వర్డ్స్‌వర్త్ ఒక కావ్యంలో "కన్య జలపాతం చూస్తూ గడిపితే, ఆ జలపాతంలో లయ, క్రమము, ధ్వని, నాదము- వీటి సమ్మేళనం వల్ల ఏర్పడే సంగీతం, సౌందర్యం ఇవన్నీ కన్య శరీరంలో జొరబడీ ఆ కన్యని అందంగా చేస్తా"యంటాడు. ఇంకొకరి జీవితానుభవాలను, మరొకరి కవిత్వాలను మనం అర్థం చేసుకోగలమే కానీ, అవే భావోద్వేగాలను అదే స్థాయిలో అనుభవించడం సాధ్యమయ్యే పని కాదనిపిస్తుంది. బహుశా అందుకేనేమో, మొదటిసారి అది చదివి, అతనిది భలే చిత్రమైన ఊహ సుమా అనుకున్నానే కానీ, ఆ రహస్యం నాకర్థమవుతుందని మాత్రం కలగనలేదు. ఆశ్చర్యమేమిటో తెలుసా..."శివ సముద్రం" జలపాతాల దగ్గర నిను చూసినప్పుడు, ఆకాశపు కొస నుండి జారిపడుతోందా అన్నట్లున్న ప్రవాహం క్రిందుగా నిల్చుని నవ్వుతోన్న నీకు దగ్గరగా నడచినప్పుడు...అకస్మాత్తుగా వర్డ్స్‌వర్త్ మాటలకు అర్థం తెలిసింది నాకు.
జలపాతమంటే నువ్వు..తెరలు తెరలుగా విస్తరించే నీ నవ్వు. తడిస్తే ఆ నవ్వుల్లో తడవాలి. జలపాతమంటే నువ్వు..నీ చిలిపి చిందులు...చేతనైతే ఆ అల్లరి ప్రవాహాన్ని అడ్డుకోగలగాలి. జలపాతమంటే...సఖీ..దానికి నిజమైన పర్యాయపదం నీ సౌందర్యం! అందులో మార్గం తెలియని సుమనస్సునై తేలిపోవాలి..లేదూ..నిశి నీలి పెదవిపై నుండి జారిపడే అమృతపు బిందువునై వచ్చి నీలో ఐక్యమవాలి. గమ్యం నీవే అయినప్పుడు, మార్గాలతో నాకేం పని ?