శృంగేరీ..సౌందర్యలహరీ!


చూసే కనుదోయి అభిప్రాయాల అల్పత్వం దగ్గరే ఆగిపోకుండా, మనసును తాకి పరవశింప జేసే సౌందర్యాన్ని అణువణువునా నింపుకున్న ప్రదేశాలు అదృష్టవశాత్తూ మన దేశంలో ఇంకా చాలానే మిగిలి ఉన్నాయి. వెర్రి పోకడల నవనాగరికత నీడలు పడని, కాలుష్యమింకా తెరలను పరువని నిష్కల్మష పుణ్యస్థలమైన శృంగేరి శారదా పీఠం తప్పకుండా అదే కోవకు చెందుతుంది.

జాతి వైరాన్ని మరచి ఒక పాము కప్పకు తన పడగ చాటున నీడనిచ్చిన మహత్తరమైన ప్రదేశంలో ఒక్కసారైనా కాలు మోపాలన్న ఆశా, అద్వైతాన్ని నలుదిశలా ప్రచారం చేసి, సనాతన భారతీయ ధర్మోద్ధరణ గావించిన శ్రీ శంకర భగవత్పాదులు ఈ ప్రదేశంలో ప్రతిష్ఠించిన శారదా పీఠాన్ని దర్శించుకుని ఒక రెండు రోజులు హడావుడి లోకానికి దూరంగా, ప్రశాంతంగా గడపాలన్న కోరిక - తొలుత ఈ రెండే మా అకస్మాత్తు ప్రయాణానికి ప్రేరణలు. అయితే, అనుకోని వరాల్లా, అక్కడ ఉన్న రెండు రోజుల్లోనే ముందు వినని, చదువని (చదివినా ఇంత మనోహరంగా ఉంటాయని ఊహించని) మరికొన్ని ప్రదేశాలు కూడా చూడగలిగాము. అదృష్టమేనేమో కానీ, బెంగళూరు దాటి సగం దూరం ప్రయాణం చేసినప్పటి నుండీ వాన పడే ముందు ఉండే అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణం, శృంగగిరి పీఠం ఇంకా చేరకుండానే మనఃస్థితి మొత్తాన్నీ మార్చేసింది. మలుపుల మయమైన ఘాట్ రోడ్ మీద కిటికి పక్కన కూర్చుని చేసిన ప్రయాణం, ఎంత వెనక్కు తోసినా మొహమంతా పరుచుకునే జుత్తు, చెవుల్లోకి సన్నని హోరుతో దూసుకెళ్ళే గాలి, కళ్ళకు హాయి గొలిపే చిక్కటి పచ్చదనం ప్రయాణంలో తొలి ఘడియల అనుభవాలు.

శృంగగిరి అడవి మధ్యలో ఉన్నట్టుంటుంది. నాకు సహజంగానే అడవి ప్రాంతాల పట్ల మక్కువ ఎక్కువ. అందునా పచ్చందనాల కౌగిళ్ళల్లో ఒదిగి హొయలొలికించే చిగురాకులలోనూ, చిరుజల్లుల తాకిడికి తడిసి తల విదుల్చుకునే లేలేత కుసుమాల కదలికల్లోనూ మానవ మేధస్సుకు అంతు పట్టని మార్మిక సౌందర్యమేదో మనసులకు ఎర వేసి లాగేస్తుంది. కాలాలను కట్టి పడేసి, బాహ్య స్మృతి విముక్తులను చేయగల అదృశ్య శక్తేదో ఆ అడవి తల్లి ఒడిలో మాత్రమే భద్రంగా ఉంది.




ఆది శంకరుల గుడిలోనూ, పలకలు చేత బుచ్చుకు అక్షరాభ్యాసం కోసం వచ్చిన మూడేళ్ళ చిన్నారులతో నిండి పోయిన శారదాంబ గుడిలోనూ అడుగేస్తే అర్థమయ్యే పాజిటివ్ ఎనెర్జీ గురించీ , కళ్ళు మూసుకున్న క్షణాల్లోనే ధ్యానంలో నిమగ్నమయ్యే శక్తినిచ్చే ఆ ప్రాంగణపు మహాత్మ్యము గురించీ నేను ఎక్కువగా రాయదల్చుకోలేదు. అవి తప్పకుండా చాలా మందికి అనుభవంలోకి వచ్చే విషయాలేనని నా నమ్మిక.

వాటిని పక్కనపెడితే, విశాలమైన ప్రాంగణము కలిగిన గుడి ఇది. ప్రసాదాలు కళ్ళ కద్దుకుంటూ కుటుంబ సమేతంగా బయటకు వచ్చిన అక్కడ కూర్చున్న వాళ్ళకు, ఆ పురాతన గుడి గోపురంలో గూళ్ళు కట్టుకున్న తెలతెల్లని పావురాలు రెక్కలల్లార్చుకుంటూ తిరగడం చూస్తుంటే బోలెడంత కాలక్షేపం. ఆ పాత రాతి కట్టడాల్లో చెప్పనలవి కాని అందమొకటి ఉంటుంది. మనవి (మన కాలంలోవి) కానివన్నీ అందమైనవే నీ కళ్ళకి - అంటూ నిష్ఠూరాలొద్దు కానీ, నిజంగానే ఈ పాత రాతి కట్టాడాల్లో, ఈ కాలపు నిర్మాణా లెరుగని అనిర్వచనీయమైన ఆకర్షణ ఉంటుంది.


అరె ఏటిలోని సేపలంట ..

దీనిని ఆనుకునే ప్రశాంతంగా పారే ఓ నది. గట్టిగా నాలుగడుగులేస్తే అందుకోగలిగిన ఆవలి తీరం - అయితే మాత్రమేం - మీరొక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. అంత లోతైనదట ఆ నది. చూస్తే అలా ఏం అనిపించని కారణానికేమో, సెక్యూరిటీ అతను విజిల్ ఊదిన వాడు ఊదినట్టే ఉన్నాడు, జనాలను నియంత్రించడానికి. అతని మాటకేం కానీ, ఆఖరు మెట్టు మీద - ఈ మూల నుండి ఆ మూల వరకూ, చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ సర్దుకు కూర్చుండిపోయారు....వందల కొద్దీ చేపలను, వాటి అబ్బురపరిచే కదలికలను దగ్గర నుండి చూడడానికి. నిజాయితీగా చెప్పాలంటే, నేను చేపలను చూడడమంటే అది నేస్తాల ఇళ్ళల్లో అక్వేరియంలలోనే. థాయ్‌లాండ్‌లో వాటర్ స్పోర్ట్స్ కోసం "ఫుకెట్" వెళ్ళినప్పుడు "స్నోర్క్లింగ్" చేస్తూ కాళ్ళను చుట్టేసే చేపపిల్లలను, రకరకాల జాతుల్లోనూ, రంగుల్లోనూ ఉన్న వాటిని గైడ్ చూపిస్తుంటే చూశాను కాని, అది ఒక మహా సముద్రం.ఆనాడు అంతటి ఆపరాని ఆత్రమూ, ఉరకలేసిన ఉత్సాహమూ ఆటలకూ - ఈత రాని వాడు మహా సముద్రంలో పడితే ఏం జరుగుతుందన్న కుతూహలానికీ మాత్రమే పరిమితమయ్యాయి.

ఈ సారి అలా కాదు. నిశ్చలంగా ఉన్న ఏటి ఒడ్డున అంతలేసి చేపలు తుళ్ళిపడుతూ...పసి వాళ్ళు మరమరాలు, బిస్కట్లు వేసినప్పుడల్లా నీరంతా చెదరగొడుతూ గుంపుగా పైకి లేచి, నోట కరుచుకుని నీటి క్రిందకు వెళ్ళిపోయి, సొగసుగా తిరుగాడుతూ, చూపరుల కళ్ళను కవ్విస్తూ, నవ్విస్తూ... ఒహ్! ఓహ్! ఒక దాన్ని మించి ఒకటి, ఆకారంలోనూ అందంలోనూ పోటీలు పడి, ఆ రెండు రోజుల్లోనూ మేము వాటితో గడిపిన మూడు గంటల సమయంలోనూ, "మీనాక్షి" అన్న పేరు మీద నాకున్న ప్రీతిని పదింతలు పెంచాయి.

నరసింహ వనం :

ఈ మీనాల మాయామోహపు వల  నుండి బయటపడితే, ఆ నదిపైని వంతెన దాటి , అటు వైపు వున్న నరసింహ వనానికి వెళ్ళవచ్చు.ఇది ఎంతటి సుందర సురభిళ ప్రాంతమంటే, అడుగడుక్కీ కాసేపు ఆగిపోయి చల్లగాలికి సేదతీరాలనో, పూల గుసగుసలు వినాలనో, ఆ వృక్షజాతుల పేర్లను ఊహిస్తూ ఉండిపోవాలనో అనిపించక మానదు.
. మత్తెక్కించే వాసనలు వెదజల్లే పూల మొక్కలను   ఒళ్ళంతా కప్పుకు వగలుపోయే వనమిది.

నే బెంగళూరుకు వచ్చిన కొత్తల్లో , ఆఫీసులో మా బిల్డింగ్ బయటకు వచ్చి ఎవరితోనో కబుర్లాడుతుంటే, పక్కన ఉన్న చెట్ల పొదల్లో నుండి ఆకుల శబ్దం లాంటిదేదో వచ్చింది. నాలోని సౌందర్యోపాసకురాలు కళ్ళు మూసుకుని చెవులు రిక్కించి "ఏమి ఈ వింతైన శబ్దము" అని ఆశ్చర్యపోతూండగా, మెదడులో నిద్రపోతున్న తెలివి ఉలిక్కిపడి లేచి "అమ్మా తల్లీ , కళ్ళు తెరిచి ఆశ్చర్యపో! అది నీ అంత పొడవున్న పాము" అని అరిచి గోలెట్టింది. ఆ తర్వాత ఒక్క నా బిల్డింగ్ మాత్రమే కాకుండా అటు నాలుగు , ఇటు నాలుగు భవంతుల్లో నుండి జనాలు బయటకు రాకుండానే పాము వచ్చిందన్న సంగతి అర్థం చేసుకునేలా అరిచాననుకోండీ..అది వేరే విషయం :).

ఈ నరసింహ వనంలో అడుగు పెట్టగానే , " Beware of snakes" అని హెచ్చరిక కనపడగానే ఆ విషయమే జ్ఞప్తికొచ్చి, కాస్త ఉలిక్కిపడ్డాను. చాలా పెద్ద "నాగ సంపంగి" చెట్టు ఉంటుంది మొదట్లోనే! అబ్బబబ్బ, ఏమి ఘుమ్మను పరిమళాలనుకున్నారూ.... పాములేం ఖర్మ, అనకొండలొచ్చినా అక్కడ నుండి వెంటనే కదిలేది లేదని నా లాంటి భీతహరిణులు కూడా భీష్మించుకుని చాలా సేపు కూర్చున్నారిక్కడ. ఇక అది మొదలు వనాన చిట్టచివరకు ఉన్న కాల భైరవ గుడి వరకూ, దారి పొడవునా బోలెడు పూల మొక్కలూ, కొబ్బరి, అరటి, తమలపాకు తోటలూ, గజశాల, గోశాల, శంకర ప్రభోదిత అద్వైత సంబంధిత విషయాలపై రీసర్చ్‌కు గానూ చక్కటి లైబ్రరీ, గురు పరంపరను చిత్రాల్లో చూపించే విశాలమైన భవంతులు, తోరణాలల్లే అమరిన పూలతీవెలూ, మొత్తం వనమంతా - కాలి బాట పొడుగూతా ఓపిగ్గా వేసిన రంగవల్లికలూ, భూమి వైపు వాలి, వంగి కనువిందు చేసిన ఎంచక్కటి ఎర్రటి ముద్ద మందారాలూ అన్నీ స్పర్శాభాగ్యమైనా పొందరేమని మనని తొందరపెడుతున్నట్టే ఉంటాయి.

ఋష్యశృంగ గుడి

నేను మొదటిసారి విన్నప్పుడు విపరీతంగా ఆశ్చర్యపోయిన కథల్లో, ఋష్యశృంగుడి కథ ఒకటి. ఆయన జననం, ఆయన శక్తి, ఆయన రూపం - అన్నీ అచ్చెరువొందించేవే! ఈయన పేరు మీదుగానే ఈ ప్రాంతానికి శృంగగిరి అని నామకరణం చేశారని మనలో చాలా మందికి తెలుసు. శృంగేరికి రమారమి ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో ఋష్యశృంగుడి గుడి ఉంటుంది. శిధిలావస్థలో ఉందనలేను కానీ, మరింత మెఱుగ్గా ఉంచుకోవలసిన స్థలపురాణం కలిగిన చోటు. ఇక్కడి శివలింగం ముందు వైపు ఋష్యశృంగుడినీ, వెనుకవైపు శివుడినీ కలిగి ఉంటుంది. ఈ శివలింగము, పక్కనే ఉన్న ద్విభుజ గణపతి స్వయంభువులని పూజారులు చెప్పారు. అన్నట్టూ - ఈ ఏడెనిమిది కిలోమీటర్లూ అడవిలో ఆటో ప్రయాణం -అది అద్భుతమంతే! మరో మాట లేదు. తిరిగి వచ్చేసేటప్పుడు దారిలో ఒక చోట కుడి వైపుగా నాలుగు కిలోమీటర్ల దూరం వెళితే చక్కటి దుర్గా ఆలయం ఉంటుంది. చుట్టూ మరింకేమీ ఉండవు - అరటిపళ్ళేమైనా తెచ్చామేమోనని మన వైపు ఆశగా పరుగులిడుతూ వచ్చే లేగదూడలు తప్ప.

ఇవన్నీ కాక, పుస్తకాభిమానుల కోసం ప్రత్యేకంగా మఠం వాళ్ళదే ఒక బుక్ హౌస్ ఉంది. "శ్రీమత్పయోనిథి నికేతన చక్రపాణే..భోగీంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే.." అన్న నరసింహ కరావలంబ స్తోత్రమూ, "భజగోవిందం", "సౌందర్యలహరి", లింగాష్టకాలూ..ఒక్కటేమిటీ, ఆదిశంకరులు రాసిన ప్రతీదీ మనసులోకి చొచ్చుకుపోవలసిందే, ముద్ర వేయాలసిందే! ఆ మహనీయుని అవతార విశేషాలన్నీ రంగరించిన శంకర విజయం మొదలుకుని, గురుపరంపర వరకూ అన్నీ ఆ పుస్తక విక్రేతల వద్ద దొరుకుతాయి. ఆసక్తి కలవారు అక్కడొక అరగంట గడిపే వీలుంది.

మఠం వాళ్ళు ఏర్పాటు చేసిన వసతి సదుపాయాలు బానే ఉంటాయనీ, అంతగా నచ్చని పక్షంలో నాలుగడుగుల దూరంలోనే మంచి హోటల్స్ ఉంటాయనీ విని ఉండడంతో, ఒక్క రాత్రి బసకు ముందస్తు ఏర్పాట్లేవీ లేకుండానే వెళ్ళిపోయాం. ఆ ధైర్యం మమ్మల్ని నిరాశపరచలేదు. 150/- కు ఇంత మంచి గదులు ఈ మధ్య కాలంలో నేనెక్కడా చూడలేదు. మీరు గనుక వెళ్ళడం కుదిరితే అక్కడొకసారి ప్రయత్నించి చూడండి.

ఇవీ, ఈ రెండు రోజుల ప్రయాణంలో , "సౌందర్య లహరి"లో ఏకమైన మనసు దాచుకున్న మధుర స్మృతులు. "సౌందర్య లహరి"ని ప్రస్తావించాను కనుక, అందులో నుండి, చదివినప్పుడల్లా/విన్నప్పుడల్లా మనసుకు ఆహ్లదాన్నీ, పెదవులకు చిన్ని చిరునవ్వునీ కానుకిచ్చి పోయే - నాకిష్టమైన పద్యంతో ఈ వ్యాసాన్ని ముగిస్తాను.


సుధా మప్యాస్వాద్య రతిభయ జరామృత్యు హరిణీం
విప్పద్యంతే విశ్వే విథిశత ముఖాద్యాదివిషదః |
కరాళం యత్వేళం కబళితవతః కాలకలనా
న శంభో స్తన్మూలం తవ జనని తాటంక మహిమా||

( సకల దేవతలూ అమృతము పుచ్చుకుని కూడా ప్రళయ కాలమున నశించినా, కాలకూట విషము త్రాగిన సదాశివునికి మరణము లేదు లేదంటున్నారు కానీ, తల్లీ, అదంతా నీ తాటంక(చెవి కమ్మల) మహిమ గాక ఆ పరమేశ్వరునిదా!"

47 comments:

  1. చాలా బాగుంటుందండీ.. శ్రుంగేరీ.. నరసింహ వనం చూడలేక పోయాను నేను. అప్పటీకే చీకటి పడిపోయిందని. ;(
    ఆ పురాతన గుడి (మీరు ఫోటోలో‌పెట్టారే అదే) చూడగానే ఎక్కడికో పోతాం.
    ఇక ఆ చేపలతో ఆటల సంగతి చెప్పక్కర్లేదు. అలా గెంతుతూ తింటూ ఒడ్డునే చేత్తో అందుకునేలా ఉంటాయ్. ఎంత సేపయినా కూర్చోవచ్చు ;)

    మీరు ఓ లెక్క లో వర్ణించారనుకోండీ... అయినా నా ఆనందం ఆపుకోలేకా.. ;)
    సూపర్ గా రాశారు ;)

    ReplyDelete
    Replies
    1. రాజ్, Thank you so much! :)

      అరెరె! మీరు మంచి అనుభవం మిస్ అయిపోయారు. నరసింహ వనం నాకు బాగా నచ్చింది :). మీకు బహుశా చేపలతోనే సరిపోయి ఉంటుంది..
      మరేం ఫరవాలేదు, ధర్మస్థల, ఉడిపి, కుక్షి, షిమోగా - అటువైపు ఎటు వెళ్ళినా ఇంకోసారి ఇక్కడికీ వెళ్ళే ప్రయత్నం చేయండి . :)

      Delete
  2. చాలా బాగా రాశారండీ.. నేను వెళ్ళినా ఇంత అందంగా అనుభూతిచెందలేనేమో అనిపించింది.

    ReplyDelete
    Replies
    1. వేణూ - భలేవారే, మీరైతే ఇంతకు పదింతలు అందంగా చెప్పేవారు. :). Thank you!: )

      Delete
  3. నేను వెళ్ళిదర్శించుకున్నానమ్మా ఈ దివ్యక్షేత్రాన్ని . అక్కడ ఉన్న శక్తితరంగాలు మనలను భావజగత్తులోకి తీసుకెళతాయి

    ReplyDelete
    Replies
    1. నిజమేనండీ, ఆ శక్తి అపారం, కాసేపైనా మౌన జగత్తులో ఉండగల్గడం మరపురాని అనుభవమే..!

      Delete
  4. చాలా వివరంగా రాసారు మానస గారు
    నరసింహవనం మరియు ఆ పాము ఎపిసోడ్ కి సూపర్ లైక్ :)

    ReplyDelete
    Replies
    1. హరేకృష్ణ గారూ - ధన్యవాదాలు! ఇప్పుడెన్నైనా కబుర్లు చెప్తాను కానీ, పామును చూసీ చూడగానే మాత్రం బాగా భయపడ్డాను :).
      శృంగేరిలో కనపడితే ఈ సారి చాలా ధైర్యంగా ఉందామనుకుంటే - ప్చ్..! పాములు నాకా చాన్స్ ఇవ్వలేదు.. :p

      Delete
  5. అద్భుతం! ఎప్పటిలానే చక్కని వర్ణన. కళ్ళకు కట్టినట్టు చూపించారు. నాకెప్పటినుంచో వెళ్ళాలని ఉంది. ఇప్పుడు మరీ ఎక్కువగా అనిపిస్తోంది.

    ReplyDelete
    Replies
    1. రసజ్ఞ గారూ - మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు, తొందరగా మీరూ చూసేయాలని మీ తరఫున నేనూ కోరుకుంటాలెండి.. :).

      Delete
  6. శృంగేరి,శంకరులు,ఋష్యశ్రంగుడు +మానస గారి వర్ణన చాలండీ ఎంతతి నాస్తికుడికయినా ఓ సారి చూసి రావాలసిందే అనిపిస్తుంది.

    ReplyDelete
    Replies
    1. పప్పు సర్, మీరసలు ...:))) ..థాంక్యూ..! :)

      Delete
  7. శృంగేరి గూర్చి విని ఉన్నాను కాని.మీరు ప్రతీది చాల చక్కగా వర్ణించారు.అక్కడే ఉండి
    చూసి నట్లు అనిపిస్తుంది

    ReplyDelete
    Replies
    1. Dear Amazing lady..

      మీ మాటలు నిజమైతే బోలెడంత సంతోషం, ధన్యవాదాలండీ..!

      Delete
  8. This comment has been removed by the author.

    ReplyDelete
  9. Eppudaina sringeri vellalani pinchelaga rasav ...Manasa.

    Regards,
    Mahadeva

    ReplyDelete
  10. Sringeri entha andam ga untundo antha andam ga raasav...Even i had that experience...

    ReplyDelete
  11. chittamma, innirojulu prayatnam tarvaata, nee blog naa intlo vichchukundi...suma parimalaalu illanthaa vyaapinchaayi ippatike...work ki vellee hadaavidilo oka saari mail check chesukuntoo, ilaa undipoyaa...intiki raagane agenda lo nee blog chadavadame first undi..
    yentha baagaa wraasaavo, yee saari velithey, nannuu pilavacchugaa..
    cannot wait to read other posts...annee chadivi comment /mail pedathaa..

    ReplyDelete
    Replies
    1. Finally....
      పొనీలెండి, కాస్త చదవగల్గుతున్నారు, అదే బోలెడు సంతోషం! మీ అభిప్రాయాల కోసం ఆత్రంగా ఎదురు చూస్తుంటాను. :)

      Delete
  12. మానస గారు!!

    మీ వ్యాసంలో 'శృంగేరి' ని చూపించారు, అంతే కాదు! తప్పకుండా చూడాలనిపించేలా చూపించారు.

    ReplyDelete
  13. ఎన్నో రోజులగా...కాదు..ఎన్నో సంవత్సరాలుగా నేను చూడాలనుకుంటున్న శృంగేరి గురించి..కళ్ళకు కట్టినట్టుగా చక్కగా వ్రాసారు మానస గారు! మీరు వ్రాసిన సంగతులు..కొత్తగా వెళ్ళననుకొనే నాలాంటి వారికి ఉపయోగపడతాయి. ధన్యవాదాలు!
    Best Wishes,
    Suresh Peddaraju

    ReplyDelete
    Replies
    1. ఓహ్! నిరంతరమూ వసంతములే మీ బ్లాగ్ అని తెలీదండీ, మీ స్పందనకు, మంచి మాటలకు కృతజ్ఞతలు.

      Delete
  14. అబ్బబ్బ..మానస..గారు - అద్భుతం :)...ఎంత హాయి గా ఉందొ చదివాకా... :)
    అన్ని చోట్లకి వెళ్తాను..ఆ ఒక్క నరసింహ వనం తప్ప...నాకు అవంటే..అవే మీరు రాసారే....beware of ****** ...చచ్చేంత భయం ..ప్రాణం ఉష్ అంటుంది :(
    ఓ ..........గాలికి ఊరికే ..జుట్టు కళ్ళల్లో పడుతోంది ..అని రాయకుండా దాన్ని కూడా ఎంత బాగా రాసేసారో :)..హిహి ofcourse అది నా స్టైల్ :D

    ReplyDelete
    Replies
    1. కిరణ్ - :) అలాక్కాదు, ఈ ఒక్కసారికీ నన్ను నమ్ము ;). కళ్ళు మూసుకుని వెళ్ళిపో, పాములెక్కడో నాగసంపంగి మత్తులో పడి నిద్దరోతూ ఉంటాయి, ఈ లోపు నువ్వెళ్ళీ అన్ని తోటలూ చూడు(తమలపాకులున్నాయ్ బోలెడు..తుంచి నోట్లో వేసుకో..) ఏనుగుల తొండాలతో తల మీద తట్టించుకో - గట్టిగట్టిగా మెత్తమెత్తగా చక్కిలిగిలి పెడుతునట్టు ఉంటుంది. ఆ ఎంచక్కటి ఎర్రటి మందారాలు నేల వైపు వాలినప్పుడు వాటిలో కనపడే వయ్యారాన్ని నీ బొమ్మల్లో ఎంత త్వరగా వేయగలవో చూడు. అదివరకైతే ఒక్కదానివని బెంగ కానీ, ఇప్పుడేమి తక్కువ తమకు..(బాపు చేతిలో మీ పక్కన కనపడ్డ రాముండొక్కడుండు వరకూ...)

      Delete
  15. మానసా, నీ చేతిలో పడితే ఎండిపోయిన వచనం కూడా చిగురించి పచ్చని కవితగా మారుతుంది. అనుభూతి సాంద్రతను బట్టే రాతల్లో గాఢత. ఇది ఈ పోస్టుకే కాదు, ఇంతకు ముందు అహోబిలం పోస్టు రాసావు చూడు...అప్పుడు కూడా ఇలాగే అనిపించింది.

    ప్రకృతిని ఆస్వాదించడం ఒకెత్తు అయితే ఆ అనుభూతిని నలుగురూ అనుభవించేలా రాయడం అందరూ ఎక్కలేని మరో ఎత్తు! నీతో పాటే నడుస్తూ ప్రతి క్షణాన్నీ ఆస్వాదించాను. నాగ సంపంగి పూలను ఆఘ్రాణించాను. సౌందర్య లహరీ తరంగాల్లో(లహరి అంటే తరంగమేననుకో) తేలియాడాను.

    నాకూ ఈ అడవుల పిచ్చి ఉంది. నడుచుకుంటూ అలా వెళ్ళిపోడమే....!అందుకే చారిత్రకాల కంటే పచ్చ దనం,కొండలు,నీళ్లు అంటూ పరుగులు పెడుతుంటా!

    చూడాల్సిన జాబితాలో ఇది తప్పక చేర్చుకుంటాను.

    ReplyDelete
    Replies
    1. సుజాత గారూ,

      మీ స్పందనలు ఇచ్చే బలం మాటల్లో చెప్పలేనిది. :). మనసు వాకిట సందేహంగా ఆగిపోయిన ఆలోచనలేమైనా ఉంటే, అవీ ఇప్పుడు ధైర్యంగా కాగితం మీదకు వచ్చేస్తామంటున్నాయ్ :).

      అవును - అడవుల్లో- ఆ పచ్చదనంలో మనసును లాలించగల అలసిన ప్రాణులకు సాంత్వననీయగల గొప్ప శక్తి ఉంటుంది. మీకీ ప్రదేశం నచ్చుతుందని గాఢంగా అనిపిస్తోంది...తప్పకుండా చూడండి.

      Delete
  16. Chala baaga varninchaaru..Tapaka chudali anipistondi...Krishna

    ReplyDelete
  17. నిన్న ఇక్కడ కామెంట్ రాస్తూంటే పోయింది...:(
    "మీనాక్షి" అనే పేరు నాకు కూడా భలే ఇష్టమండీ. చాలా బాగా రాసారు.మీ వర్ణన విషయంలో సుజాత గారి మాటే నాదీనూ.!
    తప్పక వెళ్ళాలని చాలా రోజుల్నుంచీ అనుకుంటున్నాం మేము కూడా..

    ReplyDelete
    Replies
    1. :))తృష్ణ గారూ, మీనాక్షి మీక్కూడా ఇష్టమా, భలే! నాకు మీ అమ్మాయి పేరు చాలా ఇష్టమండీ, "రవి ప్రఖ్య" - వినడానికీ, రాయడానికీ, పలకడానికీ కూడా చాలా అందంగా ఉండే అరుదైన పేరు.

      మీరు ఓపిగ్గా గుర్తుంచుకుని మరీ స్పందన తెలియజేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరొకవేళ వెళ్ళడం కుదిరితే, మీ అభిప్రాయలు మాత్రం తప్పకుండా మీ బ్లాగ్‌లో రాయాలి.

      Delete
  18. సుశ్రావ మధురం గీతం !

    చాలా బాగా వర్ణించారు.

    శ్రింగేరి ఇంకా మన రాష్ట్రపు తిరుమల లా కమర్షియల్ కాకుండా మీ అనుభవం లోని సున్నితత్వాన్ని మెత్త దనాన్ని కలిగి ఉండండం చెప్పుకోదగ్గ విషయమే. చూడవలసిన ప్రదేశమే మరి.

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
    Replies
    1. Thank you, Zilebi.

      నాకు అహోబిలం, శృంగేరి లాంటి ప్రాంతాలు, ఇలా బ్లాగ్‌లో ప్రయాణానుభవాలు రాసేంతలా నచ్చడానికి ముఖ్య కారణం - ఇక్కడ కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ ఉండకపోవడం. అఖరకు కొబ్బరికాయ కొట్టమని కూడా మిమ్మల్ని ఎవ్వరూ బలవంతపెట్టరు.

      ఆలయానికి వెళ్ళేది భగవద్ దర్శనం, భగవన్నామ స్మరణలో లోకాన్ని విస్మరించి, మరో ఆలోచన లేకుండా కొన్ని క్షణాలైనా మనసులోని భారం దించుకోవడం/మానసికోల్లాసాన్ని పొందడమే అయితే, ఆ అనుభవాలకు ఆటంకాలేవీ కలిగించని వాతావరణం ఈ ప్రాంతాల సొత్తు.

      గుడి బయటకు వచ్చీ రాగానే mad rush ఉండదు, మిమ్మల్ని తొందరపెట్టేవారూ, వెంటనే వెళ్ళకపోతే ఏమవుతుందోనన్న ఖంగారూ, భయంగొలిపే జన సమూహాలూ - ఇవేమీ లేని ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళడం, ఉండడం - నిజంగానే మంచి అనుభవాలు.

      Delete
  19. అందమైన, ఆహ్లాదకరమైన పరిచయం. గతంలో కర్ణాటక వెళ్ళినా శృంగేరి వెళ్ళలేకపోయాను. ఇప్పటికిప్పుడు ఎలాగైనా ఆ అద్వైత కేంద్రాన్ని చూడాలనిపించేలా రాశారు.

    ReplyDelete
    Replies
    1. :) ఫణి గారూ, ధన్యవాదాలండీ! మిత్రుల దగ్గర విన్నప్పటి నుండీ చూసేవరకూ నాకూ అలాగే ఉండేది.

      Delete
  20. చాలా బాగుంది. తప్పకుండా చూడాలి అనిపించేలా మీ అనుభవాన్ని,అనుభూతిని చక్కగా వివరించారు.
    థాంక్ యు వేరి మచ్ మానస గారు.

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ, వనజ గారూ!

      Delete
  21. మానస,
    చాలా చక్కగా వర్ణించావమ్మా !! చదవగానే ఈ వీకెండ్ లోనే వెల్దాం అన్న ఫీలింగ్ వచ్చింది. అన్నిటికంటే నచ్చిన విషయం, ఈ ప్రదేశాలు ఇంకా కమర్షియల్ కల్మషం అంటకుండా ప్రశాంతంగా వుడటం. మేము తప్పకుండ నెక్స్ట్ ఇక్కడికే మా యాత్రను ప్లాన్ చేసుకుంటాము.

    ReplyDelete
    Replies
    1. Thank you so much :)))
      తప్పకుండా చూడండి. శ్రీనిజ తన బ్లాగ్‌లో ప్రయాణ విశేషాలన్నీ రాయాలని నా మాటగా చెప్పండి. :)

      Delete
  22. చాలా బాగా వ్రాశారు. శృంగేరి వెళ్ళలేదు కానీ బెంగుళురు చామరాజపేట్‌లోని శంకర మాఠానికి వెళ్ళినా ఈ పాసిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది.ఫోటోలు ఇంకొన్ని పెట్టి ఉంటే ఇంకా బావుండేది

    ReplyDelete
    Replies
    1. లోకేష్ శ్రీకాంత్ గారు,
      అవునండీ, హైదరాబాదులో కూడా ఉంటుంది శంకరమఠం. నల్లకుంట దగ్గర. నాకు ఎప్పుడూ వెళ్ళడం కుదరలేదు. బెంగళూరు ఈ సారెప్పుడైనా ప్రయత్నిస్తాను. ఆ పాజిటివ్ ఎనర్జీ వృథా పోదని నాకో గుడ్డి నమ్మకం. :)
      ధన్యవాదాలు.

      Delete
    2. Manasa gaaru,

      what is positive energy and negative energy? How do we know type of energy? Please explain in a post. I heard of it many times, but no one explained what it is and how to feel it.

      Delete
  23. బాగా రాసారు మానసా.. చదివినా కాసేపూ మీతో శృంగేరి తీసుకువెళ్ళారు.. మీరు ఆపకుండా అలా రాసుకొంటూనే వెళితే బాగుండును అనిపించింది..

    ReplyDelete

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...