తీపి విషం


విరిగిపడ్డ స్వర్గ శకలం నుండి
నవ్వుతూ రమ్మని పిలిచింది
చేయందించింది, లాగింది
నాది కాని ఏదో లోకంలోకి.
మునివేళ్ళతో పెదవులను ముద్దాడి
మధువు నాపై చిమ్మినట్లుంది
మ్మ్మ్...మత్తు ! తెలుసా,
మరెవ్వరి పిలుపూ వినిపించనంత
మరింకెవ్వరి చూపూ సోకనంత
బద్దలవుతోందే హృదయం,
ఆ గొడవేమిటో వినపడనంత!
మదిరపాత్ర ఎప్పుడు చిట్లిందో
ముత్యాలెలా తివాచీపై దొర్లాయో
బ్రతుకు స్పర్శ చూపిన రాతిరిని
మళ్ళీ ఏ చీకటి మింగేసిందో
ఇంకా గుచ్చుకుంటోన్న
కలల  గాజు పెంకులూ
ఇంకా నెత్తురోడుతోన్న
జ్ఞాపకపు తునకలూ
చెప్పవెందుకని?
సాకీ,
నువ్వైనా?

నందకిశోర్ కవిత్వం - "నీలాగే ఒకడుండేవాడు"

*తొలి ప్రచురణ - సారంగ వారపత్రికలో.

" కాలే  గచ్చుపై కుంకుండు  గింజలు గీకి
నాకు  తెలీకుండా నువ్వు  చురుగ్గా అంటించినప్పుడు 

పరిక  పొదల్లో గుచ్చిన  ముళ్ళని
నొప్పి  తెలీకుండా నేను  సుతారంగా తీసినప్పుడు

ఎర్రటి  మధ్యాహ్నం మనం  భూతద్దపు చేతులతో  
రెండు  పచ్చి అగ్గిపుల్లలని  వెలిగించ చూసినప్పుడు"

ఈ  గుప్పెడు పదాలూ  చదివేసరికి, మనం ఎక్కడి వాళ్ళమక్కడి నుండి తప్పుకుని, పసితనపు వీథుల్లోకి  పరుగూ తీస్తాం. జ్ఞాపకాన్ని వెన్నెలకిరణమంత సున్నితంగా స్పృశిస్తూ, మనకే  తప్ప మరొకరికి  తెలీదనుకున్న బాల్యాన్ని అక్షరాల్లో గుప్పిస్తూ "నీలాగే  ఒకడుండేవాడు" అంటూ పేరుతోనే మనసులకు ఎర వేసి లాగిన వాణ్ణి - 'ఆ మాట నీకెలా తెలిసిందసలు' అంటూ ప్రశ్నించేందుకు సిద్ధమవుతాం. నిండా పాతికేళ్ళు నిండని పసివాడు కదా, బహుశా కవిత్వమంటే బాల్యమేనన్న భ్రమలో ఉన్నవాడేమో కదా, లోకాన్ని చూడని  అమాయకత్వం పదాల్లో  వెల్లువలా పొంగుతోంటే, కవిత్వమంటూ మనకిచ్చాడు కానీ...అని ఊహిస్తూ ఊరికే పేజీలు తిరగేస్తోంటే..

"వెన్నెల స్నేహితా! నిన్నేమీ అనను. నువ్వు చేస్తున్న  దేన్నీ ప్రశ్నించను. నీకు దేహం  కావాలి. సత్తువతో  నిండిన దేహం. శుభ్రత నిండిన  మనసు, స్వచ్ఛత  నిండిన ఆత్మ  కావాలి. మనం  మనమై జీవించడం  కావాలి. అనుభూతి సంపదను సృష్టించడం  కావాలి. ఏం  చేద్దాం?! అవేమీ  నా దగ్గర  లేవు. ఉన్నదల్లా  ఒక అనారోగ్యమైన  దేహం, గాయాలు  నిండిన మనసూ, వెలుతురు లేని  ఆత్మ. నీ  అద్భుత హృదయం  లాంటిదే నాకూ  ఉంటే బాగుండు. ఈ విషాదాలు, నిషాదాలూ అన్నీ  ఒకేసారి అంతమైతే  బాగుండు. చిందరవందరగా  పడి ఉన్న  ఊహలకి నిశాంతమేదైనా  ఆవహిస్తే బాగుండు. కానీ- 
కానీ, ఏదీ జరగదు. ఒక పిచ్చి  ఊహలో తప్ప  ఏవీ ఎక్కడా  అంతమవవు.

దుఃఖిత  సహచరీ! 

మసకలోనే అడుగులేస్తాను. మసకలోనే తప్పిపోతాను. మసకలోకానికే జీవితం  రాసిచ్చి ప్రయోజనం  లేకుండా పరుగు  తీస్తాను."  అంటూ  ఊపిరి వేగం  పెరిగేంత ఉద్వేగం కలిగిస్తాడు. ఎవరితను? చలాన్ని గుర్తు చేసేంత తీవ్రతతో జ్వలించిపోతున్న పిల్లవాడు - ఎవరితను?

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...