చలం - అమీనా


చలం రచనలు ఇన్నాళ్ళూ నేనెందుకు చదవలేదో, ఇంతకు ముందొక సారి ఇక్కడ రాసి ఉన్నాను. అలాగే, ఒక పాఠకురాలిగా నా పరిథిని పెంచుకోవడానికి ఇప్పుడొక్కొక్కటీ తీసి చదువుతున్నానని, ఈ బ్లాగ్ అడపా దడపా చూసే వారికి అర్థమైపోయి ఉంటుంది. ఇటీవలే నేను చదివిన మరో చలం కవిత్వం - "అమీనా". అమీనా నిజానికి ఒక నవల. కాకపోతే, అడుగడుగునా, అక్షరమక్షరానా, చలం హృదయం నుండి కాగితాల్లోకి నేరుగా సిరాగా పాకిన కవిత్వాన్ని చూపించే నవల.

చలం రచనలెటువంటివైనా, వాటిలోని తీవ్రతను మాత్రం అందరూ ఒప్పుకునే తీరాలి. అతని భావాలను, బాధలను, గుండెల్లోని అలజడినీ, ఆ మర్యాదపు ముసుగుల్లో మనిషి పడే సంఘర్షణనీ, చలాన్ని చదివే వాళ్ళు తప్పించుకుందామనుకుంటే, సాధ్యపడదు.
లాగేస్తాడు..లోపల్లోపలికి...అతని అక్షరాల్లోకి.
ఆహ్వానిస్తాడు..చేతులు విశాలంగా చాచి అతని అంతరంగపు లోతుల్లోకి. 

ఒక తొంభైఆరు పేజీల నవల, తొంభై నిముషాల లోపే పూర్తి చేసెయ్యడానికి అనువుగా ఉండే నవల, మనకి మునుపెన్నడూ పరిచయం లేని ఒక ముసల్‌మాన్ బాలిక పట్ల ఎంత అనురాగాన్ని, జాలినీ,  ఆత్మీయ అనుబంధాన్ని పెంచగలదో తెలుసుకోవాలంటే "అమీనా" చదవాలి. అమీనా ప్రారంభమే ఒక అద్భుతం. "ముందుమాట" నుండే మనం చదవడం మొదలెట్టాలి. రచనను అనుభవించడాన్ని, ఇక్కడి నుండే అలవాటు చేసుకోవాలి. 

"ఏళ్ళల్లో ఒదిగి
వాకిట్లో నుంచుని, ఒచ్చానంటే,
చిన్నప్పటి నీ ఒంటి బురదని 
కావలించుకున్నా,
పెద్దైన నీ మనసు మీద                                                     
లోకం చిమ్మిన మాలిన్యాన్ని అంగీకరించలేని
చలం
అవమానానికీ
లోకపరత్వానికీ
పరిహారంగా
నీకు, అమీనా ఈ పుస్తకం."
అమీనా చదవడంతో చాలా చిక్కులున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా చెప్పుకోవలసింది, ఏ పాత్ర గురించి ఏ విధమైన వివరణా లేకపోవడం. యండమూరి, సూర్యదేవర, యద్ధనపూడి తదితరుల నవలలన్నీ చదివే అలవాటు ఉన్న నాలాంటి వాళ్ళకి, నవలలో పాత్రలంటే - వాటి పరిచయాలంటే ఒక అంచనా ఉంటుంది. చలం వాటిని బద్దలుకొట్టాడు. బద్ధకాన్ని వదుల్చుకుని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువుకుని, అర్థమైనంత అర్థం చేసుకోమంటాడు; అర్థం కాని వాటిని వదిలేసి ముందుకు సాగి, అతన్ని అనుభవాలు పంచుకోమంటాడు. అతని మాటలు వినడం వినా వేరు దారి లేకుండా చేస్తాడు.

నేనెలాగో తిప్పలు పడ్డా కనుక, మీకు కొన్ని వివరాలిస్తాను. కథలో చలంతో పాటు, అతని స్నేహితులు కొందరు అతనితో కలిసి ఒకే ఇంట్లో ఉంటూంటారు. ఆ సమయంలో అతని భార్య ఊరెళ్ళి ఉంటుంది. కథ దాదాపు ముగిసే సమయానికి తిరిగి వస్తుంది. ఈ మధ్యలో ఎదురయ్యే పాత్రలన్నింటి ఆలోచనల్లోనూ కొన్ని సారూప్యాలుంటాయి. ఇదీ అని తేల్చలేని నిర్లక్ష్యం, అందరికీ మనసో దేహమో పంచుకునే వారి కోసం ప్రాకులాడే మనస్తత్వం, విడీపోయిన ప్రేమ కథలు, చలం పాత ప్రేయసి (విమల) ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రియుడితో ముందుకు రావడం, ఆమె ఏడుపులు, అర్థం లేని బాధలు, టీలు, కిళ్ళీలతో,  కబుర్లతో, పాటలతో, కొన్ని నవ్వులతో, కొన్ని బాధలతో, కొన్ని అసంతృప్తులతో సాగే జీవితాలతో....వాళ్ళంతా కలిసి కాలక్షేపం చేస్తూంటారు. వీరే చలం 'అమీనా'లో పాత్రధారులు.

ఈ కథ కాస్త కల్పితమూ, కాస్త చలం స్వీయానుభవమూ అని విని ఉన్నాను. కథలో చాలా చోట్ల ఎంకి పాటల సుబారావుగారి ప్రస్తావన వస్తుంది. ఏలురులో కథ నడిచిన కాలంలో వారిరువురూ స్నేహితులు కాబోలు. అసలు అమీనా చలానికి మొదటిసారి తారసపడింది కూడా, సుబ్బారావుని ఏటి ఒడ్డున కలుసుకోవాలని నడుస్తున్నప్పుడే! అప్పటికే అతనికి అతని జీవితం పట్ల తెలియని విముఖత ఉన్నట్లు తోస్తుంది ఆ సంభాషణలు చదివితే.
చూసీ చూడగానే స్నేహాన్ని కోరాలనిపింపజేసిన ఆ చిన్న పిల్ల అమీనాతో చలం పలికిన తొలి మాటలివీ...

<...>
"ఎక్కడ ఇల్లు?"
"అక్కడ, కాలువగట్టున. మీ ఇల్లు?"
"మొండి గోడల మధ్య."
"అంటే?"
"నీకెందుకు"
"వస్తాను."
"వొస్తావా?"
"మీతోనే ఉంటా"
అమీనా కళ్ళు నమ్మించాయి. ఆ "మీతోనే ఉంటా"నన్న మాటని మీరలేదు అమీనా నవ్వు. నిర్భాగ్యపు నా అదృష్టమే, నా అధైర్యమే, నా సందేహమే, నా లోకపరత్వమే, నా లాభనష్ట గణితమే నిన్ను తరిమి మాయం చేసాయి.

ఇది మొదలుకుని చలంలో అమీనా పసితనమంటే ఆకర్షణా, ఆమెలోని స్వచ్చత పట్ల ప్రేమ, నిష్కామ స్నేహం కోసం తపన మొదలవుతాయి. తన చుట్టూ ఉన్న ప్రపంచానికి అతీతమైనదేదో అమీనాలో చూస్తాడు చలం. మనసులో ఉన్నది కళ్ళల్లో చూపెట్టే ఆమెని ఆరాధిస్తాడు. ఆమె అమాయకత్వపు ప్రవర్తనలో, ప్రేమలో, జీవితం పునర్నిర్మితమవుతున్నట్టు భావిస్తాడు. అందుకే ఆమెకు దగ్గర్లో ఉండాలనీ, దగ్గరగా ఉండాలనీ ఆత్రపడతాడు. ఆమె తన పూరి గుడిసెకు, తల్లి కాని తల్లి దగ్గరకు వెళ్ళినప్పుడు బెంగపడతాడు. తినడానికేమీ లేక చేపలు పట్టుకు వండుకునే ఆ ముసల్‌మాన్ అమ్మాయి కాసేపు కనపడకపోతే విలవిలలాడతాడు. ఇది చలం అంతరంగం. 

బాహ్య ప్రపంచానికి చలం ఒక మర్యాదస్తుడు. ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న సభ్య సమాజ పౌరుడు. భార్యా, కుటుంబమూ ఉన్న సగటు సంసారి. అమీనాతో స్నేహం ఈ లోకానికి అర్థం కాదని చలానికి బాగా తెలుసు. ఆమెను ఒక స్నేహితురాలిగా అందరికీ పరిచయం చేయలేడనీ తెలుసు. అమీనా మాదిరిగా స్వచ్ఛమైన స్నేహాన్ని, ఆమెకు బదులివ్వలేని అశక్తుడనీ, నిస్సహాయుడనీ, అతని మాటల్లో అతనే ఒప్పుకుంటాడు కూడా.

కొన్ని రోజులు ఆ మొండి గోడల మధ్య అమీనా అందరితోనూ కలిసి చెప్పిన కబుర్లతోనూ, ఆమె  చేసిన అమృతతుల్యమైన కాఫీ టీలు తాగుతూ , ఆమె అడవిలో నెగళ్ళ దగ్గర చలి కాచుకుంటూ విని నేర్చుకున్న పాటలు వినడంతోనూ, సాఫీగా రోజులు దొర్లిపోతుంటాయి.  అమీనాకి, ఆ ఇంట్లో తన స్థానమేమిటో తెలీదు. ఆమె అసలు దాని గురించి ఏనాడూ అలోచించినట్టు కనపడదు. తన పూరి గుడిశలో తనకేనాడూ దక్కని సంతోషమేదో ఈ మనుష్యుల దగ్గర దొరికిందన్న సంతోష మొక్కటే ఆ లేత గుండెలో. చలం ఆమె పట్ల చూపించే ప్రత్యేకమైన ప్రేమ, ఆప్యాయతా - ఆ చిట్టితల్లికి అవే సకలైశ్వర్యాలూ!

ఊరెళ్ళిన భార్య శ్యామల తిరిగి రాకుంటే, ఈ కథకు అడ్డేమీ ఉండేది కాదేమో! అహాల మధ్య యుద్ధాలను రాజేసిన సంఘటనలంటూ జరగకపోతే, అమీనా పసి మనసు గాయపడేదే కాదేమో. ఈ భయం చలానికి లేకపోలేదు. అమీనాని అసలు ఏమని పరిచయం చేయాలన్న మీమంసతో అతను కొట్టుకుపోలేదని, అస్సలు అనుకోలేం.

"బడికి వెళ్ళాక జ్ఞాపకం వచ్చింది - అమీనా స్వేచ్ఛగా హార్మోనియం వాయించడం, కుర్చీలలో నిద్రపోవడం, పుస్తకాలలో ఎదో భాష గీకడం, నా బట్టలు సర్దడం తొడుక్కోవడం సహిస్తుందా శ్యామల ? ముందు చెప్పి రావలసింది...
ఏమనీ ?
అమీనా నౌకరు కాదని..!
నౌకరు కాకపోతే..ఎవరు ?

అవును. అమీనా, ఎవరు ? ఎవరు ?"

మొదట్లోనే చెప్పినట్టు, అంతః సంఘర్షణను, అలజడినీ మనలోకెక్కించేందుకు చలం అద్భుతమైన భాషను, శైలినీ వాడుకున్నాడు. అమీనా కోసం పడే తపనను అక్షరాల్లో పెట్టడంలో నూటికి నూరు శాతం సఫలీకృతుడయ్యాడు. అర్థరాత్రి అందరినీ విడిచి, అన్నింటినీ విడిచి, మనసు పిలుపు విని, గుమ్మం దాటిన క్షణాల్లో చలం మనసిది :

"మెట్లు దిగాను. తలుపు తీశాను.
రోడ్డు. ప్రశాంతమైన కంకరరోడ్డు, చీకటి.
నా సిగ్గుని దాచండి, అడుగుల శబ్దాలూ!
నా మొహాన్ని చూడకండి, నక్షత్రాలూ!
అమీనా. అమీనా - మరచిపోయినాను నిన్ను.!
కాని, కనపడదు. నాకు ముందు తెలుసు.
దురదృష్టం ప్రారంభించిందా...ఇంక అంతు లేదు. 
ఇంకేం కాబోతూంది?
రాత్రీ, ఏం చేయబోతున్నావు నన్ను!
అమీనా!! "

వెతికి వెతికి అలసి, తన పనులను తనే తఱచి చూసుకుని చలించీ, స్పష్టాస్పష్ట భావాల మధ్య ఊగిసలాడి, వెనక్కి వచ్చిన చలం, ఇంటి గుమ్మం ముందు కాళ్ళకి వెచ్చగా ఏదో తగలడంతో ఉలిక్కిపడతాడు.  అతని కాళ్ళ కింద అమీనా!

"అమీనా!"
చీకట్లో - మెట్ల మీద - దుమ్ములో-
ప్రేమలోకంలో దిక్కుమాలిన బిచ్చగాళ్ళం-
దెబ్బతిన్న గుడ్డీవాళ్ళం -అనాధలం- అంధకారులం-ప్రేమని నిరసించే నేను
ప్రేమను ఆశించే అమీనా.

ఇద్దరం-ఇద్దరం- పొడుగై పాకే నీడలో- పెళ్ళలు రాలే గోడలో.
కన్నీళ్ళు -ఎక్కిళ్ళు వేళ్ళు -ఒకళ్ళ చుట్టూ ఒకళ్ళ వేళ్ళు -వేళ్ళ మధ్య వేళ్ళు -పెదమల మధ్య జుట్టు -రెప్పల మధ్య నీళ్ళు. "

నిజంగా ఈ సంఘటన చదువుతున్నప్పుడు, పసిపిల్లను పొదుముకున్న చలం కనిపిస్తాడు. ఆకుపచ్చ రిబ్బన్లు జుట్టుకు కట్టుకున్న పిచ్చి అమీనా కన్నీళ్ళతో కనిపిస్తుంది. ఆ బాధలో ఆ రాత్రి కరిగిపోవడమూ, చీకటి వీడ్కోలిస్తూ వెళ్ళిపోతుంటే ఉషోదయం వారిని పలకరించడమూ - మనకీ తెలుస్తాయి, మనం మౌన ప్రేక్షకులమై చూస్తూంటామంతే!


అప్పుడప్పుడూ అతనిలో అంతరాత్మకు వ్యతిరేకం(?)గా చెలరేగే భావాలను స్పష్టపరచడానికా అన్నట్లు, “అమీనా నువ్వూ స్త్రీవేనా ? ” “బలి కోరుతున్న విధి వెయ్యినాల్కలలో ఒకదానివి” అని వగచే చలమూ కనపడతాడు. భయపెడతాడు. అమీనాకి మాత్రం ఈ ఆలోచనలు లేవు. ఏ భయాలూ లేవు. సంబంధాలకు నిర్వచనాలు వెదుక్కోకుండా నిజాయితీగా నిలబడడం మాత్రమే తెలిసిన మేలిమి ముత్యం అమీనా.

శ్యామల తిరిగి వచ్చి, అమీనాని వాలకం నచ్చట్లేదన్న వంక పెట్టి ఇంట్లో నుండి గెంటేసిన కొన్నాళ్ళకి, అమీనాకు ఒక ముసలి మనిషితో పెళ్ళి కుదురుతుంది. చలానికిది మింగుడుపడదు.

ఆ పైన ఒక ఆదివారం, అమీనా ఎప్పటిలాగే ఇంట్లోకి దూసుకొస్తుంది. నేరుగా చలం ఒళ్ళోకి వెళ్ళిపోయి ఏడుపు మొదలెడుతుంది. ఇవి చలంలోని మర్యాదస్తుడీకీ, అమీనాని అభిమానించే ప్రేమించే ఆరాధించే చలానికీ వైరం మొదలయ్యే క్షణాలు. చలంలోని స్వార్థం, అమీనా మనసుని తునాతునకలు చేసిన క్షణాలు. చలం జీవితంలో తర్వాత్తర్వాత ఘోరమైన పశ్చాత్తాపానికి లోనయ్యేట్టు చేసిన ఆలోచనలు, మాటలు  - అతని మాటల్లో ఇవిగో :

"వొద్దు. రాకు. నీకు నాకు అందరికీ తిట్లు.
మర్యాద తెలీదు -అంటారు.
రాకు. లోపలికి రాకు.
నన్ను కావలించుకుని. ఒకటే ఏదుస్తోంది. అమీనా, ఎందుకు ? ఏం జరిగింది ? రా, నాతో చెప్పు ?
తొరగా. తొరగా. అట్లా చప్పుడు చెయ్యకు వొస్తారు. నీ ఏడుపు విననీరు. మనకి స్థలం లేదు. తొరగా అమీనా, ఏమిటి నా అమీనా?
"నాకో చీర కావాలి. కొనిపెట్టండి"
ఏమిటి! చీర! కొనాలా!
ఉండు, అమీనా. ఆలోచించనీ. చీరె ఏమిటీ?
"ఎందుకు నీకు?"
అమీనాకి నేనెందుకు చీరె ఇవ్వాలి? నా చెల్లెలా! నా కూతురా? నా బోగందా? నా అధికారి భార్యా? ఎవరు అమీనా? నేనెందుకు చీరె ఇవ్వాలి.
<<...>>
ఎదగని నౌకరు కన్య, అమీనాకి!
"ఇవ్వరా? నేనడుగుతున్నాను. నాకు అవసరం ఇవ్వరా?"
నా నడుం చుట్టూ లేత వేళ్ళు.
నా పొట్ట తడుపుతూ కన్నీళ్ళు.

చలం తన సంసారాన్నీ, తన జీవితాన్ని గుర్తు చేసుకుంటాడు. ఆమెకు ఇవ్వడం వల్ల తను మాటలు పడవలసిన అగత్యమే తప్ప, మరే ఉపయోగమూ కనపడదు. తర్జనభర్జనలూ, లెక్కలూ పూర్తయ్యాక :

"ఏమిటి అమీనా! ఎందుకు ఇస్తాను నీకు చీరె? ఎందుకు ఇయాలి ?"
నా మొహంలోకి ఒక్క చూపు.
నా నడుంలో నుండి ఒక్క తోపు.
గుమ్మంలో అమీనా! కంఠం ఒణుకుతూ, కాళ్ళు ఎండవేడిలో ఊగుతో -
మనుష్యుల్లో, మంచితనంలో, ఔదార్యంలో, కుంగి, నలిగి, విశ్వాసం నశించి, చాలా సిగ్గుతో -
"పోనీ..పోనీ..నా జీతం..ఇవ్వండి.."

ముక్కలైన మనసు, ముక్కలు ముక్కలుగా మాటల రూపంలో బయటకు వచ్చినా, చలం కదలడు. చలించడు. డబ్బులకేనాడూ ఆశ పడని పసి అమీనా, అతని అర్థం లేని భయాన్ని చూసి ఈసడించుకుని, తన ప్రేమను, సంతోషంగా చేసిన పనులనూ, ఈ రోజు పేరు మార్చి జీతం కోసం అమ్ముకోవాల్సి వచ్చినప్పుడు ఎంత క్షోభ పడి ఉంటుందో ఆ క్షణంలో అర్థం చేసుకోలేకపోతాడు.

జీతం రాళ్ళు పడేశాక, మారుమాట్లాడకుండా వెళ్ళిపోయిన ఆమెను చూస్తూ " అమ్మా, వెళ్ళింది. తిట్టకుండా పోయింది. ఎంతైనా తురక వాళ్ళను నమ్మడానికి వీల్లేదు" అంటూ పిచ్చి ప్రేలాపనలు చేస్తాడు. అక్కడితో అయిపోలేదు, అమీనా అతనికి మళ్ళీ కనపడుతుంది.

మళ్ళీ అమీనా.అబ్బ!వొదలవా! ఇంకా జీతమా!
ఏమిటి అట్లా చూస్తుంది. ఎండలో వెలవెలపోయే చందమామ లాగు!
సాయంత్రం చీకట్లో చెంగల్వలాగు!

పాపం, అమీనాకి వేరే ఉద్దేశ్యమేదీ ఉండదు; అతనిచ్చిన డబ్బులతో కొనుక్కున్న చాలీ చాలని ఓణీ చూపించి, తాను వెళ్ళిపోతున్నానంటూ వెను తిరుగుతుంది.

"వెళ్ళకు అమీనా! ఆగు."
"ఆగు. అమీనా! ఆగు."
 గడ్డిబండీ అడ్డం - మర్యాద కట్టుకున్న నా కాళ్ళే అడ్డం.
చదివి చదివి గుడ్డివైన నా కళ్ళేఅడ్డం. సబ్బుతో కడుక్కున్న నా చేతులే అడ్డం.
 అమీనా! అమీనా!
రోడ్డి మలుపు..సైడు కాలువ. బురద.
అస్తమించే సూర్యుడు -కళ్ళల్లో చీకటి.

అంతే అమీనా!
జన్మానికి ఆఖరు నా చిన్న అమీనా!
ఎరగని పువ్వు నా అమీనా!

అంటూ చలం ఆగిపోవడంతో కథ ముగుస్తుంది.
********************
అమీనాని, చదివే అవకాశం ఉంటే తప్పక చదవండి. జీవితాన్ని చలం కళ్ళతో చూసేందుకు కాదు. జీవిత సత్యాలేవో తెలుసుకునేందుకు కాదు. మనుష్యులలోని చపల బుద్ధినీ, చంచల మనస్తత్వాన్నీ గ్రహించి నిరసించేందుకు కాదు. మర్యాదల ముసుగులు తీసుకు మనసుని స్వచ్ఛంగా మెరిపించుకుందుకూ కాదు. తప్పొప్పులు తూకాలు వేసి, మీ అభిప్రాయలు బలపరుచుకోవడానికి వాదులాడే అవకాశం కోసం అస్సలు కాదు.

ఒక రచన ఎంత శక్తివంతంగా మలచబడిందో తెలుసుకోవడం కోసం. చలం చేతుల్లో ఒక మామూలు సంఘటన, ఒక మరపురాని జ్ఞాపకం, ఎంత అపురూపంగా అక్షరాల్లోకి తర్జమా చేయబడిందో కళ్ళారా చూడండం కోసం! మనసుతో రాసే రచయితల కలం శక్తి మరో సారి రుచిచూసేందుకు...తరించేందుకు. అమీనాని ప్రేమించేందుకు. మీ గుండెల్లోనైనా కాస్త చోటిచ్చేందుకు.

*************
అడగ్గానే చలం రచనలను పంపించిన  సాహితీ మిత్రులు, బ్లాగర్ శ్రీ అవినేని భాస్కర్ గారికీ, చేతికందించిన "ఏకాంతం" బ్లాగర్ దిలీప్‌కూ - వేనవేల కృతజ్ఞతలతో....

18 comments:

  1. చలంగారు రచించిన మైదానం ఒక్కటే నేను చదివింది. ఏ పాత్రకి పరిచయాలు ఉండవు. చాల చాల కష్టపడి ముప్పై పేజీలు చదివితే గాని ఆయన వ్రాత కి అలావాటు పడలేదు. నేను మాములుగానే చాల మెల్లగా చదువుతాను పుస్తకాలు, చలం గారి పుస్తకాలు చూడడానికి చిన్నగా ఉన్నా సరిగ్గా మనసంతా పెట్టి చదవకపోతే ఏమి అర్థం కాదు :)

    అమీనా కుడా చదవడానికి ప్రయత్నిస్తాను :)

    మానసా గారు, మంచి పుస్తకాన్ని పరిచయం చేసారు :)

    ReplyDelete
  2. వంశీ కిషోర్ గారూ : మీ స్పందనకు ధన్యవాదాలు. చలం పుస్తకాలు నాకూ కొత్తే. మీరనట్టు కొన్ని పేజీలలా చదువుతూ వెళ్ళిపోవాలంతే, ఆయన చెప్పేది పూర్తిగా అర్థమయ్యేందుకు.
    కాకపోతే, చదివి వదిలెయ్యలేం చలం పుస్తకాలని. నాలా "ఫీల్ గుడ్" పుస్తకాలు మాత్రమే చదివే అలవాటు ఉన్న వాళ్ళకి, చలం పాత్రలు వేసే ముద్రలు తప్పించుకుని బయటకు రావడం చాలా చాలా కష్టం.

    ReplyDelete
  3. ఇంతకు ముందు చెప్పినట్టు చలం రచన పరిచయాలలో ఇంతవరకూ చదివిన వాటిల్లో మీది ఈ సారి కూడా నచ్చింది. చలం ఆరాధకులో, లేక ద్వేషించే వారో కాక పోవడం వల్ల అయ్యుండచ్చు. అంతే కాక మీ వ్యక్తీకరణ కూడా ఇంకో కారణం. చివరకు ఈ రచన ఎందుకు చదవాలో చెప్పిన దానితో ఏకీభవించాలని ఉంది. చదువుతానా ఎప్పటికైనా అంటే చెప్పలేను. ఇంకా మనిషి బలహీనతలను అందమైన మాటల్లో చదివి ఆనందించ లేకపోతున్నాను. అలాగని ఇంకొన్ని రచనలలో నిజాయితీని, ఆ వ్యక్తీకరణను చదివాను.నచ్చిందనీ, అర్థం చేసుకోగలిగాననీ అనుకున్నాను. బహుశా ఈ బలహీనత, దాని మీద ఏ విధమైన విజయం సాధించినట్టు కనిపించకపోవడం, సంజాయిషీలో, సానుభూతో మాత్రమే కనిపించడం వల్ల అయ్యుండచ్చు. కాకపోవచ్చు. కొన్ని విషయాలను చదవలేకపోవడం అనే నా బలహీనత వల్ల కావచ్చు. తెలుగులో నిజాయితీని భరించడం కష్టం కావచ్చు కూడా నా మటుకు నాకు. కానీ చదవాలి అనిపించేలా ఉంది మీ పరిచయం. ఇంకా ముఖ్యంగా రచన గురించే ఎక్కువ వ్రాశారు కనుక కూడా కావచ్చు, రచయిత గురించి కన్నా.

    ReplyDelete
  4. అమీనా కథ ఈసారి చదవాలి. ఈ మధ్య విశాలాంధ్ర బుక్ హౌస్‌కి వెళ్ళడానికి టైమ్ దొరక్క చలం గారి పుస్తకాలు కొనలేదు. కానీ నా దగ్గర ఉన్న చలం గారి పాత పుస్తకాలు చదువుతున్నప్పుడు చలం గారి ఉన్నంత ధైర్యం వేరే రచయితకి ఉంటుందా అనిపిస్తుంది.

    ReplyDelete
  5. మనసా.. చాలా చక్కని పరిచయం అనే కన్నా.. చలం ని యెంత బాగా అర్ధం చేసుకున్నారు అని అంటాను. చలం సౄష్టించిన పాత్రలో చలం గారి అంతరంగాన్ని బేరీజు వేయగలిగారు. ఏ రచయిత కైనా తనలో బహిర్గతం కాని మానసిక సంఘర్షణలే సజీవ పాత్రలు. చలం గారి ఆలొచనలకి కోట్లానుకోట్లమంది మనుషుల సంఘ జీవనానికి వేసిన మేలి ముసుగు "అమీనా" చలం గారు యేమి చెప్పారొ..బాగా అర్ధం చేసుకున్నారు, మనిషిలోని బహుముఖ పార్శాలు బయల్పడెధి ఉన్నది ఉన్నట్లు చెప్పే రచనలలొనే!ఆలోచనా పరిణామక్రమం రచనలలోను చూడటం,మనిషిలోని బలహీన క్షణాలని గుర్తించడం,కుండబ్రద్దలు కొట్టినట్లు వ్రాయడం చలంకే చెల్లిందెమో!

    ReplyDelete
  6. చలాన్ని చదివితే యేమొస్తుంది? ఎంత లాభం అంటే అంకెల్లో చెప్పడం అసాద్యం. మన జీవిత గమనాలను మన జీవితాల గురించి మనకు అశాంతి కలుగుతుంది. మన శరిరంలోను, మెదడులోనూ పేరుకున్న కొవ్వును కరిగించుకొవాలనిపిస్తుంది. ఎందుకు తీస్తున్నామో తెలియకుండా తీసే పరుగులు ఆపి, గుండెలనిండా గాలి పిల్చుకుని రక్తశుద్ది చేసుకోవాలనిపిస్తుంది. స్వేచ్చ, బాద్యత ఒకదానికొకటి విరుద్దమైన విషయాలు కావని, ఒకే నాణానికుండే రెండు వైపులని చలం మనకు పదే పదే గుర్తుచేస్తారు. అలాగే ఆనందనికి వ్యతిరేక పదం త్యాగంకాదు. అవి రెండూ విరుద్ద భావనలు కావు.. ఈ విషయాన్ని అర్దం చేసుకొని హృదయాలను విశాలం చేసుకొమంటుంది చలం సాహిత్యం + చలం జీవితం.

    ReplyDelete
  7. చలం గారు వ్రాసిన చిత్రాంగి నాటిక చదివారా? ఒరిజినల్ చిత్రాంగి కథని మార్చి వ్రాసారు. ఈ నాటికలో చిత్రాంగి సారంగధరుణ్ణి ప్రేమిస్తుంది కానీ సారంగధరుని తండ్రి ఆమెని బలవంతంగా పెళ్ళి చేసుకుంటాడు. చిత్రాంగి సారంగధరునితో అంటుంది 'ఇష్టం లేని బలవంతపు కాపురం నేను చెయ్యలేను, మనం లేచిపోదాం' అని. కానీ సారంగధరుడు అందుకు అంగీకరించడు. 'నీవు నాకు తల్లితో సమానం' అని అంటాడు. 'ఇష్టం లేని పెళ్ళి కారణంగా నేను నీకు తల్లిని కాలేను‌' అని చిత్రాంగి అంటుంది కానీ సారంగధరుడు అందుకు అంగీకరించడు. పాత చిత్రాంగి కథలో చిత్రాంగి పతిత (పతనమైన స్త్రీ) అయితే చలం గారు వ్రాసిన నాటికలోని చిత్రాంగి నిజాయితీపరురాలు, సారంగధరుడు నిజాయితీ లేని వాడు.

    ReplyDelete
  8. అద్బుతంగా ఉంది

    ఈ పుస్తకాన్ని ఎందుకు చదవాలి అన్నందుకు మీ సమాధానం - కత్తి మహేష్ కుమార్ గారు ఎప్పుడూ చెప్పే మాట "చలంని అర్థం చేసుకోకూడదు. అనుభవించాలి అంతే!" గుర్తుకు తెచ్చింది.

    ఈ మధ్యకాలంలో చలంపై చదివిన గొప్ప వ్యాసం
    బొల్లోజు బాబా

    ReplyDelete
  9. చలం గారి సాహిత్యం చదివితే అర్థమవుతుంది, వేరేవాళ్ళు వ్రాసిన రివ్యూలు చదివి కాంక్లూజన్స్‌కి రావడానికి ప్రయత్నిస్తే అర్థం కాదు. చలం గారి సాహిత్యం చదవడానికి ముందు చలం సాహిత్యం అర్థం కాదు అని ఎవరో చెపితే నిజమో, కాదో తెలుసుకోవడానికి చలం గారి సాహిత్యం చదివాను. నాకు సులభంగానే అర్థమైంది. చలం గారి సాహిత్యం అర్థమైనా సామాజిక కట్టుబాట్లు కారణంగా ఎక్కువ మంది అంగీకరించరు అనేది నిజం.

    ReplyDelete
  10. లలిత గారూ :

    మీ విశ్లేషణాత్మకమైన పరిచయానికి ముందుగా కృతజ్ఞతలు. మీ మాటలతో ఎందుకో నేను చప్పున కనెక్ట్ చేసుకోగల్గుతానండీ..! బహుశా కొన్నాళ్ళ క్రితం దాకా నావీ ఇవే ఆలోచనలు అవ్వడం వల్లనేమో. నేను విధిగా రచనను రచనగా మాత్రమే చూడాలని నిర్ణయించుకున్నందువల్లనేమో, ఇప్పుడు నేణు చలం రచనలను చాలా ఆనందంగా, ఆ వచనంలో అంతర్లీనంగా ఉండే కవిత్వాన్నీ అనుభవిస్తూ చదువుతున్నాను.
    ఒక్కసారి "ఇది భావ్యమేనా, ఈ రచనలు చదవదగినవేనా, నైతిక-అనైతిక అన్న ప్రశ్నలు ఉదయించాయా, ఇహ మనం అడుగు ముందుకెయ్యలేం. పుస్తకంలో ఒక్క వాక్యం కూడా చదవలేం.
    అది మినహాయిస్తే, చలం అత్యుత్తమ పుస్తకాల్లో -అమీనా ఒకటి.
    మీరు చలం పుస్తకాల గురించి మీ మాటల్లో ఎక్కడైనా రాసి ఉంటే, నాకు తప్పక తెలియజేయండి. చూడాలని ఉంది.

    ReplyDelete
  11. రఘు గారూ : అద్భుతంగా చెప్పారు. మరో మాట లేదు. వాదం లేదు.
    వీటన్నింటితో పాటు, ఒక ప్రత్యేకమైన శైలిని రచానా లోకానికి పరిచయం చేసిన మహా రచయిత చలం.

    @ప్రవీణ్ గారూ : చిత్రాంగి ఇంకా చదవలేదు నేను. ఈ సారెప్పుడైనా ప్రయత్నిస్తాను. మీ అభిప్రాయాలకి థాంక్స్.

    ReplyDelete
  12. బొల్లోజు బాబా గారూ: ధన్యోస్మి. మీ అభినందనలకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

    ReplyDelete
  13. చాలా బాగా రాసారు. ఈ కథ చదివినప్పుడు అమీనా ని నేను ఒక చిన్న అమాయకపు పసిపిల్లగా ఊహించేసుకున్నాను. ఆ పిల్ల మాటలు, ముద్దుమోము ఎన్నాళ్ళో నిలిచిపోయింది మదిలో. ఇంక చలం సంఘర్షణ ప్రతీ ఒక్కరినీ ఒక్క కుదుపు కుదుపుతుంది. మీరు బాగా రాసారు. చివరి వాక్యాలు బావున్నాయి.

    ReplyDelete
  14. రఘు గారు...చాలా బాగా చెప్పారు....ఇంక వేరే మాటల్లేవు. మొత్తం చలాన్నీ మీ వాక్యాలలో అద్భుతంగా కుదించేసారు.

    ReplyDelete
  15. చలం ని చదివి, అనుభవించి,ప్రేమించి, సొంతం చేసుకోలేక, వదులు కోలేక,మర్యాదస్తుల లోకం కోసం, రాజేశ్వరి అంతరంగం లో సమీర్ గాడ్హత, లాలస తో భీమ్లి బీచ్ తో అడుగులు ..గాలి విసిరితే చెదిరి పోయే ఇసకలో అడుగులు నడిచి, జీవితాదర్శం..లో, ముసింగ్స్ ని గ్రంధం లాగ పఠించి,బిడ్డలా శిక్షణ మీద, పెళ్లి కాక ముందే పాఠాలు చదివి, ఎన్నో, ఎన్నెన్నో,అనుభూతులు రంగరించిన ,ప్రేమ పొదిగిన పదాలు తో మనసు లోతుల్లో కి ,అంత రంగం లోకి, నిజాయితీ గా , మునకలు వేయించే..సాహిత్య ఇమజేరి ,మాంత్రికుడు, రమణ మహర్షి దగ్గర శాంతి పొందిన మనసు జీవి, ఆ చలం కి చలమే సాటి. ఎంత మంది ,ఎలా ,ఎన్ని కనుక్కుంటారో, మీరూ ప్రయాణం మొదలు పెట్టండి. చేరుతారు, ఏదో శాంతి తీరం.
    వసంతం.

    ReplyDelete
  16. వసంతం గారూ : :)
    ఒక మంచి రచన చదివిన ప్రతిసారీ మనసొక శాంతి సముద్రమే. అలల్లా ఆలోచనలు వస్తూ పోతూ ఉన్నా, ఆణిముత్యం లాంటి అనుభవాన్ని మాత్రం దక్కించుకుని గుండె గుప్పెట్లో భద్రంగా దాచుకుంటున్నానిలా....
    మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు.

    ReplyDelete
  17. సౌమ్యా...మీకూ, నాకూ, మనలాంటి మనస్సే ఉన్న పాఠకులకు, అమీనా అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అమాయకత్వం తొడుగులు విడివడని పసిపిల్లే! నాకేమిటో ఆ ఆకుపచ్చని రిబ్బన్ల ముస్లిం పిల్ల నిన్నంతా కనపడింది. "పోనీ..పోనీ..జీతం ఇవ్వండి" అన్నప్పుడు ఆ బేల మొహాన్ని ఊహించుకోవడం ఎంత కష్టసాధ్యంగా తోచిందో!
    మీ అభినందనలు ధన్యవాదాలు.

    ReplyDelete
  18. ఎంత బాగా రాసారో...!!
    నాకు అమీనా చదవాలని ఉంది....:)))
    మీ రచనా శైలి నాకు బోలెడు నచ్చింది....మీ ముందు టపాలు కూడా త్వరలో చదువుతాను...:)

    ReplyDelete

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...