క్షమ వీరస్య భూషణం


దాదాపు నాలుగేళ్ళ క్రితం..నేను సింగపూర్‌లో ఉన్ననాటి సంగతి. ఒక ఆదివారం నాడు, ఏదో రిలీజ్ వర్క్ ఉండడంతో, నేనూ, నా ఒరియా రూమ్మేట్ కలిసి, ఆఫీసుకు వెళ్ళాం.సాయంకాలానికి అవ్వాల్సిన పని, రాతిరైపోతున్నా పూర్తవ్వలేదు. ఆ ఆఫీసు సన్‌టెక్ సిటీలో ఉండేది. దగ్గర్లోనే ఒక థియేటర్ కూడా ఉండేది. ఎలాగైనా రెండో ఆట వేళకైనా పని పూర్తి చేసుకుని, ఆ పూటకి అక్కడే ఏదో ఒకటి తినేసి, మెల్లిగా ఇంటికెళ్ళాలని మా ఆలోచన. సరే, రంగంలో ఉన్నది మా లాంటి మహామహులు కదా, పని పూర్తవ్వనని మొండికేసింది. చేసేదేం లేక, అనుకున్న ప్రకారం తినడం మాత్రం పూర్తి చేసి, ఒంటి గంటకో రెండింటికో టాక్సీ మాట్లాడుకుని ఇంటికి చేరాం.

సింగపూర్‌లో వర్షాలకు ఒక వేళాపాళా ఏమీ ఉండదు. మేఘాలకు నేల మీద బెంగ రాగానే కన్నీళ్ళు కార్చేసి ఆమె గుండెనీ తడి చేస్తాయి. ఆ రోజు కూడా సన్నగా జల్లులు పడుతున్నాయి. వీధి లైట్ల వెలుగులో కొద్ది కొద్దిగా మెరుస్తూ కనపడే జల్లులను చూస్తూ, ఆ అర్థరాత్రి పూట మా కమ్యూనిటీలో కింద కూర్చుని చదరంగం ఆడుకుంటున్న వాళ్ళను చూస్తూ, మా ఇంటి వైపుకు నెమ్మదిగా అడుగులేస్తున్నాం. మా కబుర్లు మెల్లిగా పాత పాటల వైపుకు మళ్ళాయి..వాన పాటలు ఏ భాషలో నైనా పగలబడి నవ్వుకునేందుకు తప్ప ఎందుకూ పనికి రావని నిర్ణయించాం. "చిట పట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే "- అంటూ నేనొక తెలుగు పాట అందుకోవడంతో, ఆ అమ్మాయి కూడా ఏదో హిందీ పాట పాడడం మొదలెట్టింది..

"  రాత్ బైఠీ హైన్..బాహే పసారే ..షిస్కియా లే రహీ హైన్ సితారే
కోయీ టూటా హువా దిల్ పుకారే ..హుం దం తూ కహా హైన్.. "

"వహ్ ఉత్కళికా...వాహ్!" ఒంగి సలాం కొట్టా నేను. నాకు రాత్రి పూట గజల్స్ వినడం భలే ఇష్టం. సందర్భోచితంగా ఏదైనా పాటను గుర్తు చేసుకుని ఎవరైనా అందంగా హమ్ చేస్తే, అభిమానించకుండా ఉండలేను. నేస్తాలిద్దరం పాండిత్య ప్రదర్శనలో మునిగితేలుతూ గుర్తొచ్చిన కవిత్వాలనీ, పాటలనీ పంచుకునే ప్రయత్నలో ఉన్నాం. మరో రెండు నిముషాల్లో మా లిఫ్ట్ దగ్గరికి వెళ్ళబోతాం అనగా, వాన కొద్దిగా పెరిగినట్టు అనిపించింది. మేం బద్ధకాన్ని వదలకుండా నీటిలో తపతపా అడుగులేస్తూ నడుస్తుంటే, మా వెనుక ఏదో అలికిడవ్వటంతో, ఉత్కళిక వెనక్కు తిరిగి చూసింది.

"నువ్వు నీ తోడు కోసం పాట పాడుతున్నావుగా, వెనుక వస్తున్నట్టునాడు చూడు.." అంది లోగొంతుకతో నా వైపు వొంగి. నేను చప్పున వెనక్కు చూసి - ఆమె భుజం మీద ఒక దెబ్బేసి ముసిముసిగా నవ్వేశాను. "ఆ ఓల్డ్‌మేన్ ఆ? బాగా చెప్పావ్ తల్లీ!" అని నిష్ఠూరాలాడాను కూడా!. ఉన్నట్టుండి ఏదో పెద్ద శబ్దం - ముసలాయన పడిపోలేదు కదా అని వెనక్కు తిరిగి చూద్దుము కదా.... - ఆయన తన చేతిలో ఉన్న గొడుగు ఎత్తి పట్టి, మా వైపు పరుగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు. మేమిద్దరం ఏం జరుగుతోందో అర్థం కాక బిర్రబిగుసుకుపోయాం.

అప్పటికి సింగపూర్‌లో రెండేళ్ళుగా ఉంటున్నాం మేము. అబ్బాయిలు ఏడిపించడం, ఎవరైనా వెంటబడడం, ఆడపిల్లలం కదా అని భయంభయంగా మసలుకోవడం - ఇలాంటివన్నీ, ఇండియాలోనే, అక్కడి ఎయిర్‌పోర్ట్‌లోనే భద్రంగా వదిలేసి వచ్చాం. ఇక్కడా అటువంటివి జరుగవచ్చునేమో అన్న అనుమానం కూడా మాకెప్పుడూ కలుగలేదు కనుక, మా మెదళ్ళు పని చేయడం మానేశాయి. నేను పూర్తి అయోమయంలో ఉన్నాను కానీ, నా స్నేహితురాలు కాస్త తేరుకుని, "Meenu, RUN! He seems to be crazy" అని పరుగందుకుంది. తన వెనుకే నేనూ! ఈ సందట్లో మా ఇంటి వైపు వెళ్ళకుండా, ఇద్దరం వేరే వైపుకు వెళ్ళిపోయి, అక్కడి నుండి దారులు మారిపోయి చెరో దిక్కులోనూ పరుగెత్తాం. కాళ్ళకు ఉన్న షూ నీటి గుంటల్లో పడ్డప్పుడల్లా అంతెత్తున బురద లేస్తూ చిరాకు పుట్టిస్తోంది, నాలుగు నిముషాల్లో నీరసం మొదలయ్యింది. రొప్పుతూ వెనక్కి తిరిగి చూశాను. నా నేస్తం లేదెక్కడా..! ముసలాయన మాత్రం అదేదో సినిమాలో లాగా, ఆ గొడుగు పట్టుకుని పరుగెడుతూనే ఉన్నాడు. ఒక ఐదారు అపార్ట్‌మెంట్లు దాటి, గుండ్రంగా పరుగెత్తి, ఎట్టకేలకు ఆ చదరంగం ఆడుకుంటున్న ముసలి వాళ్ళు ఉన్న చోటున, నేనూ -ఉత్కళిక మళ్ళీ కలుసుకున్నాం. తను నన్ను ఆపి, "ఇక చాలు. చాలా దూరం పరుగెత్తాం. ఇక మన వల్ల కాదు. అసలేమైందో అడుగుదాం ఉండు" అని నన్ను పట్టి ఆపింది. నేను వొంగి మోకాళ్ళ మీద చేతులేసి ఆయాసం తీర్చుకోబోయాను - నిండా తడిసిన జీన్స్ మీద చల్లబడ్డ చేతులు ఆధారం దొరక్క జారిపోయాయి. అతి కష్టం మీద లేచి నిలబడ్డాను.

ఆ కాంప్లాన్ ముసలాయన రానే వచ్చాడు. గొడుగలాగే పట్టుకుని నా మీదకే వస్తున్నాడు. "భగవంతుడా, ఈ జీవితానికి ఈ శిక్ష ఏమిటి తండ్రీ" అని దేవుడిని తల్చుకుంటూ, ఉత్కళిక వెనుక నక్కి, ఆ పక్క ఆడుకుంటున్న జనాలను అరిచి పిలిచాను.

వాళు వచ్చి, మమ్మల్ని ముగ్గురినీ అనుమానంగా చూస్తూ, సంగతేమిటని అడిగారు.
మాకు తెలీదన్నాం.
అతన్నీ అడిగారు. ముందతను సమాధానం చెప్పలేదు.  కాసేపాగి నా వైపు చూపించి, వాళ్ళకి స్థానిక భాషలో ఏదో చెప్పాడు..మాట తడబడుతూ, ముద్దగా..కాస్త వింతగా మాట్లాడాడు.

మేం అయోమయంగా వాళ్ళ వైపు చూశాము.

వాళ్ళల్లో ఒక కుర్రాడు ముందుకొచ్చి " మీరు ఇతని దగ్గర డబ్బులు దొంగిలించారంటున్నాడు. అవి ఇస్తే వెళ్ళిపోతాడట!" అని చెప్పాడు.

"వ్వ్వాట్ట్??" - నేనూ నా స్నేహితురాలూ ఒకేసారి అరిచాం.

ఆ ముసలాయన అదే తీరులో నమ్మకంగా - అదే సత్యమన్నట్టుగా తలూపాడు.

"పది డాలర్లట" కుర్రాళ్ళు అతను గొణుగుతున్న మాటలు తర్జమా చేసి పెట్టారు.

అప్పటిదాకా ఏం జరిగిందో తెలీక అల్లాడిపోయి, కొద్దో గొప్పో భయం కూడా తోడవడంతో మానసికంగా, శారీరకంగా అలిసిపోయి ఉన్న వాళ్ళమల్లా, వాళ్ళీ సంగతి చెప్పగానే తారాజువ్వల్లా యుద్ధానికి వెళ్ళాం. ఉత్కళిక గబగబా జేబులో నుండి సెల్‌ఫోన్ తీసి, "పొలీస్ కి చేస్తున్నాను. వాళ్ళు వచ్చి సోదా చేస్తే మాకభ్యంతరం లేదు" అని నంబర్లు నొక్కడం మొదలెట్టింది. మిగిలిన వాళ్ళు సరేనన్నారు. మరు క్షణంలో ఆ ముసలాయన గొడుగు మూసి(ఎట్టకేలకు), మెల్లిగా అడుగులో అడుగేసుకుంటూ నడవడం మొదలెట్టాడు. "ప్లీజ్ వెయిట్..పొలీస్ వస్తున్నారు" అరిచి చెప్పాన్నేను. 

అసలు మా మాటలు విననట్టే, అక్కడ అతని ఉనికి అనవసరమన్నట్టే, ఆ చీకట్లో, వానలో వెళ్ళిపోయాడు. నేను ఆ షాక్ నుండి తేరుకోవడానికి చాలా నిముషాలు పట్టింది. "బహుశా తాగుబోతు అయి ఉంటాడు, మీరు ఇంటికి వెళ్ళిపోండి" అని, మమ్మల్ని పంపించేశారు మిగిలిన వాళ్ళు. ఆ విషయాన్ని సాగదీసే ఓపిక ఎలాగూ లేదు కనుక, ఏడుపు మొహాలతో ఇంటికొచ్చి పడ్డాం. 

**************
రాత్రిళ్ళు త్వరగా నిద్రపోవడమనేది, ఆన్‌సైట్ వాళ్ళకి, ముఖ్యంగా పెళ్ళి కాని వాళ్ళకి పాపంతో సమానం. నేనలా ఉండలేను కాబట్టి, నన్ను జనజీవనస్రవంతిలో కలువలేని నిర్భాగ్యురాలిగా పరిగణిస్తూ, నా స్నేహితులందరూ రాత్రంతా మేలుకుని కూర్చుని కబుర్లాడుకునే వాళ్ళు.  ఆ రోజు మా తలుపు తీస్తూనే మా నీరసపు ముఖాలు చూసి ఖంగారు పడుతూ, కేరళ కుట్టి లిండాజేమ్స్ "ఏమయ్యింది, పడ్డారా ఈ వానలో ఎక్కడైనా" అని అడిగింది. కాదని తలలూపి సోఫాలో కూలబడి జరిగిన కథంతా చెప్పాం. తను మా కోసం వేడిగా ఛాయ్ కలిపి తీసుకు వచ్చి, "Low crime does not always mean NO crime" అని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుని మనం కాస్త జాగ్రత్తగా ఉండాలని తేల్చి చెప్పింది.

ఇక ఆ రాత్రి మా కబుర్లన్నీ ఆ ముసలాయాన మనసులోని ఉద్దేశ్యాలేమై ఉంటాయన్న దాని గురించీ, అక్కడి జనాలు ఆడపిల్లలమని మా మాట వినకుండా, ఇద్దరి వాదనలూ పూర్తిగా వినడంలో గొప్పదనం గురించీ, కాస్త మన దేశంలో భద్రతలూ - అప్పుడప్పుడూ మేం భయపడ్డ సంఘటనలు...ఇలా అన్నీ పంచుకోవడంతో గడచిపోయింది. నా బిక్కమొహం గురించి తరువాత రోజుల్లో ఆఫీసులో మిగిలిన వాళ్ళకు చెప్పుకుని పడీ పడీ నవ్వి తన రాక్షసత్వాన్ని చూపించుకునేది, ఉత్కళిక.

"ఈ సారి అతగాడు కనపడాలీ, పోలీసులకు పట్టివ్వకుండా వెనక్కి వస్తే చూడు!" కసిగా చెప్పేదాన్ని నేను.

"నిజంగానే నిన్ను బాగా భయపెట్టాడు, ఈ సారి నేనూ వదలను. ఆ ఓల్డ్మేన్ గొడుగుతోనే ఆయనకు బుద్ధి చెప్తాను" నన్ను చూసి జాలిగా ఓదార్చేది నా నేస్తం. 

******************

ఇది జరిగిన కొన్ని వారాలకు, నేను ఆదివారాలు "గార్డెనింగ్" కోసం "అల్జునీద్"లోని తపాలా కార్యాలయం దగ్గర్లో ఉండే ఒక చిన్న తోటకి వెళ్ళినప్పుడు, దాని యజమాని జేమ్స్, ఏవో కబుర్లు చెప్తూ, "కాలిగ్రఫీ" గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. నాకూ నేర్చుకోవాలనుంది అంటూ చిన్నపిల్లలా సంబరపడ్డ నన్ను చూసి, ఆ పక్కనే ఒక వృద్ధుల శరణాలయం ఉందనీ, అక్కడ వారానికి రెండు రోజులు శిక్షణ ఇస్తారు కాబట్టి, ఇష్టమైతే రమ్మనీ ఆహ్వానించారు. 
ఆ మర్నాడు నేనక్కడికి వెళ్ళాను.

జేమ్స్ అంకుల్ నన్ను లోపలికి తీసుకు వెళ్ళడానికి వచ్చి, దారిలో కనపడ్డ వాళ్ళందరినీ పరిచయం చేస్తున్నారు. హఠాత్తుగా కనపడ్డ ఒక ముఖం చూసి, పోల్చుకోలేక ఆగిపోయాను నేను.

"ఏమైంది?" ఆగిపోయిన నన్ను చూసి సందేహంగా అడిగారాయన.

"ఆయనను ఎక్కడో చూసినట్టుంటేనూ...." అసలు విషయం దాచి పెట్టాను.

" మిగిలిన అందరి లాంటి వాడే, మనసు బాగుంటే మనుష్యులతో కలుస్తాడు, లేదంటే దొంగతనంగా దక్కించుకున్న మందుతో..." పరిహాసంగా చెప్పి నన్ను లోపలికి తీసుకు వెళ్ళాడాయన. అక్కడేమో, ఇంకొందరు ముసలి వాళ్ళు - అందరూ దాదాపు డెబ్బై ఎనభయేళ్ళు పైబడిన వాళ్ళే -  "కాలిగ్రఫీ" కోసం బ్రష్ ఎలా పట్టుకోవాలో, ఎంత సిరా కావాలో, ఎంత బలంతో రాయాలో - గడులలో ఏది ఎంత నిండాలో వివరించి చెప్తున్నారు.

నా మనసక్కడ లేదు.

నేను చూసింది మరెవర్నో కాదు, ఆ రోజు నన్ను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించిన వ్యక్తినే! ఆ రోజంటే ఓపిక లేక వాదించలేదు కానీ, తరువాత చాలా సార్లు అతను గుర్తొచ్చినప్పుడల్లా, పోలీసులకు పట్టివ్వకుండా పెద్ద తప్పు చేశాననిపించేది. ఈ సారి కనపడితే, ఎట్టి పరిస్థితులలోనూ అలా బేలగా ఉండిపోకూడదని - ముఖ్యంగా ఆయన్ను వెళ్ళిపోనివ్వకూడదనీ బలంగా అనిపించేది. కానీ ఆ బలమైన నమ్మకాలన్నీ, అతని గురించి లీలామాత్రంగా తెలుసుకున్న క్షణంలోనే, పూర్తిగా సడలిపోయాయి.

ఆ రోజు రాత్రి నన్ను వెంబడించి, దాదాపుగా కళ్ళనీళ్ళు పెట్టించినంత పని చేసి, సింగపూర్‌లో నాకు ఏకైక బాధాకర అనుభవం మిగిల్చిన ఆయన - నేనూ నా స్నేహితులూ "శిక్షార్హుడు" అని బలంగా నమ్మిన ఆ ముసలాయన - అలా ఏమీ లేని, ఎవరూ లేని ఒంటరి వాడు అని తెలీగానే ఎందుకో బాధగా అనిపించింది.
ఏమీ తోచని నైరాశ్యంలో బహుశా పది డాలర్ల కోసం కరువాచిన క్షణాల్లో, ఆయన తెలియక చేసిన తప్పును విడిచిపెట్టేయలేనా అనిపించింది. అంతే! అప్పటి దాకా, - రిలీజ్ నాటి రాత్రి మొదలు ఆ క్షణం దాకా, అతనంటే మనసంతా నిండి ఉన్న కోపమేదో, మంచల్లే కరిగిపోయింది.

"కాలిగ్రఫీ" ఎన్నో రోజులు సాగలేదు కానీ, ఒక అనుభవాన్ని బట్టి వ్యక్తుల పట్ల ద్వేషాన్ని పెంచుకోకూడదనుకునే మనస్తత్వం మాత్రం ఈనాటికీ కొనసాగుతోంది.

21 comments:

  1. మీరు చెప్పింది నిజమే. ఒక అనుభవంతో మనుషులని చెడ్డవాళ్ళగానో, మంచివారిగానో అనుకోవడం పొరపాటే. నేను లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నది కూడా నమ్మను. మీ అనుభవం పంచుకున్నందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  2. మానసా.. ఒక అనుభవాన్ని బట్టి వ్యక్తుల పట్ల ద్వేషాన్ని పెంచుకోకూడదనుకునే మనస్తత్వం ..మాత్రం ఇప్పటికి కొనసాగుతుంది. . చాలా బాగుంది. కాలక్రమేణా.. మనుషుల ఆలోచనలలో పరిణితి వచ్చి.. చాలా విషయాలకి మనం ఇచ్చిన ప్రాముఖ్యత అల్పంగా అనిపిస్తుంది. అది నిజం.
    చాలా మంచి విషయం . ధన్యవాదములు. ..

    ReplyDelete
  3. చాల చక్కగా చెప్పారు అండి.....కాని చూడంగానే ఒక అభిప్రాయానికి కి వద్దన్నా వచ్చేస్తూ ఉంటాం....మీలాగా కొంత అలోచించి అడుగేస్తే మంచిదేమో :)

    ReplyDelete
  4. మనం చదువుకునే రోజుల్లో మనం పరీక్ష రాయడానికి పాఠం నేర్చుకుంటాం, అదే జీవితం మాత్రం పాఠం నేర్పడం కోసం పరీక్షలు పెడుతుందంట. ఎక్కడో చదివిన జ్ఞాపకం.మీ అనుభవం ఎలాంటిదైనా దాన్నుంచి మీరు నేర్చుకున్న విషయం బాగుంది.:-)

    ReplyDelete
  5. సింగపూర్ కబుర్లు బావున్నాయండి

    ReplyDelete
  6. మొదట్లో చదువుతుంటే కొంచం భయమేసింది.. ఇంట్రస్టింగా(అంటే ఏమవుతుందో అని భయంగా) రాశావు :-) క్రైం స్టోరీలెప్పుడూ చదవలేదు, బహుశా అవి ఇలానే ఉంటాయేమో... వయసుమల్లడం వల్ల వచ్చే చిన్నచిన్న ఇబ్బందులు పాపం ఆ ముసలాయనకి. ఎంతబాగ అర్థం చేసుకుని క్షమించేశావో! గ్రేట్ జాబ్.

    ReplyDelete
  7. Really marvellous narration.

    cheers
    zilebi.

    ReplyDelete
  8. అనుభవం గుణపాఠం నేర్పుతుంది మరి.చాలా బాగా వ్రాసారు(సహజంగానే)

    ReplyDelete
  9. బారాసారు...కథనం చాలా అసక్తికరంగా ఉంది.
    జీవితం మనకి ఎన్నో పాఠాలు నేర్పుతుంటుంది ఇలాగే! Impressive!

    ReplyDelete
  10. చాలా బాగా రాశారు మానసా...

    ReplyDelete
  11. *జలతారు వెన్నెల గారూ, - ధన్యవాదాలండీ!

    *వనజ గారూ - వెనక్కి తిరిగి చూసుకుంటే, మనం జీవితంలో అతి ముఖ్యమైనవి అని భ్రమపడ్డ విషయాలన్నీ చిన్న విషయాలే అనిపిస్తూ ఉంటుంది నాక్కూడా; ఈ తరహా ఆలోచనలు జీవితాంతం తప్పవనుకుంటా!

    *శేఖర్ గారూ - అన్ని సార్లూ కుదిరే పని కాదు కానీ, అలా ఆలోచించి అడుగేయగల స్థిత ప్రజ్ఞతే ఉంటే, అదృష్టవంతులమే!

    *క్రాంతి గారూ : :) Life is a series of lessons:p

    *లోకేష్ శ్రీకాంత్ గారూ : ధన్యవాదాలండీ!

    ReplyDelete
  12. ** అజ్ఞాత అవినేని గారూ : :) క్రైం అంటే ముందు నేనే పరుగెత్తి పారిపోతాను. మళ్ళీ గుర్తు చేసుకుని రాయడమే - అమ్మో, జరిగే పని కాదు. ఇదేదో సరదా జ్ఞాపకం కాబట్టి అక్షరాల్లోకి వచ్చి మీ ముందు నిలిచిందిలా..!
    @Zilebi : Thank you so much for the encouraging words.
    @Deepthi - Thank you!
    * శ్రీనివాస్ గారూ : మీ మంచి మాటలకు కృతజ్ఞతలండీ
    * ఆలమూరు సౌమ్యా: థాంక్యూ. తరచి చూస్తే ప్రతి రోజూ ఇలాంటి మీమాంసకి గురి చేసే సందర్భాలు ఎదురవుతూనే ఉంటాయి కానీ, గుర్తు చేసుకుని రాయాలనిపించేవి కొన్నే. వాటిలో ఇదీ ఒకటి. మీ స్పందనకు కృతజ్ఞతలు.
    *వేణూ శ్రీకాంత్ : ధన్యవాదాలండీ!

    ReplyDelete
  13. మీరు రెండు సార్లు సరిగానే ఆలోచించారు.
    ఆపదసమయంలో ఆలానే ఆలొచిమ్చాలి. తప్పదుకదా .అతను నిజంగా క్రిమినల్ అయితే జాలి చూపాల్సిన పనిలేదు.
    ఇక తెలిశాక మీ మనస్సు మమ్చీ చెడులను బేరీజు వెసింది కనుక ,సహజమైన దయా హృదయం ఇలాస్పందిమ్చిది. రెండు రైటే

    ReplyDelete
  14. బాగుందండీ. "ఏమవుతుందా?" అనే ఆసక్తిని కథనం చివరి దాకా బాగా నడిపారు. :)

    ReplyDelete
  15. దుర్గేశ్వర గారూ: కృతజ్ఞతలండీ!
    కొత్తావకాయ గారూ : :) ధన్యవాదాలు.

    ReplyDelete
  16. చాలా బాగా రాసారండీ..మీకు ఉగాది శుభాకాంక్షలండీ..

    ReplyDelete
  17. సుభ గారూ, ధన్యవాదాలండీ! మీకూ - మీ ఆప్తులందరికీ హృదయపూర్వక నందన ఉగాది శుభాకాంక్షలు.

    ReplyDelete
  18. హ్మ్ ! బాగా రాసారు . మీరు రాసినది చదివాకా కొంచెం భయమేసింది . అవును ఇంతకీ కాబ్ అంత దూరం లో ఎందుకు దిగి పోయారు ?
    అయినా మీకు క్షమా గుణం ఎక్కువ :)) ద్వేషం కూడదు కానీ ఎలా చేసినా ఎందుకు చేసినా తప్పు తప్పే కదా :)

    ReplyDelete
  19. అంటే శ్రావ్యా,
    మేము ఉండే అపార్ట్‌మెంట్ Aljunied Crescentలో ఉండేది. మా బ్లాక్‌కి వెళ్ళాలంటే ఎప్పుడూ ఒక ఐదు నిముషాల నడక ఉంటుంది. ఆ రోజలా ఇరుక్కుపోయామన్నమాట.

    భయపడక్కర్లేదులే...ఎందుకంటే మిగిలిన రెండున్నరేళ్ళలో మాకెప్పుడూ ఎక్కడా ఏ ఇబ్బందీ రాలేదు...అర్థరాత్రిళ్ళు నిద్ర పట్టక McDకి వెళ్ళిన రోజుల్లోనూ, నేస్తాలా పుట్టినరోజులు జరపడానికి Midnight ECPకి వెళ్ళినప్పుడూ, ఇలా పనులున్నప్పుడు ఆఫీసు నుండి ఆలస్యంగా ఇంటికి వచ్చినప్పుడూ...అన్నిసార్లూ, I just loved Singapore. I can never imagine doing the same things here in India.
    By the way, Do you stay in Singapore?

    ReplyDelete
  20. Manasa ..ela unnav ... Need to talk to you email me ...

    ReplyDelete

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...