది. నాకు విసుగు" కచ్చితంగా చెప్పేసింది దివ్య.

నాకేమనాలో తోచలేదు. నిజానికి నాకూ అలాగే అనిపిస్తుంది. అందుకేనేమో గట్టిగా ఏం చెప్పలేకపోయాను. కాని..ఆ గుడిసె దగ్గరి జంటని అప్పటికి మూణ్ణాలుగు నెలలుగా చూస్తూ ఉన్నాను కనుక, నేను సరిగా మాటల్లో పెట్టలేకపోతున్న సౌందర్యమేదో ఉందని మాత్రం బలంగానే నమ్మాను. నక్షత్రాలు తొంగి చూసే ఆ పూరింటి గువ్వల్లో నన్ను ఆకర్షించింది ఏమిటో ఏదో ఒక రోజు దివ్యకి అర్థమయ్యేట్టుగా చెప్పగలిగితే బాగుండు అని పదే పదే కోరుకున్నాను.

చూస్తూ చూస్తూ ఉండగానే రెండు భవంతుల నిర్మాణమూ పూర్తైపోయింది. వాళ్ళు పెంచిన పూల మడి నిండా ముద్దబంతి పూలు. ఎంత శ్రద్ధగా చూసుకునేవాళ్ళో వాటిని. ముచ్చటేసేది.

నేనొక వారం రోజులు పని మీద ఊరెళ్ళవలసి వచ్చింది. తిరిగి వచ్చిన రోజు సాయంత్రం ఆఫీసు నుండి బయలుదేరుతోంటే, గేటు దగ్గర పక్షుల కువకువలు వింటూంటే మళ్ళీ వాళ్ళే గుర్తొచ్చారు. ఏం చేస్తూ ఉండుంటారీ వేళ? అనుకోగానే నా మనసు అల్లరిదైపోయింది.

ఆ రోజు దివ్య రాలేదు, అప్రైసల్ టైం కదా, ఏదో మీటింగ్ ఉండి ఉంటుంది. ఒంటరిగా నడుస్తున్నాను. గంపెడు పంది పిల్లలు రోడ్డుకి అటూ ఇటూ పరుగెడుతూ నన్ను నెమ్మదిగా నడవమన్నాయి. చెన్నకేశవస్వామి ఆలయం నుండి భజనగీతాలేవో స్పష్టాస్పష్టంగా వినపడుతున్నాయి. నేనూ మా ఇళ్ళ వైపు కూనిరాగాలు తీస్తూ నడుస్తూ, అలవాటుగా అటుకేసి చూస్తే...ఏముంది?! ఏమీ లేదు. గుడిసె మాయం. గుండె చివుక్కుమంది. ఆ జంట దరిదాపుల్లో ఎక్కడా కనపడలేదు. బహుశా ఇక కనపడరేమో కూడా. రెండు భవంతుల్లో ఒకటి ఆడపిల్లల పి.జి. రెండవది అబ్బాయిల పి.జి (పేయింగ్ గెస్ట్ హవుస్) గా మార్చడం జరిగిపోయింది.

పూలమడివైపు దిగులుగా చూస్తూ అడుగులేస్తున్నాను. పి.జి లు దాటగానే ఉన్న చెట్టు క్రింద మసక చీకట్లలో ఓ అమ్మాయీ, అబ్బాయీ.  ట్రాక్స్ లో ఉన్నారు. చెట్టునానుకుని నిలబడి ఉన్నారు. గుసగుసలు. నవ్వులు. ఒకరి చేతుల్లో మరొకరి వేళ్ళు. ఆ వేళ్ళ మధ్య నుండీ నలిగి రాలి పడుతున్న బంతి పూరెమ్మలు.
నేను వడివడిగా వాళ్ళను దాటుకు వచ్చేశాను. పూలబాసలూ, పుష్పవిలాపమూ నాకర్థం కావులే కానీ, బహుశా తరువాతి ఇంటి కిటికిలో నుండీ "బేనాం సా యే దర్ద్" అంటూ తేలి వచ్చిన పాటకనుకుంటాను, దిగులు మేఘంలా కమ్ముకుంది.

డిసెంబరు, 2014 సంచిక

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...