"పంచమహాభూతాలను తోచినట్లు కలిపి, తోచినట్లు విడదీసే ఆటలలో
నిన్ను నువ్వూ నన్ను నేనూ మరిచిపోవడం కవిత్వం "
- అని కవిత్వాన్ని నిర్వచించిన వ్యక్తి, అక్షరాలలో మహత్తును నింపి మునుపెరుగని మనోజ్ఞ ప్రపంచాన్ని మనకు పరిచయం చేయని మామూలు కవి ఎందుకవుతాడు? సున్నితమైన భావ పరంపరతో, ఆర్ద్రతతో, ఆశావహ దృక్పథంతో సృజింపబడి, "అపారమైన జీవితానుభవం లేనిదే, జీవించే కవిత్వం వ్రాయలేరు" అన్న ఒక సాహితీవేత్త సత్య ప్రవచనాన్ని పదే పదే గుర్తు చేసిన కవిత్వం, బి.వి.వి ప్రసాద్ గారి "ఆకాశం".
"ఆకాశం" చదివాక, అలతి పదాలతో, లోతైన భావాలను పలికించడం ఇంత తేలికా అని అనిపిస్తే, ఆ తప్పు మీది కాదు. కానీ, జీవితపు లోతులు తెలియకుండా, ఈ కవిలా ప్రగాఢమైన తాత్వికతను నరనరాల్లో నింపుకునే ఆలోచనేదీ లేకుండా, అవే పదాలను ఇటుకలు పేర్చినట్లు పక్కపక్కన పేరిస్తే అదీ కవిత్వమే అవుతుందనుకోవడం మాత్రం అపరాథమే అవుతుంది. అందుకే, ఈ సంపుటిని చదివే ముందు, ప్రసాద్ గారి సాహితీ నేపథ్యం కొంత తెలిసి ఉండటం లాభించే విషయమవుతుంది.
(జనవరి - మార్చి 2012 జయంతి త్రైమాసిక సాహిత్య పత్రికలో బి.వి.వి గారి నుండి సాహిథ్య నేపథ్యాన్ని, "ఆకాశం" రచన వెనుకనున్న ఆలోచనలను రాబట్టిన చర్చలో భాగం - )