"అసాధ్యమైన ఏకాంతం అంటూ ఏమీ లేదు. ప్రపంచ రహస్యాలను రూపకాలంకారాలతో తప్ప హేతువాదంతోనో, తర్కంతోనో విప్పి చూపలేము" - నోబుల్ స్వీకారోపన్యాసంలో నెరూడా చెప్పిన మాటలివి.
కవిత్వం నా వరకూ చాలా ప్రశ్నలకు ఒప్పించగల సమాధానమైంది. దేవరహస్యాలను విప్పి చెప్పిన మహామంత్రమైంది. కనుక, ఆ రహస్తంత్రులు మీటే రసవిద్య నేర్చిన కవుల పట్ల కూడా సహజంగానే నాకు వల్లమాలిన ఆసక్తి, గౌరవం, ప్రేమ. ఓ ఐదారేళ్ళ క్రితం విజయవాడలో పుస్తక ప్రదర్శనకు వెళ్ళినప్పుడు, "కవితా దశాబ్ది" అనే పుస్తకం కంటబడింది. నూటయాభై కవితలు - సుమారు ఓ దశాబ్ద కాలంలో వచ్చిన వందల కవితలను వడబోసి ప్రచురించారు సంపాదకులు ఎస్వీ సత్యనారాయణ గారు, పెన్నా శివరామకృష్ణ గారు. ప్రతి కవితకూ చివర, మూణ్ణాలుగు వాక్యాల్లో ఆ కవి గురించి చిన్న పరిచయం కూడా జత చేశారు. ఆ చిరుపరిచయం ఆసక్తి రేకెత్తించిన మాట వాస్తవమే కానీ, సామాన్యంగా కవితా సంకలనాలు నన్నట్టే ఆకర్షించవు. ఒక్కో కవిదీ ఒక్కో కవిత - ఏం సరిపోతుంది? కవి తత్వం అర్థం కాదు, కవి గొంతు బలంగా వినపడ్డట్టు ఉండదు, కవి మనసుల్లో చొరబడి మాయ చేసినట్టుండదు. కేవలం పొగమంచులా కమ్ముకునే కొన్ని ఆలోచనలు మిగులుతాయంతే. అది నాకు నచ్చదు. కవిత్వాన్ని కాలక్షేపం బఠానీ అనుకోలేకపోవడమనే బలహీనతే కాదు, తారసపడ్డ ప్రతి కవీ షడ్రసోపేతమైన విందుభోజనం లాంటి అనుభవమే తన కవిత్వం ద్వారా మిగల్చాలన్న దురాశ కూడా కలదాన్ని.