కొండలు

ఆకాశం మీద
పసివాడొకడు
ఎగుడుదిగుడు గీతలు గీసినట్టు
కొండలు
నిలువెత్తు బద్ధకంతో
మత్తగజమొకటి
మోకాళ్ళ మీద కూలబడినట్టు
కొండలు
మెలికల నది దారుల్ని దాస్తూ
యవ్వనవతి సంపద లాంటి
ఎత్తుపల్లాల్ని మోస్తూ
అవే కొండలు.
పసిడికాంతుల లోకాన్ని
పైట దాచి కవ్విస్తూ
పచ్చాపచ్చటి నున్నటి దేహాన్ని
వర్షపు తెరల్లో తడిపి చూపిస్తూ
సిగ్గెరుగని దూరపు కొండలు!
___________________
తొలిప్రచురణ - ఈమాటలో
నవంబరు, 2014

9 comments:

  1. చాలా బాగుంది. ఎన్నోసార్లు చూసిన కొండలను కొత్త కోణంలో చూపించారు. చదువుతున్నంత సేపు కాష్మీరు లోని వైష్ణవ్ దేవి,ఋషికేష్, శ్రీశైలం, తిరుపతి కొండలు కళ్ల ముందు మెదలాయి.

    ReplyDelete
    Replies
    1. Thank you, Sriram. నేను చూడాల్సినవి ఇంకా చాలా ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. :-)

      Delete
    2. " మెలికల నది దారుల్ని దాస్తూ" లైన్ చదువుతున్నపుడు, ఆ కొండలతో పాటుగా గుల్జార్ రాసిన ఈ పాట గుర్తుకు వచ్చింది.

      https://www.youtube.com/watch?v=zKGpVv3d7Vk

      ఎంతో ప్రతిభ ఉంటే గాని చిన్న పదాలతో గొప్ప భావాలను రాయలేరు. చాలా బాగా రాశారు.

      Delete
    3. నాకూ ఇష్టమైన పాటేనండీ..మొట్టమొదటి సీన్‌లో కనపడ్డ కొండలు..నేను మొదటి పాదంలో రాసిన మాటలు భలే గుర్తు చేశాయండీ. థాంక్యూ.

      Delete
  2. మీ కవితలు వొక చిత్రాన్ని గీసి దృశ్యం చేస్తాయి

    ReplyDelete
    Replies
    1. రాజారాం గారూ, కొత్త కవితల మీద మీ స్పందనలన్నీ ప్రోత్సాహకరంగా ఉంటున్నాయండీ..ధన్యవాదాలు.

      Delete
  3. ఆ మొదటి ఎక్స్ప్రెషన్ అద్భుతం అండీ .. చాలా బావుంది మానస గారూ :)

    ReplyDelete
    Replies
    1. నాగిని గారూ..మీకు మీ బుజ్జిగాడు గుర్తొచ్చాడు కదూ! :) కవిత నచ్చినందుకు చాలా సంతోషమండీ...ధన్యవాదాలు.

      Delete

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...