ధారాళంగా గాలి వీస్తున్నా ఆ మందిరంలో ఎవ్వరికీ ఊపిరాడటం లేదు. అందరి చూపూ ఒకే యువతి మీద. నిన్న లేని అందమేదో ఆమెలో అకస్మాత్తుగా కనపడి స్థాణువులుగా మార్చింది వారందరినీ. ఆ ఒంపుసొంపులూ వయ్యారాలూ సరే, రాజ్యమంతా జల్లెడ పడితే చూపు తిప్పుకోనివ్వని అందగత్తెలకేమంత కొదువ లేదు. వాళ్ళని ఆకర్షిస్తున్నది ఆ మచ్చెకంటి కన్నుల్లోని మెరుపు. ఆమె పగడపు పెదవులపైని సిరినవ్వు. ఈ అదనపు ఆభరణాల విలువేమిటో తెలిసినదానిలా అతిశయంగా కూర్చుని ఉందామె. ప్రియసఖులందరి మధ్యా ఉన్నదన్నమాటే కానీ, ఉండుండీ ఆ నగుమోములో మెరుస్తోన్న నవ్వొకటి ఆమె మనసక్కడ లేదనీ, మరెక్కడో చిక్కుకుని ఊగిసలాడుతోంటే, ఈమె తీయని అవస్థేదో ఇష్టంగా అనుభవిస్తోందని చెప్పకనే చెబుతోంది.
"ఇంతకీ ఎవరతను?" కుతూహలాన్ని అణచుకోలేని ఓ చెలి ప్రశ్నించింది.
ఆ ప్రశ్న వినపడ్డ వైపు ఇష్టంగా చూసిందామె. అటు తిరిగి సర్దుకు కూర్చుంది. కాలిమువ్వలు ఘల్లుమన్నాయి. మెడలోని హారాలు, చేతి గాజులు సన్నగా సవ్వడి చేసి ఆమె చెప్పబోయే సంగతులకు శ్రుతి సిద్ధం చేశాయి.
"ఏ రాజ్యమో తెలిసిందా"
"దేవలోకమే అయి ఉంటుంది కదూ"
"జగదేకవీరుడట? మచ్చలేని చందమామట?"
జలజలా రాలుతున్నాయి ప్రశ్నలు.
ఆమె వెంటనే బదులివ్వలేదు. మరపురాని కలను తల్చుకుంటునట్టుంది.
"ఎదురు చెప్పాడని ఓ చాకలివాణ్ణి ఠపీమని బుర్ర మీద కొట్టి ఒకే దెబ్బతో నేల కూలేలా చేయలేదూ..? అప్పుడు చూశాను" మెల్లిగా చెప్పింది.
"ఓహ్!..అతగాడా?" ఆ పరాక్రమవంతుడి రూపాన్ని గుర్తుచేసుకుని ఆశ్చర్యపోయిందో అలివేణి.
"ఊ..చూశానా?!...చూపు తిప్పుకోలేను. తప్పుకుని ముందడుగూ వేయలేను. ఆగి పలకరించేంత భాగ్యమీ జన్మకెలానూ లేదు. మరేం చేయనూ?"
"మరేం చేశావూ?" లేలేత యవ్వనాల ఇందుమతి ఒకతె అల్లరిగా నవ్వి అడిగింది.
"ఈనాటి పున్నెమయి ఉండదులే! వేయిన్నొక్క జన్మల తపఃఫలాన్ని అతని చూపు సోకితే చాలని దాచుకుని ఉంటాను. అందుకేగా చూశాడతడు నన్నూ."
ఉయ్యాల మీద నుండి లేచిందామె. పట్టు కుచ్చిళ్ళు పసిడి పాదాల పైని పారాణిని ముద్దాడుతున్నాయి. ముంగురులు అల్లనల్లన కదులుతున్నాయి. కన్నుల్లో ఏవో మెరుపు కలలు.
"దాటుకు వెళ్ళిపోలేదూ?"
"ఊహూ! నువ్వు నమ్మవు శాంభవీ. తిన్నగా నా దగ్గరికే వచ్చేశాడు.
'పద్మాక్షీ' అని పిలిచాడు.
నన్ను.
ఈ నిర్భాగ్యురాలిని.
కన్నెత్తైనా ఏ పురుషుడూ చూడడే! కనపడితే దాటుకు పోతారే! కన్నులు పొరబాటున కలిస్తే నిందలేస్తారే..అలాంటి నన్ను.." ఉద్వేగంతో ఆమె పెదవులు వణుకుతున్నాయి - "ఎవడమ్మా వీడు, ఇదో రకం వెక్కిరింపే సుమా అనుకున్నాను. ఆమాటే అడిగాను కూడా!"
" నిజం చెప్పాడా మరి?"
" 'నీతో పరిహాసాలెందుకు చినదానా, ఉన్నమాటే అన్నాను. ఆ చేతిలో ఏమిటవీ, చూడవచ్చునా?' అన్నాడు.
ఏమీ గుర్తు లేదు. మైపూతలివి అన్నానా, నేను ఫలానా అని చెప్పానా! చెప్పలేదా..ఏమో!
నా చేతిసంచీ నుండి చొరవగా నచ్చినవి తీసుకున్నాడు. నాకేమయిందో తెలీదు. మనసు సరే, మోహపువరదలో కొట్టుకుపోతోంది. ఈ దేహం కూడా! ఇలా ఎలా మారిపోయిందో తెలీలేదు. మునివేళ్ళపై నిలబడి నా నడుం పట్టి సాగదీసినట్టున్నాడు. నా కన్నుల్లోకి చూశాడా? నవ్వాడా? కలగన్నానా? తెలియలేదు. వెనుతిరగబోతోంటే చేయిబట్టి ఆపాను. 'పని మీద వెళుతున్నా, వస్తూ వస్తూ ఆగుతాగా' అంటూ సున్నితంగా విడిపించుకున్నాడు. నా బేలకన్నుల్లోకి చూసి నవ్వుతూ బుగ్గన చిటికె వేసి వెళ్ళిపోయాడు.
అతని దయ, కరుణ, నిష్కల్మష ప్రేమ - ఈ జన్మను ఆ కమలాక్షుడి పాదారవిందాలకు సమర్పణ చేసినా ఆ క్షణమాత్రపు సౌఖ్యానికి బదులు తీర్చుకోలేను. నా బ్రతుకంతా కన్న కలలను అతని పిలుపొక్కటి తీర్చింది. హృదయంలోని ఇన్నేళ్ళ పరివేదనా అతని ప్రేమకు కరిగిపోయింది. అయినా ప్రేమంటే ఏమిటి? బ్రతుకంటే మిగిలిన ఆశ. అంతేగా? నాకది దొరికింది, నిథిలా. అతనిలా.
నాకిక దుఃఖం లేదు. అతగాడి సాంగత్యం వినా వేరొక ఆశ లేదు. కేవలం అతని చూపు సోకే నా మనోవికారాలన్నీ మాయమయ్యాక, అతని స్పర్శకు ఈ దేహంలో మువ్వంపులు మాయమైపోవడం ఆశ్చర్యమా? "
కాదనలేని ఆశ్చర్యంతో, ఔననలేని అపనమ్మకంతో వింటున్నారు జలజాక్షులందరూ. "ఎలా వెళ్ళనిచ్చావు? మళ్ళీ వస్తాడని ఎలా నమ్మావు నీవు? తనువు ప్రాణదీపానికి దూరమైపోతే, బ్రతుకు చీకటైపోదూ?"
సమ్మోహనంగా నవ్విందామె.
"నెచ్చెలీ! . ప్రాణదీపం పరంజ్యోతి అని నమ్మాక, దిగులెందుకు? అతని కృప నేనడిగితే వచ్చిందా? అతని దయ, ప్రేమ నేనాతని ముందు మోకరిల్లితే వచ్చి వరించాయా? అయినా శివకామినీ! ఆ భగవంతుడే వచ్చి, నే మళ్ళీ వస్తానని మాటిస్తే శంకించమంటున్నావా? నా అల్పమైన ప్రేమని పోగులుగా మలచి ఆ అపార ప్రేమమయిని బంధించమంటున్నావా?
అతనిక రాకపోనీ. నన్నిక మరచేపోనీ. అతని కరస్పర్శ నా తోడిదే ఉంది. ఆ చూపులు నన్ను విడిచిపోవు. ఆ నవ్వులు నన్నొదిలి మరో వైపు వెళ్ళలేవు. వెళుతూ వెళుతూ అతను వాయించిన మురళీ గానం, అమృతమై ఇంకిపోయింది నాలోకి. వేరు పడలేదు.
చెప్పండి. ఇంకా దైన్యం నిండాలా? వలపు సంకెళ్ళతో బంధించాలన్న తలపు ఉండాలా? అతన్ని చూశాకా? కలిశాకా? అతనొక వరమై నన్ను తాకాకా? నా మనసాతనిలో ఐక్యమయ్యాకా? ఊహూ! అనల్ప సంతోషమిది. అల్పమైన కోరికలతో మామూలు దాన్ని కాలేను"
" సరే, జగదేకవీరుడంటున్నావు, సరిలేని అందగాడంటున్నావు. నిన్నెందుకు చూశాడో తెలీదు. మనిషిని అమాంతంగా మార్చేయగల మాయనెలా సొంతం చేసుకున్నాడో తెలీదు. సరి సరి, ఇంతకూ..మళ్ళీ వచ్చాడా మానసచోరుడు?"
" మాట మీరేవాడా ఆ మోహనమురళీధరుడు? వచ్చాడు. వెన్నెల రాత్రి వెంటాడే పాటేదో గొంతులో మోసుకుంటూ వచ్చాడు. కాసేపు కబుర్లతో నవ్వించాడు. ఇంకాసేపు చూపులతోనే కవ్వించాడు. నేనొక మురళిననుకున్నాడేమో, మునివేళ్ళతో తాకుతూ గిలిగింతలిచ్చాడు. మునిపంట నలిగిన నా సిగ్గుని దోచుకోగలనంటూ పందెమేశాడు. దాగుమూతలాడాడు, దొంగ, గంతలు కట్టకుండానే నా రెప్పలు మూసుకుపోయే కబుర్లేవో గుసగుసగా చెప్పాడు.
ఆతిథ్యం నచ్చిందన్నాడు. ఏం కావాలో కోరుకోమన్నాడు."
"మరి నువ్వు?" ఆసక్తిగా ముందుకు వంగి అర్థోక్తిలో ఆగారందరూ.
" ఏమనగలను? మొదలెట్టిన ఆటలన్నీ పూర్తి చేయమన్నాను. ఓడీ గెలిచే ఆటలుంటాయని నాకు మాత్రం తెలియదా? వలరాజకేళీతరంగాల్లో ఊయలూపమన్నాను."
నివ్వెరపోయారందరూ.
" అయ్యో! వెర్రితల్లీ. నీవే అంటివే పరమాత్ముడనీ! నీవే చెప్పావే అతడు మాట మీరని పురుషోత్తముడనీ, ఏమడిగినా ఇస్తాడనీ. ఇదేనా నువ్వు కోరుకున్నది?" నిరాశ ఉట్టిపడుతున్న గొంతుతో అపేక్షగా పలికారొకరు.
ఆశ్చర్యంగా చూసిందామె. "ఇంకేం కావాలీ?"
"మోక్షం. కాదూ?"
"ఇంతకు మించినదా అది? అసాధ్యం. కాదూ? " పరవశమవుతూ పలికిందామె.
ఎవ్వరి భాగ్యమెంతో ఎవ్వరు తేల్చగలరు. భారమైన హృదయాలతో నిష్క్రమించారందరూ.
శ్రావణసమీరాలకు మబ్బులు విరవిరా విచిపోతున్నాయి. మేఘాల అడ్డు తొలగిన చంద్రుడు మరింత ప్రకాశవంతుడై కాంతులీనుతున్నాడు. కొలనులో నీళ్ళు మెరసిపోతున్నాయి. దాని పొంతనున్న చంద్రోపల వేదికపై నవ్వు మోముతో శ్యామసుందరుడు కూర్చునట్లు తోచిందామెకు. లోకాలను విస్మరించిన ప్రేమలో అక్కడికి పరుగు తీసింది భామిని.
Adbhutham!!!!
ReplyDeletebhalea raastaaru meeru .chaalaa baavundi Manasa garu :0 Radhika (nani)
ReplyDeletesimply superb andi. chaduvutunte edo lokamlo viharinchi vachchinattanipinchindi.
ReplyDeleteచాలా బావుందండీ..
ReplyDeleteVery nice write-up Manasa garu :)
ReplyDelete* కార్తిక్..థాంక్యూ! :)
ReplyDelete* రాధికగారూ - నచ్చినందుకు చాలా సంతోషమండీ...ధన్యవాదాలు. :)
* స్పురిత గారూ - ద్వాపర యుగం దాకా వెళ్ళలేకపోయినా ప్రయత్నించాలనుకున్నానండీ.. :D మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు.
* వేణూశ్రీకాంత్ గారూ - ధన్యవాదాలండీ..:)
* నాగిని గారూ- :)) Many Many Thanks :)
లేదనుకున్న అదృష్టం పలకరించి"పోయినా",
ReplyDeleteమువ్వంపులు మాయమయినా కాకపోయినా,
ఆ ..ఆలంబన!
ఎందరో ఇంత మాత్రమూ లేక అలమటించిపోతున్నారు.
ఈ ఙ్ఞాపకంతో బ్రతకలేమా?
అనే పెన్నిధి ఏదో దొరికినపుడు........ఇక మోక్షం సంగతెందుకు?
అవస్థల్లో తీయని మెరుపంచులేవో చూసేసుకుంటూ, వాటినే చీరలనేసుకుంటూ.................
బ్రతికేయటంలో ఉన్న గొప్పతనం!!!!
కుబ్జలకూ, మీరాలకూ చిక్కిన ఆ చిక్కని రసాన్ని చక్కగా అందించారు.
మీ రచనలో తొంగి చూస్తున్న భావుకత్వం మిమ్మల్ని ఒక మంచి కవయిత్రిగానో,రచయిత్రిగానో ఉన్నత స్థనంలో నిలబెడుతున్నది.చాల మంచి రచన,
ReplyDeletemanasa garu u r my inspiration .please keep write such a awesome ones.
ReplyDelete* భావకుడన్ గారూ..చాలా రోజులకు కనిపించారు, చాలా సంతోషమైంది మీ మాటలు చదివి. భాగవతంలోని కుబ్జ కథ స్పూర్తి్‌తో అని వ్రాయాలా అనుకుంటూనే ఆగిపోయాను. స్పష్టంగానే ఉంది కదా అని. మీ స్పందన కాస్త బలం చేకూర్చింది. ధన్యవాదాలు. అవునండీ, మీరా, తరిగొండ వెంగమాంబ..ఈ కథలు చదవిన వెంటనే పాఠకుల పని పూర్తవదు. నిజానికి అప్పుడే మొదలవుతుందేమో కూడా. ఎన్నెన్ని ఆలోచనలు, ఎంత ఉద్వేగం.
ReplyDeleteభ్రమర గీతాలు చదివినా కలుగని ఉద్వేగం నాకు కుబ్జ కథ ద్వారానే కలిగిందనడం అతిశయోక్తి కాదు. అందుకే నావంతుగా ఈ నాలుగు మాటలూ వ్రాసుకున్నాను.
** రాజారాం గారూ, మీ మంచిమాటలకు ధన్యవాదాలండీ.
* రెహ్మాన్ గారూ - ధన్యవాదాలు. మీ నవ్వుని రచన నచ్చిందన్నట్లుగా అర్థం చేసుకుంటున్నాను ;)
* రాధిక గారూ - ధన్యవాదాలండీ.. :).
చాలా బావుందండీ..
ReplyDeleteమువ్వంపులూ, చాకలివాడి ఉదంతం, మైపూతలూ.....ఇవన్నీ ఉన్నా ప్రత్యేకంగా "ఇదీ" అంటూ చెప్పి ఉంటే ఆ అందం పోయేదిలెండి.
ReplyDeleteనాగ శ్రీనివాస్ గారూ, ధన్యవాదాలండీ.
ReplyDeleteభావకుడన్ గారూ..అదే నాకూ అనిపించి..